కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 5/1 పేజీలు 9-14
  • దైవిక విధేయత—ఎందుకు మరియు ఎవరు చూపాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవిక విధేయత—ఎందుకు మరియు ఎవరు చూపాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా దేవునికి లోబడటం ఆయనకెందుకు అచ్చియున్నాము
  • దైవిక విధేయతకు యేసుక్రీస్తు పరిపూర్ణమైన మాదిరి
  • దైవిక విధేయతకు పురాతన మాదిరులు
  • లోబడుటలో పౌలు మాదిరి
  • దైవిక విధేయత మననుండి ఏమి కోరుతుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • దేవుడు చేసిన శిరస్సత్వ ఏర్పాటుకు లోబడుతూ ప్రయోజనం పొందండి
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • భార్య చూపించే విధేయత దాని భావం ఏమిటి?
    తేజరిల్లు!—1997
  • భార్యలారా, మీ భర్తలను ప్రగాఢంగా గౌరవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 5/1 పేజీలు 9-14

దైవిక విధేయత—ఎందుకు మరియు ఎవరు చూపాలి?

“యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.”—యిర్మీయా 10:23.

1. ఎక్కువగా నేడు ఏ విధమైన స్వాతంత్ర్యములు ఉన్నతముగా ఎంచబడుతున్నాయి?

ఉత్తర అమెరికాలోని 13 బ్రిటీష్‌ కాలనీలు తమ మాతృదేశమునుండి 18వ శతాబ్దములో స్వాతంత్ర్యము పొందడం ప్రఖ్యాతిగాంచిన మానవ చరిత్ర వృత్తాంతము. పరాయి ఆధిపత్యం నుండి వారు స్వేచ్ఛా స్వతంత్రతలను కోరుకున్నారు. తద్వారా స్వేచ్ఛ లభించింది. రాజకీయ మరియు ఆర్థిక స్వాతంత్ర్యము గొప్ప ప్రయోజనకరమైనదే కాగలదు. ఇటీవలి కాలాల్లో కొన్ని తూర్పు ఐరోపా దేశాలు రాజకీయ స్వాతంత్ర్యము పొందాయి. అయితే, ఆ దేశాలలో స్వాతంత్ర్యముతో పాటు, అనేక గంభీర సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయని ఒప్పుకొనవలసిందే.

2, 3. (ఎ) ఏవిధమైన స్వాతంత్ర్యము కోరదగింది కాదు? (బి) ఈ వాస్తవము మొదట ఎలా చూపబడింది?

2 పరిపరి విధాల స్వాతంత్ర్యము కోరదగినదైనను, మనము కోరదగని స్వాతంత్ర్యము ఒకటున్నది. ఏమిటది? మానవ నిర్మాణకుడైన యెహోవా దేవుని నుండి స్వాతంత్ర్యము. అది శాపమేగాని ఆశీర్వాదముకాదు. ఎందుకనగా పైన ఎత్తివ్రాయబడిన యిర్మీయా మాటలు చక్కగా చూపునట్లు తనను రూపించిన వానినుండి వేరై స్వతంత్రంగా వ్యవహరించాలని మానవుడు ఎన్నడూ ఉద్దేశించబడలేదు. ఇంకోమాటలో చెప్పాలంటే మానవుడు తన నిర్మాణకునికి లోబడియుండాలని సృష్టించబడ్డాడు. మన సృష్టికర్తకు లోబడియుండటమంటే ఆయనకు విధేయులం కావడమే.

3 ఆ సత్యము ఆదికాండము 2:16, 17లో వ్రాయబడిన మాటలలో, మొదటి మానవజతకు స్పష్టముగా వెల్లడించబడింది. అక్కడ ఇలా వ్రాయబడింది: “మరియు దేవుడైన యెహోవా—ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను”.—ఆదికాండము 3:19; రోమీయులు 5:12.

4, 5. (ఎ) మానవులు దేవునికి లోబడియుండుటను తిరస్కరించినందున ఏమి సంభవించింది? (బి) ఏ నైతిక ధర్మాన్ని తప్పించుకోజాలము?

4 మానవులు దేవునికి లోబడుటకు నిరాకరించడం బుద్ధిహీనం మరియు నైతికంగా తప్పు. లోకములో అది విస్తారమైన అక్రమము, నేరము, హింస మరియు లైంగిక సుఖవ్యాధులకు మూలమైన లైంగిక దుర్నీతికి నడిపింది. అంతేగాక ఈనాడు తెగులువలె వ్యాపించిన బాల్యనేరాలకు ముఖ్యకారణం యువకులు యెహోవాకు, వారి తలిదండ్రులకు, వారి దేశ చట్టాలకు లోబడకుండటం కాదా? ఈ స్వేచ్ఛాయుతమైన బుద్ధి అనేకమంది వేసుకొనే చిందరవందరైన దుస్తులు మరియు వారు ఉపయోగించే దుర్భాషలో కనబడుతుంది.

5 అయితే, “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటకోయును” అను సృష్టికర్తయొక్క నిష్కర్షమైన నైతిక ఆజ్ఞనుండి ఎవరూ తప్పించుకొనలేరు.—గలతీయులు 6:7, 8.

6, 7. లోబడివుండుటను తిరస్కరించుటకు మూలకారణమేమి, దీనిని ఏ మాదిరులలో చూడగలము?

6 లోబడివుండేందుకు ఇప్పుడు కనిపిస్తున్న తిరస్కారానికి మూల కారణమేమి? క్లుప్తంగా చెప్పాలంటే స్వార్థము, గర్వము. అందుకే మొదటి స్త్రీయైన హవ్వ సర్పముచే మోసగించబడుటకు అనుమతించి నిషేధించబడిన ఫలమును తిన్నది. ఆమె అణకువ వినయముగలదైతే దేవునివలె కావాలని—తనకైతానే మంచి చెడ్డలను నిర్ణయించుకునే హక్కును కల్గియుండాలనే—శోధన ఆమెకు ప్రీతికరంగా ఉండేదికాదు. ఆమె నిస్వార్థపరురాలైతే, తన నిర్మాణకుడైన యెహోవా దేవుడు నిషేధించిన దానిని ఆశించివుండేది కాదు.—ఆదికాండము 2:16, 17.

7 ఆదాము హవ్వలు పడిపోయిన కొద్దికాలానికే గర్వము మరియు స్వార్థము కయీనును తన తమ్ముడైన హేబెలును చంపునట్లు చేసింది. అలాగే స్వార్థం కొంతమంది దూతలను కూడా తమ పూర్వస్థితిని విడిచిపెట్టి, ఇంద్రియ సుఖాలను అనుభవించుటకు శరీరములు ధరించుకొనేలా చేసింది. స్వార్థము గర్వమే నిమ్రోదును కూడా పురికొల్పింది. అప్పటినుండి అదే లక్షణము ఎక్కువ లోకపాలకులలో చూస్తున్నాము.—ఆదికాండము 3:6, 7; 4:6-8; 1 యోహాను 3:12; యూదా 6.

యెహోవా దేవునికి లోబడటం ఆయనకెందుకు అచ్చియున్నాము

8-11. దైవిక విధేయతను కనపర్చుటకు నాలుగు బలమైన కారణాలేవి?

8 మన నిర్మాణకుడైన యెహోవా దేవునికి లోబడటం ఎందుకు మన బాధ్యత? అన్నిటికన్నా మిన్నగా ఆయన విశ్వాధిపతియై యున్నాడు గనుక లోబడియుండాలి. సమస్త అధికారము ఆయనలో ఉంది. ఆయన మన న్యాయాధిపతి, శాసనకర్త, రాజు. (యెషయా 33:22) ఆయననుగూర్చి ఎంతో యుక్తంగా ఇలా వ్రాయబడింది: “మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియులేదు. మన మెవనికి లెక్క యొప్ప చెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.”—హెబ్రీయులు 4:13.

9 అంతేగాక మన నిర్మాణకుడు సర్వశక్తిమంతుడై యున్నందున, ఆయనను ఎదిరించి ఎవరూ విజయమొందలేరు. తనకు అణకువతో లోబడియుండే కర్తవ్యమును ఎవరూ త్రోసిపుచ్చలేరు. పురాతన కాల ఫరో నాశనమైనట్లు, దేవుని నియమిత కాలంలో నశించబోయే సాతానువలె ఎదురాడువారంతా ఎప్పుడో ఒకప్పుడు నాశనమౌతారు.—కీర్తన 136:1, 11-15; ప్రకటన 11:17; 20:10, 14.

10 లోబడటం వివేకముగల ప్రాణులందరి విధి, ఎందుకనగా తమ నిర్మాణకుని సేవించు సంకల్పం కొరకే వారలా ఉనికిలో ఉన్నారు. ప్రకటన 4:11 ఇలా అంటుంది: “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమునుబట్టి అవి యుండెను. దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుటవేసిరి.” ఆయన గొప్ప కుమ్మరివాడు, మరియు మానవ ఘటములను ఆయన తన సంకల్పము నెరవేర్చుకొనుటకై చేస్తాడు.—యెషయా 29:16; 64:8.

11 మన నిర్మాణకుడు సర్వజ్ఞుడను సత్యాన్ని మనము మరువనేకూడదు. మనకు శ్రేష్ఠమైనదేదో ఆయనకు తెలుసు. (రోమీయులు 11:33) ఆయన చట్టములు ‘మన మేలుకొరకే’. (ద్వితీయోపదేశకాండము 10:12, 13) అన్నిటికంటె మిన్నగా, “దేవుడు ప్రేమా స్వరూపి.” మనకు శ్రేష్ఠమైన దానిని చేయాలని ఆయన కోరుతున్నాడు. మన నిర్మాణకుడైన యెహోవా దేవునికి లోబడియుండుటకు మనమెన్ని బలమైన కారణములను కల్గియున్నాము!—1 యోహాను 4:8.

దైవిక విధేయతకు యేసుక్రీస్తు పరిపూర్ణమైన మాదిరి

12, 13. (ఎ) దైవికంగా లోబడుటను యేసుక్రీస్తు ఎలా కనపరచాడు? (బి) శారా విధేయతను ఎలా చూపింది?

12 నిస్సందేహంగా, యెహోవా అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు దైవిక విధేయతలో మనకు పరిపూర్ణ మాదిరినందిస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులు 2:6-8లో దానిని ఇలా సూచించాడు: “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని తన్నుతానే రిక్తునిగా చేసికొనెను.” యేసు భూమిపైనున్నప్పుడు పదేపదే తాను తన స్వంతగా ఏమిచేయలేదని చెప్పాడు. ఆయన స్వతంత్రంగా వ్యవహరించలేదు. ఎల్లప్పుడు తన పరలోక తండ్రికి లోబడియున్నాడు.

13 యోహాను 5:19, 30లో మనము ఇలా చదువుతాము: “కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను—తండ్రియేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును అలాగే చేయును. నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను వినునట్లుగా తీర్పుతీర్చుచున్నాను. నన్ను పంపినవాని చిత్తప్రకారమే చేయగోరుదునుగాని నా యిష్టప్రకారము చేయగోరను. గనుక నా తీర్పు న్యాయమైనది.” అలాగే తాను అప్పగించబడబోవు రాత్రి ఆయన అనేకమార్లు “నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.”—మత్తయి 26:39, 42, 44; యోహాను 7:28; 8:28, 42 కూడా చూడండి.

దైవిక విధేయతకు పురాతన మాదిరులు

14. ఏ విధాలుగా నోవహు దైవికంగా లోబడుటను చూపించాడు?

14 తొలికాలంలో దైవిక విధేయతకు మాదిరులుగా ఉన్న మానవులలో నోవహు ఒకడు. ఆయన మూడు విధములుగా తన విధేయతను ప్రదర్శించెను. ఒకటి ఆయన నీతిమంతుడైయుండి, తన తరంవారిలో నిందారహితునిగా నిజమైన దేవునితో నడిచెను. (ఆదికాండము 6:9) రెండు, ఓడను నిర్మించడం ద్వారా “దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.” (ఆదికాండము 6:22) మూడు, “నీతిని ప్రకటించినవానిగా” ఆయన రానైయున్న జలప్రళయమునుగూర్చి హెచ్చరిక చేసెను.—2 పేతురు 2:5.

15, 16. (ఎ) దైవికంగా లోబడుటలో అబ్రహాము ఏ మంచి మాదిరినుంచాడు? (బి) సారా ఎలా విధేయతను కన్పర్చింది?

15 దేవునికి లోబడుటలో మరొక ఉన్నతమైన మాదిరి అబ్రాహాము. “నీవు లేచి నీ దేశమునుండి . . . వెళ్లుము” అను దేవుని ఆజ్ఞకు లోబడటం ద్వారా ఆయన తన విధేయతను ప్రదర్శించాడు. (ఆదికాండము 12:1) అనగా సౌఖ్యమైన పరిసరములుగల ఊరు (పురావస్తుశాస్త్ర పరిశోధనలు సూచించిన ప్రకారం ప్రాధాన్యతలేని పట్టణం కాదు) పట్టణమును విడిచిపెట్టి పరదేశములో వంద సంవత్సరములు స్థిరనివాసంలేని దేశ సంచారం చేశాడు. అంతేగాక తన కుమారుడైన ఇస్సాకును యిష్టపూర్వకంగా అర్పించే గొప్ప పరీక్షను ఎదుర్కొనుటలోను అబ్రాహాము దైవిక విధేయతను చూపాడు.—ఆదికాండము 22:1-12.

16 దేవునికి లోబడుటలో అబ్రాహాము భార్యయైన శారా మనకు మరొక మంచి మాదిరినుంచింది. పరాయి దేశములో తిరుగుట నిశ్చయంగా అనేక అసౌకర్యాలను కల్గించింది, కాని ఆమె ఫిర్యాదు చేసినట్లు ఎక్కడను మనము చదువము. అబ్రాహాము ఆమెను తన సహోదరిగా అన్యపాలకుల ముందు చూపిన రెండు సందర్భాలలో దైవిక విధేయతకు ఆమె మంచి మాదిరినుంచింది. ఈ రెండు సమయాల్లో ఆమె దాదాపు వారి ఉపపత్నుల గృహములో చేర్చబడినను సహకరించింది. ఆమె దైవిక విధేయతకు మరొక నిదర్శనమేమంటే ఆమె తనలోతాను తన భర్తను “యజమానుడు” అని సంబోధిస్తూ, దానిని తన హృదయపూర్వక మనోభావంగా ప్రదర్శించింది.—ఆదికాండము 12:11-20; 18:12; 20:2-18; 1 పేతురు 3:6.

17. ఇస్సాకు దైవిక విధేయత చూపాడని ఎందుకు చెప్పవచ్చును?

17 దైవిక విధేయతకు అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు చూపిన మాదిరిని కూడా మనము పరిశీలిద్దాము. యూదుల సాంప్రదాయం ప్రకారం ఇస్సాకును బలిగా అర్పించమని తన తండ్రియైన అబ్రాహామును యెహోవా ఆజ్ఞాపించినప్పుడు ఇస్సాకు 25 సంవత్సరముల వయస్సుగలవాడు. తిరుగుబాటు చెయ్యాలనుకుంటే తనకంటె 100 సంవత్సరములు పెద్దవాడైన తన తండ్రిపై ఇస్సాకు సులభంగా తిరగబడేవాడే. బలివ్వడానికి జంతువేమి తమ యొద్ద లేకపోవడం ఇస్సాకుకు ఆశ్చర్యం కల్గించినను, వధించే కత్తినుపయోగించేటప్పుడు ఎదురయ్యే అతని అప్రయత్నక స్పందనలను అదుపుచేయడానికి ఆయనను బలిపీఠంపై పెట్టి కాళ్లు చేతులు కట్టేస్తుంటే వినయంగా తన తండ్రికి లోబడ్డాడు.—ఆదికాండము 22:7-9.

18. మాదిరికరమైన దైవిక విధేయతను మోషే ఎలా కనపర్చాడు?

18 సంవత్సరముల తదుపరి దైవిక విధేయతకు మోషే మనకు మంచి మాదిరినుంచాడు. “మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు” అని ఆయనను వర్ణించుటలో అది నిశ్చయంగా కనబడుతుంది. (సంఖ్యాకాండము 12:3) తిరుగుబాటుచేసే 20 లేదా 30 లక్షలమంది ప్రజలకు పైవిచారణ చేయవలసినవాడై అరణ్యములో 40 సంవత్సరములు విధేయతతో యెహోవా ఆజ్ఞలు నెరవేర్చాడంటే నిశ్చయంగా ఆయన దైవిక విధేయతకు ఇది రుజువైయుంది. ఆయనను గూర్చి వ్రాయబడిన వృత్తాంతము ఇలా చెబుతుంది: “మోషే ఆ ప్రకారం చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.”—నిర్గమకాండము 40:16.

19. ఏ మాటలద్వారా యోబు దైవిక విధేయతను చూపాడు?

19 దైవిక విధేయతను కనపర్చడంలో అతి శ్రేష్ఠమైన మాదిరి చూపించినవారిలో మరొకడు యోబు. పిల్లలతో సహా యోబునకు కలిగిన సమస్తమును నిర్మూలం చేయడానికి, “అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో మొత్తుటకు” ఆయన సాతానును అనుమతించినప్పటికి, యోబు భార్య “నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మ”ని చెప్పినను యోబు దైవిక విధేయతను కనపరచి ఆమెతో: “మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను.” (యోబు 2:7-10) యోబు 13:15లో వ్రాయబడిన మాటలు ఆయనకున్న అట్టి మనస్తత్వమును చూపుతున్నవి: “ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.” నిజానికి యోబు తన స్వంత నీతినిగూర్చి ఎక్కువగా చింతించినను, తనయొద్దకు వచ్చిన కపట ఆదరణకర్తలతో యెహోవా చివరకు చెప్పిన మాటలను మనము గమనించాలి: “నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదను మండుచున్నది.” యోబు నిశ్చయంగా దైవిక విధేయతలో మనకొక మంచి మాదిరినుంచుతున్నాడు.—యోబు 42:7.

20. ఏయే విధాలలో దావీదు దైవికంగా లోబడుటను ప్రదర్శించాడు?

20 హెబ్రీలేఖనముల నుండి మరొక ఉదాహరణ చెప్పాలంటే దావీదును గూర్చి చెప్పాలి. రాజైన సౌలు దావీదును ఒక జంతువువలె వేటాడుతున్నప్పుడు, సౌలును వధించి తన కష్టాలను కడతేర్చుకోగల రెండు అవకాశాలు దావీదుకు లభించాయి. అయినా దావీదుకున్న దైవిక విధేయత అలాచేయకుండా ఆయనను ఆపింది. ఆయన మాటలు 1 సమూయేలు 24:6లో ఇలా వ్రాయబడినవి: “ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను.” (1 సమూయేలు 26:9-11 కూడా చూడండి.) తన పొరపాట్లు లేక పాపమునకు ఆయన కివ్వబడిన గద్దింపును అంగీకరించుట ద్వారాకూడా ఆయన దైవిక విధేయతను చూపాడు.—2 సమూయేలు 12:13; 24:17; 1 దినవృత్తాంతములు 15:13.

లోబడుటలో పౌలు మాదిరి

21-23. ఏ అనేక సందర్భాలలో అపొస్తలుడైన పౌలు దైవిక విధేయతను కనపర్చాడు?

21 క్రైస్తవ గ్రీకులేఖనములలో దైవిక విధేయతకు గొప్ప మాదిరిగా మనకు అపొస్తలుడైన పౌలు ఉన్నాడు. తన అపొస్తలత్వపు పరిచర్యలోని ఇతర రంగాలన్నిటిలో ఎలాచేశాడో అలాగే ఈ విషయంలోనూ తన యజమానుడైన యేసుక్రీస్తును ఆయన అనుకరించాడు. (1 కొరింథీయులు 11:1) ఏ ఇతర అపొస్తలులకంటెను యెహోవా ఈయనను ఎక్కువ శక్తివంతంగా ఉపయోగించుకున్నను, ఆయన ఎన్నడూ స్వతంత్రముగా వ్యవహరించలేదు. అన్యజనులలోనుండి మారినవారు సున్నతిపొందాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు జరిగిన దానిని లూకా మనకు ఇలా చెబుతున్నాడు: “ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరు యెరూషలేమునకు అపొస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి.”—అపొస్తలుల కార్యములు 15:2.

22 పౌలు మిషనరీ పనిని గూర్చి గలతీయులు 2:9లో మనకిలా చెప్పబడింది: “స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.” పౌలు స్వతంత్రంగా వ్యవహరించకుండా నడిపింపును కోరాడు.

23 అలాగే, పౌలు చివరిసారి యెరూషలేములోనున్నప్పుడు, మోషే ధర్మశాస్త్రం విషయంలో ఆయన మతభ్రష్టుడుకాదని అందరూ ఎరుగునట్లు, దేవాలయమునకు వెళ్లి ధర్మశాస్త్ర నియమాలను అనుసరించమని పెద్దలు ఉపదేశించగా పౌలు ఆ ఉపదేశమును అంగీకరించాడు. ఆయన అలా చేయడం అల్లరి మూకలు తనపైబడుటకు కారణమైనందున పెద్దల మాటకు లోబడి పొరపాటుచేశాడా? ఏవిధంగాను కాదు. అపొస్తలుల కార్యములు 23:11లో మనము చదువుదాని బట్టి అది అర్థమౌతుంది: “ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి—ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలోకూడ సాక్ష్యమియ్య వలసియున్నదని చెప్పెను.”

24. రాబోవు శీర్షికలో లోబడుటయొక్క ఏ ఇతర రంగాలు చర్చించబడును?

24 లోబడియుండటానికిగల బలమైన కారణాలను, అలాగే లోబడియున్నవారి గొప్పమాదిరులను మనకు లేఖనములు అందిస్తున్నవి. యెహోవాదేవునికి లోబడివుండగల వివిధ రంగాలను, అలా ఉండటానికి తగిన సహాయములను, దాని ఫలితాలను మనము తదుపరి శీర్షికలో పరిశీలిద్దాము.

మీరెలా జవాబిస్తారు?

◻ ఏవిధమైన స్వాతంత్ర్యము కోరదగినది కాదు?

◻ లోబడుటకు తిరస్కరించడంలోని మూల కారణమేమి?

◻ ఏ కారణాలనుబట్టి యెహోవాకు లోబడియుండవలసిన బాధ్యత మనపై ఉన్నది?

◻ దైవికంగా లోబడుటకు ఏ మంచి ఉదాహరణలను లేఖనములిచ్చు చున్నవి?

[10వ పేజీలోని చిత్రం]

జలప్రళయము తదుపరి దైవికంగా లోబడుటపై తిరుగుబాటు చేయడంలో మొదటి పరిపాలకుడు నిమ్రోదు

[13వ పేజీలోని చిత్రం]

దైవికంగా లోబడుటకు నోవహు, నిష్కళంక మాదిరి.—ఆదికాండము 6:14, 22

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి