“వెలుగు ప్రకాశకుల” జిల్లా సమావేశాల్లో అత్యధిక ఆశీర్వాదములు
దాదాపు 2,700 సంవత్సరాల పూర్వము ప్రవక్తయగు యెషయా యిలా వ్రాశాడు: “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటికచీకటి జనములను కమ్ముచున్నది.” (యెషయా 60:2) ఆ మాటలెంత నిజమని నిరూపించబడినవి! అయితే నిరీక్షణ లేకపోలేదు, ఎందుకంటె యెహోవా వెలుగును ఉదయింపజేశాడు. పోయిన సంవత్సరం, దేవుని వెలుగును ప్రేమించువారు “వెలుగు ప్రకాశకులు” అను జిల్లా సమావేశమునకు హాజరుకావల్సిందిగా సాదరముగా ఆహ్వానింపబడ్డారు.
ఆ సమావేశ కార్యక్రమము మొదట ఉత్తర అమెరికాలో అందించబడింది. ఆ తర్వాతి నెలల్లో, అది తూర్పు, పశ్చిమ యూరపులో, మధ్య, దక్షిణ అమెరికాల్లో, ఆఫ్రికా, ఆసియా మరియు సముద్ర ద్వీపాల్లో అందించబడింది. వాటికి హాజరైన వారి సంఖ్య లక్షల సంఖ్యలో ఉంది. వారెంత ఉత్తమమైన ఆత్మీయ విందు నారగించారు!
“వెలుగు ప్రకాశకులారా మీకందరికి ఆహ్వానం!”
చాలావరకు ఎక్కువ ప్రాంతాల్లో సమావేశం శుక్రవారం ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం ముగిసింది. ఈ అంత్యదినములలో యెహోవా వెలుగు క్రితమెన్నటికంటే మరింతగా ప్రకాశించడాన్ని గూర్చిన క్లుప్త సమీక్షను శుక్రవారం ఉదయం ప్రేక్షకులు ఆనందంతో విన్నారు. ఆ తర్వాత సమావేశ అధ్యక్షుడు వేదికనుండి ప్రసంగించారు. నిజమైన క్రైస్తవులు వెలుగు ప్రకాశకులై యుండాలని నొక్కితెల్పుచూ ఆప్యాయకరంగా ఇట్లన్నాడు: “వెలుగు ప్రకాశకులారా మీకందరికి ఆహ్వానం!” యెహోవా వెలుగును ఎడతెగక ప్రతిబింబించుటకు ఆ సమావేశ కార్యక్రమం సమావేశ ప్రతినిధులకు సహాయం చేయనైయుండెను.
ముఖ్యాంశ ప్రసంగం సంపూర్ణ సమావేశ తాత్పర్యాన్ని చెప్పింది. అలనాడే ఏదెను తోటలో మానవజాతికున్న ప్రకాశమానమైన ఉత్తరాపేక్షలు అంధకారమయ్యాయని ఈ ప్రసంగీకుడు సమావేశ ప్రతినిధులకు గుర్తుచేశాడు. అప్పటినుండి, సాతాను మానవులకు సత్య సంబంధ వెలుగు విషయంలో అంధత్వాన్ని కలుగజేశాడు. (2 కొరింథీయులు 4:4) అయినప్పటికిని, యేసు “జనులకు వెలుగుగా” వచ్చాడు. (యెషయా 42:1-7) ఆయన మత అబద్ధాలను బహిర్గతం చేశాడు, అంధకారానికి సంబంధించిన దోష క్రియలను గుర్తించాడు, యెహోవా సర్వాధిపత్యాన్ని ఉన్నతపరచాడు, రాజ్య సువార్త ప్రకటించాడు. యేసు అనుచరులు అదే పనిని చేశారు—యింకను చేస్తారు! (మత్తయి 28:19, 20) ప్రసంగీకుడు ఉత్తేజముతో యిలా అన్నాడు: ‘యేసు వలెనే మనము కూడా వెలుగు ప్రకాశకులమై యుండగలము. మన కాలమందు ఈ పనికంటే మరేదియు ప్రాముఖ్యము కాదు. ఆలాగే ఇంతకంటే గొప్ప ఆధిక్యత మరేదియు లేదు.’
సమావేశ కార్యక్రమ మొదటి భాగము ఇక ముగియనైయుండగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. సమావేశ అధ్యక్షుడు మరల వేదికమీదికి వచ్చి నాలుగు క్రొత్త కరపత్రముల విడుదలను ప్రకటించాడు. వాటిని అభినందిస్తూ కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి, మరియు హాజరైన ప్రతి ప్రతినిధికి ఒక్కొక్క కరపత్రం ఇవ్వడం జరిగింది.
శుక్రవారం మధ్యాహ్నం, సమావేశ కార్యక్రమం వెలుగు ప్రకాశించు క్రైస్తవులకు అవసరమైన ప్రాథమిక సలహాపై ధ్యానం నిలిపింది. మొదటి రెండు ప్రసంగాలు లోక అంధకారము ద్వారా కలుషితము కాకుండా తప్పించుకొనే విషయంపై చక్కని సలహా నందించాయి. సాతాను వెలుగు దూత వేషము వేసికొన్నందున, లోకము యొక్క అశుద్ధ సంగతులు మనలను పురికొల్పకుండా ఆత్మీయ దృష్టిని కాపాడుకొనుట ఆవశ్యకము. (2 కొరింథీయులు 11:14) పౌలు యిలా హెచ్చరించాడు: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమీయులు 12:2) క్రైస్తవుడు రూపాంతరము చెందుట ఒక ఎడతెగని ప్రక్రియ అని సమావేశ ప్రతినిధులు విన్నారు. దేవుని వాక్యాన్ని పఠిస్తూ, నేర్చుకున్న వాటిని అన్వయిస్తూవుంటే మన మనస్సులు నిర్విరామముగా పరిశుద్ధమగుతూ మారుతూవుంటాయి. ఆ విధంగా, మనం అంతకంతకు ఎక్కువగా “కృపాసత్య సంపూర్ణుడుగా” ఉన్న యేసువలె తయారౌతాము.—యోహాను 1:14.
యువకులైన వెలుగు ప్రకాశకులు
శుక్రవారం మధ్యాహ్న కార్యక్రమ రెండవ భాగం యౌవనులపై దృష్టినిల్పింది. మొదటి ప్రసంగం (“యౌవనులారా మీరు వెంటాడునదేమి?”) విశ్వాసం విషయంలో మంచి మాదిరుంచిన యౌవనులను మెచ్చుకుంది. అయితే వారు సాతానుకు ప్రత్యేకమైన గురిగా ఉన్నారని వారికి గుర్తుచేయబడింది. బాగా తర్ఫీదుపొందిన క్రీడాకారునికి కూడా ఒక శిక్షకుడు అవసరము. అదే ప్రకారం, వెలుగులో ఎడతెగక నడవాలంటే యౌవనస్థులకు వారి తలిదండ్రుల మరియు సంఘముయొక్క సహాయం అవసరం.
ఇది యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయుట అనే చక్కని నాటకం ద్వారా నొక్కిచెప్పబడింది, దీనితో శుక్రవారపు కార్యక్రమం ముగిసింది. రాజైన యోషియా ఉదాహరణ అందు ఉన్నతపర్చబడింది. బాలుడిగా ఉన్నప్పుడే, ఆయన యెహోవాను సేవించుటకు తీర్మానించుకొన్నాడు. ఆయన చుట్టూ చెడు ప్రభావము కల్గించువారున్ననూ, ప్రధానయాజకుడైన హిల్కీయా నడిపింపుతో, దేవుని ధర్మశాస్త్రము యెడల తనమట్టుకు తాను కలిగియున్న ప్రేమనుబట్టి, యోషియా యెహోవా దృష్టికి సరియైన దానిని చేశాడు. ఈనాడు యౌవనులైన క్రైస్తవులు అదే ప్రకారము చేయుదురు గాక.
వెలుగు ప్రకాశింపనియ్యుడి
ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత, శనివారం ఉదయం మరింత క్షేమాభివృద్ధికరమైన ఆత్మీయ సలహా కొరకు సమావేశ ప్రతినిధులు సమావేశానికి వచ్చారు. వారు నిరుత్సాహపడలేదు. దినవచన చర్చ తర్వాత, ఒక క్రైస్తవుడు తన వెలుగును ప్రకాశింపగల విభిన్న మార్గాలను తెలియజేసే గోష్ఠితో ఆ కార్యక్రమం ముందుకు సాగింది. (మత్తయి 5:14-16) ప్రకటించుట ఒక ఆవశ్యకమైన మార్గము కాగా, మంచి ప్రవర్తన కూడ ఒక ప్రాముఖ్యమైన భూమికను పోషిస్తుంది. ప్రసంగీకుడు చెప్పినట్లు, “మనము నమ్మేదానిని ప్రకటించుట ఇతరులకు తెల్పుతుంది, అయితే ప్రేమను అభ్యసించుట దానిని ప్రదర్శిస్తుంది.”
ప్రకటించుటకు సహాయపడేవి అనగా—కరపత్రములు—సమావేశ ప్రతినిధుల దృష్టికి తేబడినవి. ముందు రోజు చేయబడిన ప్రకటన యింకనూ తాజాగా మదిలోవున్న సమావేశ ప్రతినిధులు ఈ చిన్న ఉపకరణములు ఎంత శక్తివంతముగా ఉంటాయో అనుభవాల ద్వారా విన్నారు. ప్రతి సందర్భంలో సిద్ధంగా ఉండేందుకు అన్ని సమయాలలో తమ యొద్ద తగినన్ని కరపత్రములు ఉంచుకొనుటకు ఆ సమావేశ ప్రతినిధులు ప్రోత్సహింపబడ్డారు.
ఆ పిమ్మట పయినీర్లపై అనగా వెలుగు ప్రకాశించుటలో కష్టపడి పనిచేస్తున్న పూర్తికాల రాజ్య ప్రచారకులపై దృష్టి నిల్పడం జరిగింది. కష్టపడి పనిచేసే మన పయినీర్లను మనమెంతగా అభినందించగలమో! వారి సంఖ్య కూడా పెరుగుచున్నది. ఇటీవలనే స్వేచ్ఛ లభించిన దేశాల్లో సహితం, పయినీర్ల సంఖ్య పెరుగుచున్నది. తమ ఆధిక్యతను కాపాడుకోవాల్సిందిగా పయినీర్లు ప్రోత్సహింపబడ్డారు. యింకా పయినీరు సేవలో చేరనివారు తమ పరిస్థితినిగూర్చి ఆలోచించాల్సిందిగా ఉద్బోధింపబడ్డారు. పూర్తికాల సేవలో తమ వెలుగును ప్రకాశింపజేయుటకు బహుశ వారును తమ పనులను చక్కబెట్టుకోవచ్చును.
వెలుగు ప్రకాశకునిగా ఉండుటయందు తరచు త్యాగములు చేరివుంటాయి, ఇది తర్వాతి ప్రసంగమగు “స్వయం త్యాగము గల ఆత్మతో యెహోవాను సేవించుట” యందు నొక్కితెల్పబడింది. పౌలు యిలా వినతిచేశాడు: ‘పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి’. (రోమీయులు 12:1) హింసను సహించువారు స్వయం త్యాగమనే ఆత్మను ప్రదర్శిస్తారు. పూర్తికాల సేవలో నిలిచియుండేందుకు పయినీర్లు ప్రతిరోజు త్యాగాలు చేస్తారు. ఈ లోకపు స్వార్థపూరిత, ఐశ్వర్యాసక్తులను వెంబడించుటకు బదులు యెహోవా సేవలో పనికలిగి ఉండేందుకు నిజ క్రైస్తవులందరు త్యాగాలు చేస్తారనుట నిజం. అటువంటి వైఖరి యెహోవా నుండి అత్యధిక ఆశీర్వాదములను కలుగజేయును.
ఆ ప్రసంగము దాని తర్వాత ఇవ్వబడిన బాప్తిస్మపు ప్రసంగానికి సరియైన ఉపోద్ఘాతముగా పనిచేసింది. “వెలుగు ప్రకాశకులు” అనే జిల్లా సమావేశమందు బాప్తిస్మం పొందినవారు నిశ్చయంగా ఈ ప్రసంగాన్ని మర్చిపోరు. వారి బాప్తిస్మము వారి జీవితంలో ఎల్లప్పుడూ ఒక ఉన్నతాంశముగా ఉంటుంది. తన 30వ ఏట బాప్తిస్మం పొందిన యేసుక్రీస్తు మాదిరిని అనుకరిస్తున్నారని వారికి జ్ఞాపకం చేయబడింది. అంతేకాదు, “అంధకార క్రియలను విసర్జించి” ‘యెహోవాను సేవించుటకు’ తాము తీర్మానించుకున్నామని గుర్తు తెచ్చుకొనుటకు బాప్తిస్మము పొందిన ఆ అభ్యర్థులు సంతోషించారు. (రోమీయులు 12:11; 13:12) ఆనందముతో వారు సమావేశ ప్రతినిధుల ముందు వరుసలో నిలువబడి బాప్తిస్మము తీసుకోవడానికి ముందు బిగ్గరగా తమ నిర్ణయాన్ని ప్రకటించారు. (రోమీయులు 10:10) “వెలుగు ప్రకాశకులు” అనే జిల్లా సమావేశములందు తమ సమర్పణను నీటి బాప్తిస్మము పొందుట ద్వారా తెలియపర్చిన వారిపై యెహోవా ఆశీర్వాదముల కొరకు మేము ప్రార్థిస్తున్నాము.
శనివారం మధ్యాహ్నం నిర్మొహమాటమైన కొన్ని హెచ్చరికలివ్వబడినవి. ఇవి “పేరాశ యొక్క ఉరులను తొలగించుకొనుము,” “మీ మంచి నడవడిని ఎవరైనా పాడుచేయుచున్నారా?” “ప్రతి విధమైన విగ్రహారాధనకు దూరముగా నుండుడి” అనే ప్రసంగముల రూపమున అవి ఇవ్వబడినవి. క్రైస్తవులను బలహీనపరచుటకు సాతాను ఉపయోగించు కొన్ని యుక్తులు ఈ మూడు ప్రసంగాలలో గుర్తించబడెను. ఇస్కరియోతు యూదా ఒక అపొస్తలునిగా ఉండిననూ, డబ్బు కొరకు అతడు యేసును అప్పగించాడు. ఇశ్రాయేలీయుల జనాంగమునకున్న యెహోవా ఆరాధనా కేంద్రమందు పెరిగిననూ బాలుడైన సమూయేలు చెడ్డవారి సాంగత్యమును తప్పించుకోలేకపోయాడు. (1 సమూయేలు 2:12, 18-20) విగ్రహారాధనలో లైంగిక దుర్నీతి, లోభత్వము వంటి సంగతులు చేరియుండగలవు. (ఎఫెసీయులు 5:5; కొలొస్సయులు 3:5) అవును, పేరాశ, చెడు సాంగత్యము, విగ్రహారాధన ప్రమాదకరమైనవి కాగా వాటిని విసర్జించవలెను.
ఆ పిమ్మట సమావేశ కార్యక్రమం ఒరవడి మారినట్లయింది. తర్వాతి ప్రసంగము ఆసక్తికరమైన అనేక బైబిలు ప్రశ్నలను లేవదీసి వాటికి జవాబిచ్చింది. ఉదాహరణకు, సత్యమును అంగీకరించకుండా మహాశ్రమలకు ముందు మరణించు ప్రజలు పునరుత్థానులౌతారో లేదో మీరు వివరించగలరా? తగిన వివాహ భాగస్వామి లభించనట్లయిన ఒక క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు ఏమి చేయవచ్చును? వారి బైబిలు జ్ఞానమును ద్విగుణీకృతం చేసుకోవడానికి, వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ ప్రత్యేకంగా “క్వెశ్చన్స్ ఫ్రం రీడర్స్” అనే హెడ్డింగ్ క్రిందగల విషయాలను పూర్తిగా ఉపయోగించవలెనని ప్రతినిధులు ప్రోత్సహింపబడ్డారు.
క్రీస్తు ప్రత్యక్షత మరియు బయల్పరచబడుట
శనివారపు ముగింపు కార్యక్రమం “క్రీస్తు సన్నిధి మరియు ప్రత్యక్షతమీద వెలుగు ప్రకాశింపజేయుట” అనే గోష్ఠితో ప్రవచనంవైపు తిరిగింది. యేసుక్రీస్తు ప్రత్యక్షతను నిరూపిస్తూ “సూచన” యొక్క వివిదాంశములు సమీక్షించబడ్డాయి. (మత్తయి 24:3) రెండవ భాగమందు, “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” ఆధునిక దిన కార్యక్రమాలు చర్చించబడ్డాయి. (మత్తయి 24:45-47) దాసుని తరగతి 1919 నుండి రాజ్యసువార్త ప్రచార సేవను నమ్మకముగా ముందుకు తీసుకెళ్లిందని సూచింపబడింది. ఆ పిమ్మట యెహోవా వెలుగును ప్రతిబింబించుటలో అభిషక్తులైన క్రైస్తవులతో భాగము వహించుటకు అన్ని జనాంగముల నుండి ఒక గొప్పసమూహము సమకూర్చబడింది. ఆ ప్రసంగీకుడు యిలా ముగించాడు: “నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసున్ని అందరూ ఆసక్తితో నిర్విరామముగా బలపర్చుదురు గాక. కేవలము యిలా చేయుట ద్వారా మాత్రమే త్వరలోనే ఏదొక రోజున గొర్రెలవంటి వారందరు ధన్యతగల ఈ మాటలు వినగలవారై యుంటారు: ‘నా తండ్రిచేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.’”—మత్తయి 25:34.
చివరి ప్రసంగీకుడు యేసుక్రీస్తు బయల్పరచబడుటలో చేరియున్న విషయాల భావాన్ని చర్చించాడు. (1 కొరింథీయులు 1:7) ఆ బయల్పరచబడుట ఎంతటి అనుభవమై యుంటుంది! మహాబబులోను నాశనం చేయబడుతుంది. సాతాను లోకానికి, యేసు ఆయన దేవదూతల మధ్య జరిగే ఆ మహాయుద్ధం ఈ విధాన నాశనంతో ముగుస్తుంది. చివరకు, సాతాను అగాధములో పడవేయబడి క్రియాశూన్యునిగా చేయబడతాడు. అయితే పరలోకమందు గొర్రెపిల్ల వివాహము మరియు క్రొత్త భూమి నెలకొల్పబడుటతో దేవుని ప్రజలకు విశ్రాంతి కలుగును. దేవుడు మనపై నిజంగా శ్రద్ధ కలిగియున్నాడా? అనే క్రొత్త బ్రోషూరును ఆవిష్కరించుట ద్వారా ప్రసంగీకుడు తన ప్రేక్షకులను రంజింపజేసాడు. మనపై శ్రద్ధచూపే సృష్టికర్తను గూర్చి, మనయెడల ఆయన సంకల్పాలను గూర్చి తెలుసుకోవల్సిన వినయస్థులకు అది ఎంతచక్కని సహాయకమై ఉంటుంది!
క్రైస్తవ గృహములు
సమావేశపు చివరి దినమగు ఆదివారం వచ్చేసింది. అయితే అందించాల్సింది యింకా ఎంతోవున్నది. దినవచనాన్ని చర్చించిన తర్వాత, “క్రైస్తవ గృహములో ఒకరియెడల ఒకరు శ్రద్ధచూపుకొనుట” అనే గోష్ఠితో క్రైస్తవ కుటుంబానికి శ్రద్ధ యివ్వబడింది. విజయవంతమైన క్రైస్తవ కుటుంబం కలిగియుండడానికి కావల్సిన కీలకమును అనగా ఆత్మీయ సంగతులను మొదట ఉంచాలనే విషయాన్ని గ్రహించడానికి మొదటి భాగం సమావేశ ప్రతినిధులకు సహాయం చేసింది. రెండవ భాగం కూటములకు హాజరగుట, ప్రాంతీయ సేవ, కుటుంబ పఠనం, లేదా వినోదం వంటి వాటితో సహా పనులన్నింటిని కలిసి చేయడానికి కుటుంబాలు ప్రోత్సహింపబడ్డాయి. ఆ గోష్ఠిలోని మూడవ భాగం వృద్ధులయెడల శ్రద్ధచూపే ఆధిక్యత మరియు బాధ్యతను సమావేశ ప్రతినిధులకు జ్ఞాపకం చేసింది. “వృద్ధులైన మన సహోదర సహోదరీలు సంఘానికి పెన్నిధివంటి వారని” ప్రసంగీకుడు చెప్పాడు. వారి అనుభవం ద్వారా లాభంపొంది వారి యథార్థతను మనమనుకరిద్దాం.
తర్వాత “స్వస్థబుద్ధి” అనే మాటకుగల అర్థం పరిశీలించబడింది. (1 పేతురు 4:7) స్వస్థబుద్ధిగలవాడు సమతూకము గలవాడు, తెలివైన వాడు, సహేతుకమైన వాడు, వినయస్థుడు, హేతుబద్ధమైన వాడై యుంటాడు. అతడు మంచి చెడ్డలను, సత్య అసత్యాలను వివేచింపగలవాడై యుంటాడు. అంతేకాకుండ, అతడు మంచి ఆత్మీయారోగ్యాన్ని కాపాడుకుంటాడు.
ఆదివారం ఉదయకాల కార్యక్రమ ముగింపు ప్రసంగం దేవునికి మరియు క్రీస్తుకు మన విధేయతను గూర్చి చర్చించింది. “యెహోవా దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు మనం చూపాల్సిన యథార్థతా విధేయతయొక్క ప్రాముఖ్యతను గూర్చి ప్రత్యేకంగా నొక్కిచెప్పాల్సిన పనిలేదని” ప్రసంగీకుడు అన్నాడు. మన జీవితమందలి ప్రతి ఆకృతిపై యిదెలా ప్రభావం చూపుతుందో ఆయన తెలిపాడు. ఎడతెగక విధేయత చూపుటలో మనకేవి సహాయం చేస్తాయి? నాలుగు లక్షణాలు: ప్రేమ, దైవ భయం, విశ్వాసం మరియు వినయం.
ఆదివారం మధ్యాహ్నం
అకస్మాత్తుగా ఆదివారం మధ్యాహ్నం వచ్చేసింది, అది సమావేశ చివరిబాగపు కార్యక్రమ సమయం. అనేకమందికి సమావేశం అప్పుడే ఆరంభమయ్యిందన్నట్లుంది, అయితే అది అప్పటికే ముగింపుకు వచ్చేసింది.
బహిరంగ ప్రసంగ ఇతివృత్తమేమనగా, “లోకమునకు వెలుగైయున్న వానిని అనుసరించుడి.” జీవాన్ని కాపాడుటలో అక్షరార్థ భౌతిక వెలుగు వహించే పాత్రను గూర్చిన ఆసక్తిపూర్వకమైన వివరణ ప్రేక్షకులకు ఇవ్వబడింది. ఆ పిమ్మట ఆత్మీయ వెలుగుయొక్క మరిగొప్ప ప్రాముఖ్యతను గూర్చి ప్రసంగీకుడు చూపించాడు. భౌతిక వెలుగు మనల్ని కొన్ని దశాబ్దాలు జీవింపజేస్తే, ఆత్మీయ వెలుగు మనం నిత్యం జీవించేటట్లు చేస్తుంది. ఆ ప్రసంగంలో యోహాను 1:1-16 నందలి ప్రతి వచనాన్ని చర్చిస్తూ, లోకానికి వెలుగుగా యేసును గుర్తించడం ఉన్నతాంశమై యుండెను. నేడు అనగా ఈ దుష్టవిధానముయొక్క చివరి సంవత్సరములలో, ఈ పాత్ర యందున్న యేసును అనుకరించుట క్రితమెన్నటికంటే అత్యవసరమై యున్నది.
ఆ వారానికి నియమించబడిన పఠనభాగము యొక్క కావలికోట సారాంశము తర్వాత, యిక ముగింపు ప్రసంగానికి సమయం ఆసన్నమయ్యింది. సంతోషకరమైన విషయమేమంటే, రాగల దినాల్లో ఆశతో ఎదురు చూడాల్సిన సంగతులు అనేకం ఉన్నాయని ప్రసంగీకుడు చూపించాడు. ఉదాహరణకు, డూయింగ్ గాడ్స్ విల్ విత్ జీల్ అనే నాటకంగల ఒక క్రొత్త ఆడియోక్యాసెట్టును గూర్చి ఆయన ప్రకటించాడు. అంతమాత్రమే కాదు. ది బైబిల్—ఎ బుక్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ప్రాఫసీ, అనే అంశంమీద క్రొత్త వీడియో క్యాసెట్ల పరంపరలో మొదటి విడతగా ది బైబిల్—ఆక్యురేట్ హిస్టరీ, రిలయబుల్ ప్రాఫసీ అను పేరుగల వీడియో క్యాసెట్టు రానైయున్నది.
చివరగా, ప్రసంగీకుడు ఆఫ్రికా, ఆసియా, యూరపు మరియు దక్షిణ అమెరికాల్లో ప్రత్యేక అంతర్జాతీయ సమావేశాలతో సహా 1993లో నాలుగు దినముల జిల్లా సమావేశములు ఉంటాయని ప్రకటించాడు. “వెలుగు ప్రకాశకులు” అనే జిల్లా సమావేశం ముగుస్తున్ననూ, సమావేశ ప్రతినిధులు వచ్చే సంవత్సరం కొరకు పథకాలు వేసుకొనుటకు ఆరంభించవచ్చు.
ఆ పిమ్మట సమావేశ ప్రతినిధులు తమ ఇళ్లకువెళ్లే సమయమయ్యింది. నిశ్చయంగా వారు ఈ అంధకార లోకంలో క్రితమెన్నటికంటె ఎక్కువగా ఎడతెగక వెలుగును ప్రకాశిస్తూ ఉండాలని వారు నిశ్చయంగా దృఢంగా తీర్మానించుకున్నారు. చక్కని ఆత్మీయ సంగతులతో పూర్తిగా నిండిన మూడు రోజుల తర్వాత, ముగింపు ప్రసంగంలో చివర ఎత్తిచూపబడిన లేఖనము గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది: “యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు ననుగ్రహించియున్నాడు. . . . యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.”—కీర్తన 118:27, 29.
[15వ పేజీలోని చిత్రం]
రష్యా భాషలో సమావేశ కార్యక్రమ పత్రం
[16, 17వ పేజీలోని చిత్రాలు]
పరిపాలక సభ సభ్యులు అనేక సమావేశాల్లో ప్రసంగించారు
రష్యా, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సమావేశమైన వారిలో జపానుదేశ ప్రతినిధులున్నారు
యెహోవా దృష్టికి యథార్థమైన దానినిచేయు అవసరతను ఉత్తేజకరమైన బైబిలు నాటకము ఉన్నతపరచింది
నూతన వెలుగు ప్రకాశకులు నీటి బాప్తిస్మము ద్వారా యెహోవాకు తాము చేసుకున్న సమర్పణను సూచించారు
సెయింట్ పీటర్స్బర్గ్ కార్యక్రమమందు నిమగ్నులైన సమావేశ ప్రతినిధులు
[18వ పేజీలోని చిత్రాలు]
“దేవుడు మనపై నిజంగా శ్రద్ధకలిగియున్నాడా?” అనే క్రొత్త బ్రోషూరును పొందుటకు సమావేశ ప్రతినిధులు పులకించిపోయారు