కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 1/1 పేజీలు 10-19
  • యెహోవాయందు ఆశ్రయం పొందండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాయందు ఆశ్రయం పొందండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్య ప్రచారకుల గొప్ప బృందగానం
  • మనం నివసించగల ఒక ఆశ్రయ దుర్గం
  • నమ్మకంతో ప్రకటించుట
  • ‘మంచితనపు నిధి’
  • ‘యెహోవా నామాన్ని ఆశ్రయించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 1/1 పేజీలు 10-19

యెహోవాయందు ఆశ్రయం పొందండి

“యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను.”—కీర్తన 31:1.

1. ఆశ్రయమిచ్చే యెహోవా సామర్థ్యమందు నమ్మకాన్ని కీర్తన 31, ఎలా వ్యక్తపరుస్తుంది?

మానసికంగా, శారీరకంగా పూర్తిగా అలసిపోయినప్పటికీ, యెహోవాపై ఆధారపడిన వ్యక్తిని గురించి ఒక మధురమైన స్వరం పాడుతుంది. విశ్వాసం విజయమొందుతుందని ఆ పరిశుద్ధ గేయంలోని పదాలు చెబుతున్నాయి. తనను వేటాడుతున్న హింసకుల నుండి తప్పించుకొనుటకు, చాచివున్న సర్వోన్నతుని చేతుల్లో ఈ వ్యక్తి ఆశ్రయం పొందుతాడు. “యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను,” ఆ కీర్తన ఇలా కొనసాగింది, “నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.”—కీర్తన 31:1.

2. (ఎ) ఏ రెండు స్తంభాలపై ఆధారపడి, మన రక్షణదుర్గంగా యెహోవా యందు మనం నమ్మకాన్ని ఉంచవచ్చు? (బి) యెహోవా ఎలాంటి దేవుడు?

2 కీర్తనల రచయిత, ఒక ఆశ్రయాన్ని—శ్రేష్ఠమైన ఆశ్రయాన్ని కలిగివున్నాడు! ఇతర విషయాలు సందేహాస్పదమైనవైనా, ఈ వాస్తవం మాత్రం నిలిచి ఉంటుంది: యెహోవా ఆయన రక్షణ దుర్గము, కోట. ఆయన నమ్మకం రెండు కచ్చితమైన స్తంభాలపై ఆధారపడింది. ఒకటి, యెహోవా ఎన్నటికీ సిగ్గుపడనియ్యడన్న ఆయన విశ్వాసం, రెండవది, ఆయన ఎన్నటికీ తన సేవకున్ని శాశ్వతంగా విడిచిపెట్టడు అనే యెహోవా నీతి. యెహోవా తన విశ్వాసులైన సేవకులను సిగ్గుపరచే దేవుడు కాదు; ఆయన మాట తప్పనివాడు. బదులుగా ఆయన సత్య దేవుడు, ఆయన యందు చిత్తశుద్ధితో విశ్వాసముంచువారికి ప్రతిఫలమిచ్చువాడు. అంతంలో, విశ్వాసం ప్రతిఫలాన్ని పొందుతుంది! విముక్తి లభిస్తుంది!—కీర్తన 31:5 6.

3. కీర్తనల రచయిత యెహోవాను ఎలా ఘనపరుస్తున్నాడు?

3 బాధ, వేదనల లోతులనుండి మనోనమ్మకపు తారాస్థాయి వరకు హెచ్చుతగ్గులుగల సంగీత స్వరాలతో తన సంగీతాన్ని కూర్చడంలో కీర్తనల రచయిత అంతర్గత బలాన్ని పొందుతున్నాడు. ఆయన యెహోవా యథార్థ ప్రేమను బట్టి ఆయనను ఘనపరుస్తాడు. ఆయనిలా పాడుతున్నాడు: “ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు, ఆయన స్తుతినొందును గాక.”—కీర్తన 31:21.

రాజ్య ప్రచారకుల గొప్ప బృందగానం

4, 5. (ఎ) ఈనాడు ఏ గొప్ప బృందగానం యెహోవాను స్తుతిస్తుంది, ఈ గత సేవా సంవత్సరంలో వారు దాన్నెలా చేశారు? (చార్టులో 12-15 పేజీలను చూడండి.) (బి) రాజ్య ప్రచారకుల బృందగానంతో కలవాలని అనేకులు ఇష్టపడుతున్నారని జ్ఞాపకార్థ దినాచరణకు హాజరైనవారి సంఖ్య ఏవిధంగా సూచిస్తుంది? (చార్టు చూడండి.) (సి) మీ సంఘంలోని ఏ గుంపు ఈ బృందగానంతో కలిసే స్థితిలో ఉండవచ్చు?

4 ఈనాడు, ఆ కీర్తన మాటలు మళ్లీ మరింత అర్థాన్ని పొందాయి. యెహోవాను స్తుతించే పాటలను ఏ దుష్ట వ్యతిరేకిగాని, ఏ ప్రకృతి వైపరీత్యంగాని, లేదా ఏ ఆర్థిక బాధగాని నిర్మూలించలేవు; నిజంగా యెహోవా కృపాబాహుళ్యము ఆయన ప్రజలకు ఆశ్చర్యకరమైందిగా తయారైంది. గత సేవా సంవత్సరం, ఒక గొప్ప బృందగానం, శిఖరాగ్ర సంఖ్యలో 231 దేశాల్లో 47,09,889 మంది దేవుని రాజ్య సమాచారాన్ని గానం చేశారు. క్రీస్తుయేసు పాలించు యెహోవా పరలోక ప్రభుత్వం వారికి నిరుత్సాహపరచని ఆశ్రయం. గత సంవత్సరం, 73,070 సంఘాల నుండి వచ్చిన ఈ రాజ్య ప్రచారకులు సువార్త ప్రకటన పనిలో మొత్తం 1,05,73,41,972 గంటలు గడిపారు. ఫలితంగా నీటి బాప్తిస్మం ద్వారా 2,96,004 మంది దేవునికి సూచనార్థకంగా తమను సమర్పించుకున్నారు. గత ఆగష్టు నెలలో యుక్రెయిన్‌లోని కేవ్‌లో జరిగిన దైవిక బోధ అంతర్జాతీయ సమావేశానికి హాజరైనవారు ఎంతో అద్భుతమైన ఆశ్చర్యాన్ని పొందారు. నిజ క్రైస్తవులు మునుపెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో బాప్తిస్మం తీసుకోవడంతో చరిత్ర సృష్టించబడటం వారు చూశారు! యెషయా 54:2, 3లో ప్రవచింపబడిన విధంగా, దేవుని ప్రజలు అసాధారణ సంఖ్యలో పెరిగిపోతున్నారు.

5 అయితే, దేవుని రాజ్యానికి విధేయత చూపే ఇంకా అనేకులు బృందగానంలో కలవటానికి ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం యేసు మరణ జ్ఞాపకార్థదినాచరణకు మహాశ్చర్యకరంగా మొత్తం 1,18,65,765 మంది హాజరయ్యారు. విశ్వసనీయంగా, వీరిలో అనేకులు ఈ సేవా సంవత్సరంలో ఇంటింటికి రాజ్య గానాన్ని ఆలపించుటకు అర్హులౌతారు. సత్య విరోధియైన అపవాదియగు సాతానుకు ఆ ఉత్తరాపేక్ష ఎంతటి కోపాన్ని కలిగిస్తుందో!—ప్రకటన 12:12, 17.

6, 7. యెహోవా సహాయంతో ఆసక్తిగల ఒక వ్యక్తి ఎలా దయ్యాల బాధను అధిగమించాడో వివరించండి.

6 ఆ గొప్ప బృందగానానికి తమ స్వరాన్ని కలపకుండా అనేకులను ఆటంకపరచుటకు సాతాను ప్రయత్నిస్తాడు. ఉదాహరణకు, థాయ్‌లాండ్‌లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు దయ్యాల బాధకు గురౌతున్నట్లు ప్రచారకులు కనుగొన్నారు. అయితే, యెహోవా సహాయంతో యథార్థవంతులైన అనేకులు విడుదల పొందారు. తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఒక వ్యక్తి మంత్రగాణ్ణి దర్శించిన తరువాత, పది సంవత్సరాల వరకు దయ్యాల ప్రభావం క్రిందే ఉండిపోయాడు. ఒక మతనాయకుని సహాయంతో ఆ ప్రభావం నుండి విడుదల పొందాలని అతను ప్రయత్నించాడు గాని, ఏమాత్రం ప్రయోజనం కలుగలేదు. యెహోవాసాక్షుల పూర్తికాల సేవకుడొకరు అతనితో బైబిలు పఠనం చేయడం మొదలు పెట్టి, దయ్యాల ప్రభావం నుండి విడుదల పొందటానికి ఒకే ఒక మార్గం సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం కలిగివుండి, యెహోవాయందు విశ్వాసముంచి, ప్రార్థనలో ఆయన్ని వేడుకోవడం మాత్రమేనని అతనికి బైబిలులో నుండి తెలియజేసాడు.—1 కొరింథీయులు 2:5; ఫిలిప్పీయులు 4:6, 7; 1 తిమోతి 2:3, 4.

7 ఈ చర్చ జరిగిన తరువాతి రాత్రి, ఆ వ్యక్తి ఒక కల కన్నాడు. అందులో మరణించిన అతని తండ్రి కనిపించి మళ్లీ అభిచార క్రియలకు తిరగకపోతే చూడు ఏమి జరుగుతుందో అని బెదిరించాడు. అతని కుటుంబం బాధలు పడటం మొదలయ్యింది. లొంగిపోవటానికి ఇష్టపడకుండా ఆ వ్యక్తి తన బైబిలు పాఠాలను కొనసాగించి, కూటాలకు హాజరవ్వడం మొదలు పెట్టాడు. ఆ పఠనాల్లో ఒకసారి, దయ్యాల ప్రభావం నుండి విడుదల పొందడానికి ప్రయత్నిస్తున్న వారి వద్ద దయ్యాలకు సంబంధించిన వస్తువులు ఏవైనావుంటే అవి ప్రజలను బంధించడానికి దయ్యాలకు దారి కలుగజేస్తాయని ఆ పయినీరు వివరించాడు. తాను మంత్రశక్తిగా ఉపయోగించే ఏదో నూనె తన దగ్గర ఉన్నట్లు ఆ వ్యక్తి గుర్తుచేసుకున్నాడు. దాన్ని పడవేయాలి అని ఆయన ఇప్పుడు గ్రహించాడు. అది పడవేసిన దగ్గర నుండి దుష్టాత్మలు మళ్లీ ఆయన్ని బాధించలేదు. (ఎఫెసీయులు 6:13; యాకోబు 4:7, 8 పోల్చండి.) ఆయన, ఆయన భార్య తమ పఠనంలో బాగా కొనసాగుతున్నారు, బైబిలు ఉపదేశం కొరకు క్రమంగా కూటాలకు హాజరౌతున్నారు.

8, 9. కొంతమంది రాజ్య ప్రచారకులు మరే ఇతర అవాంతరాలను అధిగమించారు?

8 ఇతర అవాంతరాలు కూడా సువార్త శబ్దాన్ని అణచివేయవచ్చు. ఘానాలో భరించలేని తీవ్ర ఆర్థిక పరిస్థితులుండటం వల్ల పనివారిని తాత్కాలికంగా పనిలో నుండి తొలగించారు. కనీస జీవితావసరతలు తీర్చుకొనుట కూడా నిజంగా సమస్య అయ్యేలా, జీవనవ్యయం ఆకాశాన్నంటింది. యెహోవా ప్రజలెలా తాళుకొంటున్నారు? వారు తమయందు కాకుండా యెహోవాయందు విశ్వాసముంచడం ద్వారా తాళుకొంటున్నారు. ఉదాహరణకు, ఒక రోజు ఒక వ్యక్తి బ్రాంచి కార్యాలయంలోని రిసెప్షన్‌ డెస్క్‌ వద్ద ఒక కవరు ఉంచివెళ్లాడు. ఆ కవరులో 200 డాలర్లు లేక ఒకరి మూడు నెలల కనీస జీతమంత మొత్తం అందులో ఉంది. ఆ కవరు ఎవరి వద్ద నుండి వచ్చిందో తెలిపే పేరు లేదు కాని దానిపై ఇలా వ్రాస్తుంది: “నేను నా ఉద్యోగం పోగొట్టుకున్నాను, కాని యెహోవా మళ్లీ నాకు మరో ఉద్యోగం వచ్చేలా చేసాడు. నేను ఆయనకు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనైవున్నాను. అంతం రాకముందు రాజ్య సువార్త వ్యాప్తిచేయడంలో సహాయం చేయటానికి నేను స్వల్ప చందాను పంపిస్తున్నాను.”—2 కొరింథీయులు 9:11ను పోల్చండి.

9 యెహోవాను స్తుతించే గొప్ప బృందగానంలో కలిసేవారికి తర్ఫీదు నివ్వటానికి కూటాలకు హాజరుకావడం సహాయం చేస్తుంది. (కీర్తన 22:22 పోల్చండి.) హోండురాస్‌లోని దక్షిణ ప్రాంతంలో ఎల్‌ హోర్దాన్‌ అనే ఒక సంఘం ఉంది. ఈ చిన్న గుంపు గురించి ఏమిటంత ప్రత్యేకత? విశ్వాసంగా వారు కూటాలకు హాజరు కావడం ఆ సంఘం ప్రత్యేకత. ప్రతి వారం కూటాలకు హాజరుకావటానికి ఆ 19 మంది ప్రచారకులలో 12 మంది ఒక పెద్ద నది దాటి రావాలి. ఎండాకాలంలో ఇది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ఆ కాలంలో వారు మధ్యలోవున్న రాళ్ల ఆధారంగా నదిని దాటవచ్చు. అయితే, వర్షాకాలంలో పరిస్థితులు మారిపోతాయి. ఒకప్పుడు ఏ ఇబ్బందిని కలిగించకుండావున్న నీళ్లు తన దారిలో ఉన్న దేనినైనా కొట్టుకొనిపోయేలా చేసే వడిగల ప్రవాహంలా మారిపోతాయి. ఈ అవాంతరాన్ని అధిగమించటానికి, సహోదర సహోదరీలు మంచి ఈతగాళ్లుగా ఉండాలి. నది దాటడానికి ముందు, వారు తాము కూటాలకు వేసుకునే బట్టలను టెనా (లోహపు టబ్బు)లో పెట్టి దాన్ని ఒక ప్లాస్టిక్‌ సంచితో మూస్తారు. బలమైన ఈతగాడు టెనాను తేలటానికి ఉపయోగపడే వస్తువులా ఉపయోగిస్తూ, నదిని దాటడానికి గుంపుకు నడిపింపు నిస్తాడు. క్షేమంగా అవతలి వైపుకు చేరిన తరువాత, వారు ఒళ్లు తుడుచుకొని, బట్టలు వేసుకుని, మెరిసే పరిశుభ్రతతో, ఉత్సాహంగా రాజ్యమందిరానికి వస్తారు.—కీర్తన 40:9.

మనం నివసించగల ఒక ఆశ్రయ దుర్గం

10. వత్తిడిగల సమయాల్లో మనమెందుకు యెహోవా వైపు తిరుగవచ్చు?

10 మీరు సంపూర్ణంగా దయ్యాల దాడి క్రిందవున్నా లేక ఇతర మూలాల నుండి వత్తిడి ఎదుర్కొంటున్నా, యెహోవా మీ ఆశ్రయదుర్గం కాగలడు. ఆయనకు ప్రార్థించండి. ఆయన తన ప్రజల దుర్భలమైన మూలుగులను సహితం శ్రద్ధగా వింటాడు. అది నిజమని కీర్తనల రచయిత తెలుసుకుని ఇలా వ్రాశాడు: “నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారముగల యిల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలోనుండి నన్ను తప్పించుము.”—కీర్తన 31:2-4.

11. యెహోవా రక్షణ దుర్గము ఎందుకు తాత్కాలికమైంది కాదో వివరించండి.

11 యెహోవా కేవలం తాత్కాలిక ఆశ్రయాన్నే కాదుగాని, మనం సురక్షితంగా నివసించగల తిరుగులేని ఆశ్రయాన్ని ఇస్తాడు. ఆయన నడిపింపు, మార్గదర్శకత్వం ఆయన ప్రజలను ఎన్నడు అపజయం గావించలేదు. సాతాను, అతని అనుచరుల కుటిల కార్యాలను దైవిక శక్తి నిరుపయోగం చేస్తుంది. (ఎఫెసీయులు 6:10, 11) మనం యెహోవాయందు హృదయపూర్వకంగా విశ్వాసముంచితే, ఆయన మనల్ని సాతాను ఉరులలో నుండి తప్పిస్తాడు. (2 పేతురు 2:9) గడచిన నాలుగు సంవత్సరాలలో, 35 దేశాల్లో యెహోవాసాక్షుల ప్రకటన పనిని ప్రారంభమయ్యింది. ప్రపంచమందు ఏయే ప్రాంతాల్లో సాంఘిక, ఆర్థిక, లేక రాజకీయ పరిస్థితులు సువార్త సేవను ఆటంక పరుస్తున్నాయో ఆ ప్రాంతాల్లోని కొంతమంది గొర్రెవంటి ప్రజలు తమను సుళువుగా కలుసుకొన వీలుండే ప్రాంతాలకు తరలి వెళ్లారు. అట్టి ప్రాంతాల్లో జపాన్‌ ఒకటి.

12. జపాన్‌లో ఒక పయినీరు ఎలా యెహోవాను తన రక్షణదుర్గముగా చేసుకున్నాడు?

12 జపాన్‌లో విదేశాల నుండి వచ్చిన తాత్కాలిక పనివారు ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున, అక్కడ అనేక విదేశీ భాషా సంఘాలు స్థాపించబడ్డాయి. ఈ విదేశీ భాషా క్షేత్రం ఎంత ఫలవంతంగా ఉందో జపానీయుల సంఘంలోని ఒక సహోదరుని ఈ అనుభవం ఉదహరిస్తుంది. అవసరం ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడ సేవచేయటానికి వెళ్లాలని ఆయనిష్టపడ్డాడు. అయితే, ఆయన తానున్నచోట ఇప్పటికే పది బైబిలు పఠనాలు నిర్వహిస్తున్నాడు. ఆయన స్నేహితుల్లో ఒకరు తమాషాగా ఇలా అన్నాడు: “అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి నీవు వెళ్తే, అక్కడ నీవు 20 బైబిలు పఠనాలు నిర్వహించవలసి వస్తుంది!” ఆయన హిరోషిమాకు పంపించబడ్డాడు. అయితే, నాలుగు నెలల తరువాత ఆయనకు కేవలం ఒక బైబిలు పఠనం మాత్రమే ఉంది. ఒకరోజు ఆయన కేవలం పోర్చుగీసు భాష మాత్రమే మాట్లాడగల బ్రెజిల్‌ నుండి వచ్చిన వ్యక్తిని కలిశాడు. కాని ఆ సహోదరుడు అతనితో సంభాషించలేకపోయినందున, ఆయన ఒక పోర్చుగీసు పాఠ్యపుస్తకాన్ని కొన్నాడు. కొన్ని సుళువైన సంభాషణా పదాలను నేర్చుకున్న తరువాత ఆయన మళ్లీ ఆ వ్యక్తిని దర్శించాడు. సహోదరుడు అతనికి పోర్చుగీసు భాషలో అభివాదం చేసినప్పుడు, ఆ వ్యక్తి అమితాశ్చర్యపోయి, చిరునవ్వుతో తలుపు విశాలంగా తెరిచి ఆయన్ని లోనికి ఆహ్వానించాడు. ఒక బైబిలు పఠనం మొదలయ్యింది. త్వరలోనే ఆ సహోదరుడు 14 పోర్చుగీసు భాషలో, 6 స్పానీష్‌ భాషలో, 2 జపనీస్‌ భాషలో మొత్తం 22 పఠనాలు నిర్వహింప నారంభించాడు!

నమ్మకంతో ప్రకటించుట

13. యెహోవాను సేవించడంలో ఎందుకు ఎవరూ మనల్ని సిగ్గుపరచ ప్రయత్నించలేరు?

13 యెహోవా తమ ఆశ్రయమని సంపూర్ణ విశ్వాసంతో యెహోవా ప్రజలు నమ్మకంగా రాజ్య పాటను పాడతారు. (కీర్తన 31:14) వారు సిగ్గుపర్చబడరు, యెహోవా వారిని అవమానపరచడు, ఆయన తన మాటను నెరవేరుస్తాడు. (కీర్తన 31:17) అపవాది, అతని దయ్యపు అనుయాయులు సిగ్గుపరచబడతారు. యెహోవా ప్రజలు సిగ్గుపడనవసరం లేని సమాచారాన్ని ప్రకటించ వలసిన బాధ్యత కలిగివున్నారు గనుక, ప్రకటించుటలో వారు ఇతర ప్రజలచే సిగ్గుపరచబడరు. ఆరాధించడానికి యెహోవా, లేక ఆయన కుమారుడు ఆ విధంగా ప్రజలను పురికొల్పడం లేదు. యెహోవా మంచితనం, కృపాబాహుళ్యం యెడల విశ్వాస మెప్పులతో ప్రజల హృదయాలు నింపబడినప్పుడు, వారి హృదయాల మంచి పరిస్థితే మాట్లాడటానికి వారి నోళ్లను ప్రేరేపిస్తాయి. (లూకా 6:45) అలా, ప్రతి నెలలో మనం ఎంత సమయాన్ని సేవలో గడిపినా, ప్రాముఖ్యంగా ఆ సమయం మనం చేయగలిగిన శ్రేష్ఠమైన సమయమైతే, అది మంచిది, సిగ్గుకరమైంది కాదు. విధవరాలు వేసిన చిన్న కానుకను యేసు, ఆయన తండ్రి పూర్తిగా మెచ్చుకోలేదా?—లూకా 21:1-4.

14. పయినీరు సేవ గురించి మీరేం వ్యాఖ్యానాలు చేయగలరు? (చార్టు కూడా చూడండి.)

14 అనేకమంది ప్రచారకులకు, పూర్ణాత్మతో ఆరాధించడంలో పయినీర్లుగా సేవచేయడం చేరివుంది. పోయిన సంవత్సరం శిఖరాగ్ర సంఖ్యలో రిపోర్ట్‌ చేయబడిన నెలలో రిపోర్ట్‌ చేసినవారి సంఖ్య 8,90,231. మునుపటి సంవత్సరాల అభివృద్ధి ఇలాగే కొనసాగితే, ఈ సంఖ్య 10,00,000ను దాటిపోవచ్చు. నైజీరియాలో ఒక సహోదరి ఎలా పయినీరు సేవలో ప్రవేశించిందో ఈ క్రింది అనుభవం చూపిస్తుంది. ఆమె ఇలా వ్రాస్తున్నది: “నేను ఉన్నత పాఠశాల విద్య ముగించనైవుండగా, యెహోవాసాక్షుల పయినీరు పాఠశాలకు హాజరౌతున్నవారికి వంటలో సహాయం చేయటానికి నేను వెళ్లాను. అక్కడ మా నానమ్మ కంటె పెద్దవయస్సున్న ఇద్దరు సహోదరీలను నేను కలిశాను. వారు పాఠశాలకు హాజరు కావటానికి వచ్చిన పయినీర్లని నేను తెలుసుకున్నప్పుడు, నాకు నేను ఇలా తలంచుకున్నాను, ‘వారిద్దరూ పయినీరు సేవ చేయగలిగితే, నేనెందుకు చేయలేను?’ కాబట్టి ఉన్నత పాఠశాల విద్య ముగించిన తరువాత, నేను కూడా క్రమ పయినీరు నయ్యాను.”

15. ఇతరులు యెహోవాను ఆశ్రయించుటకు తటస్థ సాక్ష్యం ఏ విధంగా మార్గం ఏర్పర్చగలదు?

15 అందరూ పయినీరు సేవ చేయలేక పోవచ్చు, కాని వారు సాక్ష్యమివ్వవచ్చు. బెల్జియంలో 82 సంవత్సరాల సహోదరి ఒకరు మాంసం కొనటానికి వెళ్లింది. ఆ దుకాణదారుని భార్య ఇటీవలి రాజకీయ అలజడులను గురించి కలతచెందివున్నట్లు ఆమె గమనించింది. కాబట్టి సహోదరి డబ్బు చెల్లించేటప్పుడు దానితోపాటు వాట్‌ డు జెహోవాస్‌ విట్నెసెస్‌ బిలీవ్‌? అనే కరపత్రాన్ని పెట్టి ఇచ్చింది. సహోదరి మళ్లీ ఆ దుకాణానికి వచ్చినప్పుడు, దుకాణదారుని భార్య ఏమాత్రము వెనుకాడకుండ మూడవ ప్రపంచ యుద్ధ సాధ్యతను గూర్చి బైబిలేం చెబుతుంది అని అడిగింది. సహోదరి ఆమె కొరకు ట్రూ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ—హౌ కెన్‌ యు ఫైండ్‌ ఇట్‌? అనే పుస్తకాన్ని తెచ్చింది. కొన్ని రోజుల తరువాత, ఆ వృద్ధ సహోదరి దుకాణంలోకి అడుగుపెట్టగానే, దుకాణదారుని భార్య మరనేక ప్రశ్నలు వేసింది. సహోదరి ఆమె విషయమై జాలిపడి ఆమెకు బైబిలు పఠనాన్ని గురించి చెప్పగా, ఆమె వెంటనే దానికి అంగీకరించింది. ఇప్పుడు, ఆ దుకాణదారుని భార్య బాప్తిస్మం తీసుకోవాలనుకుంటుంది. మరి దుకాణ దారుని సంగతేమిటి? ఆయన కూడా కరపత్రం చదివాడు, ఇప్పుడు ఆయన కూడా బైబిలు పఠనం చేస్తున్నాడు.

‘మంచితనపు నిధి’

16. యెహోవా ఎలా తన ప్రజల కొరకు ఒక మంచితనపు నిధిని ఉంచాడు?

16 వత్తిడితో కూడిన ఈ అంత్యదినాల్లో, యెహోవా తనను ఆశ్రయించిన వారికి “కృపను ఆశ్చర్యకరముగా” చూపించడం లేదా? ప్రేమగల, సంరక్షించే ఒక తండ్రిలా, తన భూసంబంధమైన పిల్లల కొరకు యెహోవా మంచితనపు నిధిని ఉంచాడు. చూసే వారందరి యెదుట, ఆయన వారిపై ఆనందాన్ని కుమ్మరిస్తున్నాడు, దాన్ని కీర్తనల రచయిత ఇలా చెబుతున్నాడు: “నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరుల యెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.”—కీర్తన 31:19, 21.

17-19. ఘానాలో, ఒక వృద్ధుడు తన వివాహాన్ని చట్టబద్ధం చేసుకోవడంతో ఏ మంచి ఫలితం కలిగింది?

17 కాబట్టి, యెహోవాను ఆరాధించేవారి నమ్మకత్వానికి లోకస్థులు ప్రత్యక్షసాక్షులై, వారు ఆశ్చర్యపోతారు. ఉదాహరణకు, ఘానాలో 96 సంవత్సరాల వృద్ధుడు వివాహ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి, తన 70 సంవత్సరాల దాంపత్య జీవితాన్ని చట్టబద్ధం చేయమని కోరాడు. వివాహ రిజిస్ట్రేషన్‌ అధికారి నిర్ఘాంతపోయి, ఇలా అడిగాడు: “నిజంగా మీరలా చేయాలనుకుంటున్నారా? అదీ ఈ మీ వయస్సులో?”

18 ఆ వ్యక్తి ఇలా వివరించాడు: “నేను యెహోవాసాక్షుల్లో ఒకరినై, లోకాంతానికి ముందు చేయవలసిన ఆత్యంత ప్రాముఖ్యమైన పనియైన దేవుని రాజ్య సువార్త ప్రకటనపనిలో భాగం వహించాలనుకుంటున్నాను. ఈ పని నిత్యజీవానికి నడిపిస్తుంది. యెహోవాసాక్షులు వివాహ రిజిస్ట్రేషన్‌తో సహా పౌర చట్టానికి విధేయులౌతారు. కాబట్టి దయచేసి నా వివాహాన్ని రిజిస్టరు చేయండి.” ఆ అధికారి నోటమాట రాలేదు. ఆయన రిజిస్ట్రేషను చేశాడు, ఆ పెద్దమనిషి ఇప్పుడు తన వివాహం చట్టబద్ధమైందన్న సంతోషంతో వెళ్లిపోయాడు.—రోమీయులు 12:2ను పోల్చండి.

19 ఆ తరువాత, వివాహ రిజిస్ట్రారు తాను విన్న విషయాల గురించి తలంచాడు. “యెహోవాసాక్షులు . . . అత్యంత ప్రాముఖ్యమైన పని . . . లోకాంతము . . . దేవుని రాజ్యము . . . నిత్యజీవము.” ఒక 96 సంవత్సరాల వృద్ధుని జీవితంలో వీటన్నిటి భావమేమిటని తికమకపడి, విషయాన్ని ఇంకా విపులంగా తెలుసుకోవటానికి సాక్షుల కొరకు వెదకటానికి నిర్ణయించుకున్నాడు. ఆయన బైబిలు పఠనాన్ని అంగీకరించి, త్వరగా అభివృద్ధి చూపించడం మొదలుపెట్టాడు. ఈనాడు, ఈ వివాహ రిజిస్ట్రారు ఒక బాప్తిస్మం తీసుకున్న సాక్షి. ఇతరులు చిన్న విషయాలు అని భావించే వాటి విషయంలో కూడా మనం యెహోవాకు విధేయత చూపిస్తే, అది మనకు, మన ప్రవర్తనకు ప్రత్యక్ష సాక్షులైనవారికి చెప్పలేని మేలుకు దారి తీయవచ్చు.—1 పేతురు 2:12ను పోల్చండి.

20. మ్యాన్మార్‌లో, ఒక యౌవన సహోదరి నమ్మకత్వం మంచి సాక్ష్యమిచ్చుటకు ఎలా నడిపింది?

20 సత్యం తమని నమ్మకస్థులుగా మార్చుటకు అనుమతించిన వృద్ధులు, ఈ అవినీతికరమైన లోకంలో యౌవనస్థులకు మంచి మాదిరి ఉంచిన వారౌతారు. మ్యాన్మార్‌లో అలాంటి ఒక యౌవన సహోదరి ఉంది. పదిమంది పిల్లలతో కూడిన ఒక పేద, దీన కుటుంబం నుండి ఆమె వచ్చింది. తండ్రి ఉద్యోగవిరమణ పొంది పింఛను తీసుకుంటూ, క్రమ పయినీరు సేవ చేస్తున్నాడు. ఒకరోజు పాఠశాలలో ఈ సహోదరికి ఒక వజ్రపు ఉంగరం దొరికింది, ఆమె దాన్ని వెంటనే టీచరు వద్దకు తీసుకువెళ్లింది. మరునాడు తరగతి సమావేశమైనప్పుడు, టీచరు ఆ ఉంగరం ఎలా దొరికిందో చెప్పి, ఉంగరాన్ని స్వంతదారునికివ్వటానికి తిరిగి ఇచ్చింది. అప్పుడామె ఇతర పిల్లలైతే దాన్ని ఉంచుకోవటానికి నిర్ణయించుకునేవారని ఎరిగి, ఈ యౌవన సహోదరి తాను ఎందుకు ఇది చేసిందో తరగతంతటి యెదుట నిలబడి చెప్పమన్నది. తాను యెహోవాసాక్షినని, తన దేవునికి దొంగతనం లేక మరేవిధమైన అవినీతి ఇష్టం వుండదని ఆ సహోదరి వివరించింది. టీచర్లకు, విద్యార్థులకు కలిపి సాక్ష్యం ఇచ్చుటకు మన సహోదరికి ఇది మంచి అవకాశం ఇవ్వగా, మొత్తం పాఠశాలంతా దీనిని గురించి విన్నది.

21. యౌవనస్థులు యెహోవాయందు విశ్వాసముంచే కొలది, వారి ప్రవర్తన ఆయనపై ఎలా ప్రతిబింబిస్తుంది?

21 బెల్జియంలో ఒక ఉపాధ్యాయుడు తరగతిలో యెహోవాసాక్షుల గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. తన విద్యార్థుల్లో ఒకరైన ఒక యౌవన సహోదరి ప్రవర్తనను గమనించి ఆయనిలా అన్నాడు: “యెహోవాసాక్షుల గురించి ఇప్పుడు నాకు మరో అభిప్రాయం ఉంది. పక్షపాత బుద్ధి నన్ను, వారు అసలు సహనం లేనివారని అనుకునేలా చేసింది. కాని వారు సూత్రాలతో రాజీపడని, చాలా సహనం గలవారని నిరూపించబడ్డారు.” ప్రతి సంవత్సరం టీచర్లు ఉత్తమమైన విద్యార్థులకు ఒక అవార్డు ఇస్తారు. ఇతర విషయాలతోపాటు మత ధర్మానికి కూడా ఒక అవార్డు ఇవ్వబడుతుంది. వరుసగా మూడు సంవత్సరాలు, మూడు ఉన్నత శ్రేణులకు ఈ టీచరు అవార్డును యెహోవాసాక్షుల పిల్లలకే ఇచ్చాడు. కాబట్టి, యెహోవాను యథార్థంగా విశ్వసించేవారికి ఇట్టి మేలు జరుగుతుంది.—కీర్తన 31:23.

22. కీర్తన 31 యొక్క విజయవంతమైన ముగింపు ఏమిటి, ఈ విధానపు ముగింపు దినాల్లో అది మనకెలా సహాయం చేస్తుంది?

22 కీర్తన 31 ఇలా విజయవంతమైన ముగింపుతో ప్రతిధ్వనిస్తుంది: “యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.” (కీర్తన 31:24) కాబట్టి, సాతాను దుష్ట విధానపు ముగింపు దినాలను మనం ఎదుర్కొనుచుండగా, యెహోవా మనల్ని విడిచిపెట్టుటకు బదులు, మనకెంతో దగ్గరై, తన స్వంత శక్తిని మనలో ఉంచుతాడు. యెహోవా నమ్మదగినవాడు, ఎన్నడు మాట తప్పడు. ఆయన మన ఆశ్రయ దుర్గము; ఆయన మన కోట.—సామెతలు 18:10.

మీకు జ్ఞాపకమున్నవా?

▫ మనమెందుకు నమ్మకంగా యెహోవాను మన ఆశ్రయదుర్గం చేసుకోవచ్చు?

▫ ఒక గొప్ప బృందగానం ధైర్యంతో రాజ్య స్తుతిని పాడుతున్నదనుటకు ఏ సాక్ష్యాధారం కలదు?

▫ సాతాను వల యెహోవా ప్రజలను పట్టివుంచలేదని మనమెందుకు నమ్మకం కలిగి ఉండవచ్చు?

▫ తనను ఆశ్రయించే వారి కొరకు యెహోవా ఏ నిధిని ఉంచాడు?

[12-15వ పేజీలోని చిత్రం]

యెహోవాసాక్షులు 1993 సేవా సంవత్సరపు ప్రపంచవ్యాప్త నివేదిక

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

[16, 17వ పేజీలోని చిత్రాలు]

యెహోవాను ఆశ్రయించువారు బలమైన అనగా, పటిష్ఠమైన—47,09,889 మందిగల బృందగాన రాజ్య ప్రచారకులుగా ఉన్నారు!

1. సెనెగల్‌

2. బ్రెజిల్‌

3. చిలీ

4. బొలీవియా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి