యెహోవా రోగులను, వృద్ధులను జ్ఞాపకంచేసుకొనును
“ఆపత్కాలము” నెదుర్కొనుట చాలా కష్టం. (కీర్తన 37:18, 19) అట్టి ఆపత్కాలము, వయస్సు పైబడుతున్నపుడు దానితోపాటు శరీరం క్షీణిస్తున్నపుడు రావచ్చును. కొందరు దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ అట్టి ఆపదలోపడతారు. తమరోగాలు సమస్త తలంపులను క్రియలను హరిస్తూ వారి ప్రాణానికే ముప్పుగా పరిణమించునని అనుకోవచ్చును.
అయిననూ యెహోవా తన సేవకులందరిపై శ్రద్ధవహిస్తాడని జ్ఞాపకముంచుకొనుట ఊరట కల్గిస్తుంది. వృద్ధాప్యం, రోగం, లేదా ఇతర బాధాకర పరిస్థితులలో కూడ తన భక్తిగల సేవకులు ఆయన ఎడల యథార్థతను వివేకాన్ని కనబరచినపుడు ఆయన హృదయం ఉల్లసిస్తుంది (2 దినవృత్తాంతములు 16:9ఎ; సామెతలు 27:11) దావీదు రాజు మనకిలా అభయమిస్తున్నాడు: “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి . . . యెహోవా సమీపముగా ఉన్నాడు . . . వారి మొఱ్ఱ ఆలకిం”చును. అవును, వారి ప్రయాసం ఆయనకు తెలుసు; తన ఆత్మతో ఆయన వారిని బలపర్చుతాడు. “వారిని రక్షించును.” వారినాయన జ్ఞాపకం చేసికొని సహించునట్లు వారికి సహాయపడతాడు. (కీర్తన 145:18, 19) మరి మన విషయమేమిటి? యెహోవా మాదిరే మనం కూడ వృద్ధులను వ్యాధిగ్రస్థులను జ్ఞాపకం చేసుకుంటున్నామా?
వ్యాధి, వృద్ధాప్యం వల్ల వచ్చే బలహీనతలు ప్రస్తుత విధాన జీవిత వాస్తవాలు. యెహోవా యీ భూమి అందులోని మానవుల యెడల తన సంకల్పాన్ని నెరవేర్చునంత వరకు, మనం యీ జీవిత వాస్తవాలతో పోరాడవలసిందే. ఈ కాలంలో అనేకులు దీర్ఘకాలంగా జీవిస్తున్నందువల్ల, చాలామంది అటువంటి శరీర బలహీనతలను ఎరిగియున్నారు. అంతేగాక అనేకులు పిన్నవయస్సులోనే ప్రాణాపాయకరమగు లేదా అంగవైకల్యం కల్గించే దుర్ఘటనలకు లేదా రోగాలకు గురౌతున్నారు. ఈ పాతలోకం గతించేంతవరకు, వ్యాధి వృద్ధాప్యం పెద్దసమస్యగా వుండిపోతాయి.
“శ్రమానుభవమునకును ఓపికకును” మాదిరికరంగావున్న రోగులను వృద్ధులను మనమెలా అభినందించెదము? అవును, “సహించినవారిని ధన్యులను కొనుచున్నాము” (యాకోబు 5:10, 11) ఇప్పుడు శక్తి ఉడిగిన వృద్ధులు, ప్రస్తుతం సంఘాలకు నాయకత్వం వహించే వారిని ఆ స్థితికి తీసుకొనిరావడానికి వారికి బోధించుటలోను, శిక్షణ నిచ్చుటలోను, వారిని మార్చుటలోను దశాబ్దాలుగా సేవచేశారు. తమ పిల్లలు పూర్తికాల సేవకులుగా తయారవడం చూచి సంతోషిస్తున్న వృద్ధులుకూడ అనేకమంది వున్నారు.—కీర్తన 71:17, 18; 3 యోహాను 4.
అలాగే, తీవ్రరోగానికి గురై కూడ ఆ బాధలోనే వారి విశ్వాస్యతను బట్టి మనలను ప్రోత్సహించుటకు ప్రయత్నిస్తున్న వారిని మనం అభినందిస్తున్నాము. వీరు తమ నిరీక్షణకు పటిష్టమైన రుజువును చూపినపుడు వచ్చే ఫలితం, పురికొల్పేదిగా విశ్వాసాన్ని ఎంతో బలపరచేదిగా వుంటుంది. వారికున్న మనశ్శాంతి, సంతృప్తి విశ్వాసం నిజంగా అనుకరించదగిందని బయల్పరుస్తుంది.
ఆకస్మికంగా ఒకరికి క్యాన్సరు, పక్షవాతం లేదా జీవితగమనాన్ని పూర్తిగా మార్చే మరో రోగం దాపురించుట దిగ్భ్రాంతిని కల్గిస్తుంది. తమ పిల్లలు రోగపీడుతులై లేదా దుర్ఘటనకు గురై బాధపడుట తలిదండ్రులకు కఠిన పరీక్షే. అట్టివారికి సహాయం చేయుటకు ఇతరులేమి చేయగలరు? అటువంటి ఆపదకాలం క్రైస్తవ సహోదరులందరికి పరీక్షా సమయమే. ‘నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడౌతాడని’ చూపించే అవకాశమదే. (సామెతలు 17:17) రోగులైన, వృద్ధులైన ప్రతివారు సంఘంలోనున్న ప్రతిఒక్కరినుండి వ్యక్తిగత సహాయం పొందాలని అపేక్షించరు. అయితే అనేకులు పలువిధాలుగా వారికి సహాయమందించులాగున యెహోవా తన ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇతరులను పురికొల్పుతాడు. మరి ఎవ్వరు అలక్ష్యం చేయబడకుండా పెద్దలు కనిపెట్టుకొని ఉండగలరు.—నిర్గమకాండము 18:17, 18 చూడండి.
అర్థం చేసుకొనుటకు ప్రయత్నించండి
ఇతరులకు సహాయం చేసే ప్రయత్నంలో, మంచి సంభాషణ కల్గివుండుట ముఖ్యం. దీనికి సమయం, ఓపిక, సానుభూతి కావాలి. సహాయకునిగా నీవు వారిని ‘మాటలతో బలపరచాలని’ కోరుకొనుట సహజమే; కానీ నీవు మాట్లాడకముందు లేదా చర్యగైకొనకముందు, వారు చెప్పేది వినాలి లేకపోతే నీవు ‘బాధకల్గించే ఆదరణకర్త’ వౌతావేమో.—యోబు 16:2, 5.
రోగులు, వృద్ధులు కొన్నిసార్లు వారి వ్యధను దాచుకొనుట వారికి కష్టంగా వుంటుంది. అనేకులు మహాశ్రమలను తప్పించుకొంటామనే నిరీక్షణతో జీవిస్తున్నారు, ఇప్పుడు వారి మరణమాసన్నమైందని, యీ పరుగులో తాము గెలవలేమని భావిస్తున్నారు. అదియుగాక, వారి పరిస్థితి వారిని అలసిపోవునట్లు చేసి ఆందోళనకరంగా మారుతుంది. ముఖ్యంగా, క్రైస్తవ పరిచర్యలో పూర్తిగా పాల్గొనవలెననే హృదయాభిలాషను తీర్చలేనప్పుడు, విశ్వాసమును గట్టిగా చేపట్టి అందులో పటిష్టంగా వుండాలంటే అదొక పోరాటమే. ఓ క్రైస్తవ పెద్ద ఓ వృద్ధ సహోదరిని దర్శించాడు; ఆమెతోకలిసి ప్రార్థిస్తూ ఆయన, యెహోవా మా పాపాలను క్షమించుము అని వేడుకున్నాడు. ప్రార్థన తర్వాత ఆ సహోదరి ఏడుస్తున్నట్లు ఆయన గమనించాడు, దానికి తాను ఇంటింటి సేవలో పాల్గొనలేక పోతున్నందుకు యెహోవా ప్రత్యేక క్షమాపణ అవసరమని తాను భావించినట్లు ఆమె వివరించింది. అవును, అశక్తత లేదా అసమర్థత వచ్చిందనే భావన తరచూ వాంఛనీయం కాకపోయినప్పటికీ, ఒకడు హృదయంలో చాలా బాధపడేటట్లు చేయగలదు.
ఆదుర్థ, అలసట మానసిక తుల్యతమీద ప్రభావం చూపగలదు జాగ్రత్త. వృద్ధాప్య బలహీనత వల్లగానీ దుర్భలంచేసే రోగాన్ని బట్టిగాని ఒక వ్యక్తి తనను యెహోవా విడనాడెనని తలంచుచూ బహుశా ఇలా అనవచ్చును: “నేనేమి చేశాను? నేనే ఎందుకు బాధపడాలి?” సామెతలు 12:25లోని మాటలను జ్ఞాపకముంచుకోండి: “ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును దయగల మాట దాని సంతోష పెట్టును.” ఓదార్పునిచ్చే దయగల మాటలకొరకు వెదకండి. యోబు వలెనే బాధపడే వృద్ధులు మరణించాలనే కోరుకుంటారు. ఇది దిగ్భ్రాంతి కల్గించేదేమీ కాదు; వారి పరిస్థితిని అర్థంచేసుకోండి. అటువంటి ఫిర్యాదులు వారికి అవిశ్వాసం, అపనమ్మకముందనే దానికి నిదర్శనంకాదు. యోబు ‘పాతాళమందు దాచబడాలని’ ప్రార్థించాడు, అయినా ఆ మాటల తర్వాత తాను చెప్పినదాన్ని బట్టి యెహోవా తనను తర్వాత లేపుతాడనే గట్టి విశ్వాసము ఆయనకున్నట్లు విశదమౌతుంది. గట్టి విశ్వాసం కల్గివుంటే అది ఆందోళనా, నిరాశజనకంగావున్న కాలంలో సహించి, యెహోవాకు ఇంకా సన్నిహితులగుటకు వీలుకలిస్తుంది.—యోబు 14:13-15.
రోగులకు వృద్ధులకు గౌరవం చూపుట
రోగులను, వృద్ధులను గౌరవ మర్యాదలతో చూడటం ఎంతో ప్రాముఖ్యం. (రోమీయులు 12:10) మునుపటి వలె వారు స్పందించకపోతే లేదా అంతబాగా చేయలేకపోతే నీ సహనం కోల్పోవద్దు. త్వరపడి వారివిషయమై నిర్ణయాలు చేయవద్దు. మనమెంత అర్థసహితంగా వున్ననూ, మన మొకవేళ పెత్తనం చేసేవారమైతే, అధికారం చెలాయించేవారమైతే, ఎదుటి వ్యక్తి ఆత్మాభిమానాన్ని అది నిశ్చయంగా హరించివేస్తుంది. జెట్టి ఇంగర్‌స్లెవ్ అనే పరిశోధకుడు 1988లో ప్రచురించిన సిద్ధాంత వ్యాసంలో 85 ఏండ్ల వృద్ధులగుంపు నాణ్యతగల తమ జీవితాలకు ప్రాముఖ్యమైనదేదో వారే స్వయంగా చెప్పినట్లు వివరించాడు: “మూడు రంగాలకు వారు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చారు; బంధువులతో ఉండటం; మంచి ఆరోగ్యం; చివరిదైనా ప్రాముఖ్యమైనదేమంటే వారి నిర్ణయాలు వారే చేసికోగలుగుట.” పితరుడైన యాకోబు వృద్ధాప్యములో వున్నపుడు తన కుమారులాయనను హీనంగా చూడలేదు; తన అభీష్టాలను వారు గౌరవించారు.—ఆదికాండము 47:29, 30; 48:17-20.
రోగులను కూడ మనం మర్యాదతో పరామర్శించాలి. శస్త్రచికిత్స సమయంలో చిన్న పొరపాటు జరిగినందున ఒక సంఘ పెద్ద మాట్లాడే, చదివే, వ్రాసే శక్తిని కోల్పోయాడు. ఇదో పెద్ద దెబ్బ, అయినా తోటి పెద్దలు ఆయన నిరుపయోగియని తలంచకుండా వుండేటట్లు తమ శాయశక్తుల కృషిచేయడానికి నిర్ణయించుకున్నారు. వారు సంఘ ఉత్తర ప్రత్యుత్తరాలను ఆయనకు చదివి వినిపిస్తున్నారు, సంఘం కొరకు చేయ తలపెట్టిన విషయాలలో ఆయనను యిముడ్చుతున్నారు. పెద్దల కూటంలో ఆయన ఉద్దేశాన్ని కనుగొనుటకు ప్రయత్నిస్తున్నారు. ఆయననింకా తోటి పెద్దగా పరిగణిస్తూ పెద్దల కూటములలో ఆయన ఉండుట యుక్తమేనని అభినందిస్తున్నారు. రోగులను, వృద్ధులెవ్వరిని ‘అలక్ష్యంచేస్తున్నట్లు’ లేదా ఆశ్రద్ధగా చూస్తున్నట్లు వారు భావించకుండా వుండుటకు సంఘంలోనున్న మనందరం కృషిచేయగలం.—కీర్తన 71:9.
ఆత్మీయ బలం పొందుటకు సహాయం
మన వి శ్వాసాన్ని బలంగా వుంచుకుంటూ దాన్ని కాపాడుకోవడానికి మనందరికి ఆత్మీయాహారం అవసరం. అందుకే, మనం ప్రతిదినము బైబిలును, బైబిలు పుస్తకాలను చదువుతూ ఆసక్తితో సేవలో పాల్గొంటూ, సంఘ కూటాలకు హాజరుకావాలని మనకు ప్రోత్సాహ మివ్వబడుతుంది. రోగులు, వృద్ధులు ఇవి చేయాలంటే వారికి సహాయమవసరం, ముఖ్యంగా వారి విషయంలో వాస్తవమైనదేదో దాన్ని చేయుట ప్రాముఖ్యం. కొద్దో గొప్పో సహాయం చేస్తూ, ప్రయాణ ఖర్చులిస్తుంటే రాజ్యమందిరములో జరిగే కూటాలకు ఇంకా చాలా మంది హాజరుకాగలరు. వారు కూటాలకు హాజరగుట సంఘానికి గొప్ప ప్రోత్సాహకరమే. వారి సహనం పురికొల్పునదిగాను విశ్వాసాన్ని బలపరచేదిగానున్నది.
అనేక సందర్భాల్లో రోగులు, వృద్ధులు కూడ క్రైస్తవ పరిచర్యలో అర్ధవంతముగా భాగం వహించగలరు. వీరిలో కొందరిని కారులో గుంపుగా సాక్ష్యమివ్వడానికి వెళ్లేవారితో కలుపవచ్చు, మరి అలా కొద్దిమందినైనా, ఎంత తక్కువ మందినైనా కలిసి మాట్లాడినందుకు వారు నిశ్చయంగా సంతోషిస్తారు. ఇది సాధ్యపడకపోతే, తమ దగ్గరికి వచ్చేవారితో వారు తటస్థ సాక్ష్యమియ్యవచ్చును. క్యాన్సర్ రోగియైనప్పటికిని ఒక సహోదరి తన శేష జీవితాన్ని సువార్త వ్యాప్తికి వినియోగించుటకు ఒక ప్రత్యేక ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంది. అవిశ్వాసులైన బంధువులకు, సహోద్యోగులకు, ఇరుగుపొరుగువారికి మంచి సాక్ష్యమిచ్చే పద్ధతిలో తన అంత్యక్రియలు జరుపవలెనని కూడ ముందే పథకం వేసుకుంది. ఆమె దుఃఖకర పరిస్థితులు “సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడెను,” విశ్వాసాన్ని దృఢనమ్మకాన్ని కనబరచాలని ఆమెకున్న పట్టుదల తన చివరిదినములను అర్థసహితం చేసెను.—ఫిలిప్పీయులు 1:12-14.
ఆత్మీయంగా బలపడుటకై రోగులకు, వృద్ధులకు సహాయపడుట మంచిది. కుటుంబములు తమతో పాటు సాయంకాలం పూట సరదాగా గడుపుటకు అట్టివారి నాహ్వానించవచ్చును, లేదా వారి కుటుంబ పఠనమును అప్పుడప్పుడు అలా బయటకు వెళ్లలేని వారింటికి మార్చుకోవచ్చును. ఓ తల్లి తన ఇద్దరు చిన్న పిల్లలను ఓ వృద్ధురాలైన సహోదరి ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఆమెతో కలిసి మై బుక్ ఆఫ్ బైబిల్ స్టోరీస్ పుస్తకాన్ని చదివేటట్లు చేసింది. ఈ వృద్ధురాలైన సహోదరికది సంతోషం కల్గించింది, ఆమె చూపిన శ్రద్ధకు పిల్లలు ఆనందించారు.
అయినా, రోగులను ఎక్కువ తొందర పెట్టకూడని సమయాలు కొన్ని వుంటాయి, మరి అప్పుడప్పుడు వచ్చి పెద్దగా వారికి చదివి వినిపించవచ్చును. అయినప్పటికి, ఒక వ్యక్తి సంభాషించలేనంత బలహీనంగా వుంటే, ఆవ్యక్తికింకా కొంత ఆత్మీయ సహవాసం అవసరమని, దాన్ని కోరుతున్నాడని జ్ఞాపకముంచుకోండి. మనం వారితో కలిసి ప్రార్థించవచ్చు, చదివి వినిపించవచ్చు, లేదా అనుభవాలు చెప్పొచ్చు; అయితే అవసరమైనంత సమయాన్నే వారితో గడపటానికి మనం జాగ్రత్తపడాలి.
రోగులు, వృద్ధులలో చాలా మంది ఇంకను చేయగల పవిత్ర సేవొకటున్నది: ఇతరుల నిమిత్తం ప్రార్ధించుట. తొలిశిష్యులు యీ సేవకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ఒక సందర్భంలో వారు సంఘంలో ఆ పనినెలా పంచుకున్నారంటే అపొస్తలులు ప్రార్థనలో గడపవలసి వచ్చింది. విశ్వాసియైన ఎపఫ్రా ‘ఎల్లప్పుడు ఇతరుల కొరకు ప్రార్థనలో పోరాడెను’ అని చెప్పబడింది. (కొలస్సయులు 4:12; అపొస్తలుల కార్యములు 6:4) అటువంటి ప్రార్థన చాలా ముఖ్యం, ప్రయోజనకరం.—లూకా 2:36-38; యాకోబు 5:16.
యెహోవా రోగులను, వృద్ధులను జ్ఞాపకం చేసికొని వారి ఆపత్కాలములో వారిని పరామర్శిస్తాడు. వారికి సహాయపడుటకై మనం చేయగల్గిన సహాయం చేయడానికి మనం కూడ అలాగే తలంచాలని ఆయన కోరుట న్యాయమే. మనం వారి ఎడల చూపే శ్రద్ధ, మనకున్న యథార్థతను కాపాడుకొనుటకు మన దృఢ నిర్ణయాన్ని ప్రతిబింబిస్తుంది. మరి మనం దావీదు రాజు పలికిన మాటలను జ్ఞాపకం చేసికొనుటలో సంతోషిస్తాం: “నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.”—కీర్తన 37:18.
[28వ పేజీలోని బాక్సు]
క్రియాత్మకమైన సహాయం వివేచనతో చేయుట
మనం రోగులను, వృద్ధులను ఎలా పరామర్శిస్తున్నామో సరియైన రీతిగా తెలిసికోవాలి. అంతేగాక, జీవితం ఎడల సరియైన దృక్పథాన్ని కల్గియుండునట్లు, వారి అవసరత వుందని, వారభినందించ బడుచున్నారని భావించునట్లు, ఆత్మాభిమానమును కల్గియుండునట్లు వారిని ప్రోత్సహించాలి. అలా చేస్తే బాధ వేదనలున్ననూ వారు యెహోవా యందానందించునట్లు వారిని సంరక్షించదగు స్థానంలో వారి జీవిత నాణ్యత నిలుస్తుంది. నిశ్చయంగా దీనికి బాగా దోహదపడేదేమంటే, ముందున్న నిరీక్షణలో సజీవ ఆసక్తి, మంచి మానసిక దృక్పథం, వీలైనంతవరకు రాజ్య పరిచర్యలో భాగం వహించుట మొదలగునవి. సంతోషభరిత, ఫలభరిత జీవితాన్ని సంతోషంగా చాలించి 100వ సంవత్సరంలో మరణించిన వాచ్‌టవర్ సొసైటి మాజీ ప్రసిడెంట్ ఫ్రెడ్రిక్. డబ్ల్యు. ఫ్రాంజ్ ఇందుకు తార్కాణం—1 దినవృత్తాంతములు 29:28 పోల్చండి.
సాధారణంగా, దైనందిన విషయాలకు ధ్యానమివ్వాలంటే చాలావున్నవి: పరిశుభ్రంగా వుండటం, సరియైన పోషకాహారం, తగినంత పానీయం, ఉప్పు, తీసుకోవడం, తగిన వ్యాయామం, మంచి గాలి, సున్నితంగా శరీర మర్ధనం చేయుట, పురికొల్పు కల్గించే సంభాషణ చేయుట మొదలైనవి. సరియైన పోషకాహారం తీసుకుంటే, బాగా వినుటకు, కంటి చూపుకు బుద్ధికుశలతకు, శరీరారోగ్యానికి, రోగాన్నెదిరించే అధిక శక్తి చేకూరగలదు. వృద్ధులు సరియైన పోషకాహారం, ఎక్కువ ద్రవ పదార్ధాలు పానీయాలు సేవిస్తూవుంటే, మంచి ఆరోగ్యానికి, వార్థక్య బలహీనతకు మధ్యగల తేడా తెలిసొస్తుంది. ఆ వ్యక్తికి తగిన వ్యాయామమును గూర్చి ఆలోచించ వలసిన అవసరముండవచ్చును. బాగా అంధురాలైన వృద్ధ సహోదరి దగ్గరకు ప్రతివారం ఓ సహోదరి వచ్చి, గది చుట్టూరు ఆమెతోపాటు నెమ్మదిగా నాట్యం చేస్తూ సమయం గడిపి వెళ్తూ వుంటుంది. ఎన్నుకున్న సంగీతంతో వున్న టేప్ రికార్డు సిద్ధంగా వుంటుంది, ఇద్దరూ యీ “పని” చేస్తూ ఆనందిస్తున్నారు.
పలుదేశాల్లో సహాయక సంస్థలు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎలా, ఏమి చేయాలి అనే విషయాలను గూర్చి విలువైన సహాయ సహకారాలను, సలహాలనందించగలవు. (క్రైస్తవులు మన నిజమైన క్రైస్తవ పరిచర్యనుండి వేరు చేసే పనులలో పడిపోకుండ వుండునట్లు, ఎల్లప్పుడు బహు జాగ్రత్తకలిగి వుండాలి.) పైకి క్రిందికి మార్చుకోగల ఆసుపత్రి మంచం, చేతికర్రలు, చంకల క్రింది కర్రలు, చక్రాల కుర్చి, శ్రవణ యంత్రం మొదలైన వాటి కొరకు ఆర్ధిక సహాయం చెయ్యవచ్చును. చాలమంది వృద్ధులు వారికటువంటివి అవసరంలేదని లేదా అలాంటి క్రొత్త వస్తువులేవి ఉపయోగ పడవని అనుకోవచ్చును. అటువంటప్పుడు బంధువులు వారిని ఒప్పిస్తారు లేదా మంచి సలహానిస్తారు, పూల గుత్తిని తెచ్చేకంటే స్నానాల గది తలుపుకు సరియైన కొక్కెము ఏర్పాటుచేస్తే వారికెంతో ఉపయోగకరం.
వృద్ధులను ముఖ్యంగా వార్థక్యదశలో అతి బలహీనంగానున్న వారిని పరామర్శించుటలో ఎంతో మానసిక వత్తిడికలుగవచ్చును. ఈ వార్థక్య దౌర్భల్యం తరచూ అనుకోకుండవస్తుంది. రోగి ఆ విషయంలో అనవసరంగా బెంగపడకుండ చూడటం ద్వారా దాన్నెదిరించుటకు ప్రయత్నించవచ్చు. తనకు సన్నిహితుడనుకున్న వ్యక్తిపై సహితం ఈ దౌర్భల్య వ్యక్తి విసుగుకుంటాడు. వార్థక్యంలోనున్న వ్యక్తి సత్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మర్చిపోతాడనే విషయాన్ని బంధువులు గ్రహించాలి—ఈ స్థితి దుఃఖకరమైనదే, అయినా ఇది తాను విశ్వాసం కోల్పోయాడనే దానికి నిదర్శనం కాదు.
రోగి ఆసుపత్రిలో గాని నర్సింగ్ హోంలోగానీ వుంటే అక్కడున్న సిబ్బందితో మంచి సంబంధం కలుగజేసుకోవాలి, తద్వారా పుట్టుక దినములు, క్రిస్మస్ లేదా తదితర లౌకిక సెలవు దినాచరణల విషయంలో వారేం చేయాలన్న విషయం వారు తెలుసు కోగల్గుదురు. ఒకవేళ శస్త్రచికిత్సే అవసరమైతే, రోగి రక్తమార్పిడి విషయంలో కల్గియున్న అభిప్రాయాలను గూర్చి బంధువులు వారికి వివరించి, ఆధారం చూపవచ్చును.