రాజ్య ప్రచారకుల నివేదిక
“యెహోవా నామము బలమైన దుర్గము”
మనం అస్థిరమైన కాలంలో జీవిస్తున్నాము. స్థిరంగా ఉన్నట్లనిపించే మన జీవితాలు ఒక్క రాత్రిలో మారిపోగలవు, హెచ్చరిక లేకుండానే కొందరు తాము గ్రహించక ముందే గొప్ప అపాయంలో ఉన్నట్లు కనుగొన్నారు. రాజకీయ అలజడి, దౌర్జన్యపూరితమైన ముట్టడి, ప్రకృతి వైపరీత్యం, లేక తీవ్రమైన అస్వస్థత మూలంగా ప్రమాదం రావచ్చు. పరిస్థితి ఏదైనప్పటికీ, తన జీవితం అపాయంలో ఉన్నప్పుడు క్రైస్తవుడు ఎటు తిరగాలి?
వాచ్‌టవర్ సంస్థ బ్రాంచీలలో ఒక దాని యందు నివసిస్తున్న డేవిడ్ అనే మిషనరీ, ఆ ప్రశ్నకు ఒక భయంకరమైన అనుభవం ద్వారా జవాబును నేర్చుకున్నాడు. నియమిత డ్రైవరుగా, బ్రాంచి కార్యాలయం వెలుపల నివసించే స్వచ్ఛంద సేవకులను కొంతమందిని తీసుకురావటానికి ఒక ఉదయాన ఆయన బయలుదేరాడు. అప్పటికింకా చీకటిగానే ఉంది. ఆయన రొసాల్యాను తీసుకుని ఒక పోలీసు స్టేషన్‌ను దాటుతుండగా ఆయన మొదటిసారి కాల్పు శబ్దాన్ని విన్నాడు.
తరువాత సంఘటనలు వెంటవెంటనే జరిగిపోయాయి. ఆయన ఒక పెద్ద పటాకు పేలినట్లు శబ్దం విని, టైర్లలో ఒకదానిలో నుండి గాలి పోతున్నట్లు గ్రహించాడు. హఠాత్తుగా ఒక సైనికుడు రోడ్డు మధ్యన నిలబడి తన వైపుకే తుపాకి సూటిగా గురిపెట్టి నిలుచున్నట్లు చూశాడు. దాదాపు ఒకేసారి మూడు సంఘటనలు జరిగాయి: కిటికీలను ముక్కలు చేస్తూ, జీపు ప్రక్క భాగాన్ని తుపాకీ తూటాలు వరుసగా వచ్చి తాకుతున్నాయి, డేవిడ్ రొసాల్యాలు క్రింద కూర్చున్నారు; కంటి ఎత్తులో విండ్‌షీల్డ్ గుండా సైనికుడు కాల్పులు జరిపాడు.
తుటాలు వచ్చి జీపులును తగులుతుంటే, అలాగే వంగివుండే డేవిడ్ వీలైనంత మంచిగా బ్రేకు వేశాడు. డేవిడ్, రొసాల్యాలిద్దరూ తాము చనిపోబోతున్నామనుకున్నారు. తమను కాపాడమని అడుగుతూ, వారు యెహోవాకు ప్రార్థన చేశారు. తన మరణం గురించి వింటే తన కుటుంబీకులు ఎలా ప్రతిస్పందిస్తారా అని ఆ క్షణాల్లో నేను ఆలోచించానని రొసాల్యా తరువాత చెప్పింది!
ఇంకా సజీవంగా ఉన్నారు!
కాల్పులు, అద్దాలు పగిలిపోతున్న శబ్దాలు చివరికి ఆగిపోయాయి, డేవిడ్ రొసాల్యా వైపు చూశాడు. ఆమె వెనుక భాగంలో చిన్న గుండ్రని రక్తం మరక చూసినప్పుడు ఆయన చాలా భయపడ్డాడు. అది తుటా కాదుగాని, ఒక గాజు ముక్క అక్కడ దిగిపోయింది. పడుతున్న గాజు ముక్కల మూలంగా ఆమె మోకాళ్లకు తగిలిన గాయాల నుండి రక్తం కారుతున్నది, అంతేకాని ఆమె క్షేమంగానే ఉంది.
చేతులకు తెల్లని బాండ్లు కట్టుకొని సైనికుల దుస్తుల్లో వున్న మనుష్యులు జీపు వైపుకు నడిచివచ్చి, వారిని చేతులు పైకెత్తి బయటికి రమ్మని ఆజ్ఞాపించారు. ఉన్నతోద్యోగిలా వున్నట్లున్న ఒకరు సైనికుని వైపు తిరిగి ఇలా అన్నాడు: “పౌరులను కాల్చ వద్దని నీకు చెప్పబడింది కదా.” తనకు కాల్పుల శబ్దాలు వినిపించాయని, అవి జీపు నుండి వచ్చాయనుకున్నానని చెప్పి ఆ సైనికుడు తన చర్యలను సమర్థించుకోవాలని చూశాడు.
తాను, రొసాల్యా యెహోవాసాక్షులమని డేవిడ్ చెప్పినప్పుడు వారి ప్రతిస్పందన అనుకూలంగా ఉంది. తాను ఏం చేస్తుండెనో ఆయన వారికి వివరించాడు, అయినా సైనికులు వాళ్లను ఇంకా అలాగే ఉంచేసారు. జరిగిందేమిటంటే, ఆ ఉదయం వేకువ జామున ఒక సైనికుల ముఠా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో, ఈ సైనికులు పోలీస్ స్టేషన్‌ను స్వాధీనపర్చుకోవాలని చూస్తుండగా డేవిడ్ రొసాల్యాలు జీపులో ఆ మార్గాన వెళ్లారు.
రొసాల్యా చాలా గాభరా పడింది కాని, డేవిడ్ తమను విడుదల చేయమని కోరుతుండగా ధైర్యంగా ఊరుకుంది. చివరికి వారు జీపు లేకుండా వెళ్లడానికి అనుమతించబడ్డారు. దగ్గరలో వున్న వీధిలోనికి నడిచి వెళ్లి, బస్సు పట్టుకుని బ్రాంచిని చేరారు, అక్కడ రొసాల్యాకు చికిత్స చేసారు.
ప్రార్థన శక్తి
మనఃపూర్వక ప్రార్థన శక్తిని ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదని, మనల్ని మనం ధైర్యంగా యెహోవాసాక్షులుగా గుర్తించుకోవడం రక్షణకరం అని ఎన్నడూ మర్చిపోకూడదని—డేవిడ్ ఆ అనుభవం నుండి నేర్చుకున్నాడు: “యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును” అన్నది అక్షరార్థకంగా నిజం కావచ్చు.—సామెతలు 15:29; 18:10; ఫిలిప్పీయులు 4:6.
[19వ పేజీలోని చిత్రసౌజన్యం]
Fotografía de Publicaciones Capriles, Caracas, Venezuela