మీ నడవడిని ఎవరును చెరపనివ్వకండి
“మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.”—1 కొరింథీయులు 15:33.
1, 2. (ఎ) కొరింథు క్రైస్తవులయెడల అపొస్తలుడైన పౌలు ఎలాంటి భావాన్ని కలిగివున్నాడు, ఎందుకు? (బి) ఏ ప్రత్యేక ఉపదేశము పరిశీలించబడును?
తల్లిదండ్రుల ప్రేమ ఎంత శక్తివంతమైన భావోద్రేకంతో నిండినది! తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించడానికి, సలహానివ్వడానికి, వారికొరకు త్యాగంచేసేలా అది వారిని నడుపుతుంది. స్వభావ సిద్ధంగా అపొస్తలుడైన పౌలు తండ్రికాకపోయి వుండొచ్చు, అయినా కొరింథులోని క్రైస్తవులకు ఆయనిలా వ్రాశాడు: “క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తుయేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని.”—1 కొరింథీయులు 4:15.
2 అంతకుముందు పౌలు కొరింథుకు ప్రయాణముచేసి అక్కడ గ్రీకులకును యూదులకు ప్రకటించాడు. కొరింథులో సంఘము ఏర్పడేలా సహాయము చేశాడు. మరొక పత్రికలో పౌలు తానిచ్చే శ్రద్ధను ఒక స్తన్యమిచ్చు తల్లికి పోల్చినను, కొరింథీయులకు మాత్రము ఆయన తండ్రివలె ఉన్నాడు. (1 థెస్సలొనీకయులు 2:7) ప్రేమగల ఒక సహజ తండ్రివలె, పౌలు తన ఆత్మీయ పిల్లలకు ఉద్బోధించాడు. అందుచేత, కొరింథులోవున్న క్రైస్తవులకు పౌలు యిచ్చిన తండ్రివంటి ఈ ఉపదేశమునుండి మీరు ప్రయోజనము పొందవచ్చును: “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” (1 కొరింథీయులు 15:33) పౌలు ఎందుకు ఆ విషయాన్ని కొరింథీయులకు వ్రాశాడు? ఆ సలహాను మనమెలా అన్వయించుకొనగలము?
వారికి, మనకు ఉపదేశము
3, 4. మొదటి శతాబ్దపు కొరింథును గూర్చి, దాని జనాభానుగూర్చి మనకు ఏమి తెలుసు?
3 గ్రీకుదేశపు భూగోళ శాస్త్రవేత్తయైన స్ట్రాబో మొదటి శతాబ్దములో ఇలా వ్రాశాడు: “కొరింథు దాని వ్యాపారాన్నిబట్టి సంపన్నవంతమైనదిగా పేరుగాంచింది. ఒకటి ఆసియాకు, మరొకటి ఇటలీకి నడుపు రెండు ముఖ్య ఓడరేవులకు నిలయమైయున్న ఇసూమస్‌లో అది ఉన్నందున ఈ రెండు దేశముల వ్యాపార మార్పిడి అక్కడే జరుగుతుండేది.” ప్రతి రెండు సంవత్సరములకొకసారి ప్రఖ్యాతిగాంచిన ఇసుమియన్ ఆటలు అక్కడ జరిగేవి గనుక గొప్పజనము గుంపులు గుంపులుగా కొరింథుకు వచ్చేవారు.
4 ప్రభుత్వపరమైన అధికారానికి, అప్రొదితు ఇంద్రియ సంబంధ ఆరాధనకు కేంద్రమైన ఈ కొరింథుకు ఎటువంటి ప్రజలు వచ్చేవారు? ప్రొఫెసరు టి. యస్. ఎవాన్స్ ఇలా వివరించాడు: “దాని జనాబా దాదాపు 4,00,000 ఉండేవారు. ఉన్నత సంస్కృతిగల సమాజము. కాని నైతికంగా అంత పట్టుగలదికాదు . . . అకాయలోనుండే గ్రీకు వాసులు మేధాపరంగా ఎడతెరిపిలేకుండా ఆలోచనలో మునిగి ఉండేవారు. ఎప్పుడూ ఏదో క్రొత్తవిషయాల కోసం పరితపిస్తూ ఉండేవారు. . . . వారి అహం, వేర్పాటుధోరణితో విభిన్న శాఖలను ఏర్పాటుచేసుకొనడానికి ఆజ్యముగా పనిచేసింది.”
5. ఏ అపాయాన్ని కొరింథులోని సహోదరులు ఎదుర్కొన్నారు?
5 చివరకు అక్కడి సంఘము కూడా ఇంకను గర్వపు యోచనలు కలిగియున్న కొందరి మూలంగా విభాగించబడింది. (1 కొరింథీయులు 1:10-31; 3:2-9) ఇంకో పెద్ద సమస్యేమంటే అక్కడుండే కొందరు “మృతుల పునరుత్థానము లేదని” చెబుతుండేవారు. (1 కొరింథీయులు 15:12; 2 తిమోతి 2:16-18) వారి విశ్వాసాన్ని, (అవిశ్వాసాన్నైనా) “క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడ”ను స్పష్టమైన నిదర్శనముతో పౌలు వారిని సరిదిద్దవలసి ఉన్నాడు. ఆవిధంగా క్రైస్తవులు “ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా దేవుడు జయము అనుగ్రహించు”నని నమ్మగలరు. (1 కొరింథీయులు 15:20, 51-57) నీవేగాని అక్కడుంటే విభాగించే అట్టి స్వభావంతో అపాయమునకు లోనైయుండేవాడివా?
6. పౌలు 1 కొరింథీయులు 15:33లో ఇచ్చిన ఉపదేశము ప్రత్యేకముగా ఎవరికి అన్వయించును?
6 మృతులు పునరుత్థానం అవుతారనే గట్టి నిదర్శనమిచ్చేదానిలో భాగంగా పౌలు వారితో, “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని చెప్పాడు. ఈ ఉపదేశములోని అంశము ఆ సంఘముతో సహవసిస్తూ, పునరుత్థాన సిద్ధాంతముతో ఏకీభవించనివారికి అన్వయించింది. వారు కేవలము వారికి అర్థంకాని అంశాన్నిగూర్చి అస్పష్టంగా ఉన్నారా? (లూకా 24:38 పోల్చండి.) లేదు. “మీలో కొందరు పునరుత్థాము లేదని చెప్పుచున్నారు” అని పౌలు వ్రాశాడు. అనగా ఇలా అనంగీకారాన్ని వ్యక్తపరచేవారు మతభ్రష్టత్వంవైపు వెళ్తుండిరి. అందుచేత వారు ఇతరుల మంచి ఆలోచనను, వారి మంచి నడవడిని చెరుపుదురని పౌలు ఎరిగియుండెను.—అపొస్తలుల కార్యములు 20:30; 2 పేతురు 2:1.
7. మొదటి కొరింథీయులు 15:33ను మనము అన్వయించగల ఒక సందర్భమేమి?
7 మన సహవాసముల విషయంలో పౌలు హెచ్చరికను మనమెలా అన్వయించగలము? సంఘములో ఎవరికైనా బైబిలులోని ఒక వచనం అర్థం గాని లేక దాని ఉపదేశాన్నిగాని గ్రహించడానికి కష్టంగావుంటే అట్టివారికి మనము సహాయం చేయడానికి వెనుకాడవలెనని ఆయన భావం కాదు. నిజానికి ఎవరికైనా, అట్టి సందేహాలుంటే వారికి కనికరంతో సహాయంచేయాలని యూదా 22, 23 మనకు ఉద్బోధిస్తుంది. (యాకోబు 5:19, 20) అయితే మనము బైబిలు సత్యమని ఎరిగినదాన్ని అంగీకరించకపోవడం లేక సందేహాత్మక ధోరణితో, వ్యతిరేక ధోరణితో వ్యాఖ్యానిస్తుంటే అట్టివారియెడల పౌలుయిచ్చిన తండ్రివంటి ఉపదేశమును మనము గైకొనవలసివున్నాము. అటువంటి వ్యక్తితో సహవసించే విషయంలో మనము జాగ్రత్త వహించాలి. ఒక వ్యక్తి కచ్చితంగా మతభ్రష్టుడైతే మందను కాపాడేందుకు ఆత్మీయకాపరులు చర్య తీసుకోవలసి యున్నారు.—2 తిమోతి 2:16-18; తీతు 3:10, 11.
8. ఎవరైనా బైబిలు బోధను అంగీకరించనప్పుడు మనమెట్లు వివేకముతో ప్రవర్తించవచ్చును?
8 మొదటి కొరింథీయులు 15:33లో పౌలు పలికిన తండ్రివంటి మాటలను, అబద్ధబోధలను పురికొల్పే సంఘమునకు వెలుపటివారి విషయంలోను మనము అన్వయించవచ్చును. అటువంటి వారితో మనమెలా సహవాసము చేయగలము? సత్యాన్ని నేర్చుకొనేలా సహాయం పొందవలసిన వారికి, అబద్ధ బోధను పురికొల్పే సవాలుచేసేవారికి మధ్యగల బేధాన్ని మనము గుర్తించలేకపోతే అలా జరగవచ్చు. ఉదాహరణకు సాక్ష్యమిచ్చే పనిచేస్తున్నప్పుడు, ఒక విషయంపైన ఏకీభవించనప్పటికి, ఆ విషయంపై మరలా చర్చించడానికి ఇష్టపడే వ్యక్తి వుండవచ్చు. (అపొస్తలుల కార్యములు 17:32-34) దానివలన ఏ సమస్య ఉండదు. ఎందుకంటే బైబిలు సత్యాన్ని నేర్చుకొనగోరే ఎవరికైనా మనము సంతోషంగా వివరిస్తాము, తిరిగివెళ్లి, ఒప్పింపజేసే నిదర్శనాలను అందిస్తాము. (1 పేతురు 3:15) అయినా, కొందరు బైబిలు సత్యాన్ని నేర్చుకొనడానికి నిజంగా ఆసక్తికలిగివుండక పోవచ్చును.
9. మన నమ్మకాలకు సవాళ్లు ఎదురైనప్పుడు మనము ఎలా స్పందించాలి?
9 చాలామంది నిజంగా సత్యాన్ని వెదకకుండానే గంటల తరబడి, వారం వారం చర్చిస్తుంటారు. అలాంటివారు ఏదో తమకు హెబ్రీ, గ్రీకు, లేక పరిణామ సిద్ధాంత సైన్సు తెలిసినవారివలె తలస్తూ, ఇతరుల విశ్వాసాన్ని బలహీనపరచాలని చూస్తారు. అలాంటివారిని ఎదుర్కొన్నప్పుడు సాక్షులు సవాలుచేయబడినట్లు భావించుకొని వారి అబద్ధమత నమ్మకము, వేదాంతము, లేదా విజ్ఞాన సంబంధమైన తప్పువిధానంపై కేంద్రీకరిస్తూ దీర్ఘకాల సహవాసాన్ని చేస్తారు. అయితే హెబ్రీ, గ్రీకు పాఠశాలలో చదివిన మతనాయకులను వారి తర్కములలో ఓడించగలిగినను యేసు అలా చేయలేదు. యేసు అలాంటి సవాలునెదుర్కొన్నప్పుడు క్లుప్తంగా సమాధానమిచ్చి, తన అవధానమును దీనులవైపు, నిజంగా గొర్రెలైనవారివైపు మళ్లించాడు.—మత్తయి 22:41-46; 1 కొరింథీయులు 1:23–2:2.
10. కంప్యూటర్లను కలిగివున్న, ఎలక్ట్రానిక్ బులెటన్ బోర్డులను పరిశీలించగల సౌలభ్యంవున్న క్రైస్తవులు జాగ్రత్తగా ఉండుట ఎందుకు యుక్తము?
10 చెడు సహవాసానికి ఆధునిక కంప్యూటర్లు మరో మార్గాన్ని తెరచాయి. కొన్ని వాణిజ్య సంస్థలు, ఎలక్ట్రానిక్ బులెటన్ బోర్డ్స్ అనబడే వాటిలోకి అనగా కంప్యూటర్ సిస్టమ్‌లో సేకరించి పెట్టబడిన సమాచారాన్ని కంప్యూటర్, లేదా టెలిఫోను ద్వారా, ఆ బోర్డులో ఉంచబడిన సమాచారాన్ని తెలుసుకోడానికి దాని చందాదారులకు ఏర్పాటుచేశాయి. ఇది మత సంబంధ విషయాలపై కంప్యూటర్లతో చర్చలు చేసేలా అనేక మందిని నడిపింది. ఒక క్రైస్తవుడు ఆ చర్చలలో పాల్గొనాలనే కోరికను పెంచుకొనుటద్వారా బహుశా సంఘమునుండి వెలివేయబడియున్నట్టి మతభ్రష్ట తలంపులుగలవానితో అనేక గంటలు గడపవచ్చు. 2 యోహాను 9-11లో యివ్వబడిన నడిపింపు చెడు సహవాసమును విసర్జించాలని పౌలుయిచ్చిన తండ్రివంటి ఉపదేశ ప్రాముఖ్యతను చూపుతుంది.a
మోసపోకుండా చూసుకో
11. కొరింథులోని వ్యాపార పరిస్థితి ఏ అవకాశాన్ని అందించింది?
11 మనము ముందు గమనించినట్లు కొరింథు గొప్ప వ్యాపారంతో అనేక దుకాణములుగల వ్యాపార కేంద్రము. (1 కొరింథీయులు 10:25) ఇసుమియన్ ఆటలకు వచ్చే అనేకమంది గుడారాల్లో ఉండేవారు. ఆ సమయంలో వ్యాపారస్థులు సులభంగా మరోచోటుకు తరలించగల దుకాణాలను, డేరాలతో వేయబడే దుకాణములలో అమ్మేవారు. (అపొస్తలుల కార్యములు 18:1-3 పోల్చండి.) అందునుబట్టే పౌలుకు అక్కడ డేరాలను తయారుచేసే పనిదొరికింది. ఆయన తాను పనిచేసే స్థలాన్ని సువార్తను వ్యాప్తిచేసే స్థలంగా వాడుకోగలిగాడు. ప్రొఫెసరు జె. మర్ఫి ఓకానోర్ ఇలా వ్రాస్తున్నాడు: “బాగా రద్దీగానున్న మార్కెట్‌లో జనసందోహంతో తాండవమాడుతుండే వీధిలోనున్న దుకాణంనుండి, తోటిపనివారితోను, తనయొద్దకు వ్యాపారానికి వచ్చేవారితోను, బయటవున్న జనసమూహాన్ని కూడా పౌలు కలిసేవాడు. వ్యాపారం అంతా రద్దీగా జరగని సమయాల్లో ద్వారం దగ్గర నిల్చుండి వింటారని అనుకున్నవారితో ఆయన మాట్లాడేవాడు. . . . ఆయన ధైర్యసాహసాలు, దృఢ విశ్వాసము తన పొరుగువారిలో ఆయనను ఒక ‘గొప్పవ్యక్తిగా’ చేయలేదనుట ఊహించరానిది. ఏదో ఏ పనిలేకుండా ఉండే సోమరులనేగాక, నిజంగా సమాచారమును వెదకేవారిని కూడా ఇది ఆకర్షించియుంటుంది. ఆయన చెప్పేవాటిని వినడానికి వివాహమైన స్త్రీలు వారి పరిచారికలతోపాటు కొనుగోలుచేసే సాకుతో ఆయనయొద్దకు వచ్చేవారు. ఒత్తిడి సమయాల్లో, హింస లేక ఏదైనా శ్రమ కలుగుబోతుందని బెదిరించబడ్డప్పుడు వ్యాపారంలో కొనుగోలు చేసేవారిగా విశ్వాసులు ఆయనయొద్దకు వచ్చేవారు. పనిచేసే ఈ స్థలాన్నిబట్టి ఆయనకు పురపాలక అధికారులతోకూడా పరిచయముండేది.”
12, 13. మొదటి కొరింథీయులు 15:33ను ఉద్యోగ స్థలములో ఎలా యుక్తంగా అన్వయించవచ్చును?
12 అయినా, పనిచేసే స్థలంలో ప్రభావంచూపే “చెడు సహవాసమును” పౌలు గుర్తించివుంటాడు. అలాగే మనము గుర్తించాలి. ప్రత్యేకంగా కొంతమందిలో ఉండే స్వభావాన్ని గూర్చి పౌలు గుర్తింపదగిన రీతిలో ఎత్తిచూపాడు. అదేమనగా: “రేపు చనిపోదుము గనుక తిందము, త్రాగుదము” (1 కొరింథీయులు 15:32) ఆ తదుపరి వెంటనే తండ్రివంటి తన ఉపదేశముతో: “మోసపోకుడి, చెడు సహవాసము మంచి నడవడిని చెరుపును,” అనే ఉపదేశాన్నిచ్చాడు. అపాయాన్ని తెచ్చి పెట్టుటలో మనము పనిచేసే స్థలము, సంతోషాన్ని వెదకడం ఎలా సంబంధాన్ని కల్గియున్నాయి?
13 తోటిపనివారితో క్రైస్తవులు స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటారు. ఇది మంచి సాక్ష్యమివ్వడానికి ఎంత బాగా తోడ్పడుతుందో అనేక అనుభవాలు చూపుతున్నాయి. అయితే ఒక సహపనివాడు ఆ స్నేహభావానికి పెడ అర్థం తీసుకొని సరదాగా సమయాన్ని గడపడానికి రమ్మని ఆహ్వానించవచ్చును. అతను లేక ఆమె మధ్యాహ్న భోజనానికి సహజంగా లేదా పని అయిపోయిన తర్వాత కొంచెము సేపు ఆగండి కొంత పుచ్చుకుని వెళ్దురుగాని (మత్తుపానీయము), లేక వారాంతములో వినోద కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించవచ్చు. ఈ వ్యక్తి దయగలవానిగా, లేక పరిశుభ్ర ప్రవర్తనగలవానిగా కనిపించవచ్చును. ఆహ్వానము కూడా నిష్కల్మషమైనదిగా అగపడవచ్చును. అయినా పౌలు: “మోసపోకుడి” అని సలహా ఇస్తున్నాడు.
14. సహవాసముల మూలంగా కొందరు క్రైస్తవులు ఎలా తప్పుదారి పట్టించబడ్డారు?
14 కొందరు క్రైస్తవులు క్రమక్రమంగా తమతోటి పనివారితో సహవసించే విషయంలో అలసత్వపు స్వభావాన్ని పెంచుకుంటారు. బహుశా అది ఆటపైనా లేక మరొక సరదాపైనా ఇద్దరికివున్న సాధారణ ఆసక్తినిబట్టి కావచ్చు. లేదా ఉద్యోగ స్థలములో క్రైస్తవుడుకాని ఒక వ్యక్తి చాలా దయగలవానిగా, లేక ఎంతో ఆలోచనాపరునిగా ఉన్నందున అది అట్టి వ్యక్తితో ఎక్కువ సమయాన్ని గడపడానికి, చివరకు సంఘములోని వారికంటెను ఎక్కువగా ఆ వ్యక్తితో సహవాసాన్ని ఎన్నుకోడానికి నడపవచ్చును. చివరకి ఆ సహవాసము ఒక కూటానికి తప్పిపోయేలా చేయవచ్చు. రాత్రి బాగా పొద్దుపోయేంతవరకు సమయముగడిపి మరుసటి రోజు ఉదయము ప్రాంతీయ పరిచర్య క్రమమును తప్పిపోయేలా చేసేది కావచ్చును. అది సాధారణంగా క్రైస్తవుడు చూసేందుకు తృణీకరించే సినిమా, లేక వీడియో చూడడానికి దారితీయవచ్చును. ‘అబ్బే, అలాంటిది నా కెన్నడూ జరగదు,’ అని మనమనుకోవచ్చు. అయితే తప్పిపోయినవారిలో ఎక్కువ మంది మొదట అలా స్పందించిన వారైయుండవచ్చును. ‘మనకై మనము పౌలు ఉపదేశమును అన్వయించుకొనుటకు నేనెంతటి దృఢ తీర్మానముచేసికొని వున్నాను’ అని మనకై మనము ప్రశ్నించుకొనవలసి యున్నాము.
15. మన పొరుగువారియెడల ఎటువంటి సమతూక దృక్పథాన్ని మనము కలిగియుండాలి?
15 ఉద్యోగ స్థల సంబంధంగా మనము పరిశీలించినదంతా కూడా మనము పొరుగువారితో సహవాసముచేసే విషయంలోనూ అన్వయిస్తుంది. పురాతన కొరింథులోవున్న క్రైస్తవులకు నిశ్చయంగా పొరుగువారున్నారు. కొన్ని సమాజాలలో బాగా స్నేహంగా ఉంటూ, పొరుగువారికి మంచి మద్దతునివ్వడం చాలా సాధారణంగా ఉంటుంది. ఒంటరిగా ఉండే గ్రామ ప్రాంతాల్లో పొరుగువారు ఒకరిపై మరొకరు ఆధారపడి వుండవచ్చు. కొన్ని సంస్కృతులలో కుటుంబ బంధాలు చాలా దృఢంగా ఉంటూ, అనేక మార్లు భోజనానికి ఆహ్వానించే విధానముంటుంది. నిశ్చయంగా యేసు చూపినట్లు సమతూకమైన దృక్పథము ప్రాముఖ్యము. (లూకా 8:20, 21; యోహాను 2:12) మనము మన పొరుగువారితో, బంధువులతో వ్యవహరించేటప్పుడు గతంలో క్రైస్తవులము కానప్పుడు వారితో ప్రవర్తించినట్లే ఇప్పుడునూ ప్రవర్తించ మనస్సుచూపుతామా? బదులుగా, ఇప్పుడు అలాంటి వ్యవహారములను మనఃపూర్వకంగా పునఃపరిశీలించుకొని వాటికి ఏ యే పరిధులు యుక్తమైనవో పరిశీలించుకోవద్దా?
16. మత్తయి 13:3, 4లోని యేసు మాటలను ఎలా అర్థంచేసుకోవాలి?
16 యేసు ఒకసారి రాజ్యమును గూర్చిన వాక్యమును ‘త్రోవ ప్రక్కను విత్తనములు పడగా, పక్షులు వాటిని మింగివేసినట్లు’ పోల్చెను. (మత్తయి 13:3, 4, 19) ఆ కాలంలో త్రోవప్రక్కన ఉన్న నేల మనుష్యులు అటుఇటు నడవడం వలన బాగా గట్టిపడివుండేది. అనేకమంది ప్రజల విషయములోను అలాగే ఉంది. వారి జీవితములు పొరుగువారితో, బంధువులతో, వచ్చిపోయే అనేకమంది ఇతరులతో నిండిపోయి తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందునుబట్టి వారి హృదయాలనే నేల త్రొక్కబడి, సత్య విత్తనములు వేరు పారలేనంత గట్టిగా తయారవుతుంది. ఇప్పటికే క్రైస్తవుడైయున్న వాని విషయంలోను అలాంటి కఠిన స్థితి సంభవించగలదు.
17. పొరుగువారితో ఇతరులతో మన సహవాసము ఎలా మనపై ప్రభావం చూపగలదు?
17 లోకసంబంధులైన కొందరు పొరుగువారు, బంధువులు స్నేహపూర్వకంగాను, సహాయకరంగాను ఉండవచ్చును కాని ఎంతకాలమైనా ఆత్మీయ విషయాలపైన ఆసక్తినేగాని, నీతియెడల ప్రేమనేగాని చూపరు. (మార్కు 10:21, 22; 2 కొరింథీయులు 6:14) మనము క్రైస్తవులమయ్యామంటే దానిభావము మనము స్నేహపూర్వకంగా ఉండమని, పొరుగువారిని పట్టించుకోమని కాదు. ఇతరులపట్ల మనము నిజమైన శ్రద్ధ చూపాలని యేసు మనకు ఉపదేశించాడు. (లూకా 10:29-37) అయితే సహవాసముల విషయంలో జాగ్రత్తగా ఉండాలను పౌలు ఉపదేశం కూడా అదేరీతిలో ప్రేరేపితమైంది, అవసరమైంది కూడా. మొదటి ఉపదేశాన్ని అన్వయించుకొనేకొలది, తరువాత దానిని మరచిపోకూడదు. ఈ రెండు సూత్రములను మనము మనస్సున పెట్టుకొనకపోతే, మన నడవడి ప్రభావితం చెందగలదు. నిజాయితీ, కైసరు చట్టాలకు లోబడివుండే విషయంలో నీ అలవాట్లు, నీ పొరుగువారు, నీ బంధువుల అలవాట్లతో ఎలాంటి పోలికను కలిగివున్నవి? ఉదాహరణకు పన్ను చెల్లించే సమయంలో ఆదాయమును తక్కువగా చూపడం లేక వ్యాపార లాభాన్ని తక్కువుగా చూపడం వారికి సమర్థనీయం, మనుగడ సాగించాలంటే అవి అవసరమైనవని కూడా భావించబడుతుంది. వారు తమ అభిప్రాయాలను కాఫీ త్రాగుతున్నప్పుడు, లేదా ఎప్పుడైనా అలా మిమ్మును సందర్శించినప్పుడు మిమ్మును ఒప్పించేలా మీతో మాట్లాడవచ్చును. అది మీ ఆలోచనలపై, మీ నిజాయితీపర నడవడిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? (మార్కు 12:17; రోమీయులు 12:2) “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.”
యౌవనమునకు సంబంధించిన నడవడి కూడా
18. మొదటి కొరింథీయులు 15:33 యౌవనులకు కూడా ఎందుకు అన్వయిస్తుంది?
18 సహజంగా యౌవనులు వారు చూసేదాన్నిబట్టి, వినేదాన్నిబట్టి ప్రభావితం చెందుతుంటారు. తమ తల్లిదండ్రుల, తోటివయస్కుల అభినయాలను లేక వారికి అలవాటైన కొన్ని పద్ధతులను అనుసరించే పిల్లలను మీరు గమనించలేదా? అందుచేత పిల్లలు వారితో ఆటలాడే పిల్లలనుబట్టి, లేక తోటి విద్యార్థులనుబట్టి ప్రభావితం చెందుతారంటే దానికి మనము ఆశ్చర్యపడనవసరంలేదు. (మత్తయి 11:16, 17 పోల్చండి.) మీ కుమార్తేగాని కుమారుడేగాని తమ తల్లిదండ్రులను గూర్చి అగౌరవంగా మాట్లాడే యౌవనులతో వుంటుంటే అది మీ పిల్లలపై ప్రభావం చూపదని ఎందుకు అనుకోవాలి? ఇతర యౌవనులు దుర్భాషలాడటం వింటూవుంటే పరిస్థితి ఏమిటి? వారి తోటివయస్కులు ఓ కొత్త మోడల్ షూస్, ఫ్యాషన్‌గల ఆభరణాలను చూసి మురిసిపోతుంటే అప్పుడు సంగతేమిటి? యౌవన క్రైస్తవులు అటువంటి ప్రభావానికి లొంగక అభేద్యంగా ఉంటారను కోవాలా? మొదటి కొరింథీయులు 15:33లోనిది కొంత వయస్సువారికే అన్వయిస్తుందని పౌలు చెప్పాడా?
19. తమ పిల్లలలో ఎటువంటి దృక్పథాన్ని నాటడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి?
19 మీరు తండ్రి లేక తల్లియైవుంటే మీరు మీ పిల్లలతో తర్కించి నిర్ణయాలను తీసుకునేటప్పుడు, ఆ ఉపదేశ విషయంలో మీరు శ్రద్ధకలిగి ఉంటారా? అలాగని పొరుగువారిలోను, పాఠశాలలోను మీ పిల్లల చుట్టువుండే ఇతర యౌవనులంతా మంచివారు కాదని మీరు భావించడం లేదని మీరు వారికి తెలియజేస్తే ఎంతో సహాయకరంగా ఉంటుంది. మీ పొరుగువారిలో, బంధువుల్లో, తోటి ఉద్యోగస్థుల్లో ఎలా కొందరు మంచివారుంటారో అలాగే వారిలో కొందరు మంచివారు, మర్యాదస్థులు ఉండవచ్చు. మీ పిల్లలు దీనిని గుర్తించేలాచేసి పౌలు కొరింథీయులకు తండ్రివలె ఇచ్చిన జ్ఞానయుక్త సలహాను అన్వయించుకొనడంలో మీరు సమతుల్యతను కలిగియున్నారని గుర్తించేలా సహాయపడండి. మీరు సంగతులను సమతూకం చేయడాన్ని వారు వివేచించేకొలది, వారు నిన్ను అనుకరించడానికది సహాయపడుతుంది.—లూకా 6:40; 2 తిమోతి 2:22.
20. యౌవనులారా, మీరు ఏ సవాలునెదుర్కొంటారు?
20 ఇంకనూ యౌవనులుగా వున్నవారు కూడా పౌలుయిచ్చిన ఈ సలహా యౌవనులకేగాని, వృద్ధులకేగాని క్రైస్తవులందరికి ప్రాముఖ్యమని గుర్తించి దానిని ఎలా అన్వయించుకోవాలో గ్రహించేందుకు కృషిచెయ్యాలి. ఇది సవాలు పూర్వకమైందే గాని, ఆ సవాలు నెదుర్కొనడానికి సంసిద్ధత చూపవచ్చును కదా? కొంతమంది యౌవనులను మీరు చిన్నప్పటినుండి ఎరుగుదురు గనుక, క్రైస్తవులుగా మీరు రూపొందించుకున్న మీ మంచి నడవడిని పాడుచేసే ప్రభావం వారు చూపలేరని తలంచవద్దు.—సామెతలు 2:1, 10-15.
మన నడవడిని కాపాడుకొనేందుకు క్రియాత్మక చర్యలు
21. (ఎ) సహవాసం విషయంలో మనందరికి ఏ అవసరత ఉంది? (బి) కొన్ని సహవాసాలు అపాయకరమైనవని మనమెందుకు నిశ్చయంగా చెప్పవచ్చును?
21 మనందరికి సహవాసము అవసరము. అయినా మన సహవాసులు మంచికేగాని లేక చెడుకేగాని మనపై ప్రభావం చూపగలరనే వాస్తవం విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. శతాబ్దాల కాలంగా, ఆదాము మొదలుకొని ప్రతివారి విషయంలోను అది వాస్తవమని తేలింది. ఉదాహరణకు, యూదా దేశానికి మంచి రాజైన యెహోషాపాతు, యెహోవా అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని అనుభవించాడు. అయితే యెహోషాపాతు తన కుమారున్ని ఇశ్రాయేలు రాజైన ఆహాబు కుమార్తెను వివాహం చేసుకొనడానికి అనుమతించడం ద్వారా, యెహోషాపాతు ఆహాబుతో సాంగత్యం చేయడం ప్రారంభించాడు. ఆ చెడ్డసహవాసము యెహోషాపాతుకు దాదాపు ప్రాణాంతకంగా తయారయ్యింది. (2 రాజులు 8:16-18; 2 దినవృత్తాంతములు 18:1-3, 29-31) మన సహవాసముల విషయంలో మనము అజ్ఞానయుక్తమైన ఎంపికచేసుకొంటే, అది అపాయకరమే.
22. దేనిని మనము హృదయానికి తీసుకోవలెను, ఎందుకు?
22 కాబట్టి 1 కొరింథీయులు 15:33లో పౌలు యిచ్చిన ప్రేమగల ఉపదేశాన్ని మన హృదయంలోకి తీసుకొందాము. అవి మనమేదో తరచుగా విన్న మాటలే కాదు. మనము పదేపదే జ్ఞాపకం తెచ్చుకోగలవి. అవి కొరింథు సంఘములోని సహోదర, సహోదరీలయెడల అలాగే మనయెడలను పౌలు కలిగియున్న తండ్రివంటి అనురాగాన్ని అవి వ్యక్తపరచేవి. నిశ్చయంగా అవి మన పరలోకపు తండ్రి మనకు అందించేవే. ఎందుకనగా, మన ప్రయత్నంలో విజయం పొందాలని ఆయన కాంక్షిస్తున్నాడు.—1 కొరింథీయులు 15:58.
[అధస్సూచీలు]
a అటువంటి బులెటిన్ బోర్డులతోనున్న మరొక శోధన ఏమంటే దానిలోని కార్యక్రమమును లేదా ప్రచురణను దాని అసలు రచయితల, లేక స్వంతదారుల అనుమతి లేకుండా తమ స్వంత కంప్యూటర్‌లోకి కాపీచేసుకోవడం. అది అంతర్జాతీయ కాపీరైట్ చట్టాన్ని వ్యతిరేకించేదై యుంటుంది.—రోమీయులు 13:1.
మీరు జ్ఞాపకం చేసుకొంటారా?
◻ ఏ ప్రత్యేక కారణాన్నిబట్టి పౌలు 1 కొరింథీయులు 15:33 వ్రాశాడు?
◻ పౌలు ఉపదేశాన్ని పనిచేసే స్థలంలో మనం ఎలా అన్వయించగలము?
◻ పొరుగువారి విషయంలో ఎటువంటి సమతూక దృక్పథాన్ని మనము కలిగివుండాలి?
◻ మొదటి కొరింథీయులు 15:33లోని ఉపదేశం ప్రత్యేకంగా యౌవనులకు ఎందుకు యుక్తమైయుంది?
[17వ పేజీలోని చిత్రం]
పౌలు తాను పనిచేసే స్థలాన్ని సువార్త వ్యాప్తిజేయడానికై ఉపయోగించాడు
[18వ పేజీలోని చిత్రం]
ఇతర యౌవనులు నీ క్రైస్తవ నడవడిని పాడుచేయగలరు