దైవిక బోధ ప్రయోజనాలను పొందండి
“నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును.”—యెషయా 48:17.
1. మన జీవితాల్లో దైవిక బోధను అనుసరించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందగలము?
యెహోవా దేవునికి సమస్తం తెలుసు. ఆలోచనలోగాని, మాటలోగాని లేక క్రియలోగాని ఎవరూ ఆయనకు సాటిలేరు. మన సృష్టికర్తగా ఆయనకు మన అవసరతలు తెలుసు గనుక ఆయన వాటిని మనకు పుష్కలంగా అందజేస్తాడు. మనకెలా ఉపదేశించాలో ఆయనకు నిజంగా తెలుసు. మనం ఒకవేళ దైవిక బోధను అనుసరిస్తే, మనం ప్రయోజనం పొందడమేగాక నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాము.
2, 3. (ఎ) దేవుని ఆజ్ఞలకు ఆయన ప్రాచీన ప్రజలు విధేయత చూపించివున్నట్లైతే, వారు ఎలా ప్రయోజనం పొందివుండేవారు? (బి) ఈనాడు మనం మన జీవితాల్లో దైవిక బోధను అనుసరిస్తే ఏమి జరుగుతుంది?
2 దేవుని కట్టడలకు, సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా ఆయన సేవకులు విపత్తును తప్పించుకొని, జీవితాన్ని ఆనందించాలన్నది దేవుని మనోభిలాష అని దైవిక బోధ తెలియజేస్తుంది. యెహోవా ప్రాచీన ప్రజలు ఆయన చెప్పినది వినియుంటే వారు గొప్ప ఆశీర్వాదాలను పొంది ఉండేవారు ఎందుకంటే, ఆయన వారికిలా చెప్పాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును.”—యెషయా 48:17, 18.
3 దేవుని ప్రాచీన ప్రజలు ఆయన ఆజ్ఞలు, ఉపదేశాల యెడల శ్రద్ధ కనబర్చివుంటే ప్రయోజనం పొందేవారు. బబులోనీయుల చేతుల్లో విపత్తు నెదుర్కొనే బదులు వారు నిండైన, లోతైన శాశ్వతమైన నది వలే శాంతి సౌభాగ్యాలను అనుభవించేవారు. అంతేగాక, వారి నీతికార్యాలు సముద్ర తరంగాలలా అసంఖ్యాకంగా ఉండేవి. అలాగే, మనం మన జీవితాల్లో దైవిక బోధను అనుసరిస్తే, దాని అనేక ప్రయోజనాలను అనుభవించవచ్చు. వీటిలో కొన్ని ఏవి?
అది జీవితాలను మారుస్తుంది
4. అనేకమంది ప్రజల జీవితాల మీద దైవిక బోధ ఎలా ప్రభావం చూపుతుంది?
4 దైవిక బోధ అనేకుల జీవితాలను మంచిగా మార్చడం ద్వారా ప్రయోజనం కలుగజేస్తుంది. యెహోవా ఉపదేశాలను అవలంభించేవారు కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, కలహము, మత్సరముల వంటి “శరీరకార్యములను” విడిచిపెడతారు. వాటికి బదులు వారు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము వంటి ఆత్మఫలాలను కనబరుస్తారు. (గలతీయులు 5:19-23) అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడిన అన్యజనుల వలె నడుచుకొనవద్దని ఎఫెసీయులు 4:17-24 నందు పౌలు తన తోటి విశ్వాసులను కోరిన సలహాను కూడ వారు లక్ష్యపెడతారు. అజ్ఞాన హృదయంచే మోసపర్చబడకుండా, క్రీస్తువంటి వ్యక్తులు ‘మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశలవలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని చిత్తవృత్తియందు నూతన పరచబడినవారవుతారు.’ వారు ‘నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొంటారు.’
5. ప్రజల నడవడిపై దైవిక బోధ ఎలా ప్రభావం చూపుతుంది?
5 దైవిక బోధను అనుసరించుట వలన వచ్చే ఒక మంచి ప్రయోజనమేమిటంటే, దేవునితో ఎలా నడవాలో అది మనకు చూపిస్తుంది. నోవహువలె మనం యెహోవాతో నడిస్తే, మనం మన మహోపదేశకుడు చెప్పినటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తాము. (ఆదికాండము 6:9; యెషయా 30:20, 21) అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా అన్యజనులు “హృదయ కాఠిన్యము“తో నడుస్తారు. అటువంటి వారి మనస్సులు వ్రాసే కొన్ని వ్రాతలు ఎంత కాఠిన్యంగా ఉండవచ్చు! పొంపీలోని ఒక గోడపైనున్న వ్రాతలను గమనించి, ఒక పరిశీలకుడు తానే ఇలా వ్రాసాడు: “ఓ గోడ, నీ మీద వ్రాయబడిన ఇంత బుద్ధిహీనవ్రాత బరువు క్రింద నీవు కూలి తునాతునకలై పోలేదంటే అది ఆశ్చర్యంగా ఉంది.” కాని ‘యెహోవా బోధ’లో, అది సాధ్యపర్చే రాజ్య ప్రకటన పనిలో అలాంటి బుద్ధిహీనత లేదు. (అపొస్తలుల కార్యములు 13:12) ఆ పని మూలంగా, సత్యాన్ని ప్రేమించే ప్రజలు బుద్ధిగా ప్రవర్తించుటకు సహాయం పొందుతారు. దేవుని సంకల్పాలు తెలియక, పాపభరితమైన మార్గాలలో నడవటం ఎలా మానివేయాలో వారికి నేర్పించబడుతుంది. వారు ఇక ఎంతమాత్రం మానసిక అంధకారంలో ఉండరు, ప్రయోజనంలేని లక్ష్యాల కొరకు పాటుపడే అజ్ఞాన హృదయాలచే వారు ప్రేరేపించబడరు.
6. యెహోవా బోధకు మనం చూపించే విధేయతకు మన ఆనందానికి ఏమి సంబంధం ఉంది?
6 యెహోవాను, ఆయన వ్యవహారాలను మనం తెలుసుకొనేలా కూడా దైవిక బోధ మనకు ప్రయోజనం కలుగజేస్తుంది. అలాంటి జ్ఞానం మనల్ని దేవునికి సన్నిహితం చేస్తుంది, ఆయన యెడల మన ప్రేమను పెంచుతుంది, ఆయనకు విధేయత చూపాలనే మన కోరికను అధికం చేస్తుంది. మొదటి యోహాను 5:3 ఇలా చెబుతుంది: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” యేసు బోధ కూడా దేవుని నుండి వచ్చిందని మనకు తెలుసు గనుక మనం ఆయన ఆజ్ఞలను కూడా అనుసరిస్తాం. (యోహాను 7:16-18) అలాంటి విధేయత మనల్ని ఆత్మీయ హాని నుండి కాపాడుతుంది, మన ఆనందాన్ని ఎక్కువ చేస్తుంది.
జీవితంలో నిజమైన సంకల్పం
7, 8. (ఎ) కీర్తన 90:12ను మనం ఎలా అర్థం చేసుకోవాలి? (బి) మనమెలా జ్ఞానహృదయాన్ని పొందవచ్చు?
7 మన జీవితాన్ని ఒక సంకల్పంతో ఎలా ఉపయోగించుకోవాలో చూపించుటలో యెహోవా బోధ మనకు ప్రయోజనకరమౌతుంది. వాస్తవానికి, మన దినాల్ని ఒక ప్రత్యేకమైన విధంగా ఎలా లెక్కించాలో దైవిక బోధ మనకు చూపిస్తుంది. డెబ్భై సంవత్సరాల జీవన వ్యవధి దాదాపు 25,550 దినాల వాగ్దానాన్నిస్తుంది. యాభై సంవత్సరాల వ్యక్తి ఇప్పటికే వాటిలో 18,250 గడిపేసాడు, మిగిలివుంటాయని నిరీక్షిస్తున్న అతని 7,300 దినాలు నిజానికి చాలా తక్కువే అనిపిస్తాయి. “మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము” అని కీర్తన 90:12 నందు మోషే దేవుని కెందుకలా ప్రార్థించాడో ప్రత్యేకంగా అప్పుడే అతను బాగా గ్రహిస్తాడు. కాని అలా చేయడంలో మోషే ఉద్దేశమేమిటి?
8 ప్రతి ఇశ్రాయేలీయుని జీవితకాలంలో కచ్చితంగా ఎన్ని దినాలుంటాయో దేవుడు తెలియజేస్తాడని మోషే భావం కాదు. కీర్తన 90లోని 9, 10 వచనాల ప్రకారం, జీవితాయుష్షు 70 లేక 80 సంవత్సరాలని ఆ హెబ్రీ ప్రవక్త గుర్తించాడు—నిజంగా చాలా తక్కువే. ‘వారి సంవత్సరాల దినాలను’ లెక్కించటంలో జ్ఞానాన్ని ప్రదర్శించటానికి, దేవుడంగీకరించే విధంగా వాటిని ఉపయోగించటానికి తనకు, తన ప్రజలకు యెహోవా చూపించాలన్న, లేక నేర్పించాలన్న మోషే ప్రార్థనాపూర్వక కోరికను కీర్తన 90:12 నందలి మాటలు వ్యక్తపర్చాయి. సరే మరి మన మాటేమిటి? ప్రతి విలువైన దినాన్ని మనం మెచ్చుకుంటున్నామా? మన మహోపదేశకుడైన యెహోవా దేవునికి మహిమ కలిగేలా ప్రతిరోజును మనం తగినవిధంగా గడపటానికి ప్రయత్నించడం ద్వారా మనం జ్ఞానహృదయాన్ని కలిగివుంటున్నామా? సరిగ్గా అది చేయటానికే దైవిక బోధ మనకు సహాయం చేస్తుంది.
9. యెహోవా మహిమ కొరకు మనం మన దినాలను లెక్కించటం నేర్చుకుంటే ఏమి ఎదురుచూడవచ్చు?
9 మనం మన దినాల్ని యెహోవా మహిమ కొరకు లెక్కించడం నేర్చుకుంటే, దైవిక బోధ నిరంతర జీవానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది గనుక మనం లెక్కిస్తూనే ఉండవచ్చు. యేసు ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) మనకు లభ్యమౌతున్న లోక జ్ఞానాన్నంతటినీ తీసుకున్నా, అది మనకు నిత్య జీవాన్ని తీసుకురాదు. కాని విశ్వంలోకెల్లా అత్యంత ప్రముఖులైన ఇద్దరు వ్యక్తులను గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని పొంది దాన్ని, అనుసరిస్తే, నిజంగా విశ్వాసాన్ని కనబరిస్తే, మనం నిత్య జీవాన్ని పొందవచ్చు.
10. విద్య గురించి ఒక ఎన్‌సైక్లోపీడియా ఏమి చెబుతున్నది, దైవిక బోధ ప్రయోజనాలతో దీన్నెలా పోల్చవచ్చు?
10 మనం ఇప్పటికే ఎంతకాలం జీవించినప్పటికీ, దైవిక బోధ యొక్క ఈ విశేషమైన ప్రయోజనాన్ని మనం గుర్తుంచుకుందాం: దాన్ని అనుసరించే వారికి అది జీవితంలో నిజమైన సంకల్పాన్నిస్తుంది. ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా తెలియజేస్తుంది: “ప్రజలు సమాజానికి ఉపయోగపడే సభ్యులగుటకు విద్య సహాయం చేయాలి. వారి సాంస్కృతిక సాంప్రదాయం యెడల మెప్పును పెంపొందించుకొని, ఎక్కువ సంతృప్తికరమైన జీవితాలను జీవించటానికి కూడా వారికి సహాయం చేయాలి.” సంతృప్తికరమైన జీవితాలను జీవించటానికి మనకు సహాయం చేయడంలో దైవిక బోధ ప్రయోజనకరమైంది. దేవుని ప్రజలుగా మన ఆత్మీయ వారసత్వం యెడల మనలో అది ప్రగాఢమైన మెప్పును పెంపొందింపజేస్తుంది. భూవ్యాప్తంగావున్న ప్రజల అవసరతలను తీర్చడంలో ముఖ్యమైన పాత్రను నిర్వహించుటకు అది మనకు సహాయం చేస్తుంది గనుక, అది మనల్ని కచ్చితంగా సమాజానికి ఉపయోగపడే సభ్యులనుగా చేస్తుంది. అలా ఎందుకు చెప్పవచ్చు?
ప్రపంచవ్యాప్త బోధనా కార్యక్రమం
11. సరైన విద్య యొక్క అవసరతను గురించి థామస్ జెఫర్‌సన్ ఎలా ఉన్నత పర్చాడు?
11 మరే ఇతర ఉపదేశ కార్యక్రమం చేయలేని విధంగా, దైవిక బోధ ప్రజల విద్యాసంబంధ అవసరతలను తీరుస్తుంది. అమెరికా మూడవ అధ్యక్షుడయిన థామస్ జెఫర్‌సన్ ప్రజలకు బోధించాల్సిన అవసరతను గుర్తించాడు. ఆగష్టు 13, 1786లో వ్రాసిన ఒక లేఖలో, తన స్నేహితుడు మరియు స్వాతంత్ర్య ప్రకటన మీద తనతోపాటు సంతకం చేసిన జార్జ్ విత్‌కు, జెఫర్‌సన్ ఇలా వ్రాశాడు: “ప్రజలలో జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం మన చట్టమంతటిలో ప్రాముఖ్యమైన కట్టడ అయివుండాలని నేను అనుకుంటున్నాను. స్వాతంత్ర్య, సంతోషాలను కాపాడటానికి మరే కచ్చితమైన పునాదిని కల్పించలేము. . . . కాబట్టి డియర్ సర్, అజ్ఞానానికి వ్యతిరేకంగా గట్టి ప్రచారం చేయండి; సామాన్య ప్రజలను విద్యావంతులను చేసే చట్టాన్ని స్థాపించి, మెరుగుపర్చండి. [విద్యా] సంకల్పం కొరకు ఇవ్వబడే పన్ను, ప్రజలను మనం అజ్ఞానంలో వదిలివేస్తే, మన మధ్య నుండి వచ్చే రాజులు, యాజకులు, ప్రభువుల కొరకు ఇచ్చేదానిలో వెయ్యో వంతు కంటే ఎక్కువ కాదని . . . మన దేశప్రజలు తెలుసుకోవాలి.”
12. లోకవ్యాప్త విద్యా కార్యక్రమం కొరకు దైవిక బోధ అత్యంత విజయవంతమైంది, ప్రయోజనకరమైంది అని ఎందుకు చెప్పవచ్చు?
12 నీతి యెడల ప్రేమగల ప్రజలను అజ్ఞానంలో విడిచిపెట్టడానికి బదులు యెహోవా బోధ వారి ప్రయోజనం కొరకు శ్రేష్ఠమైన ప్రపంచవ్యాప్త విద్యాబోధనా కార్యక్రమాన్ని అందజేస్తుంది. యాభై ఏళ్ల క్రితం రెండవ ప్రపంచ యుద్ధం ఇంకా కొనసాగుతుండగా, అమెరికా విద్యా పునర్నిర్మాణ సంస్థ “విశ్వ విద్యాబోధన” యొక్క అత్యవసరతను గుర్తించింది. ఆ అవసరత ఇప్పటికీ ఉంది, కాని దైవిక బోధ ఒక్కటే లోకవ్యాప్త విద్యాబోధనకు విజయవంతమైన కార్యక్రమము. అది అత్యంత ప్రయోజనకరమైనది కూడా ఎందుకంటే, అది ప్రజలను నిరాశ నుండి దూరం చేస్తుంది, వారిని నైతికంగా, ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తుంది, ప్రపంచ అహంకార, పక్షపాత వైఖరుల నుండి కాపాడుతుంది, నిత్యజీవం కొరకు జ్ఞానాన్ని ఇస్తుంది. అన్నిటికంటే ఎక్కువగా, యెహోవా దేవున్ని సేవించమని వారికి బోధించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రజలందరికీ ప్రయోజనం కలుగజేస్తుంది.
13. యెషయా 2:2-4 ఈనాడు ఎలా నెరవేరుతున్నది?
13 ఇప్పుడు దేవుని సేవకులౌతున్న అనేకమంది, దైవిక బోధ ప్రయోజనాలను అనుభవిస్తున్నారు. వారు తమ ఆత్మీయ అవసరత గురించి శ్రద్ధ కలిగియున్నారు, యెహోవా దినం సమీపిస్తుందని వారికి పూర్తిగా తెలుసు. (మత్తయి 5:3; 1 థెస్సలొనీకయులు 5:1-6) ఇప్పుడే, యీ “అంత్యదినములలో,” ఆయన స్వచ్ఛారాధనయైన యెహోవా పర్వతానికి సమస్త అన్యజనులు ప్రవాహం వలె వస్తున్నారు. అది స్థిరంగా స్థాపించబడింది, దేవుని చిత్తానికి విరుద్ధంగావున్న ఆరాధనంతటిపైనా అది ఉన్నతపర్చబడింది. (యెషయా 2:2-4) మీరు సమర్పించుకున్న యెహోవాసాక్షియైతే, అంతకంతకూ పెరిగిపోతూ ఆయనను ఆరాధించే గుంపులో చేరి దైవిక బోధ ద్వారా ప్రయోజనం పొందేవారిలో ఒకరై ఉండుటకు మీరు ఇష్టపడటం లేదా? “యెహోవాను స్తుతించుడి” అని చెబుతున్న వారిలో ఒకరై ఉండటం ఎంత అద్భుతంగా ఉంటుంది!—కీర్తన 150:6.
మన ఆత్మపై ప్రయోజనకరమైన ప్రభావం
14. మొదటి కొరింథీయులు 14:20 నందలి పౌలు ఉపదేశాన్ని అనుసరించడంలో ఏమి ప్రయోజనముంది?
14 దైవిక బోధ యొక్క అనేక ప్రయోజనాలలో అది మన ఆలోచనా విధానంపై, మన ఆత్మపై కలుగజేసే మంచి ప్రభావం ఒకటి. సత్యమైన, మాన్యమైన, పవిత్రమైన, ఖ్యాతిగల వాటి గురించి ఆలోచించటానికి అది మనల్ని పురికొల్పుతుంది. (ఫిలిప్పీయులు 4:8) “దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి” అనే పౌలు ఉపదేశాన్ని అనుసరించుటకు యెహోవా బోధ మనకు సహాయం చేస్తుంది. (1 కొరింథీయులు 14:20) మనం ఈ బోధను అనుసరిస్తే, దుష్ట తలంపుతో జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించము. పౌలు ఇలా కూడా వ్రాశాడు: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (ఎఫెసీయులు 4:31) అలాంటి ఉపదేశాన్ని అంగీకరించడం లైంగిక దుర్నీతిని, ఇతర గంభీరమైన పాపాలను చేయకుండా ఉండుటకు సహాయం చేస్తుంది. అది మనకు శారీరకంగా, మానసికంగా ప్రయోజనకరమైందే కాక, దేవున్ని ప్రీతిపరుస్తున్నామని తెలుసుకోవటం ద్వారా కలిగే ఆనందాన్ని కూడ అది మనకు ప్రత్యేకంగా కలుగజేస్తుంది.
15. ఆలోచనలో యథార్థంగా ఉండటానికి ఏది మనకు సహాయం చేస్తుంది?
15 మనం తలంపులో పవిత్రంగా ఉండాలంటే, ఒక సహాయం ఏమిటంటే, ‘మంచి నడవడిని చెరిపే దుష్టసాంగత్యాన్ని’ అరికట్టాలి. (1 కొరింథీయులు 15:33) క్రైస్తవులుగా మనం వ్యభిచారులతో, లైంగిక దుర్నీతిపరులతో ఇతర తప్పులు చేసేవారితో సాంగత్యము కలిగివుండము. సహేతుకంగా, మానసిక ఆనందం కొరకు వారి గురించి చదవడం ద్వారా లేక వారిని దూరదర్శినిలో లేక సినిమాలలో చూడటం ద్వారా అలాంటి వ్యక్తులతో మనం సహవసించకూడదు. హృదయం మోసకరమైంది, అది సుళువుగా చెడ్డ విషయాలను కోరుకుని, వాటిని చేయడానికి శోధింపబడవచ్చు. (యిర్మీయా 17:9) కాబట్టి మనం దైవిక బోధను హత్తుకొని ఉండటం ద్వారా అలాంటి శోధనలను తప్పించుకుందాం. “యెహోవాను ప్రేమించు” వారు “చెడును ద్వేషించు” నంత ప్రయోజనకరమైన మేరకు అది వారి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంది.—కీర్తన 97:10.
16. మనం కనబరచే స్వభావంపై దేవుని బోధ ఎలాంటి ప్రభావం కల్గి ఉండగలదు?
16 తన తోటి పనివాడైన తిమోతికి పౌలు ఇలా చెప్పాడు: “ప్రభువు నీ ఆత్మకు తోడైయుండును గాక. కృప మీకు తోడై యుండును గాక.” (2 తిమోతి 4:22) తిమోతి మరితర క్రైస్తవులను పురికొల్పే ప్రేరణా శక్తిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆమోదించాలని అపొస్తలుడు కోరుకున్నాడు. మనం ప్రేమపూర్వకమైన, దయగల, సాత్వికమైన ఆత్మను ప్రదర్శించటానికి దేవుని బోధ మనకు సహాయం చేస్తుంది. (కొలొస్సయులు 3:9-14) ఈ చివరి దినాల్లో ఉన్న అనేకమందికి, వారికి ఎంత తేడావుంది! వారు అహంకారులు, కృతజ్ఞతలేనివారు, అనురాగరహితులు, అతిద్వేషులు, గర్వాంధులు, సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, నిజమైన దైవ భక్తిలేనివారు. (2 తిమోతి 3:1-5) మనం దైవిక బోధ ప్రయోజనాలను అనుసరించడంలో కొనసాగినట్లైతే, దేవునికి, తోటి మానవులకు ప్రీతికరమైన స్వభావాన్ని కనబరుస్తాము.
మానవ సంబంధాలలో ప్రయోజనకరమైంది
17. వినయంతో కూడిన సహకారం ఎందుకంత ప్రాముఖ్యము?
17 తోటి ఆరాధికులతో వినయంతో కూడిన సహకారం కలిగివుండటం వల్ల వచ్చే ప్రయోజనాలను తెలుసుకొనుటకు యెహోవా బోధ మనకు సహాయం చేస్తుంది. (కీర్తన 138:6) ఈనాటి అనేకమంది ప్రజలవలె మనం నీతి సూత్రాలను అతిక్రమించముగాని, అంగీకరించటానికి సుముఖంగా ఉంటాము. ఉదాహరణకు, పెద్దల సమావేశాలలో నియమిత అధ్యక్షులు సమ్మతించటానికి సుముఖంగా ఉంటారు గనుక ఎంతో మంచి జరుగుతుంది. వీరు, భావోద్రేకం కారణహేతువును మరుగుచేయటానికి అనుమతించకుండా లేక అనైక్యతకు తావివ్వకుండా సత్యం నిమిత్తం శాంతంగా మాట్లాడగలరు. మనమందరం దైవిక బోధను అనుసరిస్తూనే ఉంటే, మనం అనుభవించే ఐక్యత నుండి సంఘంలోని సభ్యులందరూ ప్రయోజనం పొందుతారు.—కీర్తన 133:1-3.
18. తోటి విశ్వాసుల గురించి ఏ దృష్టిని కలిగివుండుటకు దైవిక బోధ మనకు సహాయం చేస్తుంది?
18 తోటి విశ్వాసుల గురించి సరైన ఉద్దేశాన్ని కలిగివుండటానికి సహాయం చేయుటలో కూడా దైవిక బోధ ప్రయోజనకరమైంది. యేసు ఇలా చెప్పాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనేగాని యెవడును నా యొద్దకు రాలేడు.” (యోహాను 6:44) ప్రాముఖ్యంగా 1919 నుండి, తన సేవకులు ఆయన తీర్పులను గూర్చి ప్రకటించునట్లు యెహోవా చేస్తున్నాడు, మరి ఈ ప్రపంచ వ్యాప్త హెచ్చరికతో సాతాను లోక విధానం కదలి ఊగిపోతున్నది, అదే సమయంలో, “ఇష్టవస్తువులైన” వారు అంటే, దేవునికి భయపడే మానవులు యెహోవా ఆరాధనా మందిరాన్ని మహిమతో నింపటంలో అభిషక్త క్రైస్తవులతోపాటు భాగం వహించటానికి అన్యజనుల నుండి తమను తాము వేరుపర్చుకొనుటకు దేవునిచే సమకూర్చబడుతున్నారు. (హగ్గయి 2:7) నిజంగా, దేవునిచే అలా సమకూర్చబడే ఇష్టులైన వారిని మనం ప్రియులైన సహవాసులుగా దృష్టించాలి.
19. తోటి క్రైస్తవులతో వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరించుకోవడం గురించి దేవుని బోధ ఏమి తెలియజేస్తున్నది?
19 మనందరం అపరిపూర్ణులమే గనుక, అన్నీ ఎప్పుడూ క్రమంగా జరుగకపోవచ్చు. తన రెండవ మిషనరీ యాత్రకు పౌలు బయలుదేరనైయుండగా, మార్కును వెంటబెట్టుకొని వెళ్లాలని బర్నబా నిర్ణయించుకున్నాడు. మార్కు “పంపూలియలో పని కొరకు తమతో కూడ రాక తమ్మును విడిచి” పెట్టాడు గనుక పౌలు దానికి అంగీకరించలేదు. దానితో “తీవ్రమైన వాదము కలిగింది.” బర్నబా మార్కును తీసుకుని కుప్రకు వెళ్లాడు, పౌలు సీలా కలిసి సిరియా, కిలికియ దేశాలకు వెళ్లారు. (అపొస్తలుల కార్యములు 15:36-41) తరువాత, మార్కు పౌలుతోపాటు రోములో ఉన్నాడు, అతని గురించి అపొస్తలుడు మంచిగా మాట్లాడాడు గనుక ఈ కలహము ఏమీలేకుండా సమసిపోయింది. (కొలొస్సయులు 4:10) మత్తయి 5:23, 24 మరియు మత్తయి 18:15-17ల యందు యేసు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా క్రైస్తవుల మధ్యనున్న వ్యక్తిగతమైన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చూపించడం దైవిక బోధ ప్రయోజనాలలో ఒకటి.
ఎప్పుడూ ప్రయోజనకరమైంది, విజయవంతమైంది
20, 21. దైవిక బోధను గూర్చిన మన పరిశీలన మనల్ని ఏమి చేయటానికి పురికొల్పాలి?
20 దైవిక బోధ యొక్క కొన్ని ప్రయోజనాలు, విజయాల గురించిన మన టూకీ పరిశీలన ద్వారా, దాన్ని మన జీవితంలో అమలు చేయుటకు పట్టుదలతో ప్రయత్నించవలసిన అవసరతను నిస్సందేహంగా మనమందరం గమనించవచ్చు. మరి ప్రార్థనాపూర్వక భావంతో, మనం మన మహోపదేశకుని నుండి నేర్చుకొనుట యందు కొనసాగుదాం. త్వరలోనే, దైవిక బోధ మునుపెన్నటి కన్నా ఎక్కువగా విజయవంతమగును. ఈ ప్రపంచ జ్ఞానులు వారి తుదిశ్వాస తీసుకొనడంతో అది విజయవంతమౌతుంది. (1 కొరింథీయులు 1:19 పోల్చండి.) అంతేకాక, ఇంకా లక్షలాది మంది దేవుని చిత్తాన్ని నేర్చుకొని చేస్తుండగా, సముద్రం నీటితో నిండియున్నట్లు భూమి యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండిపోతుంది. (యెషయా 11:9) ఇది విధేయులైన మానవజాతికి ఎంతటి మహత్తర ప్రయోజనాన్ని కలుగజేసి, విశ్వ సర్వాధిపతిగా యెహోవాను ఉన్నతపరుస్తుందో!
21 యెహోవా బోధ ఎప్పుడూ ప్రయోజనకరమైంది, విజయవంతమైంది. దేవుని గొప్ప పాఠ్యపుస్తకం యెడల పట్టుదలగల విద్యార్థి వలె దాని నుండి మీరు ప్రయోజనం పొందడంలో కొనసాగుతారా? మీరు బైబిలుకు అనుగుణంగా జీవిస్తూ ఉన్నారా, దాని సత్యాలను ఇతరులతో పంచుకుంటున్నారా? అలాగైతే, మన మహోపదేశకుడు, సర్వోన్నత ప్రభువైన యెహోవాకు మహిమ కలిగేలా దైవిక బోధ పూర్తి విజయాన్ని పొందడం చూడటానికి మీరు నిరీక్షించవచ్చు.
మీరేమి నేర్చుకున్నారు?
◻ మన జీవితాలపై దైవిక బోధ ఏ ఫలితాన్ని చూపించగలదు?
◻ యెహోవా బోధ ఎలా విద్యావసరతలను తీరుస్తున్నది?
◻ మన ఆలోచనా విధానంపై, దృక్పథంపై దైవిక బోధ ఏ ప్రయోజనకరమైన ఫలితాన్ని చూపగలదు?
◻ మానవ సంబంధాలకు సంబంధించి దేవుని బోధ ప్రయోజనకరమైనదని ఎలా నిరూపించబడింది?
[15వ పేజీలోని చిత్రం]
నోవహు వలె మనమూ, దేవునితో ఎలా నడవాలో దైవిక బోధ మనకు చూపిస్తుంది
[17వ పేజీలోని చిత్రం]
అన్ని జనాంగాల ప్రజలు యెహోవా పర్వతానికి ప్రవాహం వలె వస్తున్నారు