ప్రతివిధమైన విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉండండి
“దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక?”—2 కొరింథీయులు 6:16.
1. ఇశ్రాయేలీయుల దేవాలయపు గుడారము మరియు దేవాలయాలు దేనికి సాదృశ్యముగా ఉన్నవి?
యెహోవా ఒక దేవాలయమును కలిగియున్నాడు, దానిలో విగ్రహములు లేవు. మోషే నిర్మించిన ఇశ్రాయేలీయుల మందిర గుడారము మరియు ఆ తర్వాతి కాలమందు యెరూషలేములో నిర్మించిన దేవాలయములు దీనిని దృష్టాంతపరచినవి. ఆ నిర్మాణములు యెహోవా యొక్క “నిజమైన గుడారమునకు” అనగా గొప్ప ఆత్మీయాలయమునకు ప్రాతినిధ్యమై యుండెను. (హెబ్రీయులు 8:1-5) యేసుక్రీస్తు విమోచన క్రయధనపు బలి ఆధారముగా ఆరాధనలో దేవుని సమీపించు ఏర్పాటే ఈ ఆలయము.—హెబ్రీయులు 9:2-10, 23.
2. దేవుని మహాగొప్ప ఆత్మీయాలయంలో స్తంభాలుగా ఎవరు తయారయ్యారు, మరియు గొప్పసమూహం ఏ స్థానాన్ని అనుభవిస్తున్నది?
2 అభిషక్తుడైన ప్రతి క్రైస్తవుడు పరలోకములో ఒక స్థానము పొందుచు, “దేవుని ఆలయములో ఒక స్తంభముగా” తయారగును. “గొప్ప సమూహము” వారైన యెహోవా ఇతర ఆరాధికులు, హేరోదుచే పునర్నిర్మించబడిన దేవాలయమందలి అన్యుల ప్రాంగణమునకు సూచనగా ఉండి దానియందు ‘[దేవునికి] పవిత్ర సేవ’ చేయుదురు. యేసు బలియందలి విశ్వాసము కారణముగా, వారు “మహాశ్రమలు” తప్పించుకొనునట్లుచేయు నీతియుక్త స్థానమును కలిగియుందురు.—ప్రకటన 3:12; 7:9-15.
3, 4. భూమిపైనున్న అభిషక్త క్రైస్తవ సంఘము దేనికి పోల్చబడింది, అది ఎలాంటి కళంకము లేనిదైయుండాలి?
3 భూమి మీది అభిషక్తుల సంఘము కూడ అలంకారార్థముగా విగ్రహారాధనలేని మరో ఆలయమునకు పోల్చబడియున్నది. ‘పరిశుద్ధాత్మతో ముద్రించబడిన’ అటువంటి వారికి అపొస్తలుడైన పౌలు యిలా చెప్పాడు: “క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.” (ఎఫెసీయులు 1:13; 2:20-22) ముద్రింపబడిన ఈ 1,44,000 మంది “పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, . . . ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడు” “సజీవమైన రాళ్లై” ఉన్నారు.—1 పేతురు 2:5; ప్రకటన 7:4; 14:1.
4 ఈ ఉపయాజకులు “దేవుని గృహమై” యున్నందున, ఈ ఆలయము కళంకమగుటకు ఆయన అనుమతించడు. (1 కొరింథీయులు 3:9, 16, 17) “మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక?” అని పౌలు హెచ్చరించాడు. ‘సర్వశక్తిగల యెహోవాకు’ చెందిన అభిషక్తులైన క్రైస్తవులు విగ్రహారాధన చేయనివారై యుండాలి. (2 కొరింథీయులు 6:14-18) గొప్పసమూహపు వారు సహితము ప్రతివిధమైన విగ్రహారాధనను విసర్జించాలి.
5. యెహోవా అనితరభక్తికి అర్హుడను విషయాన్ని ఎరిగినవారై నిజ క్రైస్తవులు ఏమిచేయాలి?
5 పూర్తిగా ఉన్నటువంటి మరియు మోసపూరితంగా ఉండే విగ్రహారాధనలు కలవు. అబద్ధ దేవుళ్లు, దేవతల ఆరాధనకు మాత్రమే విగ్రహారాధన పరిమితం కాదు. అది యెహోవాకు మారుగా మరెవరినైనను, మరిదేనినైనను ఆరాధించుటే. విశ్వ సర్వాధిపతిగా, ఆయన యుక్తముగా అనితరభక్తిని కోరుతున్నాడు మరియు పొందనర్హుడై యున్నాడు. (ద్వితీయోపదేశకాండము 4:24) దీనిని ఎరిగినవారై, నిజ క్రైస్తవులు సమస్త విగ్రహారాధన విషయంలో లేఖనములు ఇచ్చిన హెచ్చరికలను లక్ష్యపెడతారు. (1 కొరింథీయులు 10:7) యెహోవా సేవకులు విసర్జించాల్సిన విగ్రహారాధనా విధానాలను కొన్నింటిని మనము పరిశీలించుదాము.
క్రైస్తవమత సామ్రాజ్యపు విగ్రహారాధన సూచనార్థంగా చూపబడెను
6. ఎలాంటి హేయకృత్యాల్ని యెహెజ్కేలు దర్శనంలో చూశాడు?
6 సా.శ.పూ. 612లో బబులోను చెరలోనుండగా, యెరూషలేము నందలి యెహోవా ఆలయమందు మతభ్రష్టులైన యూదులు అభ్యసిస్తున్న హేయకృత్యములను గూర్చి ప్రవక్తయగు యెహెజ్కేలుకు దర్శనము కలిగింది. ద్వారము దగ్గర యెహెజ్కేలు “రోషము పుట్టించు విగ్రహమును” చూశాడు. ఆలయమందు డెబ్బదిమంది పెద్దలు ధూపము వేయుట గమనించబడింది. స్త్రీలు అబద్ధ దేవతను గూర్చి ఏడ్చుచున్నారు. ఇంకా 25 మంది పురుషులు సూర్యున్ని ఆరాధిస్తున్నారు. ఈ మతభ్రష్ట కృత్యముల ప్రాముఖ్యత ఏమిటి?
7, 8. “రోషము పుట్టించు విగ్రహము” ఏమైయుండవచ్చును, అది యెహోవాకు ఎందుకు రోషం పుట్టించింది?
7 దర్శనమందలి ఆ హేయకృత్యములు క్రైస్తవమత సామ్రాజ్యపు విగ్రహారాధనను ముందుగా సూచించినవి. ఉదాహరణకు, ఆయనిలా చెప్పాడు: “ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతట ఆయన [యెహోవా] నాతో ఈలాగు సెలవిచ్చెను—నరపుత్రుడా, వారు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా?”—యెహెజ్కేలు 8:1-6.
8 దేవుని ఆలయమందలి ఆ రోషము పుట్టించు విగ్రహము కనానీయులు తమదేవుడైన బయలు భార్యయని తలంచిన అబద్ధ దేవతయొక్క దేవతాస్తంభమునకు సూచనయై యుండవచ్చును. ఆ సూచన ఏమైయున్ననూ, “నీ దేవుడనైన యెహోవాను నేనే; . . . నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందే గాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను” అనే ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఇశ్రాయేలీయులు తమ అనితరభక్తియందు విభాగింపబడుదురు గనుక అది యెహోవాకు రోషము పుట్టించునదై యుండెను.—నిర్గమకాండము 20:2-5.
9. క్రైస్తవమత సామ్రాజ్యం దేవునికెలా రోషం కలిగించింది?
9 దేవుని ఆలయమందు రోష చిహ్నమును ఆరాధించుట మతభ్రష్ట ఇశ్రాయేలీయులు చేసిన మహాగొప్ప హేయకృత్యమై యుండెను. అదేప్రకారం, క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చీలు తాము సేవిస్తున్నామని చెప్పుకొను ఒకేదేవునికిచ్చు అనితరభక్తిని విభాగించే దేవున్ని అవమానపరచు చిహ్నములు, ప్రతిమలతో కళంకమైనవి. ఆలాగే మానవజాతికున్న ఏకైక నిరీక్షణయగు ఆయన రాజ్యమును మతనాయకులు తృణీకరించి, ఎక్కడ నిలువబడకూడదో అక్కడ ‘నిలువబడిన హేయవస్తువును’ అనగా ఐక్యరాజ్య సమితిని ఒక ప్రతిమగా చేయుట కూడ దేవునికి రోషము పుట్టించినది.—మత్తయి 24:15, 16; మార్కు 13:14.
10. దేవాలయం లోపల యెహెజ్కేలు ఏమిచూశాడు, మరియు ఇది క్రైస్తవమత సామ్రాజ్యమందు గమనించబడు దానితో ఎట్లు పోల్చబడును?
10 దేవాలయములో ప్రవేశించిన యెహెజ్కేలు యిలా వ్రాయుచున్నాడు: “ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, . . . ఆ యాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను.” ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా ఆలయమందు గోడలపై చెక్కబడిన హేయమైన చిత్రాలు ప్రాతినిధ్యం వహించిన అబద్ధ దేవతలకు ధూపం వేయడాన్ని కొంచెమాలోచించండి! (యెహెజ్కేలు 8:10-12) దీని పోలికగానే, పక్షులు, అడవి జంతువులు క్రైస్తవ దేశముల చిహ్నములై యున్నవి, కాగా ప్రజలు వాటియెడల భక్తిని ప్రదర్శిస్తుంటారు. అంతేకాదు, యెహోవా దేవుడు సృష్టించాడను బైబిలు నిజ వృత్తాంతాన్ని సమర్థించడానికి బదులు మానవుడు క్షుద్ర ప్రాణులనుండి, జంతురూపాల నుండి పరిణామం చెందాడనే తప్పుడు బోధచేయుట ద్వారా ప్రజలను మోసగించు దోషమును అనేకమంది మతనాయకులు కలిగియున్నారు.—అపొస్తలుల కార్యములు 17:24-28.
11. మతభ్రష్ట ఇశ్రాయేలీయుల స్త్రీలు ఎందుకు తమ్మూజు కొరకు యేడ్చారు?
11 యెహోవా మందిర ద్వారమునొద్ద మతభ్రష్ట ఇశ్రాయేలీయుల స్త్రీలు తమ్మూజు కొరకు యేడ్వడాన్ని యెహెజ్కేలు చూశాడు. (యెహెజ్కేలు 8:13, 14) వర్షాకాలంలో పెరిగి ఎండాకాలంలో ఎండిపోయే పచ్చికకు దేవుడని బబులోనీయులు, సిరియన్లు తమ్మూజును దృష్టించేవారు. ఆ పచ్చిక ఎండిపోవుట తమ్మూజు మరణానికి సూచనగా ఉండేది, అందువలన బాగావేడిగావున్న కాలంలో సంవత్సరానికి ఒకసారి అతని ఆరాధికులు యేడ్చేవారు. వర్షాకాలంలో పచ్చిక మరలా పెరిగినప్పుడు, తమ్మూజు అధోలోకం నుండి తిరిగివచ్చాడని నమ్మేవారు. అతని పేరులోని మొదటి అక్షరం అతనికి ప్రాతినిధ్యంగా ఉండేది. ఆ ప్రాచీన టావ్ అక్షరం సిలువ ఆకారంలో ఉండేది. ఇది సిలువయెడల క్రైస్తవమత సామ్రాజ్యం చూపే ఆరాధనా భావాన్ని మనకు చక్కగా గుర్తుచేస్తుంది.
12. మతభ్రష్ట ఇశ్రాయేలీయుల 25 మంది మనుష్యులు ఏమి చేస్తుండడాన్ని యెహెజ్కేలు చూశాడు, మరియు క్రైస్తవమత సామ్రాజ్యంలో ఆ ప్రకారమైన ఏ క్రియ జరుగుతున్నది?
12 తర్వాత, ఆలయపు లోపలి ఆవరణలో, మతభ్రష్ట ఇశ్రాయేలీయుల 25 మంది మనుష్యులు సూర్యున్ని ఆరాధించడాన్ని యెహెజ్కేలు చూశాడు. ఇటువంటి విగ్రహారాధన దేవుని ఆజ్ఞను ఉల్లంఘించుటై యున్నది. (ద్వితీయోపదేశకాండము 4:15-19) బహుశ మానవ పురుషాంగమును సూచించు అసభ్యకరమైన తీగెను సహితం ఆ విగ్రహారాధికులు దేవుని ముక్కుకు తగిలించారు. కాబట్టి దేవుడు వారి ప్రార్థనలను లక్ష్యపెట్టడనుటలో ఆశ్చర్యమేమి లేదు. క్రైస్తవమత సామ్రాజ్యం సహితం “మహాశ్రమల” కాలంలో ఆయన సహాయాన్ని అర్థిస్తారు అయినను అది వ్యర్థమే. (మత్తయి 24:21) తమ వీపులు యెహోవా ఆలయమువైపు పెట్టి, వెలుగునిచ్చే సూర్యున్ని ఆ మతభ్రష్ట ఇశ్రాయేలీయులు ఆరాధించినట్టే, క్రైస్తవమత సామ్రాజ్యం దేవునినుండి వచ్చు వెలుగును లక్ష్యపెట్టక, అబద్ధ బోధలను బోధిస్తూ, లోకజ్ఞానాన్ని ప్రస్తుతిస్తూ లైంగిక దుర్నీతిని చూసిచూడనట్టున్నది.—యెహెజ్కేలు 8:15-18.
13. యెహెజ్కేలు దర్శనములో చూడనగు విగ్రహారాధనా రూపములను యెహోవాసాక్షులు ఏయే విధముగా విసర్జిస్తారు?
13 యెహెజ్కేలు ముందే చూసినట్టు, క్రైస్తవమత సామ్రాజ్యం లేదా సాదృశ్య యెరూషలేము అభ్యసించు విగ్రహారాధనను యెహోవాసాక్షులు విసర్జిస్తారు. దేవుని అవమానపరచు చిహ్నములను మనము ఆరాధించము. మనం ప్రభుత్వ “పైఅధికారులకు” గౌరవం చూపినను, వారియెడల మనంచూపే విధేయత పరిమితమై ఉంటుంది. (రోమీయులు 13:1-7; మార్కు 12:17; అపొస్తలుల కార్యములు 5:29) దేవునియెడల ఆయన రాజ్యంయెడల మనం హృదయపూర్వక భక్తిని ప్రదర్శిస్తాము. పరిణామమును మనము సృష్టికర్తకు, ఆయన సృష్టికి ప్రత్యామ్నాయము చేయము. (ప్రకటన 4:11) మనమెన్నడు సిలువను పూజించము లేదా మేధావితనాన్ని, తత్వాన్ని లేదా మరేవిధమైన లోక జ్ఞానాన్ని ప్రస్తుతించము. (1 తిమోతి 6:20, 21) ఆలాగే మనం సమస్త విధములైన విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉంటాము. వీటిలో కొన్ని ఏమైయున్నవి?
ఇతర విధములైన విగ్రహారాధన
14. ప్రకటన 13:1లోగల “క్రూరమృగము” విషయంలో యెహోవా సేవకులు ఏ స్థానం కలిగియుంటారు?
14 సూచనార్థక “క్రూరమృగమును” ఆరాధించుటలో క్రైస్తవులు ఇతర మానవులతో తమ చేతులు కలుపరు. అపొస్తలుడైన యోహాను యిలా చెప్పాడు: “పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములు . . ఉండెను. . . . భూనివాసులందరును, . . . ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.” (ప్రకటన 13:1, 8) మృగములు “రాజులను,” లేదా రాజకీయ శక్తులను సూచించును. (దానియేలు 7:17; 8:3-8, 20-25) కావున సూచనార్థక క్రూరమృగము యొక్క ఏడు తలలు, ఐగుప్తు, అష్షూరు, బబులోను, మాదీయ-పారశీక, గ్రీసు, రోమా మరియు బ్రిటన్ అమెరికాలు కలిసిన ఆంగ్లో-అమెరికన్ అను ఏడు ప్రపంచ ఆధిపత్యములను సూచిస్తున్నవి. “ఈ లోకాధికారియగు” సాతాను యొక్క రాజకీయ విధానమును ఆరాధించుటలో మానవజాతిని నడిపించుట ద్వారా క్రైస్తవమత సామ్రాజ్యపు మతనాయకులు దేవునిని, క్రీస్తును బహుగా అవమానపరుస్తున్నారు. (యోహాను 12:31) అయితే, తటస్థ వైఖరిగల క్రైస్తవులుగా, రాజ్య ప్రచారకులుగా యెహోవా సేవకులు అటువంటి విగ్రహారాధనను తృణీకరిస్తారు.—యాకోబు 1:27.
15. లోకంలోని వివిధ తారలను యెహోవా ప్రజలెట్లు దృష్టిస్తారు, ఈ విషయంలో ఒక సాక్షి ఏమని చెప్పాడు?
15 లోకమందలి సినీ తారలను, క్రీడా తారలను సహితం ఆరాధించకుండా దేవుని ప్రజలు తప్పుకుంటారు. తానొక యెహోవా సాక్షి అయిన తర్వాత ఒక సంగీతకారుడు యిలా చెప్పాడు: “వినోదం కొరకు, నాట్యం కొరకు వాయించే సంగీతం తప్పుడు కోరికలు కల్గిస్తాయి . . . ప్రేక్షకులలో అనేకమంది తమ జీవిత భాగస్వామిలో లోపించాయని భావించే సంతోషం, అనురాగాన్ని గూర్చి గాయకుడు ఆలపిస్తాడు. పాడే ఆ పాటలోని వ్యక్తిగా తరచు ఆ కళాకారున్ని గుర్తించడం జరుగుతుంది. నాకు తెలిసిన కొంతమంది ప్రముఖ కళాకారులు ఈ కారణము చేతనే స్త్రీలు నిజంగా అభిమానించే వ్యక్తులయ్యారు. ఒకసారి ఒకవ్యక్తి ఈ భ్రమలో పడ్డాడంటే, ఆ కళాకారున్ని అతడు ఆరాధించే స్థితిలోకి నడిపించగలదు. కేవలం ఆటోగ్రాఫ్ కొరకు అడుగుటతో అది నిరపాయకరంగా ప్రారంభం కావచ్చును. అయితే కొందరు ఆ కళాకారున్ని తమకు ఆదర్శంగా చేసుకుని అతి ఉన్నత స్థానంలోవుంచి అతన్ని తమ ఆరాధన వ్యక్తిగా చేసుకుంటారు. వారు ఆ కళాకారుడి చిత్రపటాన్ని గోడకు తగిలించి అతనివలెనే దుస్తులు ధరిస్తూ కేశాలంకరణ చేసుకోవడం ఆరంభిస్తారు. అయితే కేవలం దేవుడు మాత్రమే పూజార్హుడని క్రైస్తవులు గుర్తుంచుకోవాలి.”
16. నీతిగల దూతలు విగ్రహారాధనను నిరాకరిస్తారని ఏమి చూపిస్తున్నది?
16 అవును, దేవుడు మాత్రమే పూజకు లేదా ఆరాధనకు అర్హుడు. తనకు ఆశ్చర్యకరమైన సంగతులను చూపినప్పుడు యోహాను ఆ “దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా,” ఆ యాత్మీయ ప్రాణి ఎలాంటి ఆరాధనాక్రియనైనను నిరాకరిస్తూ, “వద్దుసుమీ. నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.” (ప్రకటన 22:8, 9) యెహోవా యెడల భయము లేదా ఆయన యెడల మనకున్న మిక్కిలి గౌరవము మనమాయనను మాత్రమే ఆరాధించునట్లు చేయును. (ప్రకటన 14:7) ఆ విధంగా, నిజమైన దైవభక్తి విగ్రహారాధన నుండి మనలను కాపాడుతుంది.—1 తిమోతి 4:8.
17. విగ్రహారాధనగా లెక్కించబడు లైంగిక దుర్నీతి విషయంలో మనమెలా జాగ్రత్తగా ఉండగలము?
17 యెహోవా సేవకులు విసర్జించు మరో విధమైన విగ్రహారాధన ఏమనగా లైంగిక దుర్నీతి. “వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, లోభియైనను—అనగా విగ్రహారాధికుడను భావముగల వీటిని చేయువాడు—క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమును స్వతంత్రించుకొనడని” వారికి తెలుసు. (ఎఫెసీయులు 5:5 NW) దీనిలో విగ్రహారాధన చేరియుంది. ఎందుకంటె అక్రమ సుఖభోగము కొరకైన తృష్ణ భక్తిప్రదమౌతుంది. అయుక్త లైంగిక కోరికల ద్వారా దైవిక లక్షణాలు ప్రమాదంలో పడతాయి. అశ్లీలతను చూచుటకు, వినుటకు మొగ్గు చూపుట ద్వారా ఒకవ్యక్తి పరిశుద్ధ దేవుడైన యెహోవాతో తనకున్న సంబంధాన్ని ప్రమాదంలో పడవేసుకుంటాడు. (యెషయా 6:3) అటువంటి విగ్రహారాధన యెడల జాగ్రత్తగా ఉండుటకు, యెహోవా సేవకులు అశ్లీల సాహిత్యాన్ని, చెడు సంగీతాన్ని విసర్జించాలి. వారు లేఖనములపై ఆధారపడిన బలమైన ఆత్మీయ విలువల్ని అంటిపెట్టుకుని, “నీతియు యథార్థమైన భక్తియుగల . . . దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించు” కొనుటలో నిలకడగా ఉండవలెను.—ఎఫెసీయులు 4:22-24.
దురాశను లోభత్వాన్ని విసర్జించుము
18, 19. (ఎ) దురాశ, లోభత్వము ఏమైయున్నవి? (బి) విగ్రహారాధనయైన దురాశ, లోభత్వం విషయంలో మనమెలా జాగ్రత్తగా ఉండగలము?
18 విగ్రహారాధనకు దగ్గర సంబంధముగల దురాశ, లోభత్వం విషయంలో కూడ క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. దురాశ అనగా అమితమైన లేదా అపరిమితమైన కోరిక కాగా, లోభత్వం వేరొకరికి చెందిన ఎలాంటి దానినైనను పొందవలెనని దురాశపడుటైయున్నది. యేసు లోభత్వం విషయమై హెచ్చరిక చేసి, మరణమప్పుడు తనకున్న ధనసమృద్ధి చేత ఏమాత్రం ప్రయోజనం పొందక, “దేవునియెడల ధనవంతుడు” కానందున దుఃఖపరిస్థితి నెదుర్కొనిన లోభియైన ఒక ధనవంతుని గూర్చి మాట్లాడాడు. (లూకా 12:15-21) పౌలు సరియైన రీతిలో తన తోటి విశ్వాసులకు యిలా సలహానిచ్చాడు: “భూమిమీదనున్న మీ అవయవములను, అనగా . . . విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి.”—కొలొస్సయులు 3:5.
19 ధనాపేక్షతో, తినుటకు, త్రాగుటకు మిక్కిలి అత్యాశతో నిండినవారు లేదా అధికార దాహముగలవారు అలాంటి కోరికలను తమ ఆరాధనా ప్రతిమలుగా చేసుకొనుచున్నారు. పౌలు సూచించినట్లుగా, దురాశపరుడు విగ్రహారాధికుడై యుండి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడు. (1 కొరింథీయులు 6:9, 10; ఎఫెసీయులు 5:5) కాబట్టి, దురాశపరులను పోలి విగ్రహారాధనను అభ్యసించు బాప్తిస్మము పొందినవారు క్రైస్తవ సంఘమునుండి వెలివేయబడగలరు. అయితే, లేఖనములను అన్వయించుట ద్వారా మరియు చిత్తశుద్ధితో ప్రార్థించుట ద్వారా మనము దురాశను విసర్జించగలము. సామెతలు 30:7-9 యిలా చెప్తున్నది: “[యెహోవా] దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము; వ్యర్థమైనవాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన యెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి—యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.” ఇటువంటి మనస్తత్వము విగ్రహారాధనయైన దురాశ, లోభత్వం యెడల జాగ్రత్తగా ఉండుటకు మనకు సహాయపడగలదు.
స్వీయారాధన విషయంలో జాగ్రత్తగా ఉండుము
20, 21. స్వీయారాధన విషయంలో యెహోవా ప్రజలెట్లు జాగ్రత్తగా ఉంటారు?
20 యెహోవా ప్రజలు స్వీయారాధన విషయంలో కూడ జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ఒకడు తన స్వంత-చిత్తాన్ని ఆరాధించుట సర్వసాధారణం. కీర్తి ప్రతిష్టల కొరకైన తృష్ణ అనేకమందిని అగమ్య పద్ధతుల్లో ప్రవర్తించునట్లు చేస్తుంది. దేవుని చిత్తం కాదుగాని, వారు తమయిష్టం జరగాలని కోరుకుంటారు. అయితే మన అభీష్టాన్నే జరిగించడానికి, ఆలాగే దానిని ఇతరులపై రుద్దడానికి అగమ్య పద్ధతుల్లో ప్రయత్నించుట ద్వారా స్వీయారాధనకు మనము లొంగిపోతే మనం దేవునితో ఎలాంటి సంబంధము కలిగియుండలేము. (సామెతలు 3:32; మత్తయి 20:20-28: 1 పేతురు 5:2, 3) యేసు అనుచరులుగా, మనం లోక రహస్య కృత్యాల్ని త్యజించాము.—2 కొరింథీయులు 4:1, 2.
21 కీర్తి సంపాదించ ప్రయత్నించుటకు బదులు, దేవుని ప్రజలు పౌలు యిచ్చిన ఈ సలహాను పాటిస్తారు: “మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.” (1 కొరింథీయులు 10:31) యెహోవా సేవకులుగా మనము మన విధానమే జరగాలని అదేపనిగా ఒత్తిడిచేయము, అయితే “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” నడిపింపును అంగీకరించి, యెహోవా సంస్థతో సంపూర్ణముగా సహకరిస్తూ దైవ చిత్తాన్ని ఆనందముతో జరిగిస్తాము.—మత్తయి 24:45-47.
జాగ్రత్తగా ఉండుము!
22, 23. ప్రతి విధమైన విగ్రహారాధన విషయంలో మనమెలా జాగ్రత్తగా ఉండగలము?
22 యెహోవా ప్రజలుగా మనము భౌతికమైన ప్రతిమల ముందు సాగిలపడము. ఆలాగే మోసపూరిత విగ్రహారాధన విషయంలో కూడ మనం జాగ్రత్తగా ఉంటాము. నిజానికి, మనం ప్రతి విధమైన విగ్రహారాధనను ఎడతెగక విసర్జించాలి. కాబట్టి, మనం యోహాను యిచ్చిన ఈ సలహాను పాటిస్తాము: “విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.”—1 యోహాను 5:21.
23 నీవు యెహోవా సేవకులలో ఒకడవైనట్లయిన, అన్నిసమయాల్లో నీ బైబిలు శిక్షిత మనస్సాక్షిని, గ్రహణ శక్తులను ప్రయోగించుము. (హెబ్రీయులు 5:14) అట్లయిన నీవు లోక విగ్రహారాధన కలగలిసిన ఆత్మతో కళంకము చెందవుగాని ఆ ముగ్గురు హెబ్రీయులు మరియు యథార్థపరులైన తొలి క్రైస్తవులవలెనే ఉంటావు. నీవు యెహోవా యెడల అనితరభక్తిని ప్రదర్శిస్తావు, కాగా ప్రతి విధమైన విగ్రహారాధన విషయంలో నీవు ఎడతెగక జాగ్రత్తగా ఉండుటకు ఆయన నీకు సహాయంచేస్తాడు.
మీ తలంపులు ఏమైయున్నవి?
◻ యెహెజ్కేలు దర్శనములో చూడబడిన విగ్రహారాధనా రూపములను యెహోవాసాక్షులు ఏయే విధముగా విసర్జిస్తారు?
◻ ప్రకటన 13:1లోని “క్రూరమృగము” ఏమైయున్నది, దాని విషయంలో యెహోవా సేవకులు ఎలాంటి స్థానం వహిస్తారు?
◻ సినీ తారలను, క్రీడా తారలను ఆరాధించుట విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
◻ స్వీయారాధన విషయంలో మనమెలా జాగ్రత్తగా ఉండగలం?
◻ ప్రతి విధమైన విగ్రహారాధన విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
[26వ పేజీలోని చిత్రాలు]
యెహెజ్కేలు దర్శనములో చూడబడిన హేయకృత్యములు ఎలా క్రైస్తవమత సామ్రాజ్యపు విగ్రహారాధనకు సాదృశ్యముగా ఉన్నవో నీకు తెలుసా?
[క్రెడిట్ లైను]
Artwork (upper left) based on photo by Ralph Crane/Bardo Museum