పేరాశ ఉరిని తప్పించుకొనడంలో విజయం పొందండి
“ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను . . . పడుదురు.”—1 తిమోతి 6:9.
1. ఉరుల విషయంలో మనము ఎందుకు జాగ్రత్త వహించాలి?
“ఉరి” అనే మాట వినగానే స్వేచ్ఛగా వచ్చే జంతువును పట్టుకోడానికి వేటగాడు వేసే ఉచ్చు గుర్తుకొస్తుంది. అయితే, దేవుడు మాత్రము మనకు అతి అపాయకరమైన ఉరులనుగూర్చి తెలియజేస్తున్నాడు. అవి అక్షరార్థ ఉచ్చులు కావు. అవి మనలను ఆత్మీయంగా నైతికంగా పడవేసేవి. అలాంటి ఉరులను బిగించుటలో అపవాది ఎంతో నేర్పుగలవాడు.—2 కొరింథీయులు 2:11; 2 తిమోతి 2:24-26.
2. (ఎ) అపాయకరమైన ఉరులను తప్పించుకోడానికి యెహోవా మనకెలా సహాయం చేస్తాడు? (బి) ప్రస్తుతం ఏ ప్రత్యేకమైన ఉరి మన అవధానానికి తేబడుతుంది?
2 సాతానుయొక్క అనేక, విభిన్న ఉరులలో కొన్నింటిని గుర్తించడం ద్వారా యెహోవా మనకు సహాయం చేస్తున్నాడు. ఉదాహరణకు మనము అజ్ఞానంగా, కరుకుగా లేక మనము అలా మాట్లాడ కూడని వాటిని గూర్చి మాట్లాడితే మన పెదవులు లేక నోరే మనకు ఉరికాగలదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. (సామెతలు 18:7; 20:25) కోపచిత్తులతో సహవాసము ఎలా ఉరి అవుతుందో, అలాగే గర్వముకూడా ఉరి కావచ్చును. (సామెతలు 22:24, 25; 29:25) కాని, మరొక ఉరిని పరిశీలిద్దాము: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.” (1 తిమోతి 6:9) ఆ ఉరికి మూలము, లేక దానికి కారణం క్లుప్తంగా “పేరాశ” అని చెప్పవచ్చును. ఈ పేరాశ ధనవంతులం కావాలనుకొనే నిర్ణయంలో కనిపిస్తున్నను, అనేక రీతులలో ఈ పేరాశ నిజంగా ఉరియే.
అపాయంగూర్చి యెహోవా మనల హెచ్చరిస్తున్నాడు
3, 4. ప్రాచీన మానవ చరిత్ర పేరాశ విషయంలో మనకు ఏ పాఠాన్ని కలిగివుంది?
3 ముఖ్యంగా పేరాశ అనేది డబ్బుయెడలేగాని లేదా వస్తుసంపద, అధికారము, లైంగిక విషయం మొదలగు వేటియెడలనైనా అసాధారణమైన, అమితమైన కోరిక కలిగివుండటము. ఈ పేరాశయనే ఉరిచే అపాయములోకి లాగబడేందుకు మనమే మొదటివాళ్లము కాదు. పూర్వము ఏదెను వనంలో హవ్వను, తదుపరి ఆదామును ఈ పేరాశ ఉరిలో పడవేసింది. హవ్వ భర్త ఆమెకంటె జీవితంలో ఎంతో అనుభవం గలవాడై యెహోవాచేత వ్యక్తిగతంగా బోధించబడ్డాడు. దేవుడు వారికి పరదైసు గృహము నిచ్చాడు. కలుషితంలేని భూమిపై పండించిన సమృద్ధియైన పలురకాల మంచి ఆహారాన్ని వారు అనుభవించవచ్చును. వారికి పరిపూర్ణమైన పిల్లలు పుట్టేవారు. వారును వీరితోపాటు జీవిస్తూ దేవున్ని నిరంతరము సేవించగలిగేవారు. (ఆదికాండము 1:27-31; 2:15) ఏ మానవున్నైనా తృప్తిపరచడానికి అది సరిపోదా?
4 అయినా, ఒకనికి కావలసినంత ఉన్నంత మాత్రాన అది అతని పేరాశ ఉరిలో పడకుండా ఆపదు. హవ్వ దేవునిలా ఉండాలని, ఇంకా ఎక్కువ స్వాతంత్ర్యముతో తనమట్టుకు తానే తన స్వంత ప్రమాణాలను ఏర్పారచుకోవాలనే ఉరిలో పడింది. ఆదాము కూడా ఏదిఏమైనా పర్వాలేదుగాని, అందమైన తన భార్య సహవాసము మాత్రము తెగిపోకూడదనుకున్నాడు. పేరాశ ఇలా ఈ పరిపూర్ణమైన మానవులనే తన ఉరిలో వేసుకుంటే, అది మనకు కూడా ఎందుకు అపాయకరము కాగలదో నీవు గుణగ్రహించగలవు.
5. మనం పేరాశ ఉరిని విసర్జించుట ఎంత ప్రాముఖ్యము?
5 మనము పేరాశ ఉరిలో పడకుండా మనలను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకనగా పౌలు మనల్ని ఇలా హెచ్చరిస్తున్నాడు: “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను, విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను (పేరాశపరులు) . . . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” (1 కొరింథీయులు 6:9, 10) పౌలు ఇంకా ఇలా చెప్పాడు: “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని (పేరాశ) వీటి పేరైనను ఎత్తకూడదు.” (ఎఫెసీయులు 5:3) కాబట్టి అసంపూర్ణమైన మన శరీరాన్ని తృప్తిపర్చుకొనుటకు ఈ పేరాశ అనేది మన సంభాషణ అంశమైనా కాకూడదు.
6, 7. (ఎ) పేరాశ ఎంత బలముగలదై యుంటుందో చూపే బైబిలు మాదిరులు ఏవి? (బి) ఆ మాదిరులు మనకెందుకు హెచ్చరికగా ఉండాలి?
6 ఈ పేరాశయొక్క అపాయమునుగూర్చి మనలను హెచ్చరించే అనేక మాదిరులను యెహోవా లిఖించియుంచాడు. ఆకాను పేరాశను మనస్సుకు తెచ్చుకోండి. యెరికోను నాశనము చెయ్యాలిగాని దాని బంగారము, వెండి, ఇత్తడి, ఇనుమును మాత్రము ఆయన ధనాగారములో ఉంచాలని దేవుడు తెలియజేసెను. ఆకాను మొదట ఆ మాటను గైకొనాలని తలంచివుండవచ్చునుగాని, తరువాత పేరాశ అతనిని ఉరిలో బంధించింది. యెరికోలో ప్రవేశించగానే, ఆయనేదో వస్తువులను కొనడానికని దుకాణానికి వెళ్లినట్లు అందమైన ఒక వస్త్రమును తనకు బాగా నచ్చినదాన్ని ఇతర వస్తువులను ఆశ్చర్యంతో తిలకించాడు. కొన్ని వేల డాలర్ల విలువచేసే బంగారమును, వెండిని చేతపట్టి ‘ఆహా! ఎంత భాగ్యము! ఊరకనే దొరుకుతుంది, దొంగిలించడం వంటిదే’ అని అనుకొనియుండవచ్చు. కచ్చితంగా అది దొంగిలించడమే దేనినైతే నాశనం చేయాలో లేక దేవునికి అప్పగించాలో దాన్నే దేవునినుండి దొంగిలించి పేరాశను ప్రదర్శించగా అది ఆకాను ప్రాణాన్నే బలిగొంది. (యెహోషువ 6:17-19; 7:20-26) అలాగే గేహజి, యూదా ఇస్కరియోతుల మాదిరులను కూడా పరిశీలించండి.—2 రాజులు 5:8-27; యోహాను 6:64; 12:2-6.
7 పైన చెప్పబడిన ముగ్గురు యెహోవా ప్రమాణాలు ఎరుగని అన్యులు కాదని మనము గుర్తించాలి. యెహోవాకు సమర్పించుకొన్న సంబంధమందు వారున్నారు. వాళ్లందరూ, దేవుని శక్తి ప్రదర్శించే అద్భుతాలను చూచి, ఆయన అనుగ్రహములో నిలిచి యుండాల్సిన ప్రాముఖ్యతను చవిచూచినవారే. అయినా పేరాశ అనే ఉరి వారిని పతనముచేసింది. అలాగే మనముకూడా ఏవిధమైన పేరాశనైనా మనలను దాని వలలో వేసికొనేలాగున అనుమతిస్తే మనము కూడా దేవునితోగల మన సంబంధాన్ని నాశనము చేసుకుంటాము. ఏ విధమైనా లేక ఎటువంటి పేరాశ మనకు అపాయకరము కాగలదు?
ఐశ్వర్యము లేక వస్తుసంపదల పేరాశలో చిక్కుబడుట
8. ధనము విషయంలో బైబిలు ఏ హెచ్చరికనిస్తుంది?
8 ధనముయెడల, ఐశ్వర్యముయెడల ప్రేమను పెంచుకునే విషయంలో చాలావరకు ఎక్కువమంది క్రైస్తవులు బైబిలిచ్చే స్పష్టమైన హెచ్చరికలను విన్నారు. మత్తయి 6:24-33; లూకా 12:13-21; 1 తిమోతి 6:9, 10లందుండే కొన్నింటిని ఎందుకు పునఃసమీక్షించకూడదు? బహుశా మీరు ఈ ఉపదేశమును అంగీకరిస్తూ, అనుసరిస్తున్నామని భావించవచ్చును, అయితే ఆకాను, గేహజి, యూదా కూడా మేము దానికి ఒప్పుకుంటాము అని చెప్పివుండరా? మనము మనస్సుతో ఏకీభవించే దానికంటే ఇంకా ఎక్కువ చేయవలసివున్నాము. ఆ ధనము లేక వస్తుసంపద యెడలగల పేరాశ మన అనుదిన జీవితములపై ప్రభావం చూపకుండా మనము జాగ్రత్తపడాలి.
9. దుకాణములకు వెళ్లి కొనుగొలుచేసే విషయంలో మన స్వభావాన్ని ఎందుకు పరిశీలించుకోవాలి?
9 మన అనుదిన జీవితంలో తరచు మనము—ఆహారం, వస్త్రములు, గృహానికి కావలసిన ఇతర సామాగ్రి కొనవలసివుంటుంది. (ఆదికాండము 42:1-3; 2 రాజులు 12:11, 12; సామెతలు 31:14, 16; లూకా 9:13; 17:28; 22:36) అయితే వ్యాపార రంగం, మనము ఎక్కువ తీసుకోవాలని, క్రొత్తవాటిని తీసుకోవాలని ప్రేరేపిస్తుంది. వార్తాపత్రికలలో, పత్రికలలో, టి.వి. తెరలపై, మనలను ఈ పేరాశకు ప్రేరేపించే కపట వ్యాపార ప్రకటనలు కనిపిస్తుంటాయి. అలాంటి వ్యాపార ప్రకటనలు దుకాణముల ముందు బ్లౌజులు, కోటులు, ఇతర దుస్తులు, చలికి వేసుకొనే దుస్తులు, క్రొత్తక్రొత్త చెప్పులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమేరాలను ఆకర్షణీయంగా పెట్టి ప్రదర్శిస్తారు. క్రైస్తవులు వీటి విషయంలో తమ్మునుతాము ఇలా ప్రశ్నించుకొనవచ్చు, ‘నా జీవితంలో అలా షాపులకెళ్లి, కొనుగోలుచేయడం ముఖ్యానందంగా లేదా ప్రధానాంశంగా ఉంటుందా?’ ‘నేను చూసే కొత్తవస్తువులు నిజంగా నాకు అవసరమా లేక కేవలం వ్యాపారరంగం నాలో పేరాశ విత్తనాలు నాటి ఫలింపచేస్తుందా?’—1 యోహాను 2:16.
10. పేరాశయొక్క ఏ ఉరి ప్రత్యేకంగా పురుషులకు అపాయకరమైనది?
10 షాపుకు వెళ్లి కొనుగోలు చేయడం స్త్రీలకున్న సాధారణ ఉరియైతే, చాలామంది పురుషులకు ఎక్కువ డబ్బు సంపాదించడం ఉరియైయుంది. అప్పటికే మంచి ఆదాయమున్నా మరలా ‘తన కొట్లు విప్పి, వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొందును’ అనుకొన్న ధనవంతుని విషయంలో యేసు ఈ ఉరిని వివరించాడు. అందుకే యేసు స్పష్టంగా ఈ అపాయమును చూపిస్తూ: “మీరు ఏ విధమైన లోభమునకు (పేరాశ) ఎడమియ్యక జాగ్రత్తపడుడి” అని తెలిపెను. (లూకా 12:15-21) మనము ధనవంతులమైనా కాకపోయిన మనకు ఆ ఉపదేశము అవసరము.
11. ఎక్కువ డబ్బుకొరకైన పేరాశలో ఒక క్రైస్తవుడు ఎలా చిక్కుకొనగలడు?
11 ధనముయెడల లేక ధనము కొనగలిగిన వాటియెడల కలిగే పేరాశ తరచు రహస్యముగా పెరిగేదైయుండవచ్చును. అది బహుశా త్వరగా ధనవంతులయ్యే స్కీము ద్వారా పొందేదో, లేక జీవితకాలములో ఒకసారి తెగించి పెట్టుబడిపెట్టితే గొప్ప ఆర్థిక భద్రతనిచ్చేదో కావచ్చును. లేదా ఒకరు సందేహాస్పదమైన లేక చట్టవిరుద్ధమైన వ్యాపార అలవాట్లద్వారా డబ్బు కూడగట్టాలని శోధించబడవచ్చును. అవును పేరాశకు సంబంధించిన ఆశ ఆధిపత్యం వహించేదై, ఉరివంటిది కాగలదు. (కీర్తన 62:10; సామెతలు 11:1; 20:10) క్రైస్తవ సంఘములోని కొందరు నమ్మకమైన తమ సహోదరులే వారికి వినియోగదారులౌతారని వ్యాపారం ప్రారంభించారు. అయితే వారి ధ్యేయము ‘కష్టించి చేతులతో మంచి పనిచేయుటద్వారా’ అవసరమైన దానిని ఉత్పత్తి చేయడంగాక, తమతోటి క్రైస్తవులను అడ్డంపెట్టుకొని తొందరగా డబ్బు సంపాదించాలనుకుంటే, వారు పేరాశతో ప్రవరిస్తున్నవారే అవుతారు. (ఎఫెసీయులు 4:28; సామెతలు 20:21; 31:17-19, 24; 2 థెస్సలొనీకయులు 3:8-12) డబ్బుయెడలగల పేరాశ కొందరు లాటరీలలో ఇతర జూదములలో పాల్గొనేలా చేసింది. కొంతమంది సానుభూతి, సహేతుకతను మరచి, తొందరపాటుతో పెద్ద మొత్తాలను పొందవచ్చనే ఆశతో కేసుల పరిష్కారానికి న్యాయస్థానాలకు వెళ్లారు.
12. ధనముకొరకైన పేరాశను మనము అధికమించగలమని మనకెందుకు తెలుసు?
12 మనలో ఏమైనా పేరాశ (లోభత్వం) పనిచేస్తుందేమోనని మనము యథార్థముగా పరిశీలించుకొనవలసిన రంగాలు ముందు చర్చించబడ్డాయి. అలా ఉన్నా మార్పు చేసుకోవచ్చును. జక్కయ్య మారాడని జ్ఞాపకముంచుకొనుము. (లూకా 19:1-10) ఎవరైనా తనలో ధనముకొరకేగాని, వస్తుసంపదకొరకేగాని పేరాశ ఉన్నదని కనుగొంటే, ఆ ఉరిలోనుండి తప్పించుకొనుటకు అతను జక్కయ్యలాంటి తీర్మానము చేసుకోవాలి.—యిర్మీయా 17:9.
జీవిత ఇతర రంగాలలో పేరాశ
13. కీర్తన 10:18 పేరాశయొక్క ఏ ఇతర ఉరిని మనదృష్టికి తెస్తుంది?
13 కొందరు ఇతర విషయాలలో ఈ పేరాశను గుర్తించేదానికంటే సులభంగా ఈ అపాయమును ధనము లేదా వస్తుసంపదలో చూడగలరు. ఒక గ్రీకు డిక్షనరీ “పేరాశ” లేక “లోభత్వము”నకు ఉపయోగించబడిన పదముల సముదాయము, “అధికారము మొదలగువాటికి, వస్తుసంపదకు సంబంధించి ‘ఎక్కువ ఆశించే’ దాన్ని సూచిస్తుంది.” ఔను, ఇతరులపై మన అధికారాన్ని చూపాలను కోరికతో, బహుశా మన అధికారము క్రింద వారు వణకిపోవాలనే పేరాశ ఉరిలోకూడా మనము పడవచ్చును.—కీర్తన 10:18.
14. ఏ యే రంగాలలో అధికారముకొరకైన పేరాశ అపాయకరము కాగలదు?
14 పూర్వ కాలం నుండి కూడా అసంపూర్ణ మానవులు ఇతరులపై అధికారము చెలాయించడాన్నిబట్టి ఆనందించారు. మానవ పాపమువలనకల్గే ఒక దుష్ఫలిత మూలంగా అనేకమంది భర్తలు తమ భార్యలను “ఏలు”దురని దేవుడు ముందుగానే ప్రవచించాడు. (ఆదికాండము 3:16) ఏమైనా, ఇలాంటి వైఫల్యము వివాహ పరిధిని మించిపోయింది. వేల సంవత్సరముల తర్వాత, బైబిలు రచయితలలో ఒకరు, “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు” అని గుర్తించాడు. (ప్రసంగి 8:9) రాజకీయాలలో, సైనికపర విషయాలలో అది ఎంతమేరకు వాస్తవమైయుందో మీరెరిగియుండవచ్చును, కాని మనము ప్రభావంచూపగల మన స్వంత పరిధిలో ఎక్కువ వ్యక్తిగత అధికారం కొరకు, ఆధిపత్యంకొరకు మనము పోరాడుతున్నామా?
15, 16. ఏ యే విధాలలో ఎక్కువ అధికారం కొరకైన పేరాశ ఉరిలో ఒక క్రైస్తవుడు చిక్కుకొనవచ్చును? (ఫిలిప్పీయులు 2:3)
15 మనందరము—మన స్వంత కుటుంబములో, లేక విస్తృతమైన కుటుంబములో, లౌకిక ఉద్యోగ స్థలాల్లో లేక పాఠశాలలో, స్నేహితులమధ్య సంఘములోను ఇతర మానవులతో సంబంధము కలిగివుంటాము. అప్పుడప్పుడు లేక తరచు ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేదాన్ని నిర్ణయించడంలో మనకు కొంత అధికారము, పాత్ర వుండవచ్చును. అందులో చెడుగాని, తప్పుగాని లేదు. అయితే మనము కలిగివున్న ఆ అధికారాన్ని అమితముగా వినియోగించడంలో మనము ఆనందాన్ని పొందుతామా? లోకసంబంధులైన మేనేజర్లు, లేక అధికారులు తాము ఏమిచేసినా ప్రశ్నించకుండా అవునంటే అవునంటూ తమపైవారి అధికార దాహాన్ని (పేరాశ) సవాలుచేయని మనుష్యులను తమచుట్టూ పెట్టుకొనడం ద్వారా ఈ స్వభావాన్ని కనపరుస్తుంటారు.
16 మనతోటి క్రైస్తవులతో వ్యవహరించేటప్పుడు మనము తప్పించుకొనవలసిన మరొక ఉరి ఇది. యేసు ఇలా చెప్పాడు: “అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను.” (మత్తయి 20:25, 26) క్రైస్తవ పెద్దలు వారిలో ఒకరితో ఒకరు వ్యవహరించేటప్పుడు, పరిచారకులతో, మందలోని ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఈ విధమైన దీనత్వమును వారు ప్రదర్శించాలి. ఒక సంఘ అధ్యక్షుడు తనతోటి ఇతర పెద్దలను చిన్నచిన్న విషయాలకొరకు సంప్రదిస్తూ, ప్రముఖమైన తీర్మానాలన్నింటిని ఆయన తనకైతానే చేస్తూ, అధికార దాహాన్ని ప్రదర్శించే వాడవుతాడా? పనులను ఇతరులకు అప్పగించడానికి ఆయన నిజంగా ఇష్టంగలవాడై యున్నాడా? ప్రాంతీయ సేవ కొరకైన కూటములను నిర్వహించే పరిచారకుడు కారణసహితంగా కాకుండా తన ఏర్పాట్లను పాటించాలని పట్టుబడుతూ, గట్టిగా కోరుతూ, లేక నియమాలు సృష్టిస్తుంటే సమస్యలుత్పన్నం కాగలవు.—1 కొరింథీయులు 4:21; 9:18; 2 కొరింథీయులు 10:8; 13:10; 1 థెస్సలొనీకయులు 2:6, 7.
17. పేరాశ ఉరినిగూర్చి చర్చించేటప్పుడు ఆహారాన్నిగూర్చి కూడా తలంచడం ఎందుకు సబబైయుంది?
17 అనేకులను పేరాశ తన వలలో వేసుకొన్న మరొక విషయమేమంటే ఆహారము. నిజమే తిని, త్రాగడంలో ఆనందం పొందటమనేది సహజం. దానిని బైబిలు అంగీకరిస్తుంది. (ప్రసంగి 5:18) అయినా, ఈ విషయంలో కోరికను కొంతకాలంవరకు పెంచుకొని, సహేతుకంగా ఎంతైతే ఆనందదాయకమో లేక సరిపోతుందో దానిని మించి అమితంగా వెళ్లడం సర్వసాధారణమైంది. దేవుని సేవకులు ఈ విషయంలోను జాగ్రత్తవహించవలసిన అవసరతలేకుంటే యెహోవా వాక్యము సామెతలు 23:20లో: “ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము” అని ఎందుకు చెబుతుంది? అయినా, ఈ ఉరిని మనము ఎలా తప్పించుకోగలము?
18. ఆహారము, పానీయ విషయములో ఏ స్వయం పరీక్ష మనము చేసుకొనవచ్చును?
18 తన ప్రజలు ఆహార విషయములో నిష్టకలిగి నియమనిషిద్ధ జీవితమును గడపాలని దేవుడు సూచించడం లేదు. (ప్రసంగి 2:24, 25) అలాగని ఆహార పానీయాలే మన పథకాలలో, సంభాషణల్లో ప్రముఖ పాత్రగా చేయడాన్ని ఆయన అంగీకరించడం లేదు. మనలను మనము ఇలా ప్రశ్నించుకోవచ్చును, “నేనెప్పుడో భోంచేసినదాన్ని, లేక చేయబోయే భోజనాన్ని ప్రస్తావించినపుడు దాని విషయంలో అమితంగా ఉల్లసించి నోట్లోనీళ్లూరేంతగా మురిసిపోతున్నానా?’ ‘నేనెప్పుడు నా సంభాషణలో ఆహారం, పానీయాన్ని ప్రస్తావిస్తున్నానా?’ ఇంకో సూచిక ఏమంటే, మనము వండని, లేక డబ్బు చెల్లించని భోజన విషయంలో ఎలా స్పందిస్తున్నాము, బహుశా ఇతరుల ఇండ్లకు అతిథిగా ఆహ్వానించబడినప్పుడు, లేక క్రైస్తవ సమావేశములలో ఆహారము పొందేటప్పుడు అనేది. అలాంటి సమయాల్లో మనము మామూలుగా భోంచేసే దానికంటె ఎక్కువ తినడానికి మొగ్గు చూపుతున్నామా? ఆహారానికి అనవసరమైన ప్రాధాన్యతనిచ్చి, శాశ్వత హాని తెచ్చుకొన్న ఏశావును మనము గుర్తు తెచ్చుకుందాము.—హెబ్రీయులు 12:16.
19. లైంగికానందం విషయములో పేరాశ ఎలా సమస్య కాగలదు?
19 మరొక ఉరినిగూర్చి పౌలు మనకు వివేకమునందిస్తున్నాడు: “మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.” (ఎఫెసీయులు 4:17-19; 5:3) లైంగిక ఆనందము విషయములోకూడా పేరాశ కలగడం వాస్తవమే. ఈ ఆనందమును వ్యక్తపర్చుకొనుటకు వివాహ పరిధి మాత్రమే తగినది. ఈ అనుభూతిలో కలుగు సన్నిహిత అనురాగము వివాహమైన అనేక సంవత్సరముల తర్వాతకూడా వారు ఒకరికొరకు ఒకరు అర్పించుకొని భార్యా భర్తలుగా జీవించుటలో ఒక పాత్ర వహిస్తుంది. అయినా, ఈ నాటి లోకం దానికి అధిక ప్రాధాన్యత నిస్తుందనడాన్ని ఎక్కువమంది కాదనలేరు. పౌలు ప్రస్తావించిన లోభత్వానికి ప్రతిబింబంగా ఉండే దీనిని, సర్వసామాన్యమైనదానిగా ఎంచుతున్నారు. లైంగికానుభూతినిగూర్చిన చెడు దృక్పథము ప్రత్యేకంగా ఈనాడు సినిమాలు, వీడియోలు, పత్రికలు, వినోదస్థలాల్లో సహజమైన అవినీతి, నగ్నత్వమును తిలకించేవారిచే సులభంగా స్వీకరించబడుతుంది.
20. లైంగిక విషయాలకు సంబంధించిన పేరాశ అపాయమునుగూర్చి క్రైస్తవులు ఎలా జాగ్రత్తను ప్రదర్శించగలరు?
20 బత్షెబాతో దావీదు జరిగించిన పాపపు వృత్తాంతము దేవుని సేవకులలో ఒకరైనవారును ఈ లైంగిక పేరాశ ఉరిలో పడగలరని చూపుతుంది. తన వివాహ పరిధిలో ఈ ఆనందాన్ని అనుభవించే స్వాతంత్ర్యం దావీదుకున్నప్పటికీ, ఆయన అక్రమ లైంగిక కోరిక వృద్ధయ్యేలా చేసుకున్నాడు. ఊరియా భార్య అందానికి ఆకర్షితుడై, ఆమెతో అక్రమ ఆనందాన్ని అనుభవించాలనే తన తలంపులకు, కార్యానికి కళ్లెము వేయలేదు. (2 సమూయేలు 11:2-4; యాకోబు 1:14, 15) నిశ్చయంగా మనము ఇటువంటి పేరాశను విసర్జించాలి. చివరకు వివాహ బంధంలోకూడా ఈ పేరాశను విసర్జించుట యుక్తమైనది. దీనిలో విపరీతమైన లైంగిక అలవాట్లను విసర్జించడం కూడా చేరికైయుంది. ఈ రంగములో పేరాశను విసర్జించగోరే భర్త, ఆయన జతయందు నిజంగా శ్రద్ధచూపించేవాడై యుంటాడు. అందుచేత కుటుంబ నియంత్రణ విషయంలో వారిరువురు తీసుకొనే నిర్ణయమునుబట్టి, భార్య ప్రస్తుత లేక భవిష్యత్తు ఆరోగ్యానికంటే అతడు తన ఆనందానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడు.—ఫిలిప్పీయులు 2:4.
పేరాశను విసర్జించు నిశ్చయతతో కొనసాగండి
21. పేరాశనుగూర్చిన మన చర్చ ఎందుకు మనలను నిరుత్సాహపరచకూడదు?
21 హెచ్చరికలను, లేక ముందుజాగ్రత్త సూచనలను యెహోవా అపనమ్మకముచేత ఇవ్వడం లేదు. తన సమర్పిత సేవకులు ఆయనను యథార్థంగా సేవించాలని కోరుకుంటున్నారని, వారిలో ఎక్కువ మంది అలా చేయుటలో కొనసాగుదురని ఆయనకు నమ్మకముంది. ఆయన యోబునుగూర్చి సాతానుతో పలికిన మాటలవంటివాటినే ఒక మొత్తంగా తన ప్రజలను గూర్చి పలుకగల్గును: “నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు.” (యోబు 1:8) మనము మచ్చలేనివారమై ఆయనకు నమ్మకముగా నుండటంలో కొనసాగాలనే కోరికతోనే, నమ్మకముంచేట్టి, మన ప్రేమగల పరలోకపు తండ్రి పేరాశకు సంబంధించిన వివిధ అపాయపు ఉరులనుగూర్చి మనలను మేల్కొల్పుతున్నాడు.
22. మనము చేసిన ఈ పఠనము ఏ రీతిలోనైనా మనలోని పేరాశ బలహీనతను బహిర్గతంచేస్తే, మనము ఏమి చేయాలి?
22 వీటిలో ఏదో విధమైన పేరాశ స్వభావమును మనలో ప్రతిఒక్కరము కలిగియున్నాము మరియు ఈ దుష్టలోకపు ప్రభావంక్రింద దానిని పెంచుకొనియుండొచ్చు కూడా. ఈ పేరాశనుగూర్చిన మన పఠనములో—ధనమునుగూర్చో లేక వస్తుసంపద, అధికారము, ఆహారము, లేక లైంగికానందము మొదలగువాటిలో బలహీనతను కలిగివున్న రంగాన్ని గమనించినట్లయిన విషయమేమి? అట్లయిన యేసు యిచ్చిన ఈ సలహాను హృదయానికి, మదిలోనికి తీసుకోండి: “నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు.” (మార్కు 9:43) నీ స్వభావంలో, లేక ఆసక్తిలో అవసరమైన మార్పు చేసుకో. మరణకరమగు ఉరియైన పేరాశను విసర్జించు. అలా, దేవుని సహాయముతో “నిత్యజీవములో ప్రవేశించ” గలవు.
నేనేమి నేర్చుకున్నాను?
◻ పేరాశ ఉరి విషయంలో మనమెందుకు శ్రద్ధ కలిగివుండాలి?
◻ ధనము, వస్తుసంపదను గూర్చి పేరాశ మనలను ఏయే విధాలుగా ఉరిలో వేసుకొనవచ్చును?
◻ ఇతర రంగాలలో పేరాశ మనకు నిజంగా ఎలా అపాయకరము కాగలదు?
◻ పేరాశసంబంధమైన ఏ బలహీనతయైన మనలో కనబడితే దానియెడల మన స్వభావము ఏమై ఉండాలి?