దైవిక విధేయత మననుండి ఏమి కోరుతుంది?
“కాబట్టి దేవునికి లోబడియుండుడి.”—యాకోబు 4:7.
1. మనము ఆరాధించు దేవుడు ఎటువంటివాడని చెప్పవచ్చును?
యెహోవా ఎంతటి ఆశ్చర్యకరమైన దేవుడు! సాటిలేనివాడు, అసమానుడు, ఎవనికీ పోల్చజాలనివాడు, అనేక రీతులలో అద్వితీయుడు! సర్వోన్నతుడై, సమస్త అధికారము తనయందుగల విశ్వసర్వాధిపతి. ఆయన యుగయుగములు జీవిస్తూ అంతము లేనివాడు. ఏ మనుష్యుడు ఆయనను చూచి బ్రతకజాలనంత మహిమగలవాడు. (నిర్గమకాండము 33:20; రోమీయులు 16:26) శక్తియందు, జ్ఞానమందు ఆయనకు పరిధిలులేవు. న్యాయములో సంపూర్ణుడు. ప్రేమా స్వరూపి. ఆయన మన సృష్టికర్త, మన న్యాయాధిపతి, మన శాసనకర్త, మన రాజు. ప్రతి యీవియు, సంపూర్ణమైన ప్రతి వరమును ఆయననుండి వచ్చును.—కీర్తన 100:3; యెషయా 33:22; యాకోబు 1:17.
2. దేవునికి లోబడుటలో ఏమి ఇమిడి ఉన్నవి?
2 ఈ వాస్తములన్నిటి దృష్ట్యా, ఆయనకు మనము లోబడియుండాల్సిన మన విధినిగూర్చి ఏవిధమైన సంశయము లేదు. అయితే ఇందులో ఏమి ఇమిడి ఉన్నవి? అనేక విషయములు ఉన్నవి. యెహోవా దేవుని మనము వ్యక్తిగతంగా చూడలేము గనుక విద్యావంతమైన మనస్సాక్షి నడిపింపునంగీకరించుట దేవుని భూసంస్థతో సహకరించుట, లౌకిక అధికారాలను గుర్తించి, కుటుంబ వలయములో శిరసత్వపు సూత్రాన్ని గౌరవించుట ఇమిడి ఉన్నాయి.
మంచి మనస్సాక్షిని కలిగియుండుట
3. మంచి మనస్సాక్షిని కలిగియుండుటకు మనము ఏవిధమైన నిషేధములకు కూడా విధేయులమైయుండాలి?
3 మంచి మనస్సాక్షిని కలిగివుండుటకు మనపై వత్తిడితేనటువంటి—అనగా మానవులు మనపై మోపి పాటించునట్లు చేయలేని చట్టములు లేక సూత్రాలకు మనము విధేయులము కావాలి. ఉదాహరణకు పది ఆజ్ఞలలోని పొరుగువానిదేనినైనను ఆశించకూడదను పదవ ఆజ్ఞను ఏ మానవ అధికారములు మనలను అమలుపరచునట్లు చేయలేవు. పది ఆజ్ఞలు దైవిక మూలాన్ని బట్టి కలిగాయని ఇదే రుజువుపరస్తుంది. ఎట్లనగా శాసనములుచేయు ఏ మానవ సభకూడా దానిని అమలుచేయకపోతే శిక్షించవీలులేని శాసనాన్ని ఏర్పాటుచేయదు. ఈ శాసనము ద్వారా మంచి మనస్సాక్షి కలిగియుండాలనుకునే ప్రతి ఇశ్రాయేలీయునిపై—తనకుతానే ఒక పోలీసుగా ఉండే బాధ్యతను యెహోవా దేవుడు పెట్టాడు. (నిర్గర్ణమకాండము 20:17) అలాగే ఒకనిని దేవునిరాజ్యములో ప్రవేశింపనివ్వని “మత్సరము” “అసూయలు,” ఏ మానవ న్యాయాధిపతులు వాటికి విరుద్ధంగా శిక్షను విధించలేని ప్రతిస్పందనలు. (గలతీయులు 5:19-21) అయితే మంచి మనస్సాక్షిని కలిగియుండుటకు వీటిని మనము విసర్జించాలి.
4. మంచి మనస్సాక్షిని కాపాడుకొనుటకు ఏ బైబిలు సూత్రముల ప్రకారము మనము జీవించాలి?
4 అవును, బైబిలు సూత్రములమేరకు మనము జీవించాలి. మోషే ధర్మశాస్త్రములో ప్రధానమైనవి ఏవని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యేసుక్రీస్తు ఈ సూత్రములను రెండు ఆజ్ఞలలో క్లుప్తీకరించాడు. “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. . . . నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను.” (మత్తయి 22:36-40, NW) వీటిలోని రెండవ ఆజ్ఞలో ఏమి ఇమిడివుందో వివరిస్తూ, మత్తయి 7:12లో వ్రాయబడిన యేసు మాటలు ఇలాగున్నవి: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైయున్నది.”
5. యెహోవా దేవునితో మనమెట్లు మంచి సంబంధాన్ని కాపాడుకొనగలము?
5 ఇతరులు చూసినను చూడకపోయినను సరైనదని మనకు తెలిసినదాన్ని చెయ్యాలి. తప్పు అని తెలిసినదాన్ని చెయ్యకుండా మానాలి. చేయవలసిన దానిని చేయకుండానైనా, చేయకూడనిదానిని చేసైనా తప్పించుకోగల పరిస్థితి ఉన్నప్పటికీ దానిని మనము గైకొనాలి. అనగా అపొస్తలుడైన పౌలు హెబ్రీయులు 4:13లో “మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మన మెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది” అని వ్యక్తపరచిన హెచ్చరికను మనస్సునందుంచుకొని మన పరలోకపు తండ్రితో మంచి సంబంధమును కలిగియుండటమనియే దాని భావము. సరైనదానిని చేయడంలో మనం కలిగివుండే పట్టుదలే అపవాది కుతంత్రములతో పోరాడుటకు, లోకవత్తిడులను ఎదిరించుటకు, మనము స్వతంత్రించుకొనియున్న మన స్వార్థపర స్వభావానికి వ్యతిరేకంగా పోరాడటానికి మనకు సహాయపడుతుంది.—ఎఫెసీయులు 6:11 పోల్చండి.
దేవుని సంస్థకు లోబడుట
6. క్రైస్తవ కాలములకు ముందు తన వర్తమానము నందించుటకు యెహోవా ఏయే మార్గములను ఉపయోగించెను?
6 మన జీవితంలో బైబిలు సూత్రములు ఎలా అన్వయించుకోవాలనే విషయాన్ని యెహోవా దేవుడు వ్యక్తిగతంగా మనకే పూర్తిగా విడిచిపెట్టలేదు. మానవజాతి చరిత్ర ఆరంభం నుండి సమాచారమును అందించుటకు దేవుడు మానవులను మధ్యమముగా వాడుకున్నాడు. ఆవిధంగా హవ్వతో మాట్లాడుటకు ఆదాము దేవుని ప్రతినిధి అయ్యాడు. హవ్వ సృష్టించబడక పూర్వమే నిషేధించబడిన ఫలమునుగూర్చిన ఆజ్ఞ ఆదాముకు ఇవ్వబడినందున, ఆమెయెడల దేవుని చిత్తమేమైయున్నదో హవ్వకు ఆదాము తప్పక తెలియజేసి ఉంటాడు. (ఆదికాండము 2:16-23) జలప్రళయమునకు ముందున్న లోకానికి, తన కుటుంబానికి నోవహు దేవుని ప్రవక్తగా ఉండెను. (ఆదికాండము 6:13; 2 పేతురు 2:5) అబ్రాహాము తన కుటుంబమునకు దేవుని వాక్య ప్రతినిధిగా ఉండెను. (ఆదికాండము 18:19) ఇశ్రాయేలు జనాంగమునకు సమాచారమందించు దేవుని ప్రవక్తగా మోషే పనిచేసెను. (నిర్గమకాండము 3:15, 16; 19:3, 7) ఆయన తరువాత బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చువరకు తన ప్రజలకు వర్తమానమునందించేందుకు దేవుడు అనేకమంది ప్రవక్తలను, యాజకులను, రాజులను ఉపయోగించాడు.
7, 8. (ఎ) మెస్సీయ రాకతో దేవుని వాక్య ప్రతినిధులుగా ఎవరు ఉపయోగించబడ్డారు? (బి) దైవిక విధేయత ఈనాడు యెహోవాసాక్షులనుండి ఏమి కోరుతుంది?
7 మెస్సీయయైన యేసుక్రీస్తు రాకతో దేవుడు ఆయనను, ఆయన సన్నిహిత సహవాసులైన అపొస్తలులను తన వాక్య ప్రతినిధులుగా ఉపయోగించాడు. ఆ తదుపరి ఆయన నమ్మకమైన అభిషక్త అనుచరులు యెహోవా ప్రజలు బైబిలు సూత్రములను ఎలా అన్వయించుకొనవలెనో తెలియజేయుటకు “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని”గా సేవచేయవలసివుండిరి. దేవునికి లోబడుట అనగా యెహోవా దేవుడు ఉపయోగిస్తున్న ఉపకరణమును గుర్తించుటైయున్నది.—మత్తయి 24:45-47; ఎఫెసీయులు 4:11-14.
8 ఈ “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు” ఈనాడు యెహోవాసాక్షులతో గుర్తించబడుతు, ఈ సాక్షుల పరిపాలక సభద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు వాస్తములు చూపుతున్నవి. తిరిగి ఆసభ ప్రాంతీయ స్థాయిలో పనిని నడిపించుటకు అనేక స్థాయిలలో అధ్యక్షులను అనగా—పెద్దలను ప్రయాణ ప్రతినిధులను నియమిస్తుంది. దేవునికి లోబడటంలో హెబ్రీయులు 13:17లోని “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి” అను దాని ప్రకారం సమర్పించుకొన్న ప్రతిసాక్షి అధ్యక్షులకు లోబడియుండవలసిన అవసరత ఉన్నది.
క్రమశిక్షణను అంగీకరించుట
9. దైవిక విధేయతలో తరచు ఏమి ఇమిడి ఉంది?
9 దేవునికి లోబడుటలో తరచు అధ్యక్షులుగా సేవచేయు వారినుండి వచ్చు క్రమశిక్షణను అంగీకరించుట కూడా ఇమిడి ఉంది. ఎల్లప్పుడు మనలను మనము క్రమశిక్షణలో పెట్టుకొనకపోతే, మన సంఘ పెద్దలవంటి అనుభవము మరియు అధికారముగల వారినుండి మనకు ఉపదేశమూ, క్రమశిక్షణ అవసరము కావచ్చును. అటువంటి క్రమశిక్షణను అంగీకరించుట వివేకయుక్తమైన విధానము.—సామెతలు 12:15; 19:20.
10. క్రమశిక్షణను అమలు జరిపేవాళ్లు ఏ విధిని కలిగివున్నారు?
10 అయితే, క్రమశిక్షణను అమలు పరచు పెద్దలు తమమట్టుకుతాము దేవునికి లోబడుటలో మాదిరి చూపువారై ఉండాలి. ఎలా? గలతీయులు 6:1 ప్రకారము వారు ఉపదేశమివ్వడంలో శ్రేష్ఠమైన పద్ధతిని ఉపయోగించడమే కాకుండా, మాదిరికరంగానూ ఉండాలి: “సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన యెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.” మరొక మాటలో చెప్పాలంటే పెద్ద ఇచ్చే ఉపదేశానికి తగిన మాదిరిని ఆయన కలిగివుండాలి. అది 2 తిమోతి 2:24, 25, తీతు 1:9లో ఇవ్వబడిన ఉద్బోధకు అనుగుణంగా ఉంటుంది. అవును, గద్దించేవారు లేక సరిదిద్దేవారు ఎన్నటికి కఠినంగా ఉండకుండా జాగ్రత్తపడాలి. ఎల్లప్పుడు వారు సాత్వికము, దయతో ఉంటూ అదే సమయంలో దేవునివాక్య సూత్రములను స్థిరంగా ఉన్నతపరచేవారైయుండాలి. భారము మోస్తూ, అలసియున్నవారికి సేదదీర్చేవారిగా వారు నిష్పక్షపాతంగా వినేవారైవుండాలి.—మత్తయి 11:28-30ని పోల్చండి.
పై అధికారులకు లోబడుట
11. ప్రభుత్వ అధికారుల యెడలగల వారి సంబంధాలలో క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి?
11 దేవునికి లోబడుటలో ప్రభుత్వ అధికారులకు లోబడు అవసరత కూడా ఉంది. రోమీయులు 13:1 మనలను ఇలా హెచ్చరిస్తుంది: “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవుని వలన కలిగిన అధికారము తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి యున్నవి.” అపొస్తలుడైన పౌలు రోమీయులు 13:7లో వ్రాసియునట్లు ఇతర విషయాలతో పాటు మనము ట్రాఫిక్ నిబంధనలు, అలాగే పన్ను, ఇతర చెల్లింపుల విషయాలలోను మనస్సాక్షి పూర్వకంగా విధేయులం కావాలి.
12. మనము కైసరుకు లోబడుట ఏ భావములో పరిమితమైనది?
12 అయితే స్పష్టంగా అన్ని విషయాల్లో, కైసరునకు లోబడటం పరిమితమైనదై ఉండాలి. మనమెల్లప్పుడు మత్తయి 22:21లో యేసు చెప్పిన ఈ సూత్రమును తప్పక మనస్సునందుంచుకోవాలి: “ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి.” రోమీయులు 13:1పై ఆక్స్‌ఫర్డ్ యన్ ఐ వి [న్యూ ఇంటర్నేషనల్ వర్షన్] స్కొఫీల్డ్ స్టడీ బైబిలు అథఃసూచిలో ఇలా తెలియజేస్తుంది: “ఇచ్చట దీని భావము అవినీతికరమైన లేక క్రైస్తవ వ్యతిరేకమైన నిబంధనలకు అతడు విధేయుడు కావాలని కాదు. అలాంటి పరిస్థితిలో మనుష్యులకంటె దేవునికి లోబడవలసిన విధి అతనిపైనున్నది (అపొ. 5:29; cp. దాని. 3:16-18; 6:10ff).”
కుటుంబ వలయములో దైవిక విధేయత
13. దైవిక విధేయత కుటుంబ వలయంలోని దాని సభ్యులనుండి ఏమి కోరుతుంది?
13 కుటుంబ వలయములో భర్త లేక తండ్రి శిరస్సుగా వ్యవహరిస్తాడు. ఇందుకు భార్యలు ఎఫెసీయులు 5:22, 23లో ఇవ్వబడిన ఉపదేశమును పాటించవలసిన అవసరమున్నది: “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు.”a పిల్లలైతే, తాము స్వంత నిబంధనలు చేసికొనకుండా తండ్రికి, తల్లికి దైవికంగా లోబడియుండ వలసిన బాధ్యతను కలిగివున్నారు. ఎఫెసీయులు 6:1-3లో అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.”
14. దైవిక విధేయత కుటుంబ శిరస్సులనుండి ఏమి కోరుతుంది?
14 ఔను, భర్తలు మరియు తండ్రులు తమ మట్టుకు తామే దేవునికి లోబడువారైనప్పుడు భార్యలకు పిల్లలకు అలా దైవికంగా లోబడియుండటం సులభమౌతుంది. వారు ఎఫెసీయులు 5:28, 29 మరియు 6:4 నందలి బైబిలు సూత్రములకు అనుగుణ్యంగా తమ శిరస్సత్వాన్ని నిర్వహిస్తారు: “అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడుగాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. . . . అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.” “తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”
దైవిక విధేయతను కనుపరచుటకు సహాయకములు
15. దైవిక విధేయతను కనుపరచుటకు ఏ ఆత్మఫలము మనకు సహాయము చేయును?
15 ఈ అనేక రంగాలలో మన దైవిక విధేయతను కనుపరచుటకు మనకు ఏమి సహాయము చేస్తుంది? మొదట నిస్వార్థమైన ప్రేమ—అనగా యెహోవా దేవునియెడల మరియు ఆయన మనపై ఉంచినవారియెడల ప్రేమ. మొదటి యోహాను 5:3 నందు మనకు ఇలా చెప్పబడింది: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” యేసు కూడా యోహాను 14:15లో ఇదే అంశాన్ని సూచించాడు: “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.” నిజంగా, ప్రేమ—ఆత్మఫలములలో ప్రధానమైనది—యెహోవా దేవుడు మనకు చేసిన దానినంతటిని మెచ్చుకొనుటకు సహాయపడి తద్వారా దైవిక విధేయతను కనుపరచుటకు మనకు సహాయము చేస్తుంది.—గలతీయులు 5:22.
16. దైవిక విధేయతను చూపుటలో దైవిక భయము ఎలా సహాయము చేస్తుంది?
16 రెండవది, దైవిక భయము. యెహోవా దేవుని అసంతోషపరచుటకు భయపడుట కూడా మనకు సహాయము చేయును. ఎందుకనగా అది “చెడుతనము నసహ్యించుకొనుటయే.” (సామెతలు 8:13) నిస్సందేహంగా, యెహోవాను అసంతోషపెట్టుటకు భయపడటమనేది మానవ భయమునుబట్టి రాజీపడకుండుటకు మనకు సహాయపడుతుంది. ఏ విధమైన కష్టాలను ఎదుర్కొనవలసి వచ్చినను దేవుని ఉపదేశాలకు విధేయులమయ్యేలా అది చేస్తుంది. అంతేగాక, శోధనలు లేక చెడు చేసేలా ప్రేరేపించు తలంపులకు లొంగిపోకుండా అది మనలను కాపాడుతుంది. అబ్రాహాము యెహోవా యెడల కలిగియున్న భయమును బట్టియే తన కుమారుడైన ఇస్సాకును అర్పించుటకు ముందుకు సాగాడని, యెహోవాను అసంతోషపెట్టుటకు భయపడుటనుబట్టే యోసేపు తనను మోహించిన పోతీఫరు భార్య అవినీతి తలంపును విజయవంతంగా ఎదిరించగలిగాడని లేఖనములు చూపుతున్నవి.—ఆదికాండము 22:12; 39:9.
17. దైవిక విధేయతను కనుపరచుటలో విశ్వాసముయొక్క పాత్ర ఏమి?
17 మూడవ సహాయము యెహోవా దేవునియందలి విశ్వాసము. సామెతలు 3:5, 6లో ఇవ్వబడిన హెచ్చరికను గైకొనుటకు మనకు విశ్వాసం తోడ్పడుతుంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” ముఖ్యముగా మనము అన్యాయంగా బాధించబడుతున్నట్లున్నను లేక తెగ, జాతి, రంగునుబట్టి లేదా ఏదైనా వ్యక్తిత్వపు విబేధాన్నిబట్టి దురభిమానానికి గురయ్యామని భావించుకొన్నప్పుడు విశ్వాసము మనకు సహాయము చేస్తుంది. కొందరు ఏదో చెడు భావాన్నిబట్టి తమను పెద్దగా లేక పరిచారకునిగా సిఫారసు చేయకుండా దాటవేస్తున్నారని కొందరు భావించవచ్చును. మనకు విశ్వాసమున్నట్లయితే యెహోవాయే తన యుక్త కాలమున విషయాలను చక్కదిద్దుటకు కనిపెట్టుకొని ఉంటాము. ఈ లోగా మనము ఓపిక సహనమును అలవర్చుకొనవలసి ఉన్నాము.—విలాపవాక్యములు 3:26.
18. దైవిక విధేయతను కనుపర్చుటకు నాల్గవ సహాయమేమి?
18 నాల్గవ సహాయము దీనత్వము. దీనుడైన వ్యక్తికి దైవిక విధేయతను కనుపరచటం కష్టమేమీ కాదు. ఎందుకనగా ‘దీనమనస్సుగలవాడై అతను ఇతరులు తనకంటె గొప్పవారని ఎంచుతాడు.’ దీనుడైన వ్యక్తి తననుతాను “అల్పునిగా” ఎంచుకొనును. (ఫిలిప్పీయులు 2:2-4; లూకా 9:48) అయితే గర్విష్టుడైన వ్యక్తి లోబడేందుకు ఆగ్రహించి ఆ విషయంలో రౌద్రుడౌతాడు. అటువంటి వ్యక్తి విమర్శనుబట్టి కాపాడబడుటకంటె పొగడ్తల వలన చెడిపోవుటకు ఇష్టపడతాడు.
19. వాచ్‌టవర్ సొసైటి మాజీ అధ్యక్షుడు దీనత్వమునకు ఎటువంటి మంచి మాదిరినుంచాడు?
19 దైవిక విధేయతకు, దీనత్వానికి వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి రెండవ ప్రెసిడెంటైన జోసఫ్ రూథర్‌ఫర్డ్ ఒక మంచి మాదిరినుంచాడు. హిట్లర్ జర్మనీలోని యెహోవాసాక్షుల పనిపై నిషేధాన్ని విధించినప్పుడు, అక్కడున్న సహోదరులు వారి కూటములపైన, ప్రకటించుపనిపైన విధించబడిన నిషేధాన్నిబట్టి ఏమి చెయ్యాలి అని ఆయనకు వ్రాశారు. ఈ విషయాన్ని బేతేలు కుటుంబానికి తెలియజేసి, జర్మను సహోదరులపై అమలుపరచబడుతున్న కఠినమైన శిక్ష దృష్ట్యా జర్మను సహోదరులకు ఏమి చెప్పాలో తనకు తెలియడంలేదని యథార్థంగా ఒప్పుకున్నాడు. ఒకవేళ వారికేమి చెప్పాలో ఎవరికైనా తెలిసివుంటే, దాన్ని వినడానికి తానెంతో సంతోషిస్తానని చెప్పాడు. అది ఎంతటి దీనమైన స్వభావము!b
దైవిక విధేయతను కనుపర్చడంద్వారా ప్రయోజనములు
20. దైవిక విధేయతను కనుపర్చడం ద్వారా ఏ ఆశీర్వాదములు లభించును?
20 దైవిక విధేయతను కనపర్చడం ద్వారా ప్రయోజనాలేమిటని అడగవచ్చును? నిజానికి అనేకములున్నవి. స్వాతంత్ర్యముగా వ్యవహరించే వారికి కలిగే అనేక కలతలనుండి, చింతలనుండి మనము తప్పించబడతాము. యెహోవా దేవునితో మంచి సంబంధమును కలిగివుంటాము. మన క్రైస్తవ సహోదరులతో శ్రేష్ఠమైన సహవాసమును కలిగివుంటాము. అంతేగాక చట్టానికి అనుగుణ్యంగా ప్రవర్తించుటద్వారా ప్రభుత్వ అధికారులవలన అనవసరమైన కష్టాలు తెచ్చుకోకుండా ఉంటాము. అంతేగాక దైవిక విధేయతను కాపాడుకొనుటద్వారా సామెతలు 27:11లో ఇవ్వబడిన ఉపదేశమునకు అనుగుణ్యంగా ప్రవర్తించిన వారమౌతాము: “నా కుమారుడా, జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.”
[అధస్సూచీలు]
a పయినీరు పరిచారకుడొకరు ఒక అవివాహిత పయినీరు ముందు తన భార్య తనకిచ్చే గౌరవము, ప్రేమగల మద్దతును ప్రశంసించాడు. ఈ ఒంటరి పయినీరు తన స్నేహితుడు ఆమె ఇతర గుణాలనుగూర్చి కూడా కొంత చెప్పివుంటే బాగుండేదనుకున్నాడు. కాని సంవత్సరముల తరువాత ఈ ఒంటరి పయినీరుకు వివాహమైనప్పుడు వివాహానందానికి భార్యయొక్క ప్రేమగల మద్దతు ఎంత ప్రాముఖ్యమో గుర్తించాడు.
b ఎంతగానో దేవుని వాక్యమును పఠించి, ప్రార్థనచేసిన తరువాత, జర్మనీలోని సహోదరులకు తానివ్వవలసిన జవాబు ఏమిటో స్పష్టంగా ఆయన కనుగొన్నాడు. వారు ఏమి చేయాలో చేయకూడదో చెప్పడం తన వంతుకాదు. కూటములనుగూర్చి సాక్ష్యమిచ్చుటనుగూర్చి వారు ఏమిచేయాలో స్పష్టంగా వారికి తెలియజేసిన దేవునివాక్యము వారియొద్ద ఉంది. ఆవిధంగా జర్మను సహోదరులు కూటములనుగూర్చి, ఆయన నామము మరియు ఆయన రాజ్యమునుగూర్చి సాక్ష్యమిచ్చు ఆజ్ఞను అజ్ఞాతంగా నెరవేర్చారు.
మీ జవాబులేమి?
◻ తన సమాచారాన్ని అందించు ప్రతినిధులుగా దేవుడు ఎవరెవరిని ఉపయోగించుకున్నాడు, ఆయన సేవకులు వారియెడల ఏ బాధ్యతను కలిగివున్నారు?
◻ ఏ యే సంబంధాలలో దైవిక విధేయత అన్వయిస్తుంది?
◻ దైవిక విధేయతను కనుపర్చడానికి ఏ లక్షణములు సహాయపడును?
◻ దైవిక విధేయతనుబట్టి ఏ ఆశీర్వాదములు లభించును?
[16వ పేజీలోని చిత్రం]
దేవుడు తన ప్రజలకు తన చిత్తాన్ని తెలియజేయటానికి యెరూషలేము ఆలయ వ్యవస్థను ఉపయోగించెను
[18వ పేజీలోని చిత్రం]
మనము దైవిక విధేయతను ప్రదర్శించగల రంగాలు