కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 7/1 పేజీలు 13-18
  • ‘మృతులు లేపబడుదురు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘మృతులు లేపబడుదురు’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పునరుత్థానంపై యేసు వెలుగును ప్రసరింపజేయడం
  • పునరుత్థాన నిరీక్షణను సమర్థించడం
  • పునరుత్థానమందు విశ్వాసం అత్యావశ్యకం
  • పునరుత్థాన నిరీక్షణ శక్తివంతమైనది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • పునరుత్థాన నిరీక్షణ తప్పకుండా నిజమౌతుంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • పునరుత్థానం—మీ మీద ప్రభావం చూపించే బోధ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • దేవుని మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 7/1 పేజీలు 13-18

‘మృతులు లేపబడుదురు’

“బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.”—1 కొరింథీయులు 15:51.

1, 2. (ఎ) ప్రవక్తయైన హోషేయ ద్వారా ఏ ఓదార్పుకరమైన వాగ్దానం ఇవ్వబడింది? (బి) మృతులను తిరిగి జీవానికి తేవడానికి దేవుడు సుముఖత కల్గివున్నాడని మనకెలా తెలుస్తుంది?

మీరెప్పుడైనా మీరు ప్రేమించిన వ్యక్తిని మరణంలో కోల్పోయారా? అయితే మరణం తీసుకురాగల వేదన గురించి మీకు తెలిసేవుంటుంది. అయినప్పటికీ, దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా ఇచ్చిన ఈ వాగ్దానంలో క్రైస్తవులు ఓదార్పును పొందుతారు: “పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును; మృత్యువునుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?”—హొషేయ 13:14.

2 మృతులు తిరిగి సజీవులవ్వడమన్న తలంపు సంశయవాదులకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కాని అలాంటి అద్భుతాన్ని చేసే శక్తి సర్వశక్తిమంతుడైన దేవునికి తప్పకుండా ఉంది! అయితే ఇమిడివున్న అంశం ఏమిటంటే, మృతులను తిరిగి జీవానికి తేవడానికి యెహోవా సుముఖత కల్గివున్నాడా అన్నదే. నీతిమంతుడైన యోబు ఇలా ప్రశ్నించాడు: “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?” ఆ తర్వాత ఆయన, ఓదార్పునిచ్చే ఈ జవాబునిచ్చాడు: “నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.” (యోబు 14:14, 15) “ఇష్టము కలుగును” అనే పదబంధం తీవ్రమైన ఆకాంక్షను లేక కోరికను సూచిస్తుంది. (పోల్చండి కీర్తన 84:2.) అవును, యెహోవా పునరుత్థానం చేయడానికి ఆతురతగా ఎదురు చూస్తున్నాడు—తన జ్ఞాపకంలో సజీవంగా ఉన్న మృతులైన విశ్వాసులను మళ్లీ ఒకసారి చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు.—మత్తయి 22:31, 32.

పునరుత్థానంపై యేసు వెలుగును ప్రసరింపజేయడం

3, 4. (ఎ) పునరుత్థాన నిరీక్షణపై యేసు ఏ వెలుగును ప్రసరింపజేశాడు? (బి) యేసు మానవునిగా కాకుండా పరలోక వ్యక్తిగా ఎందుకు లేపబడ్డాడు?

3 యోబు వంటి ప్రాచీన కాలంనాటి నమ్మకమైనవారికి పునరుత్థానాన్ని గూర్చి పాక్షికమైన అవగాహన మాత్రమే ఉండేది. ఈ అద్భుతమైన నిరీక్షణపై పూర్తి వెలుగును ప్రసరింపజేసింది యేసుక్రీస్తే. “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు” అని చెప్పినప్పుడు ఆయన తాను నిర్వహించే కీలకమైన పాత్రను చూపించాడు. (యోహాను 3:36) ఆ జీవితాన్ని ఎక్కడ ఆనందించవచ్చు? విశ్వాసాన్నుంచే అత్యధికులకు, అది ఈ భూమిపైనే. (కీర్తన 37:11) అయితే, యేసు తన శిష్యులకిలా చెప్పాడు: “చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” (లూకా 12:32) దేవుని రాజ్యం పరలోక సంబంధమైనది గనుక, ‘చిన్న మంద’ మహిమగల ప్రాణులుగా పరలోకంలో యేసుతోపాటు ఉండాలనేదే ఈ వాగ్దాన భావం. (యోహాను 14:2, 3; 1 పేతురు 1:3, 4) ఎంత మహిమాన్విత ఉత్తరాపేక్షో గదా! ఈ ‘చిన్నమంద’ సంఖ్య కేవలం 1,44,000 అయ్యుంటుందని ఆ తర్వాత ఆయన అపొస్తలుడైన యోహానుకు బయల్పరిచాడు.—ప్రకటన 14:1.

4 అయితే, 1,44,000 మంది పరలోక మహిమలోకి ఎలా ప్రవేశిస్తారు? యేసు ‘జీవాన్నీ అక్షయతనూ సువార్తవలన వెలుగులోనికి తెచ్చాడు.’ ఆయన తన రక్తం ద్వారా, పరలోకంలోకి ‘నూతనమైన, జీవముగల మార్గాన్ని’ తెరిచాడు. (2 తిమోతి 1:9; హెబ్రీయులు 10:19, 20) మొదటిగా ఆయన, బైబిల్లో ప్రవచించబడిన రీతిగానే మరణించాడు. (యెషయా 53:12) ఆ తర్వాత, అపొస్తలుడైన పేతురు ప్రకటించినట్లుగా, “ఈ యేసును దేవుడు లేపెను.” (అపొస్తలుల కార్యములు 2:32) అయితే యేసు మానవునిగా లేపబడలేదు. ఆయనిలా చెప్పాడు: “నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే.” (యోహాను 6:50) ఆయన శరీరాన్ని వెనక్కు తీసుకోవడం ఆ బలిని నిరర్థకం చేస్తుంది. కాబట్టి యేసు, ‘శరీరవిషయములో చంపబడి, ఆత్మవిషయములో బ్రదికింపబడ్డాడు.’ (1 పేతురు 3:18) అలా యేసు ‘మన కోసం’ అంటే ‘చిన్నమంద’ కోసం ‘నిత్యమైన విమోచన సంపాదించాడు.’ (హెబ్రీయులు 9:11, పరిశుద్ధ బైబిల్‌) ఆయన తన పరిపూర్ణ మానవ జీవిత విలువను పాపులైన మానవజాతి కొరకు దేవునికి అర్పించాడు, దీని నుండి ప్రయోజనాన్ని పొందాల్సిన వాళ్లలో మొదటివారు 1,44,000 మందియై ఉన్నారు.

5. యేసు మొదటి శతాబ్దపు అనుచరులకు ఏ నిరీక్షణ ఇవ్వబడింది?

5 పరలోకానికి పునరుత్థానం చేయబడేది కేవలం యేసు మాత్రమే కాదు. పౌలు రోములోని తోటి క్రైస్తవులతో వాళ్లు దేవుని కుమారులుగా ఉండడానికి పరిశుద్ధాత్మచే అభిషేకించబడ్డారనీ, అంతం వరకు సహించడం ద్వారా తమ అభిషేకాన్ని నిశ్చయపర్చుకున్నట్లయితే క్రీస్తుతోటి వారసులుగా ఉంటారనీ చెప్పాడు. (రోమీయులు 8:16, 17) “ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము” అని కూడా పౌలు వివరించాడు.—రోమీయులు 6:5.

పునరుత్థాన నిరీక్షణను సమర్థించడం

6. కొరింథులో పునరుత్థాన నమ్మకం ఎందుకు దాడికి గురయ్యింది, అపొస్తలుడైన పౌలు ఎలా ప్రతిస్పందించాడు?

6 పునరుత్థానం, క్రైస్తవత్వపు “మూలోపదేశము”లో ఒక భాగమైవుంది. (హెబ్రీయులు 6:1, 2) అయినప్పటికీ, ఆ ఉపదేశం కొరింథులో దాడికి గురయ్యింది. ఆ సంఘంలోని కొందరు గ్రీకు తత్త్వానికి ప్రభావితులయ్యారని రుజువవుతుంది, వాళ్లు “మృతుల పునరుత్థానము లేదని” చెబుతున్నారు. (1 కొరింథీయులు 15:12) దీన్ని గురించిన నివేదికలు అపొస్తలుడైన పౌలుకు చేరినప్పుడు, ఆయన పునరుత్థాన నిరీక్షణను, ప్రాముఖ్యంగా అభిషిక్త క్రైస్తవులకు సంబంధించిన పునరుత్థాన నిరీక్షణను సమర్థించాడు. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలో వ్రాయబడివున్న పౌలు మాటలను మనం పరిశీలిద్దాము. గత శీర్షికలో సిఫారసు చేయబడినట్లుగా, మీరు ఆ మొత్తం అధ్యాయాన్ని చదవడం సహాయకరంగా ఉన్నట్టు కనుగొంటారు.

7. (ఎ) పౌలు కీలకమైన ఏ వివాదాంశంపై కేంద్రీకరించాడు? (బి) పునరుత్థానుడైన యేసును ఎవరు చూశారు?

7 మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలోని మొదటి రెండు వచనాల్లో, పౌలు తన చర్చకు ముఖ్యాంశాన్నిలా పొందుపరుస్తున్నాడు: “సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, . . . మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.” కొరింథీయులు సువార్తయందు నిలిచియుండడంలో విఫలమైతే, వారు సత్యాన్ని అంగీకరించడం వ్యర్థమే. పౌలు ఇలా కొనసాగించాడు: “నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచి యున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలుల కందరికిని కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను.”—1 కొరింథీయులు 15:3-8.

8, 9. (ఎ) పునరుత్థానమందలి నమ్మకం ఎంత ప్రాముఖ్యమైనది? (బి) “ఐదువందల కంటే ఎక్కువైన సహోదరులకు” యేసు ఏ సందర్భంలో కన్పించి ఉండవచ్చు?

8 సువార్తను అంగీకరించినవారికి, పునరుత్థానమందు నమ్మకముంచడమన్నది ఐచ్ఛిక (ఎంపికచేసుకొనే) విషయం కాదు. “క్రీస్తు మన పాపములనిమిత్తము మృతి” పొంది, తిరిగి లేపబడ్డాడనేదాన్ని ధృవీకరించడానికి అనేకమంది ప్రత్యక్ష సాక్షులున్నారు. వారిలో ఒకరు కేఫా, లేక పేతురు. ఆయన ఆ పేరుతోనే అందరికీ సుపరిచితుడు. యేసు అప్పగించబడి నిర్బంధించబడిన రాత్రి పేతురు ఆయనను ఎరుగనని చెప్పిన తర్వాత, యేసు ఆయనకు కన్పించినప్పుడు ఆయన ఎంతగానో ఓదార్పు పొందివుండవచ్చు. “పండ్రెండు” మంది అపొస్తలుల గుంపును కూడా పునరుత్థానుడైన యేసు దర్శించాడు—ఆ అనుభవం వారు తమ భయాన్ని అధిగమించి, యేసు పునరుత్థానం గురించి ధైర్యంగా సాక్ష్యమిచ్చేలా వారికి సహాయం చేసిందనడంలో సందేహం లేదు.—యోహాను 20:19-23; అపొస్తలుల కార్యములు 2:32.

9 “ఐదువందలకు ఎక్కువైన సహోదరుల” పెద్ద గుంపుకు కూడా క్రీస్తు కన్పించాడు. గలిలయలోనే ఆయనకు అంత పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు గనుక, బహుశా అది శిష్యులను చేయమని యేసు ఆజ్ఞాపించిన మత్తయి 28:16-20 నందు వర్ణించబడిన సందర్భమై ఉండవచ్చు. ఈ వ్యక్తులు ఎంత శక్తివంతమైన సాక్ష్యాన్ని ఇవ్వగలిగారో కదా! సా.శ. 55లో పౌలు కొరింథీయులకు ఈ మొదటి పత్రికను కూర్చే సమయానికి కొందరు ఇంకా సజీవంగానే ఉన్నారు. అయితే, అప్పటికే మరణించిన వారిని “నిద్రించి[న]” వ్యక్తులని తెలియజేయడాన్ని గమనించండి. తమ పరలోక ప్రతిఫలాన్ని పొందడానికి అప్పటికింకా వాళ్లు పునరుత్థానం చేయబడలేదు.

10. (ఎ) యేసు తన శిష్యులతో చివరిసారి కలవడం ఏ ప్రభావాన్ని చూపింది? (బి) “అకాలమందు పుట్టినట్లున్న” పౌలుకు యేసు ఎలా కన్పించాడు?

10 యేసు పునరుత్థానానికి మరో విశేషమైన సాక్షి యాకోబు. ఈయన యోసేపు, యేసు తల్లియైన మరియల కుమారుడు. పునరుత్థానానికి ముందు, యాకోబు విశ్వాసి కాదని స్పష్టమౌతుంది. (యోహాను 7:5) కానీ యేసు తనకు కనిపించిన తర్వాతనే, యాకోబు విశ్వాసియై తన ఇతర సహోదరులను మార్చడంలో ఒక పాత్ర నిర్వహించివుండవచ్చు. (అపొస్తలుల కార్యములు 1:13, 14) తాను పరలోకానికి ఆరోహణమౌతున్న సందర్భంలో తన శిష్యులను చివరిసారి కలిసికొన్నప్పుడు, యేసు వాళ్లను “భూదిగంతముల వరకు . . . సాక్షులై” ఉండమని ఆజ్ఞాపించాడు. (అపొస్తలుల కార్యములు 1:6-11) ఆ తర్వాత, ఆయన క్రైస్తవులను హింసిస్తున్న తార్సువాడైన సౌలుకు కన్పించాడు. (అపొస్తలుల కార్యములు 22:6-8) “అకాలమందు పుట్టినట్టున్న” సౌలుకు యేసు కనబడ్డాడు. ఇది, అభిషిక్తుల పునరుత్థానం జరగడానికి అనేక శతాబ్దాల ముందే సౌలు పరలోక జీవితానికి పునరుత్థానుడై, మహిమాన్వితుడైన ప్రభువును చూడగలిగినట్టుగా ఉంది. క్రైస్తవ సంఘాన్ని ఘోరంగా వ్యతిరేకిస్తున్న సౌలు చర్యను ఈ అనుభవం అర్థాంతరంగా ఆపి, ఆయనలో విశేషమైన మార్పును తీసుకువచ్చింది. (అపొస్తలుల కార్యములు 9:3-9, 17-19) సౌలు అపొస్తలుడైన పౌలై, క్రైస్తవ విశ్వాసాన్ని సమర్థించిన అగ్రగణ్యుల్లో ఒకడయ్యాడు.—1 కొరింథీయులు 15:9, 10.

పునరుత్థానమందు విశ్వాసం అత్యావశ్యకం

11. ‘పునరుత్థానం లేదు’ అని అనడంలో ఉన్న కుతర్కాన్ని పౌలు ఎలా బయల్పర్చాడు?

11 కాబట్టి యేసు పునరుత్థానమవ్వడం, ధృవీకరించబడిన వాస్తవమైవుంది. “క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?” అని పౌలు వాదిస్తున్నాడు. (1 కొరింథీయులు 15:12) అలాంటి వారికి పునరుత్థానం గురించి వ్యక్తిగతమైన సందేహాలు లేక ప్రశ్నలు ఉండడమే గాక, వారు దానియందు అపనమ్మకాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి పౌలు వారి తర్కంలోని కుతర్కాన్ని బయల్పరుస్తున్నాడు. క్రీస్తు లేపబడనట్లైతే, క్రైస్తవ సందేశం ఒక అబద్ధమౌతుందనీ, క్రీస్తు పునరుత్థానానికి సాక్షులైన వారు “దేవుని విషయమై అబద్ధపు సాక్షు”లౌతారనీ ఆయన అంటున్నాడు. క్రీస్తు లేపబడనట్లైతే, దేవునికి విమోచనా క్రయధనం చెల్లించబడనట్లే; క్రైస్తవులు ‘ఇంకను తమ పాపములలోనే యున్నారు.’ (1 కొరింథీయులు 15:13-19; రోమీయులు 3:23, 24; హెబ్రీయులు 9:11-14) కొన్ని సందర్భాల్లో హతసాక్షులుగా ‘నిద్రించిన’ క్రైస్తవులు, నిజమైన నిరీక్షణ లేకుండా నాశనమైనట్లే. క్రైస్తవులు ఎదురుచూడగలిగేది ఈ జీవితమే అయితే వాళ్లు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నట్టో గదా! వాళ్ల శ్రమలన్నీ అర్థరహితమైనవై పోతాయి.

12. (ఎ) క్రీస్తును “నిద్రించినవారిలో ప్రథమఫలము” అని పిలవడంలో ఏమి సూచించబడింది? (బి) పునరుత్థానాన్ని యేసు ఎలా సాధ్యం చేశాడు?

12 అయితే, విషయం అది కాదు. పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు: “క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.” అంతేగాక, ఆయన “నిద్రించినవారిలో ప్రథమఫలముగా” ఉన్నాడు. (1 కొరింథీయులు 15:20) ఇశ్రాయేలీయులు తమ పంటలో నుండి ప్రథమ ఫలములను విధేయతతో యెహోవాకు ఇచ్చినప్పుడు, యెహోవా వారిని మరింత సమృద్ధికరమైన పంటలతో ఆశీర్వదించాడు. (నిర్గమకాండము 22:29, 30; 23:19; సామెతలు 3:9, 10) క్రీస్తును “ప్రథమఫలము” అని పిలువడం ద్వారా పౌలు, మరణం నుండి పరలోక జీవితానికి లేపబడే వ్యక్తుల మరో కోత ఉంటుందని సూచిస్తున్నాడు. “మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు” అని పౌలు చెబుతున్నాడు. (1 కొరింథీయులు 15:21, 22) యేసు తన పరిపూర్ణ మానవ జీవితాన్ని విమోచన క్రయధనంగా ఇవ్వడం ద్వారా పునరుత్థానాన్ని సాధ్యంచేసి, పాపమరణాల దాసత్వం నుండి మానవజాతి విడుదల పొందడానికి మార్గాన్ని తెరిచాడు.—గలతీయులు 1:4; 1 పేతురు 1:18, 19.a

13. (ఎ) పరలోక పునరుత్థానం ఎప్పుడు జరిగింది? (బి) కొంతమంది అభిషిక్తులు ‘నిద్రించరు’ అన్నది ఎలా సాధ్యమౌతుంది?

13 పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు: “ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.” (1 కొరింథీయులు 15:23) సా.శ. 33లో క్రీస్తు పునరుత్థానం చేయబడ్డాడు. అయితే, ఆయన అభిషిక్త అనుచరులు అంటే “ఆయనవారు,” యేసు తన రాజరిక ప్రత్యక్షతను ప్రారంభించిన కొంతకాలం వరకు వేచి ఉండవలసి వచ్చింది, ఆయన రాజరిక ప్రత్యక్షత 1914లో ప్రారంభమైందని బైబిలు ప్రవచనం చూపిస్తుంది. (1 థెస్సలొనీకయులు 4:14-16; ప్రకటన 11:18) ఆ ప్రత్యక్షత సమయంలో సజీవంగా ఉండే వారి మాటేమిటి? పౌలు ఇలా చెబుతున్నాడు: “ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.” (1 కొరింథీయులు 15:51, 52) స్పష్టంగా, అభిషిక్తులందరూ పునరుత్థానం కోసం ఎదురు చూస్తూ సమాధిలో నిద్రించరు. క్రీస్తు ప్రత్యక్షత సమయంలో మరణించేవారు తక్షణమే మార్పు చెందుతారు.—ప్రకటన 14:13.

14. అభిషిక్తులు, “మృతులై ఉండుటకు” ఎలా బాప్తిస్మం పొందారు?

14 “ఇట్లు కానియెడల మృతులకొరకై [“మృతులై ఉండుటకు,” NW] బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు [“మృతులై ఉండుటకు,” NW] వారు బాప్తిస్మము పొందనేల? మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేల?” (1 కొరింథీయులు 15:29, 30) కొన్ని బైబిలు అనువాదాలు చూపిస్తున్నట్లుగా, జీవించివున్న వ్యక్తులు మృతుల కొరకు బాప్తిస్మం తీసుకున్నారని పౌలు ఉద్దేశించడం లేదు. అసలు, బాప్తిస్మం క్రైస్తవ శిష్యరికానికి సంబంధించినది, మృతులు శిష్యులై ఉండలేరు. (యోహాను 4:1) బదులుగా, పౌలు జీవించివున్న క్రైస్తవుల గురించి చర్చిస్తున్నాడు, వారిలో అనేకులు, పౌలు వలె “గడియగడియకు ప్రాణభయముతో” ఉన్నారు. అభిషిక్త క్రైస్తవులు ‘క్రీస్తు మరణంలోకి బాప్తిస్మము పొందారు.’ (రోమీయులు 6:3) వారు తాము అభిషేకించబడినప్పటి నుండి, అలంకారికంగా చెప్పాలంటే క్రీస్తు పొందిన మరణంవంటి మరణానికి నడిపించే విధానంలోకి ‘బాప్తిస్మము పొందారు.’ (మార్కు 10:35-40) వాళ్లు మహిమాన్విత పరలోక పునరుత్థాన నిరీక్షణతో మరణిస్తారు.—1 కొరింథీయులు 6:14; ఫిలిప్పీయులు 3:10, 11.

15. పౌలు ఏ ప్రాణభయాలను ఎదుర్కున్నాడు, వాటిని సహించడంలో పునరుత్థానమందలి విశ్వాసం ఎలా ఒక పాత్రను నిర్వహిస్తుంది?

15 “నేను దినదినమును చనిపోవుచున్నాను” అని చెప్పగలిగేంత మేరకు తాను ప్రాణభయాన్ని ఎదుర్కున్నానని పౌలు ఇప్పుడు వివరిస్తున్నాడు. మరీ అతిశయోక్తిగా చెబుతున్నాడని కొందరు తనను నిందించకుండేలా, “సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు” అని పౌలు జతచేస్తున్నాడు. తాను ఎదుర్కొన్న ప్రమాదాలకు ఒక ఉదాహరణగా, 32వ వచనంలో పౌలు ‘ఎఫెసులో మృగములతో పోరాడడం గురించి’ మాట్లాడుతున్నాడు. రోమన్లు నేరస్థులను తరచు ఆంఫి థియేటర్లలో క్రూరజంతువులకు వేయడం ద్వారా వారిని శిక్షించేవారు. పౌలు అక్షరార్థమైన క్రూరజంతువులతో పోరాడడాన్ని సహించాడంటే, యెహోవా సహాయంతో మాత్రమే ఆయన తప్పించుకుని జీవించగలిగాడు. పునరుత్థాన నిరీక్షణ లేకుండా, అలాంటి ప్రాణభయానికి ఆయనను గురి చేసిన జీవిత విధానాన్ని ఆయన ఎంపిక చేసుకోవడం వాస్తవానికి వెర్రి సాహసం అయ్యుండేది. భవిష్యద్‌ జీవితాన్ని గూర్చిన నిరీక్షణ లేకుండా, దేవుని సేవ చేయడంలో వచ్చే కష్టాలను సహించడమూ, దాని కోసం త్యాగాలను చేయడమూ అర్థరహితమైనదౌతుంది. పౌలు ఇలా చెబుతున్నాడు: “మృతులు లేపబడనియెడల—రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.”—1 కొరింథీయులు 15:31, 32; 2 కొరింథీయులు 1:8, 9; 11:23-27 చూడండి.

16. (ఎ) “రేపు చనిపోదుము గనుక తిందము, త్రాగుదము” అనే పదబంధం ఎక్కడి నుండి వచ్చివుండవచ్చు? (బి) ఈ అభిప్రాయాన్ని హత్తుకోవడంలోగల ప్రమాదాలేమిటి?

16 అవిధేయులైన యెరూషలేము నివాసుల ప్రాణాంతకమైన దృక్పథాన్ని వర్ణించే యెషయా 22:13ను పౌలు ఎత్తివ్రాసి ఉండవచ్చు. లేదా మరణానంతర జీవితాన్ని గూర్చిన ఏ నిరీక్షణనైనా ఏవగించుకుంటూ శారీరక ఆనందమే జీవితంలోని ప్రాథమిక ప్రయోజనమని నమ్మే ఎపికూరీయుల నమ్మకాలు ఆయన మనస్సులో ఉండివుండవచ్చు. ఏదేమైనప్పటికీ, “తిందము త్రాగుదము” అనే తత్త్వం భక్తిహీనమైనది. అందుకే, పౌలు ఇలా హెచ్చరిస్తున్నాడు: “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” (1 కొరింథీయులు 15:33) పునరుత్థానాన్ని నిరాకరించే వారితో సహవసించడం విషతుల్యం కాగలదు. కొరింథు సంఘంలో పౌలు వ్యవహరించవలసి వచ్చిన సమస్యల్లో అంటే లైంగిక దుర్నీతి, విభజనలు, విభేదాలు, ప్రభురాత్రి భోజనం పట్ల అగౌరవాన్ని చూపించడం వంటి సమస్యల్లో అలాంటి సహవాసం ఒక పాత్రను నిర్వహించివుండవచ్చు.—1 కొరింథీయులు 1:11; 5:1; 6:1; 11:20-22.

17. (ఎ) పౌలు కొరింథీయులకు ఏ ఉద్బోధను చేశాడు? (బి) ఏ ప్రశ్నలకు సమాధానం రావలసి ఉంది?

17 అందుకే పౌలు కొరింథీయులకు ఈ అనుకూల ఉద్బోధను చేస్తున్నాడు: “నీతి ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై యట్లు చెప్పుచున్నాను.” (1 కొరింథీయులు 15:34) పునరుత్థానాన్ని గూర్చిన ప్రతికూల దృక్పథం కొందరిని త్రాగుబోతుల్లా, ఆధ్యాత్మిక మత్తులోకి పడవేసింది. వాళ్లు మేల్కొని జాగరూకులై ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే అభిషిక్త క్రైస్తవులు నేడు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండి, ప్రపంచపు సంశయ దృక్కోణాలచే ప్రభావితం కాకుండా ఉండాలి. పరలోక పునరుత్థానాన్ని గూర్చిన తమ నిరీక్షణను వాళ్లు గట్టిగా అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు కొరింథీయులకూ ఇంకా ప్రశ్నలు ఉన్నాయి, ఇప్పుడు మనకూ ఇంకా ప్రశ్నలున్నాయి. ఉదాహరణకు, 1,44,000 మంది ఏ రూపంలో పరలోకానికి లేపబడతారు? ఇప్పటికీ సమాధుల్లో ఉన్న, పరలోక నిరీక్షణలేని కోట్లాదిమంది ఇతరుల సంగతేమిటి? అలాంటి వారికి పునరుత్థాన భావమేమై ఉంటుంది? మా తదుపరి శీర్షికలో, పునరుత్థానాన్ని గూర్చిన పౌలు మిగతా చర్చను మనం పరిశీలిద్దాము.

[అధస్సూచి]

a విమోచన క్రయధనాన్ని గూర్చిన చర్చ కొరకు కావలికోట 1991 ఫిబ్రవరి 15 (ఆంగ్లం) సంచికను చూడండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

◻ పునరుత్థానంపై యేసు ఏ వెలుగును ప్రసరింపజేశాడు?

◻ క్రీస్తు పునరుత్థానానికి సాక్షులుగా ఉన్న కొందరు ఎవరు?

◻ పునరుత్థాన సిద్ధాంతం ఎందుకు సవాలు చేయబడింది, పౌలు ప్రతిస్పందన ఏమిటి?

◻ అభిషిక్త క్రైస్తవులకు పునరుత్థానంలో విశ్వాసం ఎందుకు అత్యావశ్యకము?

[26వ పేజీలోని చిత్రం]

యాయీరు కుమార్తె పునరుత్థానం సాధ్యమనడానికి నిదర్శనమయ్యింది

[16, 17వ పేజీలోని చిత్రం]

పునరుత్థాన నిరీక్షణ లేకుండా, నమ్మకమైన క్రైస్తవుల మరణం అర్థరహితమైనదై ఉండేది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి