యెహోవాయందు నమ్మకముంచండి!
“నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.”—సామెతలు 3:5.
1. సామెతలు 3:5 ఒక యౌవనున్ని ఎలా ప్రభావితం చేసింది, ఏ దీర్ఘకాల ఫలితంతో?
చాలా కాలంనుండి మిషనరీగా ఉన్న ఒక వ్యక్తి యిలా వ్రాస్తున్నాడు: “‘నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.’ బైబిలునుండి తీయబడిన ఆ పదాలు, ఫ్రేము కట్టబడి నేను దర్శిస్తున్న ఇంట్లోని గోడపై తగిలించబడి ఉన్నాయి. అవి నా అవధానాన్ని చూరగొన్నాయి. ఆ దినమంతా నేను ఆ మాటలను మననం చేసుకున్నాను. నేను నా పూర్ణ హృదయంతో దేవునియందు నమ్మకముంచగలనా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.” అప్పుడు ఈ వ్యక్తి 21 సంవత్సరాల వాడు. ఇప్పుడు 90 సంవత్సరాల వయస్సులో, ఆస్ట్రేలియాలోని, పెర్త్‌లో సంఘపెద్దగా ఇంకా నమ్మకంగా సేవచేస్తున్నాడు. యెహోవాయందు మనఃపూర్వకమైన విశ్వాసాన్ని ఉంచడం వలన కలిగిన ప్రతిఫలంతో ఆయన జీవితం ఎంత ధన్యమయ్యిందో. దానిలో క్రొత్త పయినీరు క్షేత్రాలైన సిలోన్ (ఇప్పుడు శ్రీలంక), బర్మా (ఇప్పుడు మాయన్మార్), మలయా, థాయిలాండ్, ఇండియా, మరియు పాకిస్తాన్‌లలో 26 సంవత్సరాలు కష్టించి చేసిన పయనీరు సేవ ఫలితాలను తాను చూడగలడు.a
2. సామెతలు 3:5 మనలో ఏ దృఢనమ్మకాన్ని నిర్మించాలి?
2 “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము”—న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ప్రకారం తర్జుమా చేయబడిన సామెతలు 3:5లోని ఈ మాటలు, పర్వతాలవంటి అడ్డంకులను కూడా ఎదుర్కొనునంతగా యెహోవా మన విశ్వాసాన్ని బలపర్చగలడను దృఢనమ్మకంతో, ఆయనకు మన జీవితాలను పూర్ణ హృదయంతో సమర్పించుకొనడంలో కొనసాగడానికి మనందరిని పురికొల్పాలి. (మత్తయి 17:20) మనము ఇప్పుడు సామెతలు 3:5ను దాని సందర్భసహితంగా పరీక్షించుదాము.
తండ్రి ఇచ్చే బోధ
3. (ఎ) సామెతల గ్రంథంలోని మొదటి తొమ్మిది అధ్యాయాల్లో ఏ ప్రోత్సాహం కనుగొనబడుతోంది? (బి) మనము సామెతలు 3:1, 2కు సరైన అవధానం ఎందుకు ఇవ్వాలి?
3 పరలోకంలో దేవుని కుమారునిగా ఉండడానికి లేదా భూపరదైసులో, “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము,” పొందడానికి బైబిలు పుస్తకమైన సామెతలలోని మొదటి తొమ్మిది అధ్యాయాలు తండ్రి ఇచ్చే బోధతో విరాజిల్లుతున్నాయి. (రోమీయులు 8:18-21, 23) కుమారులను, కుమార్తెలను పెంచడంలో తలిదండ్రులు ఉపయోగించగల జ్ఞానవంతమైన సలహాలు ఇక్కడ ఉన్నాయి. సామెతలు 3వ అధ్యాయంలోని సూచన చాలా గొప్పగా ఉంది, అది ఈ విధంగా ప్రారంభమౌతుంది: “నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము.” సాతాను దుష్టలోకముయొక్క అంత్యదినాలు వాటి ముగింపునకు వస్తుండగా మనం యెహోవా ఇస్తున్న గద్దింపులకు మునుపెన్నటికంటే ఎక్కువ అవధానాన్ని ఇవ్వాలి. అది సుదూరంగా ఉన్నట్లు కన్పించినా, సహించిన వారందరికి ఈ వాగ్దానం ఉంది, “అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును.” అదే యెహోవా తీసుకువచ్చే నూతన విధానంలోని నిత్య జీవము.—సామెతలు 3:1, 2.
4, 5. (ఎ) యోహాను 5:19, 20లో ఏ సంతోషకరమైన సంబంధం వివరించబడింది? (బి) ద్వితీయోపదేశకాండము 11:18-21లోని సలహా మన దినము వరకు ఎలా అన్వయింపును కలిగి ఉంది?
4 తండ్రీ కుమారుల మధ్య సంతోషకరమైన సంబంధం చాలా అమూల్యమైనదిగా ఉండగలదు. మన సృష్టికర్తయైన యెహోవా దేవుడు, అది ఆ విధంగా ఉండాలని నియమించాడు. యెహోవాతో తనకున్న అన్యోన్య సంబంధాన్ని గూర్చి క్రీస్తుయేసు యిలా చెప్పాడు: “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడు.” (యోహాను 5:19, 20) అటువంటి అన్యోన్యత తనకు, భూమిపైని తన పూర్తి కుటుంబానికి మధ్య, అలాగే మానవ తండ్రులకు వారి పిల్లలకు మధ్య ఉండాలని యెహోవా సంకల్పించాడు.
5 ప్రాచీన ఇశ్రాయేలులో ఒక నమ్మకమైన కుటుంబ సంబంధం ప్రోత్సహించబడింది. యెహోవా, తండ్రులకు అక్కడ యిలా సలహా ఇచ్చాడు: “మీరు ఈనామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటినిగూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ యింటి ద్వారబంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను. ఆలాగు చేసిన యెడల యెహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతివారి దినములును భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును.” (ద్వితీయోపదేశకాండము 11:18-21) మన గొప్ప బోధకుడైన యెహోవా దేవుని ప్రేరేపిత వాక్యము, ఆయనను తలిదండ్రులతోను, వారి పిల్లలతోను, అలాగే క్రైస్తవ సంఘంలో ఆయనను సేవించే వారందరితోను సన్నిహితంగా ఐక్యపర్చడానికి తప్పక దోహదపడగలదు.—యెషయా 30:20, 21.
6. మనము దేవుని దృష్టిలోను, మనుష్యుల దృష్టిలోను ఎలా దయను పొందగలము?
6 సామెతలు 3వ అధ్యాయంలోని 3, 4 వచనాల్లో దేవుని ప్రజలైన, పెద్దలకు మరియు పిన్నలకు, తండ్రి యిచ్చే జ్ఞానవంతమైన సలహాలు ఉన్నాయి: “దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు.” దయను సత్యమును ప్రదర్శించడంలో యెహోవా దేవుడు అత్యున్నతుడు. కీర్తన 25:10 తెలియజేస్తున్నట్లు, “యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములైయున్నవి.” యెహోవాను అనుకరిస్తూ, మనం ఆ లక్షణాలను, వాటి రక్షణకరమైన శక్తిని విలువైనవిగా ఎంచాలి. వాటిని ఒక ఖరీదైన కంఠాభరణాన్ని మనం ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో అలా చూసుకుంటూ మన హృదయాలపై చెక్కుకోవాలి. కావున మనం, ఈ విధంగా ఎడతెగక ప్రార్థించవచ్చు: “యెహోవా, . . . నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక.”—కీర్తన 40:11.
ఒక స్థిరమైన నమ్మకము
7. యెహోవా తన నమ్మకత్వాన్ని ఏయే విధాలుగా చూపించాడు?
7 నమ్మకము అంటే “ఒక వ్యక్తి లేక ఒకదాని యొక్క వ్యక్తిత్వం, సామర్థ్యం, శక్తి, సత్యత్వంపై నిశ్చయమైన విశ్వాసము” అని వెబ్‌స్టర్స్ నైన్త్ కాలేజియేట్ డిక్షనరీ నిర్వచించింది. యెహోవా వ్యక్తిత్వం ఆయన కృపలో దృఢంగా వేళ్లూనినదై ఉంది. యెహోవా అను ఆయన నామమే, ఆయనను మహాగొప్ప సంకల్పకర్తగా గుర్తిస్తుంది గనుక, వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల ఆయన సామర్థ్యంపై మనం పూర్తి నమ్మకం కలిగి ఉండవచ్చు. (నిర్గమకాండము 3:14; 6:2-8) సృష్టికర్తగా ఆయన శక్తికి, బలాతిశయమునకు ఊటయై ఉన్నాడు. (యెషయా 40:26, 29) ఆయన “అబద్ధమాడజాలని” దేవుడు గనుక, ఆయన సత్యానికే ప్రతిరూపమై ఉన్నాడు. (హెబ్రీయులు 6:18) కావున, ఆయన పూర్ణ సత్యానికి మూలం మరియు తనను నమ్మే వారిని రక్షించగల సర్వోన్నత శక్తి మరియు తన గొప్ప సంకల్పాలను మహోన్నతంగా విజయవంతం చేయగల సామర్థ్యత కలిగి ఉన్న మన దేవుడైన యెహోవాయందు దృఢ నమ్మకాన్ని కలిగి ఉండవలసిందిగా మనం ప్రోత్సహించ బడుతున్నాము.—కీర్తన 91:1, 2; యెషయా 55:8-11.
8, 9. లోకంలో నమ్మకం ఎందుకు విశాదకరంగా లోపించింది, మరి యెహోవా ప్రజలు ఏ విధంగా భిన్నంగా ఉన్నారు?
8 మనచుట్టూ ఉన్న దిగజారిన ప్రపంచంలో, విచారకరంగా నమ్మకమనేది ఎక్కడా కనిపించడంలేదు. బదులుగా, మనం ప్రతిచోట పేరాశ మరియు అవినీతిని కనుగొంటున్నాము. వరల్డ్ ప్రెస్ రీవ్యూ పత్రిక మే 1993 సంచిక యొక్క మొదటి పేజీపై “అవినీతి వెల్లువ—నూతన లోక వ్యవస్థలో రోత డబ్బు. అవినీతి అనేది బ్రెజిల్ నుండి జర్మనీ వరకు, అమెరికా నుండి అర్జెంటీనా వరకు, స్పెయిన్ నుండి పెరూ వరకు, ఇటలీ నుండి మెక్సికో వరకు, వాటికన్ నుండి రష్యా వరకు పాకిపోయింది” అనే మాటల్ని సొగసుగా ముద్రించింది. ద్వేషము, పేరాశ, మరియు అపనమ్మకంపై ఆధారపడిన మానవుని నూతన లోక వ్యవస్థ అని పిలువబడు ఈ వ్యవస్థ మానవజాతి కొరకు పెచ్చుపెరిగిపోవు పరితాపం కంటే ఎక్కువేమి గడించడంలేదు.
9 రాజకీయ దేశాలకు భిన్నంగా, యెహోవాసాక్షులు “యెహోవా తమకు దేవుడుగాగల జనులు”గా ఉండడానికి సంతోషిస్తున్నారు. “దేవునియందు మేము నమ్మకముంచియున్నాము” అని కేవలము వారు మాత్రమే సత్యవంతంగా చెప్పగలరు. వాళ్లలో ప్రతిఒక్కరు ఈ విధంగా ఆనందంతో కేక వేయగలరు: “దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. . . . . నేను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను.”—కీర్తన 33:12; 56:4, 11.
10. యథార్థతను నిలుపుకోడానికి చాలామంది యౌవనులను ఏది దృఢపర్చింది?
10 వేలాదిమంది యౌవన సాక్షులు తీవ్రంగా కొట్టబడడం మరియు చెరసాలలో వేయబడడాన్ని అనుభవించిన ఒక ఆసియా దేశంలో, యెహోవాయందు నమ్మకముంచడం చాలా ఎక్కువమంది సహించడానికి తోడ్పడింది. జైలులో ఒక రాత్రి, అప్పటికే చాలా దారుణమైన హింసను ఎదుర్కొన్న ఒక యౌవన సాక్షి నేనింక సహించలేను అని భావించాడు. అయితే ఇంకొక యౌవనుడు అతని దగ్గరికి చీకట్లో దొంగచాటుగా వచ్చి అతనితో గుసగుసగా యిలా చెప్పాడు: “నీవు స్థిరంగా ఉండు; నేను రాజీపడ్డాను, అప్పటి నుండి నేను అస్సలు మనశ్శాంతి లేకుండా ఉన్నాను.” మొదటి యౌవనుడు నిలకడగా ఉండాలనే తన నిశ్చయాన్ని దృఢపర్చుకున్నాడు. మన యథార్థతను హరించివేయాలని సాతాను చేసే ఏ ప్రయత్నాన్నైనా మరియు ప్రతి ప్రయత్నాన్ని ఎదుర్కొనడానికి ఆయన మనకు సహాయం చేయగలడని మనం యెహోవాయందు పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు.—యిర్మీయా 7:3-7; 17:1-8; 38:6-13, 15-17.
11. యెహోవాయందు నమ్మకం ఉంచడానికి మనం ఎలా పురికొల్పబడ్డాము?
11 మొదటి ఆజ్ఞలో కొంత భాగం యిలా ఉంది: “నీవు నీ పూర్ణహృదయముతో . . . నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.” (మార్కు 12:30) మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, మనం నేర్చుకుంటున్న గొప్ప సత్యాలు మన హృదయ లోతుల్లోనికి చొచ్చుకొని పోయి, మన ఆశ్చర్యకరుడైన దేవుడు, సర్వోన్నత ప్రభువగు యెహోవా సేవలో మనకున్న యావత్తును వినియోగించడానికి మనం పురికొల్పబడేలా చేయాలి. ఆయన మనకు నేర్పినదంతా, మనకు చేసినదంతా, మరియు మనకు ఇంకా చేయబోయేదాని విషయమై, మెప్పువల్ల ఉప్పొంగిపోయిన మనస్సుతో మనం ఆయన రక్షణను అంతర్గతంగా నమ్మడానికి పురికొల్ప బడుతున్నాము.—యెషయా 12:2.
12. అనేక సంవత్సరాల వ్యవధిలో, యెహోవాయందు తమ నమ్మకాన్ని చాలామంది క్రైస్తవులు ఎలా కనపరిచారు?
12 ఈ నమ్మకాన్ని అనేక సంవత్సరాల కాలనిడివిలో పెంపొందించుకొనవచ్చు. వాచ్‌టవర్ సంస్థ యొక్క బ్రూక్లిన్ కేంద్ర కార్యాలయంలో 50 సంవత్సరాలకు పైగా పనిచేసిన వినయస్థుడైన ఒక యెహోవాసాక్షి, 1927 ఏప్రిల్‌లో తన పని మొదలు పెట్టాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “ఆ నెల చివర్లో, సామెతలు 3:5, 6లోని బైబిలు వాక్యం అందంగా వ్రాయబడి ఉన్న ఒక కవరులో ఉంచబడిన $5.00 ఉపకార వేతనాన్ని నేను అందుకున్నాను . . . భూమిపై ఉన్న రాజ్య సంబంధ విషయాలపట్ల నమ్మకంగా శ్రద్ధ తీసుకొనడానికి ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసున్ని’ యెహోవా కలిగి ఉన్నాడనే విషయాన్ని నేను కేంద్ర కార్యాలయంలో ఉన్నప్పుడు గుణగ్రహించ గలిగాను గనుక యెహోవాయందు నమ్మకముంచడానికి ప్రతికారణం నాకుండెను.—మత్తయి 24:45-47.”b ఈ క్రైస్తవుని హృదయం ధనాశపై కాదుగానీ, “పరలోకమందు అక్షయమైన ధనమును” సంపాదించుకొనడంపై ఉంది. అదే విధంగా ఈనాడు కూడా, భూవ్యాప్తంగా ఉన్న వాచ్‌టవర్ సంస్థ యొక్క బేతేలు గృహాల్లో సేవచేసే వేలాదిమంది ఒక విధమైన చట్టపర దారిద్ర్యపు ప్రమాణం క్రిందే పని చేస్తున్నారు. తమ అనుదిన అవసరతలను తీర్చడానికి వారు యెహోవాయందు నమ్మకముంచుతున్నారు.—లూకా 12:29-31, 33, 34.
యెహోవాపై ఆధారపడండి
13, 14. (ఎ) పరిణతి చెందిన సలహా ఎక్కడ మాత్రమే లభించగలదు? (బి) హింసలను అధిగమించడానికి దేన్ని నిరాకరించాలి?
13 మన పరలోకపు తండ్రి మనల్ని యిలా హెచ్చరిస్తున్నాడు: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొన” వద్దు. (సామెతలు 3:5) ఈ లోకపు సలహాదారులూ మనస్తత్వ శాస్త్రజ్ఞులు, యెహోవా ప్రదర్శిస్తున్న జ్ఞానాన్ని మరియు బుద్ధిని సమీపించడానికి ఎన్నడూ నిరీక్షించలేరు. “ఆయన జ్ఞానమునకు మితిలేదు.” (కీర్తన 147:5) పరిణతమైన సలహా కొరకు ఈ లోకములో ఘనత వహించిన మనుష్యులపై లేక అజ్ఞానంతో నిండిన మన స్వంత భావోద్రేకాలపై ఆధారపడక, యెహోవా, ఆయన వాక్యము, మరియు క్రైస్తవ సంఘంలోని పెద్దలవైపు మనం చూద్దాము.—కీర్తన 55:22; 1 కొరింథీయులు 2:5.
14 త్వరలో రాబోతున్న మహా శ్రమదినాన మానవజ్ఞానం లేదా మన హోదా మనల్ని కాపాడలేవు. (యెషయా 29:14; 1 కొరింథీయులు 2:14) రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాన్‌నందు, మంచి సామర్థ్యంగలవాడే కానీ అహంకారియైన ఒక దేవుని ప్రజల కాపరి తన స్వబుద్ధిని ఆధారం చేసుకోడానికి ఇష్టపడ్డాడు. ఒత్తిడి వచ్చినప్పుడు అతడు మత భ్రష్టుడయ్యాడు, కాగా మందలోని చాలామంది శ్రమలు వచ్చినప్పుడు మందకొడిగా తయారయ్యారు. జైలులోని మురికి గదుల్లో భయంకరమైన బాధను ధైర్యంగా తట్టుకున్న ఒక యథార్థమైన జపాన్ సహోదరి యిలా వ్యాఖ్యానించింది: “నమ్మకంగా నిలిచినవారిలో ప్రత్యేకమైన సామర్థ్యాలు లేవు మరియు వారు పెద్ద ప్రాధాన్యతగల వారేమీ కాదు. కావున మనందరం తప్పక మన పూర్ణహృదయంతో ఎల్లప్పుడు యెహోవాయందు నమ్మకముంచాలి.”c
15. మనము యెహోవాను ప్రీతిపర్చాలంటే ఏ దైవిక లక్షణం తప్పనిసరి?
15 మన స్వబుద్ధిని ఆధారము చేసికొనక, యెహోవాయందు నమ్మకముంచుటలో దీనత్వం ఇమిడివుంది. యెహోవాను ప్రీతిపర్చాలని కోరుకునే వారందరికి ఈ లక్షణం ఎంత అవసరం! అంతెందుకు, మన దేవుడు, తాను విశ్వమంతటికి సర్వోన్నత ప్రభువైననూ, జ్ఞానంగల తన సృష్టంతో వ్యవహరించేటప్పుడు దీనత్వాన్ని ప్రదర్శిస్తాడు. అందునుబట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండవచ్చు. “ఆయన భూమ్యాకాశములను వంగిచూడ ననుగ్రహించుచున్నాడు . . . ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు.” (కీర్తన 113:6, 8) మానవజాతికి తానిచ్చిన మహాగొప్ప బహుమతి అయిన, తన ప్రియకుమారుడైన, క్రీస్తుయేసు యొక్క అమూల్యమైన విమోచనా క్రయధనం ఆధారంగా, అపార దయవలన, ఆయన మన తప్పిదాలను క్షమిస్తున్నాడు. ఈ కృప విషయమై మనము ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండవలసి యున్నాము!
16. సంఘంలో సహోదరులు ఆధిక్యతల కొరకు ఎలా ముందుకు రావచ్చు?
16 యేసు తానే మనకిలా జ్ఞాపకం చేస్తున్నాడు: “తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.” (మత్తయి 23:12) దీనత్వంతో, బాప్తిస్మం పొందిన సహోదరులు క్రైస్తవ సంఘంలో బాధ్యతల కొరకు ముందుకు రావాలి. అయితే, ఈ నియామకాన్ని, ఒక హోదాకు గుర్తుగా కాదుగానీ, పని చేయడానికి ఒక తరుణంగా భావిస్తూ, దీనంగా, మెప్పుతో, ఆసక్తితో యేసు చేసినట్లు చేయాలి. ఆయనిలా చెప్పాడు: “నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నా”ను.—యోహాను 5:17; 1 పేతురు 5:2, 3.
17. మనందరము దేనిని గుణగ్రహించాలి, మరి అది ఏ పనికి మనల్ని పురికొల్పాలి?
17 మనము యెహోవా దృష్టిలో మంటివారమను విషయాన్ని మనం అన్నివేళలా దీనంగా, ప్రార్థనా పూర్వకంగా గుణగ్రహించుదాము. “యెహోవాయందు భయభక్తులు గలవారిమీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును” అని చెప్పబడినందుకు మనం ఎంత ఆనందించవచ్చు! (కీర్తన 103:14, 17, 18) కావున మనందరము కూడా దేవుని వాక్యం యొక్క శ్రద్ధగల విద్యార్థులమై ఉండాలి. మనం వ్యక్తిగత మరియు కుటుంబ పఠనంలో, అలాగే సంఘ కూటాల్లో గడిపే సమయం మన ప్రతి వారం యొక్క అతి అమూల్యమైన సమయంలో భాగంగా ఉండాలి. ఈ విధంగా “పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివి”ని మనం గడిస్తాము. “జ్ఞానము” అంటే అదే.—సామెతలు 9:10.
“నీ ప్రవర్తన అంతటియందు . . .”
18, 19. మన జీవితాల్లో సామెతలు 3:6ను మనం ఎలా అన్వయించుకోగలము, దాని ఫలితమేమి?
18 జ్ఞానానికి దైవిక మూలమైన యెహోవా వైపునకు మనల్ని త్రిప్పుతూ, సామెతలు 3:6 అటుతరువాత యిలా పేర్కొంటుంది: “నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” ఆయన అధికారాన్ని ఒప్పుకొనడం అంటే అందు ప్రార్థనలో ఆయనకు దగ్గరగా ఉండడం ఇమిడి ఉంది. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితి తలెత్తినా, ప్రార్థన ద్వారా మనం ఆయనను వెంటనే వేడుకొనవచ్చు. మనం మన అనుదిన జీవిత పనులను సాగిస్తుండగా, మనం క్షేత్రసేవ కొరకు సిద్ధపడుతుండగా, ఆయన రాజ్యాన్ని ప్రకటిస్తూ ఇంటింటికీ వెళ్తుండగా, ఆయన మన పనిని ఆశీర్వదించాలన్నదే మన ఎడతెగని ప్రార్థనై ఉండవచ్చు. దేవునియందు భయభక్తులు కలిగి ఉండిన హనోకు, నోవహు, మరియు యెహోషువ, దానియేలు వంటి నమ్మకస్థులైన ఇశ్రాయేలీయులకు చేసినట్లు ఆయన ‘మన త్రోవలను సరాళము చేయును’ అని మనం దృఢనమ్మకంతో ఉంటూ, ‘దేవునితోకూడా నడిచే’ అతి గొప్ప ఆధిక్యత మరియు ఆనందమును మన స్వంతం చేసుకొనవచ్చు.—ఆదికాండము 5:22; 6:9; ద్వితీయోపదేశకాండము 8:6; యెహోషువ 22:5; దానియేలు 6:23; మరియు యాకోబు 4:8, 10 కూడా చూడండి.
19 మన విజ్ఞాపనలను యెహోవాకు తెలియజేస్తే ‘అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును మన తలంపులకును కావలి యుండును’ అని మనం దృఢ నమ్మకం కలిగి ఉండవచ్చు. (ఫిలిప్పీయులు 4:7) సంతోషభరితమైన ముఖవర్చస్సులో ప్రతిబింబించే, దేవుని సమాధానము, పరిచర్య పనిలో మనం కలుసుకొనే గృహస్థులు మన వర్తమానాన్ని వినడానికి సిఫారసు చేయగలదు. (కొలొస్సయులు 4:5, 6) ఈ క్రింది వృత్తాంతం చూపుతున్నట్టు, ఈ లోకంలో సర్వసామాన్యమైన ఒత్తిడులు లేక అన్యాయాలచే బాధింపబడిన వారిని అది ప్రోత్సహించగలదు కూడా.d
20, 21. (ఎ) నాజీ బీభత్సకాండ సమయంలో, యెహోవాసాక్షుల యథార్థత ఇతరులను ఎలా ప్రోత్సహించింది? (బి) యెహోవా స్వరము మనలో ఏ తీర్మానాన్ని పురికొల్పాలి?
20 ఏదో అద్భుతం జరిగినట్లు గొప్ప విపత్తును తప్పించుకున్న, సహజ యూదుడైన మాక్స్ లెబ్స్‌టర్ నాజీ ఎక్స్‌టర్మినేషన్ క్యాంపుకు వెళ్తున్న తన ప్రయాణాన్ని ఈ మాటల్లో వర్ణిస్తున్నాడు: “ఇద్దరిద్దరు పట్టేంత చిన్నచిన్న గదులుగా మార్చిన రైల్వే బోగీలో మమ్మల్ని బంధించారు. వాటిల్లో ఒక దానిలోనికి త్రోయబడగానే ప్రశాంత వదనంతో అందున్న ఖైదిని నేను చూశాను. దేవుని చట్టానికి అతను కలిగి ఉన్న గౌరవాన్నిబట్టి, ఇతర ప్రజల రక్తాన్ని చిందించడానికి బదులు, చెరసాలను మరియు రాబోవు మరణాన్ని అంగీకరించినందుకు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన యెహోవాసాక్షుల్లో ఒకడు. పిల్లల్ని ఆయన్నుండి వేరుచేశారు, ఆయన భార్య చంపబడింది. ఆమెకు పట్టిన గతే తనకు పడుతుందని ఆయన ఎదురుచూస్తున్నాడు. ఈ 14 రోజుల ప్రయాణం నా ప్రార్థనలకు జవాబును తెచ్చింది, ఎందుకంటే మరణానికి వెళ్లే ఈ ప్రయాణంలోనే నేను నిత్యజీవ నిరీక్షణను కనుగొన్నాను.”
21 “సింహపు గుహ” అని ఆయన పిలిచిన ఆస్క్‌విట్జ్‌లో శిక్ష అనుభవించిన తర్వాత బాప్తిస్మం పొందిన ఈ సహోదరుడు మునుపు జైలులో ఉండిన ఒక యెహోవా సాక్షిని వివాహం చేసుకున్నాడు. ఆమె తండ్రి కూడా డాకూవాలోని కాన్సెన్‌ట్రేషన్ క్యాంపులో శ్రమలను అనుభవించాడు. ఆమె తండ్రి అక్కడ ఉన్నప్పుడు, ఆయన భార్యా మరియు యౌవన కుమార్తె అరెస్టు చేయబడ్డారని ఆయన విన్నాడు. ఆయన తన ప్రతిస్పందనను యిలా వర్ణించాడు: “నేనెంతో కలతచెందాను. తర్వాత ఒక రోజు నేను స్నానం కొరకు వరుసలో నిలబడి ఉన్నప్పుడు, సామెతలు 3:5, 6 వచనాలను ఒక స్వరం పేర్కొనడం నేను విన్నాను. అది పరలోకంనుండి వచ్చిన శబ్దంలా ప్రతిధ్వనించింది. నా సమతుల్యాన్ని నిలుపుకొనడానికి అవసరమైనది సరిగ్గా అదే.” వాస్తవానికి, ఆ స్వరం ఆ వచనాన్ని చదువుతున్న ఇంకో ఖైదీది, కానీ దేవుని వాక్యం మనపై ఎటువంటి శక్తిని కలిగి ఉండగలదు అనే దాన్ని ఆ సంఘటన ఉన్నతపరుస్తుంది. (హెబ్రీయులు 4:12) మన 1994 వార్షిక వచనమైన “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము” అను పదముల ద్వారా యెహోవా స్వరము ఈనాడు మనతో శక్తివంతంగా మాట్లాడును గాక!
[అధస్సూచీలు]
a ది వాచ్‌టవర్, డిశంబరు 15, 1973, 760-5 పేజీల్లో క్లాడ్ ఎస్. గుడ్‌మన్‌చే చెప్పబడిన “ట్రస్టింగ్ జెహోవా విత్ ఆల్ మై హార్ట్” అనే శీర్షికను చూడండి.
b ది వాచ్‌టవర్, జూలై 15, 1968, 437-40 పేజీలలో, హారీ పీటర్‌సన్‌చే తెలుపబడిన “డిటర్‌మైండ్ టు ప్రైజ్ జెహోవా” అనే శీర్షికను చూడండి.
c ది వాచ్‌టవర్, మే 1, 1988, 21-5 పేజీల్లో మత్సూ ఇషీ చెప్పిన “జెహోవా డస్ నాట్ ఫోర్‌సేక్ హిస్ సర్వెంట్స్,” అనే శీర్షికను చూడండి.
d ది వాచ్‌టవర్, అక్టోబరు 1, 1978, 20-4 పేజిల్లో మాక్స్ లెబ్స్‌టర్ చెప్పిన “డెలివరెన్స్! ప్రూవింగ్ అవర్‌సెల్ఫ్‌స్ గ్రేట్‌ఫుల్,” అనే శీర్షికను చూడండి.
సారాంశమందు
◻ సామెతల్లో ఏ విధమైన సలహా అందింపబడింది?
◻ యెహోవాయందు నమ్మకం మనకు ఎలా ప్రయోజనకరం కాగలదు?
◻ యెహోవాపై ఆధారపడడంలో ఏమి ఇమిడి ఉంది?
◻ మన ప్రవర్తన అంతటిలో యెహోవా అధికారాన్ని మనం ఎందుకు ఒప్పుకోవాలి
◻ యెహోవా మన త్రోవలను ఎలా సరాళం చేస్తాడు?
[15వ పేజీలోని చిత్రాలు]
యథార్థ హృదయం గల ప్రజలకు ఆనందభరితమైన రాజ్య సువార్త విజ్ఞాపన చేస్తుంది