తూర్పు పడమరలో, యెహోవా తన ప్రజలను బలపరుస్తున్నాడు
ప్రకటన పని నిషేధింపబడిన దేశాల్లోను, దౌర్జన్యం నిండివున్న దేశాల్లోను, ఇటీవలనే నిషేధాలను తీసివేసిన దేశాల్లోను, వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా, యెహోవా తన సాక్షులకు “బలాధిక్యము” కలుగజేస్తూనే ఉన్నాడు.—2 కొరింథీయులు 4:7.
నిషేధం క్రిందవున్నా అభివృద్ధి
ఇప్పటికి 17 సంవత్సరాల నుండి తూర్పు ప్రాంతమందలి ఆర్కిపెలాగోలో ప్రకటనపని నిషేధం క్రింద ఉంది. సాక్షులు నిరుత్సాహపడ్డారా? ఎంతమాత్రం లేదు! గత మే నెలలో, వారు 10,756 ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యకు చేరుకున్నారు, వీరిలో 1,297 మంది పూర్తికాల పరిచారకులుగా ఉన్నారు. ప్రపంచ పరిస్థితులు దిగజారిపోతుండగా, ద్వీపవాసులు సత్యాన్ని వినటానికి మునుపెన్నటికన్నా ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి ఆసక్తిని చూపే వారి గృహాల్లో 15,654 బైబిలు పఠనాలు నిర్వహించబడుతున్నట్లు వారు రిపోర్టు చేస్తున్నారు. అంతకు మునుపు, యేసు మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించటానికి రహస్యంగా జరిగిన సమావేశాలకు 25,397 మంది హాజరయ్యారు.
స్థానిక పరిస్థితులనుబట్టి మళ్లీ బహు జాగ్రత్తగా జరిగింపబడిన “దైవిక బోధ” జిల్లా సమావేశాల్లో, అమెరికాలో విడుదల చేయబడిన పుస్తకాలే అక్కడ కూడా తమ స్థానిక భాషలో విడుదల చేయబడినప్పుడు తమ కాపీలను అందుకోటానికి సహోదరులు ఎంతో ఆనందించారు. వందలాది పేజీలుగల ప్రాముఖ్యమైన విడుదలలను తగినవేళకు సిద్ధంచేయటానికి అనువాదకులు, ఫ్రూఫ్ రీడర్లు, మరితరులు ఎక్కువ గంటలు స్వచ్ఛందంగా పనిచేశారు. చక్కని ప్రింటింగ్, బైండింగ్ పనిని చేయటానికి సాక్షులుకాని ప్రింటింగ్ పనివారు కూడా సహకరించారు. వెయ్యి కంటే ఎక్కువ రంగురంగుల చిత్రాలున్న ప్రచురణను పొందుటకు సమావేశ ప్రతినిధులు ఎంతో సంతోషించారు. అనేకమంది ప్రభుత్వాధికారులు యెహోవాసాక్షులను గౌరవిస్తున్నారు, వ్యతిరేకత ప్రాముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకుల నుండే వస్తున్నది. త్వరలో నిషేధం తీసివేయబడుతుందని నిరీక్షిస్తున్నారు.
అమెరికా ఖండాల విషయమేమిటి?
ఈ పశ్చిమ దేశాల్లోని యెహోవాసాక్షులు, తమ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనడంలో తూర్పునందున్న తమ సహోదరులతో ఐక్యమై ఉన్నారు, కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కోటానికి యెహోవా పరిశుద్ధాత్మ వారికి సహాయం చేస్తుంది. ఉదాహరణకు, మత్తుపదార్థాలను అక్రమ రవాణాచేస్తూ నిత్యము అడవుల్లో తిరుగుతుండే గుంపులున్న ఒక లాటిన్ అమెరికా దేశం నుండి వచ్చిన నివేదికను పరిశీలించండి.
కొంతమంది సాక్షుల గుంపు విడిగా ఉన్న ఒక ప్రాంతానికి వెళ్లటానికి ఒక బస్సు ఎక్కారు. వారు బస్సు దిగిన తరువాత, గ్రామం నుండి ప్రక్కకు వెళుతున్న ఒక చిన్న మార్గాన్ని గమనించారు. సహోదరీలను, పిల్లలను గ్రామంలో సేవచేయటానికి పంపించి, ఆ చిన్న మురికి మార్గం ఎక్కడికి దారితీస్తుందో చూడటానికి ఐదుగురు సహోదరులు బయలుదేరారు. వారిలో ఒక సహోదరుడు ఇలా చెబుతున్నాడు:
“ఆ మార్గం వెంబడి రెండు గంటలు నడిచిన తరువాత అక్కడ కొన్ని ఇళ్లే కనిపించాయి. అప్పుడు, ఎనిమిదిమంది సాయుధ వ్యక్తులు తమ తలలపై ముసుగులతో హఠాత్తుగా అడవిలో నుండి బయటికి వచ్చారు. కొంతమంది దగ్గర మెషీన్ గన్లు, కొంతమంది దగ్గర పెద్దకత్తులు ఉన్నాయి. మాకెటువంటి పరిస్థితి ఎదురైంది? వారికేం కావాలని మేము అడగటం మొదలుపెట్టాం, కాని ఏమి మాట్లాడవద్దని, కేవలం నిశ్శబ్దంగా ముందుకు నడవమని వారు మాకు చెప్పారు. మేమలాగే చేశాం! మరో రెండుగంటలసేపు దట్టమైన అడవిలో నడచిన తరువాత చివరకు ఒక సాయుధ క్యాంపుకు మేము చేరుకున్నాం. తుపాకీలు పట్టుకుని ఉన్న కాపలాదారులు అంతటా ఉన్నారు. మధ్యలో చక్కగా నిర్మించిన ఒక ఇల్లు ఉంది, మమ్మల్ని అక్కడికే తీసుకువెళ్లారు.
“మేము కూర్చున్న తరువాత, క్యాంపు నాయకునిలా కనిపిస్తున్న ఒక వ్యక్తి మాతో మాట్లాడాడు. అతడు శుభ్రమైన బట్టలు వేసుకుని, విద్యాధికుడిలా, గౌరవపూర్వకంగా ఉన్నాడు. మా సహోదరుల గుంపులో ఒకరిని చూపించి లేచి నిలబడమని చెప్పాడు. తరువాత అతడు ఆయన్నిలా అడిగాడు: ‘మీరు [మా] గుంపును గురించి ఏమనుకుంటున్నారు?’ సహోదరుడు మేమెక్కడున్నామో బాగా అర్థంచేసుకుని ఇలా జవాబిచ్చాడు: ‘మీ వర్గం గురించి మాకు తెలుసు, కాని మాకు దానిలోగాని మరే ఇతర రాజకీయ వర్గంలోగాని ఎలాంటి ఆసక్తి లేదు. క్రీస్తుయేసు ద్వారా వచ్చే యెహోవా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించటానికి మాత్రమే మేమిక్కడున్నాము. అది ఈ విధానపు రాజకీయ ప్రభుత్వాలన్నిటినీ త్వరలోనే నాశనం చేసి, ఏ మానవుడు లేక ఏ మానవ గుంపు చేయలేని విధంగా, ఇదే భూమిపై ప్రజలకు పరదైసు పరిస్థితుల్లో అద్భుతమైన ఆశీర్వాదాలను తెస్తుంది.’
“ఆ వ్యక్తి దృక్పథం మారిపోయింది. అతను ప్రశ్నలడగటం ప్రారంభించాడు. ‘ఇవన్నీ మీరెక్కడ నేర్చుకున్నారు? అలా మాట్లాడటానికి మీరెలా సిద్ధమయ్యారు?’ ఒక గంటన్నర సేపు మేము వారికి లోక పరిస్థితుల గురించి మంచి సాక్ష్యమిచ్చి, మానవజాతికిగల ఏకైక నిరీక్షణను బైబిలు గుర్తిస్తున్నదని చూపించ గల్గాము. మేము అధికారంలో ఉన్న వారికి విధేయత చూపిస్తాము, కాని యెహోవా వాక్యానికి వారి మాటకి తేడా ఉన్నప్పుడు, మేము మా దేవుడైన యెహోవాకే మొదట విధేయత చూపిస్తామని చెప్తూ రోమీయులు 13వ అధ్యాయాన్ని కూడా మేము వివరించాం. చివరకు, మా వద్ద ఉన్న పుస్తకాలు అతనికి చూపించాము. అతను వాటిలో మూడింటిని, ఒక బైబిలును, తీసుకుని మేమెంతో ఆశ్చర్యపోయేలా వాటి వెల కూడా మాకు ఇచ్చాడు. వాటిని చదువుతానని అతను చెప్పాడు.
“తరువాత, మమ్మల్ని క్యాంపు నుండి బయటికి విడిచిపెట్టి రమ్మని ఆ నాయకుడు ఒక వ్యక్తికి సూచించాడు. సాక్ష్యమిచ్చే మరో రంగంలో మేము విజయం పొందగలిగినందుకు యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వెంటనే మేము తిరుగుదారి పట్టాము.”
కల్లోలిత ఆఫ్రికాలో
తూర్పు పడమరలకు మధ్యభాగంలో ఆఫ్రికా ఖండం ఉంది. జాతి విబేధాలు కొన్ని దేశాల్ని దౌర్జన్యంతో నిండిపోయేలా చేశాయి. లైబీరియాలో, పౌరపోరాటంతో ఏర్పడిన హఠాత్ పరిణామాలకు యెహోవా ప్రజలు మళ్లీ ఎంతగానో ప్రభావితులయ్యారు. ముఖ్య పట్టణం, దాని పరిసరాల్లో 1992 అక్టోబరు, నవంబరు నెలల్లో మొదట పోరాటం మొదలయ్యింది. తరువాత యుద్ధం దేశమంతటా వ్యాపించడంతో, సహోదరులు మిగతా ప్రజలతోపాటు పొదలలోకి వెళ్లిపోవడంతో అన్ని సంఘాలు చెదరిపోయాయి. అయినా, వారి ఆసక్తి తరిగిపోకుండా అలాగే ఉండిపోయింది. వారు పారిపోతూ, ప్రకటించే పనిచేశారు, దానితో మారుమూల ప్రాంతాల్లో గొప్ప సాక్ష్యమివ్వటానికి అవకాశం కలిగింది.
ఇళ్లు విడిచిరావలసివచ్చిన సహోదరులున్న ఒక సంఘం రబ్బరు చెట్ల మధ్యన ఒక తాత్కాలిక రాజ్యమందిరాన్ని నిర్మించింది. సైనిక క్యాంపుల వద్దవున్న ఒక పట్టణంలో, పగటి సమయంలో జరుగుతున్న విమాన బాంబు దాడులను తప్పించుకోవటానికి ప్రజలు రబ్బరు చెట్లలోకి వెళ్లి తలదాచుకునేవారు. స్థానిక సహోదరులు (ముఖ్య పట్టణమైన మోన్రోవియా నుండి ఇళ్లు విడిచిరావలసివచ్చిన సహోదరులతో కలిసి) క్షేత్రసేవను ఏర్పాటు చేసుకుని, రబ్బరు చెట్లక్రింద తలదాచుకునివున్న వేలాదిమందికి ప్రకటించడం తరచూ కనిపించేది! ఏదైనా ఒక విమానం వస్తుంటే, సహోదర సహోదరీలు దగ్గరలోవున్న గుంటల్లోకి దూకి, ప్రమాదం దాటిపోయిన తరువాత మళ్లీ సాక్ష్యమివ్వటం మొదలు పెట్టేవారు.
ఆశ్చర్యకరమైన విధంగా, ఈ పౌరపోరాట పరిస్థితులలో కూడా వెయ్యి కంటే ఎక్కువమంది సంఘ ప్రచారకులు సగటున క్షేత్ర సేవలో 18.1 గంటలు, నెలకు 3,111 బైబిలు పఠనాలు నిర్వహిస్తున్నట్లు సంస్థకు రిపోర్టులు పంపించారు.
గత నాలుగు సంవత్సరాల్లో, ఆఫ్రికాలోని 18 దేశాల్లో యెహోవాసాక్షుల సేవ మీద విధించిన నిషేధాలు ఎత్తివేయ బడ్డాయి. చెప్పలేనంత సంతోషం! మలావీలో సాక్షులపైన అక్టోబరు, 1967లో పెట్టబడిన నిషేధం ఈ ఆగస్టు 12న తీసివేసారు. రహస్యంగా చేసిన సువార్త ప్రకటనపని ఎప్పుడూ ఫలించింది, కాని వ్యతిరేకులచే చంపబడిన తమ ప్రియమైన అనేకమంది తోటివారిని అభినందించటానికి వారు పునరుత్థానము వరకు వేచివుండవలసి వున్ననూ, సాక్షులు ఇప్పుడు స్వేచ్ఛగా ముందుకు వెళ్లగలుగుతున్నారు.
మొజాంబిక్‌లో అక్టోబరు 4, 1992న ఒక శాంతి ఒప్పందం చేయబడింది. గత 16 సంవత్సరాల నాశనకరమైన యుద్ధం వల్ల మునుపు చేరలేని ప్రాంతాలను చేరుటకు వీలయ్యింది. కార్యెకో ప్రాంతంలో, గత ఏడు సంవత్సరాల నుండి సంస్థతో పూర్తిగా సంబంధం కోల్పోయిన 375 మంది సహోదర సహోదరీలను మళ్లీ కలుసుకోగలిగారు. ఎక్కువగా మలావీ నుండి వచ్చిన శరణార్థులైన యెహోవాసాక్షుల “రీఎడ్యుకేషన్” కొరకైన కేంద్రం మరియు కాన్సెన్ట్రేషన్ క్యాంపు ప్రాంతంగా మునుపు పిలువబడిన జిల్లా ముఖ్య పట్టణమైన మిలాంజ్లో ప్రత్యేకంగా ఒకరోజు సమావేశం జరిగింది. యెహోవాసాక్షులను ఆహ్వానించిన పుర పరిపాలకునితో సహా ఆశ్చర్యకరమైన విధంగా మొత్తం 2,915 మంది దానికి హాజరయ్యారు. కాబట్టి మునుపటి “రీఎడ్యుకేషన్” కొరకైన కేంద్రం ఆ రోజున దైవిక బోధకు కేంద్రమయ్యింది.
ఒక మిషనరీ ఇలా వ్రాస్తున్నారు: “టాటె ప్రాంతంలో, శరణార్థుల క్యాంపులలో ఉన్న సహోదరుల గురించి యు.యన్.హెచ్.సి.ఆర్. (యునైటెడ్ నేషన్స్ హై కమీషనర్ ఫర్ రెఫ్యూజీస్.) ప్రతినిధి ఒకరు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఇతర గుంపుల నుండి వేరుగా యెహోవాసాక్షులు తమ స్వంత క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారు అని ఆయన చెప్పాడు. ఆయనిలా అన్నాడు: ‘వారి క్యాంపు ఒక్కటే సరిగ్గా నిర్వహించబడేది, యెహోవాసాక్షులు పరిశుభ్రత గలవారు, సంస్థీకరింపబడినవారు, విద్యావంతులు.’ నేను స్వయంగా చూసి తెలుసుకోవటానికి ఆయన నన్ను విమానంలో పొదలమీదుగా తీసుకువెళ్లాడు. పైనుండి పైలట్ రెండు క్యాంపులు నాకు చూపించాడు. అసహ్యంగా, రోతగా ఏమాత్రం ప్లాను లేకుండా ఇరుకుగా మట్టితో కట్టబడిన ఇళ్లున్నది ఒకటి. మరొకటి, చక్కగా ప్లాను చేసి, ఇళ్లు రహదార్లతో వేరుచేయబడి ఉంది. ఊడ్చి శుభ్రంగా ఉన్న ప్రాంగణాలతో ఇళ్లు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లు ఇంటివద్ద తయారు చేయబడిన పెయింట్ వేయబడి కూడా ఉన్నాయి. ‘మీ వారికి చెందినది ఏదో గుర్తించండి?’ అని అన్నాడు పైలట్. ఈ క్యాంపులో ఉన్న సహోదరులను కలిసినందుకు నేనెంతో సంతోషించాను. ఈ సాక్షుల గ్రామంలో ఇప్పుడు ఎనిమిది సంఘాలున్నాయి.”
“గరుడపక్షి దేశం”లో
ఇది అమెరికా దేశ చిహ్నమైన గరుడపక్షి కాదు! తూర్పు పడమరలకు మధ్యన ఒక యూరపు దేశమైన అల్బేనియా ఉంది, దాని పేరు అధికారిక భాషలో స్కెపెరీ, అంటే “గరుడపక్షి దేశం” అని భావం. ఇటీవలనే, ఈ దేశంలో యెహోవాసాక్షులపై ఉన్న క్రూరమైన 50 సంవత్సరాల నిషేధం ఎత్తివేయబడింది, కాగా ఆరాధనా స్వాతంత్ర్యాన్ని అనుభవించడంలో వారు తూర్పు, పడమరలలో ఉన్న తమ సహోదరులతో ఐక్యం కాగల్గుతున్నారు. వారు నిజంగా “సమయమును పోనియ్యక సద్వినియోగము” చేస్తున్నారు. (ఎఫెసీయులు 5:16) అల్బేనియా చరిత్రలో మొట్టమొదటి ఒకరోజు సమావేశం, దాని ముఖ్యపట్టణమైన టిరేన్లోని నేషనల్ థియేటర్లో ఆదివారం మార్చి 21న జరిగింది. శనివారం మధ్యాహ్నం 75 మంది సాక్షులైన స్వచ్ఛందసేవకుల గుంపు ఒకటి శిథిలావస్థలో ఉన్న సమావేశ స్థలాన్ని ప్రకాశవంతమైన, పరిశుభ్రమైన సమావేశ హాలుగా మార్చివేసింది. యాజమాన్యం అమితాశ్చర్యపోయారు. డెబ్భై అయిదు మంది స్వచ్ఛంద సేవకులలో కేవలం 20 మంది మాత్రమే బాప్తిస్మం పొందినవారన్నది ఇక్కడ గమనించవలసిన విషయము!
వాతావరణం చాలా చక్కగా ఉంది. విదేశీ ప్రతినిధులు రాగానే చేతులూపడం, హత్తుకోవడం వంటి అభినందనలు ప్రత్యేక సమావేశ దినాన్ని మరీ ప్రత్యేకం చేశాయి. సహోదరుడు నాశో డోరె ఆకాశంవైపు చేతులెత్తి ప్రారంభ ప్రార్థన చేశాడు. ఆయన 1930లో బాప్తిస్మం తీసుకున్నాడు, ఇప్పుడు ఆయన దాదాపు అంధుడు. కార్యక్రమం అల్బేనియా భాషలో అందజేయబడింది, దానిలో విదేశాల నుండి వచ్చిన ప్రత్యేక పయినీర్లే ఎక్కువగా భాగం వహించారు. సమావేశం కొరకు తర్జుమా చేయబడిన ఆరు పాటలలో ఒకటైన “క్రిస్టియన్ డెడికేషన్” అనే పాటను సమావేశానికి హాజరైన 585 మంది పాడుతుండగా, సందర్శించ వచ్చిన గ్రీకు సహోదరులు దయతో స్థానిక రాజ్యమందిరంలోనే నెలకొల్పిన ఒక కొలనువైపుకు 41 మంది క్రొత్త సహోదర సహోదరీలు నడిచారు. ఎంతటి మార్పు! మునుపు బైబిలు కలిగివుండడమంటే బలవంతంగా వెట్టిచాకిరి చేయించే క్యాంపులకు పంపబడటంగా ఉండేది, సమావేశాలు కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కూడినవై ఉండేవి.
సమావేశం జరిగిన మరునాడు వాచ్‌టవర్ సంస్థకు థియేటర్ సంచాలకుని నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మామూలుగా అతడు థియేటర్‌ను ఉపయోగించేవారి యెడల ఎక్కువ శ్రద్ధ చూపించడు. అది సహాయ సంచాలకుని పని. అయితే ఆయనిలా చెప్పాడు: “కేవలం మీకు కృతజ్ఞతలు తెలపటానికే నేను ఫోన్ చేశాను. ఈ స్థలం ఇంత పరిశుభ్రంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. దాన్ని నేను వివరించాలంటే, పరలోకం నుండి నిన్న మా థియేటర్లోకి ఒకగాలి వీచిందని చెప్పాలి. ఎప్పుడైనా మీరు మా వసతిని ఉపయోగించు కోవాలనుకుంటే, దయచేసి మరలా రండి, మేము మీకు ప్రాధాన్యతనిస్తాము. నిజంగా ప్రతి మూడు నెలలకు మీరు వచ్చి ఉచితంగా వాడుకోవాలని మేము కోరుతున్నాము.”
సాక్షులు బలపర్చబడి, కృతజ్ఞతతో వారి పట్టణాలకు తిరిగివచ్చి యేసు మరణ జ్ఞాపకార్థ దినం కొరకు సిద్ధపడటం మొదలుపెట్టారు. కేవలం 15 రోజుల తరువాత, ఏప్రిల్ 6, మంగళవారంనాడు ఏడు స్థలాల్లో మొదటిసారి బహిరంగంగా జ్ఞాపకార్థ దినం ఆచరించబడింది.
బారట్ పట్టణంలో 170 మంది హాజరయ్యారు, కాగా స్థానిక ప్రీస్టు ఉగ్రుడైపోయాడు. బారట్లోని 33 మంది ప్రచారకులలో 21 మంది సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నారు. జ్ఞాపకార్థ దినాచరణకు 472 మంది హాజరైనట్లు బారట్ రిపోర్టు చేసింది. ముఖ్యంగా ప్రత్యేక పయినీర్లు ఇచ్చిన చక్కని నడిపింపు ఫలితంగా, ఇతర జ్ఞాపకార్థ దినాచరణకు హాజరైనవారి సంఖ్యలు కూడా విశేషంగానే ఉన్నాయి.
అల్బేనియా యొక్క కాథోలిక్ పట్టణమైన, ఒక బెసిలికా ఉన్న స్కోదేర్లో, చర్చి ఒక నెలసరి వార్తాలేఖను ముద్రించడం మొదలుపెట్టింది, దాని ప్రతి సంచికలో “యెహోవాసాక్షులను ఎలా నిరోధించాలి” అనేది ఉండేది. చివరి సంచిక ఇలా తెలియజేసింది: “యెహోవాసాక్షులు స్కోదేర్ను ఆక్రమించారు!” అక్కడ ఇద్దరు సాక్షుల పెద్ద సైన్యం మంచిమర్యాద, ఆసక్తి గల 74 మందిని జ్ఞాపకార్థదినానికి పోగుచేశారు. జ్ఞాపకార్థదిన ప్రసంగం విన్న తరువాత, 15 కుటుంబాలు గృహ బైబిలు పఠనం కొరకు అడిగాయి. నలుగురు సాక్షుల సైన్యమున్న డుర్రేస్ అనే మరో పట్టణంలో మహాద్భుతంగా 79 మంది హాజరయ్యారు.
రాళ్లతో కొట్టి సాక్షులను వెళ్లగొడతామని బెదిరించిన కాథోలిక్ యౌవనస్థుల వ్యతిరేకతను బట్టి, పర్వతాల గ్రామమైన కాల్మెటే ఎ ఫోగెల్లో జ్ఞాపకార్థ దినాచరణ సమావేశాన్ని ఒక స్థానిక సహోదరుని ఇంటికి తరలించారు, అక్కడ 22 మంది ప్రశాంతంగా హాజరయ్యారు. టిరానెలో జరిగిన సమావేశంలో బాప్తిస్మం తీసుకున్న ముగ్గురితో కలిపి ఆ గుంపులో ఐదుగురు ప్రచారకులున్నారు.
వ్లోరేలో ఇద్దరు యౌవనస్థులు ది వాచ్‌టవర్ కాపీనొకదానిని పొంది, చదివి, సంస్థకు ఇలా వ్రాశారు: “ది వాచ్‌టవర్ నుండి మేము నేర్చుకున్న సత్యాన్ని బట్టి మమ్మల్ని మేము ఇప్పుడు యెహోవాసాక్షులని పిలుచుకుంటున్నాము. మాకు దయచేసి సహాయం అందజేయండి.” అక్కడికి ఇద్దరు ప్రత్యేక పయినీర్లు పంపబడగా, ఆ యౌవనస్థులలో ఒకరు త్వరగా ప్రచారకుడగుటకు అర్హుడయ్యాడు. వ్లోరేలో జరిగిన జ్ఞాపకార్థ దినాచరణకు హాజరౌతున్న 64 మందిలో తాను ఒకడిగా ఉన్నందుకు ఆయన ఆనందించాడు.
అమెరికాలో సత్యం నేర్చుకున్న ఒక అల్బేనియా సహోదరుడు తన స్వంత పట్టణమైన గిరేకాస్ట్ర్కు 1950వ దశాబ్దంలో తిరిగి వచ్చి, తనకు సాధ్యమైనంత వరకు అంటే తన మరణం వరకు అక్కడే సేవచేశాడు. ఆయన సత్య విత్తనాలను తన కుమారుని హృదయంలో నాటాడు. నిషేధం తొలగింపబడిన తరువాత, ఈ కుమారుడు వాచ్‌టవర్ సంస్థను సహాయం కోరాడు. ఉత్తరాన ఉన్న గ్రామంలో నివసిస్తున్న మరో ఆసక్తిగల వ్యక్తి కూడా సహాయం కొరకు వ్రాశాడు, కాబట్టి అక్కడికి నలుగురు ప్రత్యేక పయినీర్లు పంపబడ్డారు. జ్ఞాపకార్థదినం అయిన మరునాడు అంటే బుధవారం ఉదయం, వారిలో ఒకరు టిరేన్లోని సంస్థ ఆఫీసుకు ఇలా ఫోన్ చేశారు: “యెహోవా ఆత్మ ఎట్టి కార్యం చేసిందో చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. మేమెంతో సంతోషంగా ఉన్నాం. జ్ఞాపకార్థ దినాచరణ విజయవంతమైంది.” ఏడుగురు రాజ్య ప్రచారకులతో సహా 106 మంది హాజరయ్యారు.
మొత్తం జ్ఞాపకార్థదినాచరణకు హాజరైన వారెంతమంది? కేవలం 30 మంది రాజ్య ప్రచారకులున్నప్పుడు 1992లో 325 మంది హాజరయ్యారు. పంతొమ్మిది వందల తొంభై మూడులో 131 మంది ప్రచారకులు 1,318 మందిని సమావేశపర్చారు. రెండు సంవత్సరాల్లోనూ, హాజరైనవారి సంఖ్య ప్రచారకుల సంఖ్యకు పదింతలు ఎక్కువగా ఉంది. అంత తక్కువ సమయంలో “ఒంటిరియైనవాడు వేయిమంది” కావటాన్ని చూడ్డం ఎంత ఉత్తేజకరంగా ఉంది!—యెషయా 60:22.
“నీ త్రాళ్లను పొడుగుచేయుము”
యెహోవాసాక్షుల ప్రకటన పని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండగా, ఒక పిలుపు ఇలా వెలువడుతున్నది: “నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు.” (యెషయా 54:2, 3) తన ఆరాధికుల ప్రపంచవ్యాప్త సంఘాలచే ప్రాతినిధ్యం వహింపబడుతున్న దేవుని “గొప్ప గుడారము” నందలి వ్యాప్తి తూర్పు యూరపులో, ముఖ్యంగా మునుపటి రష్యా దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాలుగా సాగిన అణచివేతలో తన సేవకులను బలపర్చిన తరువాత, యెహోవా ఇప్పుడు సంస్థను బలపర్చి, విస్తరింపజేయటానికి కావలసిన అధిక శక్తిని తన సాక్షులకు అందజేస్తున్నాడు.
రష్యానందలి మాస్కోలోని లోకోమాటిఫ్ స్టేడియంలో, జూలై 22 నుండి 25 వరకు జరిగిన గత సంవత్సరపు “దైవిక బోధ” సమావేశాల పరంపరలోని ప్రసిద్ధ అంతర్జాతీయ సమావేశానికి హాజరైనవారి సంఖ్య శిఖరాగ్ర స్థాయిలో 23,743కు చేరుకుంది. రెండేళ్ల క్రితం కూడా, ఇది సాధ్యమౌతుందని ఎవరు ఊహించియుండవచ్చు? కాని అది నిజమైంది! జపాన్, కొరియా నుండి 1,000 కంటే ఎక్కువ మంది, అమెరికా, కెనడాల నుండి దాదాపు 4,000 మంది, దక్షిణ పసిఫిక్, ఆఫ్రికా, యూరపు, మరితర ప్రాంతాలలోని 30 కంటే ఎక్కువ దేశాల నుండి ఇతర వేలాదిమంది వచ్చారు—నిజంగా ఇది తూర్పు పడమరల కలయికే. వీరందరికీ 15,000 మందికంటే ఎక్కువగానున్న తమ రష్యా సహోదర సహోదరీలతో స్వతంత్రంగా కలిసి తిరగడం ఎంత ప్రోత్సాహకరంగా ఉండెనో! ఆనందానికి అవధులు లేవు.
అద్భుతమైన రీతిలో మొత్తం 1,489 మంది క్రొత్త సాక్షులు బాప్తిస్మం తీసుకున్నారు. ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక మొదటి పేజీలోని చిత్రంతో సహా ప్రపంచవ్యాప్తంగానున్న ప్రచారసాధనాలు ఈ బాప్తిస్మాన్ని గూర్చి ఎక్కువగా ప్రచారం చేశాయి. బాప్తిస్మం సమయంలో చప్పట్ల మోత ఉన్ననూ, చివరి ప్రసంగంలో, సమావేశం విజయవంతం కావటానికి సహాయం చేసిన 4,752 మంది స్వచ్ఛందసేవకులకు, అధికారులకు, “అందరికంటె ఎక్కువగా మేము యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము!” అని ప్రసంగీకుడు కృతజ్ఞతలు చెప్పిన తరువాత ఆ చప్పట్ల మోత మరింత ఎక్కువయ్యింది. అవును, యెహోవా ఆత్మ పూర్వాచార పరాయణ మతస్థుల బలమైన వ్యతిరేకతను తప్పించి, సమావేశాన్ని ఉత్తేజకరమైన వాస్తవంగా చేయటానికి కావలసిన అత్యవసర శక్తిని యిచ్చింది.
అయినా, ఆగష్టు 5 నుండి 8 వరకు యుక్రెయిన్ దేశపు కేవ్ అనే నగరం నుండి, ఇంకా ఎంతో రావలసి ఉంది. మళ్లీ, ఇష్టపడి వచ్చిన స్వచ్ఛంద సేవకులు స్టేడియంను పూర్తిగా క్రొత్తగా చేసేశారు, ఈ అత్యంత పెద్ద రాజ్యమందిరం శిఖరాగ్రస్థాయిలో 64,714 మంది కూర్చోవడానికి సరిపోయింది. మళ్లీ ఒకసారి, సాక్షులు తూర్పు పడమరల నుండి ప్రపంచమందలి అన్ని ప్రాంతాల నుండి వచ్చారు. ప్రముఖ ప్రసంగాలు 12 భాషల్లోకి అనువదింపబడ్డాయి. అన్ని విధాలైన రవాణా సౌకర్యాల ద్వారా వచ్చిన 53,000 మంది ప్రతినిధులను రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల నుండి వారి వసతిస్థలాలైన హోటళ్లు, పాఠశాలలు, ఇళ్లు ఆలాగే నదీనావలకు కూడా తరలించాల్సి ఉండెను. నగర పోలీసుల మెప్పును, ఆశ్చర్యంతో పలికిన మాటలను పొందేలా తక్కువ ఖర్చుతో ప్రశాంతంగా, సంస్థీకరణ సామర్థ్యతతో ఇదంతా నిర్వహించబడింది.
ఉత్తేజకరమైన సమావేశ కార్యక్రమానికి రెండున్నర గంటలపాటు కొనసాగిన బాప్తిస్మ ఘట్టం ఒక ఉన్నతాంశము. మొత్తం 7,402 మంది క్రొత్త సహోదర సహోదరీలు యెహోవాకు తమ సమర్పణను సూచనార్థకంగా తెలియజేసారు, అప్పుడు ఆ పెద్ద స్టేడియంలో చప్పట్లు మళ్లీ, మళ్లీ మారుమ్రోగిపోయాయి. న్యూయార్క్ నగరంలో 1958లో 2,53,922 మంది హాజరైనప్పుడు, శిఖరాగ్ర సంఖ్యలో బాప్తిస్మం తీసుకున్న 7,136 మందికంటే ఇది ఎక్కువే.
ఈ తీర్పు కాలం దాని ముగింపుకు వస్తుండగా, గొర్రెల వంటివారు తూర్పు, పడమర, చివరికి “భూదిగంతముల” నుండి మానవ జాతియంతటి అసమానమైన ఐక్యతలోనికి పోగుచేయబడుతున్నారు. నిజంగా, “ప్రతి జనములోనుండియు, ప్రతి వంశములోనుండియు, ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చిన . . . యొక గొప్పసమూహము,” యెహోవా సర్వాధిపత్య పరిపాలనను మహిమపర్చడంలో నెరవేర్చబడుచున్న సమస్తానికి పునాదిగానున్న యేసు ప్రశస్త విమోచన క్రయధనమందు తమ విశ్వాసాన్ని ప్రకటించుటలో ఆత్మీయ ఇశ్రాయేలుతో ఏకీభవిస్తున్నారు.—అపొస్తలుల కార్యములు 1:8; ప్రకటన 7:4, 9, 10.
[8, 9వ పేజీలోని చిత్రాలు]
మాస్కో, కేవ్లలో తూర్పు పడమర కలవటం