దేవుని సేవలో ఇంటిమీద బెంగను అధిగమించండి
యేసుక్రీస్తు తన అనుచరులకు యిలా ఆజ్ఞనిచ్చాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.” (మత్తయి 28:19) అనేక మంది క్రైస్తవులు, ఆ ఆజ్ఞను శిరసావహించడమంటే తమ యింటి నుండి దూరంగా, కష్టతరమైన పరిస్థితులను అంగీకరించడమే. ప్రయాణకాపరులు, వారి భార్యలు మరి యితరులు దేవుని సేవకొరకు అనేక విషయాలను విడిచి వస్తారు. ఈ యెహోవాసాక్షులందరికీ యింటిమీద బెంగ ఓ నిజమైన సవాలుగా ఉండగలదు.
జ్ఞాపకాలు మీ ఆలోచనలను భద్రతా ప్రేమలున్న మధురమైన గతంలోకి తీసుకువెళ్లినప్పుడు యింటిమీద బెంగ పుట్టుకొస్తుంది. ఇది ఎంత ఉద్ధృతమైన భావోద్రేకాలను రేపుతుందంటే, మీరు కృంగిపోయి, యిక ఏమీ చేయలేని స్థితికి చేరుకుంటారు. వాస్తవానికి, తమ వస్తువులన్నిటిని అమ్మి, విదేశానికి చాలా ఖరీదుతో కూడిన ప్రయాణాన్ని సాగించిన తర్వాత, కొందరు తమ పథకాలను విడిచిపెట్టి యింటికి తిరుగు ముఖం పట్టారు. ఇంటిమీద బెంగ వారిని ఆవరించింది.
భావోద్రేకాలపై అలాంటి దాడి సహజంగా మొదటిసారి బయిటికి వెళ్లినప్పుడు తరచూ వస్తుంటుంది. అయితే కొందరికి అది జీవితకాలమంతా కొనసాగవచ్చును. యాకోబు, 20 ఏళ్లకంటే ఎక్కువ సంవత్సరాలు యింటి నుండి బయట ఉన్న తర్వాత, ఆయన ‘తండ్రి యింటి మీద వాంఛలు గలవాడయ్యాడు.’ (ఆదికాండము 31:30) ఎవరు యింటిమీద బెంగతో బాధపడగలరు? ఏది దాన్ని ప్రారంభిస్తుంది? అలాంటి భావాలను ఓ వ్యక్తి ఎలా అధిగమించగలడు?
ఏది వ్యధను కలిగిస్తుంది?
ఇంటి బెంగ ఎవరినైనా బాధించవచ్చు. అస్టియాగెస్ అనే మాదీయ రాజు కుమార్తైన అమిటిస్‌కు సంతోషించడానికి అని కారణాలూ ఉన్నాయి: ధనం, ప్రతిష్ట, ఓ అందమైన గృహం. అయినా, మాదీయ పర్వతాలపై ఆమె ఎంత బెంగపెట్టుకుందంటే, ఆమెను ఓదార్చే ప్రయత్నంగా ఆమె భర్త, రాజైన నెబుకద్నెజరు బబులోనులో హాంగిగ్ గార్డెన్స్‌ను నిర్మించాడు.
ఓ వ్యక్తి యింటిని విడువకముందు కంటే యిప్పటి జీవితం మరింత కష్టతరంగా ఉంటే అప్పుడు ప్రత్యేకంగా యింటిమీద బెంగ బాధాకరంగా ఉంటుంది. యూదా ప్రజలు బంధీలైనప్పుడు వారు యిలా విలపించారు: “బబులోను నదులయొద్ద కూర్చుండియున్నపుడు మనము సీయోనును జ్ఞాపకము చేసుకొని యేడ్చుచుంటిమి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?”—కీర్తన 137:1, 4.
ఇంటిమీద బెంగలోని దుఃఖాన్ని అనేక విషయాలు అధికం చేయగలవు. కెనడాను విడిచిన టెర్రీ యిలా చెప్పింది: “ఓ రోజున నా పుస్తకంనుండి కుటుంబ ఫోటో ఒకటి పడింది. నేను దాన్ని తీసినప్పుడు, ఇంటిపైని బెంగ ఓ వెల్లువలా నన్ను ముంచేసింది. యింక నేను ఏడ్చేశాను.” ఇంగ్లాండు నుండి పేద దేశానికి మారిన క్రిస్ యిలా ఒప్పుకుంటున్నారు: “ఓ పాత పాటలోని రాగాన్ని గుర్తించడం లేక పరిచయమున్న ఓ వంటకం వాసన, నేను విడిచి వచ్చిన వాటిని ఆశించేలా చేసేవి.”—సంఖ్యాకాండము 11:5 పోల్చండి.
సన్నిహిత కుటుంబ సంబంధాలు తరచూ దీనికి దోహదపడుతుంటాయి. బ్రెజిల్‌కు చెందిన రోజలి యిప్పుడు ప్రక్క దేశంలో నివసిస్తూ యిలా వ్యాఖ్యానిస్తోంది: “నాకు యింటి నుండి చెడువార్త అంది, సహాయం చేయడానికి నేను అక్కడ ఉండలేకపోతే నేను చాలా బాధపడతాను. కొన్నిసార్లు అక్కడ నుండి ఏ సమాచారం అందక పోయినా ఏవేవో ఊహలు ప్రారంభమైనప్పుడు అది మరీ ఘోరంగా ఉంటుంది.” జానిస్ ఉత్తర అమెరికా నుండి అమెజాన్ ట్రాపిక్స్‌లోని ఓ చిన్న పట్టణంలోకి మారింది. ఆమె యిలా చెప్పారు: “ఇంటి నుండి నేనో మంచి వార్త విన్నపుడు నేను యింటి మీద బెంగ పెట్టుకుంటాను. వాళ్లు కలిసి సంతోషంగా ఉంటున్నారన్న విషయాలు విని, నేను కూడా అక్కడుండి ఉంటే ఎంత బాగుండేదని అనుకుంటాను.”
కేవలం మనుష్యులను విడిచిపెట్టడమే యింటిమీద బెంగకు కారణం కాదు. లిండా యిలా వివరిస్తున్నాడు: “నాకవసరమైన వస్తువులను నేనెక్కడ కొనుక్కోవాలో నాకు తెలియనప్పుడు నేను బాధపడతాను. నాకు ధరులుగాని, బేరమాడ్డంగానీ తెలీదు. ఓ కారును కొనుక్కోవడం చాలా ఖరీదౌతుంది, రద్దీ ఎక్కువున్న ప్రజావాహనాలను నేను ఎక్కడానికి కష్టపడుతున్నప్పుడల్లా నన్ను తోసేసేవారు. ఇది నా మనస్సును యింటి వైపుకు మరలేటట్లు చేసేది,” ఆర్థిక సామాజిక తేడాపై వ్యాఖ్యానిస్తూ జానెట్ యిలా చెబుతున్నారు: “పేదరికము నన్ను బాధపెడుతుంది. రొట్టె కొరకు ప్రజలు అడుక్కోవడంగానీ, లేక పెద్ద పెద్ద కుటుంబాలు నీళ్లులేకుండా ఒకే గదిలో ఉండడం నేనెన్నడూ చూడలేదు. . . . అలాంటి విషయాలు నన్ను ఎంతగా బాధపెట్టాయంటే, యిక ఒక్క క్షణం కూడా అక్కడుండలేనని నాకనిపించింది.”
మీ భావాలతో వ్యవహరించడం
మనం ప్రేమించేవారి యెడల లేక మనం పెరిగిన పరిసరాల యెడల బలమైన భావోద్రేకాలను కల్గివుండడం విషయంలో మనం సిగ్గుపడనవసరం లేదు. అనురాగంతో కూడిన వ్యక్తిగత సంబంధాలను మనం అనుభవించడానికే దేవుడు మనకు భావోద్రేకాలను అందించాడు. ఎఫెసీ సంఘానికి చెందిన క్రైస్తవ అధ్యక్షులు భావోద్రేకంగా పరిపక్వతకు ఎదిగినవారే. అయితే అపొస్తలుడై పౌలు సందర్శనం ముగిసేటప్పటికి ఏం జరిగింది? ఏమి జరిగిందంటే “వారందరూ చాలా ఏడ్చిరి. . . . పౌలు మెడమీద పడి అతనిని ముద్దు పెట్టుకొనిరి!” (అపొస్తలుల కార్యములు 20:37) నిజమే, అక్కడ జరిగింది యింటిమీద బెంగతో కాదనుకోండి. అయినా, అది మన ఆలోచనను పదునుపెడుతోంది. భావాలు కల్గివుండడం సహజమే, అయితే అవి మనలను వశపర్చుకోనివ్వకూడదు. మరి యింటిమీద బెంగతో మీరెలా వ్యవహరించగలరు?
ప్రాంతీయ భాషను మాట్లాడడానికి నేర్చుకోవడం భావాలను సవరించడానికి కీలకం. మీరు పరభాషతో వ్యవహరించాల్సి ఉంటుంది గనుక సంభాషణకు ఆటంకం కలిగి అది యింటిమీద బెంగను అధికం చేయవచ్చు. కాబట్టి, వీలైతే మీరు ఆ ప్రాంతానికి వెళ్లక ముందే అక్కడి భాషను రాయడం మాట్లాడడం నేర్చుకోండి. లేకపోతే, మీరు వచ్చిన మొదటి కొన్ని వారాలు ఆ భాషను నేర్చుకోవడంపై అవధానమివ్వండి. ఆ సమయంలో మీకు బలమైన ప్రోత్సాహం ఉంటుంది, అప్పుడు భాషను నేర్చుకోవడం మంచి విషయమౌతుంది. ఈ వారాలను మీరు భాష నేర్చుకోవడానికి ముఖ్యంగా వినియోగించుకున్నట్లయితే, త్వరలోనే మీరు సంభాషణను ఆనందించగలరు. అంతేకాదు అది యింటిమీద బెంగను తగ్గించుకోడానికి సహాయపడుతుంది.
వీలున్నంత త్వరగా కొత్త స్నేహితులను చేసుకోండి, ఎందుకంటే అప్పుడు మీరు మీ స్వగ్రామంలో ఉన్నట్లు భావిస్తారు. నిజమైన స్నేహితులను పొందడానికి యెహోవాసాక్షుల సంఘం ఓ చక్కటి స్థలం. మీరే చొరవ తీసుకుని యితరులయెడల ఆసక్తి కల్గి ఉండండి. వారి పుట్టుపూర్వోత్తరాలనూ వారి కుటుంబం, వారి సమస్యలను, వారి అభిరుచులను తెలుసుకోడానికి కృషిచేయండి. తోటి విశ్వాసులను మీరు మీ యింటికి ఆహ్వానించండి. అప్పుడు, యితరులు మీ యెడల ఆసక్తి కనపరుస్తారని మీరు గమనిస్తారు.
దేవుని ప్రజల్లో, స్నేహాలు కుటుంబ సంబంధాలంత సన్నిహితంగా ఉండగలవు. “దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు.” (మత్తయిమార్కు 3:35) క్రీస్తు తన అనుచరులకు కూడా యిలా హామీనిచ్చాడు. “నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందును.” (మత్తయి 10:29, 30) అలాంటి అద్భుతమైన ఆత్మీయ సహోదరత్వంతో కొత్త ప్రాంతంలోనైనా సరే మనం ఒంటరిగా ఉండము.
మీరు విడిచివచ్చిన వారితో స్నేహాన్ని కల్గి ఉండడంకూడా యింటిమీద బెంగను ఎదుర్కోడానికి సహాయపడుతుంది. మీరు మారిన తర్వాత, మీరు రాసేముందు బాగా ఆలోచించి రాస్తారు గనుక ఉత్తరాల సహాయంతో సంభాషించడం అర్థవంతమని మీకు అనిపిస్తుంది. చెప్పుకోడానికి ఎన్నో ఉత్సాహవంతమైన విషయాలుంటాయి. ముందు ప్రస్తావించిన జానెట్ యిలా సలహానిస్తున్నాడు: “దూర ప్రాంతాలకు టెలిఫోనులో మాట్లాడడానికి చాలా ఖర్చవుతుంది, దానితో పోల్చిచూస్తే రికార్డు చేసిన కెసెట్‌ను పోస్టు ద్వారా పంపించడం తక్కువౌతుంది. ఓ యంత్రంతో మాట్లాడడం మొదట విచిత్రంగా అనిపించవచ్చు. అయినా, ఎవరితోనైనా మీరు మైక్రోఫోన్ సహాయంతో మాట్లాడితే, అది మీకు సులభంగానూ ఆసక్తికరంగానూ ఉంటుంది.” మరో కేసెట్ రికార్డింగ్‌ను తిరిగి మీకు పంపించమని కూడా మీరు కోరవచ్చు.
అమెరికా నుండి లాటిన్ అమెరికాకు 25 సంవత్సరాల క్రితం వెళ్లిన షేర్లీ యిలా చెబుతోంది: “సమస్యలకు బదులుగా నేనెల్లపుడూ ప్రోత్సాహకరమైన అనుభవాలను రాస్తుంటాను. ఇది యితరులు నాకు రాస్తూ ఉండడానికిది ప్రోత్సాహకరంగా ఉంటుంది.” అయితే జాగ్రత్తగా ఉండండి సుమా. ఎక్కువగా రాయడం కొత్త స్నేహితులను చేసుకోవడాన్ని నివారిస్తుంది. కెనడా నుండి మరో దేశానికి వెళ్లిన డెల్ యిలా అన్నారు: “ఇంట్లో వుండి మీరు పోగొట్టుకున్న వాటిపై దిగాలుగా ధ్యానిస్తూ కూర్చోకుండా బయిటికి వెళ్లి కొత్త ప్రదేశాన్ని ఆస్వాదించండి.”
క్రొత్త దేశంలోని అలవాట్లను చరిత్ర, వినోదం, ఆసక్తిరేపే ప్రదేశాలు అందాలను గూర్చి తెలుసుకోండి. ఇవి మీరు ప్రతికూల విషయాలపై అవధానం నిలుపకుండా సహాయపడతాయి. మీరు వెళ్లిన ప్రాంతంలో మీరు ఉండ గోరుతున్నట్లయితే, మీ స్వగ్రామాన్ని మరీ త్వరగా కానీ లేక మరీ తరచుగా గానీ సందర్శించకుండా ఉండడం ఉత్తమం. కొత్తగా స్నేహాలు చేయడానికి, కొత్త పరిసరాలకు అలవాటు కావడానికి సమయం పడుతుంది. ఇంటిని మరలా సందర్శించడం ఈ ప్రక్రియకు ఆటంకం కల్గించవచ్చు. ఒకసారి మీరు మీ కొత్త యింట్లో స్థిరపడిన తర్వాత, మీ పాత యింటికి వెళ్లి రావడాన్ని మీరు ఆనందించగలరు. ఈ మధ్యలో, కొత్త యింటితో సంబంధం నిర్మించుకోవడంలో నిమగ్నమైవుండండి.
ముందుకు చూస్తూ ఉండిండి
యెహోవా భూమినంతటిని మనకు గృహంగా యిచ్చాడు. (కీర్తన 115:16) ఆనందభరితమైన క్రైస్తవ ఆత్మతో ఏ ప్రాంతంలోనైనా జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. రాజ్యాసక్తులను ప్రేరేపించడానికి, అంతేకాక సువార్తను మరో దేశంలో లేక మీ స్వగ్రామంలోని వారికి అందించడానికి నివాసం మారినట్లయితే, దాన్ని మీరు సంతోషకరమైన ఆపేక్షతో చేయండి. కొత్త స్నేహితులను చేసుకోవడానికి, వివిధ నాగరికతలను గూర్చి తెలుసుకోవడానికి, శిష్యులను తయారు చేయడానికి లేక దేవుని సేవలో ప్రతిఫలదాయకమైన వాటిని చేయడానికి ప్రయత్నించండి.
మీరు ఎక్కడున్నప్పటికీ యెహోవా ఎల్లప్పుడూ మీతో ఉండే స్నేహితునిగా ఉంటాడు. (కీర్తన 94:14; 145:14, 18) కనుక ప్రార్థన ద్వారా ఆయనకు సన్నిహితంగా ఉండండి. (రోమీయులు 12:12) దేవుని సేవకునిగా మీ జీవిత సంకల్పాన్ని మీరెల్లప్పుడూ మనస్సులో ఉంచుకోడానికి యిది సహాయపడుతుంది. అబ్రాహాము, శారా ఊరు పట్టణంలోని తమ అనువైన యింటిని విడిచి వెళ్లినప్పుడు తమ ఉద్దేశాన్ని మనస్సులో ఉంచుకున్నారు. యెహోవా ఆజ్ఞకు విధేయులై వారు తమ స్నేహితులనూ బంధువులనూ విడిచారు. (అపొస్తలుల కార్యములు 7:2-4) వారు విడిచిపెట్టిన ప్రదేశాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ బంధువులనూ విడిచారు. (అపొస్తలుల కార్యములు 7:2-4) వారు విడిచిపెట్టిన ప్రదేశాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ దానిమీద బెంగ పెట్టుకుని ఉంటే, వారు మరలి వచ్చే అవకాశముండేది. అయితే వారు అంతకంటే శ్రేష్టమైన స్థలంకొరకు అపేక్షించారు—అదే దేవుని పరలోక రాజ్యం ఆధ్వర్యంలో పరదైసు భూమిపైని జీవితం.—హెబ్రీయులు 11:15, 16.
విదేశీ ప్రాంతాల్లో లేక మీ స్వదేశంలోనే రాజ్య ప్రచారపని అధికంగా అవసరమైన చోట ప్రకటించడం సవాలుతో కూడినది. అయితే అది ఫలవంతమైనది, ఎక్కువ ప్రతిఫలదాయకమైంది కూడా. (యోహాను 15:8) మరి ప్రతికూల తలంపులు మిమ్మల్ని తాత్కాలికంగా బాధపెట్టినట్లయితే, మీ గమ్యాన్ని మనస్సులో కలిగి ఉండి భవిష్యత్తువైపు చూడడం వంటివి దాన్ని అధిగమించడానికి సహాయపడగలవు. ఓ అవివాహిత మిషనరీ సహోదరి యిలా చెప్పారు: “దుఃఖం నన్ను చుట్టు ముడుతున్నప్పుడు నేను నూత లోకాన్ని గూర్చి, అందులో మానవజాతి అంతాకూడ ఒకే కుటుంబంగా ఎలా ఉండబోతోందో ఆలోచిస్తాను.” ఇలాంటి మధురమైన ఆలోచనలు యింటిమీద బెంగకు గురికాకుండా మీ సంతోషాన్ని మీరు కాపాడుకోడానికి సహాయపడతాయి.
[29వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ పరిచర్యను యింటిమీద బెంగ ఆటంకపర్చనవసరం లేదు