యోబు సహించాడు—మనము కూడా సహించగలము!
“సహించినవారిని ధన్యులనుకొనుచున్నాము గదా?“—యాకోబు 5:11.
1. తన శ్రమలను గూర్చి ఒక పెద్ద వయస్సుగల క్రైస్తవుడు ఏమి చెప్పాడు?
‘అపవాది నన్ను వెంబడిస్తున్నాడు! యోబు భావించినట్లు నేను భావిస్తున్నాను!’ అలాంటి మాటలతో ఎ. హెచ్. మాక్‌మిలన్ యెహోవా సాక్షుల ప్రధాన కార్యాలయం వద్ద ఒక సన్నిహిత స్నేహితునితో తన భావాలను వ్యక్తపర్చాడు. సహోదరుడు మాక్‌మిలన్ 89 సంవత్సరాల వయస్సులో 1966 ఆగస్టు 26న తన భూజీవితాన్ని ముగించాడు. ఆయన వంటి అభిషక్త క్రైస్తవుల యథార్థమైన సేవా ప్రతిఫలం “వారి వెంట పోవునని” ఆయనకు తెలుసు. (ప్రకటన 14:13) వాస్తవానికి, వారు పరలోకంలో అమర్త్యమైన జీవమునకు పునరుత్థానం చేయబడడం ద్వారా యెహోవా సేవలో వెంటనే కొనసాగగలరు. సహోదరుడు మాక్‌మిలన్ ఆ బహుమానాన్ని పొందాడని ఆయన స్నేహితులు ఆనందించారు. అయితే ఆయన భూమిపై తన చివరి సంవత్సరాల్లోవుండగా, దేవుని యెడల తనకుగల యథార్థతను పాడుచేయడానికి సాతాను చేస్తున్న ప్రయత్నాలను ఆయన బాగా తెలుసుకొనగలిగేలా చేసిన ఆరోగ్య సమస్యలతో సహా అనేక శ్రమలు ఆయనను చుట్టుముట్టాయి.
2, 3. యోబు ఎవరు?
2 యోబు భావించినట్లు నేను భావించానని సహోదరుడు మాక్‌మిలన్ చెప్పినప్పుడు, ఆయన ఎన్నో గొప్ప విశ్వాస పరీక్షలను సహించిన ఒక వ్యక్తిని గురించి చెబుతున్నాడు. యోబు బహుశా ఉత్తర అరేబియాలోని “ఊజు దేశమునందు” నివసించివుంటాడు. ఆయన నోవహు కుమారుడైన షేము వంశపువాడు, ఆయన యెహోవా ఆరాధికుడు. యోసేపు మరణం మరియు మోషే తనను తాను నీతిమంతునిగా నిరూపించుకొనిన మధ్యకాలంలో బహుశా యోబు యొక్క పరీక్షలు సంభవించి యుండవచ్చు. ఆ సమయంలో దైవభక్తి విషయంలో భూమి మీద యోబుకు సమానులు ఎవరూ లేరు. యెహోవా యోబును యథార్థవర్తనునిగా, న్యాయవంతునిగా, దైవభయము గలవానిగా దృష్టించాడు.—యోబు 1:1, 8.
3 “తూర్పుదిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా” ఉండినందున యోబుకు అనేకమంది సేవకులు ఉండేవారు, ఆయనకు 11,500 పశువులు ఉండేవి. కాని ఆయనకు ఆత్మీయ సంపదలే అత్యంత ప్రాముఖ్యమైనవి. నేటి దైవభక్తిగల తండ్రులవలె, యోబు కూడా తన ఏడుగురు కుమారులకు, ముగ్గురు కుమార్తెలకు యెహోవా గురించి బోధించి వుంటాడు. వారు యిక తన యింటిలో నివసించనప్పటికీ, కేవలం వారు పాపం చేసివుంటారేమోనని వారి కొరకు బలులు అర్పించడం ద్వారా ఆయన వారికి కుటుంబ యాజకునిగా పనిచేశాడు.—యోబు 1:2-5.
4. (ఎ) హింసింపబడుతున్న క్రైస్తవులు యోబును ఎందుకు పరిశీలించాలి? (బి) యోబు గురించి మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాము?
4 హింసింపబడిన క్రైస్తవులు సహనంతో కూడిన ఓర్పును కలిగివుండేలా బలపర్చబడడానికి వారు పరిశీలించ వలసినవాడు యోబు. శిష్యుడైన యాకోబు యిలా వ్రాశాడు: “ఇదిగో! సహించిన వారు ధన్యులని మనము అనుకొనుచున్నాము! యోబు సహనాన్ని గూర్చి మీరు విన్నారు మరియు యెహోవా ఎంతో అనురాగంతో నిండిన జాలి, కనికరము గలవాడని యెహోవా యిచ్చిన ప్రతిఫలాన్నిబట్టి చూశాము.” (యాకోబు 5:11 NW) యోబు వలెనే, యేసు అభిషక్త అనుచరులకు, ప్రస్తుత దిన “గొప్ప సమూహము” వారికి విశ్వాస పరీక్షలను ఎదుర్కోడానికి సహనం అవసరం. (ప్రకటన 7:1-9) అయితే, యోబు ఏ శ్రమలను సహించాడు? అవి ఎందుకు సంభవించాయి? ఆయన అనుభవాల నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?
ఒక ప్రాముఖ్యమైన వివాదాంశము
5. యోబుకు తెలియకుండా, పరలోకంలో ఏమి జరుగుతుండినది?
5 యోబుకు తెలియకుండా, పరలోకంలో ఒక గొప్ప అంశము లేవనెత్తబడనై యుండెను. ఒకరోజు “దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిరి.” (యోబు 1:6) దేవుని అద్వితీయ కుమారుడైన వాక్యము అక్కడ ఉండెను. (యోహాను 1:1-3) నీతిమంతులైన దూతలు, అవిధేయులైన ‘దేవుని కుమారులగు’ దేవదూతలు కూడా హాజరైయుండిరి. (ఆదికాండము 6:1-3) రాజ్యం 1914లో స్థాపించబడేంత వరకు సాతాను పరలోకం నుండి పడద్రోయబడలేదు గనుక సాతాను కూడా అక్కడ ఉన్నాడు. (ప్రకటన 12:1-12) యోబు దినాల్లో, సాతాను ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని లేవదీస్తాడు. తన సృష్టి ప్రాణులందరిపై యెహోవా యొక్క నీతియుక్తమైన సర్వాధిపత్యాన్ని అతడు ప్రశ్నించనై యున్నాడు.
6. సాతాను ఏమి చేయడానికి ప్రయత్నిస్తుండెను, అతడు యెహోవాపై ఎలా కొండెములు చెప్పాడు?
6 యెహోవా యిలా అడిగాడు: ‘నీవు ఎక్కడ నుండి వచ్చితివి?’ “భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని” సాతాను జవాబిచ్చాడు. (యోబు 1:7) ఎవరిని మ్రింగుదునా అని అతడు వెదుకుతున్నాడు. (1 పేతురు 5:8, 9) యెహోవాను సేవించే వ్యక్తుల యథార్థతను పాడుచేయడం ద్వారా, ప్రేమను బట్టి దేవునికి విధేయత ఎవరూ చూపించరని నిరూపించడానికి సాతాను ప్రయత్నిస్తాడు. ఈ అంశాన్నే లేవదీస్తూ యెహోవా సాతానును యిలా అడిగాడు: “నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు.” (యోబు 1:8) తన అపరిపూర్ణతలను అనుమతించిన దైవిక కట్టడలను యోబు చేరుకున్నాడు. (కీర్తన 103:10-14) కాని సాతాను యిలా ఆరోపించాడు: “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.” (యోబు 1:9, 10) ఆయన ఏమైయున్నాడనే దాన్ని బట్టి ఆయనను ఎవరూ ప్రేమించి ఆరాధించరు, కాని తనను సేవించడానికి ప్రాణులకు ఆయన లంచమిస్తాడని సూచిస్తూ సాతాను యెహోవాపై కొండెములు చెప్పాడు. యోబు ప్రేమతో కాదుగాని స్వార్థపూరిత ప్రయోజనం కొరకు దేవున్ని సేవించాడని సాతాను ఆరోపించాడు.
సాతాను దాడి చేస్తున్నాడు!
7. అపవాది దేవున్ని ఎలా సవాలు చేశాడు, యెహోవా ఎలా ప్రతిస్పందించాడు?
7 సాతాను యిలా అన్నాడు: “అయినను, నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును.” అలాంటి అవమానకరమైన సవాలుకు దేవుడు ఎలా ప్రతిస్పందిస్తాడు? యెహోవా యిలా అన్నాడు: “ఇదిగో, అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికిమాత్రము ఏ హానియు చేయకూడదు.” యోబుకున్నదంతా ఆశీర్వదించబడిందని, హెచ్చించబడిందని, కంచె వేయబడిందని అపవాది అన్నాడు. యోబు శరీరాన్ని ముట్టడానికి అనుమతించనప్పటికీ ఆయన శ్రమపడుటకు దేవుడు అనుమతించాడు. చెడు చేయడానికి నిశ్చయించుకుని, సాతాను సమావేశం నుండి వెళ్లిపోయాడు.—యోబు 1:11, 12.
8. (ఎ) యోబు వస్తుసంబంధమైన ఏ నష్టాలను అనుభవించాడు? (బి) “దేవుని అగ్ని” గురించిన వాస్తవమేమై యుండెను?
8 త్వరలోనే సాతాను దాడి ప్రారంభమైంది. యోబు సేవకుల్లో ఒకరు ఆయనకు యీ చెడు సమాచారం చెప్పారు: “ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి.” (యోబు 1:13-15) యోబు సంపద చుట్టు కంచె తీసివేయబడింది. దాదాపు వెంటనే, దయ్యపు శక్తి సూటిగా పనిచేసింది, ఎందుకంటే మరో సేవకుడు వచ్చి యిలా చెప్పాడు: “దేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను.” (యోబు 1:16) తన స్వంత సేవకునికి అలాంటి విపత్తు కలుగడానికి దేవుడే కారణమని కనిపించేలా చేయడం ఎంత భయంకరం! అగ్ని పరలోకం నుండి వచ్చింది గనుక, యెహోవా సులభంగా నిందించబడి ఉండేవాడే కాని నిజానికి అగ్ని దయ్యాల మూలం నుండి వచ్చింది.
9. ఆర్థికపరమైన నష్టం దేవునితో యోబుకు గల సంబంధాన్ని ఎలా ప్రభావితం చేసింది?
9 సాతాను దాడిని కొనసాగిస్తుండగా, కల్దీయులు వచ్చి యోబు ఒంటెలను తీసుకుని యితర సేవకులను చంపేసారని మరో సేవకుడు తెలియజేశాడు. (యోబు 1:17) అలా యోబు ఆర్థిక నష్టాన్ని అనుభవించినప్పటికీ, దేవునితో ఆయనకున్న సంబంధాన్ని యిది పాడుచేయలేదు. మీరు యెహోవాతో మీకున్న యథార్థతను పాడు చేసుకోకుండా గొప్ప వస్తుదాయక నష్టాన్ని సహించగలరా?
మరింత గొప్ప వేదన కలుగుట
10, 11. (ఎ) యోబు పదిమంది పిల్లలకు ఏమి సంభవించింది? (బి) యోబు పిల్లల దుఃఖకరమైన మరణం తర్వాత, ఆయన యెహోవాను ఎలా దృష్టించాడు?
10 సాతాను యోబుపై దాడి చేయడం యింకా ముగియలేదు. మరో సేవకుడు కూడా యిలా తెలియజేశాడు: “నీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది యౌవనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాను.” (యోబు 1:18, 19) సరైన సమాచారం తెలియనివారు ఆ సుడిగాలి వలన కలిగిన విపత్తు ‘దేవుని చర్య’ అని చెప్పవచ్చు. అయితే, దుష్ట శక్తి యోబును చాలా సున్నితమైన చోట కొట్టింది.
11 వ్యధ చెందిన యోబు, ‘తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారము చేశాడు.’ అయినా, ఆయన మాటలు వినండి: “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.” వృత్తాంతం యిలా కొనసాగింది: “ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.” (యోబు 1:20-22) సాతాను మరియొకసారి ఓడించబడ్డాడు. దేవుని సేవకులుగా మనం దుఃఖాన్ని, వేదనను ఎదుర్కొనవలసి వస్తే, అప్పుడేమిటి? యెహోవాకు నిస్వార్థమైన భక్తి, ఆయన యందు విశ్వాసం, యోబు వలె యథార్థతను కాపాడుకొనేవారిగా కొనసాగడానికి మనకు సహాయం చేస్తాయి. అభిషక్తులు, భూనిరీక్షణగల వారి సహవాసులు యోబు యొక్క సహనాన్ని గూర్చిన యీ వృత్తాంతం నుండి తప్పకుండా ఓదార్పును, శక్తిని పొందగలరు.
వివాదాంశం మరింత తీవ్రతరమగుట
12, 13. పరలోకమందు మరో సమావేశంలో, సాతాను ఏమి అభ్యర్థించాడు, దేవుడెలా ప్రతిస్పందించాడు?
12 త్వరలోనే యెహోవా పరలోక ఆవరణలో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. యోబు యెహోవాచే మొత్తబడినవానివలె పిల్లలను పోగొట్టుకుని, దరిద్రునివలె అయ్యాడు, కాని ఆయన యథార్థత మాత్రం చెక్కు చెదరలేదు. దేవునికి, యోబుకు వ్యతిరేకంగా తాను చేసిన ఆరోపణలు నిజమైనవి కావని సాతాను అంగీకరించడు. ఆ వివాదాంశాన్ని ముగింపుకు తేవాలనే ఉద్దేశంతో యెహోవా అపవాదిని సమావేశపరచి నందున ఇప్పుడు ‘దేవుని కుమారులు’ వాద ప్రతివాదనలను వినబోతున్నారు.
13 విచారణ కొరకు సాతానును పిలిచి యెహోవా యిలా అడిగాడు: “నీవు ఎక్కడనుండి వచ్చితివి?” దానికి జవాబు ఏమైయుండెను? “భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితిని.” ఇంకా తన యథార్థతను దృఢంగా కాపాడుకుంటున్న యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు గలవాడు అయిన తన సేవకుడైన యోబువైపు యెహోవా దృష్టి మళ్లించాడు. అపవాది యిలా జవాబిచ్చాడు: “చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును.” కాబట్టి దేవుడిలా చెప్పాడు: “అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దు.” (యోబు 2:2-6) యెహోవా యింకా అన్ని రక్షణ కంచెలను తీసివేయలేదని సూచిస్తూ, సాతాను యోబు యెముకలను, శరీరమును ముట్టడాన్ని కోరాడు. యోబును చంపడానికి అపవాదికి అనుమతివ్వబడదు; కాని శారీరక అనారోగ్యం అతడు బాధపడేలా చేస్తుందని, అతడు చేసిన రహస్య పాపాల కొరకు అతడు శిక్ష అనుభవిస్తున్నాడని అనిపించేలా చేస్తుందని సాతానుకు తెలుసు.
14. సాతాను యోబుపై దేనితో దాడిచేశాడు, బాధపడే వానికి ఏ మానవుడు ఎందుకు ఉపశమనాన్ని యివ్వలేడు?
14 ఆ సమావేశం నుండి బయలుదేరి, సాతాను తన పైశాచిక కోరికతో కొనసాగాడు. అతడు యోబుకు “అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులు” కలిగేలా చేశాడు. కుండ పెంకుతో గోక్కోడానికి ఆయన బూడిదలో కూర్చున్నప్పుడు యోబు ఎంతటి వేదనను సహించాడు! (యోబు 2:7, 8) అత్యంత బాధాకరమైన, అసహ్యకరమైన, వేదనభరితమైన ఈ బాధ నుండి ఏ మానవ వైద్యుడు అతనికి ఉపశమనం కలిగించలేడు ఎందుకంటే, అది సాతాను శక్తి వల్ల కలిగింది. యెహోవా మాత్రమే యోబును స్వస్థపర్చగలడు. మీరు వేదన ననుభవిస్తున్న దేవుని సేవకులైతే, సహించడానికి దేవుడు సహాయం చేయగలడని, రోగం లేని నూతన లోకంలో మీకు జీవాన్ని యివ్వగలడని ఎన్నడూ మరచిపోకండి.—కీర్తన 41:1-3; యెషయా 33:24.
15. యోబు భార్య అతన్ని ఏమి చేయమని కోరింది, అతని ప్రతిస్పందన ఏమిటి?
15 చివరికి, యోబు భార్య యిలా అన్నది: “నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము.” “యథార్థత” నిష్కళంకమైన భక్తిని సూచిస్తుంది, యోబు దేవున్ని దూషించేలా చేయడానికి ఆమె వ్యంగ్యంగా మాట్లాడివుండవచ్చు. కాని ఆయనిలా సమాధానమిచ్చాడు: “మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?” సాతాను యొక్క ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు, ఎందుకంటే మనకిలా చెప్పబడింది: “ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటిమాటతోనైనను పాపము చేయలేదు.” (యోబు 2:9, 10) ఒకవేళ వ్యతిరేకించే కుటుంబ సభ్యులు మనం క్రైస్తవ గురుల కొరకు మూర్ఖంగా ప్రయాసపడుతున్నామని చెప్పి, యెహోవా దేవున్ని దూషించమని కోరితే. మనం యెహోవాను ప్రేమిస్తాము, ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి యిష్టపడతాము గనుక, యోబు వలె అలాంటి పరీక్షను మనం సహించవచ్చు.—కీర్తన 145:1, 2; హెబ్రీయులు 13:15.
ముగ్గురు అహంకారులైన వంచకులు
16. యోబును ఓదార్చటానికని చెప్పి ఎవరు వచ్చారు, కాని సాతాను వారిని ఎలా మోసపర్చాడు?
16 సాతాను యొక్క మరో పథకంగా మారినదానిలో, యోబును ఓదార్చటానికి వచ్చామని చెప్పుకుంటున్న ముగ్గురు “స్నేహితులు” వచ్చారు. ఒకరు ఏశావు ద్వారా కలిగిన అబ్రాహాము వంశపువాడైన ఎలీఫజు. మాట్లాడడంలో ఎలీఫజుకు ప్రాధాన్యత యివ్వబడింది గనుక బహుశా అతడు పెద్దవాడై యుండవచ్చు. అబ్రాహాముకు కెతురా వలన కలిగిన కుమారులలో ఒకడైన షూవహు వంశపువాడైన బిల్దదు కూడా అక్కడ ఉన్నాడు. మూడవ వ్యక్తి, బహుశా వాయవ్య అరేబియా, అంటే అతని కుటుంబాన్ని లేక నివసించే స్థలాన్ని సూచిస్తూ నయమాతీయుడని పిలువబడే జోఫరు. (యోబు 2:11; ఆదికాండము 25:1, 2; 36:4, 11) నేడు యెహోవా సాక్షులు దేవున్ని దూషించేలా చేయడానికి ప్రయత్నించే వారివలె, యోబు అబద్ధ ఆరోపణలను అంగీకరించి తన యథార్థతను కోల్పోయేలా చేయడానికి ఈ ముగ్గురు సాతానుచే మోసగించబడ్డారు.
17. దర్శించడానికి వచ్చిన ముగ్గురు ఏమి చేశారు, వారు ఏడు దినాలు, ఏడు రాత్రుల వరకు ఏమి చేయలేదు?
17 ఏడ్వడం, వస్త్రాలను చింపుకోవడం, తలలమీద ధూళి చల్లుకోవడం ద్వారా ఈ ముగ్గురు ఓదార్పును గూర్చిన గొప్ప ప్రదర్శననిచ్చారు. కాని తర్వాత వారు ఓదార్పును గూర్చిన ఒక్కమాట కూడా మాట్లాడకుండా యోబుతోపాటు ఏడు దినములు, ఏడు రాత్రులు కూర్చున్నారు! (యోబు 2:12, 13; లూకా 18:10-14) ఈ ముగ్గురు అహంకారులైన వంచకులు ఆత్మీయత ఎంతగా కొరవడి ఉండిరంటే, వీరు యెహోవా గురించి, ఆయన వాగ్దానాల గురించి ఓదార్పుకరంగా చెప్పడానికి ఏమి కలిగిలేరు. అయినప్పటికీ, వారు దుఃఖానికి సంబంధించిన తమ ఆచారాన్ని నిర్వర్తించిన తర్వాత తప్పుడు ముగింపులకు వస్తూ, వాటిని యోబుపై ఉపయోగించడానికి సిద్ధమౌతున్నారు. ఆసక్తిదాయకంగా, ఏడురోజుల మౌనం ముగియకముందే, యౌవనుడైన ఎలీహు వచ్చి మాటలు వినపడేంత దూరంలో కూర్చున్నాడు.
18. యోబు ఎందుకు మరణమందు సమాధానాన్ని వెదికాడు?
18 చివరికి యోబు నిశ్శబ్దాన్ని భంగపర్చాడు. సందర్శించడానికి వచ్చిన ముగ్గురి నుండి ఏ ఓదార్పు పొందలేక అతడు, తాను జన్మించిన దినాన్ని శపించి, తన దుఃఖభరితమైన జీవితం యింకా ఎందుకు కొనసాగింప బడుతుందోనని చకితుడయ్యాడు. ఇప్పుడాయన దిక్కులేని, దుఃఖముతో కూడిన, చాలా అనారోగ్యముగానున్న స్థితిలో ఉన్నందున, మరణించక ముందే తాను నిజమైన ఆనందం మళ్లీ పొందగలనని ఎంతమాత్రం తలంచక, మరణమందు సమాధానాన్ని పొందాలని వెదికాడు. కాని యోబు మరణించేంతగా ముట్టడానికి దేవుడు అనుమతించడు.—యోబు 3:1-26.
యోబును నిందించినవారి దాడి
19. ఏ యే విధాలుగా ఎలీఫజు యోబును అన్యాయంగా నిందించాడు?
19 యోబు యొక్క యథార్థతను యింకా పరీక్షించిన చర్చ యొక్క మూడు అంకాలలో ఎలీఫజు మొదట మాట్లాడాడు. తన మొదటి ప్రసంగంలో, ఎలీఫజు యిలా అడిగాడు: “యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా?” దేవుని శిక్ష పొందడానికి యోబు ఏదో తప్పు చేసివుండ వచ్చునని అతడు ముగించాడు. (యోబు 4, 5 అధ్యాయాలు) ఎలీఫజు తన రెండవ ప్రసంగంలో, యోబు జ్ఞానాన్ని ఎగతాళి చేసి యిలా అడిగాడు: “మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు?” యోబు సర్వోన్నతునికి తనను తాను ఉన్నతునిగా చూపించు కోవాలను కుంటున్నాడని ఎలీఫజు సూచించాడు. తన రెండవ ప్రసంగాన్ని ముగిస్తూ, అతడు యోబు మత భ్రష్టుడని, లంచగొండి మరియు మోసగాడని వర్ణించాడు. (యోబు 15వ అధ్యాయం) తన చివరి ప్రసంగంలో, బలాత్కారంగా తీసుకొనేవాడని, అవసరమైన వారికి ఆహారం, నీరు యివ్వని వాడని, విధవరాండ్రను, అనాథలను బాధించువాడని—అనేక నేరాలు చేసినట్లుగా యోబును అన్యాయంగా నిందించాడు.—యోబు 22వ అధ్యాయము.
20. యోబుపై బిల్దదు చేసిన దాడి ఎటువంటిది?
20 చర్చ యొక్క మూడు అంకాలలో రెండవవానిగా మాట్లాడుతూ, బిల్దదు ఎలీఫజు అవలంభించిన విధానాన్నే అనుసరించాడు. బిల్దదు ప్రసంగాలు చిన్నవే అయినా, ఎక్కువ గాయపర్చేవి. అతడు చివరికి యోబు పిల్లలు కూడా తప్పు చేశారని, వారు కూడా మరణానికి అర్హులని నిందించాడు. తప్పుడు తర్కాలతో, అతడు యీ ఉపమానాన్ని వాడాడు: నీరు లేకపోతే జమ్ము, రెల్లు ఎలా వాడిపోతాయో అలాగే, “దేవుని మరచువారందరి గతి” వుంటుంది. ఆ వ్యాఖ్యానం నిజమైనదే, కాని అది యోబుకు వర్తించదు. (యోబు 8వ అధ్యాయం) యోబు బాధలు దుష్టులపైకి వచ్చేలాంటివని బిల్దదు నిర్దారించాడు. (యోబు 18వ అధ్యాయం) తన క్లుప్త మూడవ ప్రసంగంలో, మనిషి “క్రిమి” వంటివాడని, “పురుగు” వంటివాడని, గనుక దేవుని యెదుట అపరిశుద్ధుడని బిల్దదు వాదించాడు.—యోబు 25వ అధ్యాయము.
