కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 4/15 పేజీలు 4-7
  • ‘ప్రభువును ఎదుర్కొనుటకు కొనిపోబడుట’—ఎట్లు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘ప్రభువును ఎదుర్కొనుటకు కొనిపోబడుట’—ఎట్లు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రీస్తు “ప్రత్యక్షత”
  • “దేవుని ఇశ్రాయేలు”
  • “కొనిపోబడుట”—ఎట్లు?
  • రక్షింపబడుట—పైకెత్తబడుట ద్వారా కాదు
  • “మొదటి పునరుత్థానము” ఇప్పుడు జరుగుతోంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • మీరు పరలోకమునకు కొనిపోబడుదురా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యేసు ప్రత్యక్షతపై దృష్టిని కేంద్రీకరించుట
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • ‘మృతులు లేపబడుదురు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 4/15 పేజీలు 4-7

‘ప్రభువును ఎదుర్కొనుటకు కొనిపోబడుట’—ఎట్లు?

మార్చుటకు వీలులేని రీతిలో ప్రస్తుత దుష్టవిధానాంతపు దినములు లెక్కించబడుచున్నవి. ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి క్షణము గతించిపోవుచుండగా, ఎంతోకాలము ముందే ప్రవచింపబడిన విపత్కర సంఘటనలకు మనము చేరువగుచున్నాము. వీటిలో కొనిపోబడుట ఒక సంగతియై యుండునా? అట్లయిన, అది ఎప్పుడు, ఎలా జరుగును?

“రాప్చర్‌” (పైకెత్తబడుట) అనేమాట బైబిలునందు కన్పించదు. అయితే దానిని నమ్మువారు తమ నమ్మకానికి ఆధారంగా 1 థెస్సలొనీకయులు 4:17 నందు అపొస్తలుడైన పౌలు వ్రాసిన మాటలను ఎత్తిచూపుదురు. సందర్భానుసారంగా మనమీ లేఖనాన్ని పరిశీలించుదాము. పౌలు యిలా వ్రాశాడు:

“సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతిపొంది తిరిగిలేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతోకూడ వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.”—1 థెస్సలొనీకయులు 4:13-18.

పౌలు దాదాపు సా.శ. 50లో థెస్సలొనీకలోని క్రైస్తవులకు తన మొదటి లేఖ వ్రాసినప్పుడు ఆ సంఘము క్రొత్తదై యుండెను. వారిలో కొందరు మృతినొంది “నిద్రించిన” కారణముగా ఆ సంఘ సభ్యులు దుఃఖాక్రాంతులై యున్నారు. అయిననూ, పౌలు వ్రాసిన మాటలు ఆ థెస్సలొనీకయులను పునరుత్థాన నిరీక్షణతో ఓదార్చినవి.

క్రీస్తు “ప్రత్యక్షత”

అప్పటికే మరణించిన ఆ నమ్మకమైన క్రైస్తవులు పునరుత్థానులగుదురని స్థిరపరస్తూనే, పౌలు ఇంకనూ ఇట్లన్నాడు: “మేము యెహోవా మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు ప్రత్యక్షత వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటె ఏ విధముగాను ముందు చేరము.” (15వ వచనము NW) ప్రభువు “ప్రత్యక్షతను” గూర్చి అపొస్తలుని సూచన నిజముగా గమనార్హమై యుంది. ఇక్కడ ఆదిమ భాషా గ్రంథము పరోసియాన్‌ అనే గ్రీకు పదమును ఉపయోగిస్తున్నది, దానికి అక్షరార్థముగా “కూడ ఉండుట” అని అర్థము.

ఒక దేశాధినేత మరో దేశాన్ని సందర్శించేటప్పుడు, ఆయనక్కడవుండే తేదీలను సాధారణంగా ప్రకటిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత విషయంలోను ఇది నిజమైయుంది. పరలోక రాజ్యాధికారమందు యేసు ప్రత్యక్షత 1914లో ఆరంభమైందని ది వాచ్‌టవర్‌ యథార్థహృదయముగల బైబిలు ప్రవచన విద్యార్థులందరికి పొందికైన రుజువును సమర్పించినది. ఆ సంవత్సరము నుండి జరిగిన సంఘటనలు యేసు యొక్క అదృశ్య ప్రత్యక్షతను ధృవపరచినవి. (మత్తయి 24:3-14) కాబట్టి ప్రభువు ప్రత్యక్షతా కాలమున జీవించు కొంతమంది క్రైస్తవులు “ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదురు” అని చెప్పుటలో అలా సజీవులుగా యుండువారు భూమియొక్క వాతావరణమందు కాదుగాని, దేవుని కుడిపార్శ్వమున యేసు కూర్చుండియుండు స్థలానికి అనగా అదృశ్యమైన పరలోక రాజ్యమందు క్రీస్తును కలుసుకొందురని పౌలు భావమై యుండెను. (హెబ్రీయులు 1:1-3) అయితే వారెవరు?

“దేవుని ఇశ్రాయేలు”

లేఖనములు సహజ ఇశ్రాయేలును గూర్చి బహుగా చెప్పుటయే కాకుండ ఆత్మీయ “దేవుని ఇశ్రాయేలును” గూర్చి కూడ మాట్లాడుచున్నవి. ఈ గుంపుకొరకు పూర్ణ సంఖ్యగా తయారగు యూదులు, అన్యులైన విశ్వాసులు దేవుని పరిశుద్ధాత్మ, లేక చురుకైన శక్తిచే అభిషేకించబడ్డారు. (గలతీయులు 6:16; రోమీయులు 11:25, 26; 1 యోహాను 2:20, 27) ఈ ఆత్మీయ ఇశ్రాయేలు మొత్తం సంఖ్య 1,44,000మందని ప్రకటన గ్రంథము చూపిస్తున్నది, వీరందరు పరలోక సీయోను పర్వతముపై గొర్రెపిల్లయగు యేసుక్రీస్తుతో కూడ ఉన్నట్లు వర్ణించబడ్డారు. క్రీస్తుతో కూడ వారు పరలోకములో రాజులుగా, యాజకులుగా ఉంటారు. (ప్రకటన 7:1-8; 14:1-4; 20:6) వారి జాతి, దేశీయత ఏదైనను వారిలో థెస్సలొనీక మరియు ఇతర ప్రాంతాల సంఘాలతో సహవసించిన వారును చేరియుంటారు.—అపొస్తలుల కార్యములు 10:34, 35.

ఆత్మీయ ఇశ్రాయేలులోని నమ్మకమైన సభ్యులు ఎవరైననూ తమ పరలోకపు బహుమానము పొందకముందు, ఒక విషయాన్ని అనుభవించాలి. పరలోక జీవనానికి పునరుత్థానుడగుటకు ముందు హింసాకొయ్యపై యేసు మరణించిన రీతిగానే, పరలోక నిరీక్షణగల క్రైస్తవులు వారి బహుమానము పొందుటకు ముందు మరణించాలి. (1 కొరింథీయులు 15:35, 36) సా.శ. మొదటి శతాబ్దములో మరియు నేడును సజీవులుగా ఉన్న ఆత్మీయ ఇశ్రాయేలు సభ్యుల విషయంలోను అది నిజమై యుంటుంది.

“ప్రభువు ప్రత్యక్షతను” గూర్చి ప్రస్తావించిన తర్వాత, మరణించిన నమ్మకమైన ఆత్మీయ ఇశ్రాయేలీయులు తమ పరలోక బహుమతిపొందే సమయాన్ని పౌలు సూచించాడు. ఆయనిలా వ్రాశాడు: “ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు.” (16వ వచనము) కాబట్టి, రాజుగా యేసు ప్రత్యక్షత ప్రారంభమైతే, యథార్థపరులుగా అప్పటికే మరణించిన ఆత్మీయ ఇశ్రాయేలు వారితో మొదలై పరలోక పునరుత్థానము ఆరంభమగునని మనమపేక్షించుదుము. (1 కొరింథీయులు 15:23) వారిప్పుడు పరలోకమందు యేసుతో పాటు సేవచేస్తున్నారు. అయితే భూమిపై ఇంకనూ జీవిస్తున్న కొద్దిమంది అభిషక్త క్రైస్తవుల విషయమేమి? పైకెత్తబడుటకు వారు ఎదురుచూస్తారా?

“కొనిపోబడుట”—ఎట్లు?

మరణించిన అభిషక్త క్రైస్తవులను సూచించిన తర్వాత, పౌలు ఇంకనూ యిట్లన్నాడు: “ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము.” (17వ వచనము) క్రీస్తు ప్రత్యక్షత కాలములో జీవిస్తున్న వారే “ఆ . . . సజీవులు”; వారు ప్రభువైన యేసును ఎదుర్కొనుటకు “కొనిపోబడుదురు.” నమ్మకమైన తొలి క్రైస్తవుల విషయములో వలెనే, పరలోకమందు క్రీస్తుతో ఏకమగుటకు మానవులుగా వారు మరణించుట అవసరము.—రోమీయులు 8:17, 35-39.

కొరింథులోని క్రైస్తవులకు వ్రాస్తూ, పౌలు యిలా అన్నాడు: “సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు; ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.” (1 కొరింథీయులు 15:50-52) క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో నమ్మకస్థులుగా మరణించు ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషములోని ప్రతివారు తక్షణమే తమ పరలోక బహుమానము పొందుదురు. “రెప్పపాటున” అతడు ఆత్మీయ ప్రాణిగా పునరుత్థానుడై యేసును ఎదుర్కొనుటకు, పరలోక రాజ్యమందు సహపాలకునిగా సేవచేయుటకు “కొనిపోబడును.” అయితే యెహోవాను ఆరాధించు మిగతా వారందరి విషయమేమి? ఈ ప్రస్తుత విధానాంతము సమీపిస్తుండగా, వారు కూడ పరలోకానికి కొనిపోబడుదురా?

రక్షింపబడుట—పైకెత్తబడుట ద్వారా కాదు

రాజుగా యేసు ప్రత్యక్షత 1914లో ప్రారంభమైనందున, మనమిప్పుడు ఈ లోకపు “అంత్యకాలము” యొక్క చివరి దశలో ఉన్నాము. (దానియేలు 12:4) పౌలు యిలా హెచ్చరించాడు: “సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఏలాగువచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.” (1 థెస్సలొనీకయులు 5:1-3) అయితే మెలకువగానున్న క్రైస్తవులు తప్పించుకొందురు. ఎట్లు?

“నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదనే” పొలికేక “మహాశ్రమ” అని యేసు పిలిచిన కాలమునకు ముందు వేయబడును. పరదైసు భూమిపై నిత్యము జీవించు నిరీక్షణగల నమ్మకమైన వారియొక్క ఒక “గొప్పసమూహమును” గూర్చి వర్ణిస్తూ ప్రకటన గ్రంథం యిలా అంటుంది: “వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు; గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.” (ప్రకటన 7:9, 14; లూకా 23:43) పైకెత్తబడు ఉత్తరాపేక్ష వారికి లేదు. బదులుగా, వారు ఈ భూమ్మీదే రక్షించబడు, నిరీక్షణకలిగి యున్నారు. దానికి సిద్ధపడేందుకు, వారు ఆత్మీయముగా మెలకువగా ఉండవలెను. దీనిని మీరెలా చేయగలరు, ఈ విధానాంతము నుండి ఎలా తప్పించుకొనగలరు?

మీరు ‘మెలకువగా ఉండి విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొనవలెను.’ (1 థెస్సలొనీకయులు 5:6-8) దేవుని ప్రవచన వాక్యమగు బైబిలుయెడల శ్రద్ధచూపవలసిన సమయమిదే. ఈ విధానాంతమునకు సమయము గతించిపోవు కొలది పౌలు సలహాను లక్ష్యపెట్టుము: “ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.” (1 థెస్సలొనీకయులు 5:20, 21) కాబట్టి బైబిలు ప్రవచనములను, దేవుని ప్రేరేపిత వాక్యపు ఇతర విషయాలను పఠించుటలో తమతో భాగము వహించులాగున తమ రాజ్యమందిరాలకు రావల్సిందిగా యెహోవాసాక్షులు మిమ్మును ఆహ్వానిస్తున్నారు.

జ్ఞానమందును విశ్వాసమందును మీరు అభివృద్ధిచెందుకొలది, ఈ విశ్వమునుండి తన శత్రువులను తొలగించి, భూమిపై పరదైసును పునరుద్ధరించే యెహోవా దేవుని సంకల్ప నెరవేర్పును మీరు గ్రహిస్తారు. విశ్వాసముంచుట ద్వారా, మహాశ్రమలు తప్పించుకొని భూమిపై పునరుత్థానమగు లక్షలాదిమందిని జీవమునకు తిరిగి ఆహ్వానించు వారిలో మీరునూ ఉండగలరు. యేసుక్రీస్తు మరియు పరలోక రాజ్యమునకు పునరుత్థానము చేయబడుటద్వారా ‘ప్రభువును ఎదుర్కొనుటకు కొనిపోబడు’ ఆయన సహపరిపాలకుల అధికారమందలి దేవుని రాజ్యము క్రింద జీవించుట ఎంత ఆనందదాయకము!

అప్పుడు విధేయతగల మానవజాతికి నిజమైన ఏ లేఖన నిరీక్షణ ఉంటుంది? అది పైకెత్తబడుట కాదు. బదులుగా, దేవుని రాజ్యము క్రింద నిత్యజీవము అనుభవించుటైయుండును.

[7వ పేజీలోని చిత్రం]

యేసు మరియు పరలోకమునకు “కొనిపోబడు” వారి పరిపాలనలో మహాశ్రమలనుండి తప్పించుకొనువారు పునరుత్థానమగువారిని భూపరదైసులోని జీవానికి ఆహ్వానిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి