కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wt అధ్యా. 3 పేజీలు 23-31
  • దేవుని వాక్యాన్ని బలంగా హత్తుకొనివుండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని వాక్యాన్ని బలంగా హత్తుకొనివుండండి
  • అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దాని విలువ గ్రహించేందుకు ఇతరులకు సహాయం చేయండి
  • మన బైబిలు పఠనం
  • మన ఉద్దేశం
  • దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టండి
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
  • ప్రతిదినం బైబిలు చదవడం నుండి ప్రయోజనం పొందుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • బైబిలు చదవడం—ప్రయోజనకరం, ఆహ్లాదకరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • బైబిలు—చదవాల్సిన ఓ పుస్తకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
wt అధ్యా. 3 పేజీలు 23-31

అధ్యాయం మూడు

దేవుని వాక్యాన్ని బలంగా హత్తుకొనివుండండి

1. (ఎ) ప్రాచీన ఇశ్రాయేలు దేవుని వాక్య సత్యసంధతను ఎలా అనుభవించింది? (బి) ఆ విషయం మనకెందుకు ఆసక్తికరమైనది?

“మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను.” (యెహోషువ 23:​14-16) ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు పెద్దలతో ఆ మాటలు చెప్పాడు. అవును యెహోవా వాగ్దానాలు నమ్మదగినవని నిరూపించబడ్డాయి. ఆ వృత్తాంతంతోపాటు మిగతా బైబిలంతా “మనకు నిరీక్షణ కలుగుటకై” మన కోసం భద్రపరచబడింది.​—⁠రోమీయులు 15: 4.

2. (ఎ) బైబిలు ఏ భావంలో ‘దైవావేశమువలన కలిగినది’? (బి) బైబిలు దైవ ప్రేరేపితమని తెలుసుకొన్న మనకు ఎలాంటి బాధ్యత ఉంది?

2 బైబిలు వ్రాయడానికి 40 మంది మానవ రచయితలు ఉపయోగించబడినప్పటికి స్వయంగా యెహోవాయే దాని గ్రంథకర్త. బైబిల్లో వ్రాయబడిన సమస్తాన్ని ఆయనే క్రియాశీలంగా నిర్దేశించాడని దానర్థమా? అవును. ఆయన తన శక్తివంతమైన పరిశుద్ధాత్మ ద్వారా అంటే తన చురుకైన శక్తి ద్వారా అలా నిర్దేశించాడు. అపొస్తలుడైన పౌలు సత్యవంతంగానే ఇలా చెప్పాడు: ‘దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినది.’ ఆ విషయం నమ్మిన ప్రజలందరు బైబిలును లక్ష్యపెట్టి దాని బోధలకు అనుగుణంగా జీవిస్తున్నారు.​—⁠2 తిమోతి 3:​16, 17; 1 థెస్సలొనీకయులు 2:​13.

దాని విలువ గ్రహించేందుకు ఇతరులకు సహాయం చేయండి

3. బైబిలు దేవుని వాక్యమని విశ్వసించని అనేకులకు సహాయం చేయగల అత్యుత్తమ మార్గమేది?

3 మనం మాట్లాడే ప్రజల్లో అనేకులు, మనవలెనే బైబిలు దేవుని వాక్యమని విశ్వసించరు. అలాంటి వారికి మనమెలా సహాయం చేయవచ్చు? తరచూ బైబిలు తెరిచి దానిలోని విషయాలను వారికి చూపించడమే అత్యుత్తమ మార్గం. ‘దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది.’ (హెబ్రీయులు 4:​12) “దేవుని వాక్యము” ఒక మృతచరిత్ర కాదు, అది సజీవమైనది! బైబిలు వాగ్దానాలు నిరాటంకంగా నెరవేరతాయి. ఒక వ్యక్తి హృదయ తలంపులపై బైబిలు సందేశం చూపే ప్రభావం, ఆ వ్యక్తిని పురికొల్పేందుకు మనం వ్యక్తిగతంగా చెప్పే వాటన్నింటికన్నా ఎంతో బలంగా ఉంటుంది.

4. బైబిలు సత్యాల గురించిన ఎలాంటి వివరణలు, బైబిలుపట్ల కొంతమంది ప్రజల దృక్పథాన్ని మార్చాయి, ఎందుకు?

4 బైబిల్లో దేవుని నామము చూసిన అనేకులు దానిని మరింత లోతుగా పరిశీలించేందుకు కదిలించబడ్డారు. జీవిత సంకల్పం గురించి, దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతించాడనే విషయం గురించి, ప్రస్తుత సంఘటనల ప్రాముఖ్యత గురించి, లేదా పరదైసు భూమిపై నిత్యజీవ నిరీక్షణ గురించి బైబిలు చెప్పే విషయాలను చూపించినప్పుడు మరితరులు బైబిలు అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. మతపరమైన ఆచారాలు ప్రజలను దుష్టాత్మల వేదనకు గురిచేసిన దేశాల్లో, దానికి కారణమేమిటి, ఉపశమనం ఎలా పొందాలి అనే విషయాల గురించి బైబిలు ఇచ్చే వివరణ ప్రజల్లో ఆసక్తి కలుగజేసింది. ఈ అంశాలు యథార్థ ప్రజలను ఎందుకు ముగ్ధులను చేస్తున్నాయి? ఎందుకంటే, ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాలన్నింటి గురించి కేవలం బైబిల్లో మాత్రమే నమ్మదగిన సమాచారముంది.​—⁠కీర్తన 119:​130.

5. (ఎ) తాము బైబిలును నమ్మమని ప్రజలు చెప్పినప్పుడు, దానికి కారణాలు ఏమై ఉండవచ్చు? (బి) అలాంటి ప్రజలకు మనమెలా సహాయపడవచ్చు?

5 అయితే, బైబిలును విశ్వసించమని ప్రజలు మనతో చెబితే అప్పుడెలా? అంతటితో మన సంభాషణ ముగించాలా? వారు తర్కించడానికి సుముఖంగా ఉంటే సంభాషణ అంతటితో ఆపవలసిన అవసరంలేదు. బహుశా వారు బైబిలు క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన పుస్తకమని దృష్టిస్తుండవచ్చు. క్రైస్తవమత సామ్రాజ్యపు వేషధారణ, రాజకీయాల్లో దాని జోక్యం, డబ్బు కోసం పదేపదే అభ్యర్థించడం వల్ల వారికి బైబిలుపట్ల ప్రతికూల అభిప్రాయం ఏర్పడివుండవచ్చు. కారణం అదేనా అని వారిని ఎందుకు అడగకూడదు? క్రైస్తవమత సామ్రాజ్య లోకసంబంధ విధానాలను బైబిలు ఖండిస్తుందని, అలాగే క్రైస్తవమత సామ్రాజ్యానికి నిజ క్రైస్తవత్వానికి మధ్య తేడాలున్నాయని వారికి చూపిస్తే అది వారిలో ఆసక్తి కలిగించవచ్చు.​—⁠మీకా 3:​11, 12; మత్తయి 15:​7-9; యాకోబు 4: 4.

6. (ఎ) బైబిలు దేవుని వాక్యమని మిమ్మల్ని వ్యక్తిగతంగా ఒప్పించే విషయమేమిటి? (బి) బైబిలు నిజంగా దేవుని నుండే కలిగిందని గ్రహించడానికి ప్రజలకు సహాయపడేందుకు మరింకే విధాలుగా తర్కించవచ్చు?

6 మరికొందరితో, బైబిలు దేవునిచే ప్రేరేపించబడినదని చూపించే రుజువులను సూటిగా చర్చించడం సహాయకరంగా ఉండవచ్చు. బైబిలు యెహోవా నుండే వచ్చినదని మీకు స్పష్టంగా నిరూపించేదేమిటి? బైబిలే స్వయంగా తన మూలం గురించి చెబుతున్న విషయమా? లేక భవిష్యత్తు గురించి వివరంగా తెలియజేసే అనేక ప్రవచనాలు బైబిల్లో ఉన్నందువల్ల ఆ ప్రవచనాలు మానవాతీత మూలం నుండే వచ్చాయనే వాస్తవమా? (2 పేతురు 1:​20, 21) బహుశా అది, బైబిలు 1,600 సంవత్సరాల కంటే ఎక్కువ కాలనిడివిలో 40 మందిచేత వ్రాయబడినా దానిలోవున్న అద్భుతమైన అంతర్గత సామరస్యతా? లేక ఆ కాలంలోనే వ్రాయబడిన ఇతర గ్రంథాలకు భిన్నంగా బైబిలుకున్న వైజ్ఞానిక ఖచ్చితత్వమా? లేక దాని రచయితల నిష్కాపట్యమా? లేక దానిని నాశనం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగినా అది భద్రపరచబడడమా? మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రభావితం చేసిన విషయమేదైనా దానిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించవచ్చు.a

మన బైబిలు పఠనం

7, 8. (ఎ) మనం బైబిలును ఎలా ఉపయోగించాలి? (బి) వ్యక్తిగత బైబిలు పఠనంతోపాటు మనం ఇంకా ఏమి చెయ్యాలి? (సి) యెహోవా సంకల్పాలను వ్యక్తిగతంగా మీరు ఎలా అర్థంచేసుకున్నారు?

7 బైబిలును విశ్వసించేందుకు ఇతరులకు సహాయం చేయడంతోపాటు, వ్యక్తిగతంగా మనం కూడా క్రమంగా బైబిలు చదవడానికి సమయం కేటాయించాలి. మీరలా చేస్తున్నారా? ఇప్పటివరకు ఉత్పత్తయిన సమస్త పుస్తకాల్లో ఇదే అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథం. అంటే దానర్థం, బైబిలును మనంతట మనమే చదువుకుంటే చాలు, ఇక మనకేమి అవసరంలేదని కాదు. మనలను మనం ఇతరుల నుండి వేరుపరచుకోకూడదని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. స్వీయపరిశోధన ద్వారా మనం అన్ని విషయాలను కనుక్కోగలమని తలంచకూడదు. మనం సమతుల్యతగల క్రైస్తవులుగా ఉండాలంటే వ్యక్తిగత అధ్యయనం, దేవుని ప్రజల కూటాలకు క్రమంగా హాజరవడం ఈ రెండూ అవసరం.​—⁠సామెతలు 18: 1; హెబ్రీయులు 10:​24, 25.

8 దీనికి సంబంధించి, యెషయా ప్రవచనం చదువుతున్న ఐతియొపీయుడైన ఒక అధికారి గురించి బైబిలు చెబుతోంది. ఒక దేవదూత క్రైస్తవ సువార్తికుడైన ఫిలిప్పును ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి “నీవు చదువునది గ్రహించుచున్నావా?” అని ప్రశ్నించమని నిర్దేశించాడు. ఆ ఐతియొపీయుడు దానికి వినయంగా ఇలా బదులు పలికాడు: ‘ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలను?’ ఆ లేఖన భాగాన్ని వివరించమని ఆయన ఫిలిప్పును వేడుకున్నాడు. అయితే ఫిలిప్పు స్వయంగా బైబిలు చదువుకొని లేఖనాల గురించి తన స్వంత అభిప్రాయాలను తెలియజేసే వ్యక్తి కాదు. ఆయన దేవుని దృశ్య సంస్థతో సన్నిహిత సంబంధం కలిగివుండేవాడు. కాబట్టి, ఆ సంస్థ ద్వారా యెహోవా ఇస్తున్న ఉపదేశం నుండి ప్రయోజనం పొందేందుకు ఆయన ఆ ఐతియొపీయుడికి సహాయం చేయగలిగాడు. (అపొస్తలుల కార్యములు 6:​5, 6; 8:​5, 26-35) అదేవిధంగా నేడు, యెహోవా సంకల్పాల గురించి ఎవ్వరూ స్వయంగా తమంతట తామే సరైన అవగాహనకు చేరుకోలేరు. యెహోవా తన దృశ్య సంస్థ ద్వారా ప్రేమపూర్వకంగా ఇచ్చే సహాయం మనందరికి అవసరం.

9. ఎలాంటి బైబిలు పఠన కార్యక్రమం మనందరికి ప్రయోజనకరంగా ఉండగలదు?

9 బైబిలును అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడేందుకు, యెహోవా సంస్థ వివిధ ప్రచురణల ద్వారా అత్యుత్తమమైన లేఖనాధార సమాచారం అందజేస్తోంది. అంతేకాక, ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాలన్నింటిలో నిర్వహించబడే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు సంబంధించిన పట్టికలో మన కోసం క్రమమైన బైబిలు పఠన షెడ్యూలు ఇవ్వబడుతోంది. పరిశుద్ధ లేఖనాలను వ్యక్తిగతంగా పరిశీలించడం వలన గొప్ప ప్రయోజనాలు లభించగలవు. (కీర్తన 1:​1-3; 19:​7, 8) క్రమంగా బైబిలు చదవడానికి ప్రత్యేకంగా కృషి చేయండి. మీకు ప్రతి విషయం పూర్తిగా అర్థంకాకపోయినా, మీరు లేఖనాల సారాంశాన్ని అర్థంచేసుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు రోజుకు కేవలం నాలుగైదు పేజీలు చదివినా దాదాపు ఒక సంవత్సరంలో పూర్తి బైబిలును చదవగలుగుతారు.

10. (ఎ) మీరు బైబిలును ఎప్పుడు చదువుతారు? (బి) బైబిలు చదివేటప్పుడు మరెవరిని కూడా చేర్చుకోవాలి, క్రమంగా చదవడం ఎందుకు ప్రాముఖ్యం?

10 మీరు బైబిలును ఎప్పుడు చదవవచ్చు? మీరు బైబిలును చదవడానికి రోజుకు కనీసం 10 లేక 15 నిమిషాలు కేటాయించినా, మీరెంతో ప్రయోజనం పొందుతారు. అలా వీలుకాకపోతే, కనీసం ప్రతివారం క్రమంగా బైబిలు చదవడానికి కొంత సమయం కేటాయించడానికి షెడ్యూలు వేసుకోండి, దానిని తప్పకుండా పాటించండి. మీరు వివాహితులైతే, మీరూ మీ భాగస్వామీ ఒకరికొకరు చదివి వినిపించుకొని బైబిలు పఠనాన్ని ఆనందించండి. చదవగలిగే వయసుగల పిల్లలుంటే, వారు కూడా చదివి వినిపించడంలో భాగం వహించవచ్చు. బైబిలు పఠనం, ఆహారం భుజించే అలవాటులాగే జీవితాంతపు అలవాటుగా ఉండాలి. ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు సరిగా లేకపోతే ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందని మీకు తెలుసు. అదే విధంగా మన ఆధ్యాత్మిక జీవితం, దానిమూలంగా లభించే నిత్యజీవం కూడా యెహోవా “నోటనుండి వచ్చు ప్రతిమాట” వలన మనం క్రమంగా పోషించబడడంపై ఆధారపడి ఉంటుంది.​—⁠మత్తయి 4: 4.

మన ఉద్దేశం

11. బైబిలు చదవడంలో మన ఉద్దేశమేమై ఉండాలి?

11 బైబిలు చదవడంలో మన ఉద్దేశమేమై ఉండాలి? కేవలం ఇన్ని పేజీలు పూర్తి చేయాలన్నదే మన లక్ష్యంగా ఉండకూడదు. దేవునిపట్ల మన ప్రేమను అధికం చేసుకొని, ఆయనకు అంగీకారయోగ్యమైన విధంగా ఆరాధించేందుకు వీలుగా ఆయన గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలన్నదే మన ఉద్దేశమై ఉండాలి. (యోహాను 5:​39-42) మన దృక్పథం, “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము” అని చెప్పిన బైబిలు రచయితలా ఉండాలి.​—⁠కీర్తన 25: 4.

12. (ఎ) “ఖచ్చితమైన జ్ఞానము” సంపాదించుకోవడం ఎందుకు అవసరం, ఆ జ్ఞానమును సంపాదించుకోవడానికి మనం చదివేటప్పుడు ఎలాంటి కృషి అవసరం కావచ్చు? (బి) మనం బైబిల్లో చదివే భాగాలను ఏ నాలుగు దృక్కోణాలు ఉపయోగించి ప్రయోజనకరంగా విశ్లేషించవచ్చు? (30వ పేజీలోని బాక్సు చూడండి.) (సి) ఈ పేరాలో ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా ఆ అంశాలను ఉదహరించండి. ఎత్తి వ్రాయబడకుండా కేవలం సూచించబడిన లేఖనాలను చూడండి.

12 మనం యెహోవా బోధలను నేర్చుకుంటుండగా, “ఖచ్చితమైన జ్ఞానము”ను సంపాదించుకోవాలని మనం కోరుకోవాలి. అది లేకుండా మనం దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో ఎలా సరిగ్గా అన్వయించుకోగలం లేదా దానిని ఇతరులకు ఎలా సరిగ్గా వివరించగలం? (కొలొస్సయులు 3:​10; 2 తిమోతి 2:​15) ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకోవాలంటే మనం జాగ్రత్తగా పఠించాలి, ఒకవేళ బైబిల్లోని ఒక భాగం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే దాని భావాన్ని గ్రహించడానికి మనం ఆ భాగాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు చదవవలసి రావచ్చు. మనం చదివిన సమాచారం గురించి వివిధ దృక్కోణాల నుండి ఆలోచిస్తూ దాని గురించి ధ్యానించడానికి సమయం తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మనం విశ్లేషించగల నాలుగు అమూల్యమైన అంశాలు 30వ పేజీలో ప్రత్యేకంగా ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దృక్కోణాలను ఉపయోగించి లేఖనాల్లోని అనేక భాగాలను ప్రయోజనకరంగా విశ్లేషించవచ్చు. తర్వాతి పేజీల్లోని ప్రశ్నలకు సమాధానాలిస్తుండగా అదెలా సాధ్యమో మీరే గ్రహిస్తారు.

(1) మీరు చదువుతున్న లేఖన భాగం, యెహోవా ఎలాంటి వ్యక్తి అనే విషయం గురించి తరచూ కొంత సమాచారమిస్తుంది. ఉదాహరణకు, కీర్తన 139:13, 14 వచనాల్లో గర్భస్థ శిశువులపట్ల దేవునికున్న ప్రగాఢమైన శ్రద్ధ గురించి తెలుసుకుంటాం: “నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.” యెహోవా సృష్టికార్యములు ఎంత అద్భుతమైనవో కదా! మానవుల నిర్మాణరీతి, ఆయనకు మనపట్ల ఉన్న గొప్ప ప్రేమను రుజువు చేస్తోంది.

యోహాను 14:​9, 10 వచనాల్లో చెప్పబడిన విషయం దృష్ట్యా, యేసు ఇతరులతో వ్యవహరించిన విధానం గురించి మనం చదివినప్పుడు, నిజానికి మనం యెహోవా స్వయంగా ఎలా వ్యవహరించి ఉండేవాడో చూస్తున్నాం. ఆ విషయాన్ని మనస్సులో ఉంచుకొని, లూకా 5:12, 13, లూకా 7:​11-15 లో నమోదు చేయబడిన సంఘటనల నుండి మనం యెహోవా గురించి ఎలాంటి నిర్ధారణకు రావచ్చు?

(2) ఆ వృత్తాంతం బైబిలు ప్రధానాంశానికి, అంటే వాగ్దత్త సంతానమైన యేసుక్రీస్తు అధికారంలోని రాజ్యం ద్వారా యెహోవా సర్వోన్నతాధిపత్యం నిరూపించబడడానికి, ఆయన నామము మహిమపరచబడడానికి ఎలా సంబంధం కలిగివుందో ఆలోచించండి.

బైబిలు మూలాంశం యెహెజ్కేలు ద్వారా దానియేలు ద్వారా ఎలా నొక్కిచెప్పబడింది? (యెహెజ్కేలు 38:​21-23; దానియేలు 2:​44; 4:​17; 7:​9-14)

యేసే వాగ్దత్త సంతానమని బైబిలు ఎలా స్పష్టంగా గుర్తిస్తోంది? (గలతీయులు 3:​16)

రాజ్య మూలాంశానికి సంబంధించిన దివ్యమైన ముగింపును ప్రకటన గ్రంథం ఎలా వర్ణిస్తోంది? (ప్రకటన 11:​15; 12:​7-10; 17:​16-18; 19:​11-16; 20:​1-3; 21:​1-5)

(3) మీరు చదువుతున్న విషయాన్ని వ్యక్తిగతంగా ఎలా అన్వయించుకోవచ్చో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉదాహరణకు, మనం నిర్గమకాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు ఇశ్రాయేలీయుల అనైతికత గురించి, తిరుగుబాటుతనం గురించి చదువుతాం. ఆ వైఖరులు, చర్యలు చెడు పరిణామాలకు దారితీశాయని మనం నేర్చుకుంటాము. అందువల్ల, మనం ఇశ్రాయేలీయుల చెడు మాదిరిని అనుకరించకుండా యెహోవాను సంతోషపరచడానికి పురికొల్పబడాలి. “ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.”​—⁠1 కొరింథీయులు 10:​11.

కయీను హేబెలును చంపడం గురించి తెలియజేసే వృత్తాంతంలో మనకెలాంటి పాఠం ఉంది? (ఆదికాండము 4:​3-12; హెబ్రీయులు 11: 4; 1 యోహాను 3:​10-15; 4:​20, 21)

పరలోక నిరీక్షణగల క్రైస్తవులకు బైబిలు ఇచ్చే ఉపదేశం, భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణగల క్రైస్తవులకు కూడా అన్వయిస్తుందా? (సంఖ్యాకాండము 15:​16; యోహాను 10:​16)

క్రైస్తవ సంఘంలో మనకు మంచి స్థానం ఉన్నప్పటికి, మనకు ఇప్పటికే తెలిసివున్న బైబిలు ఉపదేశాన్ని మరింత సంపూర్ణంగా ఎలా అన్వయించుకోవచ్చో మనమెందుకు ఆలోచించాలి? (2 కొరింథీయులు 13: 5; 1 థెస్సలొనీకయులు 4: 1)

(4) మీరు చదువుతున్న విషయాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు ఎలా ఉపయోగించవచ్చో ఆలోచించండి. ప్రజలందరు ఆరోగ్య సమస్యల గురించి చింతిస్తారు కాబట్టి, మనం యేసు రాజ్యాధికారంతో వచ్చినప్పుడు ఆయన ఎలాంటి పనులు మరింత విస్తృతంగా చేస్తాడో ఉదహరించడానికి ఆయన భూమిపై ఉన్నప్పుడు చేసిన పనుల గురించి వారికి చదివి వినిపించవచ్చు: ‘బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చారు, ఆయన వారిని స్వస్థపరిచాడు.’​—⁠మత్తయి 15: 30.

యాయీరు కుమార్తె పునరుత్థానం గురించి తెలియజేసే వృత్తాంతం ఉపయోగించి ఎలాంటి ప్రజలకు సహాయం చేయవచ్చు? (లూకా 8:​41, 42, 49-56)

13. యెహోవా సంస్థతో కలిసి క్రమంగా బైబిలు చదివి అధ్యయనం చేసే కార్యక్రమం నుండి మనమెలాంటి ఫలితాలను అపేక్షించవచ్చు?

13 పైన పేర్కొనబడిన నాలుగు అంశాలను పరిశీలించినప్పుడు బైబిలు పఠనం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో కదా! నిజానికి, బైబిలు పఠనం ఒక సవాలే. కాని అది మనకు జీవితాంతం ప్రయోజనకరంగా ఉండగలదు, ఎందుకంటే లేఖనాలు చదువుతుండగా మనం ఆధ్యాత్మికంగా బలపడతాము. క్రమంగా బైబిలు చదవడం వల్ల మనం మన ప్రేమగల తండ్రి యెహోవాకు, మన క్రైస్తవ సహోదరులకు మరింత సన్నిహితులమౌతాము. ‘జీవవాక్యమును బలంగా చేత పట్టుకొనివుండండి’ అనే సలహాను లక్ష్యపెట్టడానికి అది మనకు సహాయం చేస్తుంది.​—⁠ఫిలిప్పీయులు 2: 16.

[అధస్సూచి]

a బైబిలు ఎందుకు పరిశీలనార్హమో తెలుసుకొనేందుకు మరిన్ని వివరాల కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన సర్వమానవాళి కొరకైన గ్రంథము అనే బ్రోషుర్‌ను చూడండి.

పునఃసమీక్షా చర్చ

• బైబిలు ఎందుకు వ్రాయబడింది, మనకాలం వరకు అది ఎందుకు భద్రపరచబడింది?

• బైబిలును విలువైనదిగా ఎంచడానికి మనం ఇతరులకు ఎలా సహాయపడవచ్చు?

• క్రమంగా వ్యక్తిగత బైబిలు పఠనం చేయడం ఎందుకు లాభదాయకం? మనం చదువుతున్న బైబిలు భాగాలను ఏ నాలుగు దృక్కోణాలు ఉపయోగించి ప్రయోజనకరంగా విశ్లేషించవచ్చు?

[30వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీరు ఒక బైబిలు భాగాన్ని చదివేటప్పుడు ఈ అంశాల గురించి ఆలోచించండి

అది ఒక వ్యక్తిగా యెహోవా గురించి మీకేమి తెలియజేస్తోంది

అది బైబిలు మూలాంశానికి ఎలా ముడిపడి ఉంది

అది మీ స్వంత జీవితాన్ని ఎలా ప్రభావితం చేయాలి

ఇతరులకు సహాయం చేయడానికి మీరు దానినెలా ఉపయోగించవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి