తూర్పు పడమర కలిసినప్పుడు
“తూర్పు తూర్పే, పడమర పడమరే, ఈ రెండూ ఎన్నటికీ కలవలేవు.” బ్రిటీషు కవి రడ్‌యార్డ్ కిప్లింగ్ అనిన ఈ మాటలు, ఈనాడు మన చుట్టూ పెరిగిపోతున్న తెగ, జాతి, దేశ వైషమ్యాలకు దారితీస్తూ, మానవజాతిని విభాగిస్తున్న గంభీరమైన సామాజిక విభేదాలను మనకు జ్ఞప్తికి తెస్తాయి. ఈ పరిస్థితి గురించి దేవుడేదైనా చేయలేడా? అని అనేకులు అడుగుతారు. అవును, ఆయన చేయగలడు! ఆయన ఇప్పుడు కూడా కొంత చేస్తున్నాడు! కిప్లింగ్ పద్యంలోని తరువాతి వరుస దీనిని సూచించింది. ఎంతకాలం తూర్పు పడమర విడిపోయే ఉంటాయి? “భూమ్యాకాశాలు త్వరలో దేవుని గొప్ప తీర్పు సింహాసనం యెదుట నిలబడే వరకు” అని ఆ కవి అన్నారు.
తీర్పు తీర్చే ఈ బాధ్యతను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు అప్పగించాడు. (యోహాను 5:22-24, 30) కాని ఆ తీర్పు సమయం ఎప్పుడు మొదలౌతుంది? ఎవరికి తీర్పు తీర్చబడుతుంది, దాని ఫలితమేమిటి? మానవజాతిని 1914వ సంవత్సరం నుండి బాధించడం ప్రారంభించిన ప్రపంచ యుద్ధాలు, వాటితో వచ్చే విపత్తుల గురించిన ప్రవచనంలో దీనిని గూర్చి వివరించింది యేసే. తన అదృశ్య “రాకడకును ఈ యుగసమాప్తికిని” ఇవి “సూచన”గా ఉంటాయని ఆయన చెప్పాడు.—మత్తయి 24:3-8.
ఈ గొప్ప ప్రవచన ముగింపులో, యేసు మన ప్రస్తుత కాలాన్ని తీర్పు కాలంగా గుర్తిస్తూ తనను గురించే ఇలా చెప్పుకున్నాడు: “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.” సూచనార్థకంగా, ఇప్పుడు భూమి పైనున్న ప్రజలందరు న్యాయాధిపతి యెదుటికి పోగుచేయబడి, ఆయన రక్షణ సందేశానికి వారు ప్రతిస్పందించు దానినిబట్టి వారు జవాబుదారులై ఉన్నారు. త్వరలో సంభవించు మహాశ్రమల సమయంలో తీర్పు తీర్చబడినప్పుడు, అవిధేయులైన మేకలవంటి ప్రజలు “నిత్యశిక్షకును, నీతిమంతులు [విధేయులైన గొర్రెలవంటి వారు] నిత్యజీవమునకును పోవుదురు.”—మత్తయి 25:31-33, 46; ప్రకటన 16:14-16.
‘తూర్పు నుండి, పడమర నుండి’
ఈ ప్రపంచ తీర్పు నిజానికి మొదటి ప్రపంచ యుద్ధం నాటి అల్లకల్లోల సంవత్సరాల నుండే ప్రారంభమయ్యింది. ఆ సమయంలో, క్రైస్తవమతసామ్రాజ్య మతనాయకులు పోరాట వర్గాలకు పూర్తి మద్దతునిచ్చారు. ఇది వారిని “దేవుని ఉగ్రత” పొందదగిన అవినీతికరమైన లోకంలో భాగంగా గుర్తించింది. (యోహాను 3:36) అయితే దేవుని యందు విశ్వాసముంచిన శాంతిని ప్రేమించే క్రైస్తవుల విషయమేమిటి? వీరు 1919వ సంవత్సరం మొదలుకొని రాజైన క్రీస్తుయేసు పక్షమునకు పోగుచేయబడుతున్నారు.
వారు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలనుండి వచ్చారు. వీరిలో క్రైస్తవ శకపు శతాబ్దాలన్నింటా ఎంపిక చేసుకొనబడిన 1,44,000 మంది అభిషక్తులలోని మిగిలినవారు మొదట సమకూర్చబడ్డారు. వీరు ఆయన పరలోక రాజ్యంలో “క్రీస్తుతోడి వారసులు”గా ఉంటారు. (రోమీయులు 8:17) వీరికి దేవుని ప్రవక్త ఇలా చెబుతున్నాడు: “భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.”—యెషయా 43:5-7.
అది మాత్రమే కాదు! ప్రాముఖ్యంగా, 1930వ దశాబ్దం నుండి, ఇప్పుడు లక్షల సంఖ్యకు చేరుకుంటున్న ఒక గొప్ప సమూహము పోగుచేయబడటం ప్రారంభమైంది. వీరు మత్తయి 25:31-46లో యేసు సూచించిన “గొర్రెలు.” తమకంటే ముందున్న అభిషక్త శేషము వలెనే వీరు ‘నేనే దేవుడను మీరే నాకు సాక్షులు,’ అని ప్రకటించిన వానియందు “విశ్వాసముంచిరి.” (యెషయా 43:10-12) ఈ గొప్ప సమూహాన్ని ‘తూర్పు పడమరల నుండి, ఉత్తరదక్షిణాల నుండి, భూదిగంతముల నుండి’ కూడా పోగుచేయడం కొనసాగుతుంది.
శాంతిని ప్రేమించే ఈ గొర్రెలవంటి వారు ఒకే అంతర్జాతీయ సహోదరత్వంలోకి జతచేయబడుతున్నారు. వారు నివసించే 231 దేశాల్లోని అనేక వేరువేరు భాషలు వారు మాట్లాడతారు. అయినా వారు, “జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు” బైబిలుయొక్క రాజ్యసందేశమైన ‘స్వచ్ఛమైన భాషను’ నేర్చుకొనుటకు ఆత్మీయంగా ఐక్యమైయున్నారు. (జెఫన్యా 3:9) విశ్వాసం, సంకల్పం, క్రియల విషయంలో వారి ఐక్యత, వాస్తవానికి తూర్పు పడమర కలిసిందని, సర్వాధిపతియైన యెహోవా సేవకొరకు, స్తుతికొరకు ప్రజలు ఇంకా ఇతర దిశలన్నిటి నుండి వస్తున్నారని చెప్పటానికి అద్భుతమైన నిదర్శనాన్నిస్తుంది.
ఈ క్రింది నివేదికలు చూపునట్లు, కొన్ని దేశాలలో ఈ పోగుచేయడం అత్యంత విశేషమైన పరిస్థితుల్లో జరుగుతుంది.