నా యౌవన దశనుండే యెహోవాను దృఢంగా నమ్ముకున్నాను
బేసిల్ ట్సాటోస్ చెప్పినది
అది 1920వ సంవత్సరం; గ్రీస్‌లోని అందమైన పెలోపోనిసోస్ అనే ప్రాంతంలోని ఆర్కాడియా పర్వత శ్రేణి ప్రాంతం. లోకాన్ని హడలెత్తిస్తున్న స్పానిష్ ఇనుఫ్లూయెన్జా అనే భయంకరమైన విషజ్వరంతో మంచం పట్టాను.
చర్చి గంట మ్రోగినప్పుడెల్లా మరొకరు మరణ వాతను పడ్డారని అది ప్రకటిస్తున్నట్లు నేను గ్రహించేవాడ్ని. తర్వాత నావంతేనా? దీవెనకరంగా, నేను కోలుకున్నానుగానీ లక్షలాదిమంది కోలుకోలేదు. నాకప్పుడు ఎనిమిదేండ్లే. అయినా ఆ భయంకరమైన అనుభవం యింకా జ్ఞాపకాలలో స్పష్టంగా మెదులుతూనే వున్నది.
తొలి ఆత్మీయ శ్రద్ధాసక్తులు
పిదప కొద్దికాలానికే తాతగారు చనిపోయారు. అంత్యక్రియల తర్వాత మా ఇంటి బాల్కనీ మీద నా చెల్లెలు నాతో కలిసి మాట్లాడిన విషయం నాకు జ్ఞాపకముంది. మా దుఃఖాన్ని దిగమింగుకోవడానికి మమ్మల్ని ఓదార్చుటకై అమ్మ ప్రయత్నిస్తునే నెమ్మదిగా మాతో ఇలా అన్నది: “మనందరం ముసలి వారమై చావాల్సిందే.”
అమ్మ ఎంతో మృదువుగా చెప్పినప్పటికీ, ఆమె మాటలు నాకు బాధకల్గించాయి. ‘ఎంత విచారం, ఎంత అన్యాయం!’ అని నేననుకున్నాను. అయితే అమ్మ మాతో: “ప్రభువు మరల వచ్చినపుడు ఆయన మృతులను లేపుతాడు, అప్పుడు మనమిక ఎన్నటికి చనిపోము!” అని చెప్పినపుడు మేమిద్దరం సంతోషించాము. ఆహా! అదెంతో ఓదార్పుకరమైంది!
అప్పటినుండి ఆ శుభ ఘడియ ఎప్పుడొస్తుందాయని చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ వచ్చాను. నేనెంతో మందిని అడిగాను, ఎవరు చెప్పలేకపోయారు, అంతెందుకు ఆ విషయాన్ని చర్చించడానికి కూడ ఎవ్వరికి శ్రద్ధ ఉన్నట్లు కన్పించలేదు.
నా 12వ ఏట, ఓ రోజు మా నాన్నకు అమెరికాలో వున్న తన అన్నయ్య ఓ పుస్తకం పంపాడు. అది వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ప్రచురించిన ది హార్ప్ ఆఫ్ గాడ్ అనే పుస్తకం. నేను విషయసూచికను తిరగేసి చూశాను, అందులో “అవర్ లార్డ్స్ రిటర్న్” అనే అధ్యాయాన్ని చూచి నేను ఉప్పొంగిపోయాను. దాన్ని నేను చాలా ఆసక్తితో చదివాను. అయితే ఏ సంవత్సరంలో ప్రభువు తిరిగి వస్తాడో అందులో లేనందుకు నేను నిరాశ చెందాను. అయితే ఆ పుస్తకం మాత్రం, ఆ సమయం ఆసన్నమైందని సూచించింది.
నేను హైస్కూల్లో చేరి చదువులో మునిగిపోయాను. అయినా అప్పుడప్పుడు అమెరికాలోవున్న మా పెదనాన్న ది వాచ్‌టవర్ ప్రతులు పంపేవాడు, నేను చదివి ఆనందించేవాడ్ని. అంతేకాకుండా ప్రతి ఆదివారం నేను సన్డేస్కూల్కు హాజరయ్యేవాడ్ని, బిషప్‌గారు అప్పుడప్పుడు అక్కడికి వచ్చి ప్రసంగమిచ్చేవారు.
ఓ ఆదివారంనాడు, బిషప్ మహా ఉగ్రుడై ఇలా అన్నాడు: “సందర్శకులు యీ పట్టణాన్ని మతభ్రష్ట పుస్తకాలతో నింపేస్తున్నారు.” తర్వాత ఆయన ది వాచ్‌టవర్ ప్రతిని చూపిస్తూ ఇలా బిగ్గరగా అరిచాడు: “మీ ఇండ్లలో ఇటువంటి ప్రచురణలు ఏవైనా వుంటే, చర్చికి తీసుకురండి. నేను వాటిని కాల్చివేస్తాను.”
ఆయన కంఠస్వరం నన్ను కలత పెట్టిందిగానీ ఆయన అహంకారపు ధోరణి నన్ను అంతకంటే మరెక్కువగా కలవరపెట్టింది. అందుకే నేను ఆయన చెప్పింది వినలేదు. కానీ నేను ఇక వాచ్‌టవర్ ప్రచురణలు పంపొద్దని మా పెద్దనాన్నకు వ్రాశాను. అయినా, నేను క్రీస్తు రాకడనుగూర్చి ఆలోచిస్తూనే ఉంటిని.
ఆత్మీయ దాహం పెరుగుట
వేసవికాల శెలవు వచ్చినపుడు బట్టలు సర్దుకుందామని నా సూట్‌కేస్ తీశాను. అందులో అడుగు భాగాన వాచ్‌టవర్ సొసైటి ప్రచురించిన మూడు చిన్న పుస్తకాలున్నాయి. నేనెందుకో వాటిని అంతకు ముందు గమనించలేదు. అందులో ఒకటి వేర్ ఆర్ ది డెడ్ అనేది వుంది.
‘ఇది బాగున్నట్లుందని’ నేననుకున్నాను. బిషప్‌గారు చేసిన హెచ్చరిక నాకు జ్ఞాపకమున్నప్పటికీ, అందులో తప్పులుంటాయని నేననుకున్నందున, ఆ తప్పులను పట్టుకోవడానికే వాటిని జాగ్రత్తగా చదవాలని నిర్ణయించుకున్నాను. ఓ పెన్సిల్ తీసుకుని అతి జాగ్రత్తగా తప్పులను వెదకడం ప్రారంభించాను. నాకు ఆశ్చర్యం కల్గించిందేమంటే, ఆ చిన్న పుస్తకాలలో వున్న ప్రతిదీ సహేతుకంగా వుంది, మరి పాఠకుడు బైబిలును పోల్చిచూచుకొనేటట్లు ప్రతి వాక్యం దగ్గర లేఖనాలు ఎత్తి వ్రాయబడ్డాయి.
మాకు బైబిలు లేనందున, ఎత్తివ్రాయబడిన లేఖనాలు రచయితలకు అనుగుణంగా వుండటానికి తప్పుగా వాటిని అన్వయించారా అని సంశయమొచ్చింది. అందుకే నేను మా పెదనాన్నగార్కి ఒక పూర్తి బైబిలు పంపవలెనని వ్రాశాను. వెంటనే ఆయన పంపించాడు. దాన్ని నేను రెండుసార్లు మొదటినుండి చివరివరకు చదివేశాను, నాకర్థంకానిది అందులో ఎంతో వున్నప్పుటికీ దానియేలు, ప్రకటన పుస్తకాలలోని విషయాలు నాకు మర్మంగావుండేవి. వారు ప్రవచించిన వాటిని గూర్చి తెలుసు కోవాలనే తపన నాలో వుండేదిగానీ సహాయం చేయగల్గే వారెవరూ చుట్టూలేక పోయారు.
నేను 1929లో పాఠశాల విడిచిపెట్టాను, ఆ వెంటనే అమెరికాలో ఉన్న మా పెదనాన్న మరల ది వాచ్‌టవర్ ప్రతులను పంపించేవాడు. నేను వాటిని చదివి ఎంతో ఆనందించేవాన్ని, క్రమంగా వాటిని పంపించాలని కోరేవాన్ని ఆ పత్రికలనుండి నేను నేర్చుకుంటున్న భవిష్యత్ నిరీక్షణను గూర్చి ఇతరులతో మాట్లాడుట కారంభించాను. అయితే, అప్పుడు నా జీవితం నాటకీయంగా మార్పుచెందింది.
బర్మాలో ఆత్మీయ ఎదుగుదల
నా చిన్న మేనమామలు బర్మాకు (ఇప్పుడు మయన్మార్) వలసపోయారు, నేనూ వారితో అక్కడికి పోతే అనుభవం సంపాదించుకోవచ్చు, బహుశా వ్యాపారం చేసుకునే అవకాశాలు దొరక వచ్చునని కుటుంబం నిర్ణయించింది. తూర్పు దేశాలు ఎపుడూ నాకు ఉల్లాసభరితంగానే వుంటాయి, అందుకే అక్కడికెళ్లాలంటే నేను ఉప్పోంగిపోయాను. మా పెదనాన్న దగ్గరనుండి నాకు బర్మాకు కూడ ది వాచ్‌టవర్ వచ్చేది, గాని బైబిలు విద్యార్థులని పిలువబడే ఒక్క యెహోవాసాక్షిని కూడ నేనెన్నడూ స్వయంగా కలుసుకోలేదు.
ఒక రోజు బైబిలులోని ప్రకటన గ్రంథాన్ని వివరించే రెండు సంపుటలుగల లైట్ అనే పుస్తకములను గూర్చిన ప్రకటనను వాచ్‌టవర్‌లో చూసి మురిసి పోయాను. అంతేగాక బర్మాలోనున్న బైబిలు విద్యార్థుల పరిచర్యను వాచ్‌టవర్ సొసైటి ఇండియాలోని బొంబాయి నందున్న బ్రాంచి కార్యాలయం చూస్తుందని తెలుసుకున్నాను. వెంటనే నేను లైట్ పుస్తకాలు కావాలని, బర్మాలో ప్రచారానికై ఇండియాలోని బైబిలు విద్యార్థులను పంపాలని విన్నవిస్తూ రాశాను.
వెంటనే పోస్టు ద్వారా పుస్తకాలు వచ్చాయి, ఓ వారం తర్వాత బర్మాలోవున్న స్థానిక బైబిలు విద్యార్థులు నన్ను దర్శించారు. నేను నివసించే బర్మా రాజధానియగు రంగూన్లో (ఇప్పుడు యాంగన్) చిన్న గుంపొకటి వుందని తెలుసుకొని సంతోషించాను, వారు క్రమంగా నిర్వహించే బైబిలు పఠనానికి, ఇంటింటి సేవకు నన్నాహ్వానించారు. మొదట నేను కొంచెం సంకోచించినా, ఆ వెంటనే బైబిలు జ్ఞానమును నామకార్థ క్రైస్తవులకును, బౌద్ధులకు హిందూ ముస్లింలకు ప్రకటించుటలో ఆనందించాను.
అప్పుడు ఇండియా బ్రాంచి, యువర్ట్ ఫ్రాన్సిస్, రాండల్ హోప్లే అనే ఇద్దరు పూర్తికాల సేవకులను (పయినీర్లనబడే వారిని) పంపింది. ఆ ఇద్దరు ఇంగ్లాండ్ దేశీయులే అయితే, వారు చాలా సంవత్సరాలుగా ఇండియాలో సేవ చేస్తున్నారు. వారు నన్నెంతో ప్రోత్సహించారు, మరి 1934లో నేను యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాను.
ధైర్యంగా సాక్ష్యమిచ్చుట
కాలం గడిచే కొలది ఇండియా బ్రాంచి యింకా పయినీర్లను బర్మాకు పంపింది. క్లాడీగుడ్ మ్యాన్, రోన్టిపిన్ అనే ఇద్దరు రైల్వే స్టేషన్‌కు వచ్చి స్టేషన్ మాస్టారు సిడ్ని కుట్తో మాట్లాడారు. అతడు పుస్తకాలు తీసుకుని, బాగా చదివి, మాండలేలోనున్న వివాహితురాలైన తన అక్క డైజీ డిసౌజాకు ఉత్తరాలు వ్రాయడాని కారంభించాడు. ఆమెకూడ పుస్తకాలు ఆసక్తికరంగా వున్నాయని, యింకొన్ని కావాలని అడిగింది.
కాథోలిక్ మత విశ్వాసియైన డైజీ బహు ధైర్యశాలి. తాను నేర్చుకుంటున్న సంగతులను గూర్చి ఆమె తన ఇరుగుపొరుగు వారితో చెప్పడానికి ప్రారంభించింది. పారిష్ పాదిరిగారు ఆమెదగ్గరకు వచ్చి ఆమెందుకు చర్చి మానివేసిందని అడిగినప్పుడు, ఆయన బోధించేవాటిని అనగా, అగ్నిగుండం మొదలగు వాటిని బైబిలు తెలియజేయడం లేదని ఆయనకు చూపింది.
చివరకాయన ఆమెతో ఇలా అన్నాడు: “ఇంతకాలం నేను అగ్ని గుండాన్ని గూర్చి బోధించిన తర్వాత ఇప్పుడు అది లేదని ఎలా చెప్పగలను? అలా చెబితే ఎవరూ చర్చి ముఖం చూడరు.”
అప్పుడు డైజీ ఆయనతో ఇలా అన్నది: “మీరు యథార్థ క్రైస్తవులైతే, ఫలితమేమైనా కానివ్వండి సత్యాన్నే బోధిస్తారు.” ఇంకా ఆమె యిలా అన్నది: “మీరు చెప్పకపోతే నేను చెబుతాను.” ఆమె అన్నట్లే చేసింది.
రంగూన్లో నాతోపాటే, డైజీ, ఆమె పెద్దకూతుళ్లిద్దరు బాప్తిస్మం తీసుకున్నారు. మూడు సంవత్సరాల తర్వాత అంటే, 1937లో నేను ఆమె రెండవ కూతురు ఫిలెస్ను పెండ్లి చేసుకున్నాను.
ఇండియాకు పారిపోవుట
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాన్ సైన్యం బర్మాను ముట్టడించి 1942, మార్చి 8న రంగూన్ను స్వాధీనం చేసుకుంది. విదేశీ పౌరులు తక్షణమే ఇండియాకు వెళ్లిపోవలసిందని బలవంతపెట్టబడ్డారు. వందలాది మంది కీకారణ్యాల గుండా ప్రయాణించవలసి వచ్చింది, గానీ మార్గం మధ్యలో అనేకులు మరణించారు. ఖాళీ చేయించే ఆఫీసర్ నాకు వ్యక్తిగతంగా తెలుసు గనుక రంగూన్ నుండి బయలుదేరి కలకత్తాకు వెళ్లే రవాణా పడవల్లో చివరి దానిలో టికెట్ సంపాదించాను. మా ఇంటిని, చాల వస్తువులను అలాగే వదలి పెట్టి వెళ్లడం మా అందరికి దుఃఖకరంగా వుంది. బర్మా 1942 నుండి 1945 వరకు జపాన్ స్వాధీనంలో వుండెను.
మేము ఇండియా చేరే నాటికి మా ఆర్థిక పరిస్థితి హీనంగా వుండేది, ఉద్యోగం సంపాదించడం సులభమేమికాదు. ఇది విశ్వాసానికి పరీక్షే. నేనొక బ్రిటిష్ ఆఫీసర్‌ను కలిశాను, అతడు మిలటరీకి సంబంధించిన విభాగంలో మంచి ఉద్యోగం ఇస్తానన్నాడు. యెహోవా సహాయంతో ఆ ఉద్యోగాన్ని తిరస్కరించి, నిర్మలమైన క్రైస్తవ మనస్సాక్షిని నిలుపుకున్నాను (యెషయా 2:2-4) ఇతర విషయాల్లో కూడ యెహోవా ప్రేమగల హస్తం మాకు తోడుగావుంది.
ఇండియా రాజధాని ఢిల్లీలో నివాసమేర్పర్చుకున్నాం, అక్కడ వసతి దొరకాలంటే గగనమే. అయినా, నగరపు నడి బొడ్డుననే విశాలమైన అపార్టుమెంటు మాకు దొరికింది. ఇది ఢిల్లీనందలి యెహోవాసాక్షుల సంఘానికి రానైయున్న కొన్ని సంవత్సరాలవరకు రాజ్యమందిరంగా పని చేసింది. అయితే 1941లో వాచ్‌టవర్ సొసైటి ప్రచురణలన్నింటిపైనా నిషేధాజ్ఞలు అమలులో వున్నందున బైబిలు సాహిత్యాలు ఏవి మాకు దొరకలేదు.
నిషేధం ఎలా ఎత్తివేయబడింది
ఒక ఆదివారం, 1943 సంవత్సరంలో ఢిల్లీలోని చర్చికి వెళ్లేవారందరికి 13 మంది వివిధ చర్చీ మతగురువులు సంతకాలు చేసిన ఓ కరపత్రం అందింది. అందులో ఇలా హెచ్చరిక ఉంది: “ఢిల్లీ పౌరులారా, యెహోవాసాక్షులను గూర్చి జాగ్రత్తగా వుండండి.” దీనికిగల కారణం ఇండియాలో మన సేవ రాజకీయ కారణాలను బట్టి నిషేధించబడింది.
బొంబాయిలోని బ్రాంచి కార్యాలయ అనుమతితో, మేము మతగురువుల రంగు బయట పెట్టే ఓ కరపత్రాన్ని ముద్రించి పంచి పెట్టాము. నేను సంఘాధ్యక్షుడనైనందువల్ల కఠిన పదజాలముతో వున్న ఆ కరపత్రాల క్రింద నా పేరూ అడ్రసు ముద్రించబడింది. ఆ తర్వాత వెంటనే, కరపత్రాలను పంచుతున్న మార్గ్రిట్ హోఫ్మ్యాన్ను నన్ను పోలీసులు అరెస్టు చేసి, జైల్లో వేశారు. అయితే వెంటనే మమ్మల్ని బెయిల్ మీద విడుదల చేశారు.
పిదప, సేవ చేస్తున్న సమయంలోనె మార్గ్రిట్, ఇండియా వైస్రాయ్ కాబినెట్లో పేరుగాంచిన సర్. శ్రీవాస్తవ అనే మంత్రిని కలిసింది. శ్రీవాస్తవ ఆమెను సాదరంగా ఆహ్వానించాడు. మాటల్లో ఆమె మన సాహిత్యాలు ఇండియాలో నిషేధించబడ్డాయని ఆయనతో చెప్పింది. అదే రోజు మార్గ్రిట్, మద్రాస్ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యున్ని కూడ కలిసింది. పార్లమెంట్ మీటింగుకు హాజరుకావడానికి ఆయన నగరానికి వచ్చారు. మన సాహిత్యములను అన్యాయంగా నిషేధించారని ఆమె ఆయనతో అన్నప్పుడు, ఆయన రాబోయే మీటింగులో యీ ప్రస్తావన తెస్తానని ఆయన మాటిచ్చాడు.
ఆ కాలంలో నేను స్థానిక ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్నాను. సరే, సర్. శ్రీవాస్తవకు దెబ్బలు తగిలినందున, ఫిజియో థెరపి ఆయనకు ఉపయోగపడుతుందేమో చూడమని ఆసుపత్రి వర్గం నన్ను ఆయనయొద్దకు పంపింది. సర్. శ్రీవాస్తవ స్నేహపూర్వకంగా ఉండేవాడు, మరి మేము సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు మిస్ హోఫ్మ్యాన్, నేను జైలునుండి బెయిల్ మీద విడుదల చేయబడ్డామని చెప్పాను. మా సాహిత్యాలు మతగురువుల వత్తిడి వల్లనే రాజకీయ వంకతో నిషేధించబడ్డాయేగానీ మేము రాజకీయాలకు పూర్తిగా అతీతమని నేనాయనకు వివరించాను. మా బ్రాంచి ప్రతినిధి ఎడ్విన్ స్కిన్నర్ మా స్థానాన్ని గూర్చి వివరించడానికై అధికారులను కలుసుకొనేందుకు వినతి చేయగా తిరస్కరించారని కూడ నేను చెప్పాను.
రెండుమూడు రోజుల్లోనే సర్. శ్రీవాస్తవ నాతో ఇలా చెప్పారు: “జెంకిన్స్ ఆ అధికారి [మన సేవ విషయంలో అయిష్టత చూపే వ్యక్తి] కొద్ది రోజుల్లో రిటైర్డ్ అవుతారు, మరి ఆయన స్థానంలో సర్. ప్రాన్సిస్ మూడి వస్తారు. స్కిన్నర్గారిని ఓ మాటు రమ్మనండి, నేనాయనను సర్. ప్రాన్సిస్ గార్కి పరిచయం చేస్తాను.”
తన మాట ప్రకారం సర్. శ్రీవాస్తవ గారు అలా కలుసుకునే ఏర్పాటు చేశారు. అప్పుడు సర్. ఫ్రాన్సిస్ మూడి గారు బ్రదర్ స్కిన్నర్తో ఇలా అన్నారు: “నేనేమి మాటివ్వలేను గానీ దీని గూర్చి పరిశీలిస్తాను.” పార్లమెంటు కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానైయున్నందువల్ల, బ్రదర్ స్కిన్నర్ రాబోవు పరిణామమేమిటో చూద్దామని అక్కడే ఉండిపోయారు. తన మాట ప్రకారం మద్రాస్ పార్లమెంట్ సభ్యుడు సభలో నిల్చొని ఇలా అడిగాడు: “వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ప్రచురణలు రాజకీయ కారణాలను బట్టి నిషేధించబడిన మాట వాస్తవమేనా?”
“కాదుగానీ ముందు జాగ్రత్త చర్యగా నిషేధించాము, అయితే ఇప్పుడా నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని సర్. మూడి సమాధాన మిచ్చారు.
ఆ వార్త విన్నపుడు మాకెంత ఆనందంగా వుండెనో! ఓ వారం తర్వాత బొంబాయి బ్రాంచి కార్యాలయానికి నిషేధం ఎత్తివేసినట్లు ఉత్తరం వచ్చింది.
యుద్ధం వల్ల చిన్నాభిన్నమైన బర్మాకు తిరిగి వెళ్లుట
రెండవ ప్రపంచ యుద్ధానంతరం బర్మాలో బ్రిటిష్ పాలన వచ్చింది, కొన్ని నెలల తర్వాత ఆ పదిమంది సాక్షులము తిరిగి రంగూన్‌కు వెళ్లాము. ఆ కొద్దిమంది స్థానిక సాక్షులను తిరిగి చూచి మేమానందించాము. దేశము దీనావస్థలో వుండెను. విద్యుత్తు, ప్రయాణ సౌకర్యాలతో పాటు అనేక ప్రజోపకార్యాలు స్థంభించిపోయినవి గనుక మేము మిలటరీ వారినుండి ఓ జీపును కొని, మేమక్కడికి వెళ్లిన వెంటనే మేము ఏర్పాటు చేసిన కూటములకు ప్రజలను చేరవేయుటకు దాన్ని బాగుగా ఉపయోగించాము.
ఆసక్తిగల ఒకాయన మాకు స్థలమిచ్చాడు, ఆ ప్రాంతములోనున్న సహృదయులైనవారి సహాయంతో ఓ మాదిరి రాజ్యమందిరాన్ని నిర్మించాము. వెదురు కర్రలతో గుంజలు పాతి, వెదురు బద్దలతో గోడలు కట్టి, గడ్డితో పైకప్పువేసి దాన్ని నిర్మించాము. అప్పటి వాచ్‌టవర్ ప్రెసిడెంట్ నాతాన్ హెచ్. నార్, ఆయన సెక్రెటరీ మిల్టన్. జి. హెన్సెల్ 1947లో రంగూన్ దర్శించినప్పుడు ఇక్కడే ప్రసంగించారు. అప్పుడు బర్మా అంతటిలోను మేము 19 మంది సాక్షులమే వున్నాము. అయితే, న్యూ ఎక్సెల్సియర్ థియేటర్లో బ్రదర్ నార్ ఇచ్చిన బహిరంగ ప్రసంగానికి 287 మంది హాజరయ్యారు!
మేము ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాము
జనవరి 4, 1948లో గేట్ బ్రిటన్ బర్మాకు స్వాతంత్ర్యాన్నిచ్చింది, అందుకు అనేక మంది ఐరోపా దేశస్థులు ఆ దేశాన్ని వదలి వెళ్లడమే శ్రేష్ఠమనుకున్నారు. ప్రార్థనా పూర్వకంగా తలంచిన తర్వాత, ఫిలిస్ నేను మా పాపను తీసుకుని ఆస్ట్రేలియాకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాము. పశ్చిమ ఆస్ట్రేలియా ముఖ్య పట్టణమైన పెర్తెలో మేము స్థిరపడ్డాము.
బర్మాను వదలడం, యీ సారి శాశ్వతంగా దాన్ని విడిచి పెట్టడం మాకు బాధనిపించింది. అప్పుడప్పుడు అక్కడున్న ప్రియమైన వారిని గూర్చి విన్నాము. ఆ దేశంలో రాజ్య సేవ క్రమేపి అభివృద్ధి చెందుతుందని తెలుసుకొనుట మాకు సంతోషంగానే వుంది.
ఆస్ట్రేలియాలోని ముఖ్య నగరాలలో 1978 ప్రారంభంనుండి నాలుగు సంవత్సరాల పాటు మేము గ్రీకు మాట్లాడే సంఘాలలో సేవ చేయటంలో ఆనందించాము. పశ్చిమ తీర ప్రాంతం నుండి తూర్పు తీర ప్రాంతానికి 4,200 కిలోమీటర్ల పొడవున్న యీ విశాల దేశంలో అట్టి సేవ చేయడానికి ఎక్కువ ప్రయాణం చేయవలసి వచ్చింది. కొంత కాలం తర్వాత, ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వాతావరణంలో మార్పున్నందువలన మా ఆరోగ్యం కూడ క్షీణించింది. అందుకే మరల పెర్తెకు వెళ్లాము, ఆ పట్టణంలోని 44 సంఘాలలో ఒక దానిలో నేను సంఘ పెద్దగా సేవచేస్తున్నాను.
సంవత్సరాలు గడిచేకొలది నా కంటి చూపు మందగించింది, చదవడం కష్టమయింది. మాకు ఆరోగ్య సమస్యలున్నప్పటికి మా హృదయాలు ఇంకా యౌవనంగానే వున్నాయి. యెహోవాకు భయపడు వారందరికి ఆయన కృప, నీతి సూర్యుని వలె “ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు” అనే సంతోషభరిత దినము కొరకు మేమిద్దరము దృఢవిశ్వాసముతో వేచియున్నాము.—మలాకీ 4:2.a
[అధస్సూచీలు]
a ఈ జీవిత చరిత్ర వ్రాయడం పూర్తిచేసే సమయానికి, డిశంబర్ 13, 1992న బ్రదర్ ట్సాటోస్ మరణించారు.
[24వ పేజీలోని చిత్రం]
బ్రదర్ హెన్సెల్, నార్ గార్లతో 1947లో బర్మాలో (మయన్మార్) నా కుటుంబం ఉన్నప్పుడు
[25వ పేజీలోని చిత్రం]
ఆస్ట్రేలియాలో బేసిల్ ట్సాటోస్ ఆయన భార్య ఫిలిస్