సత్యం విస్తార జలములుగల గ్రామాన్ని ముంచెత్తుతుంది
ఎంత వింత! విస్తారమైన జలములకు పేరుగాంచిన నేల దప్పిగొంటుంది! సమృద్ధిగా నీళ్లున్న ప్రాంతము ఇంకిపోతూ, ఆరిపోతుంది! దాని దాహమును దేవుని వాక్యమైన బైబిలులోని సత్యజలములు మాత్రమే తీర్చగలవు. బీరుట్కు 130 కిలోమీటర్ల దూరంలో 2,200 మంది నివాసులతో ఉత్తర లెబానోను కొండలలో ఒదిగివున్న ఓ చిన్న గ్రామం కథే ఇది. ఆ గ్రామము పేరు రాబె.
రాబె అను పేరుకు అరబ్బీలో “విశాలమైన స్థలమని” అర్థము. ఆ పేరు “విస్తారమైన, వ్యాపించివున్న” అనే సెమిటిక్ మూలము నుండి వచ్చింది. అందుకు తగినట్లే ఈ గ్రామం సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులోవున్న రెండు పెద్ద కొండలపై పరచుకొనివుంది. చలికాలంలో, వసంతకాలంలో తూర్పున దానికొండలు మంచుతో కప్పబడి ఆ గ్రామ వైభవాన్ని మరింత అధికం చేస్తాయి. కాని వీటన్నిటికంటె మిన్నగా రాబె విస్తార జలములు గల గ్రామము. చిన్నవి, పెద్దవి కలుపుకొని అక్కడ 360 నీటి ఊటలు గలవు. అవి ఆ ప్రాంతంలోని సారవంతమైన గోధుమ, జల్దరు పండ్లు, దొండ పండ్లు, బేరి పండ్లు మరియు చుట్టుప్రక్కల లోయలలోనున్న ద్రాక్షా తోటలకు శ్రేష్ఠమైన నీటిని అందిస్తుంటాయి.
రాబెలోని నాటి, నేటి పరిస్థితులు
బైబిలు కాలములనాటి నుండి కూడ రాబెలో అనేకపరిస్థితులు ఏ మార్పులేక అలాగే ఉన్నవి. గ్రామములోని ఇండ్లు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. వీధులు ఇరుకుగా మెలికలు తిరిగి, గాడిదలు, ఆవులు మొదలగువాటితో క్రిక్కిరిసి ఉంటాయి. కొన్ని మోటారు వాహనాలున్నప్పటికిని జంతువులే ఇక్కడ వాహనాలుగా పనిచేస్తుంటాయి. బహుతరచుగా వాటి యజమానులు వాటిపైన బరువులు పెట్టి వాటిని ఒంటరిగా పొలాలనుండి ఇంటికి పంపుతారు. అవి ఇరుకు వీధుల్లోపడి దారిని కనుగొంటూ ఎంతరద్దీగా ఉన్నను చక్కగా ఇంటికి చేరతాయి. “ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంతవాని దొడ్డి తెలిసికొనును” అని యెషయా అన్నప్పుడు బహుశా ఇదే ఆయన మనస్సులో ఉండివుంటుంది.—యెషయా 1:3.
రాబె భిన్నత్వాలకు నిలయము. ఇక్కడ విశ్వవిద్యాలయ పట్టభద్రులతోపాటు ఎన్నడూ నగరాన్ని చూడని సామాన్య రైతులూ కనిపిస్తారు. మంచి తోటలతో అలరించుకొన్న ధనికుల భవంతులతో పాటు ఇంటిచుట్టూ పెంపుడు జీవులు తిరిగే చిన్న గుడిసెలూ ఉన్నాయి. విద్యుత్ ఉపకరణాలు దాదాపు ఇండ్లన్నిటికి ఉన్నా, విద్యుత్ మాత్రం అన్నివేళల ఉండదు. అందువలన చాలా ఇండ్లకు జెనరేటర్లు ఉన్నాయి. గ్రామములోని ప్రధాన వీధులు నున్నటి రహదార్లతో ఉన్నవిగాని, పొలాలకెళ్లే దారులు మాత్రం గరుకుగా గుంటమెట్టలతో ఉన్నాయి. అందుచేత పొలాలలో పండే ఉత్పత్తులను పెంపుడు జంతువులద్వారానే తప్ప మరొకరీతిలో ఇండ్లకు చేర్చడం కుదరదు. పొలాలలో పనిచేసే వ్యవసాయ పశువులతో పాటు ఉపయోగించే వ్యవసాయ మిషన్లకు విద్యుత్‌ను అందించే జనరేటర్లను పొలానికి గాడిద మోసుకెళ్లడం మీకు కన్పిస్తుంది.
అలాగే గ్రామములోని జీవితం ఏమంత పెద్దగా మారలేదు. ఒక రాత్రిగాని మీరు ఊరిలో నిద్రిస్తే, తెల్లవారుజామున రెండు లేక మూడింటికి కోడికూసి మిమ్ములను నిద్రమేల్కొల్పడం జరుగుతుంది. మసకమసక చీకటిలోనే జనం మేల్కొని ఒకరితోఒకరు మాట్లాడుకొంటూ, పశువులను సిద్ధం చేసుకుంటుండే జనాల అరుపులకు మీరు ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే అంత పెందలకడనే వారి అనుదినచర్య ప్రారంభమౌతుంది. ప్రొద్దుపొడిచే సరికి అనేక మంది గ్రామస్థులు వారి పశువులకు బరువులు కట్టుకొని పొలాల కెళ్లడం లేదా వారి సరుకులను మార్కెట్టులో అమ్మడానికి బయల్దేరటం మీరు చూడొచ్చు.
పొద్దెక్కే కొలది చిన్న బాలబాలికలు వీధుల్లో, బయటి ఆవరణలలో ఆటలాడటానికి బయటకు వస్తుంటారు. వాతావరణమంతా వారి నవ్వులతో, కేరింతలతో నిండిపోతుంది. అది ప్రాచీన యెరూషలేమును జెకర్యా వర్ణించినట్లుంటుంది: “ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోను ఆడ పిల్లలతోను నిండియుండును.” (జెకర్యా 8:5) అంతేగాక ఆ గ్రామస్థులు ఎంతో స్నేహపూర్వకమైన వారిగా, ఒకరి బాగోగులు మరొకరు అడిగి తెలిసికొనేవారిగా ఉన్నట్లు మీరు చూస్తారు. కలిసే ప్రతివ్యక్తిని మీరు పలకరించాలని వారు కోరుకుంటారు. ఎందుకంటే నీవెవరవో, ఎక్కడనుండి వచ్చావో, ఎందుకొచ్చావో, ఎక్కడికెళుతున్నావో తెలుసుకోవాలని వారు యిష్టపడతారు. వారు ఒకరినిగూర్చి ఒకరు బాగా తెలిసికొనివుంటారు.
సత్య జలములు రాబెకు చేరుట
అంత సన్నిహితంగా ఉన్న సమాజంలో, ఒక వార్త వెంటనే అంతటా ప్రాకిపోతుంది. ఆసాద్ యూనిస్ అనే వ్యక్తి 1923లో అమెరికా నుండి రాబెకు తిరిగివచ్చినప్పుడు ఇదే జరిగింది. ఆసాద్ బహుశ బాగా ధనికుడుగా తిరిగివచ్చాడేమో చూద్దామని ఆయన స్నేహితుడు అబ్దాలా బ్లాల్ ఆయనదగ్గరకు వెళ్లాడు. సరే, ఆసాద్ అతనితో డబ్బునుగూర్చి మాట్లాడేబదులు ది హార్ప్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని అతనికిచ్చి “ఇదే అసలైన ధనము” అని చెప్పాడు. మొదట ప్రొటెస్టెంటయిన అబ్దాలా బైబిలు ఆధారితమైన ఈ పుస్తకాన్ని చదివి ఎంతో ముగ్ధుడయ్యాడు. ఈ విషయంలో ఆసాద్ అంత పెద్దగా పనిచెయ్యక పోయినప్పటికిని అబ్దాలా మాత్రము ఎంతో ఉల్లసించి, నిజముగా నేను సత్యాన్ని కనుగొన్నానని బహిరంగంగా వ్యక్తంచేశాడు.
కొంతకాలం తరువాత, ఉత్తర లెబానోనులోని ట్రిపొలి పట్టణానికి అబ్దాలా తరలి వెళ్లాడు. అక్కడ ఆ కాలంలో బైబిలు స్టూడెంట్స్ అని పిలువబడే యెహోవాసాక్షులను అనేకమందిని కలుసుకొని, తన బైబిలు పఠనాలలో అభివృద్ధిచెందాడు. ఆ తరువాత ఆయన తాను నేర్చుకున్న సువార్తను వ్యాప్తిచేయుటకు రాబెకు తిరిగివచ్చాడు. త్రిత్వము, మనుష్యునికి అమర్త్యమైన ఆత్మ ఉందా, నరకాగ్ని, యాజకత్వము, మాస్, విగ్రహములను ఉపయోగించుట మొదలగువాటిపై బైబిలు నిజంగా ఏమి చెబుతుందో వారికి బోధించాడు.
ఊరిలో కొంతమంది ఆసక్తి చూపించారు. ముగ్గురు లేక నలుగురు అబ్దాలాతోపాటు సువార్త ప్రకటన పనిలో పాల్గొనటం ప్రారంభించారు. ఆదివారం కూటములను జరుపుకోవడం మొదలుపెట్టారు. వీటిలో ఫోనోగ్రాప్లో రికార్డుచేసిన ప్రసంగాన్ని వినడం లేదా బైబిలు చదవడం, ఆతర్వాత వారు అప్పుడే విన్నదాన్ని చర్చించుకోవడం జరిగేది. తర్వాత బైబిలు పఠన ఉపకరణాలగు ది హార్ప్ ఆఫ్ గాడ్, రిచ్చెస్, “లెట్ గాడ్ బి ట్రు” మొదలగు పుస్తకాలను ఉపయోగించడం జరిగింది. హాజరు పదిమంది కంటే మించి ఉండేది కాదు. కాని వారిలో ఎక్కువమంది ఆసక్తిచూపడమే కాకుండా ఎంతో ఆతురత చూపేవారు. కొంతమంది ప్రతి కూటము తర్వాత వడ్డించే భోజనం కొరకు వచ్చేవారిగా కన్పించారు.
అబ్దాలాకు 1940లో రాబెలో ఏర్పడిన గుంపును నడిపించే బాధ్యత అప్పగించబడింది. ఆయన ఇతరులకు మంచి మాదిరి చూపిస్తూ, యెహోవాకు నమ్మకపాత్రుడైన, ఆసక్తిగల సేవకునిగా రుజువు పరచుకున్నాడు. ఆ గుంపులోని సహోదరుడు మాటార్, ప్రకటన పనికి వారు ఎలా వెళ్లేవారో ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “ఆ రోజుల్లో కార్లుండేవి కాదు గనుక దగ్గరి దగ్గరి గ్రామాలకు నేను, సహోదరుడు బ్లాల్ సాక్ష్యమివ్వటానికి నడిచే వెళ్లేవారము. సహోదరుడు బ్లాల్ మాట్లాడటంలో నాయకత్వం తీసుకునేవాడు. నేనేమో పొనోగ్రాప్ మోసుకెళ్లేవాన్ని. సాధారణంగా మేము ఒకసారి యింటినుండి బయల్దేరామంటే రెండు మూడు రోజుల తర్వాతనే తిరిగి వచ్చేవారము.” సహోదరుడు బ్లాల్ 1979లో తన 98వ యేట మరణించేంతవరకు యెహోవాను నమ్మకముగా సేవించాడు.
అభివృద్ధి వ్యతిరేకతను తెచ్చుట
పని అభివృద్ధయ్యేకొలది సహోదరులు వ్యతిరేకత నెదుర్కోవడం మొదలయ్యింది. ఆ గ్రామ మతాధిపతి ప్రేరణ మూలంగా 1950లో రాబెలోని సహోదరులను హింసించే కార్యక్రమం మొదలయ్యింది. చర్చిని, పవిత్ర సేవోపకరణమును దూషిస్తున్నారనే ఆరోపణను ఆ మతాధిపతి సహోదరులపై వేశాడు. కొంతమంది గ్రామస్థులు ఎంతగానో మండిపడి సహోదరులపై రాళ్లు రువ్వారు. కొంతమంది సహోదరులు నిర్భంధించబడి, జైళ్లో వేయబడ్డారు. దాని విషయంలో ఆరా తీస్తే, అట్టి ఆరోపణ అబద్ధమని రుజువయ్యింది. అయినా సహోదరులు చాలా రోజులు జైళ్లోనే ఉంచబడ్డారు.
మరో వ్యతిరేకి గ్రామస్థులను, బహుశా వారిలో కొంతమంది చదువురాని వారిని కూడగట్టుకొని సహోదరులు ఊరక ఇంటికి వస్తూ, విసికిస్తూ ప్రజలకు ఇబ్బంది కల్గిస్తున్నారనే ఆరోపణ పత్రంపై సంతకాలు పెట్టించడానికి ప్రయత్నించాడు. చాలా మందితో సంతకాలు పెట్టించేందుకై అతనింకా వారితో, ఒక ఉద్యోగిని మన ఊరికి తిరిగి బదిలీ చేయించుకునేందుకే ఈ సంతకాలని చెప్పాడు. అయితే చివరకు ఇది కేవలం సాక్షులపై వ్యతిరేకంగా వ్రాయబడిన ఆరోపణా పత్రమేనని వారు తెలుసుకొన్నప్పుడు, తమ సంతకాలను కొట్టివేశారు. ఇలాంటి సంఘటనలు కొన్ని ఆ ప్రాంతములోని అనేకమంది అధికారులకు మంచి సాక్ష్యమివ్వటానికి సహాయపడ్డాయి.
అలాంటి ప్రత్యక్ష వ్యతిరేకతకు తోడుగా, సహోదరులు మరొక ఆటంకాన్ని ఎదుర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అందరూ తెలిసియున్న చిన్న గ్రామములో సామెతలు 29:25 తెలిపినట్లు, “భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును” అనేది నిజమౌతుంది. వారిని అదేపనిగా విమర్శిస్తూ అపహాస్యంచేసే పొరుగువారికి, స్నేహితులకు, బంధువులకు ప్రకటించాలంటే సహోదరులకు ధైర్యమవసరము. మత్తయి 10:36లోని: “ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు” అను యేసు మాటలు అక్కడ నిజమైనవి. అయినా ఆ సామెత ఇంకా చెబుతున్నట్లు “యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.” సహోదరుల విశ్వాసము మరియు సహనము ఉన్నతమైన ఫలితాలను ఫలించింది.
రాబెలో సత్యము నిండిపోవుట
సంవత్సరాలుగా, యెహోవాసాక్షుల మంచి ప్రవర్తనను, గ్రామస్తులలో అనేకమంది మెచ్చుకొని, సత్యమును అంగీకరించారు. రాబెలో 1969 సంవత్సరంలో రెండవ సంఘము ఏర్పాటుచేయబడినప్పుడు సహోదరులు అధికంగా సంతోషించారు. వారు కష్టపడి పనిచేయడం మానుకొనలేదు. అనేకమంది పూర్తికాల పరిచర్యనుచేపట్టి కొందరు బీరుట్ పట్టణంతో సహా ఇతర ప్రాంతాలలో సేవచేయుటకును తరలి వెళ్లారు. వారు శ్రమించి చేసిన పనిని యెహోవా ఆశీర్వదించుట మూలంగా 1983 సంవత్సరాన రాబెలో మూడవ సంఘం స్థాపించబడింది. ఈలోగా ఇంకా అనేకమంది సహోదరులు పట్టణాలలో జీవించడానికి వలస వెళ్లారు. అయినా పెరుగుదల ఆగిపోలేదు. రాబెలో 1989 నందు నాల్గవ సంఘం, తదుపరి 1990లో అయిదవ సంఘం ఏర్పాటుచేయబడింది.
ఇప్పటికల్లా ఆ గ్రామములోని ప్రతికుటుంబానికి వారి బంధువో లేక స్నేహితుడో సాక్షియైయున్నాడు. ఒకనాడున్న ద్వేషము సమసిపోయింది. ప్రజలకు యెహోవాసాక్షులతో బాగా పరిచయమేర్పడింది. నిజానికి “పెద్ద,” “పయినీరు,” “ప్రాంతీయ కాపరి,” “సమావేశం,” “ఆర్మగెద్దోను” అనేమాటలు ఆ గ్రామస్తుల అనుదిన పదజాలములో భాగమైపోయాయి. ప్రాంతీయ కాపరి సందర్శనము, జ్ఞాపకార్థ దిన ఆచరణ మొదలగు ప్రత్యేక సందర్భాలలో వీధులన్ని బోసిపోయి, రాజ్యమందిరాలు క్రిక్కిరిసి పోతుంటాయి. కొన్ని సంఘాలైతే, వారి పొరుగువారి సౌకర్యార్థము బాల్కనిపైన లౌడ్ స్పీకర్లను కూడా పెడుతున్నాయి.
ప్రస్తుతం రాబెలో 250 మంది రాజ్య ప్రచారకులున్నారు. అంటే ఆ ఊరిలోని ప్రతి 8 వ్యక్తులకు 1 సాక్షియన్న మాట. ఏబైఒక్క మంది ప్రచారకులు గల ఒక సంఘపు సేవా ప్రాంత పరిధిలో 76 యిండ్లున్నాయి. వాటిని వారు ప్రతివారం దర్శిస్తుంటారు. గత సంవత్సరం మార్చి, ఏప్రిల్ మాసాలలో రాబెలోని 250 ప్రచారకులలో 13 మంది క్రమపయినీర్లతోపాటు, 98 మంది సహాయపయినీరు సేవను చేపడితే ఏమి జరిగివుంటుందో ఊహించండి. వారంలో అనేక పర్యాయములు వారు ప్రాంతాన్ని చుట్టివస్తుంటారు. ఒకేరోజు, లేక ఒకేసారి ఒక్కయింటిని రెండు లేక మూడు జట్లు దర్శిస్తాయనేది అసాధారణమేమి కాదు. గ్రామస్థులలో అనేకమందికి ఈ దర్శనాలు అలవాటైపోయాయి. ఒక వ్యక్తి ఒక ప్రచారకునికి దీనిని ఫిర్యాదుచేసినప్పుడు: “బైబిలు పఠనాన్ని తీసుకోమనే మా ఆహ్వానాన్ని మీరు అంగీకరిస్తే, అప్పుడు కేవలం మిమ్ములను వారానికి ఒక్కసారే దర్శిస్తామని” ప్రచారకుడు సమాధానమిచ్చాడు. అంతేగాక వారు పొలాలలో పనిచేసేవారితోను—అనగా దున్నేవారితోను, విత్తేవారితోను, నీళ్లుకట్టేవారితోను, గాడిదమీద ఎక్కిపోయేవారితోను మాట్లాడుతుంటారు.
నిజానికి, విస్తారజలములుగల రాబెలో బైబిలు సత్యము నిండిపోయినది. అంతే కాదు. రాబె చుట్టుప్రక్కలనున్న గ్రామాలకంతా మంచినీటికి ఎలా మూలమైయున్నదో, ఆలాగే బైబిలు సత్యముయొక్క జీవజలమును కూడా అందించింది. రాబెలోని ప్రచారకులు దగ్గరదగ్గర గ్రామాలను కాలినడకతో దర్శిస్తుంటారు. దూరంగా ఉన్నవాటిని కారులలో గుంపులు గుంపులుగా వెళ్లి దర్శిస్తుంటారు. కొందరు ప్రచారకులు ఇతర నగరాలలో సేవచేయడానికి తరలి వెళ్లారు. యెహోవా ఆశీర్వాదముతో, పరలోకపుతండ్రియైన యెహోవా దేవునికి మరెక్కువ స్తుతితేచ్చే అభివృద్ధి ఇంకా జరుగుతూనేవుంది.
[26వ పేజీలోని చిత్రం]
రాబెలో ఒక వీధి