21. దేని గురించి జోఫరు యోబును నిందించాడు?
21 చర్చలో జోఫరు మూడవవానిగా మాట్లాడాడు. సాధారణంగా అతని చర్చా విధానం ఎలీఫజు, బిల్దదు వలెనే కొనసాగింది. జోఫరు, యోబు దుష్టత్వాన్ని గురించి నిందించి, పాపయుక్తమైన విధానాలను విసర్జించమని అతన్ని కోరాడు. (యోబు 11, 20 అధ్యాయాలు) రెండు అంకాల తర్వాత జోఫరు మాట్లాడడం మానేసాడు. మూడవ అంకంలో మాట్లాడడానికి అతనికి ఏమి లేదు. అయితే, యోబు చర్చ అంతటిలో తనను నిందించేవారికి ధైర్యంగా సమాధానమిచ్చాడు. ఉదాహరణకు, ఒకసారి ఆయనిలా అన్నాడు: “మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు. ఈ గాలిమాటలు ముగిసిపోయెనా?”—యోబు 16:2, 3.
మనము సహించగలము
22, 23. (ఎ) యోబు విషయంలో వలెనే, యెహోవా దేవుని యెడల మన యథార్థతను పాడుచేయడానికి అపవాది ఎలా ప్రయత్నించవచ్చు? (బి) యోబు విభిన్న పరీక్షలను సహిస్తున్నప్పటికీ, ఆయన దృక్పథాన్ని గూర్చి మనం ఏమి అడుగవచ్చు?
22 యోబువలె మనం ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ శ్రమలను ఎదుర్కొనవలసి రావచ్చు, మన యథార్థతను పాడుచేయాలనే తన ప్రయత్నాలలో సాతాను నిరుత్సాహాన్ని లేక ఇతర కారణాలను ఉపయోగించవచ్చు. మనకు ఆర్థిక యిబ్బందులున్నట్లయితే అతడు మనల్ని యెహోవాకు వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నించవచ్చు. మన ప్రియమైనవారు మరణిస్తే లేక మనకు అనారోగ్యం ఉన్నట్లయితే మనము దేవున్ని నిందించేలా ప్రోత్సహించడానికి సాతాను ప్రయత్నించవచ్చు. యోబు సహచరులవలె ఎవరైనా మనల్ని అబద్ధంగా నిందించవచ్చు. సహోదరుడు మాక్‌మిలన్ సూచించినట్లుగా, సాతాను ‘మనల్ని వెంబడించవచ్చు’ కాని మనం సహించగలము.
23 మనమింతవరకు గమనించినట్లుగా, యోబు తన అనేక శ్రమలను సహించాడు. అయితే, ఆయన కేవలం సహించాడా? నిజంగా ఆయనకు కృంగిన మనస్సు ఉందా? యోబు నిజంగా నిరీక్షణనంతా కోల్పోయాడేమో మనం చూద్దాము.
మీరెలా ప్రత్యుత్తరమిస్తారు?
◻ యోబు దినాల్లో సాతాను ఏ గొప్ప అంశాన్ని లేవదీశాడు?
◻ యోబు దేని ద్వారా పూర్తిగా పరీక్షించబడ్డాడు?
◻ యోబు ముగ్గురు “సహచరులు” దేని గురించి అతన్ని నిందించారు?
◻ యోబు విషయంలో వలెనే, యెహోవా యందలి మన యథార్థతను పాడుచేయడానికి సాతాను ఎలా ప్రయత్నించవచ్చు?
[10వ పేజీలోని చిత్రం]
ఎ. హెచ్. మాక్‌మిలన్