సంభాషణ అంటే—కేవలం మాట్లాడుకోవడమే కాదు
విహార యాత్రకు వెళ్లిన ఒక బృందం ఆకర్షణీయమైన పచ్చిక బయలు దృశ్యాన్ని చూస్తోందని ఊహించండి. ఆ బృందమంతా ఒకే దృశ్యాన్ని చూస్తున్నప్పటికి, వారిలో ఒక్కొక్కరు అదే దృశ్యాన్ని ఒక్కోరీతిగా చూస్తారు. ఎందుకంటే ఒక్కో వ్యక్తి ఒక్కో దృక్కోణం నుండి చూస్తాడు. ఏ ఇద్దరూ ఖచ్చితంగా ఒకే స్థలంలో నిలబడి లేరు. అంతేగాక బృందంలోని వారంత ఒకే చోటును చూడటం లేదు. ఒక్కోవ్యక్తికి అందులోని ఒక్కో ఆకృతి మనోరంజకంగా ఉంటుంది.
వివాహ విషయంలో కూడా అంతే. వారు ఎంత సమర్థవంతులైనప్పటికి, ఏ దంపతులు విషయాలపై ఒకే విధమైన దృక్కోణాన్ని కలిగివుండరు. భావోద్రేక నిర్మాణంలోను, బాల్య అనుభవంలోను, కుటుంబ ప్రభావం విషయములోను భార్యాభర్తలిరువురు భిన్నంగా ఉంటారు. వీరిలో ఉండే విభిన్న దృక్కోణం విపరీతమైన వివాదానికి నడపగలదు. అపొస్తలుడైన పౌలు నిష్కర్షగా ఇలా చెప్పాడు: “వివాహం చేసుకొనేవారికి శ్రమ, దుఃఖం కలుగును.”—1 కొరింథీయులు 7:28, ది న్యూ ఇంగ్లీష్ బైబిల్.
ఈ విబేధాలను యేక శరీర సంబంధంలో కలిసిపోయేలా చేసే ప్రయత్నం సంభాషణలో ఇమిడివుంది. ఇందుకొరకు మాట్లాడుకునే సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. (7వ పేజీలోని బాక్స్ చూడండి.) అయితే అంతకంటె ఎక్కువకూడా అవసరము.
వివేకము చూపుట
బైబిలు సామెత ఒకటి ఇలా తెల్పుతుంది: “జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును. వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.” (సామెతలు 16:23) ఇక్కడ “తెలివి” అని తర్జుమాచేయబడిన హెబ్రీ పదము వివేకముతో విషయములను మనస్సులో అంచనా వేసుకొనుట అనే భావాన్నిస్తుంది. కాబట్టి సమర్థవంతమైన సంభాషణకు ముఖ్యకేంద్రము హృదయమే గాని నోరు కాదు. బాగుగా సంభాషించువాడు కేవలము మాట్లాడువాడే కాదు. అతను సానుభూతితో వినేవాడైయుండాలి. (యాకోబు 1:19) ఆయన తన జతయొక్క భావాలను అర్థంచేసుకొని, పైకి కన్పించే తన జత ప్రవర్తనకుగల అంతర్గత మూల సమస్యలను వివేచించాలి.—సామెతలు 20:5.
దీన్నెలా చేయాలి? వివాదానికి కారణమైన పరిస్థితులను గమనించుట ద్వారా దీనిని చేయవచ్చును. మీ జత తీవ్రమైన భావోద్రేక లేక భౌతిక ఒత్తిడి క్రింద ఉన్నారా? ఏదైనా వ్యాధి మీ జత మనస్తత్వంపై ప్రభావం చూపుతుందా? “సరైన సమయానికి సరైన మాట లభించడం ఎంత ఆనందదాయకము!” అని బైబిలు చెబుతుంది. (సామెతలు 15:23, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్) కాబట్టి పరిస్థితులను పరిగణలోనికి తీసుకొనుట మీరు తగినరీతిగా ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు సహాయపడుతుంది.—సామెతలు 25:11.
కాని, తరచు వివాదానికి కారణము అప్పటి పరిస్థితులకు సంబంధించినదై ఉండదు.
గతాన్ని అర్థంచేసికొనడం
మన చిన్ననాటి అనుభవాలు పెద్దవాళ్లమైన తరువాత మన ఆలోచనను మలచడంలో ఎంతో ప్రభావాన్ని కలిగివుంటాయి. వివాహమైన దంపతులు విభిన్న కుటుంబాలనుండి వస్తుంటారు గనుక పొసగని దృక్పథాలు ఉండక తప్పవు.
బైబిలులో వ్రాయబడిన ఒక సంఘటన దీన్ని ఉదహరిస్తోంది. యెహోవా నిబంధన మందసము యెరూషలేముకు తిరిగి తెస్తున్నప్పుడు దావీదు ఎంతో బాహాటంగా తన ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తాడు. అయితే ఆయన భార్యయైన మీకాలు విషయమేమి? బైబిలు ఇలా చెపుతుంది: “సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను.”—2 సమూయేలు 6:14-16.
మీకాలు అనీతిమంతుడైన తన తండ్రియగు సౌలుకున్న విశ్వాసరహిత స్వభావాన్ని ప్రదర్శించింది. అందుకే 16వ వచనములో మీకాలు, దావీదు భార్య అనబడుటకు బదులు “సౌలు కుమార్తె” అని చెప్పబడినట్లు బైబిలు వ్యాఖ్యాతలు సి. యఫ్. కీల్, యఫ్. డిలిట్స్ సూచిస్తున్నారు. ఏదైననూ, తత్ఫలితంగా అక్కడ కలిగిన వివాదము ఆ సంతోషభరిత సంఘటనను ఇద్దరు ఒకేరీతిగా దృష్టించలేదని స్పష్టంచేస్తుంది.—2 సమూయేలు 6:20-23.
ఈ ఉదాహరణ భార్యాభర్తలిరువురికి వారి పెంపకం కాలంలో వారికి తెలియకుండానే తమపైబడిన అతిసూక్ష్మ ప్రభావాలు, వారు విషయాలను భిన్నంగా దృష్టించేలా చేస్తాయని చూపుతోంది. ఇద్దరు ఐక్యంగా యెహోవాను సేవిస్తున్నప్పటికి ఇది జరుగుతుంది. ఉదాహరణకు చిన్నబిడ్డగానున్న కాలంలో భావోద్రేకపరంగా తగినంత మద్దతు పొందని భార్య తన్ను యిష్టపడాలని, అందుకు అభయమివ్వాలనే భావాన్ని అతిగా కోరుటను ప్రదర్శించవచ్చును. ఇది భర్తకు కలవరం పుట్టిస్తుంది. “నేను ఆమెను ప్రేమిస్తున్నానని ఆమెతో వందసార్లు చెబుతాను, అయినా ఆమెకు అది సరిపోవడంలేదు!” అని అతడనవచ్చును.
ఈ సందర్భములో, సంభాషణ అంటే దానిలో “తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను,” అనేది ఇమిడివుంది. (ఫిలిప్పీయులు 2:4) సంభాషించడానికి, భార్యను, ఆమె గత అనుభవాలను భర్త మనస్సులోవుంచుకొని చూడాలేగాని, తన స్వంత అనుభవాన్నిబట్టి కాదు. అయితే భార్యకూడా తన భర్త విషయంలో అలాగే చేయవలసివుంది.—1 కొరింథీయులు 10:24.
గతం గాయాన్ని మిగిల్చితే
ఈనాడు పెరిగిపోతున్న సమస్యయైన బలత్కారానికి లేక చిన్న బిడ్డగా లైంగిక అఘాయిత్యానికి తన జత బలియై వుంటే, ఈ సందర్భాలలో వ్యక్తిగతంగా శ్రద్ధతీసుకోవడం ప్రత్యేకంగా అవసరం. ఉదాహరణకు లైంగికంగా సన్నిహితమయ్యే కొన్నిసమయాల్లో, ఆమె తనకు గతంలో సంభవించిన దానిని దీనితో వేరుచేయలేకపోవచ్చును, తన జతకు, అఘాయిత్యం జరిపినవానికి తేడాను గమనించలేకపోవచ్చును, లేక లైంగిక సన్నిహిత్వానికి, లైంగిక దురాగతానికి మధ్యనున్న తేడాను గుర్తించలేకపోవచ్చును. అయితే ఈ సూక్ష్మమైన విషయాన్ని భర్త తన భార్య దృక్కోణంలో గమనించకపోతే నిజంగా ఇది కలతగానే వుంటుంది.—1 పేతురు 3:8.
గతాన్ని నీవు తుడిచివేయడం లేక దాని ప్రభావాలను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోయినా, అలా క్రుంగియున్న నీ జతకు ఆదరణగా నీవు ఎంతో చేయవచ్చును. (సామెతలు 20:5) ఎలా? పేతురు ఇలా వ్రాశాడు, “భర్తలారా, మీరు కాపురం చేసే మీ భార్యలను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి.” (1 పేతురు 3:7, ఫిలిప్స్) నీ భార్య లేక నీ భర్త గతాన్ని గుర్తించుట సంభాషణలో అతి ప్రాముఖ్యమైన భాగం. సానుభూతితోకూడిన వాత్సల్యత లేకుంటే నీ మాటలు వ్యర్థమే.
యేసు స్వయంగా ఆ బాధలను తానెన్నడూ అనుభవించకపోయినా, వ్యాధులతో బాధపడేవారిని ఎదుర్కొన్నప్పుడు ఆయన వారిని చూచి “కనికర” పడ్డాడు. (మత్తయి 14:14) అలాగే, మీ భార్య అనుభవించిన నిర్లక్ష్యాన్ని లేక అఘాయిత్యాన్ని మీరు స్వయంగా అనుభవించకపోవచ్చు. ఆమె రోదనను తేలిగ్గా కొట్టిపారవేసే బదులు, ఆమె గతాన్ని అంగీకరించి ఆమెకు మీ మద్దతునివ్వండి. (సామెతలు 18:13) పౌలు ఇలా వ్రాశాడు: “కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.”—రోమీయులు 15:1.
పగచేత చిక్కుబడుట
వివాహము ఒక అమూల్యమైన పాత్రలాంటిది. వ్యభిచారము వలన దెబ్బతిన్నప్పుడు దాని హాని లెక్కించలేనంతది. (సామెతలు 6:32) నిజమే నిర్దోషియైన జత క్షమించినట్లయితే, బద్ధలైన ఆ ముక్కలను సమాధానముతో మరలా అతికించవచ్చును. కాని ఆ పగుళ్లు అలా కనిపిస్తూనే ఉంటాయి. ఏదైనా వాదన రేగినప్పుడు ఆ పగిలిన చారలు గుర్తుకొచ్చి వాటిని ఒక ఆయుధంగా ఉపయోగించడం జరగవచ్చు.
తన జత విశ్వాసఘాతకంగా ప్రవర్తించినప్పుడు ఆగ్రహం కలగడమనేది సాధారణమైన స్పందన. కాని నీవు నీ జతను క్షమించినట్లయితే, పదేపదే దానిమీదేనే పట్టుకొని వ్రేలాడుతూ కోపపడకుండా చూసుకోవాలి. ఎందుకంటే అది వ్యభిచారము కలిగించినదానికంటే మరెక్కువ నష్టాన్ని కలిగించగలదు. ఆ రోషము లేక ఆగ్రహము లోలోపల మౌనంగా మండిపోతున్నప్పటికి, లేక నిర్దాక్షిణ్యంగా బద్దలైనప్పటికి అదే పనిగా ఆ ఆగ్రహాన్ని కొనసాగనివ్వడం జతలోని యిరువురికి హానికరమే. ఎందుకు? ఒక వైద్యురాలు ఇలా సూచించింది: “నీ జతవలన నీ మనోభావాలు గాయపడ్డాయంటే అతనిపై నీకింకా శ్రద్ధ ఉండబట్టే అలా జరుగుతుంది. అందువలన నీవు పగతీర్చుకోడానికి, లేక దానినే ఎత్తిచూపిస్తుంటే నీవు నీ జతను గాయపరచడమే కాకుండా, నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నావు. నీవు కావాలని కోరుకునే మీ బంధాన్ని ఇంకా చెల్లాచెదరు చేస్తున్నావు.”
ఔను, నీ కోపాన్ని తగ్గించుకోకుండానే మీ వివాహంలోని భేదాలను సమాధానపరచుకోవడం సాధ్యం కాదు. అందుకే నీ భావోద్రేకాలు ఉద్రిక్తంగా లేని సమయంలో నీ మనోభావాలను నీ జతతో చర్చించు. నీలో ఎందుకు అలా గాయం రేగిందో వివరించు. మరలా తన అభయాన్ని పొందటానికి నీకేమి అవసరమో, మీ బంధాన్ని కాపాడుకొనేందుకు నీవు ఏమి చేస్తావో చర్చించు. ఎప్పటికి కూడా నీ వాదనలో నిన్ను నీవు సమర్థించుకోవడానికి గతాన్ని ఒక ఆయుధంగా వాడుకోవద్దు.
వ్యసనము సంభాషణను గాయపరుస్తుంది
దంపతులలోని ఒకరు మత్తుపానీయము లేక మత్తుమందుల వ్యసనానికి లోనైతే ఆ వివాహములో తీవ్రవ్యధ నెలకొనగలదు. అలా వ్యసనానికి లోనుకాని జతలోని మరో వ్యక్తి బైబిలులో తెల్పబడిన అబీగయీలులాంటి స్థితిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును. ఒకవైపు తన భర్త “త్రాగుచు” ఉండగా, ఆమె అతని మూర్ఖ ప్రవర్తనవలన కలుగబోయే దుష్ఫలితాలను తప్పించడానికి పోరాడుతుండెను. (1 సమూయేలు 25:18-31, 36) ఏ వివాహాలల్లో జతలోని ఒకరు ఇలాంటి వ్యసనానికి లోనైయుంటారో, మరొకరు ఆ వ్యసనపరుని ప్రవర్తనను సరిదిద్దే ప్రయత్నములో ఉంటారో వారు తరచు నాబాలు, అబీగయీలు కుటుంబాన్ని పోలియుంటారు.a
నిశ్చయంగా, అలా బానిసైన ఒకరు కోలుకుంటే ఎంతో నెమ్మది చేకూరగలదు. అయితే కేవలం అది ప్రారంభం మాత్రమే. ఒక చిన్న పట్టణాన్ని ఒక పెద్ద పెనుతుఫాను ముట్టడించడాన్ని ఊహించండి. ఇండ్లు కూలుతున్నాయి, చెట్లు పెల్లగించబడుతున్నాయి, టెలిఫోను లైనులు నేలనంటాయి. తుఫాను తగ్గడంతో ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే ఇప్పుడు విస్తారంగా మరమ్మత్తు చేయవలసి వస్తుంది. అలాగే ఒక జత తిరిగి మంచి దారికి వస్తున్నప్పుడు కూడా అది అవసరము. పతనమైన బాంధవ్యాలను పునర్మించాలి. నమ్మకాన్ని, యథార్థతను పునఃస్థాపించాలి. సంభాషణా మార్గాలను తిరిగి నెలకొల్పుకోవాలి. అలా మంచి స్థితికి మారుతున్న వ్యసనాల బానిసకు క్రమీణ మంచిదశకు చేరుకోవడమనేది, క్రైస్తవులు అభ్యసించాలని బైబిలు కోరే “నవీన స్వభావము”లో భాగమైయుంది.—ఎఫెసీయులు 4:22-24; కొలొస్సయులు 3:9, 10.
లెనార్డ్, ఇలేన్‌లు మాదకద్రవ్యాలు సేవించకుండా ఉండేందుకు బైబిలు అధ్యయనం సహాయపడింది, కాని సేవించకుండా ఉండాలనే చిత్తవృత్తి పూర్తిగా కార్యశీలం కాలేదు.b తొందరలోనే మరితర వ్యసనాలు చోటుచేసుకున్నాయి. “బైబిలు నియమాలు అన్వయించుకుని సంతృప్తికరమైన వివాహం పొందడానికి మేము 20 సంవత్సరాలు ప్రయత్నించాం” అని ఇలేన్ అంటున్నది. “మా వ్యసనాలు లోతుగా పాతుకుపోయాయి. ప్రార్థన, పఠనం ద్వారా మా వ్యసనాలనుండి దూరం కాలేకపోయాం.”
లెనార్డ్, ఇలేన్‌లు వారి వ్యసనాలకు గల కారణాలు తెలుసుకోడానికి ఎదురుచూశారు. పిల్లలను కొట్టడం, మద్యపానం సేవించడం, స్త్రీని గౌరవించడం అనే విషయాలపై “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని” నుండి తగిన సమయానికి ప్రత్యేకమైన సహాయకం లభించింది.c (మత్తయి 24:45-47) “మేము మా బాంధవ్యాలను తిరిగి పునఃస్థాపించుకోడానికి సహాయం పొందాము” అని ఇలేన్ చెబుతున్నది.
సమస్యలను పరిష్కరించుకొనుట
రిబ్కా తన కుమారుడైన ఏశావు భార్య విషయంలో భరించలేనంత మనోవేదనను అనుభవించింది. తన మరో కుమారుడైన యాకోబుకూడా అదే మార్గాన్ని అనుసరిస్తాడేమోనని భయపడి తన బాధను భర్తయైన ఇస్సాకుతో ఇలా చెప్పుకుంది: “హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసికొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనము.”—ఆదికాండము 27:46.
ఇక్కడ గమనించండి, రిబ్కా తన మనోభావాలను గూర్చి స్థిరంగా మాట్లాడినప్పటికి, ఆమె వ్యక్తిగతంగా ఇస్సాకును నిందించలేదు. ఆమె “దీనంతటికి తప్పు నీదే,” లేదా “అసలు దీన్ని నీవే చక్కపెట్టి ఉండాల్సినవాడివి!” అని అనలేదు. బదులుగా రిబ్కా ఆ సమస్య తనకెంత బాధ కలుగజేసిందో చెబుతూ, తన్నుగూర్చే “నా” అని ఉపయోగించింది. ఇలా సమీపించి మాట్లాడం ఇస్సాకులో సానుభూతిని కలుగజేసిందేగాని, ఆయన తన ఘనతను కాపాడుకొనేలా మాట్లాడునట్లు చేయలేదు. తద్వారా ఆయన తనను వ్యక్తిగతంగా నిందించినట్లు భావించక, ఆ విషయంలో వెంటనే తగిన చర్య తీసుకున్నాడు.—ఆదికాండము 28:1, 2.
భార్యా భర్తలు రిబ్కా మాదిరినుండి నేర్చుకోవచ్చును. ఒక వివాదం తలెత్తినప్పుడు, ఒకరినొకరు నిందించుకొని ఒకరిపై మరొకరు విరుచుకుపడే బదులు ఆ సమస్యను నిందించి దాన్ని పరిష్కరించుకోవడాన్ని గూర్చి ఆలోచించండి. రిబ్కావలె అది నీపై కలిగివున్న ప్రభావాన్నిబట్టి అది నీలో రేకెత్తించిన కలతను వ్యక్తపరచండి. “నీవు నాలో కలతను రేపావు!” లేక “నీవు నన్నెప్పుడు అర్థం చేసుకోవు” అనే మాటలకు బదులు “దీని వలన నేను కలతచెందాను . . .” లేక “నేను తప్పుగా అర్థంచేసుకున్నాను”, ఎందుకంటే . . .” అనేవి ఎంతో ప్రభావవంతగా ఉండగలవు.
నిలిచి ఉండటమే కాదు
మొదటి మానవ దంపతులైన ఆదాము హవ్వల వివాహము కొన్ని శతాబ్దాలు నిలిచింది. (ఆదికాండము 5:3-5) అయితే దీన్నిబట్టి వారి వివాహము ఆదర్శప్రాయమైనదని కాదు. వారి వివాహపు తొలిరోజుల్లోనే స్వాతంత్ర్య భావము, సృష్టికర్తయొక్క నీతియుక్తమైన శాసనం పట్ల అగౌరవము వారి యేక శరీర బంధాన్ని చెరిపివేసింది.
అలాగే, ఈనాడు ఒక వివాహము ఎంతో కాలము నిలిచివుండవచ్చు, కాని ప్రాముఖ్యమైన సంభాషణ విధానం లేకుండవచ్చును. మితిమీరిన తర్కములు, అయుక్తమైన లక్షణాలను తీసివేసుకోవలసిన పరిస్థితి ఉండవచ్చును. (2 కొరింథీయులు 10:4, 5 పోల్చండి.) ఇది ఎల్లప్పుడు కొనసాగే విద్యాకార్యక్రమము. అయితే ఆ కృషి యోగ్యమైనది. యెహోవా దేవుడే వివాహాన్ని ఏర్పరచినవాడు కావున ఆయన దాని విషయంలో ఎంతో శ్రద్ధకలిగివున్నాడు. (మలాకీ 2:14-16; హెబ్రీయులు 13:4) అందుచేత, మనము మన వంతు నిర్వహిస్తే, ఆయన మన కృషిని గుర్తించి వివాహములో దెబ్బతినివున్న సంభాషణను పునరుద్ధరించుకోడానికి కావలసిన బలమును జ్ఞానమును మనకు ఇస్తాడనే నమ్మకాన్ని మనము కలిగియుండగలము.—కీర్తన 25:4, 5; 119:34 పోల్చండి.
[అధస్సూచీలు]
a మత్తుపానీయాలకు బానిసలైయున్న వారి కుటుంబాలకు సహాయమునుగూర్చి మే 22, 1992 అవేక్! పేజీలు 3-7లలో చర్చించబడింది.
b వీరి పేర్లు మార్చబడ్డాయి.
c అక్టోబరు 8, 1991, మే 22, 1992, జూలై 8, 1992 అవేక్! సంచికలను చూడండి.
[6వ పేజీలోని బాక్సు]
“చెత్త బయట పడవేయడానికే ఎక్కువ సమయముంది!”
వివాహసంబంధమైన సమస్యలున్న ఒక భార్యా భర్తలను వారు ఇంట్లో చెత్తను బయట పారవేయడానికి వారానికి ఎంత సమయమును వెచ్చిస్తారో అడగటం జరిగింది. అందుకు వారు వారానికి 35 నిమిషాలు లేదా రోజుకు 5 నిమిషాలు అని చెప్పారు. ఆ తర్వాత వారు సంభాషించుకోడానికి ఎంత సమయము గడుపుతారని అడగటం జరిగింది. భర్త నిర్ఘాంతపోయాడు. “చెత్త పారవేయడానికే ఎక్కువ సమయం పడుతుంది!” అని చెప్తూ ఇంకా ఇలా అన్నాడు: “ఒక వివాహాన్ని నిలబెట్టుకోవడానికి రోజుకు అయిదు నిమిషాలు సరిపోతాయనుకుంటే మమ్ములను మేము మోసపుచ్చుకున్నట్టే. వివాహబంధం బలపడి వృద్ధిచెందడానికి నిశ్చయంగా ఆ సమయము సరిపోదు.”
[7వ పేజీలోని బాక్సు]
కార్యసిద్ధికైన ప్రధాన నియమాలు
◻ ఒకసారి ఒకే విషయాన్ని చర్చించండి (1 కొరింథీయులు 14:33, 40)
◻ మనోభావాలు వ్యక్తపర్చుగాని; నిందారోపణలు చేయవద్దు (ఆదికాండము 27:46)
◻ కొట్టడం తగదు (ఎఫెసీయులు 5:28, 29)
◻ జగడం చెలరేగేలా మాట్లాడవద్దు (సామెతలు 26:20)
◻ సమాధానపడటమే గమ్యంగా పెట్టుకోగాని, గెలిచేందుకు ప్రయత్నించవద్దు (ఆదికాండము 13:8, 9)
[4వ పేజీలోని చిత్రం]
మనోభావాలు వ్యక్తపర్చండిగాని; నిందారోపణలు చేయవద్దు
[8వ పేజీలోని చిత్రం]
ఒక వివాదం తలెత్తినప్పుడు, ఒకరిపై ఒకరు విరుచుకుపడే బదులు ఆ సమస్యపై దాడిచేసి దాని పరిష్కరించుకోడానికి ఆలోచించండి