బీదవారు ఎంతకాలం వేచివుండాలి?
“స్వతంత్ర సమాజం బీదలైన అనేకులకు సహాయం చేయలేకపోతే, ధనవంతులైన కొద్దిమందిని అది కాపాడలేదు.”—జాన్ ఎఫ్. కెన్నెడి.
“నేను ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని—బీదరికం లేని, నిరాశ్రయులు లేని ఒక పరదైసు రావాలని కోరుకుంటున్నాను!” బ్రెజిల్‌లోని సావోపాలోనందలి, 12 సంవత్సరాల ఒక బాలుడు అలా చెప్పాడు. కాని, బీదరికాన్ని నిర్మూలించడం సాధ్యమేనా? బీదవారు ఎంతకాలం వేచివుండాలి?
తమకు కావలసిన వస్తువులను తాము కొనుక్కోలేకపోవడం వల్ల కొందరు తమను తాము బీదవారిగా పరిగణించుకుంటారు. అయితే నిజంగా బీదరికంతో బాధపడుతున్నవారి దుఃఖకరమైన పరిస్థితి గురించి ఆలోచించండి. అలాంటి ప్రజలు కలిగివున్న విపరీతమైన కష్టాన్నిగూర్చి మరియు అసంతోషాన్ని గూర్చి మీరూహించగలరా? కొందరు చెత్త కుండీల వద్ద ఆహారం కొరకు వెదుకుతూ, రాబందులు మరియు ఎలుకలతో పోటీపడవలసి ఉంటుంది! అలాంటి బీదరికం మానవజాతిని ఎంతకాలం బాధిస్తుంది? యునెస్కో (ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ) డైరెక్టర్ జనరల్ అయిన ఫెడెరికో మేయర్ చేసిన ఈ విజ్ఞప్తి సముచితమైనదే: “బీదరికం, ఆకలి, లక్షలాదిమంది మానవుల బాధ వంటి సహించుకొనలేని వాటిని సహించుకోవడానికి మనల్ని అనుమతించే ఈ సందేహాస్పదమైన సహనాన్ని మనం విడిచిపెడదాము.”
విశ్వ శ్రేయస్సును గూర్చిన కల నెరవేరుతుందా? బీదవారికి ఏ నిరీక్షణ ఉంది?
బీదవారికి ఏ అవకాశాలున్నాయి?
సద్భావంగల నాయకులు మరిన్ని ఉద్యోగాలు, మంచి వేతనాలు, మెరుగైన సాంఘిక కార్యక్రమాలు, భూ సంస్కరణలు వంటివాటిని ప్రతిపాదిస్తారు. మునుపటి అమెరికా అధ్యక్షుడైన జాన్ ఎఫ్. కెన్నెడితో వారు ఏకీభవించవచ్చు: “స్వతంత్ర సమాజం బీదలైన అనేకులకు సహాయం చేయలేకపోతే, ధనవంతులైన కొద్దిమందిని అది కాపాడలేదు.” అయితే బీదరికాన్ని నిర్మూలించడానికి మంచి ఉద్దేశాలు మాత్రమే సరిపోవు. ఉదాహరణకు, ఆర్థిక పెరుగుదల సామాన్యులైన బీదవారికి సహాయం చేయగలదా? చేయకపోవచ్చు. భారతదేశ మాజీ నాయకుడైన జవహర్లాల్ నెహ్రూ ఇలా వ్యాఖ్యానించాడు: “పెట్టుబడిదారీ సమాజపు శక్తులు, గమనించకుండా విడిచిపెట్టబడితే, అవి ధనికులను మరింత ధనికులుగా, బీదవారిని కడు బీదవారిగా చేయగలవు.” అయితే, శ్రమ మరియు నిత్యావసర వస్తువుల కొరత వంటివేగాక, నిష్ప్రయోజకులమనే భావన బీదవారి భారాన్ని పెంచుతుంది. నిస్సహాయతా, నిరాశా భావాలను అధిగమించడానికి మానవ నాయకులు బీదవారికి సహాయం చేయగలరా?
వాస్తవానికి, కడు బీదలైన అనేకులు బీదరికాన్ని తాళుకొని, ఆకాశాన్నంటే ధరలు మరియు నిరుద్యోగం వంటి గొప్ప కష్టాల సాన్నిధ్యంలో ఆత్మన్యూనతా భావాలను అధిగమించడాన్ని నేర్చుకొన్నారు. అంతేగాక, కరువు, నిరాశ్రయత మరియు దుఃఖం నిశ్చయంగా తీసివేయబడతాయి. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా? “త్వరలోనే, ఎవరూ బీదవారై ఉండరు!” అనే మా తదుపరి శీర్షికను చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.