మహా అధిపతియైన మిఖాయేలు అంతిమ విజయము
“ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును.”—దానియేలు 12:1.
1. యెహోవా సర్వాధిపత్యం యెడల అనేకమంది ప్రపంచ రాజులు ఎటువంటి వైఖరిని కనపర్చారు, మరి యీ విషయంలో ఉత్తర దేశపు రాజు ఎందుకు వేరుగా లేడు?
“నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు?” (నిర్గమకాండము 5:2) ఇవి ఫరో మోషేతో పలికిన పరిహాసపు మాటలు. యెహోవా దైవత్వపు సర్వాధిపత్యాన్ని గుణగ్రహించడానికి నిరాకరించిన ఫరో ఇశ్రాయేలీయులను దాస్యంలోనే వుంచాలని నిర్ణయించుకున్నాడు. ఇతర పాలకులుకూడ అలాంటి అలక్ష్య భావాన్నే యెహోవా యెడల చూపారు, దానియేలు దినాల్లోని రాజులు కూడ అలానే చేశారు. (యెషయా 36:13-20) వాస్తవానికి ఉత్తర దేశపు రాజు మరింత ముందుకెళ్లాడు. దూత యిలా చెబుతున్నాడు: “ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతిదేవత మీదను దేవాది దేవునిమీదను గర్వముగా మాటలాడుచు . . . అతడు అందరికంటె ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు; మరియు స్త్రీలకాంక్షితా దేవతనుగాని, యే దేవతను గాని లక్ష్యపెట్టడు.”—దానియేలు 11:36, 37.
2, 3. ఉత్తర దేశపు రాజు తన యితర “దేవతను” ఆరాధించుటలో “తన పితరుల దేవున్ని” ఎలా తృణీకరించాడు?
2 ఈ ప్రవచనార్థక మాటలను నెరవేరుస్తూ ఉత్తర దేశపు రాజు, రోమా అన్యమత దేవుళ్లనే కానీ లేక క్రైస్తవమత సామ్రాజ్యపు త్రిత్వ దైవాన్నే కానీ “పితరుల దేవత”లందరిని (లేక “తన ప్రాచీన దేవతలను” ది న్యూ ఇంగ్లీష్ బైబిల్) తృణీకరించాడు. హిట్లర్ క్రైస్తవమత సామ్రాజ్యాన్ని తన స్వంత ఉద్దేశాలకు వాడుకున్నాడు, అయితే దాని స్థానంలో జర్మనీ చర్చీని నిలుపదామని ఆయన పథకం వేశాడు. అతని తర్వాతి రాజు పూర్తిగా నాస్థికత్వాన్ని ప్రోత్సహించాడు. అలా ‘అందరికంటే ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొని’ ఉత్తర దేశపు రాజు తన్ను తాను దేవునిగా చేసుకున్నాడు.
3 ప్రవచనం యింకా యిలా కొనసాగుతోంది: “అతడు తన పితరులెరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును; బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి, ఆ దేవతను ఘనపరచును.” (దానియేలు 11:38) వాస్తవానికి, ఉత్తర దేశపు రాజు “ప్రాకారముల దేవత”యైన ఆధునిక వైజ్ఞానిక సైనిక బలమందు తన విశ్వాసాన్ని ఉంచాడు. అంత్యకాలమంతా, తన “దేవత” ద్వారా రక్షణను పొందటానికి దాని బలిపీఠంపై విస్తారమైన సంపదను కుమ్మరించాడు.
4. ఉత్తర దేశపు రాజు ఏ విజయాన్ని పొందాడు?
4 “మరియు ఈ క్రొత్త దేవతను ఆధారముచేసికొని, కోటలకు ప్రాకారములు కట్టించి, నూతన విధముగా తనవారికి మహాఘనత కలుగజేయును; దేశమును క్రయమునకు విభజించి యిచ్చి అనేకులమీద తనవారికి ప్రభుత్వమిచ్చును.” (దానియేలు 11:39) సైనిక బలమనే “క్రొత్త దేవత”పై నమ్మకముంచి యీ ఉత్తర దేశపు రాజు, “అంత్యదినములలో” భయంకరమైన సైనిక ఆధిపత్యంగా నిరూపించుకొని, ‘సమర్థవంతంగా’ అధికారం చేశాడు. (2 తిమోతి 3:1) అతని సిద్ధాంతానికి మద్దతు పలికిన వారు రాజకీయంగా, ఆర్థికంగా కొన్నిసార్లు సైనిక సహకారంతో బహుకరించబడేవారు.
“అంత్యకాలమందు”
5, 6. దక్షిణ దేశపు రాజు ఎలా ‘యుద్ధం చేశాడు’ మరి ఉత్తర దేశపు రాజు ఎలా ప్రతిస్పందించాడు?
5 దానియేలు 11:40 మొదటి భాగంలో యిలా వుంది: “అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధముచేయును.” ఈ వచనం, దాని తర్వాతి వచనాలు మన భవిష్యత్ కాలంలో నెరవేరతాయని భావించబడ్డాయి. అయితే, దానియేలు 12:4, 9లలో వున్న భావమే యిక్కడున్న “అంత్యకాలము”నకు వుంటే, అంత్యదినాలంతటిలో మనం దీని నెరవేర్పుకై ఎదురు చూడాలి. ఈ కాలంలో దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజుతో ‘యుద్ధం” చేశాడా? అవును, నిజంగానే చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం, ప్రతీకారం చేయడానికి దండనా విధమైన శాంతి ఒప్పందం, నిజంగా ఒక ‘యుద్ధం’ వంటిదే. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత, దక్షిణ దేశపు రాజు తన శత్రువుపై భీతినొందించే అణు ఆయుధాలను గురిపెట్టాడు అంతేకాక అతనికి వ్యతిరేకంగా నేటో అనే శక్తివంతమైన సైనిక కూటమిని ఏర్పాటు చేశాడు. సంవత్సరాలు గడుస్తుండగా, అతడు చేసిన “యుద్ధంలో” అత్యాధునిక సాంకేతిక గూఢాచారి వ్యవస్థ, అలాగే రాయబార, సైనిక దాడులును యిమిడి వున్నాయి.
6 మరి ఉత్తర దేశపు రాజు ఎలా ప్రతిస్పందించాడు? “ఉత్తరదేశపు రాజు రథములను గుఱ్ఱపురౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుఫానువలె అతనిమీద పడి దేశముల మీదుగా ప్రవాహమువలె వెళ్లును.” (దానియేలు 11:40) అంత్యదినాల చరిత్ర, ఉత్తర దేశపు రాజు విస్తరణావాదాన్ని నొక్కి తెల్పింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ “రాజు” తన సరిహద్దులను చుట్టుప్రక్కలనున్న దేశాలకు విస్తరింపజేశాడు. ఆ యుద్ధం ముగిసినప్పుడు తర్వాతి “రాజు” తన స్వంత సరిహద్దుల వెలుపల ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రచ్ఛన్న యుద్ధ జరుగుతున్న కాలమందు, ఉత్తర దేశపు రాజు పోరాడిన పరోక్ష యుద్ధాల్లో, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా తిరుగుబాటులందు పాల్గొని తన విరోధితో పోరాడాడు. అతడు నిజక్రైస్తవుల సేవను పరిమితం చేస్తూ (అయితే ఏ విధంగాను దానిని ఆపుజేయక) వారిని హింసించాడు. అతని సైనిక రాజకీయ చర్యలు ఎన్నో దేశాలను తన అధికారం క్రిందకు తెచ్చాయి. ఇది సరిగ్గా దూత ప్రవచించినట్లే సంభవించింది: “అతడు ఆనందదేశమున [దేవుని ప్రజల ఆత్మీయ స్థితి] ప్రవేశించుటవలన అనేకులు కూలుదురు.”—దానియేలు 11:41.
7. ఉత్తర దేశపు రాజు విస్తరణావాదానికి ఏ అవధులు వున్నాయి?
7 అయినా, అతని విరోధి దృష్టినుండి చూస్తే, ఉత్తర దేశపు రాజు ఉనికి అపాయకరమని కన్పించినప్పటికి, అతను ప్రపంచ ఆధిపత్యాన్ని సంపాదించలేదు. “ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులలో ముఖ్యులును అతని చేతిలోనుండి తప్పించు కొనెదరు.” (దానియేలు 11:41) ప్రాచీన కాల, ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, దాదాపు ఐగుప్తు సిరియా దేశాల మధ్య వుండేవి. అవి ఈనాడు, ఉత్తర దేశపు రాజు గురిపెట్టినను, తన అధికారం క్రిందకు తెచ్చుకోలేని దేశాలను సంస్థలను సూచిస్తున్నాయని చెప్పవచ్చు.
‘ఐగుప్తు తప్పించుకొనదు’
8, 9. తన ముఖ్య విరోధి విషయంలో సహితం ఉత్తర దేశపు రాజు ప్రభావం ఎలా ఉంది?
8 దూత యింకా యిలా చెబుతున్నాడు: “అతడు ఇతర దేశములమీదికి తన సేన నంపించును ఐగుప్తు సహా తప్పించుకొననేరదు. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తుయొక్క విలువగల వస్తువులన్నిటిని వశపరచుకొని, లుబీయులను కూషీయులను తనకు పాదసేవకులుగా చేయును.” (దానియేలు 11:42, 43) “ఐగుప్తు” లేక దక్షిణ దేశపు రాజు సహితం ఉత్తర దేశపు రాజు విస్తరణా పథకాల ప్రభావాలను తప్పించుకోలేక పోయాడు. ఉదాహరణకు అతడు వియత్నామ్‌లో గొప్ప ఓటమిని ఎదుర్కొన్నాడు. “లుబీయులును కూషీయుల” మాటేమిటి? భౌగోళికంగా “ఐగుప్తు”నకు పొరుగు దేశాలుగావున్న ఇవి, ఆధునిక “ఐగుప్తు” పొరుగు దేశాలను సూచిస్తున్నవి మరి అవి కొన్నిసార్లు ఉత్తర దేశపు రాజు ‘పాద సేవకులుగా’ వున్నాయి.
9 ‘ఐగుప్తుయొక్క దాచబడిన విలువగల వస్తువులన్ని’టిని ఉత్తర దేశపు రాజు తన వశం చేసుకున్నాడా? అతను దక్షిణ దేశపు రాజును జయించలేదు, బహుశ అతను జయింపజాలడని 1993 వరకున్న ప్రపంచ పరిస్థితులు చూపుతున్నవి. అయితే, దక్షిణ దేశపు రాజు ఆర్థిక వనరులను ఉపయోగించే విధానంపై మాత్రం అతడు తన బలమైన ప్రభావాన్ని కల్గివున్నాడు. తన విరోధివలన తనకుగల భయంచేత దక్షిణ దేశపు రాజు, బ్రహ్మాండమైన సేనా, నౌకా, వాయు దళాల నిర్వహణకై ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బును కుమ్మరించాడు. ఈ విషయంలో ఉత్తర దేశపు రాజు, దక్షిణ దేశపు రాజు సంపన్న స్థితిని ‘వశపరచుకొని,’ ఆధీనమందుంచుకొన్నాడని చెప్పవచ్చు.
ఉత్తర దేశపు రాజు తుది దాడి
10. ఇరువురి నడుమనున్న వైరం అంతం కావడాన్ని దూత ఎలా వర్ణిస్తున్నాడు?
10 ఈ యిరువురు రాజుల నడుమ చెలరేగే వైరం ఎడతెగక కొనసాగుతూనే వుంటుందా? లేదు. దానియేలుతో దూత యిలా అన్నాడు: “అంతట తూర్పునుండియు ఉత్తరమునుండియు వర్తమానములు వచ్చియతని [ఉత్తర దేశపు రాజును] కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడుచేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములుగల పర్వతమునకును మధ్యవేయును; అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయముచేయు వాడెవడును లేకపోవును.”—దానియేలు 11:44, 45.
11, 12. ఉత్తర దేశపు రాజు, దక్షిణ దేశపు రాజుల మధ్య వున్న వైరానికి యిటీవలి రాజకీయ సంఘటనలు ఎలాంటి సంబంధాన్ని కల్గివున్నాయి, మరి దానినుండి మనమింకా ఏమి నేర్చుకోగలము?
11 ఈ సంఘటనలన్నీ భవిష్యత్తులో జరగవలసినవే, కాబట్టి ప్రవచనం ఎలా నెరవేరుతుందో మనం వివరించలేము. ఇటీవల, యీ యిరువురి రాజుల రాజకీయ స్థితి మారింది. అమెరికా, తూర్పు ఐరోపా దేశాల నడుమనున్న బద్ధ శత్రుత్వం అణగారిపోయింది. అంతేకాకుండా, 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయింది, మరి యిప్పుడది లేనే లేదు.—ది వాచ్‌టవర్ మార్చి 1, 1992, సంచికలో 4, 5 పేజీలను చూడండి.
12 కాబట్టి యిప్పుడు ఉత్తర దేశపు రాజెవరు? మునుపటి సోవియట్ సంయుక్త రాష్ట్రాల్లో భాగమైన కొన్ని దేశాలతో అతను గుర్తింపబడగలడా? లేక అంతకు ముందు ఎన్నోసార్లు జరిగినట్లు, అతని గుర్తింపు పూర్తిగా మారిపోతుందా? మనం చెప్పలేము. దానియేలు 11:44, 45 నెరవేరినప్పుడు ఉత్తర దేశపు రాజు ఎవరై వుంటారు? ఈ యిరువురి రాజుల మధ్యనున్న వైరము మరలా చెలరేగగలదా? అనేక దేశాల్లో యిప్పటికీ వున్న అణు ఆయుధాల అధిక సేకరణ మాటేమిటి? కేవలం కాలమే యీ ప్రశ్నలకు జవాబివ్వగలదు.
13, 14. ఆ యిద్దరు రాజుల భవిష్యత్తును గూర్చి మనకేమి తెలుసు?
13 ఒక్క విషయం మాత్రం మనకు తెలుసు. త్వరలోనే “తూర్పునుండి ఉత్తరమునుండి వర్తమానములు వచ్చి యతని కలతపర”చడంతో ఉత్తర దేశపు రాజు గట్టి దాడి చేస్తాడు. అతని “నాశనము”నకు ముందు యీ దాడి సంభవిస్తుంది. ఇతర బైబిలు ప్రవచనాలను మనం పరిశీలిస్తే యీ “వర్తమానములు” గూర్చి అధికంగా తెలుసుకోవచ్చు.
14 మొదట, ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశపు రాజుకు వ్యతిరేకంగా యీ కార్యాలను చేస్తాడని చెప్పబడలేదు. అతను తన మహా గొప్ప శత్రువు చేతిలో అంతమొందడు. అలాగే, దక్షిణ దేశపు రాజు ఉత్తర దేశపు రాజు చేతిలో నాశనం కాడు. దక్షిణ దేశపు రాజు (ఇతర ప్రవచనాలో క్రూర మృగానికి వచ్చిన చివరి కొమ్ముగా వర్ణించబడ్డాడు) “దైవాధీనము వలన,” దేవుని రాజ్యం వల్ల నాశనమౌతాడు. (దానియేలు 7:26; 8:25) వాస్తవానికి, భూరాజులందరూ అర్మగిద్దోను యుద్ధంలో నాశనమౌతారు, మరి ఉత్తర దేశపు రాజుకు కూడ యిదే సంభవిస్తుంది. (దానియేలు 2:44; 12:1; ప్రకటన 16:14, 16) దానియేలు 11:44, 45 వచనాలు తుది పోరాటానికి నడిపించే సంఘటనలను వర్ణిస్తున్నాయి. ఉత్తర దేశపు రాజు తన అంతానికి చేరుకున్నప్పుడు “సహాయముచేయు వాడెవడును లేకపోయెను” అనడంలో ఆశ్చర్యమేమీ లేదు!
15. ఏ ప్రాముఖ్య ప్రశ్నలు ఇంకనూ చర్చించాల్సివుంది?
15 మరి, ఉత్తర దేశపు రాజు “అనేకులను . . . నశింపజేయుటకు” సిద్ధపడునట్లు చేసిన “వర్తమానముల”ను ఏ యితర ప్రవచనాలు విశదపరస్తున్నాయి. అతను నాశనము చేయాలనుకున్న “అనేకులు” ఎవరు?
తూర్పునుండి వచ్చిన వర్తమానము
16. (ఎ) అర్మగిద్దోనుకు ముందు ఏ విశేష సంఘటన జరగాలి? (బి) “తూర్పునుండి వచ్చు రాజులు” ఎవరు?
16 అంతిమ యుద్ధమైన అర్మగిద్దోనుకు ముందు, నిజమైన ఆరాధనకు శత్రువైన వేశ్యవంటి ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను నాశనంకావాలి. (ప్రకటన 18:3-8) దేవుని ప్రతీకారంతో కూడిన ఆరవ ఉగ్రతాపాత్రను యూఫ్రటీసు నదిపై పోయడంతో దాని నాశనం సూచించబడింది. “తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు” నది ఎండి పోతుంది. (ప్రకటన 16:12) ఈ రాజులెవరు? వారు యెహోవా దేవుడు, యేసుక్రీస్తే కాని, వేరెవ్వరూ కారు!a
17. (ఎ) మహా బబులోను నాశనం గూర్చి బైబిలు మనకు ఏమి చెబుతోంది? (బి) “తూర్పునుండి” వచ్చిన వర్తమానము ఏమైవుండును?
17 మహా బబులోను నాశనాన్ని ప్రకటన పుస్తకం కళ్లకు కట్టినట్టుగా వివరించింది: “నీవు ఆ పది కొమ్ములుగల [అంత్యకాలమందు పరిపాలించు ‘రాజులు’] ఆ మృగమును చూచితివే [రక్తవర్ణంగల యీ కౄరమృగము ఐక్యరాజ్య సమితిని సూచిస్తుంది], వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.” (ప్రకటన 17:16) నిజమే, దేశాలు ‘ప్రజలను విస్తారముగా నాశనం చేస్తాయి.’ (దానియేలు 7:5) మరి రాజులు, ఉత్తర దేశపు రాజుతో సహా మహా బబులోనును ఎందుకు నాశనం చేస్తారు? ఎందుకంటే ‘తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధిపుట్టించును.’ (ప్రకటన 17:17) ఈ మహాగొప్ప మత సంబంధమైన వేశ్యను నిర్మూలించడానికి యెహోవా తాను సంకల్పించినట్లు మానవ నాయకుల హృదయంలో తన ఆలోచనను పెట్టుటనే యీ “తూర్పునుండి” వచ్చిన వర్తమానము అని సూచించవచ్చును.—దానియేలు 11:44.
ఉత్తరం నుండి వచ్చిన వర్తమానము
18. ఉత్తర దేశపు రాజుకు మరే యితర గురి వుండెను, మరి తన అంతానికి అతను చేరినప్పుడు అతని స్థానమేదని అది చూపుతుంది?
18 ఉత్తర దేశపు రాజు ఉగ్రతకు మరో గురివుంది. అతడు “తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములుగల పర్వతమునకును మధ్యవేయును” అని దూత చెబుతున్నాడు. (దానియేలు 11:45) దానియేలు కాలంలో, మధ్యధరా సముద్రమే గొప్ప సముద్రము, మరి పరిశుద్ధ పర్వతము, ఒకప్పుడు దేవుని ఆలయం వున్న ప్రదేశమగు సీనాయి పర్వతమే. కాబట్టి ప్రవచన నెరవేర్పులో, ఉగ్రుడైన ఉత్తర దేశపు రాజు దేవుని ప్రజలపై సైనిక దాడి చేస్తాడు! ఈనాడు ఆత్మీయ భావంలో, “సముద్రములకును పరిశుద్ధానందములుగల పర్వతమునకును మధ్య” అనగా దేవుని నుండి వేరైన మానవులనే “సముద్రము” నుండి బైటికి వచ్చి, పరలోక సీయోను పర్వతంపై యేసుక్రీస్తుతో పరిపాలించే నిరీక్షణగల దేవుని అభిషక్త సేవకుల ఆత్మీయ నగరి నందు తాను వున్నట్టు అతను కనుగొంటాడు.—యెషయా 57:20; హెబ్రీయులు 12:22; ప్రకటన 14:1.
19. యెహెజ్కేలు ప్రవచనం సూచించిన ప్రకారం, గోగు ముట్టడిని ప్రేరేపించే వర్తమానాన్ని మనం ఎలా గుర్తించగలం? (అథస్సూచి చూడండి.)
19 దానియేలు సమకాలీనుడైన యెహెజ్కేలు కూడ “అంత్యదినములయందు” దేవుని ప్రజలు ముట్టడించబడతారని ప్రవచించాడు. అపవాదియగు సాతానుకు ప్రాతినిధ్యం వహించే గోగు మాగోగు ద్వారా యీ విద్వేషం ప్రారంభమౌతుందని ఆయన చెప్పాడు. (యెహెజ్కేలు 38:16) సూచనార్థకంగా ఎటువైపునుండి గోగు వస్తాడు? యెహెజ్కేలు ద్వారా యెహోవా యిలా చెబుతున్నాడు: “ఉత్తరదిక్కున దూరముననున్న నీ స్థలములోనుండి నీవు . . . వచ్చెదవు” (యెహెజ్కేలు 38:15) కాబట్టి, “ఉత్తరదిక్కు నుండి” వచ్చిన వర్తమానము, యెహోవా ప్రజలపై ముట్టడించమని ఉత్తర దేశపు రాజును మరి యితర రాజులందరినీ పురికొల్పే సాతాను ప్రచారమే కావచ్చు.b—ప్రకటన 16:13, 14; 17:14 పోల్చండి.
20, 21. (ఎ) గోగు దేవుని ప్రజలను ముట్టడించడానికి, ఉత్తర రాజుతో సహా, రాజ్యాలను ఎందుకు పురికొల్పుతాడు? (బి) అతని ముట్టడి విజయవంతమౌతుందా?
20 లోకసంబంధులు కాని వేరే గొర్రెలలోని గొప్ప సమూహంతో కూడిన “దేవుని ఇశ్రాయేలు” అభ్యుదయాన్ని బట్టి గోగు, తన శక్తినంతా ఉపయోగించి వారిపై దాడిచేస్తాడు. (గలతీయులు 6:16; యోహాను 10:16; 17:15, 16; 1 యోహాను 5:19) “[ఆత్మీయముగా] వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై . . . ఆ యా జనములలోనుండి సమకూర్చబడి”న వారిని గోగు కోపంగా చూస్తాడు. (యెహెజ్కేలు 38:12; ప్రకటన 5:9; 7:9) ఈ మాటల నెరవేర్పుగా, మునుపెన్నడూ లేనట్లుగా యెహోవా ప్రజలు ఈనాడు ఎంతగానో వర్ధిల్లుతున్నారు. ఐరోపా, ఆఫ్రికా, ఆసియా వంటి మునుపు నిషేధించబడిన అనేక ప్రాంతాల్లో వారిప్పుడు స్వేచ్ఛగా ఆరాధించగల్గుతున్నారు. జనాంగముల నుండి 1987-1992 మధ్య పది లక్షలకంటే అధికంగా “యిష్టవస్తువులు” యెహోవా సత్యారాధనా మందిరానికి వచ్చారు. వారు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులై సమాధానంగా ఉన్నారు.—హగ్గయి 2:7; యెషయా 2:2-4; 2 కొరింథీయులు 8:9.
21 క్రైస్తవుల ఆత్మీయ స్థితిని “ప్రాకారములులేని గ్రామములుగల దేశముగా” సులభంగా జయించవచ్చునని భావించి, మానవ జాతినంతటిని తన ఆధీనంలో వుంచుకోడానికి గల యీ అడ్డంకును తొలగించడానికి గోగు విశ్వప్రయత్నం చేస్తాడు. (యెహెజ్కేలు 38:11) అయితే అతను విఫలుడౌతాడు. భూరాజులు యెహోవా ప్రజలను ముట్టడించినపుడు వారు ‘నాశనమౌతారు.’ ఎలా?
మూడవ రాజు
22, 23. గోగు ముట్టడించినప్పుడు, దేవుని ప్రజల పక్షమున ఎవరు నిలుస్తారు, దాని ఫలితమేమిటి?
22 తన ప్రజలను కాపాడటానికి యెహోవా లేచి, గోగు దళాలను “ఇశ్రాయేలీయుల పర్వతము”పై నాశనము చేయడానికి గోగు చేసే ముట్టడి సూచనయని యెహెజ్కేలు అంటున్నాడు. (యెహెజ్కేలు 38:18; 39:4) ఇది దూత దానియేలుతో పలికినదాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది: “ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.”—దానియేలు 12:1.
23 పరలోక శూరుడైన యేసు 1914లో దేవుని పరలోక రాజ్యానికి రాజయ్యాడు. (ప్రకటన 11:15; 12:7-9) అప్పటినుండి, ఆయన ‘దానియేలు జనుల పక్షమున’ నిలుచున్నాడు. అయితే, త్వరలోనే అపజయమెరుగని శూరుడైన రాజువలె ఆయన యెహోవా నామ పక్షంగా ‘నిలుచు’ని “దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయును.” (2 థెస్సలొనీకయులు 1:8) దానియేలు ప్రవచనంలోని రాజులతో సహా భూ జనాంగములన్నీ, తమ “రొమ్ము కొట్టుకొందురు.” (మత్తయి 24:30) ‘దానియేలు జనము’ యెడల యింకా తమ హృదయాల్లో దుష్ట ఆలోచనలు కలవారై, ‘మహా రాజైన మిఖాయేలు’ చేతిలో వారు నిత్య నాశనాన్ని పొందుతారు.—ప్రకటన 19:11-21.
24. దానియేలు ప్రవచనమును గూర్చిన పఠనం మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపాలి?
24 మిఖాయేలు, ఆయన దేవుడైన యెహోవా యొక్క గొప్ప విజయోత్సాహాలను మనం చూడాలని ఆశపడమా? నిజమైన క్రైస్తవులకు ఆ విజయమంటే “తప్పించుకొ”నడం, బ్రతికివుండడమే. (మలాకీ 4:1-3 పోల్చండి.) కాబట్టి, భవిష్యత్తుకొరకు ఎంతో ఆశతో ఎదురుచూస్తూ, పౌలు మాటలను మనం జ్ఞాపకముంచుకుందాం: “వాక్యమును ప్రకటించుము సమయమునందును అసమయమందును ప్రయాసపడుము.” (2 తిమోతి 4:2) మనం జీవ వాక్యాన్ని గట్టిగా హత్తుకొని వుంటూ, అనుకూల సమయం వున్నప్పుడే యెహోవా గొర్రెలను పట్టుదలతో వెదకుదాం. జీవన పరుగుపందెంలోని విజయపథంవద్ద మనం ఉన్నాం. బహుమానం మనముందున్నది. మనందరం అంతంవరకు సహించి, తద్వారా రక్షించబడినవారిలో ఒకరిగా వుండటానికి నిర్ణయించుకుందాము.—మత్తయి 24:13; హెబ్రీయులు 12:1.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి వారు ప్రచురించిన రెవలేషన్—ఇట్స్ గ్రాండ్ క్లైమాక్స్ ఎట్ హ్యాండ్! పుస్తకంలో 229-30 పేజీలు చూడండి.
b దీనికి ప్రత్యామ్నాయంగా, “ఉత్తరదిక్కు నుండి” వచ్చిన వర్తమానము, “నేను . . . నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్ను . . . బయలుదేరదీసెదను.” “ఉతర్తదిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీ”సెదనని యెహోవా గోగుతో పలికిన మాటలనుండి అది ఆయన ద్వారా వచ్చేదని కూడ నిరూపించబడవచ్చు.—యెహెజ్కేలు 38:4; 39:2; కీర్తన 48:2 పోల్చండి.
మీరు అర్థం చేసుకున్నారా?
◻ అంత్యకాలమంతా దక్షిణ దేశపు రాజు ఉత్తర దేశపు రాజుతో ఎలా యుద్ధం చేశాడు?
◻ ఇద్దరు రాజుల మధ్యనున్న శత్రుత్వ ఫలితాన్ని గూర్చి మనమింకా ఏమి నేర్చుకోవాలి?
◻ అర్మగిద్దోనుకు ముందు జరిగే ఏ రెండు సంఘటనల్లో ఉత్తర దేశపు రాజు తప్పక పాలుపంచుకుంటాడు?
◻ ‘మహా అధిపతియైన మిఖాయేలు’ దేవుని ప్రజలను ఎలా కాపాడుతాడు?
◻ దానియేలు ప్రవచనమునుగూర్చిన పఠనానికి మనం ఎలా ప్రతిస్పందించాలి?
[19వ పేజీలోని చిత్రాలు]
ఉత్తర దేశపు రాజు తన పితరుల దేవతలను కాక మరో దేవతను ఆరాధించాడు
[క్రెడిట్ లైను]
Top left and middle: UPI/Bettmann; bottom left: Reuters/Bettmann; bottom right: Jasmin/Gamma Liaison