బీదలకు నిరీక్షణా సందేశాన్ని ప్రకటించండి
1 యేసు తన భూ పరిచర్యలో బీదలపట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచాడు. ఆయన అద్భుతరీతిలో భౌతిక సహాయం చేసి రోగులను స్వస్థపరచిన సందర్భాలున్నా బీదలకు “సువార్తను” ప్రకటించడంపైనే ఆయన దృష్టి నిలిపాడు. (మత్త. 11:5) నేడు కూడా క్రైస్తవ పరిచర్య బీదలతోపాటు ఇతరులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది.—మత్త. 24:14; 28:19, 20.
2 నిజమైన నిరీక్షణ: క్రైస్తవమత సామ్రాజ్యపు పరిచారకులు, చర్చికి ధారాళంగా చందాలిస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని తరచూ బీదలకు చెబుతారు. అయితే, దేవుని రాజ్యం మాత్రమే బీదరికాన్ని తీసివేసి, మానవ సమస్యలనన్నిటినీ పరిష్కరిస్తుందని బైబిలు బోధిస్తోంది. (కీర్త. 9:18; 145:16; యెష. 65:21-23) బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో తెలుసుకునేలా బీదలకు సహాయం చేయడం ద్వారా మనం వారికి నిరీక్షణను అందించడమేకాక, ఆధ్యాత్మిక అవసరతలను తీర్చుకోవడానికి వారికి సహాయం చేస్తాం.—మత్త. 5:3.
3 యేసు కాలంలోని పరిసయ్యులు బీదలను చిన్నచూపు చూస్తూ, అహంకారంతో వారిని ‘ఆమ్-హా’-రెట్స్, లేదా “మట్టి మనుష్యులు” అని పిలిచేవారు. అయితే, యేసు “వారి ప్రాణము[ను]” “ప్రియముగా” ఎంచాడు. (కీర్త. 72:13, 14) అలాంటి బీదవారిపట్ల దయ, సానుభూతి కనబరచడం ద్వారా మనం యేసులా ‘కనికరం’ చూపించవచ్చు. (సామె. 14:31) నిరుపేద వాడల్లో నివసిస్తున్న ప్రజల గురించి మనమెప్పుడూ చులకనగా మాట్లాడాలనుకోము లేదా అలాంటివారికి ప్రకటించడానికి వెనుకాడం. నిజానికి రాజ్య సందేశానికి ఎక్కువగా ప్రతిస్పందిస్తున్నది బీదవారే.
4 వారికిప్పుడే సహాయంచేయండి: క్షేత్రంలోని బీదలకు మనం బైబిలు సూత్రాలను బోధించడం ద్వారా నేడు బీదరికంవల్ల కలిగే పరిణామాలను తగ్గించుకోవడానికి మనం వారికి సహాయపడవచ్చు. ఉదాహరణకు, త్రాగుబోతుతనాన్ని, జూదమాడడాన్ని, సోమరితనాన్ని, పొగాకు వాడకాన్ని, పేదరికానికి దారితీసే మరితర అలవాట్లను బైబిలు ఖండిస్తోంది. (సామె. 6:10, 11; 23:21; 2 కొరిం. 7:1; ఎఫె 5:5) నిజాయితీగా ఉంటూ, “మనస్ఫూర్తిగా” పనిచేయాలని బైబిలు ప్రోత్సహిస్తోంది, ఆ లక్షణాలే తమ ఉద్యోగస్థుల్లో ఉండాలని యజమానులు కోరుకుంటారు. (కొలొ. 3:22, 23; హెబ్రీ. 13:18) నిజానికి, ఒక సర్వేలో చాలామంది యజమానులు, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారిలో నిజాయితీ, విశ్వసనీయత వంటి లక్షణాలే తమను ఆకట్టుకుంటాయని చెప్పారు.
5 బీదలు పడుతున్న బాధల విషయంలో యెహోవా శ్రద్ధ వహిస్తున్నాడు. త్వరలోనే, సహాయంకోసం ‘మొఱ్ఱపెట్టుకుంటున్న దరిద్రులను’ అంటే బీదవారిని యేసుక్రీస్తు విడిపిస్తాడు. (కీర్త. 72:12) అంతవరకూ, బీదలతో సహా ఇతరులను బైబిలిస్తున్న నిరీక్షణా సందేశంతో ఓదార్చే ఆధిక్యత మనకుంది.