కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 1/1 పేజీలు 24-28
  • యెహోవా మమ్మల్ని ఎన్నడూ విడువలేదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మమ్మల్ని ఎన్నడూ విడువలేదు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు సత్యాన్ని నేర్చుకోవడం
  • వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రకటించడం
  • రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కష్టాలు
  • తటస్థత విషయమై పరీక్షింపబడడం
  • మా స్వగ్రామానికి తిరిగి వెళ్లడం
  • సాహిత్య సరఫరా ఆగిపోవడం
  • కష్టాలు అధికమయ్యాయి
  • అనూహ్యమైన మార్పులు
  • దేవుని రాజ్యం కొరకు మాత్రమే
  • యెహోవా “బలాధిక్యము” ఇచ్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • తూర్పు పడమరలో, యెహోవా తన ప్రజలను బలపరుస్తున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో యాభై సంవత్సరాలకుపైగా సేవ చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • “సకల జనములకు” సాక్ష్యమిచ్చుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 1/1 పేజీలు 24-28

యెహోవా మమ్మల్ని ఎన్నడూ విడువలేదు

నాషొ దొరి చెప్పినది

మబ్రెష్తాన్‌ అనేది దక్షిణ అల్బేనియాలోని ఒక చిన్న పర్వత గ్రామం, అది గ్రీస్‌కు ఎంతో దూరాన లేదు. నేను 1907లో అక్కడ జన్మించాను. నాకు ఐదేళ్లున్నప్పుడు నేను గ్రీకు పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాను, అయితే మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఇటలీ దళాలు అల్బేనియాను ఆక్రమించుకున్నప్పుడు నా చదువు ఆగిపోయింది. యుద్ధం తర్వాత నేను పాఠశాలకు వెళ్లడం పునఃప్రారంభించాను అయితే అది అల్బేనియా భాషలో.

నా తలిదండ్రులు ఎక్కువ మతనిష్టగలవారు కాకపోయినప్పటికీ వారు అల్బేనియా ఆర్థడాక్స్‌ చర్చి ఆచారాలను అభ్యసించేవారు. మబ్రెష్తాన్‌లో మా మామయ్య మతగురువు, కాబట్టి నేను చర్చిలో పని చేసి లోపల ఏమి జరిగేదో అంతా చూశాను. ఆ ఆచారకర్మలు ఎంతో శూన్యంగా కనిపించాయి, వేషధారణ నాకు చింతను కలిగించింది.

ప్రాంతీయ ఆచారాలను అనుసరిస్తూ, నేను వివాహం చేసుకునేందుకు నా తలిదండ్రులు నా కొరకు ఒక యౌవనస్థురాలిని ఎంపిక చేశారు. అర్గ్‌జీరో ప్రక్క గ్రామమైన గ్రబోవాకు చెందినది, ఆమెకు 18 ఏళ్లు ఉన్నప్పుడు, అంటే 1928లో మాకు వివాహమైంది.

బైబిలు సత్యాన్ని నేర్చుకోవడం

అమెరికా నుండి వచ్చిన ఒక మరిదితో నేను ఆ సమయంలో ఆర్థడాక్స్‌ చర్చి గురించి ఫిర్యాదు చేశాను. “అమెరికాలో, మా ఇంటివద్ద ఉన్న ప్రజల గుంపుకు చర్చిలేదు, అయితే వారు బైబిలు పఠిస్తారు.” చర్చి లేకుండా బైబిలును పఠించడమన్న ఆలోచన నాకు బాగా నచ్చింది. కొన్ని బైబిలు ప్రచురణలను నాకు పంపించగలవా అని నేను ఆయనను అడిగాను.

ఒక సంవత్సరం తర్వాత విస్‌కాన్‌సిన్‌నందలి మిల్‌వావ్‌కీ నుండి నేను ఒక ప్యాకెట్టును అందుకునేంత వరకూ ఆ నాటి మా సంభాషణను గురించి నేను పూర్తిగా మర్చిపోయాను. అందులో అల్బేనియా భాషలో దేవుని వీణె (ఆంగ్లం) అనే పుస్తకం మరియు గ్రీకు భాషలో కావలికోట ఉన్నాయి. ఆ పుస్తకాన్ని పైపైన చదివి, నిజమైన చర్చిని గురించి ఉదహరింపబడి ఉండటాన్ని నేను గమనించాను. అది నాకు వ్యాకులత కలిగించింది. ‘నాకు చర్చితో ఏ సంబంధమూ అక్కర్లేదు,’ అని నేను అనుకున్నాను. కాబట్టి నేను ఆ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవలేదు.

1929లో నేను సైన్యంలో చేరి అల్బేనియా రాజధాని అయిన టిరాన నగరానికి పంపబడ్డాను. గ్రీకు బైబిలు చదువుతున్న స్టాతీ మూకీని అక్కడ నేను కలిశాను. “మీరు చర్చికి వెళతారా?” అని నేను అడిగాను. “లేదండి, నేను చర్చిని వదిలేశాను. అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల్లో నేను ఒకతన్ని,” అని అతను జవాబిచ్చాడు. ఆదివారం నాడు నేను మరో సైనికుడు స్టాతీతోపాటు కూటానికి వెళ్లాం. నిజమైన చర్చి ఒక కట్టడం లేక ఒక మతం కాదు, అయితే అది క్రీస్తు అభిషిక్త సేవకులవలన ఏర్పడుతుందని నేను అక్కడ తెలుసుకున్నాను. దేవుని వీణె ఏమి చెబుతుండినదో నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను.

1920 మధ్యభాగంలో నాషో ఇడ్రిజీ మరియు స్పైరో వౄహో అమెరికానుండి అల్బేనియాకు తిరిగి వచ్చి, అక్కడ వారు నేర్చుకున్న బైబిలు సత్యాలను అందరికీ చెబుతున్నారు. టిరానలో, నేను కొంతమంది బైబిలు విద్యార్థులతో కూటాలకు హాజరవ్వడం ప్రారంభించాను. నేను యెహోవా సంస్థను కనుగొన్నానని నాకు త్వరలోనే తెలిసిపోయింది. కాబట్టి 1930 ఆగష్టు 4న, దగ్గర్లోని నదిలో నాకు బాప్తిస్మం ఇవ్వబడింది.

తర్వాత, చెప్పులు కుట్టే పనియైన నా వృత్తిని మళ్లీ చేపట్టడానికి నేను మబ్రెష్తాన్‌కు తిరిగివచ్చాను. అయితే మరింత ప్రాముఖ్యంగా, నేను నేర్చుకున్న బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకోవడాన్ని కూడా నేను ప్రారంభించాను. నేను వాళ్లకిలా చెప్పేవాన్ని: “యేసుక్రీస్తు చర్చిలోని విగ్రహాలవంటి వాడుకాడు. ఆయన సజీవంగా ఉన్నాడు!”

వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రకటించడం

1925లో అక్‌మెద్‌ బే జోగ్య అధికారం చేజిక్కించుకుని, 1928లో తననుతాను రాజైన వోగ్‌ Iగా చేసుకుని 1939 వరకు పరిపాలించాడు. ఆయనవద్దనున్న మానవహక్కుల మంత్రి మన క్రైస్తవ పనికి అంగీకారాన్నిచ్చాడు. అయినప్పటికీ, మాకు సమస్యలు ఉండేవి. ఆంతరంగిక వ్యవహారాల మంత్రియైన మూసా జుక్కా, రోమ్‌లోని పోపుతో దగ్గరి సంబంధాన్ని కలిగివున్నాడు గనుక పరిస్థితి అలా ఉండేది. ముస్లిమ్‌, ఆర్థడాక్స్‌ మరియు రోమన్‌ కాథోలిక్కు—ఈ మూడు మతాలు మాత్రమే గుర్తింపు పొందాలని జుక్కా ఆజ్ఞాపించాడు. మా పుస్తకాలను జప్తు చేసి, మా ప్రకటనాపనిని ఆపేయాలని పోలీసులు ప్రయత్నించారు, అయితే వారు విఫలమయ్యారు.

1930లలో, అల్బేనియాలోని పెద్ద నగరమైన బేరాట్‌ను నేను తరచూ దర్శించేవాన్ని, అక్కడనుండే మిహాల్‌ స్వేకీ మా ప్రకటనాపనిని నియంత్రించేవాడు. మేము దేశమంతటా ప్రకటనాయాత్రలను ఏర్పాటు చేశాం. ఒకసారి నన్ను రెండు వారాల కొరకు ష్కోడెర్‌ పట్టణానికి పంపడం జరిగింది, నేను అక్కడ చాలా సాహిత్యాన్ని అందించగల్గాను. 1935లో కెల్‌సైరీ పట్టణంలో ప్రకటించేందుకు మాలోని ఒక గుంపు ఒక బస్సును అద్దెకు తీసుకుంది. తర్వాత, అల్బేనియాలోని పెర్మెట్‌, లెస్కోవిక్‌, ఎర్‌సెకీ, కోర్‌సే, పొగ్రాడెక్క్‌ మరియు ఎల్‌బాసాన్‌ పట్టణాలకు వెళ్లేందుకు పెద్దయాత్ర ఏర్పాటు చేయబడింది. క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించేందుకు సరైన సమయంలోనే మేము టిరానలో మా యాత్రను ముగించాం.

ఆత్మీయ ఆహారం యొక్క కొంత సరఫరా మేము ఆత్మీయంగా దృఢంగా ఉండేందుకు సహాయపడింది, కాబట్టి మేము ఎన్నడూ విడువబడినట్లు భావించలేదు. 1930 నుండి 1939 వరకు నేను గ్రీకు కావలికోటను క్రమంగా పొందాను. ప్రతిదినం కనీసం ఒక గంటసేపైనా బైబిలును చదవాలనేది నా లక్ష్యం, నా కంటిచూపు దెబ్బతినేంత వరకూ అంటే 60 సంవత్సరాలు నేను అలాగే చేశాను. కేవలం ఇటీవలనే అల్బేనియా భాషలో పూర్తి బైబిలు లభ్యమయ్యింది, కాబట్టి చిన్నతనంలో నేను గ్రీకు నేర్చుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఆ తొలి దినాల్లోని ఇతర అల్బేనియా సాక్షులు, తాము కూడా పూర్తి బైబిలును చదవగల్గేందుకు గ్రీకు చదవడం నేర్చుకున్నారు.

1938లో అర్గ్‌జీరో బాప్తిస్మం తీసుకుంది. 1939కల్లా మా పదిమంది పిల్లల్లో ఏడుగురు జన్మించారు. దుఃఖకరంగా, మా మొదటి ఏడుగురు పిల్లల్లో ముగ్గురు చిన్నవయస్సులోనే మరణించారు.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కష్టాలు

రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభానికి కేవలం కొంత ముందు, 1939 ఏప్రిల్‌లో, ఇటలీకి చెందిన ఫాసిస్ట్‌ దళాలు అల్బేనియాపై దాడి చేశాయి. త్వరలోనే యెహోవాసాక్షుల పని నిషేధించబడింది, అయితే దాదాపు 50 మంది రాజ్యప్రచారకులున్న మా చిన్నగుంపు మాత్రం ప్రకటించడంలో కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో మా పుస్తకాలు మరియు చిన్నపుస్తకాలలో 15,000 ప్రచురణలను జప్తుచేసి, వాటిని నాశనం చేశారు.

జాని కొమీనో ఇంటికి ఆనుకుని, ప్రచురణలను పెట్టేందుకు పెద్ద బాండాగారం ఉండేది. పుస్తకాలు అమెరికాలో ప్రచురింపబడ్డాయని ఇటలీ దళాలకు తెలిసినప్పుడు, వారు వ్యాకులపడ్డారు. “మీరు మతప్రచారకులు! అమెరికా ఇటలీకి విరుద్ధంగా ఉంది!” అని వారన్నారు. ఆసక్తిగల యౌవన సహోదరులైన థోమాయ్‌ కామా మరియు వసిలీ కామా అరెస్టు చేయబడ్డారు, మరి వారు పంచిపెడుతున్న పుస్తకాలు కొమీనో నుండి వచ్చాయని వారికి తెలిసినప్పుడు, ఆయన కూడా అరెస్టు చేయబడ్డాడు. త్వరలోనే విచారణ కొరకు పోలీసులు నన్ను సమావేశపర్చడం జరిగింది.

“నీకు ఈ మనుష్యులు తెలుసా?” అని వారడిగారు.

“తెలుసు,” అని నేను సమాధానమిచ్చాను.

“నీవు వీళ్లతో పని చేస్తున్నావా?”

“అవును. మేము యెహోవాసాక్షులం. మేము ప్రభుత్వానికి విరుద్ధంగా లేము. మేము తటస్థంగా ఉంటాం,” అని నేను సమాధానమిచ్చాను.

“నీవు ఈ ప్రచురణలను పంచిపెడుతున్నావా?”

నేను దృఢంగా జవాబిచ్చినప్పుడు, వారు నాకు బేడీలు వేశారు, 1940 జూలై 6న నన్ను చెరసాలలో వేశారు. మా గ్రామంనుండి వచ్చిన మిగతా ఐదుగురితో అంటే జోసెఫ్‌ కాచీ, లూకాన్‌ బార్కో, జానీ కొమీనో మరియు కామా సహోదరులను నేను కలిశాను. చెరసాలలో ఉన్నప్పుడు, మేము మరో ముగ్గురు సాక్షులను అంటే గోరీ నాచీ, నికోదిమ్‌ సైటీ మరియు లియోనిడాస్‌ పోప్‌లను కలిశాం. మేము తొమ్మండుగురం 1.8×3.5 మీటర్ల ఇరుకు గదిలో వేయబడ్డాం!

కొన్ని దినాల తర్వాత, మా అందరికీ కలిపి గొలుసులువేసి పెర్మెట్‌ నగరానికి తీసుకువెళ్లారు. మూడునెలల తర్వాత మమ్మల్ని టిరానలోని చెరసాలలోకి మార్చి, మాకు విచారణ జరపకుండా మరో ఎనిమిది నెలలు అక్కడ ఉంచారు.

తుదకు, మేము ఒక సైనిక న్యాయస్థానం ఎదుట హాజరయ్యాం. సైటీ సహోదరునికి మరియు నాకు 27 నెలలు, కోమినో సహోదరునికి 24 నెలలు శిక్ష విధింపబడింది, మరి మిగిలిన వారు 10 నెలల తర్వాత విడిచిపెట్టబడ్డారు. మమ్మల్ని గ్జీరోకాస్టర్‌ జైలుకు మార్చారు, అక్కడే గోలే ఫ్లోకో సహోదరుడు 1943లో మేము విడుదలను పొందేందుకు సహాయపడ్డాడు. తర్వాత మా కుటుంబం పెర్మెట్‌ నగరంలో స్థిరపడింది, అక్కడున్న చిన్న సంఘానికి నేను అధ్యక్షున్నయ్యాను.

మా పని నిషేధింపబడి, పొరుగు దేశాల్లో రెండవ ప్రపంచ యుద్ధం చెలరేగినప్పటికీ, రాజ్య వర్తమానాన్ని ప్రకటించాలని మాకివ్వబడిన ఆజ్ఞను నెరవేర్చడానికి మేము చేయగల్గినదంతా చేయడంలో కొనసాగాం. (మత్తయి 24:14) 1944లో మొత్తం 15 మంది సాక్షులు చెరసాలలో ఉన్నారు. అయినప్పటికీ, ఈ కష్టతరమైన కాలాల్లో, యెహోవాచేత విడువబడినట్లు మేమెన్నడూ భావించలేదు.

తటస్థత విషయమై పరీక్షింపబడడం

1945లో యుద్ధం ముగిసినప్పటికీ, మా కష్టాలు కొనసాగాయి ఇంకా క్షీణించాయి కూడా. 1946 డిశంబరు 2న జరిగిన ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని నియమం పెట్టారు. ఓటు వేయకుండా ఉండాలని తీర్మానించుకునే ధైర్యం చేసే వారెవరైనా రాష్ట్రానికి శత్రువులుగా పరిగణింపబడేవారు. పెర్మెట్‌లోని మా సంఘంలో ఉన్న వారు “మేము ఏం చేయాలి?” అని అడగటం ప్రారంభించారు.

“మీకు యెహోవాపై నమ్మకముంటే, ఏమి చేయాలో మీరు నన్ను అడిగే అవసరం లేదు. యెహోవా ప్రజలు తటస్థంగా ఉంటారని మీకు ఇదివరకే తెలుసు. వారు లోకంలో భాగంకాదు” అని నేను సమాధానమిచ్చాను.—యోహాను 17:16.

ఎన్నికల దినం వచ్చింది, ప్రభుత్వ ప్రతినిధులు మా ఇంటికి వచ్చారు. వారు నెమ్మదిగా ఇలా ప్రారంభించారు, “ముందు ఓ కప్పు కాఫీ తాగి తర్వాత మాట్లాడదాం. నేడు ఏమిటో మీకు తెలుసా?”

“తెలుసు, నేడు ఎన్నికలు నిర్వహింపబడుతున్నాయని,” నేను సమాధానమిచ్చాను.

“మీరు త్వరపడితే మంచిది, లేకపోతే మరీ ఆలస్యమౌతుందని,” ఒక అధికారి అన్నాడు.

“లేదు, నేను వెళ్లదల్చుకోలేదు. మా ఓటు యెహోవాకే,” అని నేను జవాబిచ్చాను.

“సరే మరి వచ్చి ప్రత్యర్థి వర్గానికి ఓటు వేయండి.”

యెహోవాసాక్షులు సంపూర్ణంగా తటస్థంగా ఉంటారని నేను వివరించాను. మేము తటస్థంగానే ఉంటామన్నది స్పష్టమైనప్పుడు, మాపై ఎక్కువ ఒత్తిడి తీసుకురాబడింది. మా కూటాలను జరుపుకోవడం నిలిపివేయాలని మాకు ఆజ్ఞాపించబడింది, కాబట్టి మేము రహస్యంగా కూడుకోవటం ప్రారంభించాం.

మా స్వగ్రామానికి తిరిగి వెళ్లడం

1947లో నేను నా కుటుంబం మబ్రెష్తాన్‌కు తిరిగి వచ్చాం. దాని తర్వాత వెంటనే, ఒక శీతల డిశంబరు మధ్యాహ్నాన, సిగురిమి (రహస్య పోలీసు) కార్యాలయానికి నన్ను పిలిపించారు. “నేను నిన్ను ఎందుకు పిలిపించానో నీకు తెలుసా?” అని అధికారి అడిగాడు.

“నాకు విరుద్ధంగా మీరు ఆరోపణలను విని ఉంటారని నేను ఊహిస్తున్నాను. లోకం మమ్మల్ని ద్వేషిస్తుందని బైబిలు చెబుతుంది, కాబట్టి ఆరోపణలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించవని” నేను సమాధానమిచ్చాను.—యోహాను 15:18, 19.

“నాతో బైబిలు గురించి మాట్లాడకు. నేను నీ తల పగలగొట్టేస్తానని” అరిచాడు.

ఆ అధికారి అతని మనుష్యులు వెళ్లిపోయారు అయితే చలిలో బయట నిలబడమని నాకు చెప్పారు. కొంత సమయమైన తర్వాత అతను తన కార్యాలయంలోకి నన్ను పిలిచి, మా ఇంట్లో కూటాలను జరుపుకోవడం ఆపమని నాకు ఆజ్ఞాపించాడు. “మీ గ్రామంలో ఎంతమంది నివసిస్తున్నారు?” అని అతను అడిగాడు.

“నూటఇరవై మంది,” అని నేను చెప్పాను.

“వాళ్లదే మతం?”

“అల్బేనియన్‌ ఆర్థడాక్స్‌.”

“మరి నీది?”

“నేను యెహోవాసాక్షిని.”

“నూటఇరవై మందిది ఒక దారి నీది ఒక్కనిదీ మరో దారీనా?” చర్చిలో క్రొవొత్తులను వెలిగించమని తర్వాత అతను నాకు ఆజ్ఞాపించాడు. నేనలా చేయనని చెప్పినప్పుడు, అతను నన్ను కర్రతో కొట్టడం ప్రారంభించాడు. నేను తుదకు వదిలిపెట్టబడినప్పుడు ఉదయం దాదాపు ఒంటి గంట అయ్యింది.

సాహిత్య సరఫరా ఆగిపోవడం

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, తపాలాలో కావలికోట మాకు మళ్లీ రావడం ప్రారంభమైంది, అయితే తుదకు పత్రికలు అందకుండా అయ్యాయి. తర్వాత, ఒక రాత్రి పది గంటలకు, రహస్య పోలీసులు నన్ను పిలిపించారు. “గ్రీకు భాషలో ఒక పత్రిక వచ్చింది, అందులో ఏముందో నీవు మాకు వివరించాలి,” అని నాకు చెప్పారు.

“నాకు గ్రీకు అంత ఎక్కువగా రాదు. మా పొరుగతనికి బాగా వచ్చు. బహుశా ఆయన మీకు సహాయం చేయగలడు,” అని నేను చెప్పాను.

“లేదు, దీని గురించి నీవే మాకు వివరించాలి,” అని అంటూ ఒక అధికారి కొన్ని గ్రీకు కావలికోట ప్రతులను బయటకు తీశాడు.

“అరే, ఇవి నావి!” అంటూ నేను ఆశ్చర్యపడ్డాను. “నేను మీకు తప్పకుండా వివరించగలను. మీకు తెలుసా, ఈ పత్రికలు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌నుండి వస్తాయి. యెహోవాసాక్షుల ముఖ్యకార్యాలయం ఉన్నది అక్కడే. నేను ఒక యెహోవాసాక్షిని. అయితే చిరునామా విషయంలో వారు పొరబడివుంటారని నాకు అనిపిస్తుంది. ఈ పత్రికలను నాకు పంపవలసింది కానీ మీకు కాదు.”

వారు ఆ పత్రికలను నాకు ఇవ్వలేదు, మరి ఆ సమయంనుండి 1991 వరకు, అంటే 40 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వరకు అల్బేనియాలో మేము ఏ బైబిలు సాహిత్యాన్ని పొందలేదు. ఆ సంవత్సరాలన్నింటిలో, కేవలం మా బైబిళ్లను మాత్రమే ఉపయోగిస్తూ మేము ప్రకటించడం కొనసాగించాం. 1949లో దాదాపు 20 మంది సాక్షులు జైలులో ఉన్నారు; కొందరికి ఐదు సంవత్సరాల శిక్షపడింది.

కష్టాలు అధికమయ్యాయి

1950లలో, సైన్యానికి మద్దతునిస్తున్నారని చూపించే పత్రాలను వెంటబెట్టుకు తిరగాలని ప్రజలు ఆజ్ఞాపించబడ్డారు. అయితే, అలాంటి పత్రాలను వెంట ఉంచుకోడానికి యెహోవాసాక్షులు నిరాకరించారు. దాని కారణాన, కొమీనో సహోదరుడు మరియు నేను మరో రెండు నెలలు జైలులో గడిపాం.

రాష్ట్రం కొన్ని మతాల ఉనికిని అనుమతించిన సమయాల్లో, మాకు కొంత స్వాతంత్ర్యముండేది. అయితే, 1967లో అల్బేనియాను అధికారికంగా ఒక సంపూర్ణ నాస్తిక దేశంగా చేస్తూ అన్ని మతాలు నిషేధింపబడ్డాయి. సాక్షులు కూటాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించడంలో కొనసాగారు, అయితే అలా చేయడం మరీ కష్టతరమైంది. మాలో కొందరం, ఒక చిన్న బైబిలును దాచుకోడానికి, మా కోటులోపలి వైపున ఒక ప్రత్యేకమైన జేబును కుట్టుకున్నాం. తర్వాత దాన్ని చదివేందుకు మేము పొలంలోకి వెళ్లేవాళ్లం.

టిరానలోని సాక్షులు అలా చదువుతున్నప్పుడు పట్టుబడ్డారు మరియు ముగ్గురు సుదూర లేబర్‌ క్యాంపులకు ఐదేళ్ల కొరకు పంపబడ్డారు. తత్ఫలితంగా, వారి కుటుంబాలు కష్టాలు అనుభవించాయి. సుదూరంగా ఉన్న చిన్న చిన్న గ్రామాలలోని మమ్మల్ని బయటకు పంపలేదు ఎందుకంటే మేము ఒక గంభీరమైన ముప్పుకాగలమని వారు భావించలేదు. అయితే మా తటస్థత ఆహార సరఫరాల పట్టికలోనుండి మా పేర్లను తీసివేయడానికి దారి తీసింది. అలా, జీవితం చాలా కష్టమైపోయింది. మా పిల్లల్లో మరో ఇద్దరు మరణించారు. అయినప్పటికీ మేము యెహోవా ద్వారా విడువబడినట్లు ఎన్నడూ భావించలేదు.

అల్బేనియాలో భయం ప్రబలివుండేది. ప్రతి ఒక్కరూ గమనించబడే వారు, పరిపాలక వర్గం యొక్క అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపర్చేందుకు ఎవరైనా ధైర్యం చేస్తే రహస్య పోలీసులు వారిపై నివేదికలు వ్రాసేవారు. కాబట్టి మా కార్యకలాపాలను గూర్చిన వ్రాతపూర్వక నివేదికలను చేయడం విషయంలో మేమెంతో అప్రమత్తంగా ఉండేవాళ్లం. ఆత్మీయ ప్రోత్సాహం కొరకు మేము ఇద్దరు లేక ముగ్గురుకంటే ఎక్కువమంది ఉండే గుంపులుగా కూడుకోలేము. అయినప్పటికీ, ప్రకటించడాన్ని మేమెన్నడూ ఆపలేదు.

సహోదరుల మధ్య గలిబిలిని సృష్టించాలన్న ప్రయత్నంలో, టిరానలోని ఒక ప్రముఖ సాక్షి గూఢాచారి అన్న వదంతును రహస్య పోలీసులు వ్యాప్తి చేశారు. ఇది, కొందరు నమ్మకాన్ని కోల్పోవడానికి దారి తీసింది మరి కొంతమేరకు మా ఐక్యత దెబ్బతిన్నది. ఇటీవలి బైబిలు సాహిత్యాలను వేటినీ కలిగిలేనందుకు మరియు యెహోవా దృశ్య సంస్థతో ఎలాంటి సంబంధం లేనందుకు, కొందరు భయానికి లొంగిపోయారు.

దానికి తోడు, అల్బేనియాలో ఉన్నతంగా గౌరవింపబడుతున్న ఒక క్రైస్తవ పెద్ద అయిన స్పైరో వౄహో ఆత్మహత్య చేసుకున్నాడన్న వదంతును అధికారులు వ్యాప్తిచేశారు. “చూశారా, వౄహో కూడా చేతులెత్తేశాడు,” అని వారు చెప్పారు. వాస్తవానికి సహోదరుడైన వౄహో హత్య చేయబడ్డాడని తర్వాత తెలిసింది.

1975లో, కొన్ని నెలలపాటు అర్గ్‌జీరో, నేను టిరానలోని మా కుమారుని వద్ద ఉన్నాం. ఎన్నికల సమయంలో, పట్టణంలోని అధికారులు ఇలా బెదిరిస్తూ, మాపై ఒత్తిడి తెచ్చారు: “మీరు ఓటు వేయకపోతే, మేము మీ కుమారుని ఉద్యోగం తీసేస్తాం.”

“నా కుమారుడు తన ఉద్యోగంలో 25 ఏళ్లనుండివున్నాడు. అతని గురించి, అతని కుటుంబం గురించి మీ వద్ద వివరమైన వ్యక్తిగత రికార్డులు ఉంటాయి. నేను 40 ఏళ్లుగా ఓటు వేయడంలేదు. ఈ సమాచారం సాధారణంగా వ్యక్తిగత రికార్డుల్లో ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీ రికార్డులు సరైన పద్ధతిలో లేవన్న మాట. ఒకవేళ మీ రికార్డుల్లో ఉంటే, అతన్ని ఇన్ని సంవత్సరాలు పని చేయడానికి అనుమతించడం ద్వారా మీరు వర్గానికి అన్యాయం చేసినట్లే” అని నేను జవాబిచ్చాను. దీన్ని విన్న తర్వాత, మేం మబ్రెష్తాన్‌కు వెళ్లిపోతే తాము విషయాన్ని తిరగతోడమని అధికారులు చెప్పారు.

అనూహ్యమైన మార్పులు

1983లో మేము మబ్రెష్తాన్‌నుండి లాచ్‌ నగరానికి వెళ్లాం. తర్వాత కొంతకాలానికి, 1985లో ఆ నియంత మరణించాడు. 1946లో జరిగిన ఆ మొదటి తప్పనిసరి ఎన్నికలు మొదలుకొని ఇప్పటివరకు అతను పరిపాలించాడు. కొంత కాలానికి, టిరాన ముఖ్యకూడలిని ఆక్రమించివుండిన అతని విగ్రహాన్ని మరియు స్టాలిన్‌ విగ్రహాన్ని తీసివేయడం జరిగింది.

మా పనిపై నిషేధముండిన దశాబ్దాలలో, అనేకమంది సాక్షులపట్ల పాశవికంగా ప్రవర్తించారు, మరి కొందరిని చంపేశారు. ఒక వ్యక్తి వీధిలో కొందరు సాక్షులకిలా చెప్పాడు: “కమ్యూనిస్టుల కాలంలో మనమందరం దేవున్ని విడనాడాము. శ్రమలుకష్టాలు ఉన్నప్పటికీ కేవలం యెహోవాసాక్షులు మాత్రమే ఆయనకు యథార్థంగా ఉన్నారు.”

ఎక్కువ స్వాతంత్ర్యం ఇవ్వబడినప్పుడు, 1991 జూన్‌లో క్రైస్తవ పరిచర్యలో తొమ్మిదిమంది పాల్గొన్నట్లు నివేదించారు. నిషేధం ఎత్తివేయబడిన ఒక నెల తర్వాత, అంటే 1992 జూన్‌లో 56 మంది ప్రకటనాపనిలో భాగంవహించారు. మునుపు ఆ సంవత్సరంలో, క్రీస్తు మరణజ్ఞాపకార్థ దినానికి 325 మంది హాజరవ్వడంతో మేమెంతో ఆనందం పొందాము. అప్పటినుండి ప్రకటిస్తున్న వారి సంఖ్య 600 కంటే ఎక్కువకు పెరిగింది, మరి 1995 ఏప్రిల్‌ 14న జరిగిన జ్ఞాపకార్థ దినానికి 3,491 మంది హాజరయ్యారు! ఇటీవలి సంవత్సరాల్లో అనేకమంది యౌవనులు మా సంఘానికి రావడాన్ని చూడటం నాకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది.

అర్గ్‌జీరో ఈ అనేక సంవత్సరాలన్నింటిలో యెహోవాకు నమ్మకంగా ఉంది మరి నాకు యథార్థంగా ఉంది. నేను జైలులో ఉన్నప్పుడు లేక ప్రకటనాపనిలో ప్రయాణిస్తున్నప్పుడు, ఆమె ఫిర్యాదు చేయకుండా మా కుటుంబ అవసరతలపట్ల ఓర్పుతో శ్రద్ధ వహించింది. మా కుమారుల్లో ఒకతను అతని భార్య 1993లో బాప్తిస్మం తీసుకున్నారు. అది మాకెంతో సంతోషాన్ని కలిగించింది.

దేవుని రాజ్యం కొరకు మాత్రమే

అల్బేనియాలోని యెహోవా సంస్థ ఎంతో ఐక్యంగా, సమృద్ధిని అనుభవిస్తుండగా చూసి నేను సంతోషిస్తున్నాను. తాను మరణించక ముందు, ఎంతో కాలం క్రితం వాగ్దానం చేయబడిన మెస్సీయను చూడగల్గే అమూల్యమైన అధిక్యత అనుగ్రహింపబడిన వృద్ధుడైన సుమెయోనువలె నేను భావిస్తున్నాను. (లూకా 2:30, 31) నేను ఏ ప్రభుత్వ విధానాన్ని ఇష్టపడతానని ఇప్పుడు నన్ను అడిగితే, నేనిలా చెబుతాను: “నేను సమాజవాదాన్ని లేక పెట్టుబడిదారీ విధానాన్ని ఇష్టపడను. ప్రజలు లేదా రాష్ట్రం భూమిపై హక్కును కలిగి ఉండటం ప్రాముఖ్యం కాదు. ప్రభుత్వాలు రోడ్లు నిర్మిస్తాయి, దూరానున్న గ్రామాలకు విద్యుచ్ఛక్తిని తెస్తాయి మరి కొంత శాంతిని కాపాడతాయి. అయితే, అల్బేనియా మరియు మిగతా ప్రపంచమంతా అనుభవిస్తున్న కష్టతరమైన సమస్యలన్నింటికీ ఉన్న ఏకైక పరిష్కారం యెహోవా ప్రభుత్వమే, ఆయన పరలోక రాజ్యమే.”

దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడం ద్వారా భూవ్యాప్తంగా దేవుని సేవకులు చేస్తున్నది ఏ మానవుని పనికాదు. ఇది దేవుని పని. మనం ఆయన సేవకులం. అల్బేనియాలో మేమనేక కష్టాలను అనుభవించినప్పటికీ మరి యెహోవా దృశ్య సంస్థనుండి దీర్ఘకాలం దూరం చేయబడినప్పటికీ, మేం ఆయనచేత ఎన్నడూ విడువబడలేదు. ఆయన ఆత్మ ఎల్లవేళలా ఇక్కడ ఉండేది. ఆయన మార్గంలోని ప్రతి అడుగునా నడిపింపునిచ్చాడు. నేను దీన్ని నా జీవితమంతటిలో చూశాను.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి