మార్గదర్శక హెబ్రీ బైబిలు వ్రాతప్రతి
మృత సముద్రపు గ్రంథపుచుట్టలు 1947లో దొరకక మునుపు, చిన్నచిన్న ముక్కలు తప్ప, తెలిసిన అతిపురాతన హెబ్రీ బైబిలు వ్రాతప్రతులన్నియు సా.శ. 9 చివరినుండి 11వ శతాబ్దపు మధ్యలోనివే. అంటే దాదాపు వెయ్యిసంవత్సరముల నాటివే. దీని భావము 1947 ముందు నాటికి బైబిలులోని హెబ్రీ గ్రంథము అనిశ్చయతతో ఉండెననా? పురాతన హెబ్రీ వ్రాతప్రతులు ఎందుకు చాలా తక్కువగా ఉండెను?
చివరి ప్రశ్నను మొదట పరిశీలిస్తే, బహు నిష్టతోకూడిన యూదామత విధానముక్రింద పూర్తిగా పాతగిల్లి, ఇక నిరుపయోగమని ఎంచబడిన ఏ హెబ్రీ చేతివ్రాతప్రతినైనను, సమాజమందిరములోని సామాను గదిలో అనగా గెనీజాలో పెట్టి తాళము వేసేవారు. ఆ తరువాత అలా పాతగిల్లి, పోగైన వ్రాతప్రతులన్నిటిని బయటకు తీసుకెళ్లి పాతిపెట్టేవారు. లేఖనములు అపవిత్రపరచ బడకుండునట్లు లేదా దుర్వినియోగపరచబడ కుండేందుకే యూదులు ఇలా చేసేవారు. ఎందుకు? ఎందుకంటే, వాటిలో దేవుని పరిశుద్ధ నామమును సూచించే టెట్రాగ్రమేటన్ అనబడే హెబ్రీ అక్షరాలున్నవి. ఈ పేరు సాధారణంగా ఇంగ్లీషులో “జెహోవా” అని వాడబడింది.
“కిరీటము”
అతి పురాతన కాలముల నుండి పురాతన హెబ్రీ గ్రంథపు అధిక భాగము ఎంతో నమ్మకముగా భావికాలానికి అందించబడినది. ఉదాహరణకు, ఒక ప్రాముఖ్యమైన హెబ్రీ వ్రాతప్రతిని తీసుకుందాము. మొట్టమొదటి హెబ్రీలేఖనములన్నిటిని లేక “పాతనిబంధన” అంతటిని కలిగివున్న కెటెర్ అంటే, “కిరీటము” అని పిలువబడిన ప్రాముఖ్యమగు హెబ్రీ వ్రాతప్రతి ఉంది. ఇది సిరియాలోని ముస్లీమ్ ఆధిపత్యముగల అలెప్పో అనే పట్టణములో కొద్దిమందే యూదా సమాజపు ఉన్న అతిపురాతన సమాజమందిరములో భద్రపరచబడింది. మొదట ఈ చేతివ్రాత ప్రతిని యెరూషలేములోని కెరైట్ యూదులకు ఇచ్చారు. కాని 1099లో మతయుద్ధ యోధులు దీనిని వశపరచుకున్నారు. ఆ తదుపరి ఈ వ్రాతప్రతి తిరిగి సంపాదించబడి, ఐగుప్తులోని ఓల్డ్ కైరోకు తీసికొనిపో బడింది. చివరకు 15వ శతాబ్దానికల్లా ఇది అలెప్పోకు చేరుకొని, తద్వారా అలెప్పో కోడెక్స్ అని పిలువబడింది. ఈ వ్రాతప్రతి సా.శ. 930 సంవత్సరం నాటిదిగా అంచనావేయబడి, మెసొరెటిక్ విద్వాంసుల పనిలో దాని పేరు సూచించేలా అది కిరీటంగా ఎంచబడింది. బైబిలు గ్రంథమును ముందుకాలానికి అందించుటలో తీసుకొనబడిన జాగ్రత్తకు ఇది అతి శ్రేష్ఠమైన మాదిరిగా ఉంటూ, నిజంగా మార్గదర్శకమైన హెబ్రీ వ్రాతప్రతిగా నిలిచింది.
ఆధునిక కాలాలలో ఈ విశిష్టమైన వ్రాతప్రతిని భద్రంగా కాపాడే వ్యక్తులు మూఢనమ్మకముతో వారి పవిత్ర ప్రతిని అపవిత్రపరుస్తామేమోననే భయంతో విద్వాంసులను దానిని పరీక్షించుటకు అనుమతించుటలేదు. అంతేగాక, అందులోని ఒకేఒక కాగితమును మాత్రమే ఫొటోకాపీ తీయుటకు అనుమతించినందున, పఠనమునకై కచ్ఛితమైన నకలు చేయుట వీలుపడలేదు.
బ్రిటీషువారు 1948లో పాలస్తీనా నుండి వైదొలగినప్పుడు, అలెప్పోలో యూదుల మీద దాడులు చెలరేగాయి. వారి సమాజమందిరము కాల్చివేయబడింది. ప్రశస్తమైన ఈ కోడెక్స్ కనపడకుండా పోవడంతో అది నాశనమైపోయిందని అనుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా, పదిసంవత్సరముల తర్వాత దానిలో మూడు వంతులు సిరియానుండి దొంగతనంగా యెరూషలేముకు తీసుకొనిపోబడిందని తెలియవచ్చింది. 1976లో పూర్తి హంగులతో 500 శ్రేష్ఠమైన నకలు కాపీలు విడుదలచేయబడ్డాయి.
నిపుణుని పని
ఈ వ్రాత ప్రతి ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? ఎందుకంటే హల్లులతో వ్రాయబడిన దాని తొలిప్రతి, హెబ్రీ బైబిలును నకలు తీసి అందించుటలో అత్యంత పేరుగాంచిన విద్వాంసులలో ఒకరైన ఆరెన్ బెన్ ఆషెర్ వలన దాదాపు సా.శ. 930లో సరిదిద్దబడి, సరైన విరామ చిహ్నాలు నిర్ణయించబడ్డాయి. అందుచేత ఆ కోడెక్స్ తదుపరి తక్కువ నైపుణ్యముగల శాస్త్రులు భవిష్యత్తులో చేసే నకలు ప్రతులకు ప్రామాణికముగా ఉంటూ, వాటికి ఒక మార్గదర్శకంగా ఉండెను.
తొలుత దానిలో అతి శ్రేష్ఠమైన చర్మపు కాగితములపై మూడు నిలువు విభాగాలుగా వ్రాయబడిన 760 పేజీలు గలవు. కాని ఇప్పుడు ప్రథమ ఐదుగ్రంథములలోని ఎక్కువ భాగంతో సహా, విలాపవాక్యములు, పరమగీతము, దానియేలు, ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా పుస్తకములుగల చివరి భాగమును కోల్పోయి 294 పేజీలను మాత్రమే కలిగివున్నది. ఇది న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చ్‌ర్స్—రెఫరెన్సు బైబిల్ లో “Al” గా గుర్తించబడింది. (యెహోషువ 21:37, ఫుట్‌నోట్) మోజెస్ మెయిమోనైడ్స్ అనే సా.శ. 12 శతాబ్దపునాటి మధ్యయుగపు పేరుగాంచిన యూదా విద్వాంసుడు, అలెప్పో కోడెక్స్ లాంటి శ్రేష్టమైన దానిని తానెన్నడు చూడలేదని ప్రకటించాడు.a
పదమూడు, పదిహేనవ శతాబ్దాల మధ్యలో చేతితో కాపీచేయబడిన హెబ్రీగ్రంథము బెన్ ఆషెర్, బెన్ నెఫ్తాలీల రెండు ముఖ్య మెసోరటిక్ ప్రతుల శాఖలనుండి కాపీచేయబడిన గ్రంథమైయున్నది. పదహారవ శతాబ్దములో జేకబ్ బెన్ హాయీమ్ ఈ ప్రతుల శాఖా కలియిక నుండి హెబ్రీ బైబిలు ముద్రణకొరకు ఒక గ్రంథాన్ని తయారుచేశాడు. ఆ తదుపరి 400 సంవత్సరాలవరకు ముద్రించబడిన దాదాపు హెబ్రీ బైబిళ్లన్నింటికి ఈ గ్రంథమే ఆధారమైనది.
బిబ్లియ హెబ్రైకా (ముద్రించబడిన హెబ్రీ గ్రంథము) మూడవ ప్రచురణ 1937లో ముద్రించబడినప్పుడు, రష్యాలో లెనిన్‌గ్రాడ్ బి 19ఎ అనే పేరుతో ఉన్న వ్రాతప్రతియందు భద్రపరచబడియున్న బెన్ ఆషెర్ వ్రాతా విధానమును సంప్రదించే అది ముద్రించబడటం జరిగింది. ది లెనిన్‌గ్రాడ్ B 19A సా.శ. 1008 నాటిది. యెరూషలేములోని హెబ్రీ యూనివర్శిటి యీ ప్రతులు, ఇతర ప్రాముఖ్య ప్రతులలోని భాగాలు మరియు మృత సముద్రపు చుట్టలతో పాటు, కొంతకాలానికి అలెప్పో గ్రంథాన్ని పూర్తిగా ప్రచురించుటకు పథకము వేయుచున్నది.
ఈనాడు మనము ఉపయోగించు బైబిలు నమ్మదగినది. అది దైవికముగా ప్రేరేపించబడి బహు ఉన్నత నైపుణ్యముతో అక్షరాల విషయంలో ఎంతో జాగ్రత్తవహించి నకలు వ్రాసే శాస్త్రులచేత వ్రాయబడినది. వీరు తీసుకొన్న అత్యంత శ్రద్ధ మృత సముద్రము ప్రక్కన 1947లో దొరికిన యెషయా గ్రంథపు చుట్టను మెసోరటిక్ గ్రంధముతో పోల్చినప్పుడు బహు స్వల్పమైన బేధములు మాత్రమే కనబడుటలో అర్థమవుతుంది. అందులోను ఈ మృత సముద్రపు గ్రంథపు చుట్ట, అతిపురాతన మెసోరటిక్ బైబిలు కంటె వెయ్యి సంవత్సరముల పూర్వము నాటిది. అంతేగాక, ప్రస్తుతము అలెప్పో కోడెక్స్ విద్వాంసులకు లభ్యమవుతున్నందున హెబ్రీలేఖన గ్రంథపు వాస్తవికతపై ఎక్కువ నమ్మకముంచుటకు ఎన్నో ఆధారముల నందిస్తుంది. నిశ్చయంగా, “మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.”—యెషయా 40:8.
[అధస్సూచీలు]
a కొన్ని సంవత్సరములు అలెపో కోడెక్స్ వ్రాతప్రతికి విరామ చిహ్నాలు బెన్ ఆషెర్ వలననే నిర్ణయించబడ్డాయా అనే సందేహాన్ని విద్వాంసులు వ్యక్తం చేశారు. కాని కోడెక్స్ పఠనానికి లభ్యమైనప్పటినుండి, మైమోనైడ్స్‌చే ప్రస్తావించబడినది. నిజంగా బెన్ ఆషెర్ వ్రాతప్రతేనని నిదర్శనము స్పష్టము చేసింది.
[28వ పేజీలోని చిత్రసౌజన్యం]
Bibelmuseum, Münster
[29వ పేజీలోని చిత్రసౌజన్యం]
Jewish Division / The New York Public Library / Astor, Lenox, and Tilden Foundations