కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w16 మార్చి పేజీలు 26-28
  • ప్రవక్తలు చూపించినలాంటి స్ఫూర్తినే మీరూ చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రవక్తలు చూపించినలాంటి స్ఫూర్తినే మీరూ చూపించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాళ్లు చాలా కష్టపడ్డారు
  • వాళ్లు నిరుత్సాహం నుండి బయటపడ్డారు
  • వాళ్లు ప్రతికూల ఆలోచనలను అధిగమించారు
  • దేవునితో నడిచేందుకు హోషేయ ప్రవచనం మనకు సహాయపడుతుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • హోషేయ గ్రంథములోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • దేవునితో నడవండి, మంచిని పంటగా కోయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • “యెహోవా మార్గములు చక్కనివి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
w16 మార్చి పేజీలు 26-28
యెరూషలేము నమూనా గీసి ఉన్న ఓ ఇటుక వైపు చూస్తూ తన ఎడమ వైపు పడుకొనివున్న యెహెజ్కేలు

యెహెజ్కేలు 430 రోజులపాటు యెరూషలేము పట్టణం ముట్టడి వేయబడినట్లు ఇష్టపూర్వకంగా నటించాడు

ప్రవక్తలు చూపించినలాంటి స్ఫూర్తినే మీరూ చూపించండి

పూర్వకాలంలోని ప్రవక్తలకూ, మీకూ ఏదైనా పోలిక ఉందా? నూతనలోక అనువాదం బైబిలు 2013 ఎడిషన్‌లోని “బైబిలు పదాల పదకోశం” అనే భాగంలో ప్రవక్త అనే పదానికి ఈ నిర్వచనం ఇచ్చారు: ‘ఆ వ్యక్తి ద్వారా దేవుని సంకల్పాలు వెల్లడౌతాయి. ప్రవక్తలు దేవుని తరఫున మాట్లాడుతూ, కేవలం జరగబోయే వాటినే కాదుగానీ యెహోవా బోధలను, ఆజ్ఞలను, తీర్పులను కూడా తెలియజేశారు.’ మీరు ప్రవచనాలు చెప్పకపోయినా, దేవుని వాక్యంలో మీరు తెలుసుకున్న విషయాలను ప్రకటిస్తూ దేవుని తరఫున మాట్లాడుతున్నారు.—మత్త. 24:14.

మన దేవుడైన యెహోవా గురించి ఇతరులకు చెప్తూ, మనుషుల విషయంలో ఆయన సంకల్పం ఏమిటో వాళ్లకు బోధించడం మనకు దొరికిన ఓ గొప్ప అవకాశం. మనం ఆ పనిని ‘ఆకాశమధ్యమున ఎగురుచున్న’ దూతతో కలిసి చేస్తున్నాం. (ప్రక. 14:6) కానీ, మనకు ఎదురయ్యే సవాళ్ల వల్ల ఆ గొప్ప అవకాశాన్ని చిన్నచూపు చూసే ప్రమాదం ఉంది. ఆ సవాళ్లలో కొన్ని ఏమిటి? శారీరక లేదా మానసిక అలసట, నిరుత్సాహం లేదా మనం పనికిరానివాళ్లమనే భావం. పూర్వకాలంలోని నమ్మకమైన ప్రవక్తలకు కూడా మనలాంటి సవాళ్లే ఎదురయ్యాయి, అయినాసరే వాళ్లు పట్టువిడువలేదు. తమకు అప్పగించిన పనిని పూర్తిచేయడానికి యెహోవా వాళ్లకు సహాయం చేశాడు. ఇప్పుడు కొంతమంది ప్రవక్తల గురించి పరిశీలించి, వాళ్లలాంటి స్ఫూర్తిని మనమెలా చూపించవచ్చో తెలుసుకుందాం.

వాళ్లు చాలా కష్టపడ్డారు

రోజువారీ పనుల వల్ల కొన్నిసార్లు మనం అలసిపోతాం, అలాంటప్పుడు మనకు పరిచర్యకు వెళ్లాలని అనిపించకపోవచ్చు. నిజమే, మనకు విశ్రాంతి అవసరం, యేసూ అపొస్తలులూ కూడా విశ్రాంతి తీసుకున్నారు. (మార్కు 6:31) కానీ బబులోనులో ఉన్న యెహెజ్కేలు గురించి, అక్కడ బంధీలుగా ఉన్న ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు ఆయనకు అప్పగించిన పని గురించి ఒకసారి ఆలోచించండి. దేవుడు యెహెజ్కేలును ఒక ఇటుక తీసుకొని దాని మీద యెరూషలేము పట్టణ నమూనాను గీయమని చెప్పాడు. అంతేకాదు ఆ పట్టణాన్ని ముట్టడివేయడాన్ని సూచించే గుర్తులు పెట్టి, ఆ తర్వాత ఆయన ఆ నమూనాను చూస్తూ ఎడమపక్క 390 రోజులు, కుడిపక్కన 40 రోజులు పడుకోవాలని కూడా చెప్పాడు. యెహోవా యెహెజ్కేలుతో ఇలా అన్నాడు, “పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదేపాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును.” (యెహె. 4:1-8) దానివల్ల బంధీలుగా ఉన్న ఇశ్రాయేలీయులు ఆ విషయాన్ని గమనించి ఉంటారు. ఒక సంవత్సరం కన్నా ఎక్కువకాలం పాటు యెహెజ్కేలు అలా శారీరకంగా శ్రమను అనుభవించాలి. అయితే ఆ ప్రవక్త తనకు అప్పగించిన ఆ పనిని ఎలా పూర్తి చేయగలిగాడు?

దేవుడు తనను ఒక ప్రవక్తగా ఎందుకు పంపించాడో యెహెజ్కేలు అర్థంచేసుకున్నాడు. ఆయనను పంపిస్తూ దేవుడు ఇలా చెప్పాడు, ‘వాళ్లు విన్నా వినకపోయినా తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వాళ్లు తెలుసుకుంటారు.’ (యెహె. 2:4) దేవుడు తనకు ఆ పనిని ఎందుకు అప్పగించాడో యెహెజ్కేలు గుర్తుపెట్టుకున్నాడు. అందుకే యెరూషలేమును ముట్టడివేసినట్టుగా నటించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ విధంగా ఆయన నిజమైన ప్రవక్తనని నిరూపించుకున్నాడు. చివరికి, “పట్టణము కొల్లపెట్టబడెను” అనే వార్త ఆయనకు, బంధీలుగా ఉన్న ఇశ్రాయేలీయులకు అందింది. నిజంగానే తమ మధ్య ప్రవక్త ఉన్నాడని ఇశ్రాయేలీయులు అప్పుడు గుర్తించారు.—యెహె. 33:21, 33.

సాతాను లోకం పూర్తిగా నాశనం కాబోతుందని నేడు మనం ప్రజలను హెచ్చరిస్తున్నాం. మనం శారీరకంగా అలసిపోయినాసరే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, పునర్దర్శనాలు చేయడానికి, బైబిలు స్టడీలు చేయడానికి మన శక్తిని ఉపయోగిస్తాం. యుగసమాప్తి గురించిన ప్రవచనాలు నెరవేరుతుండగా, ‘దేవుని సంకల్పాలను వెల్లడిచేసిన’ వాళ్లలో మనమూ ఉన్నామనే సంతృప్తి పొందుతాం.

వాళ్లు నిరుత్సాహం నుండి బయటపడ్డారు

మనం యెహోవా పవిత్రశక్తి సహాయంతో చాలా కష్టపడి సువార్త ప్రకటిస్తాం. అయినా ప్రజలు మనం ప్రకటించేది విననప్పుడు కొన్నిసార్లు నిరుత్సాహపడతాం. అలాంటి సమయంలో యిర్మీయా ప్రవక్తను గుర్తుచేసుకోవడం మంచిది. ఆయన ఇశ్రాయేలీయులకు దేవుని సందేశాన్ని ప్రకటించినప్పుడు వాళ్లు ఆయన్ని ఎగతాళి చేశారు, అవమానించారు, దూషించారు. ఒకానొక సమయంలో యిర్మీయా ఇలా అన్నాడు, “ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను.” యిర్మీయా కూడా మనలాంటి భావాలున్న వ్యక్తే. అయినప్పటికీ ఆయన దేవుని సందేశాన్ని ప్రకటించడం మానలేదు. ఎందుకంటే, “అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడి యున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు” అని యిర్మీయా అన్నాడు.—యిర్మీ. 20:7-9.

అదేవిధంగా మనం చెప్పే సువార్తను ప్రజలు విననందుకు మనకు నిరుత్సాహం కలిగితే, మనం ప్రకటించే సువార్త గురించి ఆలోచించడం ద్వారా నిరుత్సాహం నుండి బయటపడవచ్చు. అది ‘అగ్నివలె మండుచు మన ఎముకలలో మూయబడినట్లు’ ఉంటుంది. మనం ప్రతిరోజు బైబిలు చదవడం అలవాటు చేసుకుంటే ఆ అగ్ని మనలో అలాగే మండుతూ ఉంటుంది.

వాళ్లు ప్రతికూల ఆలోచనలను అధిగమించారు

కొంతమంది క్రైస్తవులు ఏదైనా నియామకం పొందినప్పుడు, దానిని ఎలా చేయాలో అర్థంకాక లేదా అది ఎందుకు ఇచ్చారో తెలియక కంగారుపడ్డారు. హోషేయ ప్రవక్తకు కూడా బహుశా అలాగే అనిపించివుంటుంది. యెహోవా ఆయనకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, “నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము.” (హోషే. 1:2) మీరు పెళ్లి చేసుకోబోతున్నారని ఊహించుకోండి. కానీ మీరు చేసుకోబోయే ఆ అమ్మాయి ఆ తర్వాత ఒక వేశ్యగా మారుతుందని దేవుడు చెప్తే, అప్పుడు మీకెలా అనిపిస్తుంది? హోషేయ దేవుడిచ్చిన నియామకాన్ని అంగీకరించాడు. ఆయన గోమెరును పెళ్లి చేసుకున్నాడు, వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఒక కూతురు, మరో కొడుకు పుట్టారు, బహుశా ఈ ఇద్దరు పిల్లలు వ్యభిచారం కారణంగా పుట్టినవాళ్లు అయ్యుండవచ్చు. అయితే, అతను చేసుకోబోయే అమ్మాయి, “తన ప్రేమికులను వెంటాడుతూ” ఉంటుంది అని యెహోవా హోషేయకు చెప్పాడు. ఇక్కడ ‘ప్రేమికులు’ అనే మాట ఒకరికన్నా ఎక్కువమందిని సూచిస్తుంది. కొంతకాలం తర్వాత ఆమె హోషేయ దగ్గరకు తిరిగి రావడానికి ప్రయత్నిస్తుందని కూడా యెహోవా చెప్పాడు. ఒకవేళ మీరే ఆ ప్రవక్త అయితే, ఆమెను మీ భార్యగా అంగీకరిస్తారా? కానీ యెహోవా ఆమెను అంగీకరించమని హోషేయకు చెప్పాడు. ఆ ప్రవక్త ఆమెను ఎక్కువ డబ్బుపెట్టి తిరిగి కొన్నాడు.—హోషే. 2:7, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం; హోషే. 3:1-5.

ఈ నియామకాన్ని చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందని హోషేయ అనుకొనివుంటాడు. అయినాసరే యెహోవా చెప్పినదాన్ని హోషేయ నమ్మకంగా చేశాడు. ఇశ్రాయేలీయులు తనను కాదని వెళ్లిపోయినప్పుడు యెహోవా ఎంత బాధపడివుంటాడో అర్థంచేసుకోవడానికి హోషేయ ఉదాహరణ మనకు సహాయం చేస్తుంది. అయితే, కొంతమంది మంచి మనసున్న ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు తిరిగొచ్చారు.

“వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడు” అని నేడు దేవుడు ఎవ్వరికీ చెప్పట్లేదు. అయినప్పటికీ, ఇచ్చిన నియామకాన్ని చేయడానికి ముందుకొచ్చిన హోషేయ నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఒక పాఠం ఏమిటంటే ‘బహిరంగంగా, ఇంటింటా’ దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం మనకు కష్టంగా అనిపించినా ఆ పని చేయడానికి ముందుండాలి. (అపొ. 20:20-21) బహుశా కొన్ని పద్ధతుల్లో ప్రకటించడం మీకు కష్టంగా ఉండవచ్చు. యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకుంటున్న చాలామంది, తాము బైబిలు గురించి నేర్చుకుంటునందుకు సంతోషంగానే ఉందిగానీ సువార్తను ప్రకటించడానికి మాత్రం ఎప్పటికీ ఇంటింటికి వెళ్లమని చెప్పారు. కానీ అలా అన్నవాళ్లలో చాలామంది కొంతకాలం తర్వాత సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. ఇది మనకు ఏం నేర్పిస్తుంది?

కష్టమైన నియామకాన్ని అంగీకరించిన హోషేయ నుండి మనం మరో పాఠాన్ని కూడా నేర్చుకోవచ్చు. ఆయన గోమెరును పెళ్లిచేసుకోకుండా తప్పించుకోవడానికి చాలా సాకులు చెప్పవచ్చు. అసలు హోషేయ ఈ వృత్తాంతాన్ని రాసి ఉండకపోతే అతని నియామకం గురించి ఎవ్వరికీ తెలిసేదికాదు. అదేవిధంగా, ఒక్కోసారి మనకు కూడా యెహోవా గురించి ఇతరులకు చెప్పే అవకాశం దొరకవచ్చు, కానీ దానిగురించి వేరేవాళ్లకు తెలియకపోవచ్చు. ఇలాంటి పరిస్థితే అమెరికాలోని హైస్కూల్లో చదువుతున్న ఆన అనే అమ్మాయికి ఎదురైంది. వాళ్ల క్లాస్‌ టీచర్‌ పిల్లలందర్నీ, వాళ్లు బలంగా నమ్మే ఒక అంశం గురించి ఓ వ్యాసం రాయాలనీ, ఆ తర్వాత మిగతా పిల్లలతో ఆ విషయాన్ని ఒప్పించాలనీ చెప్పింది. సాక్ష్యమివ్వడానికి దొరికిన ఆ అవకాశాన్ని ఆన పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయి దాన్ని దేవుడిచ్చిన ఒక అవకాశంగా చూసింది. తాను ఏం చేయగలదో గుర్తించిన ఆన ప్రార్థన చేసుకుంది, ఎలాగైనా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే కోరిక ఆమెలో కలిగింది. “ఎవల్యూషన్‌: కన్‌సిడర్‌ ది ఎవిడెన్స్‌” అనే అంశంతో ఆమె వ్యాసం రాసింది.

క్లాస్‌లోని పిల్లలందరి ముందు తన నమ్మకాల్ని సమర్థిస్తూ మాట్లాడుతున్న ఓ యువ సహోదరి

మన యౌవనులు ప్రవక్తలు చూపించినలాంటి స్ఫూర్తినే చూపిస్తూ, యెహోవాయే మన సృష్టికర్త అని ధైర్యంగా చెప్తున్నారు

ఆన ఆ వ్యాసాన్ని క్లాస్‌లో అందరి ముందు వివరించింది, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మే ఒక అమ్మాయి ఆనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆన వాటన్నిటికి చక్కగా సమాధానం చెప్పింది. దానికి ముగ్ధురాలైన టీచర్‌, అందరికన్నా ఆన వ్యాసమే ఒప్పించే విధంగా ఉందని ఒక బహుమతి ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఆన పరిణామ సిద్ధాంతాన్ని నమ్మే ఆ అమ్మాయితో సృష్టి గురించి చాలాసార్లు మాట్లాడింది. యెహోవా నుండి వచ్చిన ఈ “నియామకాన్ని” అంగీకరించడంవల్ల, “నేను ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నాను” అని ఆన అంటోంది.

మనం నిజంగా ప్రవక్తలం కాకపోయినా, నిస్వార్థంగా త్యాగాలు చేసిన యెహెజ్కేలు, యిర్మీయా, హోషేయ ప్రవక్తలను అనుకరించడం ద్వారా నేడు మనం కూడా యెహోవా చిత్తాన్ని చక్కగా నెరవేర్చగలుగుతాం. మీ కుటుంబ ఆరాధనలో లేదా మీ వ్యక్తిగత బైబిలు అధ్యయనంలో పూర్వకాలంలో జీవించిన ఇతర ప్రవక్తల గురించి చదివి, వాళ్లను మీరెలా అనుకరించవచ్చో ఆలోచించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి