ప్రకటన—పరిపాలక సభ కమిటీల కొరకు సహాయము
ప్రస్తుతము 12 మందిగల యెహోవాసాక్షులు పరిపాలక సభ సభ్యులు, తమ నియమిత పనులలో నమ్మకముగా సేవచేస్తునేవున్నారు. అంతకంతకు పెరుగుచున్న “గొప్ప సమూహపు” యథార్థమైన సభ్యుల ఆసక్తిదాయక మద్దతు విషయమై వారు అన్ని సమయములలోను కృతజ్ఞులై యున్నారు. (ప్రకటన 7:9, 15) ప్రపంచవ్యాప్తముగా జరుగుచున్న మహత్తరమైన అభివృద్ధి దృష్ట్యా, ఈ సమయములో పరిపాలక సభకు మరింత సహాయము అందించుటకు ఇది తగిన సమయముగా కన్పించుచున్నది. కావున పరిపాలక సభ కమిటీలు, అనగా సిబ్బంది వ్యవహారాల, ప్రచారక, సేవా, బోధనా, మరియు రచనా కమిటీల కూటములలో భాగము వహించుటకు అనేకమంది సహాయకులను, ముఖ్యముగా గొప్ప సమూహములోనుండి ఆహ్వానించుటకు తీర్మానించబడినది. ఆ విధముగా, ఈ కూటములలో ప్రతిదానికి హాజరగు వారి సంఖ్య ఏడు లేక ఎనిమిదికి పెరుగును. పరిపాలక సభ కమిటీ సభ్యుల నడిపింపు క్రింద ఈ సహాయకులు చర్చలలో పాల్గొందురు మరియు కమిటీ వారికి అప్పగించిన వివిధ నియామక పనులను వారు నెరవేర్చుదురు. ఈ క్రొత్త ఏర్పాటు మే 1, 1992 నుండి అమలులోనికి వచ్చును.
ఇప్పటికి అనేక సంవత్సరాలనుండి, ఆశించిన దానికంటే అత్యంత మిన్నగా గొప్ప సమూహపు వారి సంఖ్య పెరుగుచూ ఉండగా, శేషించిన అభిషక్త సాక్షుల సంఖ్య తగ్గుతూవస్తుంది. (యెషయా 60:22) ఈ అద్భుతకరమైన విస్తరణకు మనమెంతగా యెహోవాకు కృతజ్ఞత చెల్లింతుము! 1931లో వారు కృతజ్ఞతాపూర్వకముగా యెహోవాసాక్షులు అను క్రొత్త నామమును అంగీకరించినప్పుడు, రాజ్య ప్రచారకుల అత్యధిక సంఖ్య ఎంతనగా 39,372 మంది. వీరిలో అధికులు క్రీస్తు అభిషక్త సహోదరులని చెప్పుకొనిన వారే. (యెషయా 43:10-12; హెబ్రీయులు 2:11) అరవై సంవత్సరముల తర్వాత, 1991లో ప్రపంచవ్యాప్తముగా ప్రచారకుల అత్యధిక సంఖ్య ఎంత అనగా 42,78,820 మంది, వీరిలో అభిషక్తుల శేషముగా చెప్పబడినవారు కేవలము 8,850 మంది మాత్రమే. లేఖనముల వెలుగులో ఎదురుచూసిన విధముగా, ఇప్పుడు ‘చిన్నమందతో’ ‘గొప్ప సమూహపు’ వారిని పోల్చితే లెక్కకు మిక్కిలిగా, అనగా ఒకరికి 480 మంది చొప్పునవున్నారు. (లూకా 12:32; ప్రకటన 7:4-9) రాజ్యాసక్తుల విస్తరణయెడల శ్రద్ధచూపుటకు, శేషించిన వారికి నిశ్చయముగా గొప్పసమూహపు వారి మద్దతు, సహకారము అవసరము మరియు వారు దానిని గుణగ్రహింతురు.
ఈ కావలికోట సంచికలో వివరింపబడినట్లుగా, యూదుల శేషముతో కలిసి బబులోను చెరనుండి తిరిగివచ్చిన నెతీనీయులను, సొలొమోను సేవకుల కుమారులను పోలి, ఈనాడు ఆత్మీయ ఇశ్రాయేలుతో కలిసి సేవచేయుచున్న గుంపు ఒకటి కలదు. ఆ ఇశ్రాయేలీయులు కానివారు కూడా, తిరిగివచ్చుచుండిన లేవీయులకంటే హెచ్చు సంఖ్యలో ఉండిరి. (ఎజ్రా 2:40-58; 8:15-20) ఈనాడు గొప్ప సమూహములోనుండి “వశము చేయబడినవారు” ఎవరనగా బ్రాంచి కార్యాలయములలో, ప్రయాణపు పనిలో, మరియు భూవ్యాప్తముగా ప్రస్తుతము స్థాపించబడిన 66,000 సంఘములలో పైవిచారణపని ఫలితముగా గణనీయమైన అనుభవము సంపాదించిన పరిపక్వతగల క్రైస్తవ పురుషులై యున్నారు.
ఇటీవలనే, ప్రపంచవ్యాప్తముగా పైవిచారణకర్తలు మరియు వారికి సహాయముచేయు పరిచారకులకు ఉపదేశము కొరకు రాజ్య పరిచర్య పాఠశాలలు నిర్వహించబడినవి. ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రములలోనే 59,420 మంది పైవిచారణకర్తలు హాజరైరి. ఆ విధముగా ఈ “పెద్దలు” మరింత ప్రభావితముగా తమ బాధ్యతలను నెరవేర్చుటకు సంసిద్ధము చేయబడిరి.—1 పేతురు 5:1-3; ఎఫెసీయులు 4:8, 11 పోల్చుము.
యెహోవాసాక్షుల బ్రూక్లిన్ కేంద్ర కార్యాలయములో, “వశము చేయబడినవారు” కొంతమంది అనేక సంవత్సరములు సేవచేశారు. వీరిలో గొప్ప సమూహము నుండి అనుభవము, సామర్థ్య సంపదను సాధించి పరిపక్వతకెదిగిన పైవిచారణకర్తలు చేరియున్నారు. అలా, పరిపాలక సభ కమిటీల కూటములలో సహాయపడుటకు అటువంటి పైవిచారణకర్తలను కొంతమందిని పరిపాలక సభ ఎన్నుకున్నది. వీరు కేవలము దీర్ఘకాల సేవా రికార్డును కలిగియున్న పురుషులై యుండనవసరము లేదు. బదులుగా, వారు ప్రత్యేక రంగములలో సహాయపడుటకు వారిని తగినవారినిచేయు అర్హతగల పరిపక్వత మరియు అనుభవముగల పురుషులై యున్నారు. ఒక కమిటీతో పనిచేయుటకు నియమింపబడుట వారికి ప్రత్యేక హోదానివ్వదు. తన శిష్యులనుగూర్చి యేసు చెప్పినట్లుగా, “మీరందరు సహోదరులు.” (మత్తయి 23:8) ఏమైనను, ఈ మనుష్యులకు ఎక్కువ పని అప్పగింపబడును, తత్ఫలితముగా వారినుండి “ఎక్కువగా అడుగబడును.”—లూకా 12:48.
ఈనాడు యెహోవా సంస్థ ముందుకుసాగుట విషయమై మేమెంతో సంతోషించుచున్నాము. గత పది సంవత్సరాలలో, మహాగొప్ప దావీదు అయిన యేసుక్రీస్తును గూర్చి చెప్పబడిన ప్రవచనమునకు అనుగుణ్యముగా ప్రాంతములో పరిచర్య చేయుచున్న వారి సంఖ్య దాదాపు 100 శాతము పెరిగినది. ఆ ప్రవచనమిట్లు చెప్పుచున్నది: “ఆయన ప్రభుత్వము మరియు శాంతికి కలుగు సమృద్ధికి అంతముండదు.” (యెషయా 9:7, కింగ్ జేమ్సు వర్షన్) యెరూషలేము ప్రాకారములకు మరమ్మత్తు చేయుటలో యాజకులతో నెతీనీయులు కలిసి పనిచేసినట్లే, ఈనాడు యెహోవా సంస్థకు సంబంధించిన ఈ ప్రవచనము నెరవేరవేరుచున్నది: “అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు.” (యెషయా 60:10; నెహెమ్యా 3:22, 26) యెహోవా ప్రపంచవ్యాప్త సంస్థలో అప్పగింపబడిన ఏ పనియైనను లేక సేవయైనను చేయుటలో “యెహోవాకు యాజకులైన” వారికి సహాయము చేయుచు సత్యారాధనను కట్టుటలో ఆధునిక-దిన నెతీనీయులు చూపించుచున్న ఆసక్తి కొరకు వారిని మెచ్చుకొనవలెను.—యెషయా 61:5, 6. (w92 4/15)