కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 2/1 పేజీలు 8-13
  • దైవిక బోధ జయిస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవిక బోధ జయిస్తుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జ్ఞానం కొరకు అన్వేషణ
  • యెహోవా యిచ్చిన గొప్ప పాఠ్యపుస్తకము
  • అంచెలంచెలుగా పొందే అవగాహన
  • దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి
  • ఆత్మతోను సత్యముతోను ఆరాధించుట
  • శ్రమలను, లోకాన్ని జయించుట
  • దైవిక బోధ ప్రయోజనాలను పొందండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దైవిక బోధ బలమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది
    మన రాజ్య పరిచర్య—1994
  • ఉత్సాహపూరిత సమావేశాలు దైవిక బోధను అందించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • “దైవిక బోధ” జిల్లా సమావేశములు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 2/1 పేజీలు 8-13

దైవిక బోధ జయిస్తుంది

“మీ కన్నులు మీ మహోపదేశకుని చూస్తున్నట్లుగా ఉండవలెను. మీరు కుడికిగాని ఎడమకుగాని తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని వెనుకనుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును.”—యెషయా 30:20, 21, NW.

1. యెహోవా ఉపదేశాన్ని ఎందుకు దైవిక బోధ అని సరిగ్గా పిలువవచ్చు?

యెహోవా దేవుడు, మనమెవరైనా పొందగల శ్రేష్ఠమైన బోధకు మూలము. ఆయన మాట్లాడినప్పుడు, ప్రాముఖ్యంగా ఆయన తన పరిశుద్ధ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, మనం వింటే ఆయన మన ఉత్తమ బోధకుడౌతాడు. (యెషయా 30:20) బైబిల్లోని హెబ్రీ లేఖనం కూడా ఆయనను “దేవాది దేవుడు” అని పిలుస్తున్నది. (కీర్తన 50:1) కాబట్టి, యెహోవా ఇచ్చే ఉపదేశమంటే దైవిక బోధయే.

2. దేవుడొక్కడే జ్ఞానవంతుడు అంటే ఏ భావంలో అది నిజము?

2 లోకం తాను కలిగివున్న విద్యాసంబంధ సంస్థలనుబట్టి ఎంతగానో గర్విస్తున్నది కాని, వాటిలో ఒక్కటి కూడా దైవిక బోధను అందజేయటం లేదు. కారణమేమంటే, చరిత్రంతటిలో మానవులు సంపాదించిన లోకజ్ఞానమంతా యెహోవా అనంత జ్ఞానంపై ఆధారపడిన దైవిక ఉపదేశంతో పోలిస్తే ఎంతో స్వల్పం. దేవుడు మాత్రమే జ్ఞానవంతుడని రోమీయులు 16:27 చెబుతుంది, యెహోవా మాత్రమే పరిపూర్ణ జ్ఞానం కలిగివున్నాడన్న భావంలో ఇది నిజము.

3. భూమిపై జీవించిన వారిలోకెల్ల యేసుక్రీస్తు ఎందుకు అత్యంత గొప్ప బోధకుడు?

3 దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, జ్ఞానానికి దృష్టాంతంగా ఉన్నాడు, ఆయన భూమిపై జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప బోధకుడు. ఆశ్చర్యమేమిలేదు! యుగాలనుండి పరలోకంలో యెహోవా ఆయనకు బోధకునిగా ఉండెను. వాస్తవానికి, తన మొదటి సృష్టియైన తన ఏకైక కుమారునికి దేవుడు ఉపదేశించడం మొదలుపెట్టినప్పుడే దైవిక బోధ ప్రారంభమైంది. అందుకే యేసు ఇలా చెప్పగలిగాడు: “తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాను.” (యోహాను 8:28; సామెతలు 8:22, 30) బైబిలులో వ్రాయబడిన క్రీస్తు స్వంతమాటలు మన దైవిక బోధ జ్ఞానాన్ని వృద్ధి చేస్తాయి. యేసు బోధించినదాన్నే బోధించడం ద్వారా, సంఘముచే ‘దేవుని నానావిధమైన జ్ఞానము’ తెలియబడాలనే సంకల్పం గల మహోపదేశకునికి అభిషక్త క్రైస్తవులు విధేయులౌతారు.—ఎఫెసీయులు 3:10, 11; 5:1; లూకా 6:40.

జ్ఞానం కొరకు అన్వేషణ

4. మెదడు సామర్థ్యాన్ని గూర్చి ఏమి చెప్పబడింది?

4 దైవిక బోధ ద్వారా వచ్చే జ్ఞానాన్ని పొందటానికి దేవుడిచ్చిన మన ఆలోచనా సామర్థ్యాలను బాగా ఉపయోగించటం అవసరం. మానవ మెదడుకు మహత్తరమైన శక్తి ఉంది గనుక ఇది సాధ్యమే. ది ఇన్‌క్రెడిబుల్‌ మెషీన్‌ అనే పుస్తకం ఇలా తెలియజేస్తుంది: “దాని జటిలమైన, సామర్థ్యంగల విద్యుత్‌రసాయన సంకేతాల ద్వారా సాధ్యమయ్యే గుణాలను—అంటే ఎంతో క్లిష్టమైన, మృదువైన మానవ మెదడుతో పోలిస్తే, మనం ఊహించగల అత్యంత అధునాతన కంప్యూటర్లు కూడా వట్టి మడ్డితో సమానమే. . . . ఏ క్షణంలోనైనా నీ మెదడు నుండి వెలువడే కోటానుకోట్ల సంకేతాలు అసాధారణ సమాచారాన్ని కలిగివుంటాయి. అవి మీ శరీర అంతర్గత, బాహ్య పరిసరాలు అంటే మీ కాలివేలి తిమ్మిరిని గూర్చిన, లేక కాఫీ సువాసనను గూర్చిన, లేక ఒక స్నేహితుని హస్య వ్యాఖ్యను గూర్చిన సమాచారాన్ని తెస్తాయి. ఇతర సంకేతాలు సమాచారాన్ని తయారు చేసి, విశ్లేషిస్తుండగా, అవి కొన్ని భావావేశాలను, జ్ఞాపకాలను, ఆలోచనలను, లేక ఒక నిర్ణయానికి దారితీసే పథకాలను ఉత్పన్నం చేస్తాయి. తక్షణమే మెదడులోని సంకేతాలు మీ ఇతర శరీర భాగాలకు అవేం చేయాలో తెలియజేస్తాయి అంటే, మీ కాలివేలును కదల్చటం, కాఫీ తాగటం, నవ్వటం, లేక బహుశా హాస్యపూరిత జవాబివ్వటం. అదే సమయంలో మీ మెదడు మీ శ్వాస ప్రక్రియను, రక్తం యొక్క రసాయనిక ప్రక్రియను, ఉష్ణోగ్రతను, మీకు తెలియకుండానే జరిగే మరితర అవసరమైన ప్రక్రియలను కూడా నడిపిస్తూనే ఉంటుంది. మీ పరిసరాల్లో క్రమంగా మార్పులు జరుగుతున్నప్పటికీ, మీ శరీరాన్ని సరిగ్గా పనిచేసేలా ఉంచటానికి కావలసిన ఆజ్ఞలను జారీ చేస్తూనే ఉంటుంది. అది భవిష్యత్‌ అవసరతల కొరకు కూడా సిద్ధం చేస్తుంది.”—326వ పేజి.

5. లేఖన భావంలో జ్ఞానమంటే ఏమిటి?

5 మానవ మెదడుకు నిస్సందేహంగా అద్భుతమైన సామర్థ్యం ఉన్నప్పటికీ, మనం మన మెదడును ఎలా శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించగలం? భాష, చరిత్ర, విజ్ఞానశాస్త్రం, లేక తులనాత్మక మతం లాంటి వాటి గూర్చి దీక్షతో అధ్యయనం చేయడంలో మనం పూర్తిగా నిమగ్నమైపోవడం ద్వారా కాదు. దైవిక బోధను పొందటానికి ప్రాముఖ్యంగా మనం మన ఆలోచనా సామర్థ్యాలను ఉపయోగించాలి. అప్పుడే నిజమైన జ్ఞానాన్ని పొందగలం. కాని నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? లేఖన భావంలో, సరియైన జ్ఞానం మరియు నిజమైన గ్రహింపు మీద ఆధారపడి చేసే సరైన నిర్ణయమని జ్ఞానం ఉద్ఘాటిస్తుంది. సమస్యలను విజయవంతంగా పరిష్కరించుకోవడానికి అంటే, ప్రమాదాలను తప్పించుకోవడానికి లేక నివారించుకోవడానికి, ఇతరులకు సహాయం చేయడానికి, అవసరమైన గమ్యాలను చేరుకోవడానికి తెలివిని, సరియైన వివేచనను ఉపయోగించుటకు జ్ఞానం మనకు సహాయం చేస్తుంది. ఆసక్తికరమైన విధంగా, మనం కచ్చితంగా విసర్జించదలచే మూర్ఖత్వం, మూఢత్వాలనేవి జ్ఞానానికి వ్యతిరేకమైనవని బైబిలు చూపిస్తున్నది.—ద్వితీయోపదేశకాండము 32:6; సామెతలు 11:29; ప్రసంగి 6:8.

యెహోవా యిచ్చిన గొప్ప పాఠ్యపుస్తకము

6. మనం నిజమైన జ్ఞానాన్ని కనపర్చాలంటే, దేన్ని బాగుగా ఉపయోగించాలి?

6 మనచుట్టూ లోక జ్ఞానం పుష్కలంగా ఉంది. (1 కొరింథీయులు 3:18, 19) ఈ ప్రపంచం కోట్లకొలది పుస్తకాలు గల పాఠశాలలు, గ్రంథాలయాలతో నిండిపోయింది! వీటిలో అనేకం భాష, గణితం, విజ్ఞానశాస్త్రం, మరితర రంగాల్లో ఉపదేశాన్నిచ్చే పాఠ్యపుస్తకాలే. కాని మన మహోపదేశకుడు, ఇతర అన్ని పాఠ్యపుస్తకాలను మించిన పుస్తకమైన తన ప్రేరేపిత వాక్యమగు బైబిలును మనకు ఇచ్చాడు. (2 తిమోతి 3:16, 17) చరిత్ర, భూగోళము, వృక్షశాస్త్రం వంటి అంశాలను గూర్చి తెలిపేటప్పుడే కాకుండా, భవిష్యత్తును గూర్చి ప్రవచించేటప్పుడు కూడా అది కచ్చితంగా చెబుతుంది. అంతేగాక, ఇప్పుడు కూడా మనం అంత్యంత ఆనందదాయకమైన, ఫలవంతమైన జీవితాన్ని జీవించుటకు అది మనకు సహాయం చేస్తుంది. అయితే, లోక పాఠశాలల్లోని విద్యార్థులు తమ పుస్తకాలను ఉపయోగించినట్లే, మనం ‘యెహోవా చేత బోధింపబడినవారి’ వలే నిజమైన జ్ఞానాన్ని ప్రదర్శించాలంటే మనం కూడా దేవుని గొప్ప పాఠ్యపుస్తకంతో బాగా పరిచయం చేసుకొని దాన్ని బాగా ఉపయోగించాలి.—యోహాను 6:45.

7. బైబిలులోని జ్ఞానం మనస్సునందు కలిగివుంటే మాత్రము సరిపోదని మీరెందుకు చెప్పగలరు?

7 అయినా, బైబిలులోని జ్ఞానం మనస్సునందు కలిగి ఉండడమంటే నిజమైన జ్ఞానం మరియు దైవిక బోధను అమలుపర్చటంతో సమానం కాదు. దాన్ని వివరించాలంటే: సా.శ. 17వ శతాబ్దంలో, కొర్నేలియస్‌ వాన్‌డెర్‌స్టేన్‌ అనే పేరుగల ఒక కాథోలిక్కు, జెసూట్‌ కావాలని కోరుకున్నాడు కాని అతడు మరీ పొట్టిగా ఉన్నందున అందుకు నిరాకరింపబడ్డాడు. ది జెసూట్స్‌—హిస్టరీ అండ్‌ లెజెండ్‌ ఆఫ్‌ ది సొసైటి ఆఫ్‌ జీసస్‌ అనే తన పుస్తకంలో మాన్‌ఫ్రైట్‌ బరెటెల్‌ ఇలా అంటున్నాడు: “ఎత్తుకు సంబంధించిన నిబంధనలను రద్దుచేయటానికి మేము సిద్ధంగానే ఉన్నాము కాని కేవలం ఒక షరతు ఏమిటంటే అతను బైబిలును పూర్తిగా కంఠస్థం చేసి చెప్పటం నేర్చుకోవాలి అని కమిటీ వాన్‌డెర్‌స్టేన్‌కు తెలియజేసింది. అహంతో కూడిన ఈ విన్నపాన్ని వాన్‌డెర్‌స్టేన్‌ సమ్మతించకపోయి ఉంటే ఈ కథనమంతా చెప్పవలసిన అవసరం ఉండేదికాదు.” బైబిలును పూర్తిగా కంఠస్థం చేయటానికి ఎంతటి కృషి అవసరమాయెనో! అయినా, నిజానికి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయటం కంటే దాన్ని అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యము.

8. దైవిక బోధ నుండి ప్రయోజనం పొంది, నిజమైన జ్ఞానాన్ని కనబర్చుటకు మనకేమి సహాయం చేస్తుంది?

8 దైవిక బోధనుండి మనం పూర్తిగా ప్రయోజనం పొందాలంటే, నిజమైన జ్ఞానాన్ని ప్రదర్శించాలంటే, మనకు లేఖనాలను గూర్చిన ఖచ్చితమైన జ్ఞానం అవసరం. మనం యెహోవా పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తితో కూడా నడిపింపబడాలి. ఇది “దేవుని మర్మములను,” లోతైన సత్యాలను నేర్చుకొనుటకు మనకు సహాయం చేస్తుంది. (1 కొరింథీయులు 2:10) కాబట్టి, మనం యెహోవా యిచ్చిన గొప్ప పాఠ్యపుస్తకాన్ని పట్టుదలతో చదివి, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఇచ్చే నడిపింపు కొరకు ప్రార్థిద్దాము. సామెతలు 2:1-6 అనుగుణ్యంగా, మనం జ్ఞానానికి చెవియొగ్గి, వివేచన నభ్యసించి, తెలివికై మొరపెడదాము. మనం దాన్ని దాచబడిన ధనమును వెదకినట్లు వెదకిన యెడల ‘యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో’ మనం గ్రహిస్తాము. దైవిక బోధ యొక్క కొన్ని విజయాలను, ప్రయోజనాలను పరిశీలించడం దేవుడిచ్చే జ్ఞానం యెడల మన మెప్పును అధికం చేస్తుంది.

అంచెలంచెలుగా పొందే అవగాహన

9, 10. ఆదికాండము 3:15 నందు వ్రాయబడి యున్నట్లు దేవుడు ఏం చెప్పాడు, ఆ మాటల సరైన అవగాహన ఏమిటి?

9 దైవిక బోధ, యెహోవా ప్రజలకు లేఖనాలను గూర్చిన అంచెలంచెల అవగాహనను ఇవ్వడం ద్వారా జయిస్తుంది. ఉదాహరణకు, తినవద్దన్న పండు తింటే మరణమే తగిన శిక్షయని దేవుడు చెప్పినప్పుడు ఆయన అబద్ధమాడాడని అపవాదియగు సాతాను ఏదెనులో సర్పము ద్వారా మాట్లాడి అబద్ధ నేరారోపణ చేశాడని మనం నేర్చుకున్నాం. అయినప్పటికీ, యెహోవాకు అవిధేయత చూపించడం వల్లే మానవజాతికి మరణం వచ్చినట్లు మనం చూస్తున్నాము. (ఆదికాండము 3:1-6; రోమీయులు 5:12) అయినా, దేవుడు సాతాన్నుద్దేశించి సర్పముతో ఇలా చెప్పడం ద్వారా మానవజాతికి నిరీక్షణ నిచ్చాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.”—ఆదికాండము 3:15.

10 దైవిక బోధ ద్వారా అంచెలంచెలుగా బయలుపర్చబడిన ఒక రహస్యం ఈ మాటలలో చేరివుంది. రాజ్య పరిపాలనకు చట్టబద్ధమైన హక్కుగల అబ్రాహాము, దావీదుల వారసుడైన సంతానం ద్వారా తన సర్వాధిపత్యాన్ని ఘనపర్చడం బైబిలు యొక్క ప్రధానమైన మూలాంశమని యెహోవా తన ప్రజలకు బోధించాడు. (ఆదికాండము 22:15-18; 2 సమూయేలు 7:12, 13; యెహెజ్కేలు 21:25-27) దేవుని విశ్వ సంస్థయైన “స్త్రీ” యొక్క ప్రథమ సంతానం యేసుక్రీస్తని మన మహోపదేశకుడు మనకు బోధించాడు. (గలతీయులు 3:16) సాతాను యేసుపైకి అనేక శోధనలు తెచ్చినప్పటికీ, ఆయన మరణం వరకు అంటే సంతానాన్ని మడిమెపై కొట్టేంత వరకు తన యథార్థతను కాపాడుకున్నాడు. “ఆదిసర్పమైన” సాతాను తలను చితక్కొట్టడంలో క్రీస్తుతోపాటు, మానవజాతి నుండి తీసుకొనబడిన 144,000 మంది రాజ్య సహవారసులు భాగం వహిస్తారని కూడా మనం నేర్చుకున్నాము. (ప్రకటన 14:1-4; 20:2; రోమీయులు 16:20; గలతీయులు 3:29; ఎఫెసీయులు 3:4-6) దేవుని వాక్యంలోని అలాంటి జ్ఞానాన్ని మనమెంతో మెచ్చుకోవాలిగదా!

దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి

11. ప్రజలను ఆత్మీయ వెలుగులోకి తేవటం ద్వారా దైవిక బోధ జయిస్తుందని ఎందుకు చెప్పవచ్చు?

11 ప్రజలను ఆత్మీయ వెలుగులోనికి తేవడం ద్వారా దైవిక బోధ జయిస్తుంది. 1 పేతురు 2:9 నెరవేర్పు ప్రకారం అభిషక్త క్రైస్తవులు దాన్ని అనుభవించారు: “అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.” పరదైసు భూమిపై నిరంతరము జీవించే “ఒక గొప్ప సమూహము” కూడా ఈనాడు దేవుడిచ్చిన ఈ వెలుగును అనుభవిస్తున్నారు. (ప్రకటన 7:9; లూకా 23:43) దేవుడు తన ప్రజలకు బోధిస్తుండగా, సామెతలు 4:18 నిజమని రుజువౌతుంది: “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.” వ్యాకరణం, చరిత్ర, లేక మరితర అంశాలను విద్యార్థులు చదివేటప్పుడు వారి ఉపాధ్యాయుని మంచి సహాయంతో వారెలా అభివృద్ధి చెందుతారో అలాగే, అంచెలంచెలుగా నేర్చుకునే యీ ప్రక్రియ మన దైవిక బోధ అవగాహనను మెరుగు పరుస్తుంది.

12, 13. ఏ సిద్ధాంతపరమైన ప్రమాదాలలో పడకుండా దైవిక బోధ యెహోవా ప్రజలను కాపాడింది?

12 విధేయతతో దాన్ని పొందేవారిని దైవిక బోధ “దయ్యాల బోధ” నుండి కాపాడుతుందనుట దాని మరో విజయం. (1 తిమోతి 4:1) అటు, క్రైస్తవమత సామ్రాజ్యం వైపు చూడండి! పూర్వం 1878లో రోమన్‌ కాథోలిక్‌ మతగురువైన జాన్‌ హెన్రీ న్యూమాన్‌ ఇలా వ్రాశాడు: “చెడు ప్రభావానికి లోనుకాకుండా ఉండి, దయ్యాల ఆరాధనకు సంబంధించిన వస్తువులను, ఆచారాలను మార్చి సువార్త పనికొరకు ఉపయోగించగల క్రైస్తవత్వపు శక్తి యందు నమ్మకముంచి . . . అవసరమైతే సామాన్య ప్రజల ఆచారవ్యవహారాలను అంగీకరించటానికి, లేక అనుకరించటానికి, లేక అనుమతించటానికి తొలి కాలాల నుండి చర్చి పాలకులు సిద్ధంగా ఉన్నారు.” పవిత్ర జలం, పౌరోహిత్య సంబంధ వస్త్రాలు, విగ్రహాలు “ఇవన్నీ అన్య మూలం నుండి వచ్చి, చర్చిలోనికి తీసుకోవటం వల్ల పరిశుద్ధ పర్చబడ్డాయి” అని కూడ న్యూమాన్‌ చెప్పాడు. అలాంటి మతభ్రష్టత్వం నుండి దైవిక బోధ దేవుని ప్రజలను కాపాడుతుంది కాబట్టి వారు నిశ్చయంగా ఎంతో కృతజ్ఞులై యున్నారు. అది అన్ని రకాలైన దయ్యాల బోధను అధిగమిస్తుంది.—అపొస్తలుల కార్యములు 19:20.

13 దైవిక బోధ మత సంబంధమైన లోపాలపై అన్ని విధాలుగా జయిస్తుంది. ఉదాహరణకు, దేవునివల్ల బోధింపబడినవారముగా మనం త్రిత్వాన్ని నమ్మము కాని యెహోవా సర్వోన్నతుడని, యేసు ఆయన కుమారుడని, పరిశుద్ధాత్మ దేవుని చురుకైన శక్తియని అంగీకరిస్తాము. బైబిలునందున్న నరకం అనేది మానవజాతి సామాన్య సమాధియని మనం గ్రహిస్తాం గనుక మనం నరకాగ్నికి భయపడము. అబద్ధ మతస్థులు మానవ ఆత్మ అమర్త్యమైనదని అంటారు కాని, చనిపోయిన వారు ఏమి ఎరుగరని మనకు తెలుసు. ఇలా మనం దైవిక బోధ ద్వారా పొందగల సత్యాలనెన్నిటినైనా పేర్కొనవచ్చు. ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యమైన మహా బబులోను యొక్క ఆత్మీయ దాసత్వం నుండి విడుదల పొందటం మనకెంతటి ఆశీర్వాదకరము!—యోహాను 8:31 32; ప్రకటన 18:2, 4, 5.

14. దేవుని సేవకులు ఆత్మీయ వెలుగులో ఎందుకు నడుస్తూ ఉండగలరు?

14 దైవిక బోధ మత సంబంధ లోపాలను జయిస్తుంది గనుక, దేవుని సేవకులు ఆత్మీయ వెలుగులో నడవటానికి అది సహాయం చేస్తుంది. అందువల్లే, వారు తమ వెనుక నుండి “ఇదే త్రోవ దీనిలో నడువుడి” అనే మాటను వింటుంటారు. (యెషయా 30:21) దైవిక బోధ ఆయన సేవకులను తప్పుడు వితర్కము నుండి కూడా కాపాడుతుంది. కొరింథు సంఘంలో “దొంగ అపొస్తలులు” సమస్య సృష్టిస్తున్నప్పుడు, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవైయున్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి . . . యున్నాము.” (2 కొరింథీయులు 10:4, 5; 11:13-15) సంఘములో సాత్వికముతో ఇచ్చే ఉపదేశము ద్వారా, బయటి వారికి సువార్త ప్రకటించడం ద్వారా దైవిక బోధకు వ్యతిరేకమైన వితర్కములు త్రిప్పికొట్టబడుతున్నవి.—2 తిమోతి 2:24-26.

ఆత్మతోను సత్యముతోను ఆరాధించుట

15, 16. యెహోవాను ఆత్మతోను, సత్యముతోను ఆరాధించడమంటే దాని భావమేమిటి?

15 రాజ్యసువార్త పని కొనసాగుతుండగా, దేవున్ని “ఆత్మతోను సత్యముతోను” ఎలా ఆరాధించాలో సాత్వికులకు చూపించడంలో దైవిక బోధ జయిస్తున్నది. సుఖారను ఊరి దగ్గరున్న యాకోబు బావినొద్ద యేసు నిత్యజీవాన్నిచ్చే నీటిని ఇవ్వగలనని ఆయన సమరయ స్త్రీతో చెప్పాడు. సమరయుల గురించి మాట్లాడుతూ ఆయనిలా అన్నాడు: “మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, . . . అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.” (యోహాను 4:7-15, 21-23) అప్పుడు యేసు తనను తాను మెస్సీయగా గుర్తించుకున్నాడు.

16 అయితే మనం దేవున్ని ఆత్మతో ఎలా ఆరాధించగలం? ఆయన వాక్యము యొక్క సరియైన జ్ఞానముపై ఆధారపడిన దేవుని ప్రేమతో నిండిన కృతజ్ఞతగల హృదయాలతో స్వచ్ఛమైన ఆరాధనను చెల్లించడం ద్వారా అలా చేయవచ్చు. యెహోవా యిచ్చిన గొప్ప పాఠ్యపుస్తకంలో తెలియజేయబడినట్లు, మతపరమైన అబద్ధాన్ని నిరాకరిస్తూ, దైవిక చిత్తాన్ని చేయడం ద్వారా మనం ఆయనను సత్యముతో ఆరాధించవచ్చు.

శ్రమలను, లోకాన్ని జయించుట

17. యెహోవా సేవకులు శ్రమలు ఎదుర్కొనుటకు దైవిక బోధ సహాయం చేసిందని మీరెలా నిరూపించగలరు?

17 దేవుని ప్రజలు శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, దైవిక బోధ మాటిమాటికి జయిస్తుంది. దీన్ని పరిశీలించండి: రెండవ ప్రపంచ యుద్ధారంభంలో, 1939 సెప్టెంబరు నెలలో, యెహోవా సేవకులకు ఆయన యిచ్చిన గొప్ప పాఠ్యపుస్తకం యొక్క ప్రత్యేక పరిజ్ఞానం అవసరమైంది. క్రైస్తవ తటస్థత అనే అంశంపై దైవిక బోధను విశదంగా అందజేసిన నవంబరు 1, 1939 వాచ్‌టవర్‌లోని ఒక శీర్షిక ఎంతో సహాయకరంగా ఉంది. అలాగే, ప్రభుత్వపరమైన “పై అధికారులకు” పరిమిత విధేయత చూపించడంపై 1960వ దశాబ్దంలోని తొలి దశలో, వాచ్‌టవర్‌లో వచ్చిన శీర్షికలు, దేవుని ప్రజలు సాంఘిక అలజడి సమయంలో దైవిక బోధను అనువర్తింప జేసుకొనుటకు సహాయం చేశాయి.—రోమీయులు 13:1-7; అపొస్తలుల కార్యములు 5:29.

18. సా.శ. రెండు మూడు శతాబ్దాలలోని నామకార్థ క్రైస్తవులు హీనమైన వినోదాన్ని ఎలా దృష్టించారు, ఆ విషయంలో ఈనాడు దైవిక బోధ ఏ సహాయాన్ని అందజేస్తున్నది?

18 హీనమైన వినోదాన్ని పొందాలనే ఆకర్షణల వంటి శోధనలపై విజయం సాధించటానికి దైవిక బోధ మనకు సహాయం చేస్తుంది. మన సామాన్య శకము నాటి రెండు మూడు శతాబ్దాల నామకార్థ క్రైస్తవులు ఏం చెప్పారో గమనించండి. టెర్టూలియన్‌ ఇలా చెప్పాడు: “మాట, చూపు, లేక వినికిడి విషయంలో మాకు సర్కస్‌ వెర్రి, నాటకరంగము యొక్క సిగ్గులేనితనము, రంగస్థల క్రూరత్వములతో ఏమి సంబంధం లేదు.” ఆ కాలానికి చెందిన మరో రచయిత ఇలా అడిగాడు: “నమ్మకమైన క్రైస్తవుడు దుష్టత్వాన్ని గురించి కనీసం తలంచనే తలంచడు గనుక ఆయనకు వీటితో ఏం పని? కామానికి ప్రాతినిధ్యం వహించేవాటిలో ఆయనెందుకు ఆనందాన్ని పొందుతాడు?” ఈ రచయితలు మొదటి శతాబ్దపు క్రైస్తవులు జీవించిన కాలానికి కొన్ని సంవత్సరాల తర్వాత జీవించినప్పటికీ, వారు హీనమైన వినోదాన్ని ఖండించారు. అసభ్య, అవినీతికర, దౌర్జన్యపూరిత వినోదాన్ని విసర్జించటానికి ఈనాడు దైవిక బోధ మనకు జ్ఞానాన్నిస్తుంది.

19. లోకాన్ని జయించటానికి దైవిక బోధ మనకెలా సహాయం చేస్తుంది?

19 దైవిక బోధను అనువర్తింప జేసుకోవడం ద్వారా లోకాన్నే జయించటానికి మనకది సహాయం చేస్తుంది. అవును, మన మహోపదేశకుని బోధలను అనుసరించడం సాతాను అధీనమందున్న ఈ ప్రపంచ చెడు ప్రభావాలపై మనం విజయం సాధించేలా చేస్తుంది. (2 కొరింథీయులు 4:4; 1 యోహాను 5:19) మనం వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరిస్తూ, మన అపరాధములు, పాపములచేత చచ్చినవారమై ఉండగా దేవుడు మనల్ని బ్రదికించెనని ఎఫెసీయులు 2:1-3 తెలియజేస్తున్నది. ప్రధాన మోసగాడు, ఆయన శత్రువును, మన శత్రువునైన అపవాదియగు సాతాను నుండి ఉత్పన్నమౌతున్న లౌకికాత్మను, లోకాశలను జయించటానికి దైవిక బోధ మనకు సహాయం చేస్తుంది గనుక మనం యెహోవాకు కృతజ్ఞత తెలియజేస్తాము!

20. ఏ ప్రశ్నలు తరువాత పరిశీలించదగినవి?

20 అవును, అప్పుడు దైవిక బోధ ఎన్నో విధాలుగా విజయం సాధిస్తుంది. వాస్తవానికి, దాని అన్ని విజయాలను ఉదహరించటం అసాధ్యమనిపించవచ్చు. అది ప్రపంచమంతటావున్న ప్రజలపై ప్రభావం కల్గివుంది. కాని అది మీకొరకేం చేస్తుంది? దైవిక బోధ మీ జీవితాలపై ఎలా ప్రభావం చూపుతుంది?

మీరేమి నేర్చుకున్నారు?

◻ నిజమైన జ్ఞానాన్ని ఎలా నిర్వచించవచ్చు?

◻ ఆదికాండము 3:15 గురించి దేవుడు దేన్ని క్రమంగా బయల్పర్చాడు?

◻ ఆత్మీయ విషయాల్లో దైవిక బోధ ఎలా జయించింది?

◻ దేవున్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడమంటే అర్థమేమిటి?

◻ శ్రమలను, లోకాన్ని జయించటానికి దైవిక బోధ యెహోవా సేవకులకు ఎలా సహాయం చేసింది?

[10వ పేజీలోని చిత్రం]

సంతానాన్ని మడిమెపై కొట్టే వరకు—అంటే మరణం వరకు యేసు యథార్థత చూపించాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి