యెహోవాతో సాన్నిహిత్యాన్ని పెంచుకోండి
“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని శిష్యుడైన యాకోబు వ్రాశాడు. (యాకోబు 4:8) “యెహోవాకు భయపడేవారికి ఆయనతో సాన్నిహిత్యం ఉంటుంది” అని కీర్తన రచయితయైన దావీదు పాడాడు. (కీర్తన 25:14, NW) మనకు తనతో సన్నిహిత సంబంధముండాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడన్నది స్పష్టం. అయినప్పటికీ, దేవుడ్ని ఆరాధిస్తున్న, ఆయన నియమాలను అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయనతో సన్నిహితంగా ఉన్నామన్న భావన కలగాలనేమీ లేదు.
మీ విషయమేమిటి? వ్యక్తిగతంగా మీకు దేవునితో సన్నిహిత సంబంధముందా? మీరు ఆయనకు మరింత సన్నిహితులు కావాలని కోరుకుంటున్నారనే దానిలో సందేహం లేదు. అయితే మనం దేవునితో సాన్నిహిత్యాన్ని ఎలా పెంచుకోవచ్చు? దేవునితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం అంటే మనకు ఏమిటి భావం? బైబిలులోని సామెతల గ్రంథం మూడవ అధ్యాయం జవాబులనిస్తుంది.
ప్రేమపూర్వక దయనూ సత్యసంధతనూ కనబరచండి
“నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును” అని అంటూ ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు మూడవ అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాడు. (సామెతలు 3:1, 2) సొలొమోను దైవ ప్రేరేపణతో వ్రాశాడు గనుక, తండ్రి ఇస్తున్నట్లున్న ఈ ఉపదేశం నిజానికి యెహోవా దేవుడి నుండి వస్తుంది, ఇది మనలను ఉద్దేశించినది. బైబిలులో లిఖించబడిన దేవుని జ్ఞాపికలను—ఆయన శాసనాలను లేదా బోధనూ, ఆయన ఆజ్ఞలనూ మనం అనుసరించాలని మనకు ఇక్కడ ఉపదేశించబడుతుంది. మనం అలా చేస్తే, ‘దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని అవి మనకు కలుగజేస్తాయి.’ అవును, మనం ఇప్పుడు కూడా శాంతియుతమైన జీవితాన్ని గడపవచ్చు, మనల్ని అకాల మరణానికి గురిచేసే హానికరమైన లక్ష్యాలను పెట్టుకోకుండా ఉండవచ్చు. దుష్క్రియలను చేసే వారు హానికరమైన లక్ష్యాలను పెట్టుకోవడం వల్లే అకాల మరణానికి గురవుతుంటారు. అంతేకాక, శాంతియుతమైన నూతన లోకంలో సదాకాలం జీవించే ఆశను అది మనకు ఇస్తుంది.—సామెతలు 1:24-31; 2:21, 22.
“దయను సత్యమును [“ప్రేమపూర్వక దయను సత్యసంధతను,” NW] ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు.”—సామెతలు 3:3, 4.
మూల భాషలో, “ప్రేమపూర్వక దయ” అనే మాటకు ప్రత్యామ్నాయంగా, “నమ్మకమైన ప్రేమ” అనే మాట ఉపయోగించబడింది. ఆ మాటకు విశ్వాసం, ఏకీభావం, నమ్మకం అనే అర్థాలు ఉన్నాయి. ఏమి జరిగినా సరే, యెహోవాకు సన్నిహితంగా ఉండిపోవాలన్న కృతనిశ్చయంతో మనమున్నామా? తోటి విశ్వాసులతో మనకున్న వ్యవహారాల్లో మనం ప్రేమపూర్వక దయను కనపరుస్తామా? మనం వాళ్ళకు సన్నిహితంగా ఉండడానికి కృషి చేస్తామా? ప్రతి రోజూ వాళ్ళతో వ్యవహరించేటప్పుడు, మన సహనాన్ని పరీక్షించే పరిస్థితుల్లో కూడా ‘ప్రేమపూర్వక దయ అనే ధర్మశాస్త్రం మన జిహ్వపై’ ఉండేలా మనం చూసుకుంటున్నామా?—సామెతలు 31:26, NW.
ప్రేమపూర్వక దయ పుష్కలంగా ఉన్న యెహోవా “క్షమించుటకు సిద్ధమై” ఉన్నాడు. (కీర్తన 86:5) మనం మన గత పాపాల విషయమై పశ్చాత్తాపపడితే, మన మార్గములను సరిచేసుకుంటున్నట్లయితే, యెహోవా సముఖము నుండి “విశ్రాంతికాలములు” వస్తాయని మనకు హామీ ఇవ్వబడుతుంది. (అపొస్తలుల కార్యములు 3:19) ఇతరుల అపరాధములను క్షమిస్తూ మనం మన దేవుడ్ని అనుకరించవద్దా?—మత్తయి 6:14, 15.
యెహోవా ‘సత్యదేవుడు,’ తన సాన్నిహిత్యాన్ని కోరుకునేవాళ్ళు కూడా అలాగే ‘సత్యసంధులు’ అయ్యుండాలని ఆయన కోరుకుంటున్నాడు. (కీర్తన 31:5) తాము నిజానికి ఎలాంటివారు అన్న దాన్ని కప్పిపుచ్చే “అబద్ధికుల”లా మనం ద్వంద్వ జీవితాన్ని గడుపుతున్నట్లయితే, అంటే క్రైస్తవ సహవాసుల మధ్య ఒక రకంగాను, వాళ్ళు లేనప్పుడు మరొక రకంగాను మనం ప్రవర్తిస్తున్నట్లయితే, యెహోవా మనకు స్నేహితుడుగా ఉంటాడని నిజంగా నిరీక్షించగలమా? (కీర్తన 26:4, NW) యెహోవా “కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది” కనుక, అలా ప్రవర్తించడం ఎంత మూర్ఖంగా ఉంటుంది!—హెబ్రీయులు 4:13.
ప్రేమపూర్వక దయనూ సత్యసంధతనూ అమూల్యమైన “కంఠభూషణము”లా విలువైనవిగా దృష్టించాలి, ‘దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలోను ప్రీతిపాత్రులమయ్యేందుకు’ అవి మనకు సహాయపడతాయి. మనం ఈ గుణాలను బయటికి కనబరచడమే కాక, వాటిని ‘మన హృదయ పలకమీద’ చెక్కుకుని, ఆ విధంగా వాటిని మన వ్యక్తిత్వంలో స్వాభావిక భాగంగా చేసుకోవాలి.
యెహోవాపై సంపూర్ణ విశ్వాసాన్ని పెంచుకోండి
“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని జ్ఞానవంతుడైన ఆ రాజు అంటున్నాడు.—సామెతలు 3:5, 6.
ఖచ్చితంగా మనం సంపూర్ణముగా నమ్మదగినవాడు యెహోవా. సృష్టికర్తగా, ఆయనకు “అధికశక్తి” ఉంది, ఆయన “బలాతిశయము”కు మూలం. (యెషయా 40:26, 29) ఆయన తాను ఉద్దేశించినవాటినన్నింటినీ నెరవేర్చగలవాడు. అంతెందుకు, “కారణభూతుడు” అన్నది ఆయన నామానికున్న అక్షరార్థ భావం, తాను వాగ్దానం చేసినవాటిని నెరవేర్చేందుకు ఆయనకు శక్తి ఉందని మనకున్న నమ్మకాన్ని అది అధికం చేస్తుంది! ఆయన “అబద్ధమాడజాలని” వాడు అన్న వాస్తవం, ఆయనను సత్యానికి ప్రతిరూపంగా చేస్తోంది. (హెబ్రీయులు 6:18) ఆయన ప్రముఖ గుణం ప్రేమ. (1 యోహాను 4:8) “యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు [“నమ్మకంగా ఉంటాడు,” NW].” (కీర్తన 145:17) మనం దేవునిపై నమ్మకముంచలేకపోతే, ఇంకెవరిపై నమ్మకం ఉంచగలం? నిజమే, యెహోవాపై నమ్మకాన్ని పెంచుకునేందుకు, మనం బైబిలు నుండి నేర్చుకుంటున్న దానిని మన వ్యక్తిగత జీవితంలో అన్వర్తించుకోవడం ద్వారా, అలా చేయడం వల్ల కలిగే మంచి ఫలితాలను ధ్యానించడం ద్వారా, మనం “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసి”కోవలసిన అవసరం ఉంది.—కీర్తన 34:8.
‘మన ప్రవర్తన అంతటిలోను ఆయన అధికారానికి’ మనమెలా ఒప్పుకోవచ్చు? “నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును” అని దైవప్రేరేపితుడైన కీర్తన రచయిత అంటున్నాడు. (కీర్తన 77:12) దేవుడు అదృశ్యుడు గనుక ఆయనతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలంటే, ఆయన చేసిన గొప్ప కార్యాలనూ, ఆయన తన ప్రజలతో వ్యవహరించిన విధానాన్నీ ధ్యానించడం ఆవశ్యకం.
ప్రాముఖ్యంగా ప్రార్థించడం ద్వారా కూడా యెహోవా అధికారానికి ఒప్పుకుంటాం. రాజైన దావీదు ‘దినమెల్ల యెహోవాకు మొఱ్ఱపెట్టుకుంటూ’ వచ్చాడు. (కీర్తన 86:3) ఆయన అరణ్యప్రాంతంలో పలాయితుడుగా ఉన్నప్పుడు తరచూ రాత్రుల్లో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. (కీర్తన 63:6, 7) ‘ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రార్థన చేస్తూ’ ఉండండి అని అపొస్తలుడైన పౌలు బోధించాడు. (ఎఫెసీయులు 6:18) మనం ఎంత తరచుగా ప్రార్థనచేస్తుంటాం? మనం వ్యక్తిగతంగా దేవుని ఎదుట మనస్సు విప్పి మాట్లాడడంలో ఆనందిస్తామా? మన సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురైనప్పుడు, సహాయం చేయమని ఆయనకు విజ్ఞప్తి చేసుకుంటామా? ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థనాపూర్వకంగా ఆయన మార్గదర్శనం కోసం ప్రయత్నిస్తామా? యెహోవాకు మనం చేసే హృదయపూర్వకమైన ప్రార్థనలు మనల్ని ఆయనకు ఎంతో ప్రియమైనవారిగా చేస్తాయి. ఆయన మన ప్రార్థనను విని, మన ‘త్రోవలను సరాళము చేస్తాడు’ అని మనకు నమ్మకముంది.
మనం యెహోవాపై సంపూర్ణంగా నమ్మకముంచగల్గినప్పుడు, ‘మన స్వబుద్ధిని ఆధారము చేసుకోవడం’ లేక ఈ లోకంలోని ప్రముఖుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం ఎంత మూర్ఖత్వం! “నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు” అని సొలొమోను అంటున్నాడు. అలా అనుకోక, “యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును” అని సొలొమోను ఉపదేశిస్తున్నాడు. (సామెతలు 3:7, 8) దేవునికి అప్రీతిని కలిగించాలంటే ఉండే ఆరోగ్యకరమైన భయం, మన ప్రవర్తన అంతటినీ మన తలంపులనన్నింటినీ మన భావోద్వేగాలన్నింటినీ శాసించి తీరాలి. అలాంటి భక్తితో కూడిన భయం, తప్పు చేయడం నుండి మనలను మళ్ళించి మనకు ఆధ్యాత్మిక స్వస్థతనూ సేదదీర్పునూ ఇస్తుంది.
మీకున్న దానిలో శ్రేష్ఠమైనది యెహోవాకు ఇవ్వండి
మరే విధంగా మనం యెహోవాకు సన్నిహితులం కాగలం? “నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము” అని సొలొమోను రాజు నిర్దేశిస్తున్నాడు. (సామెతలు 3:9) యెహోవాకు ఘనతనివ్వడమంటే, ఆయనకు అత్యంత గౌరవాన్నివ్వడమనీ, ఆయన నామాన్ని బహిరంగంగా ప్రకటించే పనిలో పాల్గొనడం ద్వారా, ఆ పనికి మద్దతునివ్వడం ద్వారా ఆయనను స్తుతించడమనీ అర్థం. మనం యెహోవాను ఘనపరచేందుకు ఇవ్వగల విలువైనవి—మన సమయం, మన సామర్థ్యాలు, మన బలం, మన వస్తు సంపదలు. ఇవి ప్రథమ ఫలాలు అయ్యుండాలి, అంటే మనకున్నవాటిలో శ్రేష్ఠమైనవి అయ్యుండాలి. మనం మనకున్నవాటిని ఎలా ఉపయోగిస్తున్నామన్నది ‘రాజ్యమును దేవుని నీతిని మొదట వెదకుతూ’ ఉండాలన్న మన నిర్ణయాన్ని ప్రతిఫలించేదిగా ఉండవద్దా?—మత్తయి 6:33.
యెహోవాను మనకున్న శ్రేష్ఠమైనవాటితో ఘనపరుస్తే ప్రతిఫలం దక్కకుండా పోదు. “అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును” అని సొలొమోను హామీ ఇస్తున్నాడు. (సామెతలు 3:10) ఆధ్యాత్మిక ఉన్నతి దానంతటదే భౌతిక ఉన్నతికి నడిపించకపోయినప్పటికీ, మనకున్నవాటిని యెహోవాను ఘనపరచడానికి ధారాళంగా ఉపయోగించినప్పుడు, గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుని చిత్తం చేయడమన్నది యేసుకు తనను పోషించే ‘ఆహారంగా’ ఉండింది. (యోహాను 4:34) అలాగే, యెహోవాను మహిమపరచే ప్రకటనా పనిలోను, శిష్యులను చేసే పనిలోను మనం భాగం వహించడం మనలను బలపరుస్తుంది. మనం ఈ పనిలో పట్టుదలగా ఉంటే, మన ఆధ్యాత్మిక భాండాగారాలు పుష్కలంగా నిండుతాయి. క్రొత్త ద్రాక్షారసంతో సూచించబడిన మన ఆనందం పొంగిపొర్లుతుంది.
మనం కూడా యెహోవాపై ఆధారపడుతూ, ప్రతి రోజూ కావలసిన భౌతిక ఆహారం కోసం ప్రార్థన చేయమా? (మత్తయి 6:11) వాస్తవానికి, మనకున్న ప్రతిదీ మన ప్రేమగల పరలోక తండ్రి దగ్గరి నుండి వస్తుంది. మనం యెహోవాకు స్తుతులను తీసుకువచ్చేందుకు మనకున్న విలువైన వాటిని ఎంత మేరకు ఉపయోగిస్తామో యెహోవా అంత మేరకు మనపై మరిన్ని ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు.—1 కొరింథీయులు 4:7.
యెహోవా శిక్షణను స్వీకరించండి
యెహోవాతో సాన్నిహిత్యాన్ని సంపాదించడంలో, శిక్షణను స్వీకరించవలసిన ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఇశ్రాయేలీయుల ఆ రాజు మనకు ఇలా ఉపదేశిస్తున్నాడు: “నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.”—సామెతలు 3:11, 12.
అయితే, శిక్షణను స్వీకరించడం మనకు అంత సులభంగా ఉండకపోవచ్చు. “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయనను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 12:11) గద్దింపూ, శిక్షణా మనలను దేవునికి సన్నిహితులనుగా చేసే తర్ఫీదులో అవశ్యక భాగమై ఉన్నాయి. యెహోవా నుండి వచ్చే దిద్దుబాటు యెహోవాకు మనపై ఉన్న ప్రేమను వ్యక్తీకరిస్తుంది. ఆ దిద్దుబాటు మన తల్లిదండ్రుల ద్వారానైనా, క్రైస్తవ సంఘం ద్వారానైనా, లేదా మనం వ్యక్తిగత అధ్యయనం చేస్తున్నప్పుడు లేఖనాలను ధ్యానించడం ద్వారానైనా రావచ్చు. మనం ఆ దిద్దుబాటును స్వీకరించడం వివేకవంతమైన పని.
వివేకాన్నీ, వివేచననూ నిలుపుకోండి
తర్వాత, యెహోవాతో దగ్గరి సంబంధాన్ని పెంచుకోవడంలో వివేకము వివేచనల ప్రాముఖ్యతను సొలొమోను నొక్కిచెబుతున్నాడు. “జ్ఞానము [“వివేకము,” NW] సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము [“వివేకము,” NW] సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము [“వివేకము,” NW] నొందుట మేలు. . . . దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.”—సామెతలు 3:13-18.
యెహోవా యొక్క అద్భుతమైన సృష్టి పనుల్లో ప్రదర్శించబడిన వివేకాన్నీ వివేచననూ మనకు గుర్తు చేస్తూ, రాజు ఇలా అన్నాడు: “జ్ఞానమువలన [“వివేకముతో,” NW] యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను. . . . నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును [“ఆచరణాత్మకమైన వివేకాన్నీ,” NW] వివేచనను [“ఆలోచనా సామర్థ్యాన్నీ,” NW] భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును.”—సామెతలు 3:19-22.
వివేకమూ వివేచనా దైవిక గుణాలు. మనం వాటిని పెంపొందించుకోవడమే కాక, మనం శ్రద్ధగా లేఖనాలను అధ్యయనం చేయడాన్నీ, మనం నేర్చుకుంటున్న వాటిని అన్వర్తించుకోవడాన్నీ నిర్లక్ష్యం చేయకుండా ఉండడం ద్వారా వాటిని నిలుపుకుందాం. “అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు” అని కూడా సొలొమోను అంటున్నాడు. “పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు” అని కూడా ఆయన అంటున్నాడు.—సామెతలు 3:23, 24.
అవును, సాతాను యొక్క ఈ దుష్ట విధానంపై, “ఆకస్మికముగా నాశనము తటస్థించు” రోజు దొంగవలె వస్తోందని మనం ఎదురు చూస్తుండగా, మనం భద్రతా భావంతో నడవవచ్చు, మనశ్శాంతిగా నిద్రపోవచ్చు. (1 థెస్సలొనీకయులు 5:2, 3; 1 యోహాను 5:19) మహాశ్రమ త్వరలో రాబోతున్నప్పటికీ, మనకు ఈ నిశ్చయత ఉంది: “ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.”—సామెతలు 3:25, 26; మత్తయి 24:21.
మేలు చేయండి
“మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము” అని సొలొమోను ఉపదేశిస్తున్నాడు. (సామెతలు 3:27) ఇతరులకు మేలు చేయడంలో, వాళ్ళ కోసం మనకున్న వాటిని ఉదారంగా ఉపయోగించడం ఇమిడి ఉంది. మేలు చేసే పద్ధతులు అనేకం ఉన్నాయి. కానీ, ఈ “అంత్యకాలము”లో మనం ఇతరులకు చేయగల అత్యంత శ్రేష్ఠమైన పని, వాళ్ళు సత్య దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవడానికి సహాయం చేయడం కాదా? (దానియేలు 12:4) కనుక, రాజ్య ప్రకటన పనిలో, శిష్యులను చేసే పనిలో అభినివేశాన్ని చూపించవలసిన రోజులివి.—మత్తయి 28:19, 20.
“ద్రవ్యము నీయొద్ద నుండగా—రేపు ఇచ్చెదను పోయ రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయ గోరవద్దు” అని అంటూ, వివేకియైన ఆ రాజు, మనం విడనాడవలసిన కొన్ని చెడ్డ అలవాట్లను తెలియజేస్తున్నాడు.—సామెతలు 3:28-31.
తను ఈ ఉపదేశమివ్వడానికి కారణాలను సంగ్రహంగా చెబుతూ, “కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. [‘సన్నిహితంగా ఉంటాడు,” NW] భక్తిహీనుల యంటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును. జ్ఞానులు [“వివేకులు,” NW] ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు అవమానభరితులగుదురు” అని సొలొమోను అన్నాడు.—సామెతలు 3:32-35.
మనం యెహోవాతో సాన్నిహిత్యాన్ని అనుభవించాలంటే మనం వక్రమైన హానికరమైన ఆలోచనలు చేయకుండా ఉండడం తప్పనిసరి. (సామెతలు 6:16-19) దేవుని దృష్టిలో సరైన వాటిని చేస్తేనే మనం ఆయన అనుగ్రహాన్నీ, ఆశీర్వాదాన్నీ పొందుతాము. మనం దైవిక వివేకానికి పొందికగా ప్రవర్తించడాన్ని ఇతరులు చూసినప్పుడు మనం ఆశించని గౌరవం కూడా మనకు లభించవచ్చు. కనుక, ఈ దుష్టమైన, హింసాత్మకమైన లోకంలోని వక్ర మార్గాలను మనం తిరస్కరించుదాం. నిజంగానే, సరైన పద్ధతిని అవలంబిస్తూ, యెహోవాతో సాన్నిహిత్యాన్ని పెంచుకుందాం!
[25వ పేజీలోని చిత్రాలు]
‘మీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచండి’