15వ అధ్యాయం
దేవుడు చేసిన శిరస్సత్వ ఏర్పాటుకు లోబడుతూ ప్రయోజనం పొందండి
యెహోవా ఇష్టం చేయడానికి సంస్థీకరించబడాలంటే, మనం ఈ విశ్వంలో సర్వోన్నతుడైన దేవునికి లోబడి ఉండడం ప్రాముఖ్యం. మనం క్రైస్తవ సంఘంలో దేవుని కుమారుడైన యేసు శిరస్సత్వాన్ని గుర్తిస్తాం, అలాగే జీవితంలోని ఇతర రంగాల్లో కూడా శిరస్సత్వ సూత్రాన్ని పాటిస్తాం. అలా, దేవుడు చేసిన శిరస్సత్వ ఏర్పాటుకు లోబడినప్పుడు మనందరం ప్రయోజనం పొందుతాం.
2 అధికార ఏర్పాటుకు లోబడడం అనే ఆలోచనను ఏదెను తోటలో యెహోవా మనుషులకు పరిచయం చేశాడు. ఆదికాండం 1:28 లో అలాగే 2:16, 17 లో ఆయనిచ్చిన ఆజ్ఞల్లో ఆ విషయం స్పష్టమౌతుంది. భూమ్మీదున్న మిగతా జీవులన్నీ మనుషులకు లోబడాలి, ఆదాముహవ్వలు దేవుని ఇష్టానికి, ఆయన అధికారానికి లోబడాలి. దేవుడు ఏర్పాటు చేసిన ఈ అధికారానికి లోబడడం వల్ల శాంతి నెలకొంటుంది, అలాగే అన్నీ క్రమపద్ధతిలో జరుగుతాయి. శిరస్సత్వ సూత్రం ఆ తర్వాత 1 కొరింథీయులు 11:3 లో నొక్కిచెప్పబడింది. అక్కడ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మీరు ఈ విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను: ప్రతీ పురుషునికి శిరస్సు క్రీస్తు; స్త్రీకి శిరస్సు పురుషుడు; క్రీస్తుకు శిరస్సు దేవుడు.” ఈ ఏర్పాటు అంతటిలో, యెహోవా తప్ప ప్రతీఒక్కరూ శిరస్సత్వానికి లోబడాలని ఆ లేఖనం సూచిస్తుంది.
3 నేడు చాలామంది ప్రజలు శిరస్సత్వ సూత్రాన్ని గుర్తించట్లేదు లేదా దానికి లోబడట్లేదు. ఎందుకు? ఎందుకంటే, మన మొదటి మానవ తల్లిదండ్రులు దేవుని సర్వోన్నత శిరస్సత్వాన్ని ఉద్దేశపూర్వకంగా నిరాకరించినప్పుడు సమస్య మొదలైంది. (ఆది. 3:4, 5) అయితే, వాళ్ల స్వేచ్ఛకు రెక్కలు రాలేదు. బదులుగా, వాళ్లు చెడ్డదూత అయిన సాతాను అధికారం కిందకి వెళ్లారు. ఆ మొదటి తిరుగుబాటు మనుషులందర్నీ దేవునికి దూరం చేసింది. (కొలొ. 1:21) ఫలితంగా, నేడు మనుషుల్లో చాలామంది దుష్టుని గుప్పిట్లో ఉన్నారు.—1 యోహా. 5:19.
4 దేవుని వాక్యంలోని సత్యాన్ని నేర్చుకుని, దాని ప్రకారం జీవించడంవల్ల, మనం సాతాను ప్రభావం నుండి బయటపడ్డాం. సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్న సాక్షులుగా, మనం యెహోవాను మన సర్వోన్నతాధిపతిగా అంగీకరిస్తాం. రాజైన దావీదులాగే మనం కూడా, యెహోవాను “అందరి మీద” అధిపతిగా గుర్తిస్తాం. (1 దిన. 29:11) అవును, మనం వినయంగా ఇలా ఒప్పుకుంటాం: “యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని చేశాడు, మనం ఆయన వాళ్లం. మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం.” (కీర్త. 100:3) యెహోవా సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి ఆయన గొప్పవాడని, మన పూర్తి విధేయత పొందడానికి అర్హుడని మనం గుర్తిస్తాం. (ప్రక. 4:11) మనం సత్యదేవుని పరిచారకులుగా, దేవునికి లోబడే విషయంలో పరిపూర్ణ ఆదర్శాన్ని ఉంచిన యేసుక్రీస్తును అనుసరిస్తాం.
5 భూమ్మీద పడిన బాధల నుండి యేసు ఏం నేర్చుకున్నాడు? హెబ్రీయులు 5:8 ఇలా చెప్తుంది, “ఆయన దేవుని కుమారుడే అయినా, తాను పడిన బాధల వల్ల విధేయత నేర్చుకున్నాడు.” అవును, శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కూడా యేసు తన పరలోక తండ్రికి నమ్మకంగా లోబడ్డాడు. అంతేకాదు యేసు తనంతట తాను ఏ పనీ చేయలేదు; తనంతట తానే బోధించలేదు; తన సొంత మహిమ కోరుకోలేదు. (యోహా. 5:19, 30; 6:38; 7:16-18) పరిచర్య చేస్తున్నప్పుడు యేసు తన తండ్రి ఇష్టాన్ని సంతోషంగా చేశాడు. అలా చేయడం వల్ల వ్యతిరేకత, హింస వచ్చింది. (యోహా. 15:20) అయినా, ఆయన తన దేవునికి లోబడ్డాడు. యేసు “తనను తాను తగ్గించుకుని . . . హింసాకొయ్య మీద చనిపోయేంతగా విధేయుడయ్యాడు.” అలా ఆయన యెహోవాకు పూర్తిగా లోబడడంవల్ల ఎన్నో ఆశీర్వాదాలు వచ్చాయి. మనుషులకు శాశ్వత రక్షణ సాధ్యమైంది; యేసు హెచ్చించబడ్డాడు; తన తండ్రికి మహిమ కలిగింది.—ఫిలి. 2:5-11; హెబ్రీ. 5:9.
మన జీవితంలోని ఏయే రంగాల్లో శిరస్సత్వ ఏర్పాటుకు లోబడాలి?
6 మనం యెహోవా ఇష్టం చేస్తూ ఆయనకు లోబడినప్పుడు, ఆయన సర్వాధిపత్యాన్ని తిరస్కరించేవాళ్లు పడే ఎన్నో ఆందోళనల్ని, చిరాకుల్ని తప్పించుకుంటాం. అయితే, మన శత్రువు అపవాదియైన సాతాను మనల్ని మింగేయాలని కాచుకొని కూర్చున్నాడు. మనం అతణ్ణి స్థిరంగా ఎదిరించి, యెహోవాకు ఇష్టపూర్వకంగా లోబడుతూ మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, ఆ దుష్టుని నుండి విడుదల పొందుతాం.—మత్త. 6:10, 13; 1 పేతు. 5:6-9.
7 క్రైస్తవ సంఘంలో, క్రీస్తు శిరస్సత్వాన్ని అలాగే ‘నమ్మకమైన బుద్ధిగల దాసునికి’ ఆయన ఇచ్చిన అధికారాన్ని గుర్తిస్తాం. ఇది మన వైఖరి మీద, ఒకరితో ఒకరం వ్యవహరించుకునే విధానం మీద ప్రభావం చూపిస్తుంది. సంఘంలో దేవుడు చేసిన శిరస్సత్వ ఏర్పాటుకు లోబడడంవల్ల, మన ఆరాధనకు సంబంధించిన అన్ని విషయాల్లో దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాం. అందులో మన పరిచర్య, కూటాలకు హాజరై వాటిలో పాల్గొనడం, పెద్దలతో ఉన్న సంబంధం, సంస్థ ఏర్పాట్లకు సహకరించడం ఉన్నాయి.—మత్త. 24:45-47; 28:19, 20; హెబ్రీ. 10:24, 25; 13:7, 17.
8 మనం దేవునికి లోబడడం సంఘ శాంతికి, భద్రతకు అలాగే అన్నీ క్రమపద్ధతిలో జరగడానికి దోహదపడుతుంది. యెహోవాకు లోబడే ప్రజలు ఆయన లక్షణాల్ని ప్రతిబింబిస్తారు. (1 కొరిం. 14:33, 40) యెహోవా సంస్థతో మనకున్న అనుభవాన్ని బట్టి మనం కూడా రాజైన దావీదులాగే భావిస్తాం. యెహోవా సేవకులకు, చెడ్డవాళ్లకు మధ్య ఉన్న తేడాను గమనించి, దావీదు సంతోషంతో ఇలా అన్నాడు: “యెహోవా తమకు దేవుడిగా ఉన్న ప్రజలు ధన్యులు.”—కీర్త. 144:15.
9 వివాహ ఏర్పాటులో అలాగే కుటుంబ వ్యవస్థలో, “స్త్రీకి శిరస్సు పురుషుడు.” అదేవిధంగా, పురుషులు క్రీస్తుకు లోబడాలి, క్రీస్తుకు శిరస్సు దేవుడు. (1 కొరిం. 11:3) భార్య తన భర్తకు, పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడాలి. (ఎఫె. 5:22-24; 6:1) కుటుంబంలో ప్రతీఒక్కరు శిరస్సత్వ సూత్రాన్ని పాటించినప్పుడు కుటుంబంలో శాంతి వెల్లివిరుస్తుంది.
10 భర్త క్రీస్తును అనుకరిస్తూ తన శిరస్సత్వాన్ని ప్రేమగా చూపించాలి. (ఎఫె. 5:25-29) ఆయన తన శిరస్సత్వాన్ని దుర్వినియోగం చేయకపోతే భార్యాపిల్లలు ఆయనకు సంతోషంగా లోబడతారు. భార్య పాత్ర ఏంటంటే, భర్తకు సాటియైన సహకారిగా లేదా సహాయకురాలిగా ఉండడం. (ఆది. 2:18) ఆమె తన భర్తకు ఓపిగ్గా మద్దతిస్తూ ఆయన్ని గౌరవిస్తే, ఆమె ఆయన మెప్పును పొందుతుంది, అలాగే దేవునికి మహిమను తీసుకొస్తుంది. (1 పేతు. 3:1-4) భార్యాభర్తలు శిరస్సత్వం గురించి బైబిలు చెప్పే సలహాను పాటించినప్పుడు, దేవునికి లోబడే విషయంలో తమ పిల్లలకు మంచి ఆదర్శాన్ని ఉంచుతారు.
దేవుడు చేసిన శిరస్సత్వ ఏర్పాటుకు లోబడడం, మన జీవితంలోని అన్ని రంగాల మీద ప్రభావం చూపిస్తుంది
11 మనం దేవునికి లోబడడం అనేది, ‘దేవుని అనుమతితోనే ఉనికిలో ఉన్న పై అధికారాలను’ మనం ఎలా చూస్తున్నామనే దానిమీద కూడా ప్రభావం చూపిస్తుంది. (రోమా. 13:1-7) క్రైస్తవులు చట్టానికి లోబడే పౌరులుగా, పన్నులు కడుతూ ‘కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లిస్తారు.’ (మత్త. 22:21) వీటితోపాటు, క్షేత్రాన్ని పూర్తి చేయడానికి చేసే ఏర్పాట్లు, వాటికి వర్తించే డేటా ప్రొటెక్షన్ నియమాలకు అనుగుణంగా ఉంటాయి. యెహోవా నీతి ప్రమాణాలకు విరుద్ధం కానంతవరకు పై అధికారాలకు లోబడడం వల్ల, ప్రకటనా పనిని మన శక్తిమేరకు కొనసాగించగలుగుతాం.—మార్కు 13:10; అపొ. 5:29.
12 దేవుడు చేసిన శిరస్సత్వ ఏర్పాటుకు లోబడడం, మన జీవితంలోని అన్ని రంగాల మీద ప్రభావం చూపిస్తుంది. మనుషులందరూ యెహోవా దేవునికి లోబడే రోజు కోసం మన విశ్వాస నేత్రాలతో ఎదురుచూస్తున్నాం. (1 కొరిం. 15:27, 28) యెహోవా సర్వాధిపత్యాన్ని సంతోషంగా గుర్తిస్తూ, ఆయనకు శాశ్వతంగా లోబడేవాళ్లు ఆయనిచ్చే ఆశీర్వాదాల్ని, ఆయన అనుగ్రహాన్ని పొందుతారు.