సహాయక ఏర్పాట్లు క్రైస్తవ ప్రేమను ప్రతిబింబిస్తాయి
“సహోదరులను ప్రేమించుడి,” అని అపొస్తలుడైన పేతురు తన తోటి క్రైస్తవులను కోరాడు. (1 పేతురు 2:17) అలాంటి ప్రేమ జాతి, సాంఘిక మరియు జాతీయ పరిధులను దాటి ప్రజలను నిజమైన సహోదరత్వం లోనికి నడిపించేదై యుండాలి. తొలి క్రైస్తవులలో వస్తుసంబంధ అవసరత ఏర్పడినప్పుడు, అవసరంలో ఉన్నవారికి పంచిపెట్టుటకై అపొస్తలులకు విరాళాలివ్వటానికి అనేకులను ప్రేమే ప్రేరేపించింది. “వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను.” అని ఆ వృత్తాంతం తెలియజేస్తున్నది.—అపొస్తలుల కార్యములు 2:41-45; 4:32.
మునుపటి రష్యా నందలి కొన్ని ప్రాంతాలు మరియు తూర్పు ఐరోపాలో అవసరతలోనున్న తమ సహోదరులకు ఆహారం మరియు బట్టలు సమకూర్చవలెనని యెహోవాసాక్షుల పరిపాలక సభ 1991 సంవత్సరాంతమున, పశ్చిమ ఐరోపాలోని వాచ్‌టవర్ సంస్థ బ్రాంచీలను ఆహ్వానించినప్పుడు అలాంటి ప్రేమే వ్యక్తపరచబడింది. అందులో చేరివున్న కొన్ని బ్రాంచీల నుండి వచ్చిన నివేదికల పరంపరను మేమిక్కడ అందజేస్తున్నాము.
స్వీడెన్
స్వీడెన్లోని 348 సంఘాలన్నిటికి, అటువంటి అవసరతను వివరిస్తూ డిశంబరు 5, 1991న ఒక ఉత్తరం వ్రాయబడింది. సహోదరులు వెంటనే స్పందించారు. కొన్ని దినాల్లోనే మొదటి చిన్న ట్రెయిలరు 15 టన్నుల పిండి, వంటనూనె, డబ్బాలలో ప్యాక్ చేయబడిన భీఫ్, పాలపొడి, అలాంటి ఇంకా ఇతర వస్తువులతో నింపబడి, రష్యాలోని సెంట్ పీటర్స్బర్గ్కు బయల్దేరింది. స్థానిక యెహోవాసాక్షులు ట్రక్కు నుండి వస్తువులను దింపి, అవసరతలో ఉన్నవారికి 750 పొట్లాలను త్వరగా పంచిపెట్టారు. తరువాత, మరి రెండు చిన్న ట్రెయిలర్లు రష్యాకు ఆహారాన్ని తీసుకువెళ్లాయి. మొత్తం మీద, 51.5 టన్నులకంటె ఎక్కువ స్వీడెన్ నుండి ఓడల ద్వారా రవాణా చేయబడ్డాయి.
వస్త్రాలను, చెప్పులను విరాళం ఇవ్వాలన్న అభీష్టం అన్ని అంచనాలను మించిపోయింది. వస్త్రాల ప్యాకేజీలు రాజ్య మందిరాల్లోకి కుప్పలు కుప్పలుగా వచ్చిచేరాయి. చాలమంది క్రైస్తవులు తమ స్వంత బట్టలను కూడ విరాళంగా ఇచ్చారు. ఇతరులు కొత్త వాటిని కొనితెచ్చారు. ఒక సహోదరుడు ఐదు సూట్లు కొన్నాడు. ఆశ్చర్యచకితుడైన దుకాణదారుడు, అలా కొనటానికి గల ఉద్దేశాన్ని తెలుసుకొని ఇంకా ఐదు సూట్లు విరాళంగా ఇచ్చాడు. ఇంకొక సహోదరుడు మేజోళ్లు, చేతితొడుగులు (గ్లోవ్స్) మరియు చిన్న రుమాళ్లు గల ఒక పెట్టెను కొన్నాడు. అవి ఎందుకు కొన్నాడో వివరించినప్పుడు షాపు యజమానుడు రెండు సూట్ల ఖరీదుకే 30 కొత్త సూట్లు ఇచ్చాడు. క్రీడలకు సంబంధించినవి అమ్మే దుకాణదారుడు 100 జతల కొత్త షూలను, బూట్లను విరాళంగా ఇచ్చాడు.
ఈ సామానంతా విభజించి, మళ్లీ ప్యాక్ చేసి, రవాణాచేయుటకు బ్రాంచికి తీసుకు రాబడింది. నలభై చిన్న ట్రెయిలర్లలో సరిపోగల వస్త్రాలు బ్రాంచీ వద్ద అధిక స్థలాన్ని ఆక్రమించాయి! పురుషులు, స్త్రీలు మరియు పిల్లలకు వేరు వేరుగా పెట్టెలలో ప్యాక్ చేయటానికి సహోదర సహోదరీలు వారాల తరబడి పనిచేశారు. రష్యా, యుక్రేన్ మరియు ఇస్టోనియాలకు వస్త్రాలను క్షేమంగా చేర్చటానికి 15 వేరు వేరు చిన్న ట్రెయిలర్లను ఉపయోగించారు.
మునుపటి రష్యాకు సంస్థ ట్రక్కులలో ఒకదానిని ఎనిమిది సార్లు నడిపించిన ఒక సహోదరుడు ఇలా చెప్పాడు: “గమ్యాల వద్ద సహోదరులు ఇచ్చిన స్వాగతం గొప్ప బహుమానం. వారు మమ్మల్ని హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు, వనరుల కొరత ఉన్నప్పటకీ వారు మాకు క్రైస్తవ ఉదారత విషయంలో చక్కని పాఠాన్ని నేర్పారు”.
ఫిన్లాండ్
ఫిన్లాండ్లో వాణిజ్యమందు తీవ్ర మాంద్యత, బహుళవ్యాప్తమైన నిరుద్యోగ సమస్య, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మునుపటి రష్యాలో ఉన్న తమ సహోదరులకు సహాయం చేయటానికి దాదాపు 18,000 మంది ఫిన్లాండ్ సహోదరులు చూపించిన సుముఖత గొప్పది. వారు సెంట్ పీటర్స్బర్గ్, ఇస్టోనియా, లాట్వయా, లిథువేనియా మరియు కాలినిన్గ్రాడ్లకు 58 టన్నుల ఆహారాన్ని 4,850 పెట్టెలలో పంపారు. ట్రక్కులలో ఉన్న ఖాళీ స్థలాన్ని 12 క్యూబిక్ మీటర్ల బట్టతో నింపారు. రాజ్యపనిలో ఉపయోగించటానికి 25 వాడేసిన కార్లు, వ్యాన్లు కూడ విరాళంగా ఇవ్వబడ్డాయి.
సెంట్ పీటర్స్‌బర్గ్‌లోని స్లాంటిలో ఉన్న 14 మంది ప్రచారకులు గల ఒక సంఘానికి కొన్ని ఆహార పెట్టెలు వచ్చాయి. వారు ఒక ఉత్తరంలో గొప్ప అభినందనలు తెల్పారు. “మా సంఘంలో 10 మంది వృద్ధ సహోదరీలున్నారు. మాలో చాలమందిమి తీవ్ర అనారోగ్యంతో వున్నందున ఆహారం కొరకు గంటల తరబడి లైన్లలో నిలబడలేము. అయినా మా పరలోక తండ్రి, ఈ కష్టసమయాల్లో నిరుత్సాహ పడనివ్వకుండా మా హృదయాలను ఆనందంతో నింపుతాడు. మేము 43 గృహబైబిలు పఠనాలను చేస్తున్నాము.” సెంట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న ఒక సహోదరికి సహాయక పార్సెల్ వచ్చినప్పుడు, దాన్ని తెరవటానికి ముందు రెండు గంటలసేపు ఏడ్చేంతగా చలించిపోయింది.
డెన్మార్క్
బాల్టిక్ సముద్ర ప్రవేశద్వారం వద్దవున్న ఈ చిన్న దేశంలోని 16,000 మంది యెహోవాసాక్షులు కలిసి 2,269 జతల కొత్త షూలను, మంచి నాణ్యమైన వస్త్రాలు గల 4,600 పెట్టెలు, 4,200 పెట్టెలలో 64 టన్నుల ఆహారంతో నిండిన 19 ట్రక్కులను యుక్రేన్కు పంపారు. జర్మనీలో ఉన్న ఒక సహోదరుడు ఐదు ట్రక్కులను బ్రాంచీ ఉపయోగించుకోనిచ్చాడు. తరువాత యుక్రేన్‌లో ఉన్న సహోదరులకు వాటిని విరాళంగా ఇచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చాక డ్రైవర్లలో ఒకరు ఇలా అన్నారు: “మేము తీసుకుపోయిన వాటికంటె వెనక్కి తెచ్చుకున్నవే ఎక్కువగా ఉన్నాయని మేము తెలుసుకున్నాము. మా యుక్రేనియన్ సహోదరులు చూపించిన త్యాగ బుద్ధి, ప్రేమ మా విశ్వాసాన్ని ఎంతో బలపర్చాయి”.
డ్రైవర్లు మునుపటి రష్యాలోని రోడ్లపై దొంగల గురించి జాగ్రత్త పడవలసి వచ్చేది. డెన్మార్క్ ట్రక్కులలో ఒకటి వెళ్లటానికి ముందు రోజున ఆ మార్గంలో ఒక దోపిడి జరిగింది. ఇంకొక సహాయ సంస్థ నుండి ఆహారాన్ని తీసుకువెళుతున్న ఐదు ట్రక్కులను, దొంగలు హెలికాప్టర్లను, చిన్నపాటి మెషీన్గన్లను ఉపయోగించి ఆపేశారు. డ్రైవర్లను రోడ్డు ప్రక్కన వదిలేసి ఐదు ట్రక్కులను వారు తీసుకున్నారు. అలాంటి ప్రమాదాలున్నప్పటికీ, డెన్మార్కు బ్రాంచి నుండి అన్నీ సహోదరులకు క్షేమంగా చేరాయి. అందుకు బదులుగా వారు, “ప్రియ డెన్మార్కు సహోదర సహోదరీల్లారా: మీ సహాయం మేము అందుకున్నాము. యెహోవా మీకు ప్రతిఫలమిస్తాడు.” అని ఆంగ్లంలో కష్టపడి వ్రాసిన చిట్టీని డ్రైవరుతో పంపించారు.
నెదర్లాండ్స్
నెదర్లాండ్స్ బ్రాంచి 52 టన్నుల ఆహారాన్ని 2,600 పార్సెళ్లలో పంపించింది. అవి యుక్రేన్కు రెండు వేరు వేరు ట్రక్కులలో పంపబడ్డాయి. తూర్పుదేశాల్లో రాజ్యసేవ కొరకు జర్మనీలోని సహోదరుల ద్వారా యీ విరాళం ఇవ్వబడినందున ప్రతిసారి ఆరు ట్రక్కులు అలాగే వుంచబడేవి. యుక్రేనియన్ సహోదరులు ఎక్కువ అవసరత ఉన్న ప్రాంతాలకు, సైబీరియా, మాస్కోలకు చాల ఆహారాన్ని చేరవేసారు. ఇంకను, డచ్చ్ సహోదరులు 736 క్యూబిక్ మీటర్ల బట్టను మరియు బూట్లను విరాళంగా ఇచ్చారు. ఒక ప్రైవేటు కారు వెంటవస్తూ వుండగా ట్రక్కులపై అవి లవేఫ్కు తీసుకురాబడ్డాయి.
జర్మన్, పోలాండ్ దేశాలగుండా ఎంతో దూరం ప్రయాణించి, యుక్రేనియా దేశసరిహద్దు పన్ను చెల్లింపును సుళువుగా ముగించుకుని ఉదయం మూడు గంటలకు ట్రక్కులు లవేఫ్ యొక్క పొలిమేరలను చేరాయి. డ్రైవర్లు ఇలా అంటున్నారు: “కొంత సేపటికి, ట్రక్కులను ఖాళీ చేయటానికి 140 మంది సహోదరుల బలగం వచ్చింది. పని మొదలు పెట్టటానికి ముందు ఐక్యంగా ప్రార్థించడం ద్వారా యెహోవాపై వారు ఆధారపడియున్నట్లు, ఆ దీన సహోదరులు చూపించారు. పని అయిపోయిన తరువాత యెహోవాకు కృతజ్ఞతగా ప్రార్థన చేయటానికి వారు మళ్లీ సమావేశమయ్యారు. వారికున్న కొంచెం నుండి అధికంగా ఇచ్చిన స్థానిక సహోదరుల ఆతిధ్యాన్ని స్వీకరించిన తరువాత మెయిన్ రోడ్డు వరకు మాకు రక్షణ ఏర్పాటు చేయబడింది, అక్కడ మమ్మును విడిచి వెళ్లక ముందు రోడ్డు ప్రక్కన ప్రార్థించారు.
“ఇంటికి తిరిగి వస్తున్న ఆ సుధీర్ఘ తిరుగు ప్రయాణంలో—జర్మన్, పోలాండ్ మరియు లెవేఫ్లోని సహోదరుల ఆతిధ్యమును గూర్చి అనగా వారి దృఢ విశ్వాసం మరియు ప్రార్థనా పూర్వక దృక్పథం; స్వయంగా తామే అవసరతలో ఉన్నప్పటికీ ఆహారం మరియు స్థలం ఏర్పాటు చేయటంలో వారి ఆతిధ్యం, వారు ప్రదర్శించిన ఐక్యత, సన్నిహితత్వం, వారి కృతజ్ఞతా భావం వంటి వాటిని గూర్చి తిరిగి ఆలోచించటానికి ఎంతో వుంది. అంత ఉదారంగా ఇచ్చిన మా స్వదేశీయ సహోదర సహోదరీలను గూర్చి కూడ మేము ఆలోచించాము.”
స్విట్జర్లాండు
స్విస్ బ్రాంచి యాకోబు 2:15, 16ను ఉదహరిస్తూ తన నివేదికను మొదలుపెట్టింది: “సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు, మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి, చలికాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము?” ఆ నివేదిక ఇంకను ఇలా కొనసాగింది: “అవసరతలో ఉన్న మన సహోదరులకు వస్తుదాయక సహాయాన్ని అందజేయమని యెహోవాసాక్షుల పరిపాలక సభ మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఈ లేఖనం జ్ఞాపకం వచ్చింది.
“వెంటనే అందరు బిజీ అయిపోయారు! కేవలం రెండు రోజులలో జర్మనీ నుండి అక్కడ జరిగే పని నిమిత్తం జర్మనీ వారు విరాళంగా ఇచ్చే మూడు ట్రక్కులతో కలిపి 12 టన్నుల ఆహారాన్ని 600 పార్సెళ్లలో నింపి కేవలం రెండు రోజులలో యుక్రేన్కు పంపబడ్డాయి. అన్ని క్షేమంగా చేరాయన్న వార్త ఇక్కడ ఉన్న మా సహోదరులకు చాల ఆనందాన్ని కలుగజేసింది. ఈమధ్యలో సంఘాలు వస్త్రాలను సేకరించాయి, వెంటనే అట్టపెట్టెలు, సూట్‌కేసులు మరియు సంచులతో త్వరలోనే మా బ్రాంచి అంతా నిండిపోయింది. సుదూర ఉత్తరాన ఉన్న తెలియని స్నేహితులకు స్విస్ పిల్లలు పంపిన కొన్ని బొమ్మలు కూడ పిల్లల వస్త్రాలున్న వాటిలో ఉన్నాయి. వస్త్రాల మధ్య ఎన్నో చాక్లెట్ బార్లు కూడ పెట్టారు.”
ఇవన్నీ ఎలా అందించడం? నివేదిక ఇలా తెలియజేసింది: “ఫ్రాన్సులోని బ్రాంచి రెండు చిన్న ట్రెయిలర్లను మరియు నలుగురు డ్రైవర్లను మా వద్ద వుంచడం ద్వారా మాకు సహాయం చేసింది. దానికి తోడు, 72 టన్నులను యుక్రేన్కు చేరవేయటానికి మా బ్రాంచి నుండి ఒక ట్రక్కు, స్థానిక సహోదరులకు చెందిన మరి నాలుగు ట్రక్కులు అవసరమయ్యాయి.” నూటఏబై మీటర్ల పొడుగున్న ట్రక్కులు లవేఫ్లోని డిపోకు క్షేమంగా చేరాయి, అక్కడ ట్రక్కులను ఖాళీ చేయటానికి సుమారు వందమంది స్థానిక సహోదరులు ఎదురుచూస్తుండిరి. వారి ముఖాలలో మిక్కుటమైన మెప్పు వ్యక్తమైనందువల్ల వారి భాష మాకు తెలియకపోవడం ఒక ఆటంకం కాలేదని డ్రైవర్లు నివేధించారు.
ఆస్ట్రియా
యుక్రేన్‌లో ఉజ్గొరాడ్ మరియు లవేఫ్లకు ఆస్ట్రియా సహోదరులు 48.5 టన్నుల ఆహారాన్ని, 5,114 పెట్టెల వస్త్రాలను, 6,700 జతల బూట్లను పంపించారు. మునుపటి యుగొస్లోవియాలోని ఓసిజెక్, జాగ్రేబ్, బెల్గ్రేడ్, మోస్టార్, సారాజెవాలకు కూడ 7 టన్నుల ఆహారాన్ని, 1,418 పెట్టెల వస్త్రాలను మరియు 465 జతల బూట్లను పంపించారు. బ్రాంచి ఇలా తెలియజేసింది: “నింపబడిన 34,000 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసియున్న 12 చిన్న ట్రెయిలర్లు మేము కలిగియుంటిమి. వీటిని చాలమట్టుకు రవాణా వ్యాపారం గల ఒక సహోదరుడు, ఆయన కుమారుడు రవాణా చేశారు.”
విరాళంగా ఇవ్వబడిన వస్త్రాలను గూర్చిన నివేదికలో ఇంకా ఇలా ఉన్నది: “ఒక అసెంబ్లీ హాలును మేము కేంద్ర డిపోగా వాడుకున్నాము. స్థలం లేకుండా పోయేంతవరకు, ట్రక్కు తరువాత ట్రక్కు వస్తూనే ఉండెను. మోషే దినాలలో వలె ప్రజలు ఇంకా తీసుకురాకుండ నిరోధించ వలసివచ్చింది. (నిర్గమకాండము 36:6) యెహోవాసాక్షులు కాని వారు కొంతమంది కూడ డబ్బు విరాళంగా ఇచ్చారు, ‘ఎందుకంటె ఇలా అయితే అవసరంలో ఉన్న వారికి అవి దక్కుతాయని మాకు తెలుసు’ అని వారన్నారు. అవసరమైన ఖాళీ పెట్టెలు కూడ బయటి సంస్థల నుండి ఏ ఖర్చు లేకుండానే మాకు లభించాయి.” అన్నీ వేరుచేసి ప్యాక్ చేసిన సహోదర సహోదరీలు 9 నుండి 80 సంవత్సరాల వయస్సుగల వారు. ప్రతి సూటుకు తగిన షర్టును, టైని జత చేయాలని కూడ వారు ప్రయత్నించారు.
“అన్ని బట్వాడాలు ఎక్కువ శ్రమలేకుండ జరగటానికి అవసరమైన కాగితాలను జారీ చేయటంలో మరియు అనేక సహాయ రవాణాలను సాధ్యపరచటంలో ఆస్ట్రియా మరియు సరిహద్దు అధికారులు ఎంతో సహాయకరంగా వుండిరి,” అని నివేదిక తెలియజేసింది.
