సువార్త నిమిత్తం కళ్లు తెరిపించడం
“గ్రుడ్డివాడు చూడలేడని నింగి నీలంగా ఉండక మానదు” అంటోందో డానిష్ సామెత. అయితే పనిరద్దీగల మన అనుదిన జీవితాల్లో నింగి నీలంగా ఉన్నది ఉన్నట్లు మనం చూస్తున్నామా? భవిష్యత్తును మనం నమ్మకంతో చూస్తున్నామా? దేవుని వాక్యమైన బైబిలు అందించే సువార్తను మనం నిజంగా నమ్ముతున్నామా?
ముందు శీర్షికలో, అక్షరార్థమైన గ్రుడ్డితనాన్ని గూర్చిన విషయాలను మనం పరిశీలించాం. అయితే, అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైన దృష్టిని గూర్చి మనం యిప్పుడు పరిశీలిద్దాము. దానిలో, మన చిరకాల సంతోషము అలాగే మన ప్రియమైన వారి భవిష్యత్తు కూడా యిమిడివుంది.
నిస్సందేహంగా, మనం “అపాయకరమైన కాలములను” ఎదుర్కొంటున్నాం. (2 తిమోతి 3:1) ఆరోగ్య సమస్యలనూ కుటుంబ సమస్యలను తాళుకుంటు, సామాజిక అన్యాయాన్ని, ప్రేమలేనితనాన్ని ఎదుర్కొంటూ ప్రజలు తమ జీవనాదాయాన్ని సంపాదించుకోవడానికి కష్టపడుతుండగా ఏం జరుగుతుంది? విషాదకరంగా, తమ తోటి మనుష్యుల యెడల, మతం యెడల, ప్రభుత్వం యెడల వారి నమ్మకం తగ్గుముఖం పడుతున్నట్లు అనేకులు కనుగొంటున్నారు. ఏ పరిష్కారం లేదని గ్రహించిన కొందరు, తమ సమస్యలు ఎన్నటికీ సాధారణ రీతిలో పరిష్కరించబడవనే నిర్ణయానికొచ్చారు. బ్రెజిలియన్ వార్తా పత్రికైన జర్నల్ డ టర్‌దె నందు జేకబ్ పిన్యారు గోల్డ్‌బెర్గ్ యిలా గమనించారు: “ఘోరమైన వాస్తవాలను ఎదుర్కొన్నప్పుడు, లోపం ఎక్కడుందో సరిగ్గా గ్రహించలేక ప్రజలు దిగ్భ్రాంతితో కలతను కలిగించే మర్మమైన మతంపై ఆధారపడతారు.” అయినప్పటికీ, పరిస్థితులు విషమించినప్పుడు, మనం మంచి వివేకాన్ని ఉపయోగించాలని కోరుకుంటాము, కాదంటారా?
ఒక్క క్షణం యిలా ఊహించుకోండి, మీ కుటుంబానికి ఓ మంచి యిల్లు కావాలి, డబ్బెంతైనా ఫర్వాలేదు. బహుశా మీరు చుట్టుప్రక్కలంతా తిరిగి, వివిధ ప్రాంతాల్లో ఎన్నో యిళ్లను చూస్తారు. రియల్ ఎస్టేట్ అమ్మకందారుడు మీ కోరికలకు అనుగుణంగా చూపుతున్నప్పటికీ, మీ మనస్సులో ఉన్న యిల్లు మాత్రం కనిపించలేదు. అయినా, మీ కుటుంబం యొక్క సంతృప్తి, వారి శ్రేయస్సు యిమిడి ఉన్నాయి గనుక, మీరు మీ అన్వేషణను కొనసాగిస్తారు, కాదా? మీ స్వప్న సౌధం మీకు లభించినప్పుడు మీరు పొందే సంతోషాన్ని ఊహించండి.
ఓ కొత్త యింటిని వెదకడానికి మీరు సమయాన్ని వెచ్చించినట్లే, మీ సమస్యల పరిష్కారాన్ని కనుగొనేందుకు బైబిలును ఎందుకు పరిశీలించకూడదు? ఓ యింటిని కొనాలా వద్దా అనే నిర్ణయాలు తీసుకునే ముందు వాస్తవాలను మనం ఎలా ఆచితూచి చూస్తామో అదే విధంగా, దేవుని వాక్యంలో నుండి మనం చదివేవాటిపై సరైన విధంగా తర్కించి చూడాల్సిన అవసరం ఉంది. యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తును గూర్చిన సత్యాన్ని గ్రహించి దాన్ని అంగీకరించడం ఒక యింటిని కనుగొనడం కంటే కూడా ఎంతో ప్రయోజనకరమైంది. యేసు యిలా అన్నాడు: “అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.”—యోహాను 17:3.
అయితే మరి బైబిలు సమాచారం అంత విలువైనదైతే, అనేకులు దాని సువార్త విషయంలో ఎందుకు గ్రుడ్డివాళ్లై ఉన్నారు? ఒక కారణమేంటంటే, “లోకమంతయు దుష్టునియందున్నది.” ఇది అనేకమందికి ఆశ్చర్యం కల్గించవచ్చు కూడా. (1 యోహాను 5:19) తత్ఫలితంగా, అపవాదియైన సాతాను, “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” (2 కొరింథీయులు 4:4) మనం మన కళ్లతో చూస్తున్నప్పటికీ, కంటిని చేరిన కాంతిని పసిగట్టేది మన మెదడే. కనుక, గ్రుడ్డితనం అంటే “వివేచించలేకపోవడం లేక మదింపు చేయలేకపోవడం లేక చేయడానికి యిష్టపడక పోవడం” అని కూడా నిర్వచించబడింది. ఇది ఓ ప్రఖ్యాత సామెతను గుర్తుచేస్తుంది: “చూడడానికి యిష్టపడనివానికంటే గ్రుడ్డివాడు మరొకడు లేడు.”
గ్రుడ్డి వ్యక్తి, తన ముందున్న దాన్ని చూడలేడు గనుక అతనికి దెబ్బతగిలే అపాయం ఉండవచ్చు. అనేకుల శారీరక గ్రుడ్డితనాన్ని యిప్పుడు తీసివేయలేకపోవచ్చు, అయితే ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉండవలసిన విధి ఎవ్వరి మీదా లేదు.
ఆత్మీయ అంధకారాన్ని అధిగమించడం
పరిశుభ్రతలేని పరిస్థితులు కంటిచూపును ఎలా బలహీనపరుస్తాయో అలాగే నైతికంగా చెడిపోయిన వాతావరణం నైతిక గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా, మానవ నిర్మిత సిద్ధాంతాలు, ఆచారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు హెచ్చరించాడు. నాటి మత నాయకులు, తమను అనుసరించేవారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన స్పష్టపర్చాడు: “వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు.”—మత్తయి 15:14.
ఆత్మీయంగానూ నైతికంగానూ అంధులైన నాయకుల చేతిలో మోసపోకుండా, దేవుని రాజ్య సువార్తకు తమ కన్నులను తెరచిన వారు ఎంత ధన్యులు! యేసు యిలా ప్రకటించాడు: “చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితిని.” (యోహాను 9:39) అయితే, ఆత్మీయంగా గ్రుడ్డివారైన వారు ఎలా చూడగలరు? దానికొరకు, శారీరక గ్రుడ్డితనాన్ని గూర్చిన పరిశీలనను మనం కొనసాగిద్దాము.
చూపు మందగించిన వారికి నేడు వివిధ ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎప్పుడూ అలా జరగలేదు. వాలెన్‌టైన్ అవువే 1784లో గ్రుడ్డివారికి ఓ ప్రత్యేక పాఠశాలను స్థాపించేంతవరకు గ్రుడ్డివారి సహాయార్థమై ఏ తీవ్రమైన ప్రయత్నాలు చేయడం జరగలేదు. తర్వాత, లూయి బ్రెయిలీ, తన పేరుగల ఓ పద్ధతిని కనుగొన్నాడు; గ్రుడ్డితనంగలవారు చదివేందుకు సహాయపడడానికి దాన్ని తయారుచేశాడు.
ఆత్మీయంగా గ్రుడ్డివారైన వారి విషయమేమిటి? ఇటీవలి సంవత్సరాల్లో భూమిలోని అతి సుదూర ప్రాంతాలకు కూడా సువార్తను ప్రకటించే తీవ్రమైన ప్రయత్నం జరిగింది. (మత్తయి 24:14) అటు ఆత్మీయంగా గ్రుడ్డివారైనవారికి యిటు శారీరకంగా గ్రుడ్డివారైన వారికీ నిరీక్షణను అందించడంలో యెహోవాసాక్షులు ఎంతో సంతోషిస్తారు.
ఒక బ్రెజిల్ దేశస్థురాలు యిలా రాసింది: “నాకు శారీరక లోపం ఉన్నప్పటికీ, నేను ఆత్మీయంగా చూడగల్గుతున్నాను. ఎంత అద్భుతమైన దేవుడు! ‘యెహోవా తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పర్చును’ అని తెలుసుకోవడంలో మేమెంతో సంతోషిస్తున్నాము.” (కీర్తన 145:16) శారీరకంగా గ్రుడ్డివాడైన జోర్జె యిలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నా జీవితం సరిగ్గా రెండుగా విభాగించవచ్చు: సాక్షులు కలవకముందు, కలిసిన తర్వాత . . . సాక్షుల సహాయంతో, లోకాన్ని సుస్పష్టంగా, సరైన కాంతిలో నేను నా మనో నేత్రాలతో చూడగల్గుతున్నాను. సంఘంలో ఉన్న వారందరితోనూ నేను మంచి సంబంధాన్ని కల్గివున్నాను.” అది ఎంత ఆనందదాయకమో, భూమిపై శారీరకంగా లేక ఆత్మీయంగా గ్రుడ్డివారెవ్వరూ గ్రుడ్డివాళ్లుగా ఉండరనే అభయాన్ని బైబిలు యివ్వడం కూడా అంతే ఆనందదాయకం. అదెలా జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా “యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయు”చున్నాడని అది ఎలా నిరూపిస్తుంది?—కీర్తన 146:8.
ఏకైక శాశ్వత చికిత్స—దేవుని రాజ్యము
అధిక వైద్య పనితనం ఉన్నప్పటికీ, అనేకానేక వ్యాధులు గ్రుడ్డితనాన్నీ, వేదనను మరణాన్ని కలుగజేస్తూనే ఉన్నాయి. అయితే పోషకాహారలోపాన్ని, సరైన పారిశుభ్ర పరిస్థితులు లేకపోవడాన్ని, కంటిచూపునూ జీవిత ఆనందాన్నీ తీసివేసే కృంగుదలనూ సమూలంగా తీసివేయడానికి ఏమి అవసరం? యేసు గ్రుడ్డివారికి యితరులకూ చికిత్స చేయడం భవిష్యత్తు కొరకు ఒక చిన్న ప్రదర్శనే. సంతోషకరంగా, ఆయన బోధ, స్వస్థత పని, దేవుని రాజ్య ప్రభుత్వం క్రింద అందబోయే ఆశీర్వాదాన్ని సూచిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా స్వస్థత జరిగే పని సమీపంలోనే ఉంది.a అపొస్తలుడైన యోహాను ఈ దైవిక స్వస్థతను ఎంతో రమ్యంగా వివరించాడు: “స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.”—ప్రకటన 22:1, 2.
“జీవజలము,” “జీవవృక్షము” వంటి మాటలు, నేటి దుష్ట విధానాంతం తర్వాత యెహోవా రాజ్యపు స్వస్థతా కార్యక్రమాలు క్రమంగా మానవజాతిని పరిపూర్ణతకు లేవనెత్తుతాయని చూపుతుంది. వాస్తవానికి, యేసుక్రీస్తు, ఆయన తండ్రి యొక్క జ్ఞానంతో సహా, యేసు విమోచనా క్రయధనపు ప్రయోజనాలు (పూర్తి పాపక్షమాపణతో సహా) పరిపూర్ణ ఆరోగ్యాన్నీ నిత్యజీవాన్ని తెస్తాయి.—యోహాను 3:16.
దేవుని నూతన లోకంలో ఆనందము
అయితే, దౌర్జన్యం, కాలుష్యం లేక పేదరికం లేని భూమిని ఊహించండి. పునరుద్ధరించబడిన పరదైసులో మీ కుటుంబం ప్రశాంతంగా జీవించడాన్ని మీ మనోనేత్రాలతో చూడండి. (యెషయా 32:17, 18) పరిపూర్ణ మనస్సు మరియు భావాలతో వివిధ రంగులను వీక్షించడం ఎంత ఆహ్లాదంగా ఉంటుంది!
“నిత్యం మార్పుచెందే వెలుగు, రంగు, రూపాల పర్యావరణమే మానవుడు జీవించే సహజ పరిస్థితి. “ఒకే విధంగా ఉండే పర్యావరణం ప్రకృతిలో లేనేలేదు,” అని ఫాబర్ బిరెన్ అంటున్నారు. “రంగు అన్నది ప్రకృతి నందలి ఆహ్లాదకర విషయాల్లో ఒకటి. అది ప్రకృతి నియమం, ప్రకృతిలో అన్ని సందర్భాల్లోనూ రంగులు కనిపిస్తాయి, అంతేకాకుండా ఆనందదాయకమైన జీవితంలో అధిక భాగం దాని మీద ఆధారపడి ఉంటుంది.”
కనుచూపు ఎంతటి అమూల్యమైన బహుమానము! శారీరకంగా గానీ లేక ఆత్మీయంగా గానీ ఒకప్పుడు గ్రుడ్డివైన కన్నులు తెరువబడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది!
అవును, రాబోయే పునరుద్ధరించబడిన పరదైసులో, గ్రుడ్డితనమూ యితర లోపాలూ ఎన్నటికీ అసంతోషాన్ని కలిగించవు! ఎన్నటికీ ఎవ్వరూ తప్పుదోవ పట్టించబడరు. యథార్థమైన ప్రేమ ఉంటుంది కనుక, అందరూ ఆత్మీయ జ్ఞానాన్ని పొందుతారు. అవి, అంతకంటే ఎక్కువే మున్ముందు జరగబోతున్నాయి. అయితే, “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును” అనే తన ప్రవచన వాగ్దానాన్ని నెరవేర్చే యెహోవా అంగీకారాన్ని పొందే సమయమిదే!—యెషయా 35:5.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి వారు ప్రచురించిన మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం 18వ అధ్యాయంలో అందించిన విషయాలను, దీని రుజువు కొరకు దయచేసి పరిశీలించండి.
[7వ పేజీలోని చిత్రం]
ఆ కాలంలో గ్రుడ్డివారి కన్నులు తెరవబడును!