యెహోవాను సేవించడానికి ఆమె వయస్సు మీరిపోలేదు
అనేకమంది వృద్ధులు, తమ శేష సంవత్సరాల్లో సంతోషం పొందే నిరీక్షణ లేదని భావిస్తుంటారు. పేరుగాంచిన ఓ నటి యిలా చెప్పారు: “నేను నా జీవితాన్ని గందరగోళం చేసుకున్నాను. యిక యిప్పుడు దాన్ని మార్చడానికి సమయం మించిపోయింది. . . . నేను ఒంటరిగా నడిచేటప్పుడు, నా గత జీవితం గూర్చి నేను ఆలోచిస్తాను, దాన్ని నేను తీర్చి దిద్దుకున్న రీతి నాకు సంతృప్తికరంగా లేదు . . . ఎక్కడైనా నాకు స్థిమితం లేదు, ఒక్క చోట స్థిరపడలేక పోతున్నాను.”
దాదాపు 2,000 వేల సంవత్సరాలకు పూర్వం జీవించిన ఓ వృద్ధ స్త్రీకి యిలాంటి సమస్యే లేకుండెను. ఆమె 84 ఏళ్ల వృద్ధురాలు, అయితే ఆవిడ చురుకుగా, సంతోషంగా ఉంటూ దేవుని అనుగ్రహాన్ని ఎంతో అద్భుతంగా పొందింది. ఆవిడ పేరు అన్న, మరి సంతోషించడానికి ఆమెకు ప్రత్యేకమైన కారణముంది. అదేమిటి?
“దేవాలయము విడువక” ఉంది
సువార్త రచయితయైన లూకా మనకు అన్నతో పరిచయం చేస్తున్నాడు. “ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తైయునైన అన్న అను ఒక ప్రవక్త్రి” ఇశ్రాయేలులో ఉంది. ఓ ప్రవక్త్రిణిగా ఆమెకు ప్రత్యేక భావంలో దేవుని పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తి వరంగా ఉండేది. ప్రాముఖ్యంగా, ఒక గమనార్హమైన సందర్భంలో అన్నకు ప్రవచించే గొప్ప అవకాశం దక్కింది.
లూకా యింకా యిలా చెబుతున్నాడు: “ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై, యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండెను.” (లూకా 2:36, 37) బహుశ, అన్న చాలా చిన్న వయస్సులోనే విధవరాలై ఉండవచ్చు ఏ వయస్సులోని విధవరాండ్రకైనా తమ ప్రియమైన భర్తను మరణంలో కోల్పోవడం ఎంత హృదయవిదారకమో వారికి బాగా తెలుసు. అయితే మన కాలంలోని అనేకమంది దైవిక స్త్రీల్లాగే, అన్న కూడా, ఈ విషాదకర అనుభవం తాను దేవునికి చేసే సేవను ఆపనివ్వలేదు.
అన్న యెరూషలేము ‘దేవాలయనును ఎన్నడూ విడువక’ ఉందని లూకా చెబుతున్నాడు. (లూకా 2:37) దేవుని యింటిలో సేవ చేయడం ఫలితంగా వచ్చే ఆశీర్వాదాలను ఆమె ఎంతో గుణగ్రహించింది. కీర్తన గ్రంథకర్త, మరియు రాజైన దావీదువలె, ఆమె చర్యలు బహిర్గతం చేస్తున్నాయి. మరి అది ఏమిటి? దావీదు యిలా పాడాడు: “యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.” (కీర్తన 27:4) ఈ విషయంలో కూడా, యెహోవా ఆరాధనా స్థలంలో క్రమంగా హాజరుకావడానికి ఆనందించే నేటి క్రైస్తవ స్త్రీలను అన్న పోలివుంది.
అన్న యెహోవాకు రేయింబవళ్లూ పరిశుద్ధ సేవను అందించింది. విలాపమునూ యథార్థమైన కోరికను సూచిస్తూ, దీన్ని ఆవిడ “ఉపవాసప్రార్థనతో” చేసింది. (లూకా 2:37) ఆలయానికీ, దాని యాజకుల వరకు చేరిన దిగజారిన మత పరిస్థితులు, అన్య అధికారాలకు యూదులు దీర్ఘకాలం లోబడడె వంటివి, అన్న యెహోవా దేవునికి చేసిన విజ్ఞాపనములకూ చేసిన ఉపవాసములకూ కారణం కావచ్చు. అయితే ఆమె సంతోషించడానికి కూడ కారణముంది, ప్రత్యేకంగా సా.శ. 2వ సంవత్సరములో నిజంగా గణనీయమైన ఒకరోజు జరిగిన అసాధారణమైన దాని కారణంగా ఆమె ఆనందించగలదు.
అపేక్షించని ఆశీర్వాదం
అతి ప్రత్యేకమైన ఈ రోజున బాల యేసును తన తల్లి మరియ, పెంపుడు తండ్రి యోసేపు యెరూషలేము ఆలయానికి తీసుకువచ్చారు. ఆ సందర్భంలో వయస్సుమీరిన సుమోయోను బిడ్డను చూసి ప్రవచనార్థక మాటలను పలికాడు. (లూకా 2:25-35) రోజూలాగే అన్న ఆలయంలో ఉంది. ఆమె ‘ఆ గడియలోనే బిడ్డ దగ్గరికి వచ్చింది’ అని లూకా నివేదిస్తున్నాడు. (లూకా 2:38) తన వృద్ధ కన్నులతో భవిష్యత్ మెస్సీయను చూడడానికి అన్న ఎంత పులకరించి ఉంటుంది!
నలభై దినాలకు ముందు, దేవుని దూతలు బెత్లెహేము సమీపంలో ఉన్న కాపరులను ఈ మాటలతో ఆశ్చర్యపర్చారు. “ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షుకుడు మీ కొరకు పుట్టియున్నాడు.” ఆ వేల కొలది పరలోక సైన్యం యెహోవాను కొనియాడుతూ యిలా చెప్పారు: “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక.” (లూకా 2:8-14) అదేవిధంగా అన్న యిప్పుడు మెస్సీయ కాగలవాన్ని గూర్చి సాక్ష్యమివ్వడానికి పురికొల్పబడింది.
బాలుడైన యేసును చూసినప్పుడు, అన్న “దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.” (లూకా 2:38) వృద్ధ సుమెయోనులా యేసును ఆలయంలో చూడగల భాగ్యం పొందిన ఆమెకూడా వాగ్దాన విమోచకుని కొరకు అర్థిస్తూ ప్రార్థిస్తూ కనిపెట్టుకుని ఉందనడంలో సందేహంలేదు. యేసే అతడన్న వార్త ఆమెకు దాచుకోలేనంత శుభవార్త అయింది.
యేసు పెరిగే సమయానికి అన్న జీవించి ఉంటుందని అపేక్షించకపోయినప్పటికీ, ఆమె ఏమి చేసింది? ఈ రాబోవు మెస్సీయ ద్వారా అందబోవు విమోచనను గూర్చి ఆమె అందరికి సంతోషంగా సాక్ష్యమిచ్చింది.
అన్న చక్కటి మాదిరి
లోకంలో మతాసక్తిగల ఎందరు, 84 ఏళ్ల వయస్సులో అలాంటి సాక్ష్యమిస్తూ లేక యింకా రేయింబవళ్లూ ఆరాధిస్తూ ఉంటారు? వారు సంవత్సరాలకు ముందే ఉపకారవేతనం అడిగి ఉండేవారు. అన్న, సుమెయోను మాత్రం లౌకిక మత ప్రజలకు భిన్నంగా ఉండేవారు. యెహోవా వృద్ధ సేవకులందరికీ వారు చక్కటి మాదిరినుంచారు. వాస్తవానికి, వారు యెహోవా ఆరాధనా గృహాన్ని ప్రేమించి, తమ పూర్ణ హృదయంతో ఆయన్ని కొనియాడారు.
అన్నలో దైవిక విధవరాలి మంచి మాదిరి మనకు కనిపిస్తుంది. వాస్తవానికి, 1 తిమోతి 5:3-16లో అర్హతగల విధవరాలికి ఉండవల్సిన అర్హతలకు ఈ సాత్వికరాలైన వృద్ధ స్త్రీని గూర్చిన లూకా వర్ణన సరిగ్గా సరిపోతుంది. అక్కడ, అలాంటి విధవరాలు “విజ్ఞాపనలయందును ప్రార్థనయందును రేయింబగలు నిలుకడగా ఉండును.” “ఒక్క పురుషునికే భార్యయై,” ఉండి ‘ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదై ఉంటుంది,’ అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. అన్న సరిగ్గా అలాంటి స్త్రీయే.
నేడు. భూవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల వేల సంఘాల్లో నమ్మకమైన వృద్ధ విధవరాండ్రు రేయింబవళ్లూ దేవునికి సేవను అందజేస్తూ ఉన్నట్లు మనం కనుగొంటాం. మన మధ్యలో ఈ ఆధునిక దిన “అన్నలను” కల్గివుండడాన్ని మనం ఎంతగానో మెచ్చుకుంటాం గదా!
వయస్సు మీరిన సమయంలో కూడా స్త్రీపురుషులు దేవునికి సమర్పించుకుని, దాన్ని నీటి బాప్తిస్మము ద్వారా కనపర్చవచ్చు. వృద్ధులు యెహోవాను సేవించడానికి, పరలోకంలో యిప్పుడు స్థాపించబడిన మెస్సీయ రాజ్యం గూర్చి, విధేయులైన మానవజాతికి అది త్వరలో తీసుకురాబోవు వాటిని గూర్చి సాక్ష్యమివ్వడానికి వయస్సు మీరినవారేమీకారు. శతాబ్దాల క్రితం అన్న ఆశీర్వదించబడినట్లుగానే, నేడు దేవునికి పరిశుద్ధ సేవ చేసే వృద్ధులు యెహోవా తమను ఆశీర్వరించాడని సాక్ష్యమివ్వగలరు. యెహోవాను సేవించడానికీ, ఆయన పరిశుద్ధ నామాన్ని కొనియాడడానికి ఆమెకు వయస్సు మీరిపోలేదు—అలాగే వీరికి కూడా వయస్సు మీరిపోలేదు.