ఇటలీ
రోమునుండి ఆస్ట్రియా, జెకోస్లోవాకియా మరియు పోలాండుల మీదుగా మునుపటి రష్యాకు దాదాపు 188 టన్నుల ఆహారం రెండు పెద్ద ట్రక్కుల ద్వారా పంపబడింది. ప్రతి జట్టులో ఆరుగురు డ్రైవర్లు, ఒక మెకానిక్, ఒక ఆటోఎలక్ట్రీషియన్, ఒక అనువాదకుడు, ఒక రవాణా ప్రతినిధి, ఒక వంటమనిషి, ఒక వైద్యుడు, జీపులో రక్షణ సిబ్బంది నాయకుడు మరియు మకాం పెట్టుటకు అవసరమైన వాటితో ఒక సహోదరుడు ఉండేవారు.
ఏడుగురు సప్లయర్ల నుండి ఆహారం సేకరించబడింది. బ్రాంచి ఇలా నివేదించింది: “మా సప్లయర్లు కొంతమంది, మా ప్రయత్నానికి గల కారణం తెలుసుకున్నప్పుడు వారు కూడ పాల్గొనటానికి ఇష్టపడ్డారు. బయటి సప్లయర్లు కొన్ని వందల కేజీల పాస్టా మరియు బియ్యం, ప్యాక్ చేసే పెట్టెలు విరాళంగా ఇచ్చారు. ఇంకా కొంతమంది ట్రక్కుల కొరకు మంచులో ప్రయాణించగల టయర్లను లేక డబ్బును విరాళంగా ఇచ్చారు.
“సహాయం చేయటానికి దొరికిన ఈ అవకాశాన్ని ఇటలీలోని సహోదరులు మెచ్చుకున్నారు. పిల్లలు కూడ విరాళం ఇవ్వటానికి ఇష్టపడ్డారు. రష్యాలో ఉన్న సహోదరులకు పెద్ద ట్యూనా చేప టిన్నును కొనటానికి సరిపోతుందని భావించి ఒక ఐదేళ్ల పిల్లవాడు కొంచెం విరాళం పంపించాడు. ఒక చిన్న అమ్మాయి, తనకు బడిలో మంచి మార్కులు వచ్చినందుకు, తన తలిదండ్రులకు ఓ బహుమతిని కొనటానికి తన అమ్మమ్మ తాతయ్యలు కొంత డబ్బును ఇచ్చారు. ‘కాని’ ఆమె ఇలా వ్రాసింది, ‘నాకున్నటువంటి మంచి ఆహార పదార్థాలన్ని నా సహోదరులలో చాలమందికి లేవని నేను తెలుసుకున్నప్పుడు, నా తలిదండ్రులకు నేనివ్వగల శ్రేష్ఠమైన బహుమానం ఆ సహోదరులకు సహాయం చేయటమేనని నేను భావించాను.’ చందా పెట్టెలో ఆమె చెప్పుకోదగినంత డబ్బును వేసింది. నేను ఇంకా ఎక్కువ డబ్బు పంపగలిగేలా నాకు మంచి మార్కులు వస్తూనే వుండాలని నేను నిరీక్షిస్తున్నాను’ అని చెప్పింది.” యుక్రేన్లోని సహోదరుల నుండి వచ్చిన మెప్పుతో కూడిన ఉత్తరాలు, ఇటలీ సహోదరుల మెప్పుతోకూడిన ఎన్నో మాటలు, తయారుచేయటం మరియు బట్వాడా చేయటంలోని మంచి అనుభవాలు ఎంతో కదిల్చేవిగాను, ప్రోత్సాహాన్నిచ్చేవిగాను, ఐక్యపరిచేవిగాను వున్నాయని చెప్తూ బ్రాంచి నివేదిక ముగించింది.
వేలాది మంది ప్రతినిధులకు ఆహారం
మునుపటి రష్యాలో యెహోవాసాక్షుల మొదటి అంతర్జాతీయ సమావేశం రష్యాలోని సెంట్ పీటర్స్‌బర్గ్‌లోని కిరావ్ స్టేడియంలో, 1992 జూన్ 28-30 వరకు జరిగింది. “వెలుగు ప్రకాశకులు” అనే మూలాంశముతో ఉన్న ఈ ప్రాముఖ్యమైన సమావేశానికి 46,200 మందికంటె ఎక్కువ ప్రతినిధులు 28 దేశాలనుండి హాజరయ్యారు. “సహోదరుల” యెడల క్రైస్తవ ప్రేమను కనుపర్చటానికి అది ఇంకొక అవకాశాన్ని ఇచ్చింది.—1 పేతురు 2:17.
సమావేశ సమయంలో ఉపయోగించటానికి మునుపటి రష్యానుండి వచ్చిన వేలాదిమంది సమావేశ ప్రతినిధులకు డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్, మరియు పశ్చిమ ఐరోపాలోని ఇతర ప్రాంతాల నుండి టన్నుల కొలది వచ్చిన ఆహారం ఉచితంగా పంచిపెట్టబడింది. ఆఖరి భాగం అయిపోయిన తరువాత వారు సమావేశాన్ని వదిలి, ఇంటికి వెళ్లేటప్పుడు ప్రయాణంలో వాడుకోవటానికి ఆహార పొట్లాలు ఇవ్వబడ్డాయి.
ఇవ్వడం ఒకవైపునుండి మాత్రమే కాదు అంటే తూర్పు వైపు మాత్రమే యీ విరాళములు వెళ్లలేదని యీ నివేదికలు తెలియజేస్తున్నవి. అక్కడ ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. తూర్పువైపుకు ఆహారం మరియు వస్త్రాలు వెళ్లాయి, అయితే పడమటి వైపుకు హృదయాన్ని పులకరింపజేసే లెక్కలేనన్ని ప్రేమలు మరియు దశాబ్దాల తరబడి వచ్చిన వత్తిడి, కష్టాలలో కూడ వేలాదిమంది యెహోవా ఆరాధికుల విశ్వాసం, పట్టుదలను ప్రతిబింబిస్తూ విశ్వాసాన్ని రేకెత్తించే అనుభవాలు వెళ్లాయి. అలా, యేసు మాటలలోని “పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యము” అనే సత్యాన్ని ఇరుపక్షాల వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.—అపొస్తలుల కార్యములు 20:35.
[21వ పేజీలోని బాక్సు/చిత్రం]
1. ఫిన్లాండ్ నుండి: సెంట్ పీటర్స్బర్గ్, రష్యా; టాల్లిన్ మరియు టార్టు, ఇస్టోనియా; రిగా, లాట్వయ, విల్నియస్ మరియు కౌనాస్, లిథూనియా; కాలెనిన్గ్రాడ్, రష్యా; పెట్రోజావోస్క్, కారిలియా
2. నెధర్లాండు నుండి: లవేఫ్, యుక్రేన్
3. స్వీడెన్ నుండి: సెంట్ పీటర్స్బర్గ్, రష్యా, లవేఫ్, యుక్రేన్; న్యెవినెమిస్క్, రష్యా
4. డెన్మార్క్ నుండి: సెంట్ పీటర్స్బర్గ్, రష్యా; లవేఫ్, యుక్రేన్
5. ఆస్ట్రియా నుండి: లవేఫ్, యుక్రేన్; బెల్గ్రేడ్, మోస్టర్, ఓసిజెక్, సారాజెవొ, జాగ్రెబ్ (మునుపటి యుగోస్లోవియాలో)
6. స్విట్జర్లాండు నుండి: లవేఫ్, యుక్రేన్
7. ఇటలీ నుండి: లవేఫ్, యుక్రేన్
[23వ పేజీలోని చిత్రాలు]
స్వీడెన్ బ్రాంచిలోని బట్టల పెట్టెలు
సహాయ వస్తువులను నింపుట
ఒక పార్శెల్లోని ఆహార పదార్థాలు
డెన్మార్క్ నుండి సీమపంది మాంసం
పదకొండు ట్రక్కులు మరియు ఒక కారు
ఆస్ట్రియా బ్రాంచి నందలి పార్శెళ్లు మరియు సూట్‌కేసులు
యుక్రేన్, లవేఫ్ నొద్ద ట్రక్కును ఖాళీ చేయటం