కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 1/15 పేజీలు 30-31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవముగల దేవునిచేత నడిపించబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • రక్తము—జీవాధారము
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
  • రక్తముతో జీవమును రక్షించుకొనుట—ఎట్లు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మీ జీవవరాన్ని అత్యంత విలువైనదిగా పరిగణించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 1/15 పేజీలు 30-31

పాఠకుల ప్రశ్నలు

ఎండబెట్టిన ప్లాస్మా మొదలగు రక్తసమ్మిళితాలు ఆహార ఉత్పత్తులలో చేరియున్నాయా అనే విషయంలో క్రైస్తవులు ఎటువంటి జాగ్రత్త తీసుకొనవలెను?

జంతురక్తమేగాని లేక దానిలోని సమ్మిళిత పదార్థమేగాని స్థానికంగా ఆహారోత్పత్తులలో ఉపయోగించబడుతుందనే కచ్చితమైన ఆధారముంటే, క్రైస్తవులు తగిన జాగ్రత్త వహించవలసిన అవసరముంది. అయినను, కేవలం అనుమానంతో లేక ఆధారంలేని బెంగతో కలతచెందడం అవివేకమవుతుంది.

మానవ చరిత్రారంభములో మన సృష్టికర్త, మానవులు రక్తమును తినకూడదని ఆజ్ఞాపించాడు. (ఆదికాండము 9:3, 4) రక్తమనేది దేవుడిచ్చిన వరమైన ప్రాణానికి సూచనగా ఉందని తెలియజేశాడు. ఒక ప్రాణినుండి తీసిన రక్తమును బలిపీఠముపై పోయుటకు లేక బలి అర్పణకు మాత్రమే ఉపయోగించవచ్చును. అలా చేయని పక్షములో తిరిగి దానిని దేవునికే ఇస్తున్నామను భావములో నేలమీద ఒలకబోయవలెను. ఆయన ప్రజలు రక్తముద్వారా ప్రాణాన్ని పోషించుకోవడానికి వీలులేదు. ఆయన ఇలా ఆజ్ఞాపించాడు: “రక్తము దేహమునకు ప్రాణము. . . . దానిని తిను ప్రతివాడు మరణ శిక్షనొందును.” (లేవీయకాండము 17:11-14) రక్తము తినుటపైగల ఈ దేవుని నిషేధము క్రైస్తవులకును తిరిగి చెప్పబడింది. (అపొ. కార్యములు 15:28, 29) కాబట్టి తొలిక్రైస్తవులు రక్తముచే మిళితమైయున్న ఆహారమును అనగా, గొంతుపిసికి చంపిన జంతు మాంసమునేగాని, రక్తముతో చేసిన వంటనేగాని విసర్జించవలసియుండిరి.

అయితే ఆచరణాత్మకంగా ‘రక్తమును విసర్జించవలెనను’ వారి నిర్ణయం ప్రకారం ఆ క్రైస్తవులెట్లు ప్రవర్తించవలసియుండిరి? (అపొ. కార్యములు 21:25) అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు కేవలం, “మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చున,”నే మాటలను అన్వయించుకుంటే సరిపోతుందా?

లేదు. మొదటి కొరింథీయులు 10:25లోని ఆ మాటలు బహుశా విగ్రహాలయంలో అర్పించబడిన జంతుమాంసమును సూచించేవైయున్నవి. ఆ కాలంలో ఆలయాలలో అధికంగా మిగిలిపోయిన మాంసమును మామూలుగా అమ్మే మాంసముతోపాటు కలిపి వారి దుకాణమునుండి అమ్మటానికై వ్యాపారస్తులకు అమ్మబడేది. ఇక్కడ పౌలు అభిప్రాయము ఆలయమునుండి బయటకువచ్చే మాంసం లోపల చెడిపోయినది లేక మలినమైనది కాదనునదియే. చాలావరకు అక్కడ బలి అర్పించబడిన జంతువుల రక్తమును బాగా ఒలికించి అన్య బలిపీఠములపై దానిని ఉపయోగిస్తారని కనబడుతుంది. అధికంగా మిగిలిన మాంసమును సంతలో అమ్ముతుంటే, అనగా దేవాలయానికిగాని లేక అన్య భావాలకుగాని ప్రత్యక్ష సంబంధం లేకుండా అమ్ముతుంటే దానిని క్రైస్తవులు కేవలం రక్తం బాగా ఒలికించబడిన పరిశుభ్రమైన సంతలో అమ్మబడే మాంసంగానే పరిగణించి దానిని కొనవచ్చును.

అయితే, ఒక స్థానిక దుకాణంలో గొంతుపిసికి చంపిన జంతు మాంసమును (లేక రక్తముతో చేయబడిన ఇతర పదార్థము) అమ్ముతున్నారని ఆ క్రైస్తవులకు తెలిసియుంటే పరిస్థితి వేరుగా ఉండేది. అప్పుడు ఏ మాంసమును కొనవలెనో వారు ఎంపిక చేసుకోవలసి ఉండేది. (నేడు అనేక దేశాలలో రక్తముతో చేయబడిన వంటలను ఎలా సులభంగా గుర్తిస్తున్నారో,) అలాగే దానియొక్క ప్రత్యేకమైన రంగునుబట్టి రక్తముకలిసిన ఆహారోత్పత్తులను వారు గుర్తించగలిగియుండిరి లేక మంచి పేరుగల నిక్కచ్చిగా అమ్మే కటికవాడు లేక మాంస వ్యాపారి ఎవరో క్రైస్తవులు విచారణచేసుకోవచ్చును. ఫలానా మాంసంలో రక్తము ఇమిడి ఉందని అనడానికి ఆధారమేమీ లేనప్పుడు ఏ సందేహము లేకుండా కొని, తినవచ్చును.

పౌలు “మీ సహేతుకతను అందరికి తెలియబడనియ్యుడి” అని వ్రాశాడు. (ఫిలిప్పీయుల 4:5, NW) ఇది మాంసం కొనే విషయానికి కూడ వర్తిస్తుంది. ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రమేగాని, మొదటిశతాబ్దపు క్రైస్తవ పరిపాలక సభయేగాని దేవుని ప్రజలు మాంసం విషయంలో విచారణచేయుటకు అమితంగా సమయం తీసుకొని, ప్రయాసపడమని సూచించలేదు. లేక మాంసంలో ఎక్కడో కొంత రక్తమున్నట్లు అతి స్వల్పమైన అనుమానమొస్తే, శాఖాహారులుగా మారాలని సూచించలేదు.

ఇశ్రాయేలీయుడైన వేటగాడు ఒక జంతువును చంపితే అతడు దానిరక్తమును ఒలికించవలెను. (ద్వితీయోపదేశకాండము 12:15, 16 పోల్చుము.) అతని కుటుంబము మాంసమంతటిని తినలేకపోతే, దానిలో కొంత అమ్మవచ్చును. రక్తమును బాగా ఒలికించిన జంతువులోకూడా దాని మాంసమందు కొంత రక్తము మిగిలియుండ వచ్చును, అయితే దాన్ని కొనే యూదుడు చంపిన తర్వాత దాని రక్తమును ఎన్ని నిమిషాలు ఒలికించాడో, రక్తము బాగా కారిపోవుటకు ఏ నాళాన్ని కోశాడో, జంతువు ఏ ఆకారంలో, ఎంతసేపు వ్రేలాడదీయబడిందో అని విపరీతమైన ధోరణితో విచారణచేయాలని బైబిలు సూచించుటలేదు. అలాగే, పరిపాలక సభకూడా క్రైస్తవులు ఇలాంటి అసాధారణమైన జాగ్రత్తలు తీసుకొని, ప్రతి వివరానికి సమాధానం వచ్చేంతవరకు ఏ మాంసాన్ని తినకూడదని చెప్పలేదు.

ఈనాడు అనేక దేశాలలో చట్టమేగాని, ఆచారమేగాని, మత సంప్రదాయమేగాని రక్తం బాగా ఒలికించిన జంతు మాంసంద్వారా చేయబడిన మాంసపు ఉత్పత్తులను (ప్రత్యేకంగా రక్తముతోచేయబడిన వంటల విషయంలో తప్ప) అంగీకరిస్తున్నవి. అందుచేత అలాంటి ప్రాంతాలలో ఉండే క్రైస్తవులు వాటిని వధించే తీరు, సిద్ధంచేసే పద్ధతులనుగూర్చి నిశితంగా పరిశీలించేవారు కానవసరంలేదు. విశాల భావంలో వారు ‘సంతలో అమ్మబడే మాంసమును, ఏ విచారణచేయకుండా తినవచ్చును.’ అదే సమయంలో రక్తమును విసర్జిస్తున్నామనే స్వచ్ఛమైన మనస్సాక్షిని కలిగియుండవచ్చును.

అయితే, అప్పుడప్పుడు వ్యాపారరీత్యా రక్తము నుపయోగించే పద్ధతి కొంతమంది క్రైస్తవులను కలత పరచినట్లు సాంకేతిక రిపోర్టులున్నవి. మాంసమును సిద్ధంచేసే పరిశ్రమలలోని కొంతమంది వ్యాపారస్తులు పెద్దమొత్తములో రక్తమును సేకరించి దానిని ఎరువుల కొరకు, పశు దాణా కొరకు ఉపయోగించవచ్చని అంటారు. పరిశోధకులు అటువంటి రక్తమును (రక్తములోని సమ్మిళిత పదార్థాలను) వండిసిద్ధం చేసే మాంసంలో కలిపివాడే విధానాన్ని గూర్చి అధ్యయనం చేశారు. కొన్ని పరిశ్రమలు ద్రవరూపమైన గడ్డకట్టిన లేక పొడిచేసిన ప్లాస్మాను రక్తపు వంటకాలలో కలిపే కొద్దిశాతము మాంసానికి బదులుగా ఉపయోగించడానికి ఉత్పత్తిచేశారు. ఇతర అధ్యయనాలు రక్తములోని ఇతర భాగాలను పొడిచేసి లోటును భర్తీచేసేదానిగా, నీటిని భద్రపరచేదానిగా, పొడిచేసిన మాంసమును రుచింపజేసేందుకు, రొట్టెలు తయారుచేయడంలోను, ఇతరపానీయాలలో ప్రొటీన్లను, ఐరన్‌ను చేర్చేందుకు ఉద్దేశిస్తున్నారు.

ఏమైనను, ఇట్టి అధ్యయనము దశాబ్దాలుగా కొనసాగుతుందని గుర్తించుట గమనార్హము. అయినా అనేక దేశాలలో అలాంటివాటిని ఉపయోగించడం చాలా తక్కువగా జరుగుతుంది లేక అసలు లేనే లేదు. అలా ఎందుకు జరుగుతున్నదో అర్థం చేసికొనడానికి కొన్ని సారూప్య నివేదికలు సహాయపడతాయి:

“రక్తము పోషకవిలువకు, ప్రోటీన్ల నిర్వహణకు మూలము. అయిననూ, పశు రక్తము దాని తీవ్రమైన రంగు, ప్రత్యేకమైన రుచినిబట్టి కొంత పరిమాణములోనే మానవుల కొరకు ఉపయోగించబడుతుంది.”—జర్నల్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్‌, వాల్యూమ్‌ 55, నంబర్‌ 2, 1990.

“రక్త ప్లాస్మాలోని ప్రోటీనులు లవణములను ద్రవీభవింపజేయుటలో, శరీరమును మృదువుగా చేయడంలో, నీటిని నిరోధించడంలో ఉపయుక్తమైన భాగాలను కలిగియున్నవి. ఆహారమును పరిశుభ్రపరచడంలోను దాని ప్రయోజనాలు విస్తృతంగా ఉన్నవి. అయితే దీనిని ఎండబెట్టిన తర్వాత, సమర్ధవంతంగా పరిశుభ్రపరచే విధానం జపానులో నెలకొల్పబడలేదు.”—జర్నల్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్‌, వాల్యూమ్‌ 56, నంబర్‌ 1, 1991.

కొందరు క్రైస్తవులు అప్పుడప్పుడు ఆహారపు ప్యాకేజిలపై ఉన్న లేబుల్స్‌ను పరిశీలిస్తుంటారు. ఎందుకంటే అనేక ప్రభుత్వాలు దానిలో కలిపిన మిశ్రమ పట్టికను చూపించాలని కోరుతున్నవి. రక్తము చేర్చబడివుంటుందని నమ్ముటకు ఆధారం దొరకిన సందర్భాలన్నిటిలో వారు ఆలాగున క్రమంగా పరిశీలించుటకు యిష్టపడవచ్చును. రక్తము, రక్త ప్లాస్మా, ప్లాస్మా, గ్లోబిన్‌ ప్రొటీను, లేక హెమోగ్లోబిన్‌ ఐరన్‌ మిళితమైయున్నవని సూచించబడిన ఉత్పత్తులను విసర్జించడం సరియైయుంటుంది. ఈ విషయంలో ఒక ఐరోపా కంపెనీ మార్కెటింగ్‌ సమాచారము: “ఆహారపు ప్యాకేజిలలో గ్లోబిన్‌ మిళితమైయుందా లేదా అనే సమాచారాన్ని తెలిపేటప్పుడు, కొనుగోలుదారుడు నిజంగా అదే పదార్థము కలిసిందా లేక ఆ పదార్థపు విలువనిచ్చే వేరే పదార్థము కలుపబడిందా అనే విషయంలో మోసపోకుండునట్లు సమాచారం స్పష్టంగా ఉండాలని తెలియజేసింది.”

ఎలాగైనా, లేబుల్స్‌ను పరిశీలించడంలోగాని లేక కటికవానిని విచారించడంలోనే గాని సహేతుకత అవసరము. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడు ప్యాకేజితోవున్న ఆహారముపై గల లేబుల్స్‌ను, దానిలోని మిశ్రమాలను చదవాలని, రెస్టారెంట్లలో లేక ఆహారపు దుకాణాలలో ఉద్యోగస్తులను నిలదీసి విచారించి తెలుసుకోవాలని కాదు. క్రైస్తవుడు మొదట తనను తాను ఇలా అడుగుకొనవచ్చును, ‘రక్తమునేగాని, లేక దానిలోని భాగాలనేగాని ఈ ప్రాంతములో లేక ఈ దేశములో సాధారణంగా ఉపయోగిస్తుంటారనే ఆధారమేమైనా ఉందా’? ఎక్కువ సందర్భాలలో దానికి లేదు అనే సమాధానమే వస్తుంది. అందుచేత అనేకమంది క్రైస్తవులు ఏమైనా కలిసిందేమో ననే అతి అరుదైన సంభవాన్నిగూర్చి ఎక్కువ సమయాన్ని, అవధానాన్ని వెచ్చించడం ఎందుకులే అనే ముగింపు కొచ్చారు. ఇలా భావించని వ్యక్తి, దేవుని యెదుట మంచి మనస్సాక్షితో మరోరీతిగా ప్రవర్తించే ఇతరులకు తీర్పుతీర్చకుండా, తన మనస్సాక్షి ప్రకారం ప్రవర్తించవలెను.—రోమీయులు 14:2-4, 12.

రక్తముచేర్చబడిన ఆహారోత్పత్తులను తయారుచేయగలిగినను ఇది బహుశా ఖర్చునుబట్టియో, చట్టమనుమతించక పోవుటనుబట్టియో, లేక ఇతర కారణాలను బట్టియో వాటిని ఎక్కువగా తయారుచేయడం లేదు. ఉదాహరణకు ఫుడ్‌ ప్రోసెసింగ్‌ (సెప్టెంబరు 1991) ఇలా గుర్తించింది: “సిద్ధం చేసే ఆహారంలో (వండిన మాంసపు ముక్క) 1 శాతము ద్రవరూప బీఫ్‌ ప్లాస్మాను కలపటం సమస్యగా ఎంచబడినప్పుడు, దానికి ప్రత్యామ్నాయంగా వారు ద్రవీకృత ప్రోటీన్‌ సాంద్రతను చేర్చి యూదా మత ధర్మానికి అనగా కోషేరుకు ఆమోదయోగ్యమైన, నిరభ్యంతరకరమైన ఆహారంగా దానిని సిఫారసుచేయవచ్చును.”

అనేక దేశాలలో చట్టము, సంప్రదాయము, రుచి వగైరాలు వధించబడిన జంతువునుండి రక్తాన్ని పూర్తిగా ఒలికించేందుకు ప్రాధాన్యతనిస్తున్నవి. ఆ రక్తము ఇతర ఆహారోత్పత్తులలో కూడ ఉపయోగించబడటం లేదు. స్థానికంగా పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని లేక ఇటీవల పరిస్థితి గొప్పగా మారిందని తలంచుటకు ఆధారమేమి లేనప్పుడు క్రైస్తవులు ఏదో ఉండొచ్చు అనేదాన్నిబట్టి లేక పుకార్లనుబట్టి కలతచెందకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ ఆహారంలోగాని లేక వైద్య చికిత్సలోగాని కచ్చితంగా, విస్తృత ఆధారంతో రక్తము పరిపాటిగా ఉపయోగించబడుతుందని స్పష్టమయితే, రక్తమును విసర్జించుడి అను దేవుని ఆజ్ఞకు లోబడుటకు మనము తీర్మానించుకొనినవారమై యుండాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి