దానియేలు చెప్పిన ప్రవచనార్థక దినాలు, మన విశ్వాసము
“వెయ్యిన్ని మూడువందల ముప్పదియైదు దినములు తాళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు.”—దానియేలు 12:12.
1. అనేకులు నిజమైన సంతోషాన్ని కనుగొనటానికి ఎందుకు విఫలులౌతున్నారు మరి నిజమైన సంతోషం దేనితో ముడిపెట్టబడింది?
ప్రతి ఒక్కరూ సంతోషంగా వుండాలని కోరుకుంటారు. అయితే, ఈనాడు బహు కొద్దిమంది సంతోషంగా వున్నారు. ఎందుకు? ఒక కారణమేమంటే వారిలో అనేకులు సంతోషాన్ని వెదకరానిచోట వెదకుతున్నారు. విద్య, సంపద, ఉద్యోగం, లేక అధికారాన్ని పొందటం వంటి వాటిలో సంతోషాన్ని వెదకుతున్నారు. అయితే, యేసు తన కొండమీది ప్రసంగాన్ని ప్రారంభిస్తూ సంతోషాన్ని ఆత్మీయావసరతలపై శ్రద్ధ, కనికరం, హృదయ శుద్ధత, మరి అటువంటి యితర లక్షణాలను కలిగివుండుటతో ముడిపెట్టాడు. (మత్తయి 5:3-10) యేసు పేర్కొన్న సంతోషమే నిజమైంది, నిరంతరం నిలిచేది.
2. ప్రవచనం ప్రకారం, అంత్యదినాల్లో సంతోషానికి ఏది నడుపుతుంది, మరి వీటికి సంబంధించి ఏ ప్రశ్నలు తలెత్తుతాయి?
2 అంత్యదినాల్లో, అభిషక్త శేషానికున్న సంతోషం మరి యితర దానితోకూడా ముడిపడివుంది. దానియేలు పుస్తకంలో మనం యిలా చదువుతాం: “ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊరకుండుము . . . వెయ్యిన్ని మూడువందల ముప్పదియైదు దినములు తాళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు!” (దానియేలు 12:9, 12) ఈ 1,335 దినాలు ఏ కాలానికి చెందినవి? ఆ కాలంలో జీవించిన వారెందుకు ధన్యులయ్యారు? నేడు మన విశ్వాసంతో దీనికి ఎలాంటి సంబంధమైనా వుందా? పారశీక రాజైన కోరేషు ఏలుబడినందు మూడో సంవత్సరాన, ఇశ్రాయేలీయులు బబులోను చెరనుండి విడిపింపబడిన తర్వాత దానియేలు యీ మాటలను వ్రాసిన కాలానికి మనం వెనుదిరిగితే యీ ప్రశ్నలకు జవాబివ్వడానికి మనకు సహాయం లభిస్తుంది.—దానియేలు 10:1.
పునరుద్ధరణ సంతోషాన్ని తెస్తుంది
3. కోరేషు రాజు, తీసుకున్న ఏ చర్య నమ్మకమైన యూదులకు సా.శ.పూ. 537 లో సంతోషాన్ని తెచ్చింది, అయితే ఏ అధిక్యతను కోరేషు యూదులకు యివ్వలేదు?
3 యూదులకు బబులోను నుండి విడుదల నిజమైన ఆనందోత్సాహకరమైన సమయం. యూదులు దాదాపు 70 సంవత్సరాల ఖైదుననుభవించిన తర్వాత, యెరూషలేముకు తిరిగి వచ్చి, యెహోవా ఆలయాన్ని పునఃనిర్మించమని కోరేషు రాజు వారిని ఆహ్వానించాడు. (ఎజ్రా 1:1, 2) ఆ పిలుపుకు ప్రతిస్పందించినవారు ఎన్నో ఆశలతో బయల్దేరి, సా.శ.పూ. 537లో తమ స్వదేశం చేరుకున్నారు. అయితే కోరేషు, దావీదు రాజు సంతతి క్రింద రాజ్యం స్థాపించటానికి వారిని ఆహ్వానించలేదు.
4, 5. (ఎ) దావీదు రాజరికం ఎప్పుడు పడద్రోయబడింది? ఎందుకు? (బి) దావీదు రాజరికం పునఃస్థాపించబడుతుందనే ఏ అభయాన్ని యెహోవా యిచ్చాడు?
4 దానికో అంతరార్థం వుంది. దాదాపు అయిదు శతాబ్దాల క్రితం యెహోవా దావీదుతో యిలా వాగ్దానం చేశాడు: “నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును.” (2 సమూయేలు 7:16) విచారకరమైన విషయమేమంటే, దావీదు రాజ వంశీయుల్లో ఎక్కుమంది తిరుగుబాటుదార్లేనని రుజువు చేసుకున్నారు. మరి ఆ జనాంగపు రక్తాపరాధం ఎంతో అధికమైనందున, దావీదు వంశ రాజరికపు పాలన సా.శ.పూ. 607లో పడద్రోయబడటానికి యెహోవా అనుమతించాడు. మకాబీలు క్రిందున్న కొద్దికాలం తప్పించి, యెరూషలేము సా.శ. 70లో, అది రెండొవ సారి నాశనమయ్యేంత వరకు విదేశీ అధికారం క్రిందే వుంది. అలా, సా.శ.పూ. 537లో దావీదు సంతతివారెవ్వరూ రాజ్యపాలన చేయని “అన్యజనముల కాలములు,” ప్రారంభమయ్యాయి.—లూకా 21:24.
5 అయినప్పటికీ, దావీదుకు తాను చేసిన వాగ్దానాన్ని మాత్రం యెహోవా మర్చిపోలేదు. బబులోను ప్రపంచాధిపత్యంగా ఉన్న కాలం మొదలుకొని మరలా దావీదు వంశంలోని రాజు యెహోవా ప్రజలను పరిపాలించు కాలం వరకు, శతాబ్దాలపాటు భవిష్యత్తులో జరుగు ప్రపంచ సంఘటనల వివరాలను ఆయన తన ప్రవక్తైన దానియేలు ద్వారా దర్శనాలు, కలల పరంపరలతో బయల్పర్చాడు. దానియేలు 2, 7, 8, 10-12 అధ్యాయాల్లో వ్రాయబడిన యీ ప్రవచనాలు, నమ్మకమైన యూదులకు దావీదు సింహాసనం చివరికి “నిత్యము స్థిరపరచబడును” అనే అభయాన్ని యిచ్చాయి. నిశ్చయంగా, అలా బయల్పర్చబడిన సత్యం, సా.శ.పూ 537లో తమ స్వదేశానికి తిరిగి వచ్చిన యూదులకు ఎంతో సంతోషాన్నిచ్చింది!
6. దానియేలు ప్రవచనాల్లో కొన్ని మన కాలంలోనే నెరవేరుతాయని మనకెలా తెలుసు?
6 దానియేలు ప్రవచనాలు యేసుక్రీస్తు పుట్టకమునుపే దాదాపు పూర్తిగా నెరవేరాయని అనేక మంది బైబిలు వ్యాఖ్యాతలు చెబుతుంటారు. అయితే, వాస్తవానికి విషయమది కాదు. దానియేలు 12:4లో ఒక దూత దానియేలుతో యిలా చెప్పాడు: “నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును.” దానియేలు గ్రంథం అంత్యకాలంలోనే విప్పబడాలి—దాని భావం పూర్తిగా బయల్పర్చబడాలంటే తప్పకుండ కనీసం అందులోని కొన్ని ప్రవచనాలైనా నిశ్చయంగా ఆ కాలానికి అన్వయించేవై వుండాలి.—దానియేలు 2:28; 8:17; 10:14 చూడండి.
7. (ఎ) అన్యజనుల కాలం ఎప్పుడు సమాప్తమైంది, మరి ఏ అత్యవసర ప్రశ్నకు సమాధానం చెప్పవలసివుంది? (బి) “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు” ఎవరు కాదు?
7 అన్యజనుల కాలం 1914లో ముగియడంతో, యీ లోకానికి అంత్యకాలం ప్రారంభమైంది. దావీదు రాజ్యం భూసంబంధమైన యెరూషలేములో కాదుగానీ అదృశ్యంగా ‘పరలోకమందు’ పునరుద్ధరించబడింది. (దానియేలు 7:13, 14) అదే సమయంలో, అబద్ధ క్రైస్తవత్వపు “గురుగులు” వృద్ధిచెందటం వల్ల, నిజ క్రైస్తవత్వపు స్థితి మానవుల కన్నులకు కూడా అంత స్పష్టంగా కనబడలేదు. అయితే, ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నకు సమాధానం రావల్సివుంది: “నమ్మకమును బుద్ధిమంతుడగు దాసుడెవడు?” (మత్తయి 13:24-30; 24:45) పునరుద్ధరించబడిన దావీదు రాజ్యానికి భూ ప్రతినిధిగా ఎవరుంటారు? వారు దానియేలు స్వంత సహోదరులైన యూదులు కారు. వారు మెస్సీయను విశ్వసించక సందేహించినందుకు నిరాకరించబడ్డారు. (రోమీయులు 9:31-33) ఏ విధంగా కూడ నమ్మకమైన దాసుడు క్రైస్తవమత సామ్రాజ్య సంస్థల్లో కనిపించ లేదు! యేసు వారిని ఎరుగడని వారి దుష్క్రియలు నిరూపించాయి. (మత్తయి 7:21-23) మరి ఆ దాసుడెవరు?
8. అంత్యదినాల్లో ఎవరు “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు”గా నిరూపించబడ్డారు? అది మనకెలా తెలుసు?
8 నిస్సందేహంగా అదెవరంటే, 1914లో బైబిలు విద్యార్థులు అని పిలువబడి, 1931 నుండి యెహోవాసాక్షులుగా గుర్తించబడుతున్న యేసు అభిషక్త సహోదరుల చిన్న గుంపే. (యెషయా 43:10) దావీదు వంశంలో పునరుద్ధరించబడిన రాజ్యాన్ని గూర్చి వారు మాత్రమే ప్రకటించారు. (మత్తయి 24:14) వారు మాత్రమే లోకం నుండి వేరుగా వుండి యెహోవా నామాన్ని ఘనపర్చారు. (యోహాను 17:6, 14) మరి అంత్యదినాల్లోని దేవుని ప్రజలకు సంబంధించిన బైబిలు ప్రవచనాలు కేవలం వారిపైనే నెరవేరాయి. ఈ ప్రవచనాల్లో, దానియేలు 12వ అధ్యాయమందున్న ప్రవచన కాలాల పరంపరలో సంతోషాన్ని తెచ్చే 1,335 దినాలు కూడ యిమిడివున్నాయి.
1,260 దినాలు
9, 10. ఏ సంఘటనలు దానియేలు 7:25లోని “కాలము కాలములు అర్థకాలము”ను సూచిస్తున్నాయి మరి ఏ యితర లేఖనాల్లో దీనికి సారూప్యమైన కాలం చెప్పబడింది?
9 దానియేలు 12:7లో, మొదటి ప్రవచన కాలాన్ని గూర్చి మనం ఇలా చదువుతాం: “ఒకకాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధజనముయొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగును.”a ఇదే కాల పరిమితిని గూర్చే ప్రకటన 11:3-6 నందు పేర్కొనబడిన దేవుని సాక్షులు నారబట్టలు కట్టుకొని మూడున్నర సంవత్సరాల వరకు ప్రకటిస్తారని పిమ్మట చంపబడతారని చెబుతోంది. మరలా, దానియేలు 7:25లో మనం యిలా చదువుతాం: “ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయపద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు.”
10 ఈ రెండవ ప్రవచనంలో “అతడు” అంటే, బబులోను నుండి అయిదవ ప్రపంచ ఆధిపత్యమే. ఈ “చిన్న కొమ్ము” ఆధిపత్యంలో వున్న కాలంలోనే మనుష్య కుమారుడు “మహిమయు ఆధిపత్యమును” పొందుతాడు. (దానియేలు 7:8, 14) మొదట మహా సామ్రాజ్యంగా ఉన్న బ్రిటనే యీ సూచనార్థక కొమ్ము, ఇది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆంగ్లోఅమెరికన్ ద్వంద ప్రపంచ ఆధిపత్యంగా మారి, ఈనాడు అది ఎక్కువగా అమెరికా ఆధిపత్యంలో వుంది. మూడున్నర కాలాలు లేదా సంవత్సరాలవరకు యీ ఆధిపత్యం, పరిశుద్ధులను హింసించి, కాలాన్ని న్యాయాన్ని మార్చటానికి ప్రయత్నిస్తుంది. తుదకు, పరిశుద్ధులు దాని హస్తగతమౌతారు.—ప్రకటన 13:5, 7 కూడ చూడండి.
11, 12. ప్రవచనార్థక 1,260 దినాల ఆరంభానికి ఏ సంఘటనలు నడిపించాయి?
11 ఈ సమాంతర ప్రవచనాలన్నీ ఎలా నెరవేరాయి? మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభానికి ముందున్న సంవత్సరాల్లో, యేసు అభిషక్త సహోదరులు 1914 నందు అన్యజనుల నిర్ణయ కాలము సంపూర్ణమౌతుందని బహిరంగంగా హెచ్చరించారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు, హెచ్చరిక అలక్ష్యంచేయబడిందని స్పష్టమైంది. దేవుని రాజ్యం పాలించే సమయాన్ని ఆపివేయ ప్రయత్నించుటకు “కాలాలను న్యాయాన్ని” మార్చడానికి, సాతాను, బ్రిటీషు సామ్రాజ్యం ఆధిపత్యంలో వున్న రాజకీయ సంస్థయైన “క్రూర మృగాన్ని” ఉపయోగించాడు. (ప్రకటన 13:1, 2) అతడు విఫలుడయ్యాడు. దేవుని రాజ్యం మానవునికి అందనంత దూరంలో పరలోకమందు స్థాపించబడింది.—ప్రకటన 12:1-3.
12 బైబిలు విద్యార్థులకు యుద్ధం, ఒక పరీక్షా సమయం. జనవరి 1914 నుండి మొదలుకొని దానియేలు ప్రవచనాలపై దృష్టిని నిల్పిన ఫోటో-డ్రామా ఆఫ్ క్రియేషన్ అనే బైబిలు అంశాన్ని చూపుతూ వచ్చారు. ఆ సంవత్సరం వేసవి కాలంలో ఉత్తరార్థగోళంలో యుద్ధం ప్రారంభమైంది. అక్టోబరు నెలలో నిర్ణయ కాలం అంతమయ్యాయి. “నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా?” అని మత్తయి 20:22 కింగ్ జేమ్స్ వర్షన్లో యేసు తన శిష్యులను అడిగిన ప్రశ్నను వారు 1915 సాంవత్సరిక వచనంగా ఎంచుకోవడాన్నిబట్టి చూస్తే, సంవత్సరాంతంలో అభిషక్త శేషం హింసింపబడటానికి ఎదురు చూస్తున్నారని అర్థమౌతోంది.
13. బైబిలు విద్యార్థులు నారబట్టలు ధరించి 1,260 దినాలు ఏలా ప్రకటించారు, మరి ఆ కాలాంతంలో ఏమి సంభవించింది?
13 కాబట్టి, డిశంబరు 1914 నుండి ‘నారబట్టలతో ప్రకటించిన’ యీ చిన్న సాక్షిసమూహం, వినయంగా సహిస్తూ యెహోవా తీర్పులను ప్రకటించారు. వాచ్‌టవర్ అండ్ ట్రాక్ట్ సొసైటి మొదటి అధ్యక్షుడైన సి. టి. రస్సల్ 1916లో మరణించడం అనేకులకు దిగ్భ్రాంతిని కల్గించింది. యుద్ధోన్మాదం పెరిగిపోవడంతో, ఆ సాక్షులు ఉదృతమైన హింసను ఎదుర్కోవలసి వచ్చింది. కొందరు జైల్లో వేయబడ్డారు. ఇంగ్లాండ్‌లోని ఫ్రాంక్ ప్లాట్, కెనడాలోని రాబర్ట్ క్లెగ్ వంటి వ్యక్తులను ఉన్మాదులైన అధికారులు క్రూరంగా హింసించారు. తుదకు, జూన్ 21, 1918లో వాచ్‌టవర్ బైబిలు అండ్ ట్రాక్ట్ సొసైటి డైరెక్టర్లతో సహా, క్రొత్త అధ్యక్షుడైన జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్‌కు అబద్ధ నేరారోపణలపై దీర్ఘకాల జైలు శిక్ష వేయబడింది. అలా, సంస్థీకరించబడిన బహిరంగ ప్రకటనా పనిని ఆ “చిన్న కొమ్ము,” ప్రవచనార్థక కాలాంతానికల్లా అంతం చేసింది.—దానియేలు 7:8 కింగ్ జేమ్స వర్షన్.
14. అభిషక్త శేషానికి సంబంధించిన విషయాలు 1919 నందు, ఆ తర్వాత ఎలా మారాయి?
14 ఆ తర్వాత ఏమి జరిగిందో ప్రకటన గ్రంథం ప్రవచిస్తోంది. క్రియాశూన్యతగల కొద్దికాలం, అంటే ప్రవచింపబడిన విధంగా మూడున్నర దినాలు వీధిలో చనిపోయిన స్థితియందున్న తర్వాత, మరలా అభిషక్త శేషం సజీవమై, చురుకుగా తయారౌతుంది. (ప్రకటన 11:11-13) మార్చి 26, 1919 నాడు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి అధ్యక్షుడూ డైరెక్టర్లు జైలు నుండి విడుదలపొందారు, మరి ఆ తర్వాత వారిపై మోపబడిన అబద్ధ ఆరోపణల నుండి వారు పూర్తిగా స్వతంత్రులయ్యారు. అభిషక్త శేషం విడుదలపొందిన వెంటనే, భవిష్యత్ కార్యకలాపాలకై పునఃసంస్థీకరణను ప్రారంభించారు. కాబట్టి, ప్రకటనలోని మొదటి శ్రమ నెరవేర్పుకు అనుగుణ్యంగా, వారు కార్యశూన్యతనే అగాధంలో నుండి దట్టమైన పొగతో బైటికి వచ్చిన ఆత్మీయ మిడతల్లా, అబద్ధమతానికి రాబోయే అంధకార భవిష్యత్తును గూర్చి హెచ్చరించారు. (ప్రకటన 9:1-11) తర్వాతి కొద్ది సంవత్సరాల కాలంలో, వారు ఆత్మీయంగా పోషింపబడి, ముందున్న వాటికొరకై తయారయ్యారు. ప్రాథమిక బైబిలు సత్యాలను క్రొత్తవారూ పిల్లలు నేర్చుకోటానికి అనువుగా వారు 1921లో ది హార్ప ఆఫ్ గాడ్ అనే క్రొత పుస్తకాన్ని ప్రచురించారు. (ప్రకటన 12:6, 14) ఈ పేరాలో చర్చించబడినవన్నీ మరో ప్రాముఖ్యమైన కాలంలో జరిగాయి.
1,290 దినాలు
15. మనం 1,290 ఆరంభాన్ని ఏ విధంగా లెక్కపెట్టవచ్చును? ఈ కాలం ఎప్పుడు అంతమైంది?
15 దానియేలుతో ఆ దూత యిలా అన్నాడు: “అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైనదానిని నిలువ బెట్టు వరకు వెయ్యిన్ని రెండువందల తొంబది దినములగును.” (దానియేలు 12:11) మోషే ధర్మశాస్త్రం క్రింద, “అనుదిన బలి” యెరూషలేము ఆలయంలోని బలిపీఠంపై అర్పించబడేది. క్రైస్తవులు దహన బలిని అర్పించరు, అయితే వారు ఆత్మీయ అనుదిన బలిని అర్పిస్తారు. “కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము” అని పౌలు అన్నప్పుడు దీన్ని సూచించాడు. (హెబ్రీయులు 13:15; మరియు హోషేయ 14:2 పోల్చండి.) ఈ అనుదిన బలి జూన్ 1918లో నిలిపివేయబడింది. అయితే, మరి ఎదురుచూడాల్సిన రెండవ విషయమగు, “హేయమైనది” ఏమిటి? అది మొదటి ప్రపంచ యుద్ధాంతంలో విజయం సాధించిన ఆధిపత్యాలు నిలబెట్టిన నానాజాతి సమితి.b క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు దాన్ని దేవుని రాజ్యానికి మారుగా వుంచి, శాంతి కొరకైన మానవుని ఏకైక నిరీక్షణగా ఆ సమితిని నిలబట్టినందున అది హేయమైంది. నానాజాతి సమితి 1919 జనవరిలో ప్రతిపాదించబడింది. అప్పటినుండి మనం 1,290 దినాలను (మూడు సంవత్సరాల ఏడు నెలలు) లెక్కపెడితే, 1922 సెప్టెంబరుకు చేరుకుంటాం.
16. అభిషక్త శేషం 1,290 దినాల అంతానికి, కార్యంచేపట్టడానికి సిద్ధంగా వుందని ఏలా స్పష్టమైంది?
16 అప్పుడు ఏమి జరిగింది? బైబిలు విద్యార్థులప్పుడు మహా బబులోను నుండి విడుదల పొంది సేదదీర్చుకొని, కార్యం చేపట్టి ముందుకు నడవడానికి సిద్ధంగా వున్నారు. (ప్రకటన 18:4) సెప్టెంబరు 1922లో సీడర్ పాయింట్, ఒహాయో, అమెరికా నందు జరిగిన సమావేశంలో క్రైస్తవమత సామ్రాజ్యంపై దేవుని తీర్పును వారు ధైర్యంగా ప్రకటించ నారంభించారు. (ప్రకటన 8:7-12) మిడతల కొండ్లు నిజంగా బాధించ నారంభించాయి! ఇంకా ఏమైందంటే, ప్రకటనలో పేర్కొనబడిన రెండవ శ్రమ మొదలైంది. మొదట అభిషక్త శేషం ఆ తర్వాత గొప్ప సమూహంతో పెరిగిన క్రైస్తవ రౌతుల గుంపు భూమ్యంతటా ప్రబలి విస్తరించింది. (ప్రకటన 7:9; 9:13-19) అవును, 1,290 దినాల ముగింపు దేవుని ప్రజలకు సంతోషాన్ని తెచ్చిపెట్టాయి.c అయితే, మునుముందు మరెక్కువ జరగాల్సివుంది.
1,335 దినాలు
17. వెయ్యిన్ని మూడువందల ముప్పైయైదు దినాలు ఎప్పుడు ఆరంభమయ్యాయి, ఎప్పుడు అంతమయ్యాయి?
17 దానియేలు 12:12 యిలా అంటోంది: “వెయ్యిన్ని మూడువందల ముప్పదియైదు దినములు తాళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు!” ఈ 1,335 దినాలు లేక మూడు సంవత్సరాల ఎనిమిదిన్నర నెలలు మునుపటి కాలాంతంలో ప్రారంభమయ్యాయి. వీటిని మనం సెప్టెంబరు 1922 నుండి లెక్కబెడితే, 1926 వసంత కాలం అంతానికి (ఉత్తర అర్థగోళం) చేరతాం. ఆ 1,335 దినాల కాలంలో ఏమి సంభవించింది?
18. ఇంకా అభివృధి సాధించవలసి వుందని 1922 నందలి ఏ వాస్తవాలు సూచిస్తున్నాయి?
18 ఆ 1922లో ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగినా, కొందరింకా గతంలోకి ఆశతో చూశారు. సి. టి. రసెల్ వ్రాసిన స్టడీస్ ఇన్ ది స్క్రిప్చర్స్ పుస్తకం యింకా మూల పఠనాంశంగా వుంది. అంతేకాకుండా, విరివిగా పంచబడిన మిలియన్స్ నవ్ లివింగ్ విల్ నెవర్ డై అనే బుక్లెట్, భూమిని పరదైసుగా పునరుద్ధరించడం, ప్రాచీనకాల విశ్వాసులను పునరుత్థానం చేయడానికి సంబంధించిన దేవుని సంకల్పాలు 1925లో నెరవేరతాయనే దృక్పథాన్ని అందించింది. అభిషక్తుల సహనం దాదాపు పూర్తయినట్లు కన్పించింది. అయినప్పటికీ, బైబిలు విద్యార్థులతో సహవసించే కొందరు, సువార్తను యితరులతో పంచుకోవలసిన అవసరతను గుర్తించలేదు.
19, 20. (ఎ) దేవుని ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు 1,335 దినాల కాలంలో ఎలా మారాయి? (బి) ఏ సంఘటనలు 1,335 దినాల కాలాంతాన్ని సూచించాయి, అవి యెహోవా ప్రజలను గూర్చి వేటిని సూచిస్తున్నాయి?
19 ఆ 1,335 దినాలు గడిచే కొలది, ఇదంతా మారిపోయింది. సహోదరులను బలపర్చడానికి ది వాచ్ టవర్ పఠనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రాంతీయ సేవను నొక్కి చెప్పారు. మే 1923 నుండి ప్రారంభమై, ప్రతి నెలలోని మొదటి మంగళవారం ప్రతి ఒక్కరు ప్రాంతీయసేవలో పాల్గొనాలని ఆహ్వానించబడ్డారు, ఈ పనిలో వారిని ప్రోత్సహించడానికి వారం మధ్యలో సంఘ కూటానికి సమయాన్ని కేటాయించారు. ఆగస్టు 1923న లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా, అమెరికాలో జరిగిన సమావేశంలో, మేకలు గొర్రెలను గూర్చి యేసు చెప్పిన దృష్టాంతం వెయ్యేండ్ల పరిపాలనకు ముందు నెరవేరుతుందని చూపించబడింది. (మత్తయి 25:31-40) గాలి తరంగాల ద్వారా సువార్తను వ్యాపింపజేయటానికి, 1924లో డబ్ల్యు.బి.బి.ఆర్ రేడియో స్టేషన్ ప్రారంభించబడింది. ది వాచ్‌టవర్ మార్చి 1, 1925 సంచికలోని “బర్త్ ఆఫ్ ది నేషన్” అనే శీర్షిక, ప్రకటన 12వ అధ్యాయంపై సరిదిద్దబడిన భావాన్ని అందించింది. తుదకు, నమ్మకమైన క్రైస్తవులు 1914-19 వరకు జరిగిన సంక్షోభ సంఘటనల భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోగల్గారు.
20 అలా 1925వ సంవత్సరం ముగింపుకొచ్చింది, కానీ అంతం అప్పుడే రాలేదు! బైబిలు విద్యార్థులు 1870 నుండి మొదట 1914, ఆ తర్వాత 1925 అలా ఒక తేదీని మనస్సులో ఉంచుకుని సేవ చేశారు. అయితే ఇప్పుడు, యెహోవా ఎంత కాలం కోరితే అంత కాలం సేవించాలని వారు గ్రహించారు. ది వాచ్ టవర్ జనవరి 1, 1926 సంచికలో మునుపెన్నటికన్నా ఎక్కువగా దేవుని నామ ప్రాముఖ్యతను ఎత్తి చూపే “హు విల్ ఆనర్ జెహోవా” అన్న విశేష శీర్షిక వుంది. చివరిగా, మే 1926 లండన్, ఇంగ్లాండ్‌లో జరిగిన సమావేశంలో “ఏ టెస్టిమోనీ టు ది రూలర్స్ ఆఫ్ ది వరల్డ్” అనే ముఖ్యాంశంపై ఒక తీర్మానాన్ని తీసుకున్నారు. దేవుని రాజ్యాన్ని, సాతాను లోకంపై రాబోవు నాశనాన్ని గూర్చిన సత్యాలను యిది బాహాటంగా ప్రకటించింది. అదే సమావేశంలో డెలివరెన్స్ అనే ప్రభావవంతమైన పుస్తకం విడుదలైంది. ఇది స్టడీస్ యిన్ ది స్క్రిప్చర్స్ స్థానంలో, మొదలైన పుస్తకాల పరంపరలో మొదటిదైంది. దేవుని ప్రజలిప్పుడు వెనుకకుకాదు ముందుకే చూస్తున్నారు. ఆ 1,335 దినాలు ముగిశాయి.
21. ఆనాటి దేవుని ప్రజలకు 1,335 దినాల్లో సహనం చూపించడమంటే దాని అర్థం ఏమిటి, మరి యీ కాలంలోని ప్రవచన నెరవేర్పు మనకు ఏ భావాన్ని కల్గివుంది?
21 కొందరు యీ సంఘటనల గమనంతో సర్దుబాటు చేసుకోడానికి యిష్టపడలేదు, అయితే సహించిన వారు నిజమైన సంతోషాన్ని పొందారు. అంతేకాకుండా, యీ ప్రవచనార్థక కాల నెరవేర్పును మనం చూస్తే, ఆ కాలంలో జీవించిన చిన్న అభిషక్త క్రైస్తవుల గుంపు, నిజంగానే నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుడనే మన నమ్మకాన్ని దృఢపరుస్తుంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో యెహోవా సంస్థ అద్భుతంగా అభివృద్ధి చెందింది, అయితే యింకా ఆ నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు దాని కేంద్రంగా వుండి దాన్ని నడిపిస్తున్నాడు. అభిషక్తులకు వేరే గొర్రెలకు మరింత సంతోషం దాచబడివుందని తెలుసుకోవడం ఎంత అద్భుతం! దానియేలు వ్రాసిన మరో ప్రవచనాన్ని మనం పరిశీలిస్తుండగా దాన్ని మనం చూడగలం.
[అధస్సూచీలు]
a ఈ ప్రవచనార్థక కాలాలను ఎలా లెక్కపెట్టాలోననే చర్చకొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి వారు ప్రచురించిన అవర్ ఇన్కమింగ్ వరల్డ్ గవర్నమెంట్—గాడ్స్ కింగ్డమ్, పుస్తకంలోని 8వ అధ్యాయం చూడండి.
b కావలికోట ఏప్రిల్ 1, 1986 సంచికలో 13-23 పేజీలు చూడండి.
c ఏప్రిల్ 1, 1991, 21, 22 పేజీలు, 1975 ఇయర్‌బుక్ ఆఫ్ జెహోవాస్ విట్నెసెస్, 132వ పేజీని చూడండి.
మీరు వివరించగలరా?
◻ దానియేలు ప్రవచనాల్లో కొన్ని మన కాలమందు నెరవేరాలని మనకు ఎలా తెలుసు?
◻ అభిషక్త శేషమే “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు” అని మనమెలా నమ్మవచ్చు?
◻ ఆ 1,260 దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు అంతమయ్యాయి?
◻ అభిషక్త శేషానికి 1,290 దినాలు ఎలాంటి విశ్రాంతిని పునరుద్ధరణను తెచ్చిపెట్టాయి?
◻ ఆ 1,335 దినాల అంతం వరకు సహించినవారు ఎందుకు ధన్యులు?
[8వ పేజీలోని చిత్రం]
“నమ్మకమును బుద్ధిమంతుడగు దాసుడు”అభిషక్త శేషమని 1919 నుండి స్పష్టమైంది
[10వ పేజీలోని చిత్రం]
జెనీవా, స్విట్జర్లాండ్‌లో నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం
[క్రెడిట్ లైను]
UN photo
[11వ పేజీలోని బాక్సు]
దానియేలు ప్రవచనార్థక కాలాలు
1,260 దినాలు:
డిసెంబరు 1914 నుండి జూన్ 1918
1,290 దినాలు:
జనవరి 1919 నుండి సెప్టెంబరు 1922
1,335 దినాలు:
సెప్టెంబరు 1922 నుండి మే 1926