కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 2/1 పేజీలు 20-25
  • మేము మొదట రాజ్యమును వెదికాము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మేము మొదట రాజ్యమును వెదికాము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు సత్యం యెడల మెప్పు
  • పయినీరు సేవలో ప్రవేశించడం
  • యుద్ధ సంవత్సరాలలో మా పరిచర్య
  • యుద్ధానంతర పరిచర్య—తరువాత గిలియడ్‌
  • బ్రెజిల్‌లో మా పరిచర్య
  • ఒక ఉత్తమ, ఫలవంతమైన జీవితం
  • డబ్బుంటేనే సంతోషంగా ఉంటామా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • మిషనరీ సేవచేయాలనే నా కోరికను యెహోవా మెండుగా ఆశీర్వదించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • నా జీవితంతో చేయగల శ్రేష్ఠమైన పని
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • దృష్టిని హృదయాన్ని ప్రతిఫలంపై కేంద్రీకరించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 2/1 పేజీలు 20-25

మేము మొదట రాజ్యమును వెదికాము

ఆలివ్‌ స్ప్రింగేట్‌ చెప్పినది

మా ప్రార్థనలు విన్న తరువాత అప్పుడే మా అమ్మ కొవ్వొత్తి ఆర్పి గదిలోనుండి వెళ్లిపోయింది. వెంటనే నా చిన్న తమ్ముడు నన్నిలా అడిగాడు: “ఆలివ్‌, ఇటుక గోడలలో నుండి దేవుడెలా మనల్ని చూసి, విన గలడు?”

“ఆయన దేని నుండైన చూడగలడని అమ్మ చెబుతుంది, చివరికి మన హృదయాల్లోకి కూడా చూడగలడు” అని నేను జవాబిచ్చాను. అమ్మ దేవుని యందు భయభక్తులున్న స్త్రీ, ఆమె అత్యంతాసక్తితో బైబిలు చదివేది, పిల్లలమైన మాలో దేవుని యెడల, బైబిలు సూత్రాల యెడల ప్రగాఢ గౌరవాన్ని ఆమె కల్గించింది.

మా తలిదండ్రులు ఇంగ్లాండులో కెంట్‌ కౌంటిలోని చాతామ్‌ అనే చిన్న పట్టణంలో ఉన్న ఆంగ్లికన్‌ చర్చి సభ్యులుగా ఉండేవారు. మా అమ్మ క్రమంగా చర్చికి వెళుతున్నప్పటికీ, క్రైస్తవులుగా ఉండటమంటే కేవలం వారానికొకసారి చర్చికి వెళ్లడం మాత్రమే కాదని నమ్మేది. దేవుడు కేవలం ఒకే నిజమైన చర్చిని మాత్రమే కలిగివుంటాడని కూడా ఆమె అనుకునేది.

బైబిలు సత్యం యెడల మెప్పు

నాకు ఐదేళ్లున్నప్పుడు, 1918లో, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సంస్థ మొదటి అధ్యక్షుడైన చార్లస్‌ టి. రసెల్‌ వ్రాసిన స్టడీస్‌ ఇన్‌ ది స్క్రిప్చర్స్‌ అనే సంపుటలను అమ్మ సంపాదించింది. కొన్ని సంవత్సరాల తరువాత, విగ్‌మార్‌ అనే చిన్న ప్రాంతంలో నివసిస్తుండగా, అప్పట్లో బైబిలు విద్యార్థులు అని పిలువబడుతున్న యెహోవాసాక్షులలో ఒకరు అమ్మను కలిశారు. ది హార్ప్‌ ఆఫ్‌ గాడ్‌ అనే బైబిలు పఠన సహాయక పుస్తకాన్ని ఆమె తీసుకుని, తనకున్న అనేక బైబిలు ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడం ప్రారంభించింది. ప్రతి వారం, ప్రతి అధ్యాయం నుండి ప్రశ్నలు ముద్రించబడిన ఒక గులాబి రంగు కార్డు పోస్టుద్వారా వచ్చేది. ఆ ప్రశ్నలకు సమాధానాలు పుస్తకంలో ఎక్కడ కనుగొనవచ్చో కూడా ఆ కార్డు చూపించేది.

చర్చి రాజకీయాలలో పాల్గొంటున్నందున, అలాగే దాని అనేక కారణరహితమైన బోధల వల్ల అసహ్యం ఏర్పడి 1926లో మా తల్లిదండ్రులు, నేను, నా చెల్లి బెరిల్‌ ఆంగ్లికన్‌ చర్చికి హాజరుకావడం మానివేశాము. ప్రముఖ బోధ ఏమిటంటే, దేవుడు ప్రజలను నరకాగ్నిలో నిత్యమూ హింసిస్తాడన్నది. నిజంగా బైబిలు సత్యం కొరకు వెదుకుతున్న మా అమ్మ, ఆంగ్లికన్‌ చర్చి నిజమైనది కాదని అంగీకరించింది.

తరువాత కొంతకాలానికి, అమ్మ యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థనలకు జవాబుగా, ఒక బైబిలు విద్యార్థి, శ్రీమతి. జాక్‌సన్‌ మమ్మల్ని దర్శించారు. మా ప్రశ్నలకు బైబిలు నుండి సమాధానాలిస్తూ, ఆమె నాతో మా అమ్మతో దాదాపు రెండు గంటలు మాట్లాడింది. అనేక ఇతర విషయాలతోపాటు, నిగూఢమైన త్రిత్వానికి బదులు యేసుక్రీస్తు తండ్రియైన యెహోవా దేవునికి మనం ప్రార్థించాలని తెలుసుకొనుటలో మేమానందించాం. (కీర్తన 83:18; యోహాను 20:17) కాని నేను అసలు మరిచిపోలేని ప్రశ్నేమిటంటే, మా అమ్మ అడిగిన ఈ ప్రశ్నే: “రాజ్యమును మొదట వెదకటమంటే దాని భావమేమిటి?”—మత్తయి 6:33.

బైబిలు ఆధారిత జవాబు మా జీవితాలను చాలా ప్రభావితం చేసింది. ఆ వారం నుండే మేము బైబిలు విద్యార్థుల కూటాలకు హాజరవ్వడం, మేము నేర్చుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవడం ప్రారంభించాము. కొన్ని నెలల తరువాత, 1927లో యెహోవాను సేవించటానికి తన సమర్పణకు సూచనగా మా అమ్మ బాప్తిస్మం తీసుకుంది, నేను కూడా 1930లో బాప్తిస్మం తీసుకున్నాను.

పయినీరు సేవలో ప్రవేశించడం

దాదాపు 25 మంది వ్యక్తులతో కూడిన గిల్లింగ్‌హామ్‌ సంఘానికి మా కుటుంబం హాజరయ్యేది. అనేకమంది పయినీర్లు అని పిలువబడే పూర్తికాల పరిచారకులుగా ఉన్నారు, అందరికీ పరలోక నిరీక్షణ ఉంది. (ఫిలిప్పీయులు 3:14, 20) వారి క్రైస్తవ ఆసక్తి ఇతరులకు సోకేలా ఉండేది. బెల్జియంలో 1930వ దశకంలో నేను ఇంకా యౌవనదశలో ఉండగానే, కొంతకాలం పయినీరు సేవ చేశాను. ఇంకా ఎక్కువ రాజ్య పరిచర్య చేయుటకు ఇది నన్ను ప్రేరేపించింది. ఆ సమయంలో మేము, ది కింగ్‌డమ్‌, ది హోప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అనే చిన్న పుస్తకాన్ని ప్రతి మతనాయకునికి పంచిపెట్టాము.

కొంతకాలానికి మా నాన్న మా క్రైస్తవ పరిచర్యను చాలా వ్యతిరేకించడం మొదలు పెట్టాడు, అందువల్ల, నేను కాలేజీకి వెళ్లటానికి 1932లో లండన్‌కు వెళ్లాను. తరువాత నేను నాలుగు సంవత్సరాలు బడిలో బోధించాను అప్పుడు, ఆ సమయంలో లండన్‌లో ఉన్న నాలుగు సంఘాలలో ఒకటైన బ్లాక్‌హెత్‌ సంఘానికి నేను హాజరయ్యేదాన్ని. అప్పుడే, హిట్లరు యుద్ధ ప్రయత్నాలకు మద్దతు నివ్వడానికి నిరాకరించినందుకై మా క్రైస్తవ సహోదర సహోదరీలు బంధించబడి, హింసింపబడటాన్ని గూర్చిన నివేదికలు వినిపించడం మొదలయ్యాయి.

నేను తీసుకున్న పుస్తకాల అప్పును తీర్చేసిన ఆ నెలలో, 1938లో నేను పయినీరునవ్వాలనే నా కోరికను తీర్చుకొనుటకు ఉద్యోగం మానేసాను. అదే సమయంలో నా చెల్లి లండన్‌లో పయినీరు సేవ ప్రారంభించింది, కాని ఆమె వేరే పయినీరు గృహంలో ఉండేది. ఇప్పుడు యెహోవాసాక్షుల పరిపాలకసభ సభ్యుడుగా ఉన్న జాన్‌ బార్‌ను ఆ తరువాత వివాహం చేసుకున్న మిల్‌డ్రెడ్‌ విల్లెట్‌ నా మొదటి పయినీరు భాగస్వామిగా ఉండేది. మా గుంపులో ఉన్న ఇతరులతోపాటు మేము ప్రాంతీయసేవకు సైకిళ్లపై వెళ్లి, వర్షం పడుతున్నాగాని, దినమంతా అక్కడే గడిపేవారము.

అప్పటికే యుద్ధ మేఘాలు యూరపుపై అలుముకుంటున్నాయి. యుద్ధ కారణంగా, పౌరులకు గాస్‌మాస్క్‌ డ్రిల్లులు చేయించడం, పిల్లలను నగరాలనుండి దూరంగా లేక చిన్న పట్టణాలకు తీసుకువెళ్లడం వంటివి మొదలుపెట్టారు. నా దగ్గర ఒక జత బూట్లు కొనటానికి మాత్రమే సరిపోయేంత డబ్బు ఉంది, మా తలిదండ్రుల వద్ద నుండి కూడా ఆర్థిక సహాయం వచ్చే అవకాశం లేదు. కాని యేసు ‘మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును’ అని చెప్పలేదా? (మత్తయి 6:33) నా అవసరతలన్నీ యెహోవా తీర్చగలడన్న పూర్తి నమ్మకం నాకుంది, అలాగే ఈ సంవత్సరాలన్నిటిలో ఆయన ఎంతో పుష్కలంగా దయచేశాడు. యుద్ధకాలంలో కొన్నిసార్లు, దారిలో వెళుతున్న ట్రక్కులలో నుండి పడిపోయిన కూరగాయలను ఏరుకుని వాటిని ఇచ్చి, వాటికి బదులుగా నాకు కావలసిన ఆహారాన్ని తెచ్చుకుని గడిపేదాన్ని. అనేకసార్లు బైబిలు సాహిత్యమిచ్చి బదులుగా పండ్లు, కూరగాయలు తీసుకుని నేను ఆహారం సంపాదించుకునేదాన్ని.

మా చెల్లి సోనియా 1928లో జన్మించింది. ఆమె ఏడు సంవత్సరాల వయస్సులోనే తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుంది. ఆ చిన్న వయస్సులోనే పయినీరుసేవే తన లక్ష్యమని సోనియా చెబుతుంది. నీటి బాప్తిస్మం ద్వారా సమర్పించుకున్న వెంటనే 1941లో ఆమె, మా అమ్మ సౌత్‌వేల్స్‌ నందలి కార్‌ఫిలేకు పయినీర్లుగా నియమింపబడటంతో ఆమె తన లక్ష్యాన్ని సాధించింది.

యుద్ధ సంవత్సరాలలో మా పరిచర్య

రెండవ ప్రపంచ యుద్ధం సెప్టెంబరు 1939లో ప్రారంభమయ్యింది, వారితోటి విశ్వాసులు నాజీ జర్మనీలో ఏ కారణానికి బంధింపబడ్డారో అదే కారణం, అంటే యుద్ధంలో పాల్గొనడం విషయంలో తమ తటస్థ వైఖరిని బట్టి బ్రిటన్‌లోవున్న మా క్రైస్తవ సహోదర సహోదరీలు కూడా బంధింపబడ్డారు. ఇంగ్లాండు మీద బాంబులు వేయడం 1940 మధ్యభాగంలో మొదలైంది. ప్రతీ రాత్రి యుద్ధసన్నాహం చెవులు చిల్లులు పడే శబ్దంతో ఉండేది, కాని యెహోవా సహాయంతో మేము కొంతసేపు నిద్రపోయి, మరునాడు ప్రకటన పనికి వెళ్లటానికి ఉత్సాహంగా తయారయ్యేవారము.

కొన్నిసార్లు మేము ప్రకటించే ప్రాంతానికి వెళ్లేసరికి అక్కడ అనేక గృహాలు శిథిలాలుగా మిగిలి ఉండేవి. నవంబరు నెలలో, అనేకమందిమి నివసిస్తున్న మా ఇంటికి కొన్ని గజాల దూరంలోనే ఒక బాంబు పడటంతో, కిటికీలు వెయ్యి ముక్కలయ్యాయి. బరువైన ప్రధానద్వారపు తలుపు విరిగిపోయింది, పొగగొట్టం పడిపోయింది. ఆ మిగిలిన రాత్రి ఒక విమాన-దాడి పరిరక్షక గదిలో గడిపిన తరువాత, మేము విడిపోయి, వేరువేరు సాక్షుల ఇళ్లలో నివసించటానికి వెళ్లిపోయాము.

తరువాత కొంతకాలానికి గ్రేట్‌ లండన్‌ నందలి క్రాయ్‌డాన్‌కు నేను నియమింపబడ్డాను. నా పయినీరు భాగస్వామి ఆన్‌ పార్కిన్‌, ఆమె తమ్ముడు రాన్‌ పార్కిన్‌ తరువాత ప్యూర్టోరికో బ్రాంచి కమిటీలో కోఆర్డినేటర్‌ అయ్యాడు. తరువాత నేను సౌత్‌వేల్స్‌ నందలి బ్రిడ్జెండ్‌కు వెళ్లి, అక్కడ పయినీరు సేవ చేస్తూ, ఆరు నెలలు గుర్రం లాగే వ్యానులో నివసించాను. అక్కడి నుండి మేము సమీపంలో పోర్ట్‌ టాల్‌బెట్‌లో ఉన్న పెద్ద సంఘానికి ఆరు కిలోమీటర్లు సైకిళ్లపై వెళ్లేవారము.

ఈ సమయానికి మమ్మల్ని కన్‌చెజ్‌ (వ్యతిరేకించదగినవారు) అని పిలుస్తూ, ప్రజలు మాకు చాలావరకు శత్రువులయ్యారు. దీనితో మాకు వసతి కనుగొనటం కష్టమైంది కాని యెహోవా వాగ్దానం చేసినట్లు ఆయన మా యెడల శ్రద్ధ వహించాడు.

తరువాత, సౌత్‌వేల్స్‌లోని ఒక ఓడరేవు పట్టణమైన స్వాన్‌సీకి మేము ఎనిమిది మందిమి ప్రత్యేక పయినీర్లుగా నియమింపబడ్డాము. యుద్ధం తీవ్రతరం అవుతుండగా, మా యెడల దురభిమానం పెరిగిపోయింది. “ఎలుకలు,” “పిరికివారు” అనే పదాలను మా పయినీరు గృహం గోడపై వ్రాశారు. మా తటస్థ వైఖరిని బట్టి మమ్మల్ని నిందించిన వార్తాపత్రికల నివేదికలతో ప్రాముఖ్యంగా ఈ విరోధం పెరిగిపోయింది. చివరికి, ఒకరి తరువాత ఒకరంగా మేము ఏడుగురం చెరసాలకు పంపబడ్డాము. నేను 1942లో కార్డిఫ్‌ జైలులో ఒక నెల గడిపాను, తరువాత నా చెల్లి బెరిల్‌ కూడా అక్కడ కొంతకాలం గడిపింది. మేము వస్తుదాయకంగా బాధపడి, అవమానం, నింద ఎదుర్కొన్నప్పటికీ, మేము ఆత్మీయంగా సంపన్నంగానే ఉన్నాము.

ఈ మధ్యలో అమ్మ, సోనియా కార్‌ఫిలేలో పయినీరు సేవ చేస్తూ అలాంటి అనుభవాలనే పొందారు. సోనియా నిర్వహించిన మొదటి బైబిలు పఠనాన్ని ఆమె ఒక స్త్రీతో శుక్రవారం సాయంకాలం ఏర్పాటు చేసుకుంది. అమ్మ తనతో వస్తుందని సోనియా ధైర్యంగా ఉంది, కాని అమ్మ ఇలా వివరించింది: “నాకు మరో పని ఉంది. నీవు ఏర్పాటు చేసుకున్నావు గనుక నీవు ఒంటరిగా వెళ్లవలసిందే.” సోనియా 13 సంవత్సరాల వయస్సుదే అయినప్పటికీ, ఆమె తాను ఒకతే వెళ్లింది, ఆ స్త్రీ ఆత్మీయంగా బాగా అభివృద్ధి చెంది తరువాత సమర్పించుకొన్న సాక్షి అయ్యింది.

యుద్ధానంతర పరిచర్య—తరువాత గిలియడ్‌

రెండవ ప్రపంచ యుద్ధం 1945లో ముగిసినప్పుడు, డెర్బిషైర్‌ నందలి హ్వాలే బ్రిడ్జి అనే ఊరికి సుదూరంగా ఉన్న ప్రాంతంలో నేను పనిచేస్తున్నాను. యుద్ధ విరమణను ప్రకటించిన ఉదయాన, యుద్ధం వల్ల తయారైన అనాధలు, విధవలు, అంగవైకల్యమైన శరీరాలతో పూర్తిగా విసిగిపోయివున్న ప్రజలను మేము దర్శించి, ఓదార్చాము.

కొన్ని నెలల తరువాత, ఎమరాల్డ్‌ ద్వీపమందలి ఐర్లాండ్‌లో ప్రకటించటానికి స్వచ్ఛంద సేవకులు కావాలని సంస్థ అడిగింది. ఆ సమయంలో ఆ ద్వీపంలో కేవలం 140 మంది యెహోవాసాక్షులే ఉన్నారు గనుక దాన్ని మిషనరీ ప్రాంతంగా పరిగణించారు. కొన్ని నెలల్లోనే, అక్కడికి దాదాపు 40 మంది పయినీర్లు నియమింపబడ్డారు, వారిలో నేనొకరిని.

ఉత్తరాన కొలెరైన్‌, కుక్స్‌టౌన్‌లలో కొంతకాలం పనిచేసిన తరువాత, మరి ఇతర ముగ్గురితోపాటు నేను తూర్పుతీరం వద్దనున్న డ్రోగెడాకు నియమింపబడ్డాను. ఐర్లాండ్‌ ప్రజలు స్వతహాగా ప్రేమగలవారు, అతిథి సత్కారులు అయినప్పటికీ వారు మతపరంగా మహా దురభిమానం గలవారు. కాబట్టి, మొత్తం ఒక సంవత్సరమంతటిలో మేము కేవలం కొన్ని బైబిలు పఠన పుస్తకాలనే (నిజానికి కేవలం ఒక పుస్తకం, కొన్ని చిన్నపుస్తకాలు) అందజేయగలిగాము.

మేము డ్రోగెడాలో ఉన్నప్పుడు, నేను ఒక పొలం నుండి మరో పొలానికి సైకిలుపై వెళ్తుండగా, పొలంలో పని చేసే ఓ కుర్రాడు హఠాత్తుగా కంచెలోనుండి రోడ్డుపైకి వచ్చాడు. అటు ఇటు రోడ్డును చూసి మెల్లిగా ఇలా అడిగాడు: “మీరు యెహోవాసాక్షులలో ఒకరా?” అవునని నేను జవాబిచ్చినప్పుడు, అతడిలా కొనసాగించాడు: “మీ గురించి గత రాత్రి నా కాబోయే భార్యతో నేను తీవ్రంగా వాదించాను, అందుకు మేము విడిపోయాము. కాథోలిక్‌ మతగురువులు, వార్తాపత్రికలు అన్నట్లు మీరు కమ్యూనిస్టులని ఆమె నొక్కిచెప్పింది, కాని మీరు బహిరంగంగా ఇంటింటికి వెళతారు గనుక అది నిజమైవుండదని నేను ఆమెతో వాదించాను.”

చదవటానికి నేను అతనికి ఒక చిన్నపుస్తకాన్ని ఇచ్చాను, దాన్ని అతను జేబులో దాచుకున్నాడు, “నేను మీతో మాట్లాడుతున్నట్లు ఎవరైనా చూస్తే, నా ఉద్యోగం పోతుంది” అని అతడు చెప్పాడు కాబట్టి, చీకటిపడిన తరువాత మళ్లీ కలుసుకొని ఇంకా ఎక్కువ మాట్లాడుకోవటానికి మేము ఏర్పాటు చేసుకున్నాము. ఆ రాత్రి మేమిద్దరం అతన్ని కలిసి, అతనికున్న అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చాము. ఇది సత్యమని అతను గ్రహించినట్లు కనిపించింది, ఇంకా ఎక్కువ నేర్చుకోటానికి మరో రాత్రి మా ఇంటికి వస్తానని అతడు వాగ్దానం చేశాడు. అతడు మళ్లీ ఎన్నడూ రాలేదు, ఆ మొదటిరోజు రాత్రి అతన్ని ఆ దారిన సైకిలుపై వెళ్లుతున్నవారు ఎవరైనా గుర్తించారేమో, దానితో బహుశా అతను తన ఉద్యోగం కోల్పోయివుండవచ్చు అని మేమనుకున్నాం. అతనసలు సాక్షి అయ్యాడా అని మేము తరచూ అనుకునేవాళ్లము.

ఇంగ్లాండ్‌ దక్షిణ తీరంలోనున్న బ్రింగ్‌టన్‌లో జిల్లా సమావేశానికి హాజరైన తరువాత 1949లో న్యూయార్క్‌ రాష్ట్రంలో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు మేము అనేకమందిమి ఆహ్వానాన్నందుకున్నాము. బ్రిటన్‌ నుండి మొత్తం 26 మంది 15వ గిలియడ్‌ క్లాస్‌కు హాజరయ్యారు, వారు 1950 జూలై 30న యాంకీ స్టేడియంలోని అంతర్జాతీయ సమావేశంలో పట్టభద్రులయ్యారు.

బ్రెజిల్‌లో మా పరిచర్య

తరువాతి సంవత్సరం నేను ప్రపంచంలోని త్వరగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటైన బ్రెజిల్‌ నందలి సావొ పౌలోకు నియమింపబడ్డాను. ఆ సమయంలో అక్కడ యెహోవాసాక్షుల సంఘాలు కేవలం ఐదే ఉన్నాయి, కాని ఇప్పుడు దాదాపు 600 ఉన్నాయి! ఐర్లాండ్‌లో పనిచేయటానికి ఇక్కడికి ఎంత వ్యత్యాసం! సావొ పౌలోలోని మేమున్న ప్రాంతంలోని అనేక ఇళ్లు ఎత్తైన ఇనుప ప్రహరీలతో, దుక్క ఇనుముతో చేయబడిన గేట్లతో వున్న భవనాలే. ఇంటి యజమానిని లేదా పనిమనిషిని పిలవాలంటే, మేము చప్పట్లుకొట్టి పిలిచేవారము.

సంవత్సరాలు గడుస్తుండగా, కొత్త నియామకాలు వచ్చేవి. జుండియాలో 1955లో, మరొకటి 1958లో పిరెసెకాబెలో ఇలా సావొ పౌలో రాష్ట్రంలోని అనేక స్థలాల్లో కొత్త సంఘాలను స్థాపించటానికి సహాయం చేసే ఆధిక్యతను నేను పొందాను. తరువాత 1960లో మా చెల్లి సోనియా నా మిషనరీ భాగస్వామి అయ్యింది, మేము రాయో గ్రాండె డొ సుల్‌ రాష్ట్ర ముఖ్య పట్టణమైన పోర్టో అలెగ్రీకి నియమించబడ్డాము. ఆమె బ్రెజిల్‌కు ఎలా వచ్చిందని మీరనుకోవచ్చు.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సోనియా, అమ్మ ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్‌లో పయినీరు సేవ చేశారు. కాని 1950వ దశక తొలిభాగంలో, అమ్మకు క్యాన్సరు శస్త్రచికిత్స జరగడంతో ఆమె ఇంటింటికి వెళ్లలేనంత బలహీనమైంది, అయినా ఆమె బైబిలు పఠనాలు నిర్వహించడం, ఉత్తరాలు వ్రాయడం వంటివి చేయగలిగేది. సోనియా పయినీరు సేవలో కొనసాగింది, అదే సమయంలో ఆమె అమ్మను చూసుకునేది. సోనియా 1959లో 33వ గిలియడ్‌ తరగతికి హాజరయ్యే ఆధిక్యతనుపొంది, బ్రెజిల్‌కు నియమింపబడింది. ఈ మధ్యలో, 1962లో అమ్మ చనిపోయే వరకు ఆమెను బెరిల్‌ చూసుకునేది. అప్పటికి బెరిల్‌కు వివాహం అయ్యింది, ఆమె, ఆమె కుటుంబము విశ్వాసంగా యెహోవాకు సేవ చేస్తున్నారు.

బ్రెజిల్‌లో, సోనియా నేను అనేకమందికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకొనుటకు సహాయం చేశాము. అయితే, అనేకమంది బ్రెజిల్‌ నివాసులకున్న ఒక సమస్యేమిటంటే తమ వివాహాలను చట్టబద్ధం చేసుకోవడమే. బ్రెజిల్‌లో విడాకులు తీసుకోవడంలోవున్న కష్టం కారణంగా, జంటలు వివాహం చేసుకోకుండానే కలిసి జీవించడం సర్వసాధారణం. జంటలో ఒకరు మునుపటి చట్టబద్దమైన వివాహజత నుండి వేరైనప్పుడు ముఖ్యంగా ఇలా జరిగేది.

నేను మొదటిసారి ఆమెను కలిసినప్పుడు ఇవా అనే స్త్రీ అదే పరిస్థితిలో ఉంది. ఆమె భర్త ఆమెను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు, అందుకని అతని కొరకు మేము రేడియోలో ప్రకటన చేయించాము. ఆమె భర్తను కనుగొనినప్పుడు, ఆమె ఇప్పుడు కలిసి జీవిస్తున్న అవివాహిత వ్యక్తితో తన సంబంధాన్ని చట్టబద్ధం చేసుకొనుటకు ఉపయోగపడే ఒక పత్రం మీద అతని సంతకం తీసుకోవడానికి నేను ఆమెతో పాటు మరో నగరానికి వెళ్లాము. జడ్జి ఎదుట వాదన సమయంలో ఆయన, తన వివాహ పరిస్థితిని ఆమె ఎందుకు సరిచేసుకోవాలను కుంటుందో వివరించమని నన్ను, ఇవాను అడిగాడు. అది మేము వివరించినప్పుడు, జడ్జి ఆశ్చర్యాన్ని, సంతృప్తిని వ్యక్తపర్చాడు.

మరో సందర్భంలో, నా బైబిలు విద్యార్థులలో ఒకరి కేసును విచారించడానికి ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయటానికి నేను ఆమెతో కలిసి వెళ్లాను. వివాహం, దేవుని నైతిక కట్టడల గురించి మరోసారి మంచి సాక్ష్యం ఇవ్వబడింది. ఈ కేసులో విడాకుల రేటు ఎంత ఎక్కువగా ఉండేదంటే ఆ ఫీజును కట్టడానికి ఇద్దరూ పనిచేయాలి. ఈ కొత్త బైబిలు విద్యార్థులకు అది వారి కష్టానికి తగిన ఫలితాన్నిచ్చేది. వారి వివాహానికి సాక్షులుగా ఉండే ఆధిక్యత నాకు, సోనియాకు లభించింది, దాని తరువాత, వారి ముగ్గురు యౌవన పిల్లలతోపాటు మేము కూడా వారి ఇంట్లో ఒక చిన్న బైబిలు ప్రసంగాన్ని విన్నాము.

ఒక ఉత్తమ, ఫలవంతమైన జీవితం

యెహోవాకు మా జీవితాలను సమర్పించుకొని పయినీర్లమైనప్పుడు నేను సోనియా, సాధ్యమైతే పూర్తికాల పరిచర్య మా జీవిత లక్ష్యం కావాలని కోరుకున్నాము. మా తరువాతి సంవత్సరాల్లో లేక అనారోగ్య సమయంలోగాని లేక ఆర్థికపరమైన కష్టాలలోగాని ఏం జరుగుతుంది అనే విషయానికి మేము ఎన్నడూ ఎక్కువ శ్రద్ధ నివ్వలేదు. అయినా యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు, మేమెన్నడూ విడిచిపెట్టబడలేదు.—హెబ్రీయులు 13:6.

అవును, కొన్నిసార్లు డబ్బు లేకపోవడం సమస్యగా ఉండేది. ఒకసారి, నా భాగస్వామి నేను ఒక సంవత్సరమంతా భోజనంగా కొత్తిమీర వంటి కూరాకు, శ్యాండ్‌విచ్‌నే తిన్నాము కాని, మేము ఆకలితో మాత్రం ఎన్నడూ ఉండలేదు, లేక మా కనీస అవసరతలు తీరకుండా ఉండలేదు.

సంవత్సరాలు గడుస్తుండగా, మా శక్తులు కూడా అలాగే ఉడిగిపోయాయి. మాకిద్దరికీ, 1980వ దశక మధ్యభాగంలో పెద్ద శస్త్రచికిత్సలు జరగడంతో మా సేవకు అవాంతరమేర్పడింది గనుక అది మాకు తీవ్రమైన శ్రమ. జనవరి 1987లో, బ్రెజిల్‌లో వున్న యెహోవాసాక్షుల కేంద్రకార్యాలయ సభ్యులుగా ఉండటానికి మమ్మల్ని ఆహ్వానించారు.

ఒక వెయ్యికంటే ఎక్కువమంది పరిచారకులుగల మా పెద్ద కుటుంబం, సావొ పౌలోకు దాదాపు 140 కిలోమీటర్ల వెలుపలవున్న అందమైన భవనాలలో ఉన్నది, మేము బ్రెజిల్‌, దక్షిణమెరికాలోని ఇతర భాగాల కొరకు బైబిలు సాహిత్యాన్ని ఇక్కడే ముద్రిస్తున్నాము. ఇక్కడ మేము సమర్పిత దేవుని సేవకుల నుండి ప్రేమపూర్వకమైన శ్రద్ధను పొందుతున్నాము. నేను 1951లో మొదటిసారి బ్రెజిల్‌కు వచ్చినప్పుడు, అక్కడ దాదాపు 4,000 మంది రాజ్య సమాచార ప్రచారకులున్నారు, కాని ఇప్పుడు 3,66,000 కంటే ఎక్కువమంది ఉన్నారు! మేము రాజ్యమును మొదట వెదికాము గనుక మా ప్రేమగల పరలోకపు తండ్రి నిజంగా ‘ఇతర అన్ని విషయాలు’ మాకిచ్చాడు.—మత్తయి 6:33.

[22వ పేజీలోని చిత్రం]

ఒక సమాచార బండి ప్రక్కన మిల్‌డ్రెడ్‌ విల్లెట్‌తోపాటు ఆలివ్‌ 1939

[25వ పేజీలోని చిత్రం]

ఆలివ్‌ మరియు సోనియా స్ప్రింగేట్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి