రాజ్యప్రచారకుల నివేదిక
రైలు ప్రయాణంలో ఆసక్తిగల ఓ యువకుడు సత్యాన్ని నేర్చుకొనుట
ఒకని హృదయం నీతివైపు మొగ్గితే అపుడు యెహోవా దేవుడు, క్రీస్తు యేసును పరలోక దూతలను ఉపయోగించుకొని అటువంటి గొర్రెలాంటి వ్యక్తిని రాజ్యసువార్త ద్వారా కలుసుకునే ఏర్పాటు చేస్తాడు. యుక్తకాలంలో ఆ వ్యక్తి యేసు కుడివైపునవుండే అనుగ్రహ పక్షానికి రావచ్చును. (మత్తయి 25:31-33) ఆస్ట్రియాలో రైలు ప్రయాణంలో ఆసక్తిగల ఓ యువకుడు అసాధారణరీతిలో సత్యాన్ని తెలుసుకున్నాడు.
ఈ కుర్రవాని సరదాలోకెల్లా అత్యంత ఉల్లాసకరమైందేమంటే రైల్వే అధికారుల అనుమతితో రైల్ ఇంజన్ క్యాబిన్లో కూర్చుని ప్రయాణిస్తూ వుండడమే. ప్రతి ప్రయాణాన్ని తన వీడియో కెమేరాతో చిత్రించి, ఇంటిదగ్గర వాటిని మరల చూసేవాడు. వియన్నా నుండి శాల్స్బర్గ్ మధ్య తాను ప్రయాణించినపుడు తానెక్కిన రైలును ఒక యెహోవాసాక్షి నడిపాడు. ఆయనకు రైలు ప్రయాణమందు ఆసక్తిగల యీ యువకునితో రాజ్యాన్ని గూర్చి మాట్లాడే అవకాశం దొరికింది. మొదట్లో ఒక రైలు డ్రైవర్ దేవున్ని గూర్చి, బైబిలును గూర్చి మాట్లాడటం విని యీ యువకుడు ఆశ్చర్యపోయాడు, అయితే ప్రయాణంలో ఇతడు ఆ దృశ్యాల మీదనే ధ్యానముంచాడుగానీ యీ రైలు డ్రైవర్ చెప్పేదాన్ని అంతగా పట్టించుకోలేదు.
ఇంట్లో ఇతడు తన వీడియోను ఒకసారి కాదు పదిసార్లు చూశాడు, ఎందుకంటే యీ ప్రయాణం తనకెంతగానో ఇష్టమయ్యింది. అతడు శబ్దాన్ని కూడ రికార్డ్ చేసినందువల్ల యెహోవాసాక్షి చెప్పిన దాన్ని కూడ మాటి మాటికి వినేవాడు. వీడియో ఎంత ఎక్కువగా చూస్తే అంత ఎక్కువగా తాను వినిన సమాచారం తెలుసుకునేవాడు. ఇప్పుడు అతను ఆ విషయాన్ని గూర్చి ఆలోచించ నారంభించాడు, చివరకు బైబిలు నందు తెలుపబడిన అద్భుత సమాచారం ఎడల తనకు ఆసక్తికల్గింది. అతడింకా అధికంగా తెలుసుకొనగోరాడు.
అతనికి రైలు డ్రైవర్ పేరు జ్ఞాపకముంది. వియాన్నా పట్టణంలో ఎక్కడో ఆయన వుంటాడని తెలుసు, అందుకే అతడు పోస్టాఫీస్ కెళ్లి డైరెక్టరీ తీసుకుని ఆ పేరున్న ప్రతి ఒక్కరికీ ఫోను చేశాడు. ఫోన్ అందుకున్న ప్రతి వ్యక్తితో “నీవు రైలు డ్రైవరువేనా” అని యీ కుర్రాడు అడిగేవాడు. లేదని సమాధానమొస్తే వెంటనే మరొక నంబర్‌కు ఫోను చేసేవాడు. చివరకు అసలు రైలు డ్రైవర్ దొరికాడు. తన కథ చెప్పి తాను వీడియోలో వినిన బైబిలు సమాచారం యెడల తనకు ఆసక్తి వున్నట్లు చెప్పాడు.
ఈ యెహోవాసాక్షి బ్రాంచి కార్యాలయంద్వారా యీ కుర్రాడి ఇంటి దగ్గర్లోవుండే వ్యక్తి అతన్ని కలుసుకునే ఏర్పాటు చేశాడు. తమాషా ఏమంటే అక్కడున్న స్థానిక సంఘంలో యెహోవాసాక్షియైన మరొక రైలు డ్రైవర్, ఉన్నాడు. ఈ రెండో డ్రైవర్ యీ రైలు ప్రయాణకుని దర్శించి, బైబిలు పఠనం ఆరంభించాడు. ఈ కుర్రాడు 1991 వేసవిలో బాప్తిస్మం పొందాడు.
సమస్త హృదయాలను పరిశోధించు యెహోవా, ఇతడు నీతిని ప్రేమించేవాడని తప్పక చూసివుంటాడు. కావుననే అతడు బైబిలు సత్యాలను—ఒక విశేష మార్గంలో తెలుసుకునేలా చేశాడు.—1 దినవృత్తాంతములు 28:9; యోహాను 10:27.
[9వ పేజీలోని చిత్రసౌజన్యం]
Courtesy of the Austrian Railways