ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు—పోలండ్
పందొమ్మిది వందల ఎనభై తొమ్మిది శీతాకాలం వచ్చినప్పుడు, బాల్టిక్ నుండి నల్ల సముద్రం వరకున్న సామ్యవాద ప్రభుత్వాలు కంపించడం మొదలయ్యాయి. ఇనుప తెర ఛేదించబడుతున్నప్పుడు, తూర్పు ఐరోపా నందున్న దేశాలు స్వతంత్ర పద్ధతులను అవలంభించడం ప్రారంభించాయి. వాటిలో, గుండ్రని గుట్టలూ, పల్లపు ప్రదేశాలూ మెరకుపల్లాల పర్వతాలతో ఉన్న పోలండ్ దేశం ఒకటి.a
పోలండ్ ప్రజలు చాలా కష్టపడి పనిచేసేవారు, అంతేకాకుండ కొందరు ప్రపంచ ఖ్యాతిగాంచిన కళాకారులను వైజ్ఞానికులనూ పోలండ్ అందించింది. అయితే దానికంటే అధికంగా, యిప్పుడు దేవుని రాజ్య సువార్తను ప్రకటించే పెరుగుతున్న పెద్ద సైన్యము అక్కడ ఉంది.
అబద్ధాన్ని బహిర్గతం చేయడంలో ధైర్యం
పోలండ్‌లో, బైబిలు నుండి సత్యాన్ని నేర్చుకోవాలని యిష్టపడేవారనేకమంది ఉన్నారు. అయితే, కొందరు తమ బంధువులు లేక పొరుగువారి వల్ల భయపడుతున్నారు. ఉదాహరణకు, రోక్లా ప్రాంతంలో, ఆసక్తి గల ఒక స్త్రీ, తన కుటుంబం మరియు స్నేహితులు ఆమెను ఒత్తిడి చేసినప్పుడు, యెహోవాసాక్షులతో బైబిలు పఠించడాన్ని మానేసింది. అయినప్పటికీ, ఆమె యౌవన కుమార్తె అబద్ధ మతాన్ని బహిర్గతం చేసే కావలికోట శీర్షికలను చదివింది. అది సత్యం యెడల ఆమె ఆసక్తిని రేకెత్తించింది.
ఆరు నెలల బైబిలు పఠనం తర్వాత ఆ యౌవనస్థురాలు అబద్ధ మతంతో తన సంబంధాలన్నింటినీ తెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె తన నిర్ణయాన్ని గూర్చి తెలియజేసేందుకు తన చర్చి మత గురువును కలిసింది. ఈ క్రింది విధంగా రాయమని ఆయన ఆమెతో చెప్పాడు: “కె—— పి——నైన నేను, కాథోలిక్ విశ్వాసాన్ని పరిత్యజిస్తున్నాను.”
తర్వాతి ఆదివారం, ఈ ప్రకటనను చర్చిలో చదవడం జరిగింది. ఆ అమ్మాయి తాతగారు కళ్లుతిరిగి పడిపోయారు, ఆమె అమ్మమ్మ బోరుమంటూ ఏడ్చేసింది. అయితే, యితర సభ్యులు ముగ్ధులై, యిలా వ్యాఖ్యానించారు: “చివరికి, మన చర్చిలో ఎంతో అసత్యం ఉందని చెప్పేంత ధైర్యం ఒక్కరికైనా ఉంది.” ధైర్యశాలియైన ఈ యౌవనస్థురాలు యిప్పుడు బాప్తిస్మం పొందిన ఆత్మీయ సహోదరి, అంతేకాకుండా ఆమె తన గ్రామంలో ఏడు బైబిలు పఠనాలను నిర్వహిస్తోంది.
‘వారి ఫలాల ద్వారా’
“వారిని తమ ఫలాలా ద్వారా గుర్తిస్తారు” అనే నివేదికను వార్తా పత్రికైన కుయావె యి పొమోజి ప్రచురించింది. క్రైస్తవ మత సామ్రాజ్యంలోని ఆరాధికులు “తాము అంగీకరించిన మత సూత్రాలను వారు గంభీరంగా ఎంచరు. తాము చెప్పినట్లుగా నడుచుకునే యెహోవాసాక్షులకు వారు చాలా భిన్నంగా ఉంటారు. అంతేకాకుండా వీరు బైబిలు ఆజ్ఞాపించే దాన్ని చెబుతారు.”
సాక్షులను నామకార్థ క్రైస్తవులతో పోల్చిన తర్వాత ఆ నివేదిక యిలా కొనసాగింది: “బహుశ నామకార్థ క్రైస్తవులకు తమ విశ్వాసం యొక్క ముఖ్య సూత్రాలూ సత్యాలూ తెలియవు, మరి తరచుగా వాటిని అన్వయించరు. . . . వారి ప్రవర్తనను బట్టి తమ మాటలూ క్రియలూ ఒకే తాటిపైనున్నాయనీ, తద్వారా తాము ‘అబద్ధ ప్రవక్తలు’ కారుగానీ, తమ ఫలాల వల్ల వారు గుర్తించబడతారనీ యెహోవాసాక్షులు నిరూపించుకుంటారు. ‘ప్రజలు ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైను, పల్లేరుచెట్ల నుండి అంజూరపు పండ్లనైనను కోయుదురా?’ (మత్తయి 7:15, 20).”
తన కుమారుడు కాథోలిక్ చర్చిని విడిచిపెట్టి ఒక యెహోవాసాక్షి అయినందుకు విలపిస్తూ ఒక స్త్రీ పచియాచుకా అనే వారపత్రికకు ఉత్తరాన్ని రాసింది. ఆ సంపాదకురాలు ఏమని సలహా యిచ్చింది? “మీ కుమారుడు యెహోవాసాక్షులతో సహవసించి, వారి విశ్వాసాన్ని గూర్చి నేర్చుకుని దాన్ని అంగీకరిస్తే, అదంతా అతని స్వంత నిర్ణయమౌతుంది, దాన్ని గుర్తించి గౌరవించాలి. . . . వారి అపూర్వమైన ఐక్యత, అనురాగ బంధాలు, గొప్ప నిజాయితీ అంతేకాకుండ అంగీకృతమైన సాంఘిక నియమాలన్నింటినీ వారు సన్నిహితంగా అనుసరించడం, తమ సత్యానికి అనుగుణంగా జీవించే సామర్థ్యమూ, అలాగే వారికున్న విలువలను ఆచరణ ద్వారా సాధించడం వంటి లక్షణాలను మరియు చివరిగా సాంఘికంగా కోరదగిన లక్షణాలనేకం ఈ అద్భుతమైన మత గుంపుకు ఉన్నాయి. ఇవన్నీ అమూల్యమైన సద్గుణాలు.”
[అధస్సూచీలు]
a అదనపు సమాచారం కొరకు, 1994 యెహోవాసాక్షుల కేలండరు చూడండి.
[9వ పేజీలోని బాక్సు]
దేశ గణాంక వివరాలు
1993 సేవా సంవత్సరం
సాక్ష్యమిస్తున్నవారి శిఖరాగ్ర సంఖ్య: 113,551
నిష్పత్తి: 1 సాక్షికి 339
జ్ఞాపకార్థ దినానికి హాజరైనవారి సంఖ్య: 235,642
సగటు పయినీర్ ప్రచారకులు: 7,961
సగటు బైబిలు పఠనాలు: 79,131
బాప్తిస్మము తీసుకున్నవారి సంఖ్య: 8,164
సంఘాల సంఖ్య: 1,397
బ్రాంచి కార్యాలయం: నాడార్జిన్
[9వ పేజీలోని చిత్రం]
లూజ్ నందలి 1948 నాటి పోలండ్ బ్రాంచి కార్యాలయము
[9వ పేజీలోని చిత్రం]
జూన్ 1948 మునుపటి తూర్పు ప్రష్యానందలి ప్లాకార్డ్ పని
[9వ పేజీలోని చిత్రం]
జనవరి 1993లో డెభ్బైరెండు మంది పోలండ్ బేతేలు సిబ్బందిలోని సభ్యులు
[9వ పేజీలోని చిత్రం]
నాడాజిన్ నందలి కొత్త బ్రాంచి