కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 2/1 పేజీలు 25-29
  • సలహా ఇచ్చేటప్పుడు మీరు ఇతరులను గౌరవిస్తారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సలహా ఇచ్చేటప్పుడు మీరు ఇతరులను గౌరవిస్తారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • గౌరవింపబడటం మానవుని సహజమైన హక్కు
  • స్వతస్సిద్ధ గౌరవంతో యెహోవా మనిషిని సృష్టించాడు
  • గౌరవాన్ని కాపాడే సూత్రాలు
  • ఇతరులను గౌరవించండి—అపవాదిని ఎదిరించండి
  • గౌరవపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా యెహోవాను ఘనపరచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మీరు వాళ్లకు తగిన గౌరవాన్నిస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • అందరూ ఆత్మగౌరవంతో ఉండవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • మనుష్యుల ఆత్మగౌరవం తరచూ ఉల్లంఘించబడుతోంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 2/1 పేజీలు 25-29

సలహా ఇచ్చేటప్పుడు మీరు ఇతరులను గౌరవిస్తారా?

గౌరవపూర్వకంగా సలహా పొందడం ఎంత మంచిది, ఎంత ప్రయోజనకరమైంది! “దయ, కనికరం, శ్రద్ధగల సలహా మంచి సంబంధాలు ఏర్పడటానికి దోహదపడతాయి,” అని ఎడ్వర్డ్‌ అంటున్నాడు. “సలహా ఇచ్చే వ్యక్తి మన కథను వినటానికి ఇష్టపడటం ద్వారా మనకు మర్యాదిస్తాడని, మనల్ని గౌరవిస్తాడని మనకనిపించినప్పుడు, సలహాను అంగీకరించడం ఎంతో సుళువు,” అని వార్రెన్‌ తెలియజేస్తున్నాడు. “సలహాదారుడు నన్ను గౌరవంగా చూసినప్పుడు, అతని వద్దకు వెళ్లటానికి, సలహా కొరకు అడగటానికి నేను ఇబ్బంది పడను,” అని నార్‌మన్‌ చెబుతున్నాడు.

గౌరవింపబడటం మానవుని సహజమైన హక్కు

వాస్తవంగా వాత్సల్యపూర్వకమైన, స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన సలహా కోరదగినదే. మనమెలా సలహా పొందాలని కోరుకుంటామో అలా మనం ఇతరులకు సలహా ఇవ్వడం ప్రయోజనకరం. (మత్తయి 7:12) మంచి సలహాదారుడు సలహాపొందే వ్యక్తిని విమర్శించటం లేక నిందించటానికి బదులు, ఆయన ఆలోచనా విధానాన్ని, ఆయన పరిస్థితిని, ఆయన భావాలను వినటానికి, అర్థం చేసుకోటానికి సమయం తీసుకుంటాడు.—సామెతలు 18:13.

ఈనాడు క్రైస్తవ పెద్దలతోసహా సలహా ఇచ్చేవారందరూ, సలహా ఇచ్చేటప్పుడు ఇతరులను గౌరవించడానికి జాగ్రత్త వహించాల్సిన అవసరత ఉంది. ఎందుకు? ఒక స్వల్ప కారణమేమిటంటే, ఇతరులతో అమర్యాదపూర్వకరంగా వ్యవహరించడం సమాజంలో ఉన్న అలవాటు. ఇది ఇతరులకు సోకే గుణం గలది. వృత్తి సంబంధ వ్యక్తులు, మత నాయకులు, లేక ఇతరులు ఎవరైనప్పటికీ, ఎవరి నుండి మనం గౌరవపూర్వకమైన ఆదరాన్ని ఆశిస్తామో వారే గౌరవాన్ని చూపరు. ఉదాహరణకు, పనిచేసే స్థలంలో, ఉద్యోగం నుండి తొలగించడం అటు ఉద్యోగికి, ఇటు యజమానికి కూడా గాయపర్చేదిగా, ఒత్తిడి కల్గించేదిగా ఉంటుంది. ప్రాముఖ్యంగా తొలగింపబడిన వ్యక్తితో గౌరవపూర్వకంగా వ్యవహరించకపోతే అది అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఈ విషయంలో యజమానులు, “ఆ కఠినమైన సమాచారాన్ని, స్పష్టంగా, అనవసరమైన విషయాలు లేకుండా, వృత్తిపరంగా ఉండి ఆ వ్యక్తి గౌరవాన్ని భంగపర్చనిదై” ఉండేలా అందజేయడం నేర్చుకోవాలని ది వాన్‌కూవర్‌ సన్‌ నివేదిస్తున్నది. అవును మానవులందరిని గౌరవపూర్వకంగా చూడాలి.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఇలా తెలియజేస్తుంది: “మానవులందరూ స్వతంత్రులుగా జన్మించారు, గౌరవం, హక్కుల విషయంలో అందరూ సమానులే. వారందరికీ హేతుబద్ధత, మనస్సాక్షి ఇవ్వబడ్డాయి, వారు ఒకరి యెడల ఒకరు సహోదర భావాన్ని ప్రదర్శించాలి.” మనిషి గౌరవం భంగపర్చబడుతుంది గనుక, ఐక్యరాజ్య సమితి అధికారపత్రం మరియు యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ పీఠిక ఈ లక్షణాన్ని గుర్తిస్తున్నవి. “మానవుని ప్రాథమిక హక్కులు, మానవుని గౌరవ విలువలలో విశ్వాసాన్ని” అవి ధృవపర్చాయి.

స్వతస్సిద్ధ గౌరవంతో యెహోవా మనిషిని సృష్టించాడు

యెహోవా గౌరవంగల దేవుడు. ఆయన ప్రేరేపిత వాక్యం సరైన విధంగా ఇలా తెలియజేస్తుంది, “ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి,” మరియు “ఆకాశములలో [ఆయన] మహిమ కనుపర్చబడును.”—1 దినవృత్తాంతములు 16:27; కీర్తన 8:1.

గౌరవంగల దేవునిగా, విశ్వాధిపతిగా ఆయన తన పరలోక, భూలోక సృష్టియంతటికి గౌరవాన్ని ఇస్తాడు. అలా గౌరవింపబడేవారిలో మహిమపర్చబడి పరిపాలిస్తున్న కుమారుడు, రాజు అయిన యేసుక్రీస్తు ప్రముఖుడు. దావీదు ప్రవచనార్థకంగా ఇలా వ్రాశాడు: “గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు.”—కీర్తన 21:5; దానియేలు 7:14.

విచారకరంగా, ఈ మానవ హక్కు చరిత్రంతటిలో ఎక్కువగా దుర్వినియోగపర్చబడింది. తన క్రియల ద్వారా అపవాదియగు సాతానుగా మారిన ఒక శక్తివంతమైన దూత, దేవుని సర్వాధిపత్యపు హక్కును, నీతిని, యోగ్యతను సవాలు చేశాడు. అలా చేయడం ద్వారా అతడు యెహోవాకు అగౌరవాన్ని చూపించి, పరిపాలించే ఆయన హక్కును సవాలు చేయడం ద్వారా ఆయన మహిమగల నామాన్ని అగౌరవపర్చాడు. అతడు తనకు అర్హతలేని అధిక గౌరవాన్ని ఆశించాడు. అపవాది వలే బైబిలు కాలాలనాటి నెబుకద్నెజరు వంటి శక్తివంతమైన మానవ పరిపాలకులు, తమ ‘బలాధికారమును, ప్రభావఘనతను’ గూర్చి ప్రగల్భాలు పలికారు. వారు తమకు తాము కారణరహితమైన గౌరవాన్ని ఆపాదించుకోవడం ద్వారా యెహోవా గౌరవాన్ని భంగపర్చారు. (దానియేలు 4:30) మానవజాతిపై విధించబడిన సాతాను నిరంకుశ పరిపాలన మనిషి గౌరవాన్ని భంగపర్చింది, భంగపరుస్తూనే ఉంది.

మీ గౌరవం ఎప్పుడైనా భంగపర్చబడిందా? సలహా ఇవ్వబడినప్పుడు, మీరు ఎంతో తప్పుచేసినట్లు, సిగ్గుపర్చబడినట్లు, అవమానింపబడినట్లు, లేక నీచపర్చబడినట్లు భావించేలా చేయబడ్డారా? “శ్రద్ధ, వాత్సల్యం, గౌరవం చూపినట్లు నాకనిపించలేదు. నేను వ్యర్థుడనని భావించేలా చేయబడ్డాను, ఇది నిరాశ, వ్యాకులత, విషాదం వంటి భావాలకు నడిపింది” అని ఆండ్రే చెబుతున్నాడు. లోరె ఇలా చెబుతున్నది: “మీ మంచిచెడ్డల యెడల శ్రద్ధలేదని మీరు భావించే వ్యక్తి నుండి సలహా అంగీకరించడం కష్టము.”

ఈ కారణాన్ని బట్టే, దేవుని మందను గౌరవ మర్యాదలతో చూడాలని క్రైస్తవ పెద్దలకు సలహా యివ్వబడింది. (1 పేతురు 5:2, 3) ఇతరులకు ఉపదేశమివ్వడం అవసరం, ప్రయోజనకరం అయిన సందర్భాలు వస్తే, ఇతరుల గౌరవాన్ని నిస్సంకోచంగా భంగపర్చే లోకసంబంధ వ్యక్తుల ఆలోచనా సరళి, ప్రవర్తన నుండి మిమ్మల్ని మీరెలా కాపాడుకోగలరు? తోటి క్రైస్తవుల గౌరవాన్ని, మీ స్వంత గౌరవాన్ని కాపాడుకొనుటకు మీకేది సహాయం చేయగలదు?—సామెతలు 27:6; గలతీయులు 6:1.

గౌరవాన్ని కాపాడే సూత్రాలు

ఈ విషయంలో దేవుని వాక్యం మౌనం వహించడంలేదు. ఒక నైపుణ్యంగల సలహాదారుడు ఈ లోక జ్ఞానం వైపు చూడటం కంటే దేవుని వాక్య ఉపదేశమందు విశ్వాసముంచుతాడు. పరిశుద్ధ వ్రాతలు విలువైన సలహా కలిగివున్నాయి. వాటిని అనుసరిస్తే, సలహాదారున్ని అలాగే ఉపదేశం పొందేవాన్ని అవి గౌరవిస్తాయి. అందుకే పౌలు క్రైస్తవ అధ్యక్షుడైన తిమోతికి ఇలా సూచించాడు: “వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యౌవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము.” (1 తిమోతి 5:1, 2) ఈ సూత్రాలకు కట్టుబడి ఉండటం ద్వారా ఎంతటి దుఃఖాన్ని, బాధాతప్త భావాలను, చికాకునైనా నివారించవచ్చు!

ఇతర వ్యక్తి యెడల, గౌరవపూర్వకంగా మరియు శ్రద్ధతో వ్యవహరించబడవలసిన అతని హక్కు యెడల సరైన మర్యాదను కనపర్చడమే విజయవంతంగా సలహా ఇవ్వడం యొక్క కీలకమని గమనించండి. ప్రయాణకాపరులతో సహా క్రైస్తవ పెద్దలు ఈ సలహాను పాటించటానికి పట్టుదలతో ప్రయత్నిస్తూ, సరిచేసుకోవలసిన అవసరత గల వ్యక్తి ఎందుకలా ఆలోచిస్తున్నాడో, ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవటానికి వారు ప్రయత్నిస్తూ, అతని దృక్పథాన్ని వినటానికి ఇష్టపడటమే కాకుండా, ఉపదేశింపబడుతున్న వ్యక్తి సిగ్గుపర్చబడటం, నీచపర్చబడటం లేక అవమానింపబడటం వంటివి నివారించటానికి అన్ని ప్రయత్నాలు చేయాలి.

ఒక పెద్దగా, మీరు ఆయన యెడల శ్రద్ధ కలిగివున్నారని, ఆయన సమస్యలో ఆయనకు సహాయం చేయటానికి మీరిష్టపడుతున్నారని ఆ సహోదరుడు తెలుసుకోనివ్వండి. శారీరక పరీక్ష కొరకు మీరు ఒక మంచి వైద్యుని యొద్దకు వెళ్లినప్పుడు అతను అలాగే చేస్తాడు. చల్లని, సూక్ష్మక్రిములులేని గదిలో వస్త్రాలు లేకుండా ఉండటాన్ని గురించిన ఆలోచన కూడా మీకు చికాకును, అగౌరవాన్ని కలిగించవచ్చు. మీ అస్వస్థతకు కారణాన్ని తెలుసుకొనుటకు అవసరమైన పరీక్ష చేసేటప్పుడు మీ ఆత్మగౌరవం యెడల సున్నిత భావాన్ని కనపర్చి, మిమ్మల్ని గౌరవించే వైద్యున్ని మీరెంతగా మెచ్చుకుంటారు! అదేవిధంగా, ఒక వ్యక్తి యెడల సరైన గౌరవాన్ని చూపే ఒక క్రైస్తవ సలహాదారుడు దయ, స్థిరత్వం గలవాడు, అంతేగాక, ఆయన సలహా పొందే వ్యక్తిని గౌరవిస్తాడు. (ప్రకటన 2:13, 14, 19, 20) దానికి విరుద్ధంగా, కఠినంగా, చల్లగా, శ్రద్ధ లేనట్లున్న సలహా సిగ్గుకరంగా, నీచంగా, మీ గౌరవాన్ని తొలగించినట్లు మీరు భావించేలా చేసే సూచనార్థక వస్త్రాల తొలగింపులా ఉంటుంది.

గౌరవంతో సలహా ఇవ్వడంలో, ప్రాముఖ్యంగా దైవపరిపాలనా పాఠశాల అధ్యక్షులు జాగ్రత్త కలిగి ఉంటారు. పెద్దవారికి ఉపదేశం ఇచ్చేటప్పుడు, దైవపరిపాలనా పాఠశాల అధ్యక్షులు తమ స్వంత తలిదండ్రుల యెడల చూపించే ప్రేమనే చూపిస్తారు. వారు దయ, స్నేహభావం, వాత్సల్యం కలిగి ఉంటారు. అలాంటి సున్నిత భావం అవసరం. సలహా ఇవ్వటానికి, పొందటానికి అది తగిన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

వృద్ధి చేసే ప్రోత్సాహకరమైన, నిర్మాణాత్మకమైన, అనుకూలమైన పురికొల్పునిచ్చే సలహా ఆచరణయోగ్యమైనదని పెద్దలు మనస్సులో ఉంచుకోవాలి. ఎఫెసీయులు 4:29 ఇలా తెలియజేస్తుంది: “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.”

కఠినమైన పదాలు, భాష, లేక తర్కం ఉపయోగించవలసిన అవసరం లేదు. బదులుగా, ఇతర వ్యక్తి యెడల గౌరవం, అతని ఆత్మాభిమాన, ఆత్మగౌరవ భావాలను కాపాడాలనే కోరిక, విషయాన్ని అనుకూల, నిర్మాణాత్మకమైన విధంగా చెప్పటానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. అతను చిరాకు పడేలా లేదా విలువలేనివానిగా భావించేలా చేసేటటువంటి ఉద్దేశాలను వ్యక్తపర్చే బదులు, అతని మంచి విషయాలు లేక గుణాలను గూర్చి యథార్థమైన, నిజమైన మెప్పుతో ఏ విశేషాలనైనా ప్రస్తావించండి. మీరు పెద్దగా సేవ చేస్తుంటే, మీ ‘అధికారాన్ని పడద్రోయుటకు కాక కట్టుటకే’ ఉపయోగించండి.—2 కొరింథీయులు 10:8.

అవును, క్రైస్తవ అధ్యక్షుల నుండి వచ్చే ఏ సలహా ఫలితమైనా ఎలా ఉండాలంటే అవసరమైన ప్రోత్సాహాన్ని, మేలైనదానిని అందజేసేదై ఉండాలి. అది నిరుత్సాహపర్చేదిగా లేక “భయపెట్టే”దిగా ఉండకూడదు. (2 కొరింథీయులు 10:9) ఒక తీవ్రమైన తప్పు చేసిన వ్యక్తికి కూడా కొంతమేరకు ఆత్మగౌరవం, మర్యాద ఇవ్వటం అవసరం. అతన్ని పశ్చాత్తాపపడుటకు కదిల్చేలా దయ, స్థిరత్వాలతో సమతూకంగల సలహాను ఇవ్వాలి.—కీర్తన 44:15; 1 కొరింథీయులు 15:34.

ప్రాముఖ్యంగా, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఇవే సూత్రాలతో రూపొందించబడింది. కొంత వ్యక్తిగత గౌరవాన్ని కలిగివుండగల ఒకరి హక్కును పరిరక్షిస్తూనే, అదే సమయంలో సలహాను, శారీరక క్రమశిక్షణను కూడా అది అనుమతించింది. “నేరముకొలది దెబ్బలు లెక్క పెట్టి” కొట్టడం అనుమతించబడింది, కాని అది మరీ ఎక్కువగా ఉండకూడదు. తప్పుచేసినవాడు ‘నిజంగా నీచుడుగా’ కాకూడదని ఎన్ని దెబ్బలు కొట్టాలి అనేదానికి ఒక హద్దు ఉండేది.—ద్వితీయోపదేశకాండము 25:2, 3.

తప్పుచేసి పశ్చాత్తాపపడిన వ్యక్తి భావాల యెడల శ్రద్ధ చూపించటంలో కూడా యేసు విశేష లక్షణాన్ని కనబర్చాడు. ఆయన గురించి యెషయా ఇలా ప్రవచించాడు: “నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును.”—యెషయా 42:3; మత్తయి 12:17, 20; లూకా 7:37, 38, 44-50.

కొండ మీది ప్రసంగంలోని యేసు మాటలు ఇంకా సానుభూతి చూపించవలసిన అవసరతను నొక్కిచెబుతున్నాయి: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) మంచి సంబంధాలను పెంపొందించడంలో ఈ సూత్రం ఎంత కీలకమైనదంటే, అది సామాన్యంగా బంగారు సూత్రం అని పిలువబడుతుంది. ఒక క్రైస్తవ పెద్దగా, ఉపదేశించేటప్పుడు ఇతరులను దయతో, గౌరవంతో చూచుటకు అది మీకెలా సహాయం చేయగలదు?

మీరు కూడా పొరపాట్లు చేస్తారని జ్ఞాపకముంచుకోండి. యాకోబు చెప్పినట్లు, “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము.” (యాకోబు 3:2) దీన్ని జ్ఞాపకముంచుకోవడం, ఇతరులతో వారి తప్పుల గురించి మాట్లాడవలసిన అవసరం వచ్చినప్పుడు మీ వ్యాఖ్యలను అదుపు చేసుకొనుటకు, మీ భావాలను నియంత్రించుకొనుటకు సహాయం చేస్తుంది. వారి సున్నిత భావాలను గుర్తించండి. చిన్న పొరపాట్లు, తప్పిదాలకు ఎక్కువ ధ్యాసనిస్తూ, విపరీతంగా విమర్శించటాన్ని నివారించుటకు, ఇది మీకు సహాయం చేస్తుంది. యేసు ఇలా చెప్పినప్పుడు దాన్ని నొక్కిచెప్పాడు: “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.”—మత్తయి 7:1, 2.

ఇతరులను గౌరవించండి—అపవాదిని ఎదిరించండి

సాతాను కుతంత్రాలు మీరు గౌరవం పొందకుండా చేసి, అగౌరవమైన, అయోగ్యమైన, నిరాశా భావాలను ఉత్పన్నం చేయటానికి రూపొందించబడ్డాయి. నమ్మకస్థుడైన యోబులో అననుకూల భావాలు కలిగేలా చేయటానికి అతను ఎలా ఒక మానవ ప్రతినిధిని ఎన్నుకున్నాడో చూడండి. వేషధారియైన ఎలీఫజు ఇలా అన్నాడు: “ఆయన తన [యెహోవా] సేవకులను నమ్ముట లేదు తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?” (యోబు 4:18, 19) కాబట్టి అతని మాటల ప్రకారం, దేవుని దృష్టిలో యోబుకు చిమ్మట కంటే ఎక్కువ విలువలేదు. వాస్తవానికి, ఎలీఫజు అతని తోటివారి సలహా ప్రోత్సహించేదిగా కాక యోబు తన మంచి కాలాలను కూడ జ్ఞాపకం తెచ్చుకోకుండ అడ్డగించేదైయుంది. వారి దృష్టిలో అతని గత నమ్మకత్వం, కుటుంబ శిక్షణ, దేవునితో సంబంధం, కనికరంతో ఇవ్వబడిన బహుమానాలు విలువలేనివి.

అలాగే ఈనాడు, పశ్చాత్తాపపడిన తప్పిదస్థులు ముఖ్యంగా అలాంటి భావాలకు లోను కావచ్చు, వారు ‘అత్యధికమైన దుఃఖములో మునిగిపోవు’ ప్రమాదం కూడా ఉంది. అలాంటి వారికి సలహా ఇస్తున్నప్పుడు కొంత గౌరవాన్ని కాపాడుకొనుటకు వారిని అనుమతించడం ద్వారా పెద్దలైన మీరు మీ “ప్రేమను స్థిరపరచండి.” విలియం ఇలా అంగీకరిస్తున్నాడు: “అగౌరవంగా ప్రవర్తించడం సలహాను అంగీకరించడాన్ని కష్టతరం చేస్తుంది.” వారు దేవుని దృష్టిలో విలువైన వారన్న నమ్మకాన్ని దృఢపర్చడం అత్యవసరం. యెహోవా ‘మీరు చేసిన కార్యమును . . . తన నామమును బట్టి [వారు] చూపిన ప్రేమను మరచుటకు అన్యాయస్థుడు కాడని’ వారికి గుర్తు చేయండి.—హెబ్రీయులు 6:10.

సలహా ఇచ్చేటప్పుడు మరే ఇతర విషయాలు ఇతరులను గౌరవించటానికి మీకు సహాయం చేస్తాయి? మానవులు దేవుని పోలిక చొప్పున చేయబడ్డారు గనుక అందరూ గౌరవింపబడవలసిన సహజమైన హక్కును కలిగివున్నారని గ్రహించండి. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారిని విలువైన వారిగా పరిగణిస్తున్నారు; విమోచనం, పునరుత్థానం యీ రెండు ఏర్పాట్లు, ఈ వాస్తవాన్ని రుజువు పరుస్తున్నాయి. “[వారిని] పరిచర్యకు నియమించటం” ద్వారా, దుష్ట తరంవారు దేవునితో సమాధానపడవలెనని బతిమాలటానికి దాన్ని ఉపయోగించటం ద్వారా యెహోవా క్రైస్తవులకు ఇంకా ఎక్కువ ఘనతను కలుగజేస్తున్నాడు.—1 తిమోతి 1:12.

మీ క్రైస్తవ సహోదరులలోని అనేకమంది, శుభ్రపరచబడిన భూమిలో క్రొత్త మానవ సమాజానికి భవిష్యత్‌ పునాదులుగా ఉంటారని పెద్దలు గుర్తుంచుకోవాలి. అలాంటి విలువైన, అమూల్యమైన వ్యక్తులుగా వారు గౌరవింపబడటానికి అర్హులు. సలహా ఇచ్చేటప్పుడు, యెహోవా, యేసు ఇద్దరూ వారి యెడల ఎలా శ్రద్ధ చూపిస్తారో గుర్తుతెచ్చుకుని, సాతాను సవాళ్ల విషయంలో మీ సహోదరుల ఘనతను, ఆత్మాభిమానాన్ని కాపాడుకొనుటకు సహాయపడుటలో మీ వంతును చేయుటలో కొనసాగండి.—2 పేతురు 3:13; మరియు 1 పేతురు 3:7ను పోల్చండి.

[29వ పేజీలోని బాక్సు]

గౌరవాన్నిచ్చే సలహా

(1) నిజంగా, యథార్థంగా మెచ్చుకొనండి. (ప్రకటన 2:2, 3)

(2) బాగా వినేవారిగా ఉండండి. ఆ సమస్యను, సలహాను ఇవ్వటానికి గల కారణాన్ని స్పష్టంగా, దయతో పేర్కొనండి. (2 సమూయేలు 12:1-14; సామెతలు 18:13; ప్రకటన 2:4)

(3) మీ సలహాను లేఖనాల ఆధారంగా ఇవ్వండి. అనుకూల దృక్పథం, కారణసహితంగా, ప్రోత్సాహకరంగా వుంటూ సానుభూతిని చూపించండి. ఉపదేశం పొందేవారి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడండి. (2 తిమోతి 3:16; తీతు 3:2; ప్రకటన 2:5, 6)

(4) సలహాను అంగీకరించి, అనుసరించడం ద్వారా ఆశీర్వాదాలు వస్తాయని సలహా పొందేవారిని నమ్మింపజేయండి. (హెబ్రీయులు 12:7, 11; ప్రకటన 2:7)

[26వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ పెద్దలు సలహా ఇచ్చేటప్పుడు ఇతరులను గౌరవించాల్సిన అవసరత ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి