త్వరలోనే, ఎవరూ బీదవారై ఉండరు!
“భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.” (లూకా 2:10) యేసు జన్మించిన నాటి రాత్రి బేత్లెహేము సమీపంలో ఆశ్చర్యచకితులైన గొర్రెల కాపరులు ఈ ఉత్తేజాన్నిచ్చే మాటలు విన్నారు. ఆ ప్రకటనతో పొందికగా, యేసు తన భూపరిచర్య కాలంలో “సువార్త”ను ఎంతగానో నొక్కి చెప్పాడు. నేడు మనం మన అవసరతలు తీర్చుకోవడానికి ఎక్కువగా డబ్బుపై ఆధారపడుతుండగా, యేసును గూర్చిన సువార్త మనకెలా ప్రయోజనకరం కాగలదు?
యేసుక్రీస్తు “బీదలకు సువార్త” ప్రకటించాడు. (లూకా 4:18) మత్తయి 9:35 ప్రకారం, “యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు, . . . సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను.” ఆయన వర్తమానం బీదరికంతో బాధపడుతున్నవారికి ప్రాముఖ్యంగా ప్రోత్సాహకరంగా ఉండేది. ‘ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడెను.’ (మత్తయి 9:36) నిజమే, “బీదలు ఎల్లప్పుడును మీతో కూడ ఉందురు” అని యేసు అన్నాడు, కాని మనం ఈ మాటల ద్వారా, అవసరతలోవున్న వారికి ఏ నిరీక్షణ లేదని తీర్మానించకూడదు. (యోహాను 12:8) ఈ దుష్ట విధానం ఉన్నంత వరకు, వారి బాధకు కారణం ఏదైనప్పటికీ, బీద ప్రజలు ఉండనే ఉంటారు. బీదరికం యొక్క వాస్తవికతను దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయదు, కాని అది ప్రతికూల అంశాల గురించి నొక్కిచెప్పదు. బదులుగా, జీవిత వ్యాకులతలను ఎదుర్కోవడానికి అది బీదవారికి సహాయాన్ని అందజేస్తుంది.
బీదవారికి సహాయం
గమనించదగినట్లుగా, ఇలా చెప్పబడింది: “ఒక వ్యక్తి తాను ఎవరికీ అవసరం లేదని లేక తనను ఎవరూ అర్థంచేసుకోరని తెలుసుకోవడం కంటే భారమైంది ఆ వ్యక్తికి మరొకటి ఉండదు.” అయితే, అత్యధికులకు వాత్సల్యం చూపకపోయినప్పటికీ, ప్రస్తుతమున్న బీదవారికి, భవిష్యత్తులో ఉండబోయే బీదవారికి కూడా సువార్త ఉంది.
విచారకరంగా, బీదలకు సహాయం చేయడంలో అనేకులకు ఎక్కువ ఆసక్తిలేదు. ద వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం, “సమాజంలోని ప్రజలు ఉనికిలో ఉండడానికి పోటీపడతారు . . . అందులో పైచేయిగల వాళ్లు శక్తిమంతులు, ధనవంతులు అవుతారు.” సాంఘిక డార్వినిజమ్ అని పిలువబడే ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు, బీదవారిని బద్ధకస్థులుగా లేక దుబారా చేసేవారిగా దృష్టించవచ్చు. అయినప్పటికీ, గ్రామీణ శ్రామికులు, వలస వచ్చిన కార్మికులు, మరి ఇతరులు, తక్కువ వేతనం ఇవ్వబడినప్పటికీ తమ కుటుంబాలను పోషించుకోవడానికి తరచూ చాలా కష్టపడి పనిచేస్తారు.
అనేక దేశాల్లో బీదరికం సర్వసామాన్యమైనది. గనుక, బీదవారు—అత్యధికులు—వారు విఫలులని భావించేలా చేయబడరు. అయినప్పటికీ, అలాంటి దేశాల్లో బీదరికం మధ్యన గొప్ప విలాసవంతమైన జీవితాన్ని జీవించే ప్రజలున్నారు. ఇరుకైన, అపరిశుభ్రమైన పాడైపోయిన గుడిసెల ప్రక్కనే సౌకర్యవంతమైన, ఖరీదైన గృహాలు ఉంటాయి. అధిక వేతనాలు పొందే వాళ్లు తమ ఖరీదైన కార్లను, బీద మరియు నిరుద్యోగులైన ప్రజలతో క్రిక్కిరిసివున్న వీధుల గుండా తీసుకువెళతారు. అలాంటి దేశాల్లో బీదవారు తమ బాధను గూర్చి వేదనభరితంగా తెలుసుకుని ఉంటారు. నిజంగా, “బీదవారు మంచి ఆహారం లేకపోవడం, సరైన ఇళ్లులేకపోవడం, తగినంత వైద్య సదుపాయం లేకపోవడం వంటివాటివల్ల బాధపడడమేగాక, తమ స్థితిని గూర్చిన తదేకమైన చింతను బట్టి కూడా బాధపడతారని, ఉద్యోగాలను సంపాదించుకోలేక, వాటిని నిలుపుకోలేక వారు గౌరవభావాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోతారని” ద వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా చెబుతుంది. మరైతే, కొంతమంది కడుబీదవారు తమ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు? ఎదుర్కోవడానికి యేసును గూర్చిన సువార్తకు ఏం సంబంధం ఉంది?
మొదటగా, అవివేకమైన అలవాట్ల ద్వారా బీదరికం మరింత అధికం కావచ్చునని గుర్తుంచుకోండి. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి. తన భార్యా పిల్లలకు తినడానికి ఎంతో తక్కువ ఉన్నప్పటికీ, తాను అవినీతికరమైన జీవిత విధానాన్ని అవలంబించడంలో డబ్బు వ్యర్థం చేసానని వాల్డెసిర్ అంగీకరిస్తున్నాడు. “నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ, నా కుటుంబం కొరకు నా దగ్గర ఎన్నడూ డబ్బు ఉండేది కాదుగాని, నా జేబులో మాత్రం ఎప్పుడూ రకరకాలైన లాటరీ టికెట్లు ఉండేవి” అని అతడు చెబుతున్నాడు. త్రాగుబోతుతనం, పొగత్రాగడం వల్ల మిల్టన్ 23 మంది పనివారు గల వ్యాపారాన్ని పోగొట్టుకున్నాడు. అతడిలా చెబుతున్నాడు: “నేను ఇంటికి వెళ్లలేక రాత్రులు వీధుల్లో గడిపేవాడిని, నా వల్ల నా కుటుంబం ఎంతో బాధననుభవించింది.”
జావున్ కూడా తన వేతనాన్ని దురలవాట్ల కొరకు వ్యయం చేశాడు. “నేను రాత్రులు ఇంటి బయట గడిపేవాడిని. నా సంపాదనంతా నా దురలవాట్లకు, నా వ్యాపకాలకే సరిపోయేదికాదు. పరిస్థితి సహించలేనిదిగా తయారుకావడంతో నా భార్య విడిపోవాలనుకుంది.” ఆయనకు ఆర్థికపరమైన, వైవాహిక సంబంధమైన సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా ఉండేవి. ఆయనిలా చెబుతున్నాడు: “నేను బంధువులకు, పొరుగువారికి సమస్యలు కలిగించాను, ప్రాముఖ్యంగా పనిచేసే స్థలంలో నాకు సమస్యలుండేవి. తత్ఫలితంగా నేను ఎప్పుడూ పనిలో నుండి తీసివేయబడే వాడిని.” జూల్యో ఒక మాదకద్రవ్యాల బానిస. అయితే ఆయనిలా వివరిస్తున్నాడు: “నా వేతనం నా మాదకద్రవ్యాల వ్యసనానికే ఎన్నడూ సరిపోయేది కాదు కాబట్టి, మాదకద్రవ్యాలను కొనే అవసరం ఉండదని నేను మత్తుపదార్థాల అమ్మకం దారునిగా పనిచేయడం మొదలుపెట్టాను.”
ఎనిమిది మంది పిల్లలుగల బీద కుటుంబంలో పెంచబడిన జోస్, తన కొరకు తాను కొంత కలిగివుండాలని కోరుకున్నాడు. తాను ఇక కోల్పోయేది ఏమీ లేదని భావించి, ఇతర యువకులతో కలిసి అతడు ప్రజలను దోచుకోవడం ప్రారంభించాడు. నిరాశ చెందిన మరో యువకుడు, తలలు బ్రద్దలుగొట్టేవారు అనే పేరుగల ముఠా సభ్యునిగా చేరాడు. అతడిలా వివరిస్తున్నాడు: “మాలో అనేకులం బీదవారం గనుక, వస్తువులను పగులగొట్టడంలో, ప్రజలపై దాడి చేయడంలో మేము ఒక విధమైన తృప్తిని పొందేవాళ్లం.”
అయితే, నేడు ఈ వ్యక్తులు వారి కుటుంబాలు నిత్యావసర వస్తువుల విపరీత కొరతను అనుభవించడంలేదు లేక బాధాకరమైన, నిరాశతోకూడిన భావాలతో ఎంత మాత్రం బాధపడడంలేదు. వారు ఇక ఎంతమాత్రం నిస్సహాయంగా లేక నిరాశగా లేరు. ఎందుకని? ఎందుకంటే వారు యేసు ప్రకటించిన సువార్తను పఠించారు. వారు బైబిలు ఇచ్చే ఉపదేశాన్ని అన్వయించుకొని, యెహోవాసాక్షుల సంఘాలలో ఉండే ఒకే విధమైన భావాలు గల వ్యక్తులతో సహవసించారు. సంపద, బీదరికం గురించి వాళ్లు కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నారు.
బీదరికాన్ని ఎదుర్కోవడానికి సహాయం
మొదటగా, బైబిలు సూత్రాలను అన్వయించుకున్నట్లయితే, బీదరికం యొక్క చెడు ప్రభావాలు తక్కువ చేయబడగలవని వాళ్లు నేర్చుకున్నారు. అవినీతి, త్రాగుబోతుతనం, జూదం, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటివాటిని బైబిలు గర్హిస్తుంది. (1 కొరింథీయులు 6:9, 10) అలాంటివి చాలా ఖర్చుతో కూడినవి. అవి ఒక గొప్ప వ్యక్తిని బీదవానిగా, బీదవాన్ని కడుబీదవానిగా చేయగలవు. ఈ దురలవాట్లను, వీటివంటి ఇతరమైన వాటిని విడిచిపెట్టడం కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి తోడ్పడుతుంది.
రెండవదిగా, జీవితంలో సంపద కంటే మరింత ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయని వాళ్లు కనుగొన్నారు. ఈ ప్రేరేపిత మాటల్లో సమతూకం గల దృక్పథం వ్యక్తపర్చబడింది: “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.” (ప్రసంగి 7:12) అవును, డబ్బు అవసరమే. కాని బైబిలు ఆధారిత వివేచన, దేవుని సంకల్పాలను గూర్చిన జ్ఞానము మరెంతో ప్రయోజనకరమైనవి. వాస్తవానికి, వివేచనలేని వ్యక్తి యొద్ద ఎక్కువ ధనముండడం అతనికి, ధనం లేకపోవడమంత భారం కాగలదు. బైబిలు రచయిత జ్ఞానయుక్తంగా ఇలా ప్రార్థించాడు: “పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి—యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.”—సామెతలు 30:8, 9.
మూడవదిగా, ఒక వ్యక్తి యేసు ప్రకటించిన సువార్తకు అనుగుణ్యంగా జీవించినట్లయితే, అతడు ఎన్నడూ విడిచి పెట్టబడినట్లు భావించనవసరం ఉండదని వాళ్లు కనుగొన్నారు. సువార్తలో దేవుని రాజ్యం ఇమిడి ఉంది. “రాజ్యసువార్త” అని ఆ వర్తమానం పిలువబడుతుంది, అది మన కాలంలో లోకమందంతటా ప్రకటించబడుతుంది. (మత్తయి 24:14) ఆ రాజ్యమందు మనం మన నిరీక్షణ నుంచినట్లయితే, మనకు మద్దతు ఇవ్వబడుతుందని యేసు చెప్పాడు. ఆయనిలా చెప్పాడు: ‘కాబట్టి మీరు రాజ్యమును [దేవుని] నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.’ (మత్తయి 6:33) దేవుడు ఆకర్షణీయమైన కార్లను లేక విలాసవంతమైన గృహాలను వాగ్దానం చేయలేదు. ఆహారం, వస్త్రాలు వంటి జీవితావసరతల గురించి యేసు మాట్లాడుతున్నాడు. (మత్తయి 6:31) కాని నేడు లక్షలాదిమంది యేసు వాగ్దానం నమ్మదగినదని రుజువుచేస్తున్నారు. ఒక వ్యక్తి కడుబీదవాడైనప్పటికీ, రాజ్యాన్ని ముందుంచినట్లయితే పూర్తిగా విడిచిపెట్టబడడు.
నాలుగవదిగా, దేవుని రాజ్యాన్ని మొదట ఉంచేవ్యక్తి ఆర్థిక కష్టాలచే కలతచెందడని వాళ్లు తెలుసుకున్నారు. అవును, ఒక బీద వ్యక్తి కష్టపడి పని చేయాలి. కాని ఆ వ్యక్తి దేవుని సేవ చేస్తున్నట్లయితే, “ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను” అని బైబిలు చెబుతున్న తన సృష్టికర్తతో ఆయన ఆధిక్యతతో కూడిన సంబంధాన్ని కలిగివుంటాడు. (కీర్తన 22:24) అంతేగాక, జీవిత సమస్యలనెదుర్కోవడానికి ఒక బీద వ్యక్తికి సహాయం లభిస్తుంది. అతడు తోటి క్రైస్తవులతో వాత్సల్యపూరితమైన సహవాసాన్ని అనుభవిస్తూ, బయల్పర్చబడిన యెహోవా చిత్తాన్ని గూర్చిన జ్ఞానాన్ని, దాని ఎడల నమ్మకాన్ని కలిగివుంటాడు. ఇలాంటి విషయాలు “బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారుకంటెను కోరదగినవి.”—కీర్తన 19:10.
చివరికి, ఇక బీదరికం ఉండదు!
చివరికి, సువార్తను వినే వ్యక్తులు యెహోవా దేవుడు తన రాజ్యం ద్వారా బీదరిక సమస్యను మరెన్నడూ ఉండకుండా పరిష్కరించేందుకు సంకల్పించాడని తెలుసుకుంటారు. బైబిలు ఇలా వాగ్దానం చేస్తుంది: “దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు.” (కీర్తన 9:18) యేసుక్రీస్తు పరిపాలకుడుగా పరలోకంలో స్థాపించబడిన రాజ్యం వాస్తవమైన ప్రభుత్వమైయుంది. త్వరలోనే, మానవ వ్యవహారాల నిర్వహణలో ఆ రాజ్యం మానవ ప్రభుత్వాల స్థానాన్ని వహిస్తుంది. (దానియేలు 2:44) ఆ తర్వాత పట్టాభిషేకం నొందిన రాజుగా, యేసు “నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.”—కీర్తన 72:13, 14.
ఆ కాలం గురించి ఎదురుచూస్తూ, మీకా 4:4 ఇలా చెబుతుంది: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవా మాట యిచ్చియున్నాడు.” ఇక్కడ మాట్లాడబడుతున్నది ఎవరి గురించి? దేవుని రాజ్యానికి విధేయులయ్యే వారందరి గురించి. ఆ రాజ్యము అనారోగ్యం మరియు మరణంతో సహా మానవజాతిని బాధించే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుంది. “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును.” (యెషయా 25:8; 33:24) అదెంత భిన్నమైన లోకమై ఉంటుందోకదా! ఈ వాగ్దానాలు దేవునిచే ప్రేరేపించబడ్డాయి గనుక మనం వాటిని నమ్మవచ్చునని గుర్తుంచుకోండి. ఆయనిలా చెబుతున్నాడు: “నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరు.”—యెషయా 32:17.
తరచూ బీదరికం వల్ల ఏర్పడే ఆత్మగౌరవ కొరత, దేవుని రాజ్యమందలి విశ్వాసం ద్వారా అధిగమించబడవచ్చు. దేవుని దృష్టిలో తాను కూడా, ధనికుడైన క్రైస్తవునంత ప్రాముఖ్యమైన వాడినేనని బీదవాడైన క్రైస్తవునికి తెలుసు. దేవుడు ఇద్దరినీ సమానంగా ప్రేమిస్తాడు, ఇద్దరికీ ఒకే నిరీక్షణ ఉంటుంది. దేవుని రాజ్యం క్రింద బీదరికం గతించిన విషయమై ఉండే సమయం కొరకు వారిద్దరూ ఆతురతతో ఎదురుచూస్తారు. అది ఎంత మహిమాన్విత కాలమై ఉంటుందో కదా! చివరికి, ఎవరూ బీదవారై ఉండరు!
[5వ పేజీలోని చిత్రం]
జూదం, పొగత్రాగడం, త్రాగుబోతుతనం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, లేక అవినీతికరమైన జీవన విధానం వంటి వాటిపై డబ్బు వ్యర్థం చేయడమెందుకు?
[7వ పేజీలోని చిత్రం]
యెహోవా దేవుడు తన రాజ్యం ద్వారా మానవ బీదరిక సమస్యలను పరిష్కరిస్తాడు