వెలుగు ప్రకాశకులు—ఎందుకొరకు?
“నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను.”—అపొస్తలుల కార్యములు 13:47.
1. అపొస్తలుల కార్యములు 13:47 నందు తెలియజేయబడిన ఆజ్ఞ ద్వారా అపొస్తలుడైన పౌలు ఎలా ప్రభావితుడయ్యాడు?
“నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను” అనే మాటలలో యెహోవా మనకు ఆజ్ఞ ఇచ్చియున్నాడని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (అపొస్తలుల కార్యములు 13:47) అలా అనడమే కాదు దానియొక్క గంభీరతను కూడ ఆయన గుర్తించాడు. క్రైస్తవుడైన తరువాత ఆ యాజ్ఞను నెరవేర్చుటకు పౌలు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 26:14-20) అట్టి ఆజ్ఞ మనపై కూడ ఉంచబడిందా? అలాగైతే, అది మన దినాలలో ఎందుకు ప్రాముఖ్యము?
మానవ జాతికి ‘చీకటి కమ్మినప్పుడు’
2. (ఎ) ప్రపంచం దాని అంత్యకాలంలోకి ప్రవేశించినప్పుడు, దాని ఆత్మీయ మరియు నైతిక వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినదేది సంభవించింది? (బి) ఆగస్టు 1914లో సంభవిస్తున్న దానిని చూసి ఒక బ్రిటీషు రాజనీతిజ్ఞుడు ఎలా ప్రతిస్పందించాడు?
2 ఈనాడు జీవించియున్న అనేకమంది మంది ప్రజలు జన్మింపక మునుపే, ఈ లోకం దాని అంత్య కాలంలో ప్రవేశించింది. ప్రముఖ సంఘటనలన్నీ వేగంగా ఒకదాని తరువాత ఒకటి సంభవించాయి. ఆత్మీయ మరియు నైతిక చీకటి యొక్క వ్యాప్తికి ముఖ్య కారకుడైన అపవాదియగు సాతాను, భూమిమీదకు పడద్రోయబడ్డాడు. (ఎఫెసీయులు 6:12; ప్రకటన 12:7-12) అప్పటికే మానవజాతి మొదటి ప్రపంచ యుద్ధంలో మునిగివుంది. ఆగస్టు 1914 తొలి దినాలలో, యుద్ధం అనివార్యమని అనిపించినప్పుడు, బ్రిటీషు విదేశాంగ వ్యవహారాల రాష్ట్ర కార్యదర్శి, సర్ ఎడ్వర్డ్ గ్రే, లండనులో తన కార్యాలయం కిటికీ వద్ద నిలబడి ఇలా అన్నాడు: “యూరపు అంతట దీపాలు ఆరిపోతున్నాయి; మన జీవితకాలంలో మళ్లీ అవి వెలిగింపబడటం మనం చూడలేము.”
3. మానవజాతి భావిదృష్టిని ఉత్తేజపరచటానికి లోకనాయకులు చేస్తున్న ప్రయత్నాలలో వారు ఎంతవరకు విజయం సాధించగలిగారు?
3 ఆ దీపాలను తిరిగి వెలిగించాలనే ప్రయత్నంగా, 1920లో నానాజాతి సమితి అమలులోకి తేబడింది. కాని దీపాలు అంతంత మాత్రంగానే వెలిగాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో, ప్రపంచ నాయకులు ఈసారి ఐక్యరాజ్యసమితితో మళ్లీ ప్రయత్నించారు. మరోసారి కూడా, దీపాలు ప్రకాశవంతంగా వెలగలేకపోయాయి. అయినా, ఇటీవలి సంఘటనల తరువాత, ప్రపంచ నాయకులు “ఒక నూతన లోక విధానాన్ని” గూర్చి మాట్లాడుతున్నారు. కాని వారు తెచ్చిన ఎటువంటి “నూతన లోకం” అయినా నిజమైన శాంతి భద్రతను అందించిందని చెప్పలేము. దానికి విరుద్ధంగా, సాయుధ పోరాటం, జాతి విరోధం, నేరం, నిరుద్యోగం, పేదరికం, వాతావరణ కాలుష్యం, మరియు అనారోగ్యం ఇవన్నీ ప్రజల జీవితానందాన్ని ధ్వంసం చేస్తున్నాయి.
4, 5. (ఎ) మానవ కుటుంబంపై అంధకారం ఎప్పుడు మరియు ఎలా కమ్మింది? (బి) నివారణ కలుగజేయుటకు ఏమి అవసరము?
4 వాస్తవానికి, 1914 కంటే ఎంతో ముందే మానవజాతికి ఆ దీపాలు ఆరిపోయాయి. ఆరువేల సంవత్సరాల క్రితం ఏదెనులో, వ్యక్తపరచబడిన దేవుని ఉద్దేశాన్ని లెక్క చేయకుండా మన మొదటి తలిదండ్రులు తమ స్వంతగా నిర్ణయాలు తీసుకొనుటకు మొదలు పెట్టినప్పుడే అది సంభవించింది. అప్పటి నుండి మానవజాతి యెదుర్కొంటున్న ఘోరమైన అనుభవాలు “అంధకార సంబంధమైన అధికారము” అని బైబిలు తెలియజేస్తున్న దాని క్రింద జరుగుతున్న భాగాలే. (కొలొస్సయులు 1:13) అపవాదియగు సాతాను ప్రభావం క్రింద మొదటి మానవుడైన ఆదాము, లోకాన్ని పాపంలో మునిగిపోయెలా చేశాడు; ఆదాము ద్వారా పాపము మరియు మరణము మానవజాతి అంతటికి వ్యాపించింది. (ఆదికాండము 3:1-6; రోమీయులు 5:12) ఆ విధంగా జీవానికి, వెలుగుకు మూలమైన యెహోవా అంగీకారాన్ని మానవజాతి కోల్పోయింది.—కీర్తన 36:9.
5 మానవజాతి సృష్టికర్త అయిన యెహోవా దేవుని అంగీకారాన్ని పొందటం ద్వారానే మానవజాతిలో ఎవరికైనా తిరిగి వెలుగు ప్రకాశించగల ఏకైక మార్గము. అప్పుడే “సమస్త జనముల మీద పరచబడిన తెర,” పాపమువలన కలిగిన నింద తొలగింపబడగలదు. ఇదెలా సాధ్యము?—యెషయా 25:7.
“అన్యజనులకు వెలుగుగా” ఇవ్వబడిన వాడు
6. యేసుక్రీస్తుద్వారా యెహోవా ఏ గొప్ప ఉత్తరాపేక్షలను మన కొరకు సాధ్యపరచాడు?
6 ఆదాము, హవ్వ పరదైసు నుండి వెళ్లగొట్టబడక మునుపు, నీతిని ప్రేమించేవారిని విడుదల చేయు ఒక “సంతానాన్ని” గూర్చి యెహోవా తెలియజేశాడు. (ఆదికాండము 3:15) ఆ వాగ్దాన సంతానం యొక్క మానవ జననం తరువాత ఈయనను, “జనములను కప్పియున్న తెరను తీసివేసే వెలుగుగా” గుర్తించునట్లు యెరూషలేము దేవాలయంలో వృద్ధుడైవున్న సుమెయోనును యెహోవా ప్రేరేపించాడు. (లూకా 2:29-32 NW) యేసు పరిపూర్ణ మానవ బలియందు విశ్వాసముంచుట ద్వారా, జన్మతా వచ్చిన పాపపు నిందనుండి మానవులు విడుదల చేయబడగలరు. (యోహాను 3:36) యెహోవా చిత్తానుసారంగా, పరలోక రాజ్యంలో భాగంగా, లేదా పరదైసు భూమిపై దాని వారసులుగా పరిపూర్ణతయందు నిత్యజీవం పొందునట్లు వారు ఇప్పుడు ఎదురు చూడవచ్చు. అది ఎంత అద్భుతమైన ఏర్పాటు!
7. యెషయా 42:1-4 నందలి వాగ్దానాలు మరియు మొదటి శతాబ్దంలో వాటి నెరవేర్పు ఎందుకు మనల్ని నిరీక్షణతో నింపుతాయి?
7 ఈ గొప్ప ఉత్తరాపేక్షలు నెరవేరుతాయనుటకు యేసుక్రీస్తు తానే ఒక హామీగా ఉన్నాడు. బాధపడువారిని యేసు స్వస్థపరచుటకు సంబంధించి అపొస్తలుడైన పౌలు యెషయా 42:1-4 నందు వ్రాయబడిన దానిని ఆయనకు అనువర్తింప జేసెను. ఆ లేఖనం పాక్షికంగా ఇలా తెలియజేస్తున్నది: “ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.” అన్యజనులకు అవసరమైనది ఇదికాదా? ఆ ప్రవచనం ఇలా కొనసాగింది: “ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు. ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు”. దీనికి అనుగుణ్యంగా, ముందే బాధపడుచున్న ప్రజలతో యేసు కఠినంగా వ్యవహరించలేదు. ఆయన వారియెడల దయ చూపించాడు, యెహోవాయొక్క సంకల్పాలను గూర్చి వారికి బోధించాడు, మరియు వారిని స్వస్థపరిచాడు.—మత్తయి 12:15-21.
8. యెహోవా ద్వారా యేసుక్రీస్తు ఏ ఉద్దేశ్యంలో “జనులకు నిబంధనగా” “జనాంగములకు వెలుగుగా” ఇవ్వబడ్డాడు?
8 ఈ ప్రవచనాన్ని ఇచ్చిన వ్యక్తి తన సేవకుడైన యేసుతో ఇలా అన్నాడు: “గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బందింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని యున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.” (యెషయా 42:6, 7) అవును, యెహోవా యేసుక్రీస్తును ఒక నిబంధనగా, ఒక వాగ్దానముతో కూడిన హామీగా ఇచ్చాడు. అది ఎంత ప్రోత్సాహకరంగా ఉంది! యేసు భూమిపై ఉన్నప్పుడు మానవజాతియెడల నిజమైన శ్రద్ధను కనుపరిచాడు; ఆయన మానవజాతి కొరకు తన ప్రాణాన్ని సహితం ఇచ్చాడు. యెహోవా ఈయనకే జనాంగాలన్నిటిపై ఆధిపత్యం అనుగ్రహించాడు. యెహోవా ఈయనను అన్యజనులకు వెలుగు అని చెప్పాడంటే ఆశ్చర్యమేమి లేదు. యేసు తానే ఇలా చెప్పాడు: “నేను లోకమునకు వెలుగును.”—యోహాను 8:12.
9. అప్పుడు ఉనికిలో ఉన్న విధానాన్ని మెరుగు పరచటానికి యేసు ఎందుకు తననుతాను సమర్పించుకోలేదు?
9 యేసు ఏ సంకల్పం కొరకు లోకానికి వెలుగుగా వ్యవహరించాడు? అది కచ్చితంగా ప్రాపంచిక లేక వస్తుదాయక సంకల్పం కొరకు కాదు. ఆనాడు ఉనికిలో ఉన్న రాజకీయ విధానాన్ని బాగుపరచటానికి ప్రయత్నించటాన్ని, ప్రజల నుండి లేక ఈ లోకాధికారి అయిన సాతాను నుండి రాజరికాన్ని పొందటాన్ని ఆయన నిరాకరించాడు. (లూకా 4:5-8; యోహాను 6:15; 14:30) బాధపడుతున్న వారి యెడల యేసు ఎంతో కరుణ చూపించాడు, ఇతరులెవరు చేయలేని విధంగా వారికి, వారి బాధ నుండి విముక్తిని కలిగించాడు. కాని, అదృశ్య దుష్ట ఆత్మీయ శక్తులచే మోసగించ బడుతున్న మరియు జన్మతా వచ్చిన పాపాన్ని బట్టి దైవిక శిక్ష క్రింద ఉన్న మానవ సమాజరూపకల్పనలో శాశ్వత ఉపశమనం అసాధ్యమని ఆయనకు తెలుసు. దైవిక వివేచనతో, దేవుని చిత్తాన్ని చేయుటపైనే యేసు తన జీవితాన్నంతటిని కేంద్రీకరించాడు.—హెబ్రీయులు 10:7.
10. యేసు ఏ ఉద్దేశ్యం కొరకు, ఏ విధములుగా లోకానికి వెలుగుగా పనిచేశాడు?
10 ఏయే విధాలుగా, మరియు ఏ సంకల్పం కొరకు, యేసు ఈ లోకానికి వెలుగుగా వ్యవహరించాడు? దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు ఆయన తనను తాను సమర్పించుకొన్నాడు. (లూకా 4:43; యోహాను 18:37) యెహోవా సంకల్పాన్ని గూర్చిన సత్యానికి సాక్ష్యమిచ్చుట ద్వారా తన పరలోకపు తండ్రి నామమును ఆయన మహిమపరచాడు. (యోహాను 17:4, 6) అంతేగాక, లోకానికి వెలుగుగా, యేసు మతసంబంధమైన వేషధారణను బహిర్గతంచేశాడు మరియు మత బానిసత్వం క్రింద ఉన్నవారికి ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. తమను తాము అతనిచే ఉపయోగించు కొనుటకు అనుమతించు వారిని మోసపుచ్చువాడిగా సాతానును ఆయన బహిర్గతంచేశాడు. యేసు అంధకార సంబంధమైన క్రియలను కూడ స్పష్టంగా గుర్తించాడు. (మత్తయి 15:3-9; యోహాను 3:19-21; 8:44) తన పరిపూర్ణ మానవ జీవితాన్ని విమోచన క్రయధన బలిగా అర్పించడం ద్వారా, ఈ ఏర్పాటునందు విశ్వాసముంచు వారి పాపాలు క్షమించుటకు, దేవునితో అంగీకృత సంబంధాన్ని కలిగివుండుటకు, యెహోవాయొక్క విశ్వ కుటుంబములో భాగంగా నిత్యజీవ అవకాశానికి మార్గం తెరుచుటతో ఆయన ఈ లోకానికి వెలుగై యున్నట్లు అసాధారణమైన రీతిలో రుజువుచేసుకొన్నాడు. (మత్తయి 20:28; యోహాను 3:16) చివరిగా, తన జీవితమంతటిలో పరిపూర్ణమైన దైవభక్తిని కలిగివుండుటద్వారా, యేసు యెహోవాయొక్క సర్వాధిపత్యాన్ని ఉన్నత పరచి, సాతానును అబద్ధికునిగా రుజువుచేయటం ద్వారా, నీతిని ప్రేమించు వారికి శాశ్వత మేలులు కలిగేలాచేశాడు. కాని, కేవలం యేసు ఒక్కడే వెలుగు ప్రకాశకుడైయున్నాడా?
“మీరు లోకమునకు వెలుగైయున్నారు”
11. వెలుగు ప్రకాశకులుగా ఉండుటకుగాను, యేసు అనుచరులు ఏమి చేయవలసియుండిరి?
11 మత్తయి 5:14నందు, యేసు తన శిష్యులకు “మీరు లోకమునకు వెలుగైయున్నారు” అని చెప్పెను. వారు ఆయన అడుగుజాడలను అనుసరించ వలసియుండిరి. వారు తమ జీవన విధానంద్వారా మరియు బోధద్వారా నిజమైన వెలుగుకు మూలం యెహోవాయేనని ఆయన వైపుకు ఇతరులను త్రిప్పవలసి యుండిరి. యేసును అనుకరిస్తూ, వారు యెహోవా యొక్క నామాన్ని తెలియజేసి ఆయన సర్వాధిపత్యాన్ని ఉన్నత పరచవలసి యుండిరి. యేసు చేసినట్లుగా, మానవజాతియొక్క ఏకైక నిరీక్షణ దేవుని రాజ్యమని ప్రకటించ వలసి యుండిరి. వారు మతపరమైన అసత్యాలను, అంధకార సంబంధమైన క్రియలను, వీటి వెనుక ఉన్న దుష్టున్ని బహిర్గతం చేయవలసి యుండిరి. రక్షణకొరకు, యేసుక్రీస్తుద్వారా యెహోవా చేసిన ప్రేమపూర్వక ఏర్పాటునుగూర్చి క్రీస్తు అనుచరులు ప్రజలందరికి చెప్పవలసి యుండిరి. యేసు ఆజ్ఞాపించిన విధంగా, తొలిక్రైస్తవులు ఆ పనిని యెరూషలేము, యూదయ నుండి మొదలు పెట్టి సమరయ గుండా ఎంత ఉత్సాహంతో నెరవేర్చారు!—అపొస్తలుల కార్యములు 1:8.
12. (ఎ) ఆత్మీయ వెలుగు ఎంత వరకు ప్రసరించ వలసి యుండెను? (బి) యెషయా 42:6ను గూర్చి ఏమి గ్రహించటానికి యెహోవా ఆత్మ పౌలుకు సహాయం అందజేసింది, మరియు ఆ ప్రవచనం మన జీవితాలను ఎలా ప్రభావితం చేయాలి?
12 అయినా, సువార్త ప్రకటన పని ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు తన శిష్యులకు ఆదేశించెను. (మత్తయి 28:19) తార్సువాడైన సౌలు మార్పునొందే సమయంలో, (అపొస్తలుడైన పౌలుగా మారిన) సౌలు కేవలం యూదులకే కాక అన్యజనులకు కూడ ప్రకటించాలని ప్రభువు విశేషంగా సూచించాడు. (అపొస్తలుల కార్యములు 9:15) పరిశుద్ధాత్మ సహాయంతో, దానిలో ఏమి ఇమిడివుందో పౌలు గుణగ్రహించ గలిగాడు. ఆవిధంగా యెషయా 42:6 నందలి, యేసునందు ప్రత్యక్షంగా నెరవేరిన ప్రవచనం, అంతర్గతంగా అందులో క్రీస్తును విశ్వసించే వారందరికి ఒక ఆజ్ఞను కల్గివున్నది. గనుక, యెషయా నుండి ఎత్తివ్రాస్తూ అపొస్తలుల కార్యములు 13:47నందు పౌలు ఇలా చెప్పాడు: “ఏలయనగా—నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.” మీ సంగతేమిటి? వెలుగు ప్రకాశకులుగా ఉండవలసిన మీ బాధ్యతను మీరు గుణగ్రహించారా? యేసు మరియు పౌలువలె, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మీ జీవితంలో కేంద్ర స్థానాన్నిచ్చారా?
మనల్ని నడిపించుటకు దేవుని నుండి వెలుగు మరియు సత్యము
13. కీర్తన 43:3కు అనుగుణ్యంగా, మన మనఃపూర్వక ప్రార్థన ఏమైయుండవలెను, మరియు దేనినుండి ఇది మనలను కాపాడవలెను?
13 మన స్వంత ఉపాయాలతో మానవజాతి భవిష్యత్తును ప్రకాశవంతం చేయుటకు, ‘దీపాలు తిరిగి వెలిగేలా’ చేయటానికి ప్రయత్నించినట్లైన దేవుని ప్రేరేపిత వాక్య అభిప్రాయమందు ఎంతగానో తప్పిపోతున్నాము. ఈ ప్రపంచం సాధారణంగా ఏం చేసినప్పటికి, నిజక్రైస్తవులు వెలుగునకు నిజమైన మూలంగా యెహోవావైపే చూస్తారు. వారి ప్రార్థన కీర్తన 43:3, నందు ఉన్నట్లు ఇలా ఉంటుంది: “నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొనివచ్చును.”
14, 15. (ఎ) యెహోవా ఇప్పుడు ఏయే విధాలుగా తన వెలుగును మరియు సత్యాన్ని పంపిస్తున్నాడు? (బి) నిజంగా దేవుని వెలుగు మరియు సత్యం మనల్ని నడిపిస్తున్నాయని మనమెలా చూపించగలము?
14 తన నమ్మకమైన సేవకుల ఆ ప్రార్థనకు యెహోవా ప్రత్యుత్తరమిస్తూనే ఉన్నాడు. తన సంకల్పాన్ని తెలియజేసి, తన సేవకులకు అది అర్ధమయ్యేలా చేసి, తాను తెలియజేసినది నెరవేరేలా చేయడంద్వారా ఆయన వెలుగును ప్రసరింప జేస్తాడు. మనం దేవునికి ప్రార్థన చేయునప్పుడు, అది కేవలం పరిశుద్ధతా భావం కనిపించేలా చేయుటకు చేసే వాడుక కాదు. కీర్తన చెప్పినట్లు, యెహోవా నుండి వచ్చే వెలుగు మనల్ని నడిపిస్తుందన్నది మన మనఃపూర్వక అభిలాష. దేవుడిచ్చే వెలుగును పొందుటతో వచ్చే బాధ్యతను మనం అంగీకరిస్తాము. అపొస్తలుడైన పౌలువలెనే, యెహోవాయొక్క వాక్య నెరవేర్పు దానియందు విశ్వాసముంచు వారందరిపై అంతర్గతంగా ఆజ్ఞను ఉంచుతుందని మనం గ్రహిస్తాము. దేవుడు మనకు ఆ సంకల్పం కొరకే అప్పగించిన సువార్తను ఇతరులకు అందజేసేంత వరకు మనం వారికి రుణస్తులంగా భావిస్తాము.—రోమీయులు 1:14, 15.
15 యెహోవా మన దినాలలో పంపిస్తున్న వెలుగు మరియు సత్యము యేసుక్రీస్తు తన పరలోక సింహాసనము నుండి చురుకుగా పరిపాలిస్తున్నాడని స్పష్టంచేస్తున్నది. (కీర్తన 2:6-8; ప్రకటన 11:15) తన రాజరిక ప్రత్యక్షత సమయంలో, ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడునని యేసు ముందే తెలియజేసెను. (మత్తయి 24:3, 14) ఆ పని ఇప్పుడు భూవ్యాప్తంగా, విస్తృతంగా, నెరవేర్చబడుచున్నది. ఆ పనిని మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా చేసుకుంటే, కీర్తనల రచయిత చెప్పినట్లు, దేవుని వెలుగు మరియు సత్యము మనల్ని నడిపిస్తున్నట్లే.
యెహోవా మహిమ ప్రకాశింపబడింది
16, 17. తన స్త్రీవంటి సంస్థపై యెహోవా 1914లో ఎలా తన మహిమను ప్రకాశింప జేశాడు, మరియు ఆమెకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?
16 మనస్సును కంపింపజేసే భాషలో, ప్రజలందరికి దైవిక వెలుగు వెదజల్ల బడిన విధానాన్ని లేఖనాలు వివరిస్తున్నాయి. యెహోవాయొక్క “స్త్రీ” లేదా నమ్మకస్తులైన సేవకులతో కూడిన ఆయన పరలోక సంస్థను సంబోధిస్తూ యెషయా 60:1-3 నందు ఇలా చెప్పబడింది: “నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు.”
17 చాల కాలం కనిపెట్టి యుండి, యేసుక్రీస్తును రాజుగా, పరలోక స్త్రీవంటి సంస్థ మెస్సీయ రాజ్యానికి జన్మనిచ్చినప్పుడు, 1914వ సంవత్సరంలో ఆమెపై యెహోవా మహిమ ప్రకాశింపబడింది. (ప్రకటన 12:1-5) భూమి యంతటికి ఆ ప్రభుత్వమును సరైనదానిగా గుర్తించి, అంగీకరించుటద్వారా యెహోవా యొక్క తేజోవంతమైన వెలుగు ప్రకాశింపబడుతుంది.
18. (ఎ) యెషయా 60:2 నందు ప్రవచింపబడినట్లుగా భూమిని అంధకారం ఎందుకు కమ్మింది? (బి) భూమియొక్క అంధకారం నుండి ఆయా వ్యక్తులు ఎలా విడిపింపబడగలరు?
18 అందుకు భిన్నంగా, భూమిని అంధకారం, జనాంగములను కటిక చీకటి కమ్మేస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే, జనాంగాలు మానవ పరిపాలనను కోరుకొని, దేవుని ప్రియకుమారుని ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నాయి. ఒక రకమైన ప్రభుత్వాన్ని వదిలేసి ఇంకొక తరహా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా, తమ సమస్యలను పరిష్కరించు కోగలమని వారు భావిస్తున్నారు. ఆత్మీయ సామ్రాజ్యం నుండి, తెరమరుగైయుండి జనాంగాలను మోసగిస్తున్నది ఎవరో కనుగొనుటలో వారు విఫలమౌతున్నారు. (2 కొరింథీయులు 4:4) నిజమైన వెలుగుకు మూలాన్ని నిరాకరిస్తున్నారు గనుక వారు అంధకారంలో ఉన్నారు. (ఎఫెసీయులు 6:12) అయిననూ, జనాంగాలు చేసేది ఏమైనప్పటికీ, ఆయావ్యక్తులు ఆ అంధకారం నుండి విడుదల పొందగలరు. ఏ విధంగా? దేవుని రాజ్యమందు పూర్తి విశ్వాసాన్ని వుంచి, దానికి లోబడటం ద్వారా.
19, 20. (ఎ) యేసు అభిషక్త అనుచరులపై యెహోవా మహిమ ఎలా మరియు ఎందుకు ప్రకాశింపబడింది? (బి) తన అభిషక్తులను యెహోవా ఏ కారణం చేత వెలుగు ప్రకాశకులుగా చేశాడు? (సి) ప్రవచింపబడిన విధంగా, “రాజులు” మరియు “జనాంగాలు” దేవుడిచ్చిన వెలుగువైపుకు ఎలా ఆకర్షింప బడ్డారు?
19 క్రైస్తవ మతసామ్రాజ్యం దేవుని రాజ్యమందు విశ్వాసముంచ లేదు, దానికి లోబడలేదు. కాని యేసుక్రీస్తుయొక్క అభిషక్త అనుచరులు అలా చేశారు. దాని ఫలితంగా, పరలోక స్త్రీయొక్క దృశ్య ప్రతినిధులపై యెహోవా అంగీకార వెలుగు ప్రకాశింపబడింది. ఆయన మహిమ వారిపై ఉన్నట్లు బయల్పడింది. (యెషయా 60:19-21) ప్రపంచ రాజకీయాలలో లేదా ఆర్థిక పరిస్థితులలోవచ్చే ఏ మార్పులు కూడ తీసివేయలేని ఆత్మీయ వెలుగును వారు ఆనందిస్తున్నారు. యెహోవాద్వారా మహాబబులోను నుండి వారు విడుదలను పొందారు. (ప్రకటన 18:4) ఆయన సర్వాధిపత్యాన్ని నమ్మకంగా ఉన్నతపరిచి ఆయన ఇచ్చే శిక్షణను వారు స్వీకరించారు గనుక ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. వారికి భవిష్యత్తు కొరకు ఉజ్వలమైన ఉత్తరాపేక్షలున్నాయి. ఆయన వారి ముందుంచిన నిరీక్షణనుబట్టి వారు సంతోషిస్తారు.
20 కాని, ఏ సంకల్పం కొరకు యెహోవా వారితో ఈ విధంగా వ్యవహరించాడు? ఆయన తానే యెషయా 60:21, నందు చెప్పినట్లు, ఆయన నామం ఘనపర్చబడాలని, తమకు తాము నిత్యాశీర్వాదాలు తెచ్చుకునేలా—ఆయన మాత్రమే నిజమైన దేవుడని ఇతరులు ఆయనయొద్దకు తేబడాలని, తాను “మహిమపరచబడా”లని అలా చేశాడు. దీనికి అనుగుణ్యంగా, 1931లో సత్యదేవుని ఈ ఆరాధికులు యెహోవాసాక్షులు అనే పేరును పెట్టుకున్నారు. వారి సాక్ష్యపుపని ఫలితంగా, యెషయా ప్రవచించిన విధంగా, వారు ప్రతిబింబించిన వెలుగువైపుకు “రాజులు” ఆకర్షింపబడ్డారా? అవును! లోక రాజకీయ పరిపాలకులు కాదుగాని, పరలోక రాజ్యంలో క్రీస్తుతోపాటు పరిపాలించే శేషించబడినవారు ఆకర్షింపబడ్డారు. (ప్రకటన 1:5, 6; 21:24) జనాంగాల మాటేమిటి? వారు ఈ వెలుగువైపుకు ఆకర్షింపబడ్డారా? కచ్చితంగా ఆకర్షింపబడ్డారు! ఏ ఒక్క రాజకీయ జనాంగము ఆకర్షింపబడలేదుగాని, అన్ని దేశాల నుండి ఒక పెద్ద సమూహము దేవునిరాజ్య పక్షమున నిలిచి తీసుకుని, దేవుని నూతన లోకంలోనికి ప్రవేశించుటకు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అది నిజంగా నీతితో నిండియుండే నూతన లోకమైయుంటుంది.—2 పేతురు 3:13; ప్రకటన 7:9, 10.
21. తన చిత్తాన్ని గ్రహించుటకు యెహోవా మనకు అనుగ్రహించిన తన కృప యొక్క సంకల్పాన్ని మనం తప్పిపోలేదని ఎలా చూపించగలము?
21 పెరుగుతున్న ఆ వెలుగు ప్రకాశకుల గుంపులో మీరొకరై యున్నారా? యేసువలె, మనము కూడ వెలుగు ప్రకాశకులుగా ఉండునట్లు, యెహోవా తన చిత్తాన్ని మనకు గ్రహింపజేశాడు. మన దినాలలలో, యెహోవా తన నమ్మకమైన సేవకులకు అప్పగించిన పనియందు ఉత్సాహాన్ని ప్రదర్శించడం ద్వారా దేవుడు మనయెడల కనపరచిన కృపయొక్క ఉద్దేశాన్ని తప్పిపోకుండ వుందాము. (2 కొరింథీయులు 6:1, 2) మన దినాలలో అంతకంటే ముఖ్యమైన పని ఇంకొకటి లేదు. ఆయన నుండి వచ్చే తేజోవంతమైన వెలుగును ఇతరులకు ప్రతిబింబించుట ద్వారా యెహోవాను ఘనపర్చుటకంటే, ఎక్కువైన ఆధిక్యత లేదు.
మీరెలా జవాబిస్తారు?
◻ మానవజాతియొక్క బాధాకరమైన సమస్యల మూల కారణాలేమిటి?
◻ యేసు మరియు ఆయన అనుచరులు ఏయే విధాలుగా “లోకానికి వెలుగైయున్నారు”?
◻ యెహోవాయొక్క వెలుగు మరియు సత్యము మనల్ని ఎలా నడిపిస్తున్నవి?
◻ యెహోవా తన సంస్థపై తన మహిమను ఎలా ప్రకాశింపజేశాడు?
◻ యెహోవా ఏ సంకల్పము కొరకు తన ప్రజలను వెలుగు ప్రకాశకులనుగా చేశాడు?
[9వ పేజీలోని చిత్రం]
ఏదెనులో జరిగిన ఒక సంఘటన మానవజాతియొక్క ఈనాటి దుఃఖకరమైన సమస్యలను అర్థం చేసుకొనుటకు మనకు సహాయంచేస్తుంది
[క్రెడిట్ లైను]
Tom Haley/Sipa
Paringaux/Sipa