గ్రుడ్డివారికి ఏ నిరీక్షణ ఉంది
జాన్ మిల్టన్ పూర్తిగా గ్రుడ్డివాడైనప్పటికీ పారడైస్ లాస్ట్ అండ్ పారడైస్ రీగెయిన్‌డ్ అనే కావ్యాన్ని రచించాడు. గ్రుడ్డితనం చెవుడూ రెండూ ఉన్న హెలెన్ కెల్లర్, శారీరక లోపం ఉన్న వారికి సహాయపడేందుకు ఆమెను ఆపలేదు. అవును, గ్రుడ్డివారైన అనేకులు దానివల్ల వచ్చే కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనగల్గుతున్నారు. అయితే అందరూ మంచి కనుచూపు కల్గివుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! ప్రత్యేకంగా మీ ప్రియమైన వ్యక్తిగానీ లేక స్నేహితుడుగానీ గ్రుడ్డివాళ్లైతే, అప్పుడు మీరు ఈ విషయాన్ని తప్పకుండా ఒప్పుకుంటారు.
కొన్ని దేశాల్లో కనుచూపులేని ప్రజలకు అనుదిన జీవితంలో నిపుణతతో ఎలా జీవించాలన్న వాటిని పునరావాస కార్యక్రమాలు నేర్పుతుంటాయి. బ్రెయిలీ మరియు శిక్షణను పొందిన కుక్కలు, గ్రుడ్డివారి అవసరతలనేకాలకు శ్రద్ధ వహిస్తుంటాయి. అయినప్పటికి, గ్రుడ్డితనం అతి ఘోరమైన లోపం అని అనేకులు దృష్టిస్తారు. ఓ రచయిత యిలా నొక్కి చెప్పాడు: “ఓ గ్రుడ్డి వ్యక్తి పరికించి చూడగల లోకమందలి ప్రాముఖ్యమైన భాగంలోకి ప్రవేశసౌలభ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు.” అదే సమయంలో, అనేకులు యితరులపై ఎక్కువగా ఆధారపడవలసివస్తుంది.
గ్రుడ్డితనం ఎందుకు అంత ప్రబలంగా ఉంది? అని మీరు ఆలోచించవచ్చు. మరి, మీరు ట్రాకోమా గూర్చి విన్నారా? సుమారు 90 లక్షల మంది గ్రుడ్డివారవ్వడానికి అదే కారణం. న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా దీన్ని గూర్చి యిలా చెబుతోంది: “ఈ వ్యాధి అంటువ్యాధి, అంతేకాదు అనారోగ్య పరిసరాల్లో జనసమూహం కిక్కిరిసి జీవించే ప్రాంతాల్లో అది పాకుతుంది. కడుగుకోవడానికి నీరు లేకపోవడమూ మానవ మలానికి ఆకర్షితమయ్యే వేలకొలది ఈగలూ ఈ రోగం వ్యాపించడానికి దోహదపడతాయి. కొన్ని విధాల్లో ట్రాకోమా ఓ వైద్య సమస్య కన్నా ఓ సాంఘిక సమస్యే; జీవన ప్రమాణాలను మెరుగుపర్చగల్గి, ఎక్కువ మంది ఒకే చోట జీవించడం తగ్గగల్గి, ఈగలను సమూలంగా తోలివేయగల్గి, కావలసినంత నీటి సరఫరా తప్పకుండా ఉండేట్లు చేయగల్గితే, ట్రాకోమా సోకడం త్వరగా తగ్గుముఖం పడుతుంది.” సుమారు మరో పది లక్షలమంది ప్రజలు ఆన్‌కోసిర్సియాసిస్, లేక రివర్ బ్లైండ్‌నెస్‌తో బాధపడుతున్నారు. లేక గ్సెరోఫ్తాల్మియా మాటేమిటి? ఆ పేరు కష్టమైనప్పటికీ, వాస్తవమేమిటంటే, గ్రుడ్డితనానికి అదే సామాన్య కారణంగా ఉంది. మధుమేహవ్యాధి, డిఫ్తీరియా, అమ్మవారు, స్కార్లెట్ ఫీవర్, సుఖ వ్యాధులు కూడా గ్రుడ్డితనానికి దారితీయవచ్చు.
మనకు వయస్సు మీరుతున్న కొద్ది, మాక్యులా క్షీణించడం, గ్లౌకోమాలు వంటి వాటిలో ఏర్పడిన జాడ్యం కారణంగా మన చూపు మందగించవచ్చు; లేక కాటరాక్ట్ కూడా మన కంటిచూపును పాడుచేయగలదు. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా యిలా గుర్తించింది: “ప్రపంచంలోని అనేక దేశాల్లో కాటరాక్ట్ యింకా అనేక మంది గ్రుడ్డివాళ్లవ్వడానికి కారణమౌతోంది, అంతకంటే విషాదకరమైనదేంటంటే అది శస్త్రచికిత్సవల్ల సులభంగా నయమౌతుంది.”
నేత్రచికిత్స శాస్త్రంలో నూతన పరిశోధనలున్నప్పటికీ, అంధత్వ నివారణ ఎక్కడో దూరాన ఉన్నట్లు అనిపిస్తుంది. అదే ఎన్‌సైక్లోపీడియా యిలా అంటోంది: “అంధత్వ నివారణ, మందులు, శస్త్రచికిత్సల ద్వారా దాన్ని చికిత్స చేయడంలో సాధించిన పురోభివృద్ధి, వైద్య సహాయాన్ని పొందగల ప్రజలకు మాత్రమే ఉపయుక్తం. ప్రపంచ జనాబాలోని అధిక శాతం ప్రజల ఆహార, పారిశుభ్ర నియమాలు మెరుగుపర్చబడేంతవరకు, నివారించగల్గినప్పటికీ గ్రుడ్డివారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.
గ్రుడ్డితనంతో పోరాడేందుకు ఆంటిబయాటిక్‌లు, శస్త్రచికిత్సలు తమ వంతు పనిచేస్తున్నప్పటికీ, యిది శాశ్వతంగా చికిత్స చేయబడుతుందన్న నిరీక్షణ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనతో పొందిక కల్గి ఉంటుంది.
యేసు జీవించిన రోజుల్లో గ్రుడ్డివారికి స్వస్థత
మట్టి రోడ్డుగుండా ఓ 30 ఏండ్ల వ్యక్తి నడుస్తున్నట్లుగా ఊహించండి. ఆయన వెళుతున్నాడని విని రోడ్డు ప్రక్కన ఉన్న యిద్దరు గ్రుడ్డివాళ్లు యిలా కేకలు వేశారు: “మమ్ము కరుణింపుము” చూసిన వాళ్లు మాట్లాడవద్దని వారికి ఆజ్ఞాపించినప్పటికీ, గ్రుడ్డివారు బిగ్గరగా అరిచారు “మమ్ము కరుణింపుము.” ఆ వ్యక్తి కరుణతో “నేను మీకేమి చేయగోరుచున్నారని” అడిగాడు. వాళ్లు ఎంతో ఆశతో “ప్రభువా, మా కన్నులు తెరవవలెను” అన్నారు. ఇప్పుడు ఊహించండి: ఆ వ్యక్తి వారి కన్నులను ముట్టుకుంటాడు, వెంటనే వాళ్లు చూపు పొందుతారు!—మత్తయి 20:29-34.
మునుపు గ్రుడ్డివారైన ఈ వ్యక్తులకు ఎంత ఆనందం కల్గివుంటుంది! అయినా, గ్రుడ్డితనం విస్తారంగా వ్యాపించి ఉంది. ఇది కేవలం ఒక్క సంఘటనే. అది మన అవధానాన్ని ఎందుకు చూరగొనాలి? ఎందుకంటే నజరేయుడైన యేసు ఆ గ్రుడ్డివారికి చూపును అనుగ్రహించాడు గనుక. వాస్తవానికి, ‘బీదలకు సువార్త ప్రకటించుటకు అభిషేకించబడ్డమే’ కాకుండా, ‘గ్రుడ్డివారికి చూపును అనుగ్రహించడానికి’ కూడా యేసు పంపబడ్డాడు.—లూకా 4:18.
దేవుని శక్తివంతమైన పరిశుద్ధాత్మ వల్ల జరిగిన అలాంటి అద్భుత చికిత్సలను చూసిన ప్రజలు ఆశ్చర్య చకితులయ్యారు. మనం యిలా చదువుతాం: “మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి.” (మత్తయి 15:31) అలాంటి స్వస్థతకార్యాల్లో యేసు డబ్బు పుచ్చుకోకుండా, తన సామర్థ్యాలను గూర్చి డాబులు చెప్పుకోకుండా లేక తనకు తాను మహిమను తెచ్చుకోవడానికి ప్రయత్నించకుండా ఆయన యెహోవా దేవుని ప్రేమ కనికరాలను నొక్కి తెలిపాడు. అయినప్పటికి, ఆత్మీయంగా గ్రుడ్డివారైన నిస్సహాయులైన “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్న” ప్రజల యెడల కూడా యేసుకు కనికరం ఉంది.—మత్తయి 9:36.
అలాంటి చరిత్ర ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ఈనాటి విషయమేమిటని మీరు ఆలోచించవచ్చు. యేసు చేసినట్లుగా నేడు ఎవ్వరూ ప్రజలను స్వస్థపర్చడంలేదు గనుక, ఆ స్వస్థతలు మన కొరకు భావాన్ని కల్గివున్నాయా? గ్రుడ్డివారికి ఏలాంటి నిరీక్షణ ఉంది? దయచేసి తదుపరి శీర్షికను చదవండి.
[4వ పేజీలోని చిత్రం]
“ప్రపంచ జనాబాలోని అధిక శాతం ప్రజల ఆహార, పారిశుభ్ర నియమాలు మెరుగుపర్చబడేంతవరకు, నివారించబడగల గ్రుడ్డివారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది”—ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా.