నా జీవితంతో చేయగల శ్రేష్ఠమైన పని
బాబ్ ఆండర్సన్ చెప్పినట్లు
దాదాపు పది సంవత్సరాల క్రితం, కొందరు స్నేహితులు నన్ను ఇలా అడిగారు: “మీరు ఎంతోకాలం పయినీర్‌గా ఎందుకు కొనసాగారు, బాబ్?” నేను నవ్వి ఇలా అన్నాను, “సరే, పయినీరింగ్ కన్నా శ్రేష్ఠమైనది చేయడానికేమైనా ఉందని మీరు తలంచగలరా?”
నేను 1931లో పయినీర్ సేవలో చేరినప్పుడు, నాకు 23 ఏండ్లు. నేను ఇప్పుడు నా 87వ ఏట ఉన్నాను, ఇప్పటికీ పయినీరింగ్ చేస్తున్నాను. నా జీవితంతో మరి శ్రేష్ఠమైన దేనిని చేసి ఉండేవాన్ని కానని నాకు తెలుసు. ఎందుకో నన్ను వివరించనీయండి.
పందొమ్మిది వందల పద్నాలుగులో మా ఇంట్లో ఒక కరపత్రం వేయబడింది. అప్పట్లో అంతర్జాతీయ బైబిలు విద్యార్థులు అని పిలువబడిన యెహోవాసాక్షులు దానిని ప్రచురించారు. ఆ సాక్షి తిరిగి వచ్చినప్పుడు, మా అమ్మ అతనిని నరకాగ్ని గురించి అత్యంత ఆసక్తితో అడిగింది. ఆమె ఒక నిష్ఠగల వెస్లియన్ మెథడిస్ట్‌గా పెరిగింది, కాని ప్రేమగల దేవుడు నిత్య యాతన పెడతాడనే సిద్ధాంతంతో ఆమె ఎన్నడూ రాజీపడలేకపోయింది. ఈ విషయాన్ని గూర్చిన సత్యాన్ని ఆమె నేర్చుకున్న వెంటనే, “నా జీవితంలో నేనెన్నడూ అనుభవించనంత సంతోషాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను!” అని ఆమె చెప్పింది.
మా అమ్మ మెథడిస్ట్ సండే స్కూల్లో బోధించడాన్ని వెంటనే మానేసి, బైబిలు విద్యార్థుల చిన్న గుంపులో చేరింది. ఆమె మెర్సీ నదికవతల ఉన్న లివర్‌పూల్ ఓడరేవుకు ఎదురుగా ఉన్న మా స్వంత ఊరైన బిర్కెన్హెడ్లో ప్రకటించనారంభించింది. త్వరలోనే సైకిల్ మీద అనేక పొరుగు పట్టణాలకు వెళ్ళింది. ఆమె తన పిల్లలకు మంచి మాదిరినుంచుతూ, ఈ విస్తృతమైన ప్రాంతంలో తన శేషజీవితమంతా సాక్ష్యమిచ్చి ప్రఖ్యాతి గాంచింది. చివరి వరకు ఒక చురుకైన సాక్షిగా ఉండి, ఆమె తన పండు ముసలితనంలో అంటే తన 97వ ఏట 1971లో మరణించింది.
నేను, నా అక్క కాథ్లీన్ బైబిలు విద్యార్థుల కూటాలకు అమ్మతో పాటు వెళ్ళేందుకు మెథడిస్ట్ సండే స్కూల్ నుండి తీసుకువెళ్ళబడ్డాము. తర్వాత, మా నాన్న కూడా వచ్చినప్పుడు, మా తల్లిదండ్రులు దేవుని వీణ (ఆంగ్లం) అనే పుస్తకం నుండి క్రమమైన కుటుంబ పఠనాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో అలాంటి పఠనమనేది క్రొత్త విషయము. కాని బైబిలు ఆధారిత సత్యాలను చిన్నతనంలోనే నేర్పడం ఒక గొప్ప ప్రతిఫలాన్నిచ్చింది, ఎందుకంటే ఈ కారణంగానే కొంత కాలం తర్వాత నేను, నా అక్క పయినీరు సేవలో ప్రవేశించాము.
మేము 1920లో లివర్‌పూల్‌లో “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్‌ను” చూడడం పిల్లలమైన మాకు ఆత్మీయంగా ఒక పెద్ద మలుపు అనే అభిప్రాయం మా అమ్మకుండేది, ఆమె అనుకున్నది నిజమే. నేను చిన్నవాన్ని అయినప్పటికీ, ఆ ప్రదర్శన నా మనస్సుపై చెరగని ముద్రలను వేసింది. యేసు జీవితాన్ని చిత్రీకరించే భాగం, ముఖ్యంగా అది అది చూపినట్లుగా, మరణించేందుకు యేసు నడిచి వెళ్ళడం నా జ్ఞాపకాల్లో మిగిలి ఉంది. ఆ అనుభవమంతా జీవితంలో అతి ముఖ్యమైన పని—ప్రకటనా పని—మీద శ్రద్ధ కేంద్రీకరించడానికి నాకు తోడ్పడింది!
పందొమ్మిది వందల ఇరవైయవ పడి ఆరంభంలో, నేను మా అమ్మతో పాటు ఆదివారం మధ్యాహ్నాల్లో కరపత్రాలను పంచిపెట్టడం మొదలుపెట్టాను. వాటిని ఇండ్లలో వేయాలని మొదట్లో మాకు నిర్దేశించబడింది; వాటిని గృహస్థుల చేతికి అందించాలని, మరియు ఆసక్తిగల వారి దగ్గరికి తిరిగి వెళ్ళాలని మాతో తర్వాత చెప్పబడింది. నేడు ఎంతో ఫలవంతంగా ఉన్న పునర్దర్శన మరియు బైబిలు పఠన కార్యక్రమానికి అది తొలి పునాదియని నేను ఎల్లప్పుడూ దృష్టించాను.
పయినీరు సేవలోనికి!
నేను, కాథ్లీన్ 1927లో బాప్తిస్మం పొందాము. యెహోవాసాక్షులు అనే పేరును పెట్టుకోవాలనే ప్రతిపాదన 1931లో నేను విన్నప్పుడు, లివర్‌పూల్‌లో అనలిటికల్ కెమిస్ట్‌గా పనిచేస్తున్నాను. లివర్‌పూల్‌లోని వ్యాపార సంస్థలో పరిచర్య చేస్తున్న కాల్పోర్టర్స్ (ఇప్పుడు పయినీర్లని పిలువబడుతున్నారు) నాకు తరచూ కనిపించేవారు, వారి మాదిరి నన్ను ఎంతో ప్రభావితం చేసింది. యెహోవా సేవలో నా జీవితాన్ని గడపాలని, లోక సహవాసం నుండి స్వతంత్రుడనవ్వాలని నేను ఎంత ఎక్కువగా వాంఛించానో!
అదే సంవత్సరం, వేసవి కాలంలో నా స్నేహితుడైన జెర్రీ గెరార్డ్ ఇండియాలో ప్రకటించాలని వాచ్‌టవర్ సొసైటీ రెండవ అధ్యక్షుడు జోసఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్ నుండి తనకు వచ్చిన నియామకాన్ని స్వీకరించానని నాతో చెప్పాడు. సముద్రయానం చేయడానికి కొంచెం ముందు, ఆయన వచ్చి నన్ను కలిసి, పూర్తికాల సేవయనే ఆధిక్యతను గూర్చి మాట్లాడాడు. ఆయన గుడ్‌బై చెబుతూ, ఇంకా ఇలా అంటూ ఆయన నన్ను ప్రోత్సహించాడు, “నువ్వు త్వరలో, పయినీరు అవుతావని నాకు నిశ్చయమే, బాబ్.” అది అలాగే జరిగింది. నేను ఆ అక్టోబరులో పయినీరు జాబితాలో చేరాను. గ్రామంలోని సందుల్లో గుండా సైకిల్ తొక్కి, మారు మూల సమాజాల్లో ప్రకటించడంలో ఎంత సంతోషం, ఎంత స్వేచ్ఛ! నేను ఎన్నడూ చేయలేనంతటి అతి ప్రాముఖ్యమైన పనిని ఆరంభించబోతున్నానని అప్పుడు నాకు తెలుసు.
సౌత్ వేల్స్లో నా మొదటి పయినీరు నియామకం, అక్కడే నేను సిరల్ స్టెనెటిఫార్డ్ను కలిశాను. తర్వాత సిరిల్ కాథ్లీన్ను పెళ్ళి చేసుకున్నాడు, వారు అనేక సంవత్సరాలు కలిసి పయినీరింగ్ చేశారు. అనంతరం, వారి కూతురు రూత్ కూడా పయినీరు సేవలో ప్రవేశించింది. నేను 1937 నాటికి, ఫ్లీట్వుడ్ లాంకాషెయిర్లో ఉన్నాను—ఎరిక్ కూక్స్ నా భాగస్వామి. ఆ సమయం వరకు, సంఘ ప్రాంతానికి బయట, బ్రిటన్‌లోని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే పయినీర్లు పనిచేశారు. కాని సొసైటీ యొక్క లండన్ బ్రాంచి కార్యాలయ పనికి అప్పట్లో బాధ్యత వహించిన ఆల్బర్ట్ డి ష్క్రోడర్, మేమిరువురము యార్క్‌షైర్‌లోని బ్రాడ్ఫార్డ్కు వెళ్ళాలని తీర్మానం చేశాడు. బ్రిటన్‌లోని పయినీర్లు ఒక ప్రత్యేక సంఘానికి సహాయపడేందుకు నియమించబడడం ఇదే మొదటిసారి.
ఎరిక్ 1946లో వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు వెళ్ళాడు, ఇప్పుడు జింబాబ్వే అయిన దక్షిణ రోడెషియాలో నియమించబడ్డాడు, అతడు, అతని భార్య దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఇప్పటికీ నమ్మకంగా మిషనరీలుగా సేవ చేస్తున్నారు.
నాకు 1938లో మరో నియామకం వచ్చింది, ఈ సారి వాయవ్య లాంకాషెయిర్ మరియు రమణీయమైన లేక్ డిస్ట్రిక్ట్‌లకు జోన్ పరిచారకునిగా (ఇప్పుడు ప్రయాణ కాపరి అని అంటారు) నియమించబడ్డాను. అక్కడ నేను అలివ్ డకెట్‌ను కలిశాను, మేము పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమె ప్రయాణ పనిలో నాతో చేరింది.
యుద్ధ సంవత్సరాల్లో ఐర్లాండ్‌నందు
సెప్టెంబర్ 1939లో బ్రిటన్ జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించిన వెంటనే, నా నియామకం ఐర్లాండ్‌కు మార్చబడింది. బ్రిటన్‌లో అనివార్య సైనిక సేవ ఆరంభమయ్యింది కాని, దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లో అలా జరుగలేదు, అది యుద్ధ సమయంలో తటస్థ రాజ్యంగా ఉండిపోయింది. రిపబ్లిక్ ఐర్లాండ్ మరియు ఉత్తర ఐర్లాండ్, ఒకే మండలం కానున్నాయి. అయితే నిర్బంధాలు అమలులో ఉండేవి, మరి బ్రిటన్ను వదిలిపెట్టి ఐర్లాండ్‌లోని ఏ భాగానికి వెళ్ళాలన్నా ప్రయాణ అనుమతిని పొందవలసిన అవసరత కూడా ఉండేది. నేను వెళ్ళగలను కాని, నేను అనివార్య సైనిక సేవచేసే వయస్సు గల వారి గుంపు పిలువబడిన వెంటనే తిరిగి ఇంగ్లాండ్‌కు రావాలని అధికారులు చెప్పారు. నేను నోటిమాటతో ఒప్పుకున్నాను, కాని ఆశ్చర్యం కలిగేటట్లు, నాకు అనుమతి పత్రం లభించినప్పుడు, అందులో ఏ షరతులు లేవు!
ఆ సమయంలో, ఐర్లాండంతటిలో కేవలం 100 కంటే ఎక్కువ మంది సాక్షులే ఉన్నారు. మేము నవంబరు 1939లో డూబ్లిన్ చేరుకున్నప్పుడు, ఎంతోకాలంగా పయినీరింగ్ చేస్తున్న జాక్ కార్ మమ్మల్ని కలిశాడు. సమీపంలో ఉన్న ఒక నగరంలో మరో ఇద్దరు పయినీర్లు ఉన్నారని, డూబ్లిన్లో ఆసక్తి గల కొందరు, అంతా కలిసి దాదాపు 20 మంది ఉన్నారని ఆయన మాకు చెప్పాడు. జాక్ డూబ్లిన్లో కూటం కొరకు ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు, అక్కడ అందరు క్రమంగా ప్రతి ఆదివారం కూడుకుంటామని ఒప్పుకున్నారు. ఈ ఏర్పాటు 1940లో సంఘం స్థాపించబడే వరకు కొనసాగింది.
యునైటెడ్ కింగ్డమ్లో భాగంగా, ఉత్తర ఐర్లాండ్ జర్మనీతో యుద్ధం చేస్తుంది, కాబట్టి మేము ఉత్తరానికి, బెల్ఫాస్ట్కు తరలి వెళ్ళినప్పుడు మాకు ఆహార రేషన్ పుస్తకాలున్నాయి. రాత్రి పూట లైట్లను తీసివేసేవారు. నాజీ విమానాలు బెల్ఫాస్ట్కు చేరుకోడానికి, మరియు తిరిగి ఐరోపాలోని తమ స్థావరాలకు చేరుకోడానికి 1,600 కిలోమీటర్లు ఎగురవలసి ఉన్నప్పటికీ, వారు పట్టణంపై విజయవంతంగా బాంబులు కురిపించారు. జరిగిన మొదటి ముట్టడిలో, మా రాజ్యమందిరం పాడయ్యింది, మరియు పట్టణంలోని మరొక భాగంలో సహోదరులను మేము సందర్శిస్తున్న సమయంలో, మా అపార్ట్మెంట్ ధ్వంసం చేయబడింది, కాబట్టి మేము అద్భుతంగా తప్పించుకున్నాము. అదే రాత్రి, ఒక సాక్షి కుటుంబం ప్రజా రక్షణ స్థావరానికి వెళ్ళింది. వాళ్ళు అక్కడ చేరుకునే సరికి, అది నిండిపోవడం చూసి, తమ ఇంటికి తిరిగి రావలసి వచ్చింది. ఆ స్థావరంపైనే బాంబు వేయబడింది. అందులో ఉన్న వారందరు చంపబడ్డారు, కాని మన సహోదరులు చిన్న గాయములతోను, దెబ్బలతోను తప్పించుకున్నారు. ఈ క్లిష్టమైన యుద్ధ సంవత్సరాల్లో మన సహోదరుల్లో ఒక్కరు కూడా తీవ్రంగా గాయపరచబడలేదు, అందుకు మేము యెహోవాకు కృతజ్ఞతలు తెలిపాము.
ఆత్మీయ ఆహార సరఫరాలు
యుద్ధం తీవ్రమవుతుండగా, నిర్బంధాలు మరింత తీవ్రతరమయ్యాయి, చివరికి ఉత్తరాలను తనిఖీ చేయు నియమం అమలు చేయబడింది. అంటే కావలికోట నిషేధించబడి, దేశంలో ప్రవేశించే అనుమతి లేకుండా పోయింది. మేము ఏమి చేయగలమని ఆలోచించినప్పటికీ, యెహోవా చేయి కురచ కాలేదు. ఒక ఉదయం, కుటుంబ విషయాలను వ్రాసే కెనడాలోని “మా పిన్నికొడుకు” నుండి నాకు ఉత్తరం వచ్చింది. ఆయన ఎవరో నాకు మాత్రం తెలియదు. అయితే ఉత్తరం చివరలో నేను చదువుకోడానికి తాను “ఒక ఆసక్తికరమైన బైబిలు శీర్షికను” పంపుతున్నాడని వ్రాశాడు. అది కావలికోట ప్రతి, దాన్ని మామూలు కవరులో పంపినందువల్ల, ఉత్తరాల తనిఖీదారుడు దానిని తీసి చూడలేదు.
వెంటనే “ఫోటో డ్రామా” పనిలో ఉండిన మాగీ కోపర్తో సహా స్థానిక సాక్షుల సహాయంతో నేను, నా భార్య ఆ శీర్షికల ప్రతులను తీయడం మొదలెట్టాము. కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాల్లోని క్రొత్త స్నేహితులనుండి మామూలు కవరులో కావలికోట పత్రికలు క్రమంగా వస్తుండగా, మేము త్వరలోనే, దేశమంతటా 120 ప్రతులను పంపేలా మాకై మేము సంస్థీకరించుకున్నాము. వారి శ్రద్ధ, దయలవలన ఆ యుద్ధ సమయమంతటిలోను మేము ఎన్నడూ ఒక సంచికను కూడా కోల్పోలేదు.
మేము సమావేశాలను కూడా జరుపుకోగల్గాము. పిల్లలు (ఆంగ్లం) అనే క్రొత్త ప్రచురణ విడుదల చేయబడిన 1941లో జరిగిన సమావేశం విశిష్టమైనది. పుస్తకాల తనిఖీదారుడు పిల్లలను గూర్చినదని తాను తలంచే పుస్తకాన్ని నిషేధించలేదని అనిపించింది, కాబట్టి మేము మా దేశంలోకి ఆ పుస్తక ప్రతులను ఏ ఆటంకం లేకుండా తెప్పించుకోగల్గాము! మరో సందర్భంలో, శాంతి—అది నిలువగలదా? (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని స్థానికంగానే ముద్రించాము, ఎందుకంటే అన్ని ప్రతులను లండన్ నుండి దిగుమతి చేసుకోవడం అసాధ్యం. మాపై అన్ని ప్రతిబంధాలు విధించబడినప్పటికీ, మేము ఆత్మీయంగా చాలా చక్కగా పోషించబడ్డాము.
వ్యతిరేకతను అధిగమించుట
బెల్ఫాస్ట్లో యెహోవాసాక్షులలో ఒకరు నడుపుతున్న నర్సింగ్ హోమ్‌లో ఉంటున్న ఒక మతగురువు, సంపద (ఆంగ్లం) అనే పుస్తక ప్రతిని ఇంగ్లాండులోవున్న తన భార్యకు పంపాడు. ఆమె సత్యానికి వ్యతిరేకి, ఆమె తన ఉత్తరంలో దానిని వ్యక్తం చేసింది. మాది “దేశద్రోహుల సంఘమని” కూడా ఆమె నొక్కి చెప్పింది. ఉత్తరాల తనిఖీదారుడు దీనిని రాసుకొని, నేర పరిశోధనాశాఖకు నివేదించాడు. దాని ఫలితంగా, వివరణను ఇవ్వడానికి, నేను పోలీస్ శిబిరానికి పిలువబడ్డాను, సంపద యొక్క ఒక ప్రతిని తీసుకురమ్మని నన్ను అడిగారు. ఆసక్తికరమైనదేమంటే, చివరికి, ఆ పుస్తకం తిరిగి పంపబడినప్పుడు, గీయబడిన భాగాలన్నీ రోమన్ కాథోలిక్ చర్చి గురించేనని నేను గమనించాను. ఇది చాలా ప్రభావం గలదేనని నేను భావించాను. ఎందుకంటే, పోలీసులు ఐ.ఆర్.ఎ. (ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ) చర్యలకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉన్నారని నాకు తెలుసు.
యుద్ధ సమయాల్లోని మన తటస్థతను గూర్చి నేను విశదంగా ప్రశ్నించబడ్డాను, ఎందుకంటే పోలీసులకు మన దృక్పథాన్ని గూర్చి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. అయితే, అధికారులు మాకు వ్యతిరేకంగా ఎన్నడూ ఏ చర్యా గైకొనలేదు. తర్వాత, నేను సమావేశం జరుపుకోడానికి అనుమతినడిగినప్పుడు, పోలీసు, ఇద్దరు పోలీసు రిపోర్టరులను పంపుతానని పట్టుపట్టాడు. నేనిలా చెప్పాను, “మేము వారిని స్వాగతిస్తున్నాము!” అలా వారు మధ్యాహ్న కూటాలకు వచ్చి, సంక్షిప్త-లేఖన (షార్టుహ్యాండు) నోట్సులను రాసుకొంటూ కూర్చున్నారు. ఆ కార్యక్రమ అంతంలో, వాళ్ళు ఈ విధంగా అడిగారు: “మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించారు? మేము అంతా చూసి ఎంతో ఆనందిస్తున్నాము!” వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చారు, శాంతి—అది నిలుస్తుందా? అనే చిన్న పత్రికను ఉచితంగా సంతోషంగా అంగీకరించారు. మిగిలిన సమావేశ కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా జరిగింది.
యుద్ధం ముగిసి, ప్రయాణ ప్రతిబంధాలు తీసివేయబడిన వెంటనే, లండన్ బేతేలు నుండి ప్రిస్ హగ్స్ బెల్ఫాస్ట్కు వచ్చారు. ఆయనతో పాటు, హెరాల్డ్ కింగ్ వచ్చారు. తర్వాత ఆయన చైనాకు మిషనరీగా నియమించబడ్డారు. లండన్ బ్రాంచి నుండి దూరం చేయబడిన ఆరు సంవత్సరాల తర్వాత మేమందరము ఈ సహోదరులిచ్చిన ప్రసంగాల వల్ల ఎంతగానో ప్రోత్సహించబడ్డాం. తర్వాత, అతి త్వరలోనే, హెరాల్డ్ డ్యుర్డన్ అనే మరొక నమ్మకమైన పయినీరు బెల్ఫాస్ట్లోని రాజ్య పనిని బలపరచడానికి ఇంగ్లాండు నుండి పంపించబడ్డాడు.
ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళడం
మేము ఐరిష్ సహోదరులతో మమకారాన్ని పెంచుకున్నాము, కాబట్టి, ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళడం కష్టంగా ఉంది. అయితే నేను, నా భార్య మళ్ళీ మ్యాన్చెస్టర్కు నియమించబడ్డాం, తర్వాత మరింత అవసరతలోవున్న లాంకాషెయిర్ నగరమైన న్యూటన్ లా విలోస్కు తరలి వెళ్ళాము. మా కూతురు లూయిస్ 1953లో జన్మించింది. ఆమె 16వ ఏట పయినీరు సేవలో ప్రవేశించగా చూడడం ఎంతో హృదయానందకరంగా ఉంది. పయినీరు డేవిడ్ పార్కిన్సన్తో ఆమె వివాహం జరిగిన తర్వాత, నేను, అలివ్ ఉంచిన అడుగు జాడలను ఎన్నోవిధాలుగా అనుసరిస్తూ, వాళ్ళు ఉత్తర ఐర్లాండ్‌లో తమ పూర్తికాల సేవలో సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వారు తమ పిల్లలతో ఇంగ్లాండుకు తిరిగి వచ్చారు, మేమందరము ఒకే సంఘంలో సేవ చేస్తున్నాము.
మా పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పటికీ, నేను ఎన్నడూ పయినీరింగ్ ఆపలేదు—అలివ్ అలా ఎన్నడూ కోరుకోలేదు, నేను కూడా కోరుకోలేదు. నా పయినీరు రికార్డుకు నా భార్య చక్కగా తోడ్పడిందని నేను ఎల్లప్పుడూ భావించాను, ఎందుకంటే, ఆమె స్థిరమైన, ప్రేమపూర్వకమైన మద్దతు లేకపోతే, నేనెన్నడూ పూర్తికాల సేవలో కొనసాగి ఉండేవాడ్ని కాదు. ఇప్పుడు మేమిద్దరం త్వరగా అలిసిపోతాము, నిజంగా, సాక్ష్యమివ్వడం ముఖ్యంగా మేము కలిసి మా పొరుగువారితో బైబిలు పఠనాలను నిర్వహించడం ఇప్పటికీ ఆనందం కలిగిస్తుంది. సంవత్సరాలుగా దాదాపు వందమంది వ్యక్తులు యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్న సేవకులవడానికి సహాయపడేందుకు మాకు ఆధిక్యత లభించింది. అందులో ఎంత సంతోషం ఉందో! కుటుంబాల్లోని మూడు నాలుగు తరాలవారు కూడా సాక్షులయ్యారు గనుక, నేటికి ఈ సంఖ్య ఎన్నో రెట్లు అధికమై ఉండవచ్చని నేను భావిస్తున్నాను.
సంవత్సరాల తరబడి ఉన్న మా ఆధిక్యతల గురించి, అనుభవాల గురించి నేను, అలివ్ తరచూ మాట్లాడుకుంటాం. అవి ఎంత సంతోషకరమైన సంవత్సరాలుగా ఉన్నాయో, అవి ఎంత త్వరగా గడిచిపోయాయో! ఈ సంవత్సరాలన్నింటిలో, నేను దేవుడైనా యెహోవాను పయినీరుగా సేవించడం కన్నా మిన్నగా నా జీవితంతో నేనేమి చేయలేనని నాకు తెలుసు. ఇప్పుడు, నేను కృతజ్ఞతతో వెనక్కి తిరిగి చూసినా లేదా నిరీక్షణతో ముందుకు చూసినా యిర్మీయా మాటలకు ఎంతో అర్థముందని నేను గ్రహిస్తున్నాను: “యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. . . ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.”—విలాపవాక్యములు 3:22-24.
[26వ పేజీలోని చిత్రం]
బాబ్ మరియు అలివ్ ఆండర్సన్