దేవుని వాక్యం ఉపదేశించడానికి ప్రయోజనకరం
1. రాబోయే సేవా సంవత్సరంలో జరిగే ప్రాంతీయ సమావేశ ముఖ్యాంశం ఏమిటి, ఆ కార్యక్రమంలో ఏ ప్రశ్నకు జవాబును పరిశీలిస్తాం?
1 మన దేవుడైన యెహోవా ఈ విశ్వంలోనే అత్యుత్తమ బోధకుడు. (యెష. 30:20, 21) అయితే, యెహోవా మనకు ఎలా బోధిస్తాడు? ఆయన, తాను ప్రేరేపించి రాయించిన బైబిలు అనే సాటిలేని గొప్ప గ్రంథాన్ని మనకు ఇచ్చాడు. దేవుని బోధ భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక విషయాల్లో మనకెలా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నకు జవాబును మనం 2014 సేవా సంవత్సరంలో జరిగే ప్రాంతీయ సమావేశ కార్యక్రమంలో పరిశీలిస్తాం. ఆ సమావేశ ముఖ్యాంశం, “దేవుని వాక్యం ఉపదేశించడానికి ప్రయోజనకరం.” దాన్ని 2 తిమోతి 3:16, 17 వచనాల నుండి తీసుకున్నారు.
2. ఏ ప్రశ్నల జవాబులు కార్యక్రమ ముఖ్యాంశాలను తెలియజేస్తాయి?
2 ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాం: ఈ కింది ప్రశ్నల జవాబులే కార్యక్రమంలోని ముఖ్యాంశాలు.
• దేవుని బోధ మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? (యెష. 48:17, 18)
• పూర్తికాల సేవ చేసేలా మన పరిస్థితుల్లో మార్పులు చేసుకుంటున్నప్పుడు, మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు? (మలా. 3:10)
• “అన్య బోధలు” ఎదురైనప్పుడు మనం ఎలా స్పందించాలి? (హెబ్రీ. 13:9)
• యేసు బోధనా విధానాన్ని మనం ఎలా అనుకరించవచ్చు? (మత్త. 7:28, 29)
• సంఘంలో బోధించేవాళ్లు, తమకు తాము ఎందుకు బోధించుకోవాలి? (రోమా. 2:21)
• దేవుని వాక్యం ఏమేమి చేయడానికి ప్రయోజనకరమైనది? (2 తిమో. 3:16, 17)
• ‘అన్యజనులను కదిలించడం’ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుంది? (హగ్గ. 2:6, 7)
• యెహోవాకు మనమీద ఏ నమ్మకం ఉంది? (ఎఫె. 5:1)
• యెహోవా బోధలో నిలిచివుండడానికి మనం ఎందుకు కృషి చేయాలి? (లూకా 13:24)
3. సమయానుకూలమైన ఈ కార్యక్రమానికి హాజరై, శ్రద్ధగా వినడం ఎందుకు ప్రాముఖ్యం?
3 ఈ కార్యక్రమ ముఖ్యాంశానికి ఆధారమైన 2 తిమోతి 3:16, 17లోని మాటలను రాయడానికి కాస్త ముందు పౌలు, అంత్యదినాల్లో ఉండే అపాయకర పరిస్థితుల గురించి వర్ణించాడు. “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు” అని ఆయన రాశాడు. (2 తిమో. 3:13) అయితే మనం మోసపోకూడదంటే, దేవుని బోధను విని, దాన్ని అన్వయించుకోవడం ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి, సమయానుకూలమైన ఈ కార్యక్రమానికి హాజరై, శ్రద్ధగా వినాలని నిశ్చయించుకుందాం.