కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w17 ఫిబ్రవరి పేజీలు 23-28
  • నేడు దేవుని ప్రజల్ని ఎవరు నడిపిస్తున్నారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేడు దేవుని ప్రజల్ని ఎవరు నడిపిస్తున్నారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిపాలక సభను యేసు నడిపిస్తున్నాడు
  • “ఇది మనుషుల పని కాదు, దేవుని పని”
  • “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు నిజంగా ఎవరు?”
  • “నాయకత్వం వహిస్తున్నవాళ్లను గుర్తుచేసుకోండి”
  • ఈనాడు గవర్నింగ్‌ బాడితో సహకరించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఎవరు? ఏం చేస్తాడు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • నేడు పరిపాలక సభ ఎలా పనిచేస్తుంది?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
  • ‘నమ్మకమైన దాసుడు’ మరియు అతని గవర్నింగ్‌ బాడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
w17 ఫిబ్రవరి పేజీలు 23-28
మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ

నేడు దేవుని ప్రజల్ని ఎవరు నడిపిస్తున్నారు?

“మీలో నాయకత్వం వహిస్తున్నవాళ్లను గుర్తుచేసుకోండి.”—హెబ్రీ. 13:7.

పాటలు: 42, 13

మీరు వివరించగలరా?

మొదటి శతాబ్దంలో అలాగే ఇప్పుడు, దేవుని ప్రజలకు నాయకత్వం వహిస్తున్న వాళ్లకు . . .

  • పవిత్రశక్తి ఎలా బలాన్నిచ్చింది?

  • దూతలు ఎలా సహాయం చేశారు?

  • దేవుని వాక్యం ఎలా నిర్దేశించింది?

1, 2. యేసు పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత అపొస్తలులు ఏమి అనుకుని ఉంటారు?

అపొస్తలులు ఒలీవ కొండమీద నిలబడి ఆకాశంవైపు చూస్తూ ఉన్నారు. వాళ్ల గురువు, స్నేహితుడు అయిన యేసు పరలోకానికి ఎక్కిపోవడాన్ని, మేఘం అడ్డురాగానే ఆయన అదృశ్యమైపోవడాన్ని చూశారు. (అపొ. 1:9, 10) దాదాపు రెండేళ్లపాటు యేసు వాళ్లకు బోధించాడు, వాళ్లను ప్రోత్సహించాడు, నడిపించాడు. కానీ ఇప్పుడు ఆయన వాళ్లతో లేడు, మరి వాళ్లేమి చేస్తారు?

2 పరలోకానికి వెళ్లకముందు యేసు తన అనుచరులతో ఇలా చెప్పాడు, “యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నాకు సాక్షులుగా ఉంటారు.” (అపొ. 1:8) మరి వాళ్లు ఆ పనిని ఎలా చేయగలరు? వాళ్లకు దేవుని పవిత్రశక్తి సహాయం చేస్తుందని యేసు మాటిచ్చాడు. (అపొ. 1:5) అయినాసరే ప్రకటనా పని భూమంతటా ఓ క్రమపద్ధతిలో జరిగేలా వాళ్లను ఎవరు నడిపిస్తారు? గతంలో ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి యెహోవా మనుషుల్ని ఉపయోగించుకున్నాడని అపొస్తలులకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా నాయకత్వం వహించడానికి యెహోవా ఓ కొత్త వ్యక్తిని ఎన్నుకుంటాడని అపొస్తలులు అనుకుని ఉంటారు.

3. (ఎ) యేసు పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత నమ్మకమైన అపొస్తలులు ఏ ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

3 యేసు పరలోకానికి వెళ్లిపోయిన కొన్ని రోజులకు, ఆయన శిష్యులు లేఖనాల్ని పరిశోధించి, సహాయం కోసం దేవునికి ప్రార్థించి ఇస్కరియోతు యూదా స్థానంలో మత్తీయను 12వ అపొస్తలునిగా ఎంపిక చేశారు. (అపొ. 1:15-26) అలా ఎంపిక చేసుకోవడం శిష్యులకు, యెహోవాకు ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది? అపొస్తలులు 12 మంది ఉండడం అవసరమని శిష్యులు గుర్తించారు.a యేసు అపొస్తలుల్ని ఎంపిక చేసుకుని, ఎంతో ప్రాముఖ్యమైన ఓ పని కోసం వాళ్లకు శిక్షణనిచ్చాడు. ఆ ప్రాముఖ్యమైన పని ఏమిటి? దానికోసం యెహోవా, యేసు వాళ్లను ఎలా సిద్ధంచేశారు? నేడు కూడా అలాంటి ఏ ఏర్పాటు ఉంది? మనపై “నాయకత్వం వహిస్తున్నవాళ్లను” ముఖ్యంగా ‘నమ్మకమైన, బుద్ధిగల దాసున్ని’ మనమెలా గుర్తుచేసుకోవచ్చు?—హెబ్రీ. 13:7; మత్త. 24:45.

పరిపాలక సభను యేసు నడిపిస్తున్నాడు

4. అపొస్తలులు, ఇతర పెద్దలు యెరూషలేములో ఏయే బాధ్యతలు నిర్వర్తించేవాళ్లు?

4 సా.శ. 33 పెంతెకొస్తు రోజున, క్రైస్తవ సంఘాన్ని నడిపించే బాధ్యతను అపొస్తలులు తీసుకున్నారు. “పేతురు పదకొండుమంది అపొస్తలులతో పాటు లేచి నిలబడి” ప్రాణాల్ని కాపాడే సత్యాల్ని ఓ పెద్ద గుంపుకు బోధించడం మొదలుపెట్టాడని బైబిలు చెప్తోంది. (అపొ. 2:14, 15) ఆ గుంపులోని చాలామంది క్రైస్తవులుగా మారారు. తర్వాత నుండి వాళ్లు “పట్టుదలతో అపొస్తలుల దగ్గర నేర్చుకుంటూ” వచ్చారు. (అపొ. 2:42) అపొస్తలులే సంఘానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను చూసుకునేవాళ్లు. (అపొ. 4:34, 35) దేవుని ప్రజలకు బోధిస్తూ, వాళ్ల కోసం ప్రార్థించేవాళ్లు. అపొస్తలులు ఇలా అన్నారు, “మేము మాత్రం ప్రార్థించడానికి, వాక్యాన్ని బోధించడానికి మా పూర్తి సమయాన్ని, శక్తిని వెచ్చిస్తాం.” (అపొ. 6:4) అంతేకాదు అనుభవమున్న క్రైస్తవుల్ని కొత్త ప్రాంతాల్లో ప్రకటించడానికి పంపించారు. (అపొ. 8:14, 15) కొంతకాలం తర్వాత, అభిషిక్తులైన ఇతర పెద్దలు అపొస్తలులతో కలిసి సంఘంలో నాయకత్వం వహించారు. వాళ్లు పరిపాలక సభగా పనిచేస్తూ సంఘాలన్నిటికీ నిర్దేశాల్ని ఇచ్చారు.—అపొ. 15:2.

5, 6. (ఎ) పరిపాలక సభను పవిత్రశక్తి ఎలా బలపర్చింది? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) పరిపాలక సభకు దూతలు ఎలా మద్దతిచ్చారు? (సి) పరిపాలక సభను దేవుని వాక్యం ఎలా నిర్దేశించింది?

5 పరిపాలక సభను యెహోవాయే యేసు ద్వారా నిర్దేశిస్తున్నాడని మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు అర్థంచేసుకున్నారు. ఏవిధంగా? మొదటిగా, పవిత్రశక్తి పరిపాలక సభను బలపర్చింది. (యోహా. 16:13) అభిషిక్త క్రైస్తవులందరూ పవిత్రశక్తిని పొందారు. కానీ ముఖ్యంగా అపొస్తలులు, అలాగే యెరూషలేములోని ఇతర పెద్దలు పర్యవేక్షకులుగా తమ బాధ్యతల్ని నిర్వర్తించేలా పవిత్రశక్తి వాళ్లను ప్రత్యేకంగా బలపర్చింది. ఉదాహరణకు సా.శ. 49⁠లో, సున్నతి విషయంలో ఓ నిర్ణయం తీసుకునేలా పవిత్రశక్తి పరిపాలక సభను నిర్దేశించింది. సంఘాలన్నీ ఆ నిర్దేశాన్ని పాటించాయి. “దానివల్ల సంఘాలు విశ్వాసంలో స్థిరపడుతూ వచ్చాయి, విశ్వాసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.” (అపొ. 16:4, 5) సున్నతి గురించి సంఘాలన్నిటికీ పంపిన ఉత్తరాన్ని బట్టి, పరిపాలక సభను పవిత్రశక్తి నిర్దేశిస్తోందని, అందులోని సభ్యులు ప్రేమ, విశ్వాసం వంటి లక్షణాలు చూపించారని అర్థమౌతోంది.—అపొ. 15:11, 25-29; గల. 5:22, 23.

6 రెండవదిగా, దూతలు పరిపాలక సభకు సహాయం చేశారు. ఉదాహరణకు, పేతురు కోసం మనుషులను పంపించమని ఓ దూత కొర్నేలికి చెప్పాడు. పేతురు వచ్చి కొర్నేలికి, అతని బంధువులకు ప్రకటించాడు. వాళ్లు సున్నతి పొందనివాళ్లు అయినప్పటికీ పవిత్రశక్తిని పొందారు. ఆ విధంగా సున్నతి పొందని అన్యుల్లో క్రైస్తవుడిగా మారిన మొదటి వ్యక్తి కొర్నేలి అయ్యాడు. అపొస్తలులు, ఇతర సహోదరులు ఈ విషయం గురించి విన్నప్పుడు, వాళ్లు దేవుని ఇష్టాన్ని అంగీకరించి, సున్నతి పొందని అన్యులను క్రైస్తవ సంఘంలోకి చేర్చుకున్నారు. (అపొ. 11:13-18) పరిపాలక సభ నడిపిస్తున్న ప్రకటనా పనికి దూతలు చురుగ్గా మద్దతిచ్చారు. (అపొ. 5:19, 20) మూడవదిగా, పరిపాలక సభ దేవుని వాక్యం పై ఆధారపడింది. క్రైస్తవ నమ్మకాల విషయంలో, సంఘాల్ని నిర్దేశించే విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు వాళ్లు లేఖనాల్ని పరిశోధించి, వాటి ప్రకారమే నిర్ణయాలు తీసుకునేవాళ్లు.—అపొ. 1:20-22; 15:15-20.

7. తొలి క్రైస్తవుల్ని యేసే నడిపించాడని మనమెందుకు చెప్పవచ్చు?

7 పరిపాలక సభలో ఉన్న సహోదరులకు సంఘంలో అధికారం ఉన్నప్పటికీ, యేసుక్రీస్తే తమ నాయకుడని వాళ్లు అర్థంచేసుకున్నారు. ఆ విషయం మనకెలా తెలుసు? క్రీస్తే “కొందరిని అపొస్తలులుగా” నియమించాడని, ఆయనే సంఘానికి ‘శిరస్సు’ లేదా నాయకుడని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (ఎఫె. 4:11, 15) అంతేకాదు ప్రసిద్ధి చెందిన ఓ అపొస్తలుని పేరు మీద కాకుండా ‘శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారు.’ (అపొ. 11:26) అపొస్తలులు, అలాగే నాయకత్వం వహించే ఇతర సహోదరులు చెప్పే బైబిలు ఆధారిత బోధలను క్రైస్తవులు పాటించడం ముఖ్యమని పౌలుకు తెలుసు. అయినప్పటికీ ఆయన వాళ్లకిలా చెప్పాడు, “మీరు ఈ విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను: ప్రతీ పురుషునికి శిరస్సు క్రీస్తు.” ఆ పురుషుల్లో పరిపాలక సభ సభ్యులు కూడా ఉన్నారు. అంతేకాదు ఆయన ఇంకా ఇలా అన్నాడు, “క్రీస్తుకు శిరస్సు దేవుడు.”(1 కొరిం. 11:2, 3) అవును, సంఘాన్ని నడిపించడానికి యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తునే నియమించాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.

“ఇది మనుషుల పని కాదు, దేవుని పని”

8, 9. సహోదరుడు రస్సెల్‌ ఏ ప్రాముఖ్యమైన పనిచేశాడు?

8 బైబిలు చెప్తున్న విధంగా దేవున్ని ఆరాధించడమెలాగో తెలుసుకోవడానికి 1870 మొదలుకొని ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌, అతని స్నేహితులు కొంతమంది కలిసి కృషిచేశారు. అంతేకాదు ఆ విషయాల్ని ఇతరులకు, అలాగే వేరే భాష మాట్లాడేవాళ్లకు కూడా చెప్పడానికి ప్రయత్నించారు. అలా 1884⁠లో జాయన్స్‌ వాచ్‌ టవర్‌ ట్రాక్ట్‌ సొసైటీ చట్టబద్ధంగా ఏర్పాటైంది, దానికి సహోదరుడు రస్సెల్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.b సహోదరుడు రస్సెల్‌ బైబిల్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశాక, చర్చీలు బోధించే త్రిత్వ సిద్ధాంతం, అమర్త్యమైన ఆత్మ వంటివి బైబిల్లో లేవని ఇతరులకు ధైర్యంగా చెప్పాడు. క్రీస్తు రాకడ అదృశ్యంగా ఉంటుందని, “అన్యజనులకు నియమించిన కాలాలు” 1914⁠లో ముగుస్తాయని తెలుసుకున్నాడు. (లూకా 21:24) ఇతరులకు ఈ సత్యాల్ని బోధించడానికే అతను తన సమయాన్ని, శక్తిని, డబ్బును ఉపయోగించాడు. వీటన్నిటినిబట్టి, చరిత్రలోని ఓ ముఖ్యమైన కాలంలో తన ప్రజలకు నాయకత్వం వహించడానికి సహోదరుడు రస్సెల్‌ను యెహోవా, యేసు ఉపయోగించుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

9 ప్రజలు తనను ప్రత్యేకంగా చూడాలని సహోదరుడు రస్సెల్‌ కోరుకోలేదు. 1896⁠లో అతను ఇలా రాశాడు, “మేము చేస్తున్న పనిని బట్టి లేదా మేము రాస్తున్న విషయాలను బట్టి ఇతరులు మమ్మల్ని గౌరవించాలని గానీ, భక్తితో చూడాలని గానీ మేం కోరుకోవడంలేదు. రెవరెండ్‌ లేదా రబ్బీ అని పిలిపించుకోవాలని మేము ఆశపడడంలేదు. మా పేరు మీద గుంపులు మొదలుపెట్టాలని కూడా అనుకోవడంలేదు.” ఆ తర్వాత అతను ఇలా చెప్పాడు, “ఇది మనుషుల పని కాదు, దేవుని పని.”

10. (ఎ) ‘నమ్మకమైన బుద్ధిగల దాసున్ని’ యేసు ఎప్పుడు నియమించాడు? (బి) పరిపాలక సభ, వాచ్‌ టవర్‌ సొసైటీ డైరక్టర్లు ఒకటి కాదని ఎలా వెల్లడైంది?

10 సహోదరుడు తేజ్‌ రస్సెల్‌ చనిపోయిన మూడేళ్లకు అంటే 1919⁠లో యేసు ‘నమ్మకమైన బుద్ధిగల దాసున్ని’ నియమించాడు. ఎందుకు? తన అనుచరులకు ‘తగిన సమయంలో ఆహారం పెట్టడానికి.’ (మత్త. 24:45) ఆ సంవత్సరాలన్నిటిలో, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న ప్రధాన కార్యాలయంలో సేవచేస్తున్న కొంతమంది అభిషిక్త సహోదరులు, యేసు అనుచరులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని సిద్ధంచేసేవాళ్లు. “పరిపాలక సభ” అనే మాట 1940ల తర్వాత నుండి మన ప్రచురణల్లో ఉపయోగిస్తున్నాం. అయితే ఆ మాట, వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ డైరక్టర్లను సూచిస్తుందని అప్పట్లో అనుకునేవాళ్లు. కానీ పరిపాలక సభకూ వాచ్‌ టవర్‌ సొసైటీ డైరక్టర్లకూ తేడా ఉందని, వాచ్‌ టవర్‌ సొసైటీ డైరక్టర్లు చట్టపరమైన విషయాల్ని మాత్రమే చూసుకుంటారని 1971⁠లో స్పష్టమైంది. అప్పటినుండి అభిషిక్తులైన పరిపాలక సభ సభ్యులు సొసైటీ డైరక్టర్లుగా ఉండేవాళ్లు కాదు. గడిచిన కొన్నేళ్లలో, ‘వేరేగొర్రెలకు’ చెందిన కొంతమంది సహోదరులు సొసైటీకి, దేవుని ప్రజలు ఉపయోగించే ఇతర సంస్థలకు డైరక్టర్లుగా సేవచేశారు. దానివల్ల పరిపాలక సభ సభ్యులు బైబిలు ఉపదేశాన్ని, నిర్దేశాన్ని ఇవ్వడంపై ఎక్కువ దృష్టిపెట్టగలిగారు. (యోహా. 10:16; అపొ. 6:4) పరిపాలక సభ సభ్యులుగా సేవ చేస్తున్న అభిషిక్త సహోదరుల చిన్న గుంపే “నమ్మకమైన బుద్ధిగల దాసుడు” అని 2013, జూలై 15 కావలికోట సంచిక వివరించింది.

1950లలో ఉన్న పరిపాలక సభ

1950లలో పరిపాలక సభ

11. పరిపాలక సభ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది?

11 పరిపాలక సభ సభ్యులందరూ వారానికి ఒకసారి కలిసినప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలా కలుసుకోవడం వల్ల చక్కగా చర్చించుకోవడం, ఐక్యంగా ఉండడం వీలౌతుంది. (సామె. 20:18) పరిపాలక సభలోని సభ్యులందరూ సమానమే. అందుకే వారానికి ఒకసారి వాళ్లు కలుసుకునే మీటింగ్‌కి ఒక్కో సంవత్సరం ఒక్కో సహోదరుడు అధ్యక్షుడిగా ఉంటాడు. (1 పేతు. 5:1) పరిపాలక సభలోని ఆరు కమిటీలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తాయి. పరిపాలక సభలోని ఏ సహోదరుడూ తాను నాయకుడినని భావించడు. వాళ్లలో ప్రతీఒక్కరు, తాము ‘ఇంటివాళ్లలో’ ఒకరమని భావించుకుంటూ ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుంటారు, నమ్మకమైన దాసుడిచ్చే నిర్దేశాన్ని పాటిస్తారు.

1800ల నుండి ఇప్పటివరకు ఉన్న కావలికోటలు; మనకాలంలోని పరిపాలక సభ

1919⁠లో నియమించబడినప్పటి నుండి నమ్మకమైన దాసుడు దేవుని ప్రజలకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తూనే ఉన్నాడు (10, 11 పేరాలు చూడండి)

“నమ్మకమైన, బుద్ధిగల దాసుడు నిజంగా ఎవరు?”

12. ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

12 పరిపాలక సభ సభ్యులు పవిత్రశక్తి ద్వారా దర్శనాలు పొందరు, వాళ్లు పరిపూర్ణులు కారు. కాబట్టి లేఖన సిద్ధాంతాల్ని వివరిస్తున్నప్పుడు లేదా సంస్థను నడిపిస్తున్నప్పుడు వాళ్లు పొరపాట్లు చేస్తుంటారు. ఉదాహరణకు, వాచ్‌ టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌లో (ఇంగ్లీషు) “లేఖన అవగాహనలో వచ్చిన సవరణలు” (బిలీఫ్స్‌ క్లారిఫైడ్‌) అనే శీర్షిక కింద, 1870 మొదలుకొని ఇప్పటివరకు లేఖనాల అవగాహనలో వచ్చిన సవరణలు ఉంటాయి.c అవును, తన నమ్మకమైన దాసుడు ఏ లోపంలేని పరిపూర్ణమైన ఆహారాన్ని అందిస్తాడని యేసు చెప్పలేదు. కాబట్టి “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు నిజంగా ఎవరు” అని యేసు అడిగిన ప్రశ్నకు మనమెలా జవాబు తెలుసుకోవచ్చు? (మత్త. 24:45) పరిపాలక సభే నమ్మకమైన దాసుడు అని చెప్పడానికి ఏ రుజువులు ఉన్నాయి? అపొస్తలుల కాలంలోని పరిపాలక సభకు సహాయం చేసిన మూడు అంశాలు ఈ కాలంలోని పరిపాలక సభకు ఎలా సహాయం చేశాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

13. పవిత్రశక్తి పరిపాలక సభకు ఏ విషయంలో సహాయం చేసింది?

13 పవిత్రశక్తి సహాయం. ఒకప్పుడు అర్థంకాని బైబిలు సత్యాల్ని అర్థంచేసుకునేలా పవిత్రశక్తి పరిపాలక సభకు సహాయం చేసింది. ఉదాహరణకు పై పేరాలో మనం అనుకున్న లేఖన అవగాహనలో వచ్చిన సవరణల గురించి ఒకసారి ఆలోచించండి. “దేవుని లోతైన విషయాల్ని” ఏ మనిషీ తన సొంత జ్ఞానంతో అర్థంచేసుకోగలిగేవాడు కాదు, వివరించగలిగేవాడు కాదు. (1 కొరింథీయులు 2:10 చదవండి.) అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలతో పరిపాలక సభ ఏకీభవిస్తుంది, “మేము ఈ విషయాలు కూడా మనుషుల తెలివివల్ల నేర్చుకున్న మాటలతో కాదుగానీ, దేవుని పవిత్రశక్తి ద్వారా నేర్చుకున్న మాటలతో మాట్లాడుతున్నాం.” (1 కొరిం. 2:13) ఎన్నో వందల సంవత్సరాల వరకు అబద్ధ బోధలు రాజ్యమేలాయి, ఆధ్యాత్మిక అంధకారం అలుముకుంది. మరి అకస్మాత్తుగా 1919 నుండి బైబిల్ని అర్థం చేసుకోవడంలో ఇంత ప్రగతి ఎలా సాధ్యమైంది? దానికిగల ఏకైక కారణమేమిటంటే, యెహోవా తన పవిత్రశక్తి ద్వారా పరిపాలక సభకు సహాయం చేస్తున్నాడు.

14. ప్రకటన 14:6, 7 ప్రకారం నేడు దూతలు దేవుని ప్రజలకు ఎలా మద్దతిస్తున్నారు?

14 దూతల మద్దతు. ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకన్నా ఎక్కువమంది రాజ్య ప్రచారకులు చేస్తున్న ప్రకటనాపనిని నిర్దేశించే పెద్ద బాధ్యత పరిపాలక సభ భుజాలపై ఉంది. ప్రకటనాపనిలో చక్కని ఫలితాలు రావడానికిగల కారణమేమిటి? ఒక కారణమేమిటంటే, దూతల మద్దతు. (ప్రకటన 14:6, 7 చదవండి.) కొంతమంది సహాయం కోసం దేవునికి ప్రార్థించిన కొన్ని నిమిషాలకే ప్రచారకులు వాళ్ల ఇంటి తలుపు తట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాళ్లను దూతలే అక్కడికి నడిపించారు.d తీవ్రమైన వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రకటనాపని, బోధనాపని వేగంగా జరుగుతోంది. అది కూడా దూతల సహాయం వల్లే సాధ్యమౌతోంది.

15. పరిపాలక సభకు, ఇతర క్రైస్తవ నాయకులకు ఉన్న తేడా ఏమిటి? ఓ ఉదాహరణ చెప్పండి.

15 దేవుని వాక్యంపై ఆధారపడడం. (యోహాను 17:17 చదవండి.) 1973⁠లో ఏం జరిగిందో పరిశీలించండి. “పొగతాగే అలవాటును ఇంకా మానుకోనివాళ్లు బాప్తిస్మానికి అర్హులేనా” అనే ప్రశ్న ఆ సంవత్సరంలోని జూన్‌ 1 కావలికోట సంచికలో వచ్చింది. దానికి జవాబుగా “బైబిల్లోని ఆధారాలబట్టి చూస్తే వాళ్లు అర్హులు కాదని అర్థమౌతోంది” అని ఆ కావలికోట వివరించింది. ఆ కావలికోట ఎన్నో లేఖనాల్ని ప్రస్తావించి, పొగతాగే అలవాటును మానుకోని వ్యక్తిని సంఘం నుండి ఎందుకు బహిష్కరించాలో వివరించింది. (1 కొరిం. 5:7; 2 కొరిం. 7:1) ఖచ్చితమైన ఈ ప్రమాణం మనుషులు పెట్టింది కాదుగానీ “తన వాక్యం ద్వారా తన భావాల్ని తెలియజేసే దేవుని నుండే” వచ్చిందని కూడా ఆ సంచిక వివరించింది. వేరే ఏ మతసంస్థ దేవుని వాక్యంపై ఇంత పూర్తిగా ఆధారపడలేదు. ఒకవేళ ఆధారపడినా ఆ సంస్థలోని కొంతమందికి చాలా కష్టంగా ఉండేది. మతాల గురించి అమెరికాలో ఈమధ్య విడుదలైన ఓ పుస్తకం ఇలా చెప్తోంది, “తమ సభ్యుల మద్దతు, ప్రజల మద్దతు పొందడం కోసం, క్రైస్తవ నాయకులు తమ బోధల్ని ఆ ప్రజల నమ్మకాలకు, అభిప్రాయాలకు తగ్గట్లుగా మారుస్తూ వచ్చారు.” కానీ పరిపాలక సభ మాత్రం ప్రజల ఇష్టాయిష్టాల ప్రకారం నడుచుకోదు. బదులుగా, అది దేవుని వాక్య ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ కారణాన్ని బట్టి, నేడు దేవుని ప్రజల్ని యెహోవాయే నిజంగా నడిపిస్తున్నాడని తేటతెల్లమౌతోంది.

“నాయకత్వం వహిస్తున్నవాళ్లను గుర్తుచేసుకోండి”

16. పరిపాలక సభ సభ్యులను గుర్తుచేసుకోవడానికి ఒక మార్గమేమిటి?

16 హెబ్రీయులు 13:7 చదవండి. “నాయకత్వం వహిస్తున్నవాళ్లను గుర్తుచేసుకోండి” అని బైబిలు చెప్తోంది. అలా గుర్తుచేసుకోవడానికి ఒక మార్గమేమిటంటే, పరిపాలక సభకు సహాయం చేయమని మన ప్రార్థనల్లో యెహోవాను వేడుకోవడం. (ఎఫె. 6:18) పరిపాలక సభ సభ్యులకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వాళ్లు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించాలి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనాపనిని నిర్దేశించాలి, సంస్థకు వచ్చే విరాళాలు సరైన విధంగా ఉపయోగపడేలా చూడాలి. కాబట్టి వాళ్లకోసం మనం క్రమంగా ప్రార్థించడం చాలా అవసరం.

17, 18. (ఎ) పరిపాలక సభకు మనమెలా మద్దతివ్వవచ్చు? (బి) మనం ప్రకటనా పని చేస్తే పరిపాలక సభకు, యేసుకు మద్దతిచ్చినట్లు ఎలా అవుతుంది?

17 రెండవ మార్గమేమిటంటే, పరిపాలక సభ ఇచ్చే సూచనల్ని, నిర్దేశాల్ని పాటించడం. పరిపాలక సభ ప్రచురణల ద్వారా, మీటింగ్స్‌ ద్వారా, సమావేశాల ద్వారా మనకు నిర్దేశాల్ని ఇస్తుంది. అంతేకాదు ప్రాంతీయ పర్యవేక్షకుల్ని నియమిస్తుంది, ప్రాంతీయ పర్యవేక్షకులు సంఘపెద్దల్ని నియమిస్తారు. పరిపాలక సభ తమకు ఇచ్చే నిర్దేశాల్ని శ్రద్ధగా పాటించడం ద్వారా ప్రాంతీయ పర్యవేక్షకులు, సంఘ పెద్దలు పరిపాలక సభను గుర్తుచేసుకుంటున్నామని చూపిస్తారు. అయితే మనం మన నాయకుడైన యేసుకు లోబడుతున్నామని చూపించాలంటే ఆయన నేడు ఉపయోగించుకుంటున్న సహోదరులకు లోబడాలి.—హెబ్రీ. 13:17.

18 పరిపాలక సభను గుర్తుచేసుకోవడానికి మూడవ మార్గమేమిటంటే, ప్రకటనా పని చేయడంలో శాయశక్తులా కృషిచేయడం. నాయకత్వం వహిస్తున్నవాళ్ల విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకోమని హెబ్రీయులు 13:7 క్రైస్తవుల్ని ప్రోత్సహిస్తోంది. ప్రకటనాపనిని ఉత్సాహంగా చేస్తూ మంచివార్తను చాటడం ద్వారా పరిపాలక సభ గొప్ప విశ్వాసాన్ని చూపిస్తోంది. మరి ఈ ప్రాముఖ్యమైన పనిలో మనం వాళ్లకు మద్దతిస్తున్నామా? ఒకవేళ మద్దతిస్తుంటే యేసు మనతో ఇలా అంటాడు, “ఈ నా సోదరుల్లో అందరికన్నా తక్కువవాడికి మీరు చేసిందేదైనా నాకు చేసినట్టే.” ఈ మాటలు విన్నప్పుడు మనకెంత సంతోషంగా ఉంటుందో కదా!—మత్త. 25:34-40.

19. మన నాయకుడైన యేసును వెంబడించాలని మీరెందుకు నిర్ణయించుకున్నారు?

19 యేసు పరలోకానికి వెళ్లిపోయాక తన అనుచరులను విడిచిపెట్టేయలేదు. (మత్త. 28:20) తాను భూమ్మీద ఉన్నప్పుడు నాయకత్వం వహించడానికి పవిత్రశక్తి సహాయం, దూతల మద్దతు, దేవుని వాక్య నిర్దేశం ఎలా సహాయపడ్డాయో యేసుకు తెలుసు. ఆయన నేడు పరిపాలక సభకు అదే సహాయాన్ని అందిస్తాడు. పరిపాలక సభ సభ్యులు “గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్లినా సరే, ఆయన వెంట వెళ్తూ ఉంటారు.” (ప్రక. 14:4) కాబట్టి మనం పరిపాలక సభ ఇచ్చే నిర్దేశాన్ని పాటిస్తే మన నాయకుడైన యేసును వెంబడిస్తున్నట్లే. త్వరలో ఆయన మనకు నిత్యజీవాన్ని ఇస్తాడు. (ప్రక. 7:14-17) వేరే ఏ మానవ నాయకుడు దాన్ని మనకు ఇవ్వలేడు.

a 12 మంది అపొస్తలులు భవిష్యత్తులోని కొత్త యెరూషలేముకు ‘12 పునాదిరాళ్లు’ అవ్వాలని యెహోవా కోరుకుని ఉండవచ్చు. (ప్రక. 21:14) కాబట్టి నమ్మకమైన అపొస్తలులు చనిపోయిన తర్వాత వాళ్ల స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సిన అవసరం లేదు.

b 1955 నుండి ఆ సంస్థను వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా అని పిలుస్తున్నాం.

c యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకంలో “మన నమ్మకాల వివరణ” అనే శీర్షిక కూడా చూడండి.

d “బేరింగ్‌ థరో విట్నెస్‌” ఎబౌట్‌ గాడ్స్‌ కింగ్‌డం (ఇంగ్లీషు) పుస్తకంలోని 58-59 పేజీలు చూడండి. అలాగే 2014, జూలై 15 కావలికోట సంచికలోని 3వ పేజీ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి