యెహోవా పరిశుద్ధ స్థలాన్ని ఒక రాజు అపవిత్రపర్చుట
“అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు”—దానియేలు 11:32.
1, 2. రెండువేల సంవత్సరాల కంటే అధికంగా ఏ నాటకీయ పోరాటం మానవ చరిత్రలో గుర్తింపబడింది?
పరస్పరం వ్యతిరేకించుకొను యిరువురు రాజులు అధికారం కొరకై విపరీతంగా పోరాడారు. మొదట ఒకడు తర్వాత రెండవవాడు అధికారం పొందుతూ యిలా యీ పోరాటం రెండు వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది. మన కాలంలో యీ పోరాటం భూమి మీద అనేకమంది ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తూ దేవుని ప్రజల యథార్థతను యిది పరీక్షించింది. ఈ రెండు ఆధిపత్యాలూ ఎదురుచూడని సంఘటనతో యిది ముగుస్తుంది. ఈ నాటకీయ చరిత్ర, ప్రాచీనకాల ప్రవక్తయైన దానియేలుకు ముందుగానే బయల్పరచబడింది.—దానియేలు 10 నుండి 12 అధ్యాయాలు.
2 ఉత్తర దేశపు రాజు, దక్షిణ దేశపు రాజుల నడుమ జరిగే ఎడతెగని వైరంతో యీ ప్రవచనానికి సంబంధం వుంది. ఈ విషయం “యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్”a అనే పుస్తకంలో విశదంగా చర్చించబడింది. ఉత్తర దేశపు రాజు, మొదటగా ఇశ్రాయేలుకు ఉత్తరంగానున్న సిరియా అని ఆ పుస్తకం చూపింది. ఆ తర్వాత, రోమా యీ పాత్రను వహించింది. ఇకపోతే, దక్షిణ దేశపు రాజుగా మొదట ఐగుప్తు ఉండింది.
అంత్యకాలంలో వైరం
3. దూత చెప్పిన ప్రకారం, ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశపు రాజుల ప్రవచనం ఎప్పుడు అర్థమౌతుంది, ఎలా?
3 ఈ విషయాలను దానియేలుకు బయల్పర్చిన దూత యిలా అన్నాడు: “దానియేలూ, నీవు యీ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు యీ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశల సంచరించి నందున తెలివి అధికమగును.” (దానియేలు 12:4) అవును, 1914 నుండి ప్రారంభమైన కాలంతో, అంటే అంత్యకాలముతో యీ ప్రవచనానికి సంబంధం వుంది. గుర్తింపబడిన ఆ కాలంలో, అనేకులు పరిశుద్ధ లేఖనాలందు “నలుదిశల సంచరి”స్తారు, అలాగే పరిశుద్ధాత్మ సహాయంతో తెలివి, బైబిలు ప్రవచనాల అవగాహన సహితం అధికమౌతాయి. (సామెతలు 4:18) కాలగమనంలో దానియేలు ప్రవచనాల అవగాహన మరిన్ని వివరాలతో స్పష్టమయ్యింది. మరి “యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్” అనే పుస్తకం ప్రచురించబడిన 35 సంవత్సరాల తర్వాత, అంటే యిప్పుడు 1993లో ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశపు రాజులను గూర్చిన ప్రవచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
4, 5. (ఎ) ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశపు రాజులను గూర్చిన దానియేలు ప్రవచనంలో 1914వ సంవత్సరం ఎక్కడ వుంది? (బి) దూత చెప్పినట్లు, 1914లో ఏమి సంభవిస్తుంది?
4 యేసు ప్రవచించిన మొదటి ప్రపంచ యుద్ధం, యితర ప్రపంచ విపత్తులు 1914లో అంత్యకాలం ప్రారంభమయ్యిందని సూచించాయి. (మత్తయి 24:3, 7, 8) ఆ సంవత్సరాన్ని మనం దానియేలు ప్రవచనంలో గుర్తించగలమా? అవును. అంత్యకాల ప్రారంభమే దానియేలు 11:29లో ప్రస్తావించిన “నిర్ణయకాలం.” (“యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్” పుస్తకంలో 269-70 పేజీలు చూడండి.) దానియేలు 4వ అధ్యాయంలో ప్రవచనార్థకంగా గుర్తించదగిన సంఘటనలందు సూచింపబడిన 2,520 సంవత్సరాలు ముగిసిన తర్వాత అది వచ్చింది గనుక, అది దానియేలు కాలంలో యెహోవా ముందుగానే నిర్ణయించిన కాలమైయుంది.
5 సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం నుండి, అంటే దానియేలు బాలుడుగా వున్న కాలం నుండి సా.శ. 1914. వరకున్న ఆ 2,520 సంవత్సరాలు ‘అన్యజనముల కాలములు’ అని పేర్కొనబడ్డాయి. (లూకా 21:24) వాటి ముగింపును ఏ రాజకీయ సంఘటనలు సూచిస్తాయి? ఒక దూత దాన్ని దానియేలుకు బయల్పర్చాడు. “నిర్ణయకాలమందు [ఉత్తర దేశపురాజు] మరలి దక్షిణదిక్కునకు వచ్చునుగాని మొదట నున్నట్టుగా కడపటనుండదు” అని దూత అన్నాడు.—దానియేలు 11:29.
రాజు యుద్ధంలో ఓడిపోతాడు
6. పందొమ్మిది వందల పద్నాలుగులో ఉత్తర దేశపు రాజు ఎవరు, దక్షిణ దేశపు రాజు ఎవరు?
6 ఉత్తర దేశపు రాజు స్థానాన్ని, 1914లో కైసరు విల్హెల్మ్ నాయకత్వంలో జర్మనీ ఆక్రమించుకుంది. (రోమీయుల బిరుదైన “సీజర్” నుండి తీసుకొనబడిన “కైసర్.”) ఉత్తర దక్షిణ దేశపు రాజుల నడుమ జరిగే పోరాటాల పరంపరలందు ఐరోపాలో చెలరేగిన విరోధాలు మరొక నిదర్శనం. రెండవదైన యీ దక్షిణ దేశపు రాజు పాత్రను యిప్పుడు బ్రిటన్ వహించింది. ఇది, మొదట్లో దక్షిణ దేశపు రాజుగా నిల్చిన ఐగుప్తును అతి వేగంగా ఆక్రమించింది. యుద్ధం కొనసాగుతుండగా, బ్రిటన్ దాని మునుపటి వలస ప్రాంతమైన అమెరికాతో చేతులు కలిపింది. ఇప్పుడిక దక్షిణ దేశపు రాజు, చరిత్రలోనే అతి శక్తివంతమైన ఆంగ్లోఅమెరికన్ ప్రపంచ ఆధిపత్యంగా తయారయ్యింది.
7, 8. (ఎ) మొదటి ప్రపంచ యుద్ధంలో, సంగతులు ఏ విధంగా “మొదటనున్నట్టుగా” వుండలేదు? (బి) మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలేమిటి, అయితే ప్రవచనానుసారంగా ఉత్తర దేశపు రాజు ఎలా ప్రతిస్పందించాడు?
7 ఇద్దరి రాజుల నడుమ మునుపు జరిగిన పోరాటాల్లో ఉత్తర దేశపు రాజైన రోమా సామ్రాజ్యం ఎడతెగక విజయాన్ని సాధించింది. ఈసారి, ‘మొదట నున్నట్టుగా కడపటనుండదు.’ ఎందుకు? ఎందుకంటే ఉత్తర దేశపు రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అందుకు ఒక కారణం, “కిత్తీయుల ఓడలు” ఉత్తర దేశపు రాజుకు వ్యతిరేకంగా రావడమే. (దానియేలు 11:30) ఈ ఓడలేమిటి? దానియేలు కాలంలో కిత్తీయులంటే సైప్రసు, మరి మొదటి ప్రపంచ యుద్ధకాలంలో సైప్రసు బ్రిటన్‌తో ఏకమయ్యింది. అంతేకాకుండా ది జొండర్వన్ పిక్టోరియల్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బైబిల్ ప్రకారం కిత్తీయులనే పేరు, “సామాన్యంగా పశ్చిమ ప్రాంతమంతటిని, ప్రాముఖ్యంగా పశ్చిమప్రాంతపు నౌకాబలాన్ని సూచిస్తుంది.” న్యూ ఇంటర్నేషనల్ వర్ష్న్, “కిత్తీయుల ఓడలు” అన్న భావాన్ని “పశ్చిమ సముద్రతీరానున్న ఓడలు” అని అంటోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో, పశ్చిమ కోస్తా ఐరోపా ప్రాంతానున్న బ్రిటన్ ఓడలే కిత్తీయుల ఓడలుగా నిరూపించబడ్డాయి. పిదప ఉత్తర అమెరికా పశ్చిమ ఖండంలోని ఓడలు బ్రిటీషు నౌకాదళాన్ని బలపర్చాయి.
8 ఈ యుద్ధంలో, ఉత్తర దేశపు రాజు “తృణీకరించబడి,” 1918లో ఓటమిని అంగీకరించాడు. అయితే అతడు అంతమొందలేదు. “అంతట కిత్తీయుల ఓడలు అతనిమీదికి వచ్చుటవలన అతడు వ్యాకులపడి మరలి, పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహముగలవాడై, తన యిష్టానుసారముగా జరిగించును, అతడు మరల పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును.” (దానియేలు 11:30) దూత అలా ప్రవచించాడు, మరి అలాగే సంభవించింది కూడ.
రాజు అత్యాగ్రహంతో ప్రవర్తించుట
9. అడాల్ఫ్ హిట్లర్ అధికారానికి రావడానికి ఏమి తోడ్పడింది, మరి అతను “అత్యాగ్రహంగా” ఎలా ప్రవర్తించాడు?
9 విజయం సాధించిన మిత్రపక్ష కూటమి, 1918లో యుద్ధం ముగిసిన తర్వాత, జర్మన్ ప్రజలను అనిశ్చయ కాలంవరకు పస్తుల్లో వుంచడానికే తయారుచేయబడిన దండనా శాంతి ఒప్పందాన్ని జర్మనీపై విధించింది. తత్ఫలితంగా, తీవ్ర ఇబ్బంది అనుభవించిన కొన్ని సంవత్సరాల తడబాటు తర్వాత, జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారానికి వచ్చాడు. అతను 1933లో సర్వాధికారాన్ని పొంది, వెంటనే యేసుక్రీస్తు అభిషక్త సహోదరులు ప్రాతినిధ్యం వహించే “పరిశుద్ధ నిబంధన”పై క్రూరమైన దాడి చేయబూనుకున్నాడు. యథార్థ క్రైస్తవులకు వ్యతిరేకియై, వారిలోని అనేకులను క్రూరంగా హింసించడంలో అతను అత్యాగ్రహంగా ప్రవర్తించాడు.
10. మద్దతు కొరకై హిట్లర్ ఎవరితో కలవటానికి ప్రయత్నించాడు, మరి దాని ఫలితమేమిటి?
10 హిట్లర్ ఆర్థిక రాజరిక రంగాల్లోకూడ విజయం సాధించి, సఫలుడయ్యాడు. కొద్ది సంవత్సరాల్లోనే, అతడు జర్మనీని గుర్తించదగిన ఒక ఆధిపత్యంగా తయారుచేశాడు, యీ ప్రయాసలో “పరిశుద్ధ నిబంధనను నిషేధించిన” వారి సహాయం అతనికి వుంది. వీరెవరు? నిస్సందేహంగా, వీరు తమకు దేవునితో నిబంధనా సంబంధాలున్నాయని చెప్పుకొని, ఎంతో కాలంగా యేసుక్రీస్తు శిష్యులుగా వుండనేరని క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులే. తన సహాయార్థమై “పరిశుద్ధ నిబంధనను నిషేధించిన” వారిని కూడగట్టడంలో హిట్లర్ విజయం సాధించాడు. రోమ్‌లోని పోపు అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. రోమన్ కాథోలిక్కు చర్చీ, అలాగే జర్మనీలోని ప్రొటస్టెంటు చర్చీలు, 12 సంవత్సరాల హిట్లర్ భయోత్పాత పరిపాలనకు తమ మద్దతునిచ్చారు.
11. ఉత్తర దేశపు రాజు ఎలా ‘పరిశుద్ధ స్థలమును అపవిత్రపర’చాడు, “అనుదిన బలిని” ఎలా నిలిపివేశాడు?
11 దూత సరిగ్గా ప్రవచించినట్లుగా, హిట్లర్ యుద్ధానికి వెళ్ళేంతగా కృతార్థుడయ్యాడు. “అతని పక్షమున శూరులు లేచి, పరిశుద్ధస్థలపు కోటను అపవిత్రపరచి, అనుదిన బలిని నిలిపివేసిరి.” (దానియేలు 11:31) ప్రాచీన ఇశ్రాయేలులో పరిశుద్ధస్థలం యెరూషలేము దేవాలయమందు ఒక భాగం. అయితే, యూదులు యేసును తృణీకరించినప్పుడు యెహోవా వారి ఆలయాన్నీ వారినీ తృణీకరించాడు. (మత్తయి 23:37–24:2) మొదటి శతాబ్దం నుండి యెహోవా ఆలయం ఆత్మీయమైనదయ్యింది. దాని అతి పరిశుద్ధ స్థలం పరలోకంలోనూ ఆత్మీయ ప్రాంగణం భూమిపైన వుండి, ప్రధాన యాజకుడైన యేసు అభిషక్త సహోదరులు సేవ చేస్తారు. గొప్ప సమూహం 1930వ దశకం నుండి అభిషక్త శేషంతో సహవసించి ఆరాధిస్తూ వచ్చారు; కాబట్టి వారు ‘దేవుని ఆలయంలో’ సేవ చేస్తున్నారని చెప్పబడింది. (ప్రకటన 7:9, 15; 11:1, 2; హెబ్రీయులు 9:11, 12, 24) ఉత్తర దేశపు రాజు అధికారంలో వున్న దేశాల్లోని అభిషక్త శేషము వారి సహవాసులు ఎడతెగక హింసించబడటంతో ఆలయ భూప్రాంగణం అపవిత్రపర్చబడింది. ఆ హింస ఎంత తీవ్రంగా వుండెనంటే, అనుదిన బలి అనగా, యెహోవా నామానికి బహిరంగంగా చేసే స్తుతియాగం తీసివేయబడింది. (హెబ్రీయులు 13:15) అయితే, హృదయవిదారక బాధననుభవించినప్పటికి నమ్మకమైన అభిషక్త క్రైస్తవులూ వారితోకూడ “వేరే గొర్రెలు” రహస్యంగా ప్రకటిస్తూనే వున్నారని చరిత్ర చూపుతోంది.—యోహాను 10:16.
“హేయమైన వస్తువు”
12, 13. “హేయమైన వస్తువు” ఏది, మరి నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుడు ముందే చూసినట్లు అది ఎప్పుడు ఎలా పునఃస్థాపించబడింది?
12 రెండవ ప్రపంచ యుద్ధం ఇక అంతమౌతుందనగా మరో సంఘటన సంభవించింది. వారు “నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు” (దానియేలు 11:31) యేసు కూడ ప్రస్తావించిన యీ “హేయమైన వస్తువు,” ప్రకటన గ్రంథం ప్రకారం అగాధంలోకి వెళ్లిన రక్తవర్ణంగల క్రూరమృగం, నానాజాతి సమితిగా ఎప్పుడో గుర్తించబడింది. (మత్తయి 24:15; ప్రకటన 17:8; లైట్ రెండవ పుస్తకంలో, 94వ పేజి చూడండి.) రెండవ ప్రపంచ యుద్ధం చెలరేగినప్పుడు అది అగాధంలోకి వెళ్ళింది. అయినప్పటికి, 1942లో జరిగిన యెహోవాసాక్షుల న్యూ వరల్డ్ థియోక్రాటిక్ సమావేశంలో, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి మూడవ అధ్యక్షుడైన నాథాన్ హెచ్. నార్, ప్రకటన 17వ అధ్యాయమందలి ప్రవచనాన్ని చర్చించి, అగాధంనుండి ఆ క్రూరమృగం మరలా లేచివస్తుందని హెచ్చరించాడు.
13 ఆయన మాటల సత్యసంధతను చరిత్ర స్థిరపర్చింది. ఆగస్టు, అక్టోబరు 1944 మధ్య కాలంమందు, అమెరికాలోని డమ్బార్టెన్ ఒక్స్లో ఐక్యరాజ్య సమితి అని పిలువబడబోయే సంస్థ యొక్క శాసనాధికార ప్రణాళిక రూపొందించబడటం ప్రారంభమైంది. మునుపటి సంయుక్త రష్యాతో సహా 51 దేశాలు యీ శాసనాధికార ప్రణాళికను ఆమోదించాయి, అయితే అక్టోబరు 24, 1945లో అది అధికారంలోకి వచ్చినప్పుడు, నిర్జీవ నానాజాతి సమితి మరలా పని ప్రారంభించడానికి అగాధం నుండి బయటకు వచ్చింది.
14. ఉత్తర దేశపు రాజు గుర్తింపు ఎప్పుడు, ఎలా మారింది?
14 రెండు ప్రపంచ యుద్ధాల్లో కూడ జర్మనీ దక్షిణ దేశపు రాజుకు ప్రధాన శత్రువుగా నిలిచింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలోని కొంత భాగం దక్షిణ దేశపు రాజుకు మిత్ర రాజ్యంగా తయారగుటకు పునఃమిళితమైంది. అయితే జర్మనీలోని మరో భాగం, మరో బలమైన సామ్రాజ్యానికి మిత్రపక్షమైంది. జర్మనీలోని ఒక భాగంతో విలీనమైన కమ్యూనిస్టు కూటమి, ఆంగ్లోఅమెరికా కూటమికి బలమైన వ్యతిరేకిగా నిల్చుంది. ఈ రాజులిద్దరి నడుమనున్న వైరం ప్రచ్ఛన్న యుద్ధంగా తయారయ్యింది.—“యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్” 264-84 పేజీలు చూడండి.
రాజు, నిబంధన
15. ‘నిబంధన నతిక్రమించువారెవరు’ మరి వారు ఉత్తర దేశపు రాజుతో ఎటువంటి సంబంధాన్ని కల్గివుండిరి?
15 ఇప్పుడు దూత యిలా అంటున్నాడు: “అందుకతను ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును.” (దానియేలు 11:32) ఈ నిబంధనను అతిక్రమించేదెవరు? ఈసారి కూడ క్రైస్తవులమని చెప్పుకుని, క్రైస్తవత్వానికి కళంకం తెచ్చే క్రియలు చేసే క్రైస్తవమత సామ్రాజ్య నాయకులే. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో “సోవియట్ ప్రభుత్వం, తమ మాతృదేశ భద్రతకు చర్చీల వస్తు సంబంధిత, నైతిక సహాయ సహకారాన్ని సంపాదించడానికి ప్రయత్నించింది.” (వాల్టర్ కోలార్స్ వ్రాసిన రెలీజియన్ యిన్ ది సోవియట్ యూనియన్) యుద్ధానంతరం, చర్చీ నాయకులు ప్రస్తుతం ఉత్తర దేశపు రాజైన యీ నాస్తికవాద విధానంగల ఆధిపత్యంతో తమ స్నేహాన్ని నిలుపుకునే ప్రయత్నం చేశారు.b అలా, క్రైస్తవమత సామ్రాజ్యం మునుపెన్నటికంటే యిప్పుడు లోకంలో భాగమైంది—ఇది యెహోవా దృష్టికి హేయమైన మతభ్రష్టతే.—యోహాను 17:14; యాకోబు 4:4.
16, 17. “బుద్ధిమంతులు” ఎవరు, మరి వారు ఉత్తర దేశపు రాజు క్రింద ఎలా జీవించారు?
16 మరి, యథార్థ క్రైస్తవుల మాటేమిటి? “అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గమువలనను అగ్నివలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు.” (దానియేలు 11:32, 33) ఉత్తర దేశపు రాజు అధికారం క్రింద జీవించే క్రైస్తవులు, సరైన రీతిలో “పై అధికారులకు లోబడియు”న్నప్పటికీ, వారు లోక సంబంధులు కారు. (రోమీయులు 13:1; యోహాను 18:36) కైసరువి కైసరుకు చెల్లించడంలో వారు జాగ్రత్తగా వుంటూ, “దేవునివి దేవునికి” యిచ్చారు. (మత్తయి 22:21) ఈ కారణంగా వారి యథార్థత పరీక్షించబడింది.—2 తిమోతి 3:12.
17 దాని ఫలితం? వారు ‘బలముకలిగి’ వుంటారు అదే సమయంలో ‘క్రుంగి’ పోతారు. వారు క్రుంగి పోతారు, అంటే వారు హింసించబడి తీవ్రమైన బాధననుభవిస్తారు, కొందరైతే చంపబడ్డారు కూడ అని అర్థం. అయితే, వారిలో అధికశాతం బలముకలిగి, నమ్మకంగా నిలిచారు. అవును, వారు యేసు జయించినట్లుగానే యీ లోకాన్ని జయించారు. (యోహాను 16:33) అంతేకాకుండా, వారిని జైళ్లలో పడవేసినా లేక కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో వేసినా, వారు ప్రకటించడం ఎన్నడూ మానుకోలేదు. అలా చేయడం ద్వారా వారు ‘అనేకులకు బోధించారు.’ ఉత్తర దేశపు రాజు పరిపాలించు అనేక దేశాల్లో హింస ఉన్నప్పటికీ, యెహోవాసాక్షులు పెరుగుతూనే వచ్చారు. ఎడతెగక పెరిగే “గొప్ప సమూహము” ఆ స్థలాల్లో కన్పించడానికి సహాయపడిన “బుద్ధిమంతుల” నమ్మకానికి కృతజ్ఞతలు.—ప్రకటన 7:9-14.
18. ఉత్తర దేశపు రాజు అధికారంలో జీవించిన అభిషక్తులు ఏ “స్వల్ప సహాయము” పొందారు?
18 దేవుని ప్రజలనుభవించే హింసలను గూర్చి మాట్లాడుతూ దూత యిలా ప్రవచించాడు: “వారు క్రుంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును.” (దానియేలు 11:34) ఇది ఎలా జరిగింది? రెండవ ప్రపంచ యుద్ధంలో దక్షిణ దేశపు రాజు పొందిన విజయం, అతని ప్రత్యర్థి రాజు అధికారం క్రింద జీవిస్తున్న క్రైస్తవులకు గొప్ప విడుదలను తెచ్చింది. (ప్రకటన 12:15, 16 పోల్చండి.) ఆ తదుపరి ఉత్తర దేశపు రాజు హింసించిన వారికి అప్పుడప్పుడు ఉపశమనం లభించింది, మరి ప్రచ్ఛన్న యుద్ధం క్రమేపి అంతరించిపోవడంతో నమ్మకమైన క్రైస్తవులు హానికరమైనవారు కారని గ్రహించిన అనేక మంది రాజకీయ నాయకులు వారికి చట్టపరమైన గుర్తింపునిచ్చారు.c మత్తయి 25:34-40 నందు వివరించబడినట్లు, అభిషేకించబడినవారు చేసిన నమ్మకమైన ప్రకటనాపనికి ప్రతిస్పందించి పెరుగుతున్న గొప్ప సమూహం బట్టి కూడ గొప్ప సహాయం లభించింది.
దేవుని ప్రజలను శుభ్రపరచుట
19. (ఎ) ఎలా కొందరు “ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తు”కొన్నారు? (బి) “అంత్యకాలము” అనే పదానికున్న భావమేమిటి? (అథస్సూచి చూడండి.)
19 ఈ కాలంలో, దేవుని సేవయందు ఆసక్తిని కనపర్చిన వారందరికీ మంచి ఉద్దేశాలు లేవు. దూత యిలా హెచ్చరించాడు: “అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని నిర్ణయకాలము ఇంక రాలేదు గనుక అంత్యకాలమువరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు.”d (దానియేలు 11:34, 35) కొందరు సత్యం యెడల ఆసక్తిని చూపారు కానీ సేవకొరకు యథార్థంగా సమర్పించుకోడానికి యిష్టపడలేదు. సువార్తను అంగీకరించినట్లు కన్పించిన మరికొందరు, వాస్తవానికి అధికారుల గూఢాచారులే. ఒక దేశం నుండి వచ్చిన నివేదిక యిలా చెబుతోంది: “నీతి నియమాల్లేని కొందరు కమ్యూనిస్టులు దేవుని సంస్థలోకి జొరబడ్డారు. వీరు అధిక ఆసక్తిని కనపర్చారు, అంతేకాకుండా గొప్ప బాధ్యతగల స్థానాల్లో నియమింపబడ్డారు.”
20. వేషధారణతో జొరబడిన కొందరివల్ల నమ్మకమైన క్రైస్తవులు “క్రుంగి”పోవడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు?
20 ఇలా జొరబడినవారు నమ్మకస్థులైన కొందరిని అధికారులకు అప్పగించారు. ఇలాంటివి జరగడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు? పరిశీలించడానికిని పవిత్రపర్చడానికిని అనుమతించాడు. యేసు “తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొ”న్నట్లు, యీ నమ్మకమైన వారు తమ విశ్వాసానికి కల్గిన పరీక్షను బట్టి సహనాన్ని నేర్చుకున్నారు. (హెబ్రీయులు 5:8; యాకోబు 1:2, 3; మరియు మలాకీ 3:3 పోల్చండి.) అలా వారు ‘పరిశీలించబడి పవిత్రపర్చబడి తెలుపుచేయబడ్డారు.’ వారి సహనానికి తగిన ఫలం లభించే నిర్ణయకాలం సమీపించినప్పుడు గొప్ప సంతోషం అటువంటి నమ్మకస్థుల కొరకు వేచివుంటుంది. దానియేలు ప్రవచనాన్ని మనమింకా చర్చించినప్పుడు దీనిని మనం చూడవచ్చు.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి వారి యీ ప్రచురణ, 1958లో జరిగిన “డివైన్ విల్” యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశమందు ఇంగ్లీషులో విడుదలైంది.
b ది నవంబరు 1992 వరల్డ్ ప్రెస్ రివ్యూ, ది టొరొంటొ స్టార్ నుండి ఒక శీర్షికను ప్రచురించింది. అది యిలా అంటోంది: “ఒకప్పుడు తమ దేశ చరిత్రను గూర్చి కలలుగన్న అనేక విషయాలు వాస్తవాలముందు కుప్పకూలిపోవడాన్ని రష్యా దేశస్థులు గత కొన్ని సంవత్సరాలనుండి చూస్తూవచ్చారు. అయితే, కమ్యూనిస్టు పాలనతో చర్చీకున్న సహవాసం బహిర్గతం కావడం, ఎంతో విస్మయాన్ని కలిగిస్తుంది.
c ది వాచ్‌టవర్ జూలై 15, 1991, 8-11 పేజీలు చూడండి.
d “అంత్యకాలమువరకు” అంటే, “అంత్యకాల సమయంలో” అని చెప్పవచ్చు. “వరకు” అని యిక్కడ అనువదించబడిన పదం దానియేలు 7:25లోని అరమిక్ వచనంలో కనబడుతుంది, మరి అక్కడ దానికి “ఆ సమయంలో” లేక “అప్పటికి” అని భావం. ఆ పదానికి 2 రాజులు 9:22, యోబు 20:5, న్యాయాధిపతులు 3:26 వచనాల హెబ్రీ పాఠ్యభాగానికి కూడ యిలాంటి అర్థమే ఉంది. అయితే, అనేక అనువాదాల్లో దానియేలు 11:35వ వచనమందున్న పదం, “వరకు” అనే తర్జుమా చేయబడింది, మరి యిదే సరైన భావమైతే యిక్కడ పేర్కొనబడిన “అంత్యకాలము” అంటే దేవుని ప్రజల సహనానికి అంతమని భావం.—“యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్,” 286 పేజీ పోల్చండి.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ దానియేలు ప్రవచనాల భావాన్ని మనం ఈనాడు మరింత స్పష్టంగా అర్థంచేసుకోగలమని ఎందుకు ఆశించవచ్చు?
◻ ఉత్తర దేశపు రాజు “వ్యాకులపడి, అత్యాగ్రహంతో” ఎలా ప్రవర్తించాడు?
◻ “హేయమైన వస్తువు” మరలా కన్పించడాన్ని దాసుని తరగతి ఎలా ముందే గ్రహించింది?
◻ అభిషక్త శేషం ఎలా ‘క్రుంగి, బలముకలిగి, స్వల్ప సహాయాన్ని పొందింది?’
[15వ పేజీలోని చిత్రం]
దక్షిణ దేశపు రాజు చేతిలో 1918 నందు ఓడిపోయిన ఉత్తర దేశపు రాజు హిట్లర్ ఆధ్వర్యమున పూర్తిగా కోలుకున్నాడు
[16వ పేజీలోని చిత్రం]
క్రైస్తవమత సామ్రాజ్య మత నాయకులు ఉత్తర దేశపు రాజుతో సంబంధమేర్పర్చుకోడానికి ప్రయత్నించారు
[క్రెడిట్ లైను]
Zoran/Sipa Press