కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 5/1 పేజీలు 13-19
  • ప్రతిదినం బైబిలు చదవడం నుండి ప్రయోజనం పొందుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రతిదినం బైబిలు చదవడం నుండి ప్రయోజనం పొందుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రతిదినం దాన్ని చదవడం
  • బైబిలును పదేపదే చదవవలసిన అవసరత
  • బైబిలును ఎప్పుడు చదవవచ్చు
  • బైబిలు చదవడానికి విభిన్నమైన విధానాలు
  • మీరు చదివేదాని భావాన్ని గ్రహించండి
  • బైబిలు చదవడం—ప్రయోజనకరం, ఆహ్లాదకరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • చదవడం మీద శ్రద్ధ వహించండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • దేవుని వాక్యంలో ఆనందించండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • బైబిలు—చదవాల్సిన ఓ పుస్తకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 5/1 పేజీలు 13-19

ప్రతిదినం బైబిలు చదవడం నుండి ప్రయోజనం పొందుట

“యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.”—కీర్తన 1:2.

1. (ఎ) వాచ్‌టవర్‌ సంస్థ ప్రపంచ ప్రధాన కార్యాలయం వద్ద కర్మాగార భవనానికి ఒక వైపున ఏ ప్రముఖ చిహ్నం కనిపిస్తుంది? (బి) ఆ ఉపదేశాన్ని మనం వ్యక్తిగతంగా హృదయంలోకి తీసుకుంటే మనమెలా ప్రయోజనం పొందగలము?

“దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును ప్రతిదినం చదవండి.” న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌నందలి వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి బైబిళ్లను, బైబిలు సాహిత్యాన్ని ముద్రించే భవనానికి ఒక వైపున ఆ మాటలు పెద్ద అక్షరాల్లో కనిపిస్తాయి. ఆ సలహా ఆ చిహ్నాన్ని చూసే లోకస్థుల కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడింది కాదు. దాన్ని తాము కూడా మనస్సులోకి తీసుకోవాలని యెహోవాసాక్షులు గుర్తిస్తారు. బైబిలును క్రమంగా చదివి, దాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకునేవారు అది అందజేసే ఉపదేశం, ఖండన, తప్పు దిద్దడం, నీతియందు శిక్షచేయడం వంటివాటి నుండి ప్రయోజనం పొందుతారు.—2 తిమోతి 3:16, 17.

2. బైబిలు చదవడం యొక్క ప్రాముఖ్యతను సహోదరుడైన రస్సెల్‌ ఎలా నొక్కి చెప్పాడు?

2 యెహోవాసాక్షులు కావలికోటతోపాటు తమ బైబిలు పఠన సహాయకాలను ఎంతో మెచ్చుకుంటారు, వారు వీటిని క్రమంగా ఉపయోగిస్తారు. కాని వాటిలో ఏవి కూడా బైబిలు స్థానాన్ని తీసుకోలేవని వారికి తెలుసు. మునుపు 1909లో, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి మొదటి అధ్యక్షుడైన చార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ కావలికోట పత్రిక యొక్క పాఠకులకు ఇలా వ్రాశారు: “బైబిలు మన ప్రమాణికమని, మన సహాయకాలు ఎంత దేవుడిచ్చినవైన్నప్పటికీ, అవి ‘సహాయకాలు’ మాత్రమే కాని బైబిలుకు ప్రత్యామ్నాయాలు కావని ఎన్నడూ మరచిపోకండి.”

3. (ఎ) “దేవుని వాక్యం,” దాన్ని చదివేవారిపై ఏ ప్రభావాన్ని చూపింది? (బి) బెరయలోని ప్రజలు లేఖనాలను ఎంత తరచుగా చదివేవారు మరియు పఠించేవారు?

3 ప్రేరేపిత లేఖనాలకు మరే పుస్తకానికి లేని గంభీరత, శక్తి ఉన్నాయి. “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (హెబ్రీయులు 4:12) బెరయలోని ప్రజలను ‘ఘనులు’ అని పిలుస్తూ శిష్యుడైన లూకా వారిని ప్రేమపూర్వకంగా మెచ్చుకున్నాడు. అపొస్తలుడైన పౌలు మరియు ఆయన సహవాసియైన సీల ప్రకటించినట్లుగా వాక్యాన్ని ఆసక్తితో స్వీకరించడం మాత్రమే కాదుగాని, వారికి బోధించబడుతున్నదానికి లేఖనాధారం ఉందో లేదో నిశ్చయపర్చుకోవడానికి వారు ‘ప్రతిదినం లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించారు.’—అపొస్తలుల కార్యములు 17:11.

ప్రతిదినం దాన్ని చదవడం

4. మనం బైబిలును ఎంత తరచుగా చదవాలనేదాన్ని గూర్చి లేఖనాలు ఏమి సూచిస్తున్నాయి?

4 మనం దాన్ని ఎంత తరచుగా చదవాలనేది బైబిలు ప్రత్యేకంగా తెలియజేయడం లేదు. అయితే, యెహోషువ జ్ఞానయుక్తంగా ప్రవర్తించి, దేవుడిచ్చిన తన పనిని నెరవేర్చడంలో విజయం సాధించగలిగేలా ‘ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించమని’ యెహోవా ఆయనకిచ్చిన ఉపదేశం అందులో వ్రాయబడివుంది. (యెహోషువ 1:8) ప్రాచీన ఇశ్రాయేలుపై రాజుగా పరిపాలించేవారెవరైనా సరే లేఖనాలను “తాను బ్రదుకు దినములన్నిటను” చదవవలసి ఉండెనని అది మనకు తెలియజేస్తుంది. (ద్వితీయోపదేశకాండము 17:22) అది ఇంకా ఇలా తెలియజేస్తుంది: “దుష్టుల ఆలోచన చొప్పున నడువక . . . యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.” (కీర్తన 1:1, 2) తనను శోధించడానికి సాతాను చేసిన ప్రయత్నాలను యేసుక్రీస్తు నిరాకరించినప్పుడు, “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును, అని వ్రాయబడియున్నదని” చెబుతూ, ఆయన ప్రేరేపిత హెబ్రీ లేఖనాల నుండి ఉదాహరించాడని మత్తయి వ్రాసిన సువార్త మనకు తెలియజేస్తుంది. (మత్తయి 4:4) భౌతికాహారం మనకు ఎంత తరచుగా అవసరం? ప్రతి దినం! నిత్యజీవానికి సంబంధించిన మన ఉత్తరాపేక్షలను అది ప్రభావితం చేస్తుంది గనుక, ప్రతిదినం ఆత్మీయాహారాన్ని తీసుకోవడం మరెంతో ప్రాముఖ్యం.—ద్వితీయోపదేశకాండము 8:3; యోహాను 17:3.

5. మనపైకి విశ్వాస పరీక్షలు వచ్చిపడినప్పుడు, మనం ‘యెహోవాకు తగినట్లు నడుచుకోవడానికి’ ప్రతిదినం బైబిలు చదవడం ఎలా సహాయపడగలదు?

5 మనలో ప్రతి ఒక్కరం ప్రతిదినం దేవుని వాక్యంచే బలపర్చబడడం అవసరము. ప్రతి దినం—ఇంటివద్ద, పనివద్ద, పాఠశాలవద్ద, వీధుల్లో, కొనుగోలు చేసేటప్పుడు, మన పరిచర్యలో—మన విశ్వాసానికి సవాళ్లు మనపై వచ్చిపడుతుంటాయి. వీటితో మనమెలా వ్యవహరిస్తాము? బైబిలు ఆజ్ఞలు, సూత్రాలు వెంటనే మనస్సుకు వస్తాయా? స్వయం నిర్భర భావాన్ని ప్రోత్సహించే బదులు, బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కొరింథీయులు 10:12) లోకం తన ఆకృతిలోకి మనల్ని మార్చడానికి అనుమతించె బదులు, ‘యెహోవాను సంపూర్ణంగా ప్రీతిపర్చేందుకు ఆయనకు తగినట్లు నడవడానికి’ ప్రతిదినం బైబిలు చదవడం మనకు సహాయం చేస్తుంది.—కొలొస్సయులు 1:9, 10; రోమీయులు 12:2.

బైబిలును పదేపదే చదవవలసిన అవసరత

6. బైబిలును పదే పదే చదవడం ఎందుకు ప్రయోజనకరము?

6 బైబిలు చదవడానికి ఒక కల్పనా కథ చదవడానికి ఎంతో తేడా ఉంది. పేరుపొందిన అనేక కల్పనాకథలు కేవలం ఒకసారి చదవడానికే వ్రాయబడతాయి; ఒకసారి ఒక వ్యక్తి దాని కథను, అదెలా ముగుస్తుంది అనేవి తెలుసుకుంటే, ఇక దాన్ని చదవవలసిన అవసరం ఉండదు. దానికి విరుద్ధంగా, బైబిలును మనం ఎన్నిసార్లు చదివి ఉన్నప్పటికీ, దాన్ని మళ్లీ చదవడం ద్వారా మనం ఎంతో ప్రయోజనం పొందుతాము. (సామెతలు 9:9) జ్ఞానంగల వ్యక్తికి, లేఖనాలు ఎప్పుడూ సరిక్రొత్త భావాన్నిస్తాయి. ఇటీవలి నెలల్లో తాను చూసిన, వినిన, వ్యక్తిగతంగా అనుభవించిన వాటి వెలుగులో అంత్యదినాలను గూర్చిన ప్రవచనాలు అతనికి మరింత ప్రభావవంతమైనవౌతాయి. (దానియేలు 12:4) ఒక వివేకంగల బైబిలు పాఠకుడు తాను ఇంతకుమునుపు కేవలం యథాలాపంగా చదివిన ఉపదేశాన్ని, అతడు జీవితంలో తన స్వంత అనుభవాన్ని విశాలపర్చుకొని సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, మరింత అధికంగా గుణగ్రహిస్తాడు. (సామెతలు 4:18) ఒకవేళ అతడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లయితే, బాధను తీసివేసి ఆరోగ్యాన్ని పునఃస్థాపించడాన్ని గూర్చిన బైబిలు వాగ్దానాలు అతడికి మునుపెన్నటికంటే మరింత లోతైన భావాన్నిస్తాయి. సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు మరణించినప్పుడు, పునరుత్థాన వాగ్దానం మరింత విలువైనదవుతుంది.

7. మనం జీవితంలో ఒక క్రొత్త బాధ్యతను చేపట్టినప్పుడు ఏది మనకు సహాయం చేయగలదు, ఎందుకు?

7 మీరు బైబిలును వ్యక్తిగతంగా చదివి, దాని ఉపదేశాన్ని సంవత్సరాలుగా అన్వయించుకొని ఉండవచ్చు. కాని బహుశా ఇప్పుడు మీరు జీవితంలో క్రొత్త బాధ్యతలు చేపడుతుండవచ్చు. మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? మీరు తల్లి లేక తండ్రి కాబోతున్నారా? సంఘంలో మీకు పెద్దగా లేక పరిచారకునిగా బాధ్యత అప్పగించబడిందా? మీరు ప్రకటించే మరియు బోధించే అధిక అవకాశాలతో పూర్తికాల సువార్తికులయ్యారా? ఆ క్రొత్త బాధ్యతలను మనస్సులో ఉంచుకొని పూర్తి బైబిలును మళ్లీ చదవడం ఎంత ప్రయోజనకరంగా ఉండగలదు!—ఎఫెసీయులు 5:24, 25; 6:4; 2 తిమోతి 4:1, 2.

8. మనకు ఇదివరకే తెలుసని మనం తలంచిన విషయాల గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవలసిన అవసరతను, మారిన పరిస్థితులు ఎలా కలిగించగలవు?

8 గతంలో మీరు ఆత్మఫలాలను చక్కగా ఫలించివుండవచ్చు. (గలతీయులు 5:22, 23) అయినప్పటికీ మారిన పరిస్థితులు ఆ దైవిక లక్షణాల గురించి మరింత నేర్చుకోవలసిన అవసరతను మీకు కలిగించవచ్చు. (హెబ్రీయులు 5:8 పోల్చండి.) వయస్సు పైబడుతున్న తన తల్లిదండ్రులను చూసుకునేందుకు తన ప్రత్యేక సేవను విడిచిపెట్టవలసివచ్చిన ఒక మునుపటి ప్రయాణకాపరి ఇలా చెప్పాడు: “ఆత్మఫలాలను ఫలించడంలో నేను కారణసహితంగా బాగానే ఉన్నానని నేను తలంచేవాడిని. ఇప్పుడు నేను మళ్లీ అంతా మొదలు పెడుతున్నట్లు భావిస్తున్నాను.” అలాగే, తమ వివాహజత తీవ్రమైన శారీరక లేక మానసిక రుగ్మతకు గురైనప్పుడు వారి ఎడల వ్యక్తిగత శ్రద్ధ చూపించడంలో అప్పుడప్పుడు ఒత్తిడి, తమను నిరుత్సాహపర్చే ప్రతిస్పందనలను కలుగజేస్తున్నట్లు కనుగొంటారు. క్రమంగా బైబిలు చదవడం గొప్ప ఓదార్పును, సహాయాన్ని ఇవ్వగలదు.

బైబిలును ఎప్పుడు చదవవచ్చు

9. (ఎ) ఎంతో పనితొందరగల ఒక వ్యక్తి ప్రతిదినం బైబిలు చదవడం కొరకు సమయాన్ని కనుగొనేందుకు ఏది సహాయపడగలదు? (బి) దేవుని వాక్యాన్ని చదవడం విశేషంగా పెద్దలకు ఎందుకు ప్రాముఖ్యము?

9 ఇప్పటికే ఎంతో పని కలిగివున్న ప్రజలకు, క్రమమైన పద్ధతిలో ఏదైనా అదనపు పని చేయడానికి సమయాన్ని కనుగొనడం సవాలుతో కూడినదే. అయితే, మనం యెహోవా మాదిరినుండి ప్రయోజనం పొందగలం. ఆయన ‘నిర్ణయకాలాల్లో’ పనులు చేస్తాడని బైబిలు తెలియజేస్తుంది. (ఆదికాండము 21:2; నిర్గమకాండము 9:5; లూకా 21:24; గలతీయులు 4:4) దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడం యొక్క ప్రాముఖ్యత ఎడల గుణగ్రహణ, మన ప్రతిదిన పట్టికలో దానికొరకు సమయాన్ని కేటాయించడానికి మనకు సహాయం చేయగలదు. (ఎఫెసీయులు 5:15-17) వారు ఇచ్చే ఉపదేశం నిస్సందేహంగా బైబిలు సూత్రాలపై ఆధారపడి ఉండేలా, తద్వారా వారు చూపే స్ఫూర్తి “పైనుండివచ్చు జ్ఞానము”ను ప్రతిఫలించేలా, ప్రాముఖ్యంగా పెద్దలు క్రమంగా బైబిలు చదవడానికి సమయాన్ని కేటాయించడం అవసరము.—యాకోబు 3:17; తీతు 1:9.

10. ప్రతిదినం బైబిలును చదివేవారు, దాన్ని చదవడానికి ఎప్పుడు సమయాన్ని కనుగొంటారు?

10 వ్యక్తిగతంగా బైబిలు చదివే కార్యక్రమంలో విజయం సాధించేవారనేకులు తమ దిన కార్యక్రమాలను ప్రారంభించక ముందు ఉదయాన్నే దాన్ని చదువుతారు. మరో సమయంలో తాము దాన్ని సరిగ్గా చేయగలుగుతున్నట్లు ఇతరులు కనుగొంటారు. తరచూ ప్రయాణించేవారు తమ ప్రయాణ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి బైబిలు ఆడియో క్యాసెట్లు (లభ్యమౌతున్న చోట) సహాయం చేస్తాయి, కొంతమంది సాక్షులు తమ అనుదిన పనులను చేసుకునే సమయంలో వాటిని వింటారు. ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు తూర్పు దేశాల్లోని వివిధ సాక్షుల విషయంలో పనిచేసిన కార్యక్రమాలు “వారు దాన్ని ఎప్పుడు చదువుతారు, వారెలా ప్రయోజనం పొందుతారు” అనే శీర్షిక నందు 20, 21 పేజీల్లో చూపించబడ్డాయి.

11. లభ్యమౌతున్న సమయం చాలా స్వల్పమే అయినప్పటికీ, ప్రతిదినం బైబిలును ఎలా చదవవచ్చు?

11 ఏదైనా ఒక సందర్భంలో మీరు బైబిలు చదవడానికి కేటాయించిన సమయం యొక్క మోతాదు కాదుగాని అది చేయబడే క్రమం చాలా ప్రాముఖ్యం. ఒకసారి కూర్చున్నప్పుడు, అదనపు పరిశోధన చేస్తూ, ఆ విషయంలో పూర్తిగా నిమగ్నమై ఒక గంట లేక ఎక్కువ సేపు చదవడం ప్రతిఫలదాయకంగా ఉంటుందని మీరు కనుగొనవచ్చు. కాని దాన్ని క్రమంగా చేయడానికి మీ పట్టిక అనుమతిస్తుందా? అసలు బైబిలే చదవకుండా దినాలు గడిచిపోవడానికి అనుమతించే బదులు, ప్రతిదినం 15 నిమిషాలు లేక కనీసం 5 నిమిషాలు చదవడం మంచిది కాదా? ప్రతిదినం బైబిలు చదవడాన్ని మీ తీర్మానంగా చేసుకోండి. ఆ తర్వాత వీలైనప్పుడు ఆ అధ్యయనానికి లోతైన పరిశోధనను జతచేయండి.

బైబిలు చదవడానికి విభిన్నమైన విధానాలు

12. బేతేలు కుటుంబం యొక్క క్రొత్త సభ్యులకు మరియు గిలియడ్‌ విద్యార్థులకు బైబిలు చదవడం యొక్క ఏ కార్యక్రమం ఉంటుంది?

12 బైబిలు చదవడానికి అనేక మార్గాలున్నాయి. ఆదికాండము నుండి ప్రకటన వరకు చదవడం ప్రయోజనకరమైంది. ప్రపంచ ప్రధాన కార్యాలయంలో గాని లేక సంస్థ యొక్క బ్రాంచిలలో ఒకదానిలోగాని ఉన్న భూగోళవ్యాప్త బేతేలు కుటుంబ సభ్యులందరూ వారి బేతేలు సేవ యొక్క మొదటి సంవత్సరంలో మొత్తం బైబిలు చదవవలసి ఉంటుంది. (దానిలో సాధారణంగా వాటి పరిమాణాన్ని బట్టి ఒక దినానికి మూడు నుండి ఐదు అధ్యాయాలు లేక నాలుగు నుండి ఐదు పేజీలు చదవవలసి ఉంటుంది.) వాచ్‌టవర్‌ గిలియడ్‌ బైబిలు పాఠశాల వద్ద విద్యార్థులు కూడా తాము పట్టభద్రులు కావడానికి ముందు మొత్తం బైబిలు చదవాలి. ప్రతిదినం బైబిలు చదవడాన్ని వారి జీవితంలో ఒక భాగంగా చేసుకోవడానికి ఇది వారికి సహాయం చేస్తుందని అపేక్షించబడుతుంది.

13. క్రొత్తగా బాప్తిస్మం పొందిన సాక్షులకు ఏ లక్ష్యం సిఫారసు చేయబడుతున్నది?

13 మొత్తం బైబిలును చదివే లక్ష్యాన్ని కలిగివుండడం క్రొత్తగా బాప్తిస్మం తీసుకున్న సాక్షులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్రాన్సునందలి ఒక యౌవనుడు 1975లో బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడుతుండగా, బైబిలు చదివే ఒక కచ్చితమైన కార్యక్రమం నీకు ఉందా అని పెద్ద అతన్ని అడిగాడు. అప్పటి నుండి అతడు ప్రతి సంవత్సరం మొత్తం బైబిలు చదువుతున్నాడు, అతడు సాధారణంగా తాను పనికి వెళ్లకముందు ఉదయం వేళ చదువుతాడు. ఫలితాల గురించి ఆయనిలా చెబుతున్నాడు: “నేను యెహోవాకు ఎంతో సన్నిహితమయ్యాను. ఆయన చేసే ప్రతిదీ ఆయన సంకల్పానికి ఎలా సంబంధం కలిగివుందో, అవాంతరాలేర్పడినప్పుడు ఆయనెలా ప్రతిస్పందిస్తాడో నేను గ్రహించగలుగుతున్నాను. అదే సమయంలో, యెహోవా తన కార్యాలన్నిటిలో నీతిమంతుడని, మంచివాడని నేను తెలుసుకోగలుగుతున్నాను.”

14. (ఎ) కొనసాగగల, మీ వ్యక్తిగత బైబిలు అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏమి అవసరము? (బి) ఒక్కొక్క బైబిలు పుస్తకాన్ని మనం చదువుతుండగా దాని సాధారణ ప్రధానాంశమును మనస్సులో ఉంచుకోవడానికి మనకు ఏది సహాయం చేయగలదు?

14 మీరు మొత్తం బైబిలు చదివారా? చదవనట్లయితే, ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఒక కచ్చితమైన కార్యక్రమాన్ని సిద్ధం చేసుకుని, దానికి కట్టుబడి ఉండండి. ప్రతిదినం మీరు ఎన్ని పేజీలు లేక ఎన్ని అధ్యాయాలు చదువుతారో, లేక కేవలం మీరు ఎంత సమయం గడుపుతారో, ఏ సమయంలోనో, నిర్ణయించుకోండి. ప్రతి ఒక్కరూ పూర్తి బైబిలును ఒక సంవత్సరంలోనే ముగించలేకపోవచ్చు, కాని దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడం, సాధ్యమైతే ప్రతిదినం చదవడం ప్రాముఖ్యమైన విషయం. మీరు బైబిలును చదువుతుండగా, విషయం యొక్క సాధారణ అంశాన్ని మీ మనస్సుపై ముద్రించేందుకు కొన్ని రిఫరెన్సు పుస్తకాలను ఉపయోగించడం సహాయకరంగా ఉంటుందని మీరు తెలుసుకోవచ్చు. మీ భాషలో లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) లభ్యమౌతున్నట్లయితే, మీరు ఫలానా బైబిలు పుస్తకాన్ని చదవడం ప్రారంభించడానికి ముందు, అంతర్దృష్టి నందు ఇవ్వబడిన దాని ఉన్నతాంశాలను గూర్చిన స్వల్ప ప్రధానాంశాన్ని పునఃసమీక్షించండి.* ప్రాముఖ్యంగా, ప్రధానాంశంలోని బోల్డ్‌ అక్షరాలతోగల శీర్షికలను గమనించండి. లేక “అన్ని లేఖనాలు దేవునిచే ప్రేరేపించబడినవి, ప్రయోజనకరమైనవి” అనే పుస్తకంలో ఇవ్వబడిన అత్యంత విస్తృతమైన సమీక్షను అదే విధంగా ఉపయోగించుకోండి.a

15. (ఎ) పదహారు, పదిహేడు పేజీలనందివ్వబడిన ఏ సలహాలు మీరు బైబిలు చదవడాన్ని వృద్ధి చేసుకోవడానికి సహాయం చేయగలవు? (బి) కొన్ని పేజీలు చదవడాన్ని ఒక ఆచారంగా చేసుకునే బదులు, ఏ ప్రాముఖ్యమైన విషయానికి మనం గొప్ప శ్రద్ధనివ్వాలి?

15 క్రమంగా బైబిలు చదవడం ప్రయోజనకరమైనది, కాని కేవలం ఆచారం కొరకు చదివే పాఠకునిగా తయారుకావద్దు. కేవలం ప్రతి సంవత్సరం బైబిలు చదవడం ముగించానని చెప్పేందుకు ప్రతిదినం కొన్ని పేజీలు చదవడం చేయకండి. (పదహారు, పదిహేడు పేజీల్లో గల) “మీ బైబిలు అధ్యయనాన్ని వృద్ధి చేసుకోవడానికి సలహాలు” అనే బాక్సులో చూపబడినట్లుగా, మీరు బైబిలును చదివి ఆనందించడానికి ఎన్నో మార్గాలున్నాయి. మీరు ఏ పద్ధతిని ఉపయోగించినప్పటికీ, మీరు మీ మనస్సును, హృదయాన్ని రెండింటిని పోషించేలా చూసుకోండి.

మీరు చదివేదాని భావాన్ని గ్రహించండి

16. మనం చదివేదాన్ని ధ్యానించేందుకు సమయం తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యము?

16 తన శిష్యులకు బోధిస్తున్నప్పుడు, యేసు తాను చెప్పినదాన్ని వారు అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. కేవలం తెలివితో గ్రహించడం కాదుగాని, వారు దాన్ని తమ జీవితాల్లో అన్వయించుకొనగలిగేలా తమ “హృదయముతో గ్రహించడం” ప్రాముఖ్యమైయుండెను. (మత్తయి 13:14, 15, 19, 23) ఒక వ్యక్తి నిజంగా అంతర్గతంగా ఏమైయున్నాడో దాన్నే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు, అది హృదయంచే ప్రాతినిధ్యం వహించబడుతుంది. (1 సమూయేలు 16:7; సామెతలు 4:23) గనుక, బైబిలు వాక్యాలు చెప్పేది మనం కచ్చితంగా అర్థం చేసుకోవడమేకాక, వాటి అన్వయింపులను మన స్వంత జీవితాల్లో పరిగణలోకి తీసుకుంటూ మనం వాటిపై ధ్యానించాల్సిన అవసరం ఉంది.—కీర్తన 48:9; 1 తిమోతి 4:15.

17. మనం లేఖనాల్లో చదివేదాన్ని ధ్యానించగల కొన్ని దృక్కోణాలేమిటి?

17 మీరు ఎదుర్కొనే పరిస్థితులకు అన్వయించుకొనగలిగేలా బైబిలు వృత్తాంతాల వెనుకనున్న సూత్రాలను గుర్తించడానికి ప్రయత్నించండి. (మత్తయి 9:13; 19:3-6 పోల్చండి.) మీరు యెహోవా అద్భుతమైన లక్షణాల గురించి చదివి, వాటిపై ధ్యానిస్తుండగా, ఆయనతో మీ వ్యక్తిగత సంబంధాన్ని బలపర్చుకోవడానికి, మీలో ఒక బలమైన దైవభక్తి భావాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. యెహోవా సంకల్పాన్ని గూర్చిన వ్యాఖ్యానాలను మీరు చదివినప్పుడు, వీటికి అనుగుణంగా పనిచేయడానికి మీరు ఏమి చేయగలరో పరిశీలించుకోండి. మీరు సూటియైన ఉపదేశాన్ని చదివినప్పుడు, కేవలం ‘నాకు తెలుసు’ అని మీకు మీరు చెప్పుకొనేబదులు, ‘అది చెప్పేది నేను చేస్తున్నానా? అలాగైతే, నేను ఏ విధాలుగా దాన్ని ‘మరింత ఎక్కువగా’ చేయగలను?’ అని ప్రశ్నించుకోండి. (1 థెస్సలొనీకయులు 4:1) మీరు దేవుడు కోరేవాటిని గూర్చి తెలుసుకుంటుండగా, వాటికి అనుగుణంగా జీవించినవారి మరియు అనుగుణంగా జీవించనివారికి సంబంధించిన, బైబిలు నందుగల నిజజీవిత ఉదాహరణలను కూడా పరిశీలించండి. వారు చేపట్టిన గమ్యాన్ని వారెందుకు చేపట్టారో, దాని ఫలితమేమైయుండెనో పరిశీలించండి. (రోమీయులు 15:4; 1 కొరింథీయులు 10:11) మీరు యేసుక్రీస్తు జీవితం గురించి చదివినప్పుడు, భూమి అంతటిపైనా యెహోవా ఆయనకు రాజ్యాధికారాన్ని ఇచ్చాడని గుర్తుంచుకోండి; దేవుని నూతన లోకం కొరకు మీలో మీరు ఒక నిరీక్షణను బలపర్చుకోవడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంతేగాక, మీరు ఇంకా ఎక్కువగా దేవుని కుమారున్ని ఏ యే విధాలుగా పూర్తిగా అనుకరించగలరో అంచనా వేయండి.—1 పేతురు 2:21.

18. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందజేసే పఠన సమాచారం యొక్క మన ఉపయోగంతో మనం అధ్యయనాన్ని ఎలా సమతూకం చేయగలము?

18 అయితే, “నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా అందజేయబడుతున్న అద్భుతమైన పఠన సమాచారమును మీరు ఉపయోగించడాన్ని, బైబిలు చదవడం ఆటంకపర్చకూడదు. అది కూడా యెహోవా ఏర్పాటులో ఒక భాగమే—ఒక అమూల్యమైన భాగం. (మత్తయి 24:45-47) దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడం మీ జీవితంలో ప్రముఖ స్థానం వహించేలా చూడండి. సాధ్యమైతే, “దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును ప్రతిదినం చదవండి.”

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌, ఇన్‌కార్పొరేటెడ్‌ ప్రచురించినది.

మీరెలా సమాధానమిస్తారు?

◻ ప్రతిదినం బైబిలు కొంత చదవడం ఎందుకు ప్రయోజనకరము?

◻ మనం బైబిలును పదే పదే చదవడం ఎందుకు అవసరము?

◻ మీ స్వంత పట్టికలో, ప్రతిదినం బైబిలు చదవడం కొరకు తగిన సమయం ఏది?

◻ మీరు బైబిలును పదే పదే చదువుతుండగా, మీ కార్యక్రమానికి ఏది వైవిధ్యాన్ని చేకూర్చగలదు?

◻ మనం చదివేదాన్ని ధ్యానించడం ఎందుకు అత్యంత ప్రాముఖ్యము?

[16, 17వ పేజీలోని బాక్సు]

మీ బైబిలు అధ్యయనాన్ని వృద్ధి చేసుకోవడానికి సలహాలు

(1) అనేకమంది ప్రజలు బైబిలు పుస్తకాలు వాడుకగా ముద్రింపబడిన క్రమంలో అంటే ఆదికాండము నుండి ప్రకటన వరకు చదువుతారు. అవి ప్రాథమికంగా వ్రాయబడిన క్రమంలోనే మీరు కూడా చదవవచ్చు. బైబిలు 66 ప్రేరేపిత పుస్తకాల సముదాయమని, ఒక దైవిక గ్రంథాలయమని మనస్సులో ఉంచుకోండి. వైవిధ్యం కొరకు, కేవలం పేజీ క్రమం ప్రకారం చదవడానికి బదులు, చరిత్ర ఉండే కొన్ని పుస్తకాలను, తర్వాత ప్రవచనార్థకమైన కొన్ని పుస్తకాలను, వాటి తర్వాత ఉపదేశం ఉండే కొన్ని పత్రికలను చదవాలని మీరు కోరుకోవచ్చు. మీరు చదివినవాటిని జ్ఞాపకం ఉంచుకోండి, పూర్తి బైబిలును చదివేలా శ్రద్ధ తీసుకోండి.

(2) మీరు లేఖనాల కొంత భాగాన్ని చదివిన తర్వాత, అది యెహోవా గురించి, ఆయన సంకల్పం గురించి, ఆయన పనులు చేసే విధానం గురించి ఏమి తెలియజేస్తుందో; మీ స్వంత జీవితాన్ని అది ఎలా ప్రభావితం చేయాలో; మరెవరికైనా సహాయం చేసేందుకు మీరు దాన్ని ఎలా ఉపయోగించవచ్చో; మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

(3) లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) నందు (“అన్ని లేఖనాలు దేవునిచే ప్రేరేపించబడినవి, ప్రయోజనకరమైనవి” (ఆంగ్లం) అనేదానిలో కూడా) గల “యేసుక్రీస్తు” అనే శీర్షిక క్రిందనున్న “యేసు భూ జీవితంలోని ప్రముఖ ఘట్టాలు” అనే చార్టును గైడుగా ఉపయోగిస్తూ, సువార్తలలోని ప్రతి సంబంధిత వృత్తాంతాలను ఒకదాని తర్వాత ఒకటి చదవండి. జీవించినవారిలోకెల్లా మహా గొప్ప మనిషి అనే పుస్తకంలోని సంబంధిత భాగాలను చూస్తూ దీన్ని చేయండి.

(4) పౌలు జీవితం మరియు పరిచర్యను గూర్చిన వృత్తాంతాన్ని అపొస్తలుల కార్యముల నుండి మీరు చదివేటప్పుడు, సంబంధిత ప్రేరేపిత లేఖనాలను కూడా చదవండి. అలా, పౌలు ప్రకటించిన వివిధ నగరాలు లేక ప్రాంతాల గురించి చెప్పబడినప్పుడు, ఆగి ఆ స్థలాల్లోని తోటి క్రైస్తవులకు ఆయన ఆ తర్వాత వ్రాసిన ఉత్తరాలను చదవండి. నూతన లోక అనువాదం (ఆంగ్లం)నందు వెనుక చివరి పేజీలో ఉన్నటువంటి పటం మీద ఆయన ప్రయాణాలను గూర్చి చూడడం కూడా సహాయకరంగా ఉంటుంది.

(5) నిర్గమకాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు మీరు చదవడంతో పాటు, అనేక ప్రవచనార్థక మాదిరులను గూర్చిన వివరణ కొరకు హెబ్రీయులకు వ్రాసిన పత్రికను చదవండి. లేఖనాలపై అంతర్దృష్టి నందలి “ధర్మశాస్త్రం” క్రింద, “ధర్మశాస్త్ర నిబంధన యొక్క కొన్ని విషయాలు” అనే చార్టును సంప్రదించండి.

(6) ప్రవచనార్థక పుస్తకాలు చదువుతున్నప్పుడు, బైబిలునందుగల సంబంధిత చారిత్రాత్మక పూర్వాపరాలను పునఃసమీక్షించడానికి సమయం తీసుకోండి. ఉదాహరణకు, యెషయా పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, యెషయా 1:1నందు చెప్పబడిన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా వంటి రాజుల గురించి మరో చోట ఎక్కడైనా ఏమి చెప్పబడిందో పునఃసమీక్షించండి. (2 రాజులు, 15-20 అధ్యాయాలు; 2 దినవృత్తాంతములు 26-32 అధ్యాయాలు) లేక హగ్గయి మరియు జెకర్యా పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఎజ్రా పుస్తకంలో ఏమి కనుగొనబడుతుందో పునఃసమీక్షించడానికి సమయం తీసుకోండి.

(7) ఒక బైబిలు పుస్తకాన్ని ఎంపిక చేసుకోండి, దానిలోని కొంత భాగాన్ని (బహుశా ఒక అధ్యాయం) చదవండి, తర్వాత కావలికోట ప్రచురణల విషయసూచిక లేదా ఒకవేళ మీ భాషలో కంప్యూటరైజ్డ్‌ కావలికోట గ్రంథాలయం లభ్యమౌతే దాన్ని ఉపయోగిస్తూ పరిశోధన చేయండి. సమాచారాన్ని మీ స్వంత జీవితంలో అన్వయించుకోండి. దాన్ని ప్రసంగాల్లో, ప్రాంతీయ పరిచర్యలో ఉపయోగించండి. ఆ తర్వాత మరో భాగానికి వెళ్లండి.

(8) ఒక బైబిలు పుస్తకంపైగాని లేక కొంతభాగంపైగాని వ్యాఖ్యానాన్ని అందజేసే కావలికోట ప్రచురణ ఏదైనా ఉంటే, బైబిలు యొక్క ఆ భాగాన్ని మీరు చదువుతున్నప్పుడు దాన్ని తరచుగా సంప్రదించండి. (ఉదాహరణకు: పరమగీతముపై, కావలికోట (ఆంగ్లం) డిశంబరు 1, 1957 720-34 పేజీలు; యెహెజ్కేలుపై, “నేను యెహోవానైయున్నానని జనాంగాలు తెలుసుకోవాలి—ఎలా?” (ఆంగ్లం); దానియేలుపై, “నీ చిత్తం భూమి మీద నెరవేరునుగాక” లేక మన రాబోయే ప్రపంచ ప్రభుత్వం—దేవుని రాజ్యం (ఆంగ్లం); హగ్గయి మరియు జెకర్యాపై, మానవజాతి కొరకు పరదైసు పునఃస్థాపించబడింది—దైవపరిపాలన ద్వారా (ఆంగ్లం); ప్రకటనపై, ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపంలో ఉంది!)

(9) మీరు చదువుతుండగా కొన్ని క్రాస్‌ రెఫరెన్సులను చూడండి. హెబ్రీ లేఖనాల్లో నుండి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో సూటిగా ఉదాహరించబడిన 320 వాక్యాలను, రెఫరెన్సు ఇవ్వబడి అలాగే అన్వయింపు కూడా ఇవ్వబడిన వందలాది ఇతర వాక్యాలను గమనించండి. క్రాస్‌ రెఫరెన్సులు బైబిలునందు వ్రాయబడిన ప్రవచనాల నెరవేర్పులను, జీవిత చరిత్రలకు సంబంధించిన మరియు భౌగోళిక వివరాలను, అర్థం చేసుకోవడానికి మీకు కష్టంగా అనిపించే పదాలను స్పష్టపరిచే సమాంతరమైన తలంపులను సూచిస్తాయి.

(10) మీ భాషలో లభ్యమౌతున్నట్లయితే, నూతన లోక అనువాదం యొక్క రెఫరెన్సు సంచికనుపయోగిస్తూ, మీరు చదువుతున్న దానికి సంబంధించే అథఃస్సూచిలను మరియు అనుబంధంలోని శీర్షికలను చూడండి. ఉపయోగింపబడిన వాటికి ఆధారాలను, ప్రాముఖ్యమైన పదాలు అనువదించబడగల ఇతర మార్గాలను ఇవి చూపిస్తాయి. ఇతర బైబిలు అనువాదాలలోని కొన్ని వచనాల అనువాదాన్ని పోల్చి చూడాలని కూడా మీరు కోరుకోవచ్చు.

(11) మీరు ప్రతి అధ్యాయం చదివిన తర్వాత, ఆ అధ్యాయం నందుగల ముఖ్యాంశాన్ని స్వల్ప వ్యాసంగా వ్రాయండి. తర్వాత చేసే పునఃసమీక్షకు, ధ్యానానికి దాన్ని ఆధారంగా ఉపయోగించండి.

(12) మీరు బైబిలు చదువుతుండగా, ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలనుకునే ఎంపిక చేసుకున్న లేఖనాలను మీరు గుర్తు పెట్టుకోండి, లేక వాటిని కార్డులపై ఎత్తివ్రాసుకొని, వాటిని మీరు ప్రతి దినం చూసే స్థలంలో ఉంచండి. వాటిని కంఠస్థం చేయండి; వాటిపై ధ్యానించండి; వాటిని ఉపయోగించండి. ఒకేసారి చాలా కంఠస్థం చేయడానికి ప్రయత్నించకండి, బహుశా ఒక వారానికి ఒకటి లేక రెండు చేయండి; తర్వాత, మీరు మళ్లీ బైబిలు చదువుతున్నప్పుడు ఎక్కువ ఎంపిక చేసుకోండి.

[15వ పేజీలోని చిత్రాలు]

మీరు ప్రతిదినం బైబిలు చదువుతున్నారా లేక దాని రికార్డింగులను వింటున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి