యెహోవా గురించి నేర్చుకునేలా చూపులేనివాళ్లకు సహాయం చేయండి
1. చూపులేనివాళ్ల పట్ల యేసు కనికరాన్ని ఎలా చూపించాడు?
1 యేసు, తాను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు యెరికో పట్టణం నుండి వెళ్తున్నప్పుడు ఇద్దరు చూపులేనివాళ్లు, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపు” అని కేకలువేశారు. యేసు తనకు త్వరలో రాబోయే శోధనల గురించి ఆలోచిస్తున్నప్పటికీ, ఆగి ఆ ఇద్దరిని పిలిచి, బాగుచేశాడు. (మత్త. 20:29-34) యేసు చూపించిన కనికరాన్ని మనం కూడా ఎలా చూపించవచ్చు?
2. చూపులేనివాళ్లను కలిసినప్పుడు, మనం ఎలా సాక్ష్యమివ్వవచ్చు?
2 సహాయం చేయండి: చూపులేనివాళ్లు ఎవరైనా మీకు ఎదురుపడితే పరిచయం చేసుకొని, సహాయం కావాలేమో అడగండి. అలాంటి వాళ్లను ఇతరులు తరచూ మోసం చేస్తూ ఉంటారు కాబట్టి, ఆ వ్యక్తి మనల్ని మొదట్లో నమ్మకపోవచ్చు. అయితే, మీరు వాళ్లతో స్నేహపూర్వకంగా ఉంటూ, నిజమైన శ్రద్ధ చూపిస్తే వాళ్లు కంగారుపడరు. చూపులేనివాళ్లలో కొంతమందికి పూర్తిగా కనిపించకపోవచ్చు లేదా కొంచెం కనిపించవచ్చని గుర్తుపెట్టుకోండి. దాన్నిబట్టే వాళ్లకు ఎంత సహాయం చేయాలో మనం ఒక నిర్ణయానికి రావచ్చు. సహాయం చేసిన తర్వాత, మీరు బైబిలు గురించి ఇతరులకు నేర్పిస్తుంటారని చెప్పవచ్చు. కీర్తన 146:8 లేదా యెషయా 35:5, 6 లాంటి ఒక లేఖనం చదివి వినిపించవచ్చేమో అడగండి. ఆయనకు బ్రెయిలీ చదవడం వస్తే, బైబిలు గురించి ఎక్కువ తెలుసుకోవడానికి బ్రెయిలీలో ఉన్న ప్రచురణ ఏదైనా చదువుతారేమో అడగండి. jw.org వెబ్సైట్ నుండి ఆడియో ఫైల్స్ ఆయనకు అందేలా సహాయం చేయండి. ఆయన కంప్యూటర్లో, స్క్రీన్మీదున్న సమాచారాన్ని పైకి చదివి వినిపించే స్క్రీన్‌రీడర్ ప్రోగ్రామ్ ఉంటే, RTFలో (రిచ్చ్ టెక్స్ట్ ఫార్మాట్) డౌన్లోడ్ చేసుకోగల ప్రచురణలతో పాటు jw.orgవెబ్సైట్లో ముద్రిత ఆర్టికల్స్‌ని కూడా పొందడానికి వాళ్లు ఇష్టపడవచ్చు.—“చూపులేనివాళ్లకు సహాయం చేస్తున్నప్పుడు . . . ” అనే బాక్సు చూడండి.
3. మన క్షేత్రంలో ఉన్న చూపులేనివాళ్లను ఎలా వెతకవచ్చు?
3 చూపులేనివాళ్ల కోసం వెతకండి: ఇంటింటి పరిచర్యకు వెళ్లినప్పుడు చూపులేనివాళ్లను చాలా తక్కువగా కలుస్తాం. ఎందుకంటే చాలామంది బయటికి వచ్చి కొత్తవాళ్లతో మాట్లాడడానికి ఇష్టపడరు. కాబట్టి అలాంటివాళ్లకు సాక్ష్యమివ్వాలంటే వాళ్ల కోసం ‘విచారణ చేయాలి,’ అది కష్టమైనపనే. (మత్త. 10:11) మీ స్కూల్లోగానీ మీరు పనిచేసే చోటగానీ చూపులేనివాళ్లు ఉన్నారా? చొరవ తీసుకొని వాళ్లతో మాట్లాడండి. మీరు ప్రకటించే ప్రాంతంలో చూపులేనివాళ్ల కోసం స్కూలు ఉంటే, ఆ స్కూల్లైబ్రరీలో పెట్టడానికి కొన్ని పుస్తకాలు ఇవ్వండి. మీ కుటుంబంలో చూపులేనివాళ్లు ఉన్నారా? మీ క్షేత్రంలో, చూపులేనివాళ్లకు సేవలు అందించే లేదా వాళ్లు ఉండడానికి వసతి ఏర్పాట్లు చేసిన సంస్థలు ఉన్నాయా? యెహోవాసాక్షులు చూపులేనివాళ్లకు సహాయం చేయడానికి ఇష్టపడతారని మీ కుటుంబ సభ్యునికి, రిసెప్షనిస్టుకి లేదా డైరెక్టర్‌కి వివరించి, కొన్ని బైబిలు ప్రచురణలు లేదా ఆడియో రికార్డింగ్‌లు తెచ్చి ఇవ్వవచ్చేమో అడగండి. త్వరలోనే అంధత్వాన్ని శాశ్వతంగా తీసేస్తానని బైబిల్లో దేవుడు చేసిన వాగ్దానాన్ని వాళ్లకు చూపించండి. విత్అవుట్ఇట్, ఐ వుడ్ ఫీల్లాస్ట్, అనే వీడియోను మీరు jw.org వెబ్సైట్నుండి చూపించాలనుకోవచ్చు. బైబిలు బ్రెయిలీలో ఉండడంవల్ల ప్రయోజనం పొందిన చూపులేని ఒక వ్యక్తి అనుభవం అందులో ఉంది. మీరు ఎందుకు ఇలా కలుస్తున్నారో వివరిస్తే, చూపులేనివాళ్లను కలిసే అవకాశం దొరుకుతుంది.
4. జానెట్అనుభవం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
4 జానెట్అనే సహోదరికి చూపులేదు. ఆమె చూపులేనివాళ్లు ఉండే ఒక బిల్డింగ్‌కి వెళ్లి, అక్కడున్న ఒక యౌవనస్థురాలితో మాట్లాడింది. జానెట్ఇలా అంది, “చూపులేనివాళ్లకు యేసు భవిష్యత్తులో ఏమి చేయనున్నాడో చూపించడానికి వాళ్లను బాగుచేశాడు.” వాళ్లిద్దరు కలిసి ప్రకటన 21:3, 4 వచనాలు చదివారు. దానిలోని వాగ్దానం దేవుని రాజ్యం ద్వారా ఎలా నెరవేరుతుందో జానెట్వివరించింది. ఆ యౌవనస్థురాలు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయి, తర్వాత ఇలా అంది, “చూపులేనివాళ్లు ఇలా చెప్పడం నేను ఎప్పుడూ వినలేదు. ఒకరికి చూపులేకపోవడానికి కారణం వాళ్లుగానీ వాళ్ల పూర్వీకులుగానీ చేసిన పనులేనని చూడగలిగే చాలామంది నమ్ముతారు.” సహోదరి జానెట్ఆ అమ్మాయికి బైబిలు బోధిస్తోంది పుస్తకం తెరిచే లింక్‌ను ఈ-మెయిల్లో పంపించింది. ఇప్పుడు జానెట్ఆమెతో వారానికి రెండుసార్లు బైబిలు అధ్యయనం చేస్తుంది.
5. చూపులేనివాళ్లను యేసు బాగుచేసినట్టు మనం బాగుచేయలేకపోయినా, వాళ్ల పట్ల శ్రద్ధ చూపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
5 చూపులేనివాళ్లను యేసు బాగుచేసినట్టు మనం బాగుచేయలేకపోవచ్చు. అయితే, ఈ యుగసంబంధమైన దేవుడు ఎవరి మనసులకు గ్రుడ్డితనం కలుగజేశాడో వాళ్లకూ, అలాగే నిజంగానే చూపులేనివాళ్లకూ దేవుని వాక్యం అర్థంచేసుకోవడానికి మనం సహాయం చేయవచ్చు. (2 కొరిం. 4:4) యెరికో దగ్గర యేసు ఇద్దరు చూపులేనివాళ్లను బాగుచేశాడు, ఎందుకంటే ఆయన వాళ్లమీద ‘కనికరపడ్డాడు.’ (మత్త. 20:34) మనం కూడా చూపులేనివాళ్ల మీద అలాంటి శ్రద్ధే చూపించాలి. అలా చేస్తే, త్వరలో అంధత్వాన్ని శాశ్వతంగా తీసివేసే యెహోవా గురించి నేర్చుకునేలా ఇతరులకు సహాయం చేస్తూ దానిలో ఉండే గొప్ప సంతోషాన్ని పొందవచ్చు.