కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 4/15 పేజీలు 20-25
  • విగ్రహారాధన విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విగ్రహారాధన విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విగ్రహారాధన అంటే ఏమిటి?
  • విగ్రహారాధనయెడల యెహోవా దృష్టి
  • పరీక్షలో యథార్థముగా ఉండుట
  • వ్యాజ్యమందు విగ్రహములు ఓడిపోవును
  • దయ్యములకు బలులు
  • జాగ్రత్తగా ఉండుట ఎందుకు అవసరం?
  • విగ్రహారాధన విషయంలో నీవు జాగ్రత్తగా ఉందువా?
  • ప్రతివిధమైన విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • విగ్రహపూజకు దూరంగా పారిపోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • యెహోవాతో మీకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 4/15 పేజీలు 20-25

విగ్రహారాధన విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

“చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.”—1 యోహాను 5:21.

1. యెహోవా ఆరాధన ఎందుకు విగ్రహారాధన లేనిదైయున్నది?

యెహోవా లోహముతో, కర్రతో, లేదా రాయితో చేయబడిన విగ్రహం కాదు. భూమ్మీది ఏ ఆలయమందును ఆయనను ప్రతిష్ఠించడం కుదరదు. ఆయన సర్వశక్తిమంతుడైన ఆత్మయు, మానవులకు అదృశ్యుడును గనుక ఆయన ప్రతిమను చేయడం అసాధ్యం. కావున, యెహోవాకు చేసే స్వచ్ఛారాధన నిశ్చయంగా ఎలాంటి విగ్రహాలు లేనిదైయుండాలి.—నిర్గమకాండము 33:20; అపొస్తలుల కార్యములు 17:24; 2 కొరింథీయులు 3:17.

2. మనమే ప్రశ్నలు పరిశీలించాలి?

2 నీవు యెహోవా ఆరాధికుడవైనట్లయిన, నీవిలా అడుగవచ్చును, ‘విగ్రహారాధన అంటే ఏమిటి? పూర్వమందు యెహోవా సేవకులెట్లు దానిని విసర్జించగల్గారు? మరియు ఈనాడు విగ్రహారాధన విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?’

విగ్రహారాధన అంటే ఏమిటి?

3, 4. విగ్రహారాధనను ఎలా నిర్వచించవచ్చును?

3 సాధారణంగా, విగ్రహారాధనలో ఒక ఆచరణ లేదా ఆచారం ఇమిడివుంటుంది. విగ్రహారాధన అనగా ఒక విగ్రహాన్ని పూజించుట, ప్రేమించుట, ఆరాధించుట, అర్చన చేయుటై యున్నది. మరి విగ్రహమంటే ఏమిటి? అది ఏదైనా ఒకదాని సూచన లేదా చిహ్నం యొక్క ప్రతిమ, అంటే భక్తిచూపే ఒక వస్తువై యున్నది. సాధారణంగా, విగ్రహారాధన నిజమైన లేదా సజీవమైన (మానవుని, జంతువు, లేదా సంస్థయొక్క) అతీత శక్తిని నమ్ముతూ చేసేదై యుంటుంది. అయితే విగ్రహారాధన నిర్జీవమైన (ఒక శక్తి, లేదా జీవరహిత ప్రకృతి విషయం) వాటి సంబంధముగా కూడ అభ్యసించేదై యుండగలదు.

4 లేఖనములలో, విగ్రహాలను సూచించే హెబ్రీ పదములు తరచు విలువలేనితనాన్ని, లేదా చీత్కరించుకోవడాన్ని నొక్కితెల్పుచున్నవి. వీటిలో ఉపయోగింపబడిన కొన్ని పదాలేమనగా, “చెక్కిన లేదా మలచిన ప్రతిమ” (అక్షరార్థముగా, చెక్కి మలచిన); “పోత విగ్రహం, ప్రతిమ, లేదా బొమ్మ” (లోహము కరిగించి పోతపోసిన); “అసహ్యమైన విగ్రహము”; “పనికిరాని విగ్రహము” (అక్షరార్థముగా, నిరర్థకమైన); మరియు “బొమ్మల పీనుగలు.” గ్రీకు పదమైన ఇయోడొలోన్‌ “విగ్రహమని” అనువదించబడింది.

5. ప్రతిమలన్నీ విగ్రహాలు కావని ఎందుకు చెప్పవచ్చును?

5 ప్రతిమలన్నీ విగ్రహాలు కావు. మందసపు పెట్టె కొరకు రెండు బంగారు కెరూబులను చేయవలెనని, గుడారాన్ని కప్పే పది తెరల లోపలి భాగమందు ఆలాగే పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుచేసే తెరపైన అటువంటి ఆత్మీయ ప్రాణుల చిత్రాలను అల్లిక చేయించాలని దేవుడు తానుగా ఇశ్రాయేలీయులకు తెలియపర్చాడు. (నిర్గమకాండము 25:1, 18; 26:1, 31-33) పరలోక కెరూబులకు ప్రాథమిక చిహ్నంగావున్న ఆ చిత్రాల్ని కేవలం యాజక ధర్మాన్ని నెరవేర్చే యాజకులు మాత్రమే చూసేవారు. (హెబ్రీయులు 9:24, 25 పోల్చండి.) నీతిమంతులైన దేవదూతలు తమకొరకైన ఆరాధనను అంగీకరించరు గనుక, గుడారమందలి చిహ్నరూపకమైన కెరూబులు ఆరాధించకూడనివై యుండెననుట స్పష్టమే.—కొలొస్సయులు 2:18; ప్రకటన 19:10; 22:8, 9.

విగ్రహారాధనయెడల యెహోవా దృష్టి

6. విగ్రహారాధన విషయంలో యెహోవా దృక్పథమేమి?

6 సమస్త విగ్రహారాధనకు యెహోవా వ్యతిరేకి గనుక ఆయన సేవకులు విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. పూజా వస్తువులుగా ఎలాంటి ప్రతిమలు చేసికోవద్దని వాటిని ఆరాధించవద్దని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. పది ఆజ్ఞలందు మనమీ మాటలు కనుగొంటాము: “పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరముల వరకు కరుణించు వాడనై యున్నాను.”—నిర్గమకాండము 20:4-6.

7. సమస్త విగ్రహారాధనకు యెహోవా ఎందుకు వ్యతిరేకి?

7 యెహోవా సమస్త విగ్రహారాధనను ఎందుకు వ్యతిరేకిస్తాడు? ఎందుకంటే ముఖ్యంగా పది ఆజ్ఞలలో పైన చూపబడిన రెండవదాని ప్రకారం ఆయన తనకు మాత్రమే భక్తిని కనపర్చాలని కోరుతున్నాడు. అంతేకాదు, ఆయన తన ప్రవక్తయగు యెషయా ద్వారా యిలా సెలవిచ్చాడు: “యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.” (యెషయా 42:8) ఒక సమయంలో విగ్రహారాధన ఇశ్రాయేలీయులను ఎంతగా ఉరిలో పడవేసిందంటే “వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి.” (కీర్తన 106:36, 37) విగ్రహారాధికులు యెహోవా సత్య దేవుడనే విషయాన్ని నిరాకరించుటయేగాక, ఆయన ముఖ్య విరోధియగు సాతాను మరియు దయ్యముల అభీష్టమును నెరవేర్చేవారై యుంటారు.

పరీక్షలో యథార్థముగా ఉండుట

8. షద్రకు, మేషాకు, అబేద్నెగో అను ముగ్గురు హెబ్రీయులు ఎలాంటి పరీక్ష నెదుర్కొన్నారు?

8 యెహోవా యెడల యథార్థత కూడ మనం విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉండేటట్లు చేస్తుంది. దానియేలు 3వ అధ్యాయంలో వ్రాయబడిన సంఘటన దీనిని ఉదహరిస్తుంది. తాను నెలకొల్పిన ఒక గొప్ప బంగారు ప్రతిమ ప్రారంభోత్సవానికి, బబులోను రాజైన నెబుకద్నెజరు తన సామ్రాజ్యమందలి అధిపతులందరిని సమావేశపర్చాడు. ఆయనిచ్చిన తాకీదులో బబులోను అధికారము క్రిందగల ప్రాంతపు అధికారులుగావున్న ముగ్గురు హెబ్రీయులగు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు కూడా చేరియుండిరి. అక్కడ హాజరైన వారందరు వాద్యధ్వనులు విన్నంతనే ఆ ప్రతిమ ముందర సాగిలపడవలెను. ఈ ముగ్గురు హెబ్రీయులు బబులోను సామ్రాజ్యానికి ప్రాతినిధ్యమైన ఆ ప్రతిమ ముందర సాగిలపడునట్లు చేయుటకు బబులోనుయొక్క నిజమైన దేవతయగు సాతాను ప్రయత్నమై యుండెను. నీవే అక్కడ ఉండడాన్ని ఊహించుకొనుము.

9, 10. (ఎ) ఆ ముగ్గురు హెబ్రీయులు ఎలాంటి స్థానం వహించారు, వారికి దక్కిన ఫలితమేమి? (బి) ఆ ముగ్గురు హెబ్రీయుల నుండి యెహోవాసాక్షులు ఎలాంటి ప్రోత్సాహము పొందగలరు?

9 ఇదిగో, అక్కడ ఆ ముగ్గురు హెబ్రీయులు నిలువబడియున్నారు. విగ్రహాలను లేదా చెక్కిన ప్రతిమలను చేసుకొని వాటిని సేవించడం దేవుని ధర్మశాస్త్ర విరుద్ధమని వారు గుర్తు చేసుకున్నారు. సాగిలపడతారా లేదా చస్తారా అని నెబుకద్నెజరు వారికి చివరి హెచ్చరిక చేశాడు. అయితే వారు యెహోవా యెడల యథార్థత చూపుతూ యిలా అన్నారు: “మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.”—దానియేలు 3:17, 18.

10 దేవుని ఈ యథార్థ సేవకులు బాగుగా వేడిచేయబడిన కొలిమిలో పడవేయబడిరి. కొలిమిలో నలుగురు ఉండడం చూసి ఆశ్చర్యపడి నెబుకద్నెజరు ఆ ముగ్గురు హెబ్రీయులను బయటకు పిలువగా వారు ఏ హాని లేకుండా బయటకు వచ్చిరి. దానితో ఆ రాజు ఆశ్చర్యముతో, “షద్రకు మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. . . . ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు.” (దానియేలు 3:28, 29) లోకం విషయంలో తటస్థతను కాపాడుకొంటూ, విగ్రహారాధనను విసర్జిస్తూ దేవుని యెడల యథార్థముగా ఉండుటకు ప్రస్తుత దిన యెహోవాసాక్షులకు ఆ ముగ్గురు హెబ్రీయుల యథార్థత ప్రోత్సాహమును సమకూరుస్తున్నది.—యోహాను 17:16.

వ్యాజ్యమందు విగ్రహములు ఓడిపోవును

11, 12. (ఎ) యెహోవా మరియు విగ్రహదేవతలు చేరియున్న ఏ విషయాన్ని యెషయా వ్రాశాడు? (బి) యెహోవా సవాలు చేసినప్పుడు అన్యజనుల దేవతలు ఎలా భంగపడ్డారు?

11 విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉండుటకు మరో కారణమేమనగా విగ్రహాలను పూజించుట వ్యర్థము. మానవ నిర్మిత విగ్రహాలు కొన్ని జీవమున్న వాటివలె అనగా తరచు నోరు, కళ్లు, చెవులు ఉన్నట్లు కన్పించిననూ అవి మాట్లాడలేవు, చూడలేవు, లేదా వినలేవు మరియు అవి తమ భక్తుల కొరకు ఏమియు చేయలేవు (కీర్తన 135:15-18) ఇది సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దములో చూపబడింది, ఆ కాలంలో దేవుని ప్రవక్త, యెషయా 43:8-28లో వ్రాసిన విషయం నిజానికి యెహోవాకు విగ్రహ దేవతలకు మధ్య జరిగిన వ్యాజ్యమై యున్నది. దానిలో దేవుని ప్రజలగు ఇశ్రాయేలీయులు ఒక పక్షముగా, లోక జనాంగములు మరో పక్షముగా ఉన్నారు. “జరిగినవాటిని” కచ్చితముగా ప్రవచింపుడని యెహోవా జనాంగముల అబద్ధ దేవతలను సవాలు చేస్తున్నాడు. అలా ఎవరునూ చేయలేకపోయిరి. తన ప్రజలవైపు తిరిగి యెహోవా ఇట్లన్నాడు: “నేనే దేవుడను మీరే నాకు సాక్షులు.” తమ దేవతలు యెహోవా కంటె ముందే ఉనికిలో ఉన్నట్లు గాని వారు ప్రవచింపగలరని గాని జనాంగములు నిరూపించలేకపోయినవి. అయితే బబులోను నాశనాన్ని గూర్చి, బందీలైన తన ప్రజల విముక్తిని గూర్చి యెహోవా ప్రవచించాడు.

12 అంతేకాదు, దేవుడు విముక్తి గావించిన ప్రజలు, యెషయా 44:1-8లో వర్ణింపబడినట్లు తాము ‘యెహోవాకు చెందిన వారమని’ చెప్పుదురు. యెహోవా తానుగా ఇట్లన్నాడు: “నేను మొదటివాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు.” విగ్రహ దేవతలు దానిని త్రోసిపుచ్చలేక పోయారు. “నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియు లేదు” అని అంటూ, “మీరే నాకు సాక్షులు,” అని యెహోవా మరలా తన సాక్షులను గూర్చి చెప్పాడు.

13. విగ్రహారాధికుని గూర్చి విగ్రహారాధన ఏమి బయల్పరచును?

13 విగ్రహారాధనలో పాల్గొనుట అజ్ఞానము గనుక మనమా విషయములో కూడ జాగ్రత్తగా ఉంటాము. విగ్రహారాధికుడు తానెంచుకున్న వృక్షమందలి కొంత భాగముతో తన ఆరాధనకొక విగ్రహము చేసికొంటాడు, మరికొంత భాగముతో మంటచేసి తనకు ఆహారం వండుకుంటాడు. (యెషయా 44:9-17) ఎంత అవివేకం! విగ్రహ దేవతలను తయారు చేయువారు వాటి దేవత్వమును నిరూపించలేకపోయినందున అవమానం పాలగుదురు. అయితే యెహోవా దైవత్వము నిస్సందేహమైనది, ఎందుకంటె ఆయన బబులోను నుండి తన ప్రజల విడుదలను ప్రవచించుటే కాదు అది నెరవేరునట్లు ఆయన చేశాడు. యెరూషలేము తిరిగి జనావాస ప్రాంతమైంది, యూదా పట్టణాలు తిరిగి నిర్మింపబడ్డాయి, మరియు రక్షణివ్వకుండా బబులోను “ప్రవాహము” అనగా యూఫ్రటీసు నది ఎండిపోవడం జరిగింది. (యెషయా 44:18-27) దేవుడు ప్రవచించినట్లుగానే, పారశీకువాడైన కోరెషు బబులోనును జయించాడు.—యెషయా 44:28–45:6.

14. విశ్వ న్యాయస్థానమందు, ఏది శాశ్వతముగా నిరూపించబడును?

14 విగ్రహ దేవతలు దేవత్వము విషయంలో తమ న్యాయ వ్యాజ్యెమును కోల్పోయాయి. బబులోనుకు సంభవించినదే ఆధునిక బబులోనుకు అనగా ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యమునకు నిశ్చయంగా సంభవించును. అది మరియు దాని సమస్త దేవతలు, మతసంబంధమైన సమస్తము, మరియు విగ్రహారాధనా వస్తువులన్నియు త్వరలోనే గతించిన సంగతులై యుండును. (ప్రకటన 17:12–18:8) ఆ పిమ్మట విశ్వ సర్వోన్నత న్యాయస్థానమందు, యెహోవా మాత్రమే సత్య దేవుడని ఆయన తన ప్రవచన వాక్యాన్ని నెరవేర్చాడని శాశ్వతముగా నిరూపించబడును.

దయ్యములకు బలులు

15. యెహోవా ప్రజలను గూర్చి, విగ్రహారాధనను గూర్చి పరిశుద్ధాత్మ మరియు తొలి శతాబ్దపు పరిపాలక సభ ఏమి సూచించెను?

15 యెహోవా ప్రజలు విగ్రహముల విషయంలో జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటె వారు దేవుని ఆత్మచే మరియు సంస్థచే నడిపించబడుతున్నారు. యెహోవా సేవకుల మొదటి శతాబ్దపు పరిపాలక సభ తోటి క్రైస్తవులకు యిలా చెప్పింది: “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యకమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.”—అపొస్తలుల కార్యములు 15:28, 29.

16. విగ్రహార్పితములైన వాటిని గూర్చి పౌలు చెప్పిన విషయాన్ని మీ స్వంత మాటలలో మీరెలా వ్యక్తపరుస్తారు?

16 విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉండుటకు మరో కారణమేమనగా దయ్యముల ప్రభావమును తప్పించుకొనుటే. ప్రభువు రాత్రి భోజనమును గూర్చి అపొస్తలుడైన పౌలు కొరింథు క్రైస్తవులకు ఇలా చెప్పాడు: “విగ్రహారాధనకు దూరముగా పారిపొండి. . . . మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకొనుటయేగదా?—మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయే గదా? మనమందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము. శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా? ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? లేదుగాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్ర లోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు. ‘ప్రభువునకు రోషము పుట్టించెదమా?’ ఆయన కంటె మనము బలవంతులమా?”—1 కొరింథీయులు 10:14-22.

17. సా.శ. మొదటి శతాబ్దములో, ఎలాంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడు విగ్రహార్పిత మాంసమును తినగలడు, ఎందుకు?

17 జంతువులో కొంత భాగము విగ్రహాలకు బలియివ్వబడేది, కొంత భాగము యాజకులకు పోగా, విందు చేసుకోవడానికి ఆరాధికునికి కొంత భాగము వచ్చేది. అయితే, కొంత మాంసము బజారులో అమ్మబడేది. ఆచార వ్యవహారంలో భాగంగా తినకపోయిననూ ఒక క్రైస్తవుడు విగ్రహాలుండే ఆలయానికి వెళ్లి మాంసం తినడం మంచిది కాదు, ఎందుకంటే ఇది ఇతరులను అభ్యంతర పర్చగలదు లేదా అతన్ని అబద్ధ ఆరాధనలోనికి ఈడ్వవచ్చును. (1 కొరింథీయులు 8:1-13; ప్రకటన 2:12, 14, 18, 20) విగ్రహానికి జంతువును బలియిచ్చుట మాంసమును మార్చలేదు గనుక క్రైస్తవుడు దానిని బజారునుండి కొనుక్కోవచ్చును. తను భోజనానికి వెళ్లినప్పుడు వడ్డించబడిన మాంసము ఎక్కడనుండి తేబడినదని అతడు అడుగనక్కరలేదు. అయితే ఆ మాంసము “బలి అర్పింపబడినదని” ఎవరైనా చెప్పినట్లయిన, ఎవరినీ అభ్యంతరపెట్టకుండుటకు అతడు దానిని తినడు.—1 కొరింథీయులు 10:25-29.

18. విగ్రహార్పితమైన దానిని భుజించు వారు ఎలా దయ్యములతో పాలుపుచ్చుకున్న వారు కాగలరు?

18 బలియర్పణ తర్వాత ఆ మాంసములో దేవుడున్నాడని, ఆరాధికుల విందులో దానిని తినువారిలో ఆయన ప్రవేశించునని తరచు తలంచబడెను. దానిని కలిసి భుజించు ప్రజలు ఒక బంధముగా ఏర్పడుదురు గనుక, బలియర్పిత జంతు మాంసము భుజించు వారు బలిపీఠముతో పాలివారై ఆ విగ్రహం ప్రాతినిధ్యం వహించిన దయ్యమైన దేవతతో కలిసి భోజనము చేసిన వారగుదురు. అటువంటి విగ్రహారాధన ద్వారా దయ్యములు ప్రజలు అద్వితీయ సత్యదేవుని ఆరాధించకుండా చేస్తున్నవి. (యిర్మీయా 10:1-15) కావున విగ్రహాలకు బలియర్పించిన వాటినుండి యెహోవా ప్రజలు దూరముగా ఉందురనుటలో ఆశ్చర్యము లేదు. దేవుని యెడల యథార్థత, ఆయన పరిశుద్ధాత్మ మరియు సంస్థ నడిపింపును అంగీకరించుట, దయ్యములతో పొత్తును విసర్జించుటకు తీర్మానించుకొనుట ఈనాడు విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉండుటకు శక్తివంతమైన ప్రోత్సాహకములై ఉన్నవి.

జాగ్రత్తగా ఉండుట ఎందుకు అవసరం?

19. ప్రాచీన ఎఫెసులో ఎలాంటి విగ్రహారాధన ఉనికిలో ఉండెను?

19 విగ్రహారాధన అనేక రూపములను కలిగియున్నందున, మరియు కేవలం విగ్రహారాధన ఒక్క ప్రక్రియే వారి విశ్వాసమును రాజీపడజేయును గనుక క్రైస్తవులు పట్టుదలతో దాని విషయమై జాగ్రత్తగా ఉందురు. అపొస్తలుడైన యోహాను తోటి విశ్వాసులకు యిలా చెప్పాడు: “విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.” (1 యోహాను 5:21) అనేక విధములైన విగ్రహారాధనలు వారిని చుట్టిముట్టియుండెను గనుక ఈ సలహా వారికవసరమై యుండెను. అబద్ధ దేవతలను గూర్చిన పురాణములతో, మంత్రతంత్ర అభ్యాసములతో నిండియుండిన ఎఫెసు పట్టణమునుండి యోహాను వ్రాశాడు. ప్రపంచమందలి ఏడు మహాద్భుతములలో ఒకటైన అర్తెమీ దేవాలయము ఎఫెసులో ఉండెను. ఇది నేరస్థులకు ఆశ్రయముగా లైంగిక దుర్నీతి క్రియలకు కేంద్రమైయుండెను. ఎఫెసువాడైన తత్వజ్ఞానియగు హెరాక్లెటియస్‌ ఆలయ బలిపీఠానికున్న చీకటి మార్గాన్ని దుర్మార్గతా చీకటి ప్రదేశానికి పోల్చాడు, మరియు దేవాలయ నైతిక సూత్రాలను మృగ్య నియమాలకంటే నీచమైనవిగా పరిగణించాడు. కాబట్టి, ఎఫెసులోని క్రైస్తవులు దయ్యముల ప్రభావం, లైంగిక దుర్నీతి, విగ్రహారాధన విషయంలో కడు స్థిరంగా ఉండాలి.

20. విగ్రహారాధన యొక్క ఏ చిన్న ప్రక్రియనైనా ఎందుకు విసర్జించాలి?

20 విగ్రహారాధన సంబంధముగా అతిచిన్న విషయాన్ని కూడ విసర్జించుటకు క్రైస్తవులకు బలమైన తీర్మానం కావాలి. ఎందుకంటె అపవాదికి చేసే చిన్న ఆరాధనా ప్రక్రియ కూడ పరీక్షలలో మానవులు దేవుని పక్షాన నమ్మకముగా నిలిచియుండలేరనే అతని సవాలును బలపరచినట్లవుతుంది. (యోబు 1:8-12) యేసుకు “యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను” చూపించినప్పుడు, సాతాను యిలా అన్నాడు: “నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదను.” క్రీస్తు అలాచేయ నిరాకరించుట యెహోవా విశ్వాధిపత్యమును బలపరచి అపవాదిని అబద్ధికుడని నిరూపించింది.—మత్తయి 4:8-11; సామెతలు 27:11.

21. రోమా చక్రవర్తికి సంబంధించి, దేనిని చేయుటకు నమ్మకమైన క్రైస్తవులు తిరస్కరించారు?

21 యేసు తొలి అనుచరులు సహితం సాతాను లేవదీసిన వివాదాంశమును బలపరచు విగ్రహారాధన యొక్క ఏ ప్రక్రియయు చేయరు. ప్రభుత్వ “పైఅధికారుల” యెడల వారికి సరియైన గౌరవమున్నను, రోమా చక్రవర్తి గౌరవార్థమై ధూపము వేయలేదు. ఆ చర్య వారికి ప్రాణాపాయము కల్గించినను వారట్లు చేయలేదు. (రోమీయులు 13:1-7) ఈ విషయాన్ని గూర్చి డానియేల్‌ పి. మానిక్స్‌ యిలా వ్రాశాడు: “ప్రాంగణమందు వారికి అనుకూలముగా మండుచున్న బలిపీఠము ఏర్పాటుచేయబడినను, క్రైస్తవులలో కేవలము కొద్దిమంది మాత్రమే తమ అభిప్రాయాన్ని మార్చుకొన్నారు. ఖైది చేయవలసిందల్లా ఏమంటే చిటికెడు సాంబ్రాణి తీసుకొని అగ్నిలో వేయాలి, అలాచేసిన పిదప అతనికి బలికి సంబంధించిన ధృవపత్రమునిచ్చి విడుదల చేసేవారు. అది చక్రవర్తిని ఆరాధించుట కాదుగాని, రోమా ప్రభుత్వాధికారిగా చక్రవర్తిని కేవలం దైవాంశసంభూతునిగా గుర్తించుటేనని అతనికి విపులంగా చెప్పబడేది. అయినను, అలా విడుదల కావడానికి దాదాపు క్రైస్తవులందరు సుముఖత చూపలేదు.” (దోస్‌ ఎబౌట్‌ టు డై, పుట 137) ఆవిధంగా పరీక్షింపబడితే, సమస్త విగ్రహారాధనను నీవు పూర్తిగా వ్యతిరేకిస్తావా?

విగ్రహారాధన విషయంలో నీవు జాగ్రత్తగా ఉందువా?

22, 23. నీవు విగ్రహారాధన విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

22 కాబట్టి, క్రైస్తవులు నిశ్చయముగా సకల విధములైన విగ్రహారాధన రూపముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యెహోవా అనితర భక్తిని కోరుచున్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు నిలబెట్టిన ఆ గొప్ప ప్రతిమకు సాగిలపడుటకు నిరాకరించుటలో ఆ ముగ్గురు నమ్మకమైన హెబ్రీయులు ఒక చక్కని మాదిరినుంచారు. ప్రవక్తయగు యెషయా వ్రాసిన విశ్వ న్యాయస్థానమందు, కేవలము యెహోవా మాత్రమే నిజమైన, సజీవుడైన దేవుడని చూపించబడింది. ఆయన తొలి క్రైస్తవ సాక్షులు విగ్రహార్పితములైన వాటిని విసర్జించాల్సి వచ్చింది. యెహోవాను నిరాకరించుటగా పరిగణించబడు విగ్రహారాధనకు సంబంధించిన ఏ ఒక్క ప్రక్రియయైనను చేయవలెనను వత్తిడికి వారిలోని అనేకమంది యథార్థవంతులు లోనుకాలేదు.

23 కాబట్టి, నీవు వ్యక్తిగతంగా విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉన్నావా? దేవునికి నీవు అనితర భక్తిని ప్రదర్శిస్తున్నావా? యెహోవా సర్వాధిపత్యానికి మద్దతునిస్తూ ఆయనను నిజమైన, సజీవుడగు దేవునిగా ప్రస్తుతింతువా? అట్లయిన, విగ్రహారాధన అభ్యాసముల విషయంలో ఎడతెగక స్థిరంగా నిలబడుట నీ తీర్మానమై యుండాలి. అయితే ప్రతివిధమైన విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉండుటకు యింకా ఎలాంటి లేఖన అంశములు నీకు సహాయపడగలవు?

మీ తలంపులు ఏమైయున్నవి?

◻ విగ్రహారాధన అంటే ఏమిటి?

◻ సమస్త విగ్రహారాధనకు యెహోవా ఎందుకు వ్యతిరేకి?

◻ విగ్రహారాధన విషయంలో ఆ ముగ్గురు హెబ్రీయులు ఏ స్థానం వహించిరి?

◻ విగ్రహార్పితమైన దానిని భుజించు వారు ఎలా దయ్యములతో పాలుపుచ్చుకున్న వారు కాగలరు?

◻ విగ్రహారాధన విషయంలో మనమెందుకు జాగ్రత్తగా ఉండాలి?

[23వ పేజీలోని చిత్రం]

వారు చంపబడతారని బెదిరింపబడిననూ, ఆ ముగ్గురు హెబ్రీయులు విగ్రహారాధనలో పాల్గొనలేదